“సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుని” నుండి ఓదార్పు
“కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. . . . ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.”—2 కొరింథీయులు 1:3, 4.
1, 2. దుఃఖిస్తున్నవారికి ఎలాంటి ఆదరణ అవసరం?
దుఃఖించే ప్రజలకు యథార్థమైన ఓదార్పు అవసరంకానీ, వట్టిమాటలూ వక్రోక్తులు కాదు. ‘కాలం గాయాలను మాన్పుతుంది’ అని మనమందరం విన్నాము, అయితే, ప్రియమైన వారిని కోల్పోయిన ఏ వ్యక్తి తొలుత ఆ ఆలోచనవల్ల ఓదార్పును పొందగలడు? దేవుడు పునరుత్థానాన్ని గూర్చి వాగ్దానం చేశాడని క్రైస్తవులకు తెలుసు, అయితే దాని భావం అకస్మాత్తుగా కలిగిన ఆ నష్టం వల్ల వాటిల్లిన తీవ్రమైన గాయాన్ని మరియు మానసిక వ్యధను అది నివారిస్తుందని కాదు. మీ బిడ్డల్లో ఒకరు చనిపోయారనుకోండి, మరప్పుడు జీవించి ఉన్న పిల్లలు, ప్రియమైన ఆ పిల్లవాని స్థానాన్ని భర్తీ చేయలేరు కదా.
2 ప్రియమైనవారు మరణించిన సమయమందు యథార్థమైన ఓదార్పువల్ల, అంటే దేవుని వాగ్దానమందు దృఢమైన ఆధారంగల ఓదార్పువల్ల మనం ఎంతో సహాయాన్ని పొందగలము. మనకు సానుభూతి కూడా ఉండాలి. రువాండా ప్రజల విషయంలోను మరి ప్రత్యేకంగా అక్కడి జాత్యంతర పైశాచిక మారణహోమంలో తమ ప్రియమైనవారిని కోల్పోయిన యెహోవాసాక్షుల విషయంలో ఇది వాస్తవం. దుఃఖించేవారందరూ ఎవరినుండి ఓదార్పును పొందగలరు?
యెహోవా—ఆదరణను అనుగ్రహించు దేవుడు
3. ఆదరణను అందించడంలో యెహోవా ఎలాంటి మాదిరినుంచాడు?
3 మనందరికీ ఆదరణనివ్వడం విషయంలో యెహోవా మంచి మాదిరిని ఉంచాడు. మనకు నిత్య ఆదరణనూ నిరీక్షణను ఇచ్చేందుకు ఆయన తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును, భూమి మీదికి పంపించాడు. యేసు ఇలా బోధించాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16) తన అనుచరులతో ఆయన ఇలా కూడా చెప్పాడు: “తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు.” (యోహాను 15:13) మరో సందర్భంలో ఆయన ఇలా చెప్పాడు: “మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను.” (మత్తయి 20:28) మరియు పౌలు ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమైయుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.” (రోమీయులు 5:8) ఈ వచనాలు మరియు అనేక ఇతర వచనాల ద్వారా, మనం దేవుని ప్రేమనూ క్రీస్తు యేసు ప్రేమను చూడగలము.
4. అపొస్తలుడైన పౌలు యెహోవాకు విశేషంగా ఎందుకు రుణపడివున్నాడు?
4 అపొస్తలుడైన పౌలుకు యెహోవా కృపాబాహుళ్యతను గూర్చి విశేషముగా తెలుసు. ఆత్మీయ మృత పరిస్థితినుండి ఆయన రక్షించబడ్డాడు, అంటే క్రీస్తు అనుచరులను తీవ్రంగా హింసించేవాని నుండి క్రైస్తవునిగా తానే హింసించబడేటట్లు మారాడు. (ఎఫెసీయులు 2:1-5) ఆయన తన అనుభవమును ఇలా వర్ణిస్తున్నాడు: “నేను అపొస్తలులందరిలో తక్కువవాడను. దేవుని సంఘమును హింసించినందున అపొస్తలుడనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమైయున్నానో అది దేవుని కృపవలననే అయియున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని, వారందరికంటె నేనెక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైయున్న దేవుని కృపయే.”—1 కొరింథీయులు 15:9, 10.
5. దేవుని నుండి వచ్చే ఆదరణను గూర్చి పౌలు ఏమి వ్రాశాడు?
5 మరి సమంజసంగానే పౌలు ఇలా వ్రాశాడు: “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగునట్లు, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. క్రీస్తుయొక్క శ్రమలు మా యందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. మేము శ్రమ పొందినను మీ ఆదరణకొరకును రక్షణకొరకును పొందుదుము; మేమాదరణ పొందినను మీ ఆదరణకొరకై పొందుదుము; ఈ ఆదరణ, మేముకూడ పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమైయున్నది. మీరు శ్రమలలో ఏలాగు పాలివారైయున్నారో, ఆలాగే ఆదరణలోను పాలివారైయున్నారని యెరుగుదుము గనుక మిమ్మునుగూర్చిన మా నిరీక్షణ స్థిరమైయున్నది.”—2 కొరింథీయులు 1:3-7.
6. “ఆదరణ” అని అనువదించిన గ్రీకుపదం భావమేమిటి?
6 ఎంతటి ప్రేరణాత్మకమైన మాటలో కదా! ఇక్కడ “ఆదరణ” అని ఉపయోగించిన గ్రీకుపదం “ఒకనివద్ద ఉండమనే ఆహ్వానానికి” సంబంధించి ఉంది. కనుక, “ఒక వ్యక్తి తీవ్రమైన శ్రమలకు గురౌతున్నప్పుడు అతనితో ఉండి అతనికి ప్రోత్సాహమివ్వడమని దాని భావం.” (ఎ లింగ్విస్టిక్ కీ టు ద గ్రీక్ న్యూ టెస్టమెంట్) ఒక బైబిలు రచయిత ఇలా వ్రాశాడు: “ఆ పదం ఎల్లప్పుడూ . . . ఉపశమనాన్నిచ్చే సానుభూతిని కనపర్చడం అని మాత్రమే కాదు. . . . క్రైస్తవ ఆదరణన్నది, ధైర్యాన్ని తెచ్చే ఆదరణ, జీవిత శ్రమలన్నింటినీ తాళుకునేందుకు సహాయపడే ఆదరణ. అందులో మరణించినవారి పునరుత్థానాన్ని గూర్చిన దృఢమైన వాగ్దానం మరియు నిరీక్షణలపై, ఆధారపడిన ఆదరణకరమైన మాటలు ఉన్నాయి.
యేసు మరియు పౌలు—వాత్సల్యపూర్ణ ఆదరణకర్తలు
7. పౌలు తన క్రైస్తవ సహోదరులకు ఎలా ఓదార్పుకరంగా ఉన్నాడు?
7 ఆదరణను అందించడంలో పౌలు ఎంతటి అద్భుతమైన మాదిరి! థెస్సలొనీకయలోని సహోదరులకు ఆయన ఇలా వ్రాయగలిగాడు: “స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించునట్లుగా, మేము మీ మధ్యను సాధువులమై యుంటిమి. మీరు మాకు బహు ప్రియులైయుంటిరి గనుక మీయందు విశేషాపేక్షగలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములనుకూడ మీకిచ్చుటకు సిద్ధపడియుంటిమి. . . . మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డలయెడల నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును.” ప్రేమపూర్వకమైన, శ్రద్ధగల తలిదండ్రులవలె, మనమందరమూ అవసరమున్నప్పుడు ఇతరులతో మన అనురాగాన్ని, అవగాహనను పంచుకోగలము.—1 థెస్సలొనీకయులు 2:7, 8, 12.
8. దుఃఖిస్తున్నవారికి యేసు బోధలు ఎందుకు ఆదరణకరంగా ఉంటాయి?
8 అలాంటి శ్రద్ధ మరియు కనికరాన్ని కనపర్చడంలో, పౌలు తన గొప్ప మాదిరికర్తయైన యేసునే అనుకరించాడు. మత్తయి 11:28-30 నందున్నట్లుగా యేసు ఇస్తున్న వాత్సల్యపూర్ణమైన ఆహ్వానాన్ని జ్ఞాపకముంచుకోండి: “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.” అవును, యేసు బోధ ఉపశమనాన్నిస్తుంది, ఎందుకంటే అది నిరీక్షణను మరియు వాగ్దానాన్ని అంటే, పునరుత్థాన వాగ్దానాన్నిస్తుంది. ఉదాహరణకు మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే అనే బ్రోషూరును ప్రజలకు ఇచ్చినప్పుడు మనం వారికి ఈ నిరీక్షణ మరియు వాగ్దానాలనే అందిస్తున్నాము. మనం ఎంతో కాలంగా దుఃఖిస్తున్నప్పటికీ ఈ నిరీక్షణ మనకందరికీ సహాయపడగలదు.
దుఃఖిస్తున్నవారికి ఆదరణను ఎలా అందించాలి
9. దుఃఖిస్తున్న వారి ఎడల మనం ఎందుకు అసహనంగా ప్రవర్తించకూడదు?
9 దుఃఖమన్నది, ప్రియమైనవారు మరణించిన వెంటనే కొంత పరిమిత సమయంలో మాత్రమే ఉండేది కాదు. కొందరు తమ జీవిత కాలమంతటిలోనూ ఈ దుఃఖ భారాన్ని భరిస్తూనే ఉంటారు, ప్రత్యేకంగా తమ పిల్లలను కోల్పోయినవారు. స్పెయిన్నందలి ఒక నమ్మకమైన క్రైస్తవ దంపతులు తమ 11 సంవత్సరాల కుమారున్ని 1963 నందు వేదోమజ్జా రోగానికి గురవ్వడం వల్ల కోల్పోయారు. ఈ నాటివరకు కూడా, పకీటోను గూర్చి వారు మాట్లాడుతున్నప్పుడెల్లా వాళ్లు కంటతడి పెడతారు. వార్షికోత్సవాలూ, ఫోటోలూ, జ్ఞాపక చిహ్నాలూ ఆ చేదుజ్ఞాపకాలను తిరిగి తీసుకురాగలవు. కాబట్టి, మనం ఎన్నడూ ఓర్మిని కోల్పోయి, ఈపాటికి వారు తమ దుఃఖం నుండి కోలుకుని ఉండాలని తలంచకూడదు. ఓ వైద్యాధికారి ఇలా అంగీకరిస్తున్నారు: “కృంగుదల మరియు అస్థిరచిత్తం అనేక సంవత్సరాలవరకు కొనసాగవచ్చు.” కనుక, శారీరక గాయాలవల్ల ఏర్పడ్డ మచ్చలు మన శరీరంపై జీవితాంతం ఎలా ఉంటాయో, భావోద్రేక గాయాలవల్ల ఏర్పడ్డ మచ్చలుకూడా అలాగే ఉంటాయని జ్ఞాపకముంచుకోండి.
10. దుఃఖిస్తున్న వారికి సహాయపడేందుకు మనం ఏమి చేయాలి?
10 క్రైస్తవ సంఘంలో దుఃఖిస్తున్నవారి ఆదరణనందించేందుకు మనం చేయగల కొన్ని ఆచరణాత్మక విషయాలేమిటి? మనం ఎంతో యథార్థంగానే, ఆదరణ అవసరమున్న ఆ సహోదరుడు లేక సహోదరితో, “మీకు సహాయపడేందుకు నేను చేయగల్గినదేమైనా ఉంటే, నాతో చెబితే చాలు” అని చెప్పవచ్చు. అయితే, “నాకు ఈ సహాయం కావాలండి” అని తన ప్రియమైనవారిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న వ్యక్తి వచ్చి మనకు ఎన్ని సార్లు చెబుతాడు? ప్రియమైనవారిని కోల్పోయిన దుఃఖంలోనున్న వారికి మనం ఆదరణను ఇవ్వాలంటే మనమే యుక్తంగా చొరవ తీసుకోవాలి. కనుక, వారి ప్రయోజనానికి మనం ఏమి చేయగలం? ఇక్కడ కొన్ని ఆచరణాత్మకమైన సలహాలున్నాయి.
11. మనం వినడం ఇతరులకు ఆదరణకరంగా ఎలా ఉండగలదు?
11 వినండి: ప్రియమైనవారిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న వారు చెప్పేది వినడం ద్వారా వారి వేదనను పంచుకోవడం ఎంతో సహాయకరమైన విషయాల్లో ఒకటి. “మీరు దాన్ని గూర్చి మాట్లాడాలనుకుంటున్నారా?” అని మీరు అడగవచ్చు. ఆ వ్యక్తినే నిర్ణయించుకోనివ్వండి. తన తండ్రి మరణించినప్పుడు జరిగిన విషయాన్ని ఓ క్రైస్తవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “నాకు సహాయపడినదేమిటంటే, ఏమి జరిగిందని ఇతరులు అడిగి, ఆ తర్వాత వారు నిజంగా వినడమే.” యాకోబు సలహానిచ్చినట్లుగా వినేందుకు వేగిరపడండి. (యాకోబు 1:19) ఓర్మితోనూ, సానుభూతితోనూ వినండి. “ఏడ్చువారితో ఏడువుడి,” అని రోమీయులు 12:16 సలహానిస్తుంది. యేసు మార్తా మరియలతో ఏడ్చాడని జ్ఞాపకముంచుకోండి.—యోహాను 11:35.
12. దుఃఖిస్తున్న వారికి మనం ఎలాంటి అభయాన్ని అందించగలము?
12 అభయాన్నివ్వండి: ప్రియమైనవారిని కోల్పోయిన దుఃఖంలో ఉన్నవారు, తాము ఎక్కువ చేయలేకపోయామని తలంచి, మొదట్లో తామేదో తప్పు చేసినట్లుగా భావిస్తారు. బహుశ చేయగల్గినదంతా చేశారని ఆ వ్యక్తికి హామీనివ్వండి (లేక నిజమని, అనుకూలమైందని మీకు తెలిసినదాన్ని దేన్నైనా చెప్పండి). అతను భావించేదేదీ అసహజం కాదని అతనికి అభయమివ్వండి. మీకు తెలిసినవారెవరైనా వారిలాగే మరణించినవారిని కోల్పోయి, ఆ బాధనుండి ఎలా విజయవంతంగా తేరుకున్నారో అతనికి చెప్పండి. మరో మాటలో చిన్న విషయాలను కూడా అర్థంచేసుకోండి మరియు సానుభూతిని కల్గివుండండి. దయగల మన సహాయం ఎంతో భావాన్ని స్ఫురింపజేయవచ్చు! సొలొమోను ఇలా వ్రాశాడు: “సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది.”—సామెతలు 16:24; 25:11; 1 థెస్సలొనీకయులు 5:11, 14.
13. మనలను మనం అందుబాటులో ఉంచుకున్నప్పుడు అది ఎలా తోడ్పడగలదు?
13 అందుబాటులో ఉండండి: అనేకమంది స్నేహితులూ బంధువులు ఉన్న మొదటి కొద్ది రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉండడం కాకుండా, అవసరమైతే అందరూ తమ సామాన్య దినచర్యలో నిమగ్నులైపోయిన కొన్ని నెలల తర్వాత కూడా మీరు అందుబాటులో ఉండండి. దుఃఖించే సమయం ఒక వ్యక్తినుండి మరో వ్యక్తికి వేరువేరుగా ఉండగలదు. మన క్రైస్తవ ఆసక్తి మరియు కనికరం ఏ సమయంలోనైనా ఎంతో భావాన్ని స్ఫురింపజేయగలదు. “సహోదరునికంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడని” బైబిలు చెబుతోంది. ఆ విధంగా “అవసరతలో సహాయం చేసేవాడే అసలైన ఆత్మీయుడు” అనే లోకోక్తికి అనుగుణంగా జీవించవల్సిన వాస్తవమే.—సామెతలు 18:24; అపొస్తలుల కార్యములు 28:15 పోల్చండి.
14. ప్రియమైనవారు మరణించిన బాధలోనున్న వ్యక్తులకు ఆదరణనిచ్చేలా మనం దేన్ని గూర్చి మాట్లాడవచ్చు?
14 చనిపోయిన వ్యక్తి మంచి లక్షణాలను గూర్చి మాట్లాడడం, సరైన సమయంలో అందించే మరో సహాయం. ఆ వ్యక్తిని గూర్చి మీకు జ్ఞాపకమున్న మంచి విషయాలను చెప్పండి. మరణించిన వ్యక్తి పేరును ఉపయోగించేందుకు వెనుకాడవద్దు. మరణించిన ప్రియమైన వ్యక్తి అసలు ఎన్నడూ లేనట్లుగా గానీ లేక అస్తిత్వరహితునిగా గాని ప్రవర్తించవద్దు. హార్వర్డ్ మెడికల్ స్కూల్ వారి ప్రచురణ పేర్కొన్న విషయాన్ని తెలుసుకోవడం ఆదరణకరంగా ఉంటుంది: “ప్రియమైన వారిని కోల్పోయినవారు, కలతపర్చేంతగా దుఃఖపడకుండా మరణించిన వ్యక్తినిగూర్చి ఆలోచించగల్గినప్పుడు ఒక విధంగా కోలుకుంటారు. . . . నూతన వాస్తవాన్ని అంగీకరించి మరియు సమకూర్చుకున్నప్పుడు దుఃఖం, అపురూప స్మృతులుగా మారుతుంది.” “అపురూప స్మృతులు”—ప్రియమైన వారితో గడిపిన ఆ ఘడియలను జ్ఞాపకం చేసుకోవడం ఎంత ఆదరణకరంగా ఉంటుందో కదా! తన తండ్రిని కొన్ని సంవత్సరాల క్రితం కోల్పోయిన ఓ సాక్షి ఇలా చెప్పాడు: “నాన్నగారు సత్యాన్ని పఠించడం ప్రారంభించిన కొంతకాలానికి, ఆయనతో బైబిలును చదవడం నాకు ఓ మధురస్మృతి.” మరొకటి నా సమస్యల్లో కొన్నింటిని చర్చించుకుంటూ నది ఒడ్డున పడుకుని మాట్లాడుకోవడం. నేను ఆయనను కేవలం మూడు లేక నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి చూసేవాణ్ణి, కనుక ఆ సందర్భాలు నాకు ఎంతో ప్రశస్తమైనవి.”
15. సహాయపడేందుకు ఒకరు ఎలా చొరవ తీసుకోగలరు?
15 సమంజసమైనప్పుడు చొరవతీసుకోండి: దుఃఖించే కొందరు వ్యక్తులు ఇతరుల కంటే బాగా కోలుకోగలరు. కనుక పరిస్థితులనుబట్టి, అనుకూలంగా సహాయపడేందుకు చర్యలను చేపట్టండి. దుఃఖించే ఓ క్రైస్తవ స్త్రీ ఇలా జ్ఞాపకం చేసుకుంది: “‘నేను చేయగలదేమైనా ఉంటే, నాతో చెప్పండి’ అని నాతో ఎంతోమంది చెప్పారు. అయితే ఒక క్రైస్తవ సహోదరి అలా అడగలేదు. ఆమె నేరుగా పడగ్గదిలోకి వెళ్లి, పరుపు మీదినుండి దుప్పట్లు తీసి ఉతికింది. మరో సహోదరి ఓ బక్కెటును, నీళ్లను, శుభ్రం చేసే వస్తువులను తీసుకుని నా భర్త వాంతి చేసిన తివాచీని కడిగింది. వీరే నాకు నిజమైన స్నేహితులు మరియు నేను వారిని ఎన్నడూ మరువను.” బహుశ భోజనాన్ని తయారు చేయడం ద్వారా, శుభ్రపర్చడం ద్వారా, లేక సహాయక పనులను చేయడం ద్వారా సహాయమవసరమున్నచోట చొరవ తీసుకోండి. ప్రియమైన వారిని కోల్పోయిన వ్యధలోనున్న వ్యక్తి ఏకాంతం కావాలని కోరుకుంటున్న సమయంలో అనవసరంగా జోక్యం చేసుకోకుండ ఉండేందుకు జాగ్రత్తపడాలన్నది వాస్తవమే. కాబట్టి, మనం పౌలు మాటలను గైకొనాలి: “కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.” దయ, ఓర్మి మరియు ప్రేమ ఎన్నడూ విఫలమవ్వవు.—కొలొస్సయులు 3:12; 1 కొరింథీయులు 13:4-8.
16. ఒక ఉత్తరం గానీ లేక ఒక కార్డుగానీ ఎందుకు ఆదరణను అందించగలవు?
16 ఒక ఉత్తరాన్ని గానీ ఓదార్పునిచ్చే ఒక కార్డునుగానీ పంపించండి: పరామర్శిస్తూ వ్రాసే ఉత్తరం విలువను లేక సానుభూతిని వ్యక్తపర్చే చక్కని కార్డు విలువను తరచూ లెక్కచేయరు. దాని ఉపయోగమేమిటి? దాన్ని మరలా మరలా చదవవచ్చు. అలాంటి ఉత్తరం చాలా పొడుగ్గా ఉండనవసరంలేదు కానీ అది మన వాత్సల్యాన్ని కనపర్చేదై ఉండాలి. ఆత్మీయ భావన అందులో ప్రతిబింబించాలి, అయితే ప్రసంగించినట్లుగా ఉండకూడదు. “నీకు మేమున్నాము” అన్న సమాచారమే ఓ పరామర్శ.
17. ప్రార్థన ఎలా ఆదరణను తేగలదు?
17 వారితో ప్రార్థించండి: తమ ప్రియమైనవారిని కోల్పోయిన తోటి క్రైస్తవులుతో చేసే ప్రార్థనలతోనూ మరియు వారికొరకు చేసే ప్రార్థనలనూ తక్కువ అంచనా వేయవద్దు. యాకోబు 5:16 నందు బైబిలు ఇలా అంటోంది: “నీతిమంతుని విజ్ఞాపన . . . బహు బలము గలదై యుండును.” ఉదాహరణకు, దుఃఖిస్తున్నవారు మనం వారికొరకు ప్రార్థిస్తున్నామని విన్నప్పుడు, వారు తప్పు చేశామనేటువంటి ప్రతికూల భావనలతో సరైన విధంగా వ్యవహరించేందుకు సహాయపడుతుంది. మనం బలహీనంగా ఉన్నప్పుడు, కలత చెందినప్పుడు, సాతాను తన “తంత్రములు” లేక “కుతంత్రాలతో” మనలను బలహీనులను చేసేందుకు ప్రయత్నిస్తాడు. ‘ప్రతి సమయమునందును ప్రతివిధమైన ప్రార్థన విజ్ఞాపనములచేత ఆత్మ యందు ఎల్లప్పుడు ప్రార్థిస్తూనే ఉండండి. మరియు అందుకు పరిశుద్ధుల నిమిత్తము ఎల్లప్పుడు మెలకువగా ఉండి వారికొరకు విజ్ఞాపనములను చేయండి’ అని పౌలు పేర్కొన్న ప్రకారంగా, ప్రార్థన వల్ల కలిగే ఆదరణ మరియు మద్దతు అవసరమున్న సమయమిదే.—ఎఫెసీయులు 6:11, 18, కింగ్డమ్ ఇంటర్లీనియర్; యాకోబు 5:13-15.
దేన్ని నివారించాలి
18, 19. మన సంభాషణలో మనం చాతుర్యాన్ని ఎలా కనపర్చగలము?
18 ఒక వ్యక్తి దుఃఖిస్తున్నప్పుడు, చేయకూడని మరియు చెప్పకూడని విషయాలు కూడా ఉన్నాయి. సామెతలు 12:18 ఇలా హెచ్చరిస్తోంది: “కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.” కొన్నిసార్లు, మనకు తెలియకుండానే, మనం చాతుర్యం కనపర్చడంలో విఫలులమౌతాము. ఉదాహరణకు, “మీరెలా భావిస్తున్నారో నాకు తెలుసు” అని మనం చెప్పవచ్చు. కానీ అది నిజమేనా? మీరు సరిగ్గా అలాంటి నష్టాన్నే అనుభవించారా? అంతేకాకుండ, ప్రజలు వివిధ రీతుల్లో ప్రతిస్పందిస్తారు. మీ ప్రతిస్పందన దుఃఖిస్తున్న వ్యక్తి ప్రతిస్పందనకు పోలినది కాకపోవచ్చు. “మా . . . మరణించినప్పుడు నేను కూడా మీరిప్పుడున్న పరిస్థితినే అనుభవించాను కనుక మీ విషయంలో నాకు నిజంగా అనుతాపముంది.”
19 మరణించిన వ్యక్తి పునరుత్థానమౌతాడా లేదా అన్న విషయాన్ని గూర్చి వ్యాఖ్యానించకుండా ఉండడం మన భావనను కనపరుస్తుంది. కొందరు సహోదర సహోదరీలు అవిశ్వాసిగా మరణించిన తన భార్యను గూర్చిగానీ తన భర్తను గూర్చిగానీ చేసే వ్యాఖ్యానాల వల్ల ఎంతో బాధపడ్డారు. ఎవరు పునరుత్థానమౌతారు ఎవరు కారు అన్న వాటిని నిర్ణయించేది మనం కాదు. హృదయాలను పరిశీలించే యెహోవా మనలో అనేకులకంటే ఎంతో కనికరాన్ని కనపర్చగలడని మనం ఉపశమనాన్ని పొందవచ్చు.—కీర్తన 86:15; లూకా 6:35-37.
ఆదరణనిచ్చే లేఖనాలు
20, 21. తమ ప్రియమైనవారిని కోల్పోయిన వ్యక్తులకు ఆదరణనిచ్చే కొన్ని లేఖనాలేవి?
20 సరైన సమయంలో అందించగల శ్రేష్ఠమైన సహాయమేమిటంటే, మరణించినవారి కొరకు యెహోవా చేసిన వాగ్దానాన్ని పరిశీలించడం. ప్రియమైన వారిని పోగొట్టుకున్నది అప్పటికే ఓ సాక్షైనా లేక మనం పరిచర్యనందు కలిసే వ్యక్తెనా, బైబిలు ఆలోచనలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ వచనాల్లో కొన్ని ఏమిటి? యెహోవా ఆదరణకర్తయైన దేవుడని మనకు తెలుసు, ఎందుకంటే ఆయన ఇలా చెప్పాడు: “నేను నేనే మిమ్ము నోదార్చువాడను.” ఇంకా ఆయన ఇలా చెప్పాడు, “ఒకని తల్లి వానిని ఆదరించునట్లు నేను మిమ్మును ఆదరించెదను.”—యెషయా 51:12; 66:13.
21 కీర్తనల గ్రంథకర్త ఇలా వ్రాశాడు: “నీ వాక్యము నన్ను బ్రదికించి యున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. యెహోవా, పూర్వకాలమునుండి యుండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసికొని నేను ఓదార్పు నొందితిని. నీ సేవకునికి నీవిచ్చిన మాటచొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక.” “ఓదార్పు” అనే పదం ఈ భాగాల్లో అనేకమార్లు ఉపయోగించబడిందని గమనించండి. అవును, మనం బాధపడే సమయంలో యెహోవా వాక్యంపై అవధానం నిలిపినప్పుడు మనకై మనం నిజమైన ఆదరణను పొందగలము మరియు దాన్ని మనం ఇతరులకు కూడా అందించగలము. ఇది మరియు సహోదరుల ప్రేమా వాత్సల్యాలు, మరణం వల్ల వచ్చిన వేదనను మనం తాళుకునేందుకు మరియు క్రైస్తవ పరిచర్యనందలి ఆనందమయ కార్యకలాపాలతో మన జీవితాలను మరలా నింపుకునేందుకు దోహదపడుతుంది.—కీర్తన 119:50, 52, 76.
22. మన ముందు ఏ ఉత్తరాపేక్ష ఉంది?
22 చింతిస్తున్న ఇతరులకు మనం సహాయం చేయడంలో పనిరద్దీని కల్గివుండడం కూడా కొంతమేరకు మన దుఃఖాన్ని మనం అధిగమించేందుకు సహాయపడుతుంది. ఓదార్పు అవసరమున్న వారి వైపుకు మనం మన అవధానాన్ని కేంద్రీకరించినప్పుడు, ఆత్మీయభావంలో ఇచ్చేవారిగా కూడా మనం నిజమైన ఆనందాన్ని పొందగలము. (అపొస్తలుల కార్యములు 20:35) మునుపటి రాజ్యాలన్నింటి ప్రజలు, ఒక తరం తర్వాత తరం వారు, మరణం వల్ల కోల్పోయిన తమ వారిని తిరిగి నూతన లోకంలోకి ఆహ్వానించే ఆ పునరుత్థాన దర్శనాన్ని మనం వారితో కూడా పంచుకుందాము. ఎంత చక్కని ఉత్తరాపేక్ష! మరి అప్పుడు యెహోవా నిజంగానే “దీనులను ఆదరించు” దేవుడని తెలుసుకున్నప్పుడు ఆనందబాష్పాలు రాలకుండా ఉండవు.—2 కొరింథీయులు 7:6.
మీరు జ్ఞాపకం చేసుకోగలరా?
◻ యెహోవా ఎలా “సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు”?
◻ తమ ప్రియమైనవారు మరణించిన వ్యధలోనున్నవారిని యేసు మరియు పౌలు ఎలా ఓదార్చారు?
◻ దుఃఖిస్తున్న వారికి ఆదరణనిచ్చేందుకు మనం చేయగల కొన్ని పనులేమిటి?
◻ తమ ప్రియమైనవారు మరణించిన వ్యధలోనున్న వారితో వ్యవహరించేటప్పుడు మనం ఏమి నివారించాలి?
◻ మరణించిన సమయంలో ఆదరణనందించే లేఖనాల్లో మీకు ఇష్టమైన లేఖనాలేవి?
[15వ పేజీలోని చిత్రం]
దుఃఖిస్తున్నవారికి సహాయపడేందుకు వివేకయుక్తంగా చొరవ తీసుకోండి