కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w03 5/1 పేజీలు 19-24
  • దుఃఖిస్తున్నవారిని ఓదార్చండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దుఃఖిస్తున్నవారిని ఓదార్చండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడిచ్చే ఓదార్పుతో ఇతరులను ఓదార్చండి
  • దౌర్జన్యంవల్ల లేదా ఆర్థిక సమస్యలవల్ల తీవ్రంగా బాధపడుతున్నవారిని ఓదార్చండి
  • తుఫానులు, భూకంపాలు ఎదుర్కొన్నవారిని ఓదార్చండి
  • కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు ఓదార్చండి
  • “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుని” నుండి ఓదార్పు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • ‘దుఃఖిస్తున్న వాళ్ళందర్నీ ఓదార్చండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • దేవుడు ఎలా ఓదారుస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2016
  • నిజమైన ఓదార్పు ఎక్కడ లభిస్తుంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
w03 5/1 పేజీలు 19-24

దుఃఖిస్తున్నవారిని ఓదార్చండి

‘దుఃఖాక్రాంతులందరిని ఓదార్చడానికి యెహోవా నన్ను అభిషేకించాడు.’—యెషయా 61:1, 2.

1, 2. మనం ఎవరిని ఓదార్చాలి, ఎందుకు ఓదార్చాలి?

నిజమైన ఓదార్పంతటికీ మూలమైన యెహోవా దేవుడు, ఇతరులు కష్టాలనుభవిస్తున్నప్పుడు వారి గురించి శ్రద్ధ తీసుకోవాలని మనకు బోధిస్తున్నాడు. ‘ధైర్యము చెడినవారిని ధైర్యపరచమని,’ దుఃఖిస్తున్నవారందరినీ ఓదార్చమని ఆయన మనకు బోధిస్తున్నాడు. (1 థెస్సలొనీకయులు 5:14) మన తోటి ఆరాధకులకు అలాంటి సహాయం అవసరమైనప్పుడు మనం అందజేస్తాము. మనం సంఘం వెలుపలవున్నవారిపట్ల, మనపై ప్రేమ ఉన్నట్లు గతంలో ఏ నిదర్శనము చూపించని వారిపట్ల కూడా ప్రేమ చూపిస్తాము.—మత్తయి 5:43-48; గలతీయులు 6:10.

2 యేసుక్రీస్తు ఈ ప్రవచనార్థక ఆజ్ఞను చదివి, దానిని తనకు అన్వయించుకున్నాడు: ‘ప్రభువగు యెహోవా ఆత్మ నామీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును, దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును, ఆయన నన్ను పంపియున్నాడు.’ (యెషయా 61:1, 2, 3; లూకా 4:16-19) ఈ ఆజ్ఞ తమకు కూడా వర్తిస్తుందని ఆధునిక దిన అభిషిక్త క్రైస్తవులు ఎప్పుడో గ్రహించారు, వారితోపాటు “వేరే గొఱ్ఱెలు” ఆ పనిలో సంతోషంగా భాగం వహిస్తున్నారు.—యోహాను 10:16.

3. “దేవుడు విపత్తులను ఎందుకు అనుమతిస్తున్నాడు?” అని ప్రజలు ప్రశ్నించినప్పుడు మనం వారికెలా సహాయం చేయవచ్చు?

3 విపత్తులు సంభవించినప్పుడు నలిగిన హృదయాలతో మిగిలిన ప్రజలు తరచూ “దేవుడు విపత్తులను ఎందుకు అనుమతిస్తున్నాడు?” అని ప్రశ్నిస్తారు. బైబిలు ఆ ప్రశ్నకు స్పష్టంగా సమాధానమిస్తోంది. అయితే బైబిలును అధ్యయనం చేయని వ్యక్తి ఆ సమాధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. దాన్ని అర్థం చేసుకోవడానికి యెహోవాసాక్షుల ప్రచురణల్లో సహాయం లభిస్తుంది.a అయితే కొందరు యెషయా 61:1, 2 వంటి వచనాలను బైబిలులో చూసి ఓదార్పు పొందారు, ఎందుకంటే మానవులు ఓదార్పు పొందాలన్న దేవుని కోరికను అవి వ్యక్తం చేస్తున్నాయి.

4. కృంగుదలతో బాధపడుతున్న ఒక విద్యార్థినికి పోలండ్‌లోని ఒక సాక్షి ఎలా సహాయం చేయగలిగింది, మీరు ఇతరులకు సహాయం చేసేందుకు ఆ అనుభవం మీకెలా సహాయపడవచ్చు?

4 యౌవనులకు, వృద్ధులకు కూడా ఓదార్పు అవసరం. పోలండ్‌లో కృంగుదలతో బాధపడుతున్న ఒక టీనేజ్‌ అమ్మాయి తనకు పరిచయస్థురాలైన ఒక స్త్రీని సలహా అడిగింది. యెహోవాసాక్షి అయిన ఆ స్నేహితురాలు ఆ అమ్మాయి బాధకు కారణమేమిటో ప్రేమపూర్వకంగా అడిగి తెలుసుకుంది. “ఈ లోకంలో ఎందుకు ఇంత దుష్టత్వం ఉంది? ప్రజలు ఎందుకు బాధలనుభవిస్తున్నారు? నా చెల్లెలు పక్షవాతంతో ఎందుకు బాధపడుతోంది? నా గుండె ఎందుకు ఆరోగ్యంగా లేదు? ఇవన్నీ ఇలాగే జరగాలని దేవుడు కోరుకుంటున్నాడని చర్చి చెబుతోంది. అదే నిజమైతే నేను దేవుణ్ణి నమ్మడం మానేస్తాను!” అని ఆ అమ్మాయి చెప్పినదాన్ని బట్టి ఆమెను ఎన్నో ప్రశ్నలు, సందేహాలు కలతపెడుతున్నాయని ఆ సాక్షి గ్రహించింది. అప్పుడు ఆ సాక్షి మౌనంగా యెహోవాకు ప్రార్థన చేసుకొని ఇలా చెప్పింది: “నువ్వు నన్ను ఈ విషయాల గురించి అడిగినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను.” చిన్నప్పుడు తనకు కూడా ఎన్నో సందేహాలు ఉండేవని, యెహోవాసాక్షులు తనకు సహాయం చేశారని ఆ సాక్షి ఆ అమ్మాయితో చెప్పింది. ఆ సాక్షి ఇలా వివరించింది: “దేవుడు ప్రజలు బాధలుపడేలా చేయడని నేను నేర్చుకున్నాను. ఆయన వారిని ప్రేమిస్తున్నాడు, వారి కోసం ఉత్తమమైనవాటినే కోరుకుంటున్నాడు, త్వరలోనే ఈ భూమిపై గొప్ప మార్పులు తీసుకురాబోతున్నాడు. అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలు, మరణం ఇక ఉండవు, విధేయులైన మానవులు ఈ భూమ్మీదే నిరంతరం జీవిస్తారు.” ఆమె ఆ అమ్మాయికి ప్రకటన 21:3, 4; యోబు 33:25; యెషయా 35:5-7; 65:21-25 వచనాలను చూపించింది. సుదీర్ఘమైన చర్చ జరిగిన తర్వాత కలిగిన అవగాహనతో ఆ అమ్మాయి, “ఇప్పుడు నా జీవిత సంకల్పమేమిటో నాకు తెలుసు. నేను మిమ్మల్ని మళ్ళీ కలవడానికి రావచ్చా?” అని అడిగింది. ఆమెతో వారానికి రెండుసార్లు బైబిలు అధ్యయనం నిర్వహించబడేది.

దేవుడిచ్చే ఓదార్పుతో ఇతరులను ఓదార్చండి

5. మనం సానుభూతిని వ్యక్తం చేసినప్పుడు, నిజమైన ఓదార్పునిచ్చేది ఏమిటి?

5 మనం ఇతరులను ఓదార్చడానికి ప్రయత్నించేటప్పుడు సానుభూతితో మాట్లాడడం మంచిది. దుఃఖపడుతున్న వ్యక్తి పరిస్థితి గురించి మనం ఎంతో చింతిస్తున్నామని మన మాటల ద్వారా మన స్వరం ద్వారా ఆయనకు తెలియజేయడానికి ప్రయత్నించాలి. అర్థరహితమైన వ్యాఖ్యానాలు చేయడం ద్వారా మనం దాన్ని సాధించలేము. “ఓర్పువలనను, ఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగు”తుందని బైబిలు మనకు చెబుతోంది. (ఇటాలిక్కులు మావి.) (రోమీయులు 15:4) ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనం సముచితమైన సందర్భంలో ఆ వ్యక్తికి దేవుని రాజ్యం గురించి వివరించి అది ప్రస్తుతమున్న సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో బైబిలు నుండి చూపించవచ్చు. అది ఎందుకు ఆధారపడదగిన నిరీక్షణో మనం తర్కించవచ్చు. ఈ విధంగా మనం ఓదార్పునిస్తాము.

6. లేఖనాల్లోని ఓదార్పు నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి ప్రజలు ఏ విషయాలను అర్థం చేసుకోవడానికి మనం సహాయపడాలి?

6 మనమిచ్చే ఓదార్పునుండి పూర్తి ప్రయోజనం పొందడానికి ఆ వ్యక్తికి నిజమైన దేవుని గురించి తెలిసివుండాలి అంటే ఆయన ఎలాంటి దేవుడు, ఆయన వాగ్దానాలు ఎంత ఆధారపడదగినవి అనే విషయాలు తెలిసివుండాలి. ప్రస్తుతం యెహోవా ఆరాధకుడు కాని వ్యక్తికి సహాయం చేయడానికి మనం ప్రయత్నించేటప్పుడు ఈ క్రింది అంశాలను వివరించడం మంచిది. (1) బైబిలులో ఉన్న ఓదార్పు సత్య దేవుడైన యెహోవా నుండి వచ్చినది. (2) యెహోవా సర్వశక్తిగల దేవుడు, ఆయన ఆకాశాన్నీ భూమినీ సృష్టించాడు. ఆయన ప్రేమగల దేవుడు, ప్రేమపూర్వక దయా సత్యమూ సమృద్ధిగా ఉన్న దేవుడు. (3) దేవుని వాక్యం నుండి ఖచ్చితమైన జ్ఞానమును సంపాదించుకోవడం ద్వారా దేవునికి సన్నిహితమైతే మనం కష్ట పరిస్థితులను సహించడానికి బలపరచబడతాము. (4) వివిధ వ్యక్తులు ఎదుర్కొనే నిర్దిష్టమైన పరీక్షలకు వర్తించే లేఖనాలు బైబిలులో ఉన్నాయి.

7. (ఎ) దేవుడిచ్చే ఓదార్పు ‘క్రీస్తుద్వారా విస్తరిస్తుందని’ నొక్కి చెప్పడం ద్వారా ఏమి సాధించవచ్చు? (బి) తాను గతంలో చెడ్డ పనులు చేశానని గ్రహించిన వ్యక్తిని మీరెలా ఓదార్చవచ్చు?

7 కొంతమంది, బాధపడుతున్నవారికి బైబిలు గురించి తెలిసివుంటే వారికి 2 కొరింథీయులు 1:3-7 వచనాలు చదివి వినిపించడం ద్వారా ఆధ్యాత్మిక ఓదార్పునిచ్చారు. అలా ఓదార్పునిచ్చేటప్పుడు వారు “ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది” అనే మాటలను నొక్కి చెప్పారు. బైబిలు ఓదార్పుకు మూలమని, దానికి మనం ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలని ఆ వ్యక్తి గ్రహించడానికి ఈ లేఖనం సహాయపడవచ్చు. బహుశా వేరే సందర్భాల్లో అదనపు చర్చలు జరపడానికి అది ఆధారం కావచ్చు. ఒక వ్యక్తి తాను గతంలో చేసిన చెడ్డ పనుల వల్లనే ఇప్పుడు కష్టాలనుభవిస్తున్నానని భావిస్తుంటే, మనం తీర్పు తీర్చేవారిగా ఉండకుండా 1 యోహాను 2:1, 2; కీర్తన 103:11-14 వచనాల్లో నమోదు చేయబడిన మాటలు తెలుసుకోవడం ఎంతో ఓదార్పుకరమని ఆయనకు చెప్పవచ్చు. ఈ విధంగా మనం దేవుడిచ్చే ఓదార్పును ఉపయోగించి ఇతరులకు నిజమైన ఓదార్పునిస్తాము.

దౌర్జన్యంవల్ల లేదా ఆర్థిక సమస్యలవల్ల తీవ్రంగా బాధపడుతున్నవారిని ఓదార్చండి

8, 9. దౌర్జన్యాన్ని అనుభవించిన ప్రజలకు తగినట్లుగా ఎలా ఓదార్పునివ్వవచ్చు?

8 సమాజంలోని నేరస్థుల దౌర్జన్యంవల్ల లేదా యుద్ధాలవల్ల కోట్లాదిమంది జీవితాలు నాశనమయ్యాయి. మనం వారిని ఎలా ఓదార్చవచ్చు?

9 నిజ క్రైస్తవులు తమ మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ లోక వివాదాల్లో ఒక నిర్దిష్టమైన వర్గానికి మద్దతునివ్వకుండా జాగ్రత్తపడతారు. (యోహాను 17:16) కానీ ప్రస్తుతమున్న ఈ చెడు పరిస్థితులు ఎప్పటికీ ఇలాగే ఉండవని చూపించడానికి వారు బైబిలును సరైన విధంగా ఉపయోగిస్తారు. దౌర్జన్యాన్ని ప్రేమించే వారి గురించి యెహోవా ఎలా భావిస్తున్నాడో చూపించడానికి కీర్తన 11:5వ వచనాన్ని చదవవచ్చు లేదా మనం ప్రతిక్రియ చేయకుండా దేవునిపై నమ్మకముంచాలని ఆయనిచ్చే ప్రోత్సాహాన్ని చూపించడానికి కీర్తన 37:1-4 వచనాలు చదవవచ్చు. ప్రస్తుతం పరలోక రాజుగా పరిపాలిస్తున్న గొప్ప సొలొమోను అయిన యేసుక్రీస్తు హింసలనుభవిస్తున్న అమాయక ప్రజల గురించి ఎలా భావిస్తున్నాడో కీర్తన 72:12-14 వచనాలు తెలియజేస్తున్నాయి.

10. మీరు యుద్ధం జరుగుతున్న కాలంలో నివసించివుంటే, పైన ప్రస్తావించబడిన లేఖనాలు మిమ్మల్ని ఎలా ఓదార్చగలవు?

10 వివిధ వర్గాలు అధికారం కోసం చేసే అనేక పోరాటాలను చాలామంది సహించారు. యుద్ధాలు, వాటి ప్రభావాలు తమ జీవితంలో ఒక భాగమని వారు భావిస్తారు. ఇంకో దేశానికి తప్పించుకొని పారిపోతే తప్ప తమ పరిస్థితులు మెరుగుపడవని వారు అనుకుంటారు. కానీ వారిలో చాలామంది అలా చెయ్యలేకపోయారు, అలా చేయడానికి ప్రయత్నించిన వారిలో చాలామంది తమ ప్రాణాలను కోల్పోయారు. కొంతమంది చివరికి వేరే దేశానికి వెళ్ళడంలో సఫలమైనప్పటికీ అక్కడ కూడా ఎన్నో సమస్యలున్నాయని గ్రహిస్తారు. అలాంటి వారు వలస వెళ్ళడం కంటే మరింత ఆధారపడదగిన విషయం గురించి నిరీక్షించడానికి సహాయం చేసేందుకు కీర్తన 146:3-6 వచనాలను ఉపయోగించవచ్చు. అలాంటి వారు అనుభవిస్తున్న పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, ఆ పరిస్థితుల భావాన్ని అంటే మనం ఈ పాత విధానాంతంలో జీవిస్తున్నామని అర్థం చేసుకోవడానికి మత్తయి 24:3, 7, 14 లేదా 2 తిమోతి 3:1-5 వచనాల్లోని ప్రవచనం సహాయపడవచ్చు. శాంతియుతమైన భవిష్యత్తు కోసం మనం నిజంగా నిరీక్షించవచ్చని గ్రహించడానికి వారికి కీర్తన 46:1-3, 8, 9; యెషయా 2:2-4 వంటి లేఖనాలు సహాయం చేయవచ్చు.

11. దక్షిణాఫ్రికాలోని ఒక స్త్రీని ఏ లేఖనాలు ఓదార్చాయి, ఎందుకు?

11 దక్షిణాఫ్రికాలో నిర్విరామంగా యుద్ధం జరుగుతున్న కాలంలో ఒక స్త్రీ తుపాకి గుండ్ల వర్షాన్ని తప్పించుకోవడానికి తన ఇల్లు వదిలి పారిపోయింది. ఆమె జీవితం భయం, దుఃఖం, హృదయాన్ని కలతపెట్టే నిరుత్సాహంతో నిండిపోయింది. తర్వాత ఆమె కుటుంబం వేరే దేశంలో నివసిస్తున్నప్పుడు ఆమె భర్త వారి వివాహ సర్టిఫికెట్‌ను కాల్చేసి గర్భవతిగా ఉన్న ఆమెను, పదేళ్ళ కుమారుడిని దూరంగా పంపించి ప్రీస్టుగా మారడానికి నిర్ణయించుకున్నాడు. ఆమెకు కావలికోట, తేజరిల్లు! పత్రికల్లోని ఆర్టికల్‌లతోపాటు ఫిలిప్పీయులు 4:6, 7; కీర్తన 55:22 వచనాలను చూపించినప్పుడు చివరికి ఆమె తన జీవితంలో ఓదార్పును పొంది, తన జీవితానికి ఒక సంకల్పాన్ని కనుగొంది.

12. (ఎ) ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్న వారికి లేఖనాలు ఎలాంటి నిరీక్షణను ఇస్తున్నాయి? (బి)ఆసియాలోని ఒక సాక్షి ఒక వినియోగదారిణికి ఎలా సహాయం చేయగలిగింది?

12 ఆర్థిక పతనం కోట్లాదిమంది జీవితాలను తీవ్రంగా పాడుచేసింది. కొన్నిసార్లు అది యుద్ధాలు, వాటి ప్రభావాలవల్లే జరుగుతుంది. వేరే సందర్భాల్లో ప్రభుత్వాలు వేసిన అవివేకమైన పథకాలు, అధికారంలో ఉన్న వారు స్వార్థంతో అవినీతికి పాల్పడడం వంటివి ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొట్టి వారు తమ సంపదలను కోల్పోయేలా చేస్తుంది. మరికొంతమందికి ఈ లోకంలోని వస్తువులు స్తోమతకు మించినవి. దేవునిపై విశ్వాసముంచే వారికి ఉపశమనం లభిస్తుందని, ప్రజలు తమ కృషి ఫలితాలను అనుభవించే నీతియుక్తమైన లోకం తప్పకుండా వస్తుందని దేవుడు హామీ ఇస్తున్నాడని తెలుసుకొని అలాంటి వారందరూ ఓదార్పు పొందుతారు. (కీర్తన 146:6, 7; యెషయా 65:17, 21-23; 2 పేతురు 3:13) ఆసియాలోని ఒక దేశంలో ఉన్న ఒక వినియోగదారిణి అక్కడి ఆర్థిక పరిస్థితి గురించి తన చింతను వ్యక్తం చేయడాన్ని విన్న ఒక సాక్షి, అక్కడ జరుగుతున్నది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల విధానంలో భాగమని ఆమెకు వివరించింది. మత్తయి 24:3-14; కీర్తన 37:9-11 వచనాలను ఆమెతో చర్చించడంతో అది ఒక క్రమ బైబిలు అధ్యయనానికి దారి తీసింది.

13. (ఎ) అబద్ధపు వాగ్దానాల వల్ల నిరుత్సాహపడిన ప్రజలకు సహాయం చేయడానికి మనం బైబిలును ఎలా ఉపయోగించవచ్చు? (బి) చెడు పరిస్థితులు దేవుడు లేడని నిరూపిస్తున్నాయని ప్రజలు భావిస్తుంటే, అలాంటి వారితో తర్కించడానికి మీరెలా ప్రయత్నించవచ్చు?

13 ప్రజలు అనేక సంవత్సరాలుగా బాధలనుభవించినప్పుడు లేదా అనేక అబద్ధపు వాగ్దానాల వల్ల నిరుత్సాహపడినప్పుడు వారు “మనోవ్యాకులమునుబట్టి” మోషే మాట వినని ఇశ్రాయేలీయులవలే ఉండవచ్చు. (నిర్గమకాండము 6:9) అలాంటప్పుడు, ప్రస్తుత సమస్యలతో సమర్థవంతంగా వ్యవహరించడానికి, అనేకుల జీవితాలను అకారణంగా నాశనం చేసే ప్రమాదాలను నివారించడానికి బైబిలు సహాయం చేసే విధానాలను నొక్కి చెప్పడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. (1 తిమోతి 4:8) కొందరు దేవుడు లేడని లేదా ఆయన తమ గురించి పట్టించుకోడని అందుకు తాము జీవిస్తున్న చెడు పరిస్థితులే రుజువని భావించవచ్చు. దేవుడు సహాయాన్ని అందించాడు కానీ చాలామంది దాన్ని స్వీకరించలేదని వారు గ్రహించేలా మీరు తగిన లేఖనాలను ఉపయోగించి వారితో తర్కించవచ్చు.—యెషయా 48:17, 18.

తుఫానులు, భూకంపాలు ఎదుర్కొన్నవారిని ఓదార్చండి

14, 15. ఒక విపత్తువల్ల చాలామంది దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు యెహోవాసాక్షులు తమ శ్రద్ధను ఎలా చూపించారు?

14 తుఫాను, భూకంపం, అగ్నిప్రమాదం లేదా బాంబు పేలుడు వంటి వాటివల్ల విపత్తు సంభవించవచ్చు. దాని ఫలితంగా అనేకులు బాధకు గురికావచ్చు. అలాంటి విపత్తుల నుండి బ్రతికి బయటపడినవారిని ఓదార్చడానికి ఏమి చేయవచ్చు?

15 తమ పట్ల శ్రద్ధ తీసుకునేవారు ఉన్నారని ప్రజలు తెలుసుకోవాలి. ఒక దేశంలో ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత అనేకమంది దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. వారిలో చాలామంది తమ కుటుంబ సభ్యులను, తమ కుటుంబాన్ని పోషించే సభ్యులను, స్నేహితులను కోల్పోయారు. కొంతమంది తమ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు లేదా తమకు భద్రతనిస్తుందని భావించినదాన్ని కోల్పోయారు. యెహోవాసాక్షులు తమ ఇరుగు పొరుగు వారికి సహాయాన్ని అందించారు, తమ పొరుగువారి శారీరక, భావోద్వేగ సంక్షేమం గురించి యథార్థమైన శ్రద్ధ వ్యక్తం చేస్తూ వారు బైబిలునుండి ఓదార్పుకరమైన విషయాలను తెలియజేశారు. వారు చూపిన శ్రద్ధకు చాలామంది కృతజ్ఞతలు తెలియజేశారు.

16. ఎల్‌ సాల్వడార్‌లోని ఒక ప్రాంతంలో విపత్తు సంభవించినప్పుడు, స్థానిక సాక్షులు చేసిన క్షేత్ర పరిచర్య ఎందుకు ప్రభావవంతమైనదిగా ఉండింది?

16 ఎల్‌ సాల్వడార్‌లో 2001వ సంవత్సరంలో ఒక తీవ్రమైన భూకంపం తర్వాత కొండలపైనుండి పెద్ద మట్టిదిబ్బలు జారిపడడంతో చాలామంది చనిపోయారు. ఒక సాక్షి 25 సంవత్సరాల కుమారుడు, తన కుమారుడికి కాబోయే భార్య చెల్లెళ్ళిద్దరు ఆ ప్రమాదంలో చనిపోయారు. ఆ యువకుడి తల్లి, ఆయనకు కాబోయే భార్య వెంటనే క్షేత్ర పరిచర్యలో భాగం వహించడం ప్రారంభించారు. చనిపోయినవారందరిని దేవుడు తీసుకువెళ్ళాడనీ, అలా జరగడం దేవుని చిత్తమేననీ చాలామంది అన్నారు. మనం బాధపడాలని దేవుడు కోరుకోవడంలేదని చూపించడానికి ఆ సాక్షులు సామెతలు 10:22వ వచనాన్ని చూపించారు.b మరణము దేవుని చిత్తం వల్ల కాదు కానీ మానవుడు చేసిన పాపం వల్ల వచ్చిందని చూపించడానికి వారు రోమీయులు 5:12వ వచనం చదివారు. వారు కీర్తన 34:18; కీర్తన 37:29; యెషయా 25:8; ప్రకటన 21:3, 4 వచనాల్లోని ఓదార్పుకరమైన సందేశాన్ని కూడా తెలియజేశారు. తమకు సాక్ష్యమిస్తున్న ఈ ఇద్దరు స్త్రీలు కూడా తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు కాబట్టి ప్రజలు వారు చెప్పింది ఇష్టపూర్వకంగా విన్నారు, ఎన్నో బైబిలు అధ్యయనాలు ప్రారంభించబడ్డాయి.

17. విపత్తు సమయాల్లో మనం ఏ విధంగా సహాయం చేయవచ్చు?

17 విపత్తు సంభవించినప్పుడు, తక్షణమే శారీరక సహాయం అవసరమైన వారిని మీరు కలిసే అవకాశం ఉంది. మీరు డాక్టర్‌ను పిలవడం, ఆ వ్యక్తి హాస్పిటల్‌కి వెళ్ళడానికి సహాయం చేయడం లేదా ఆహారం, వసతి కల్పించడానికి సాధ్యమైనదంతా చేయడం వంటివి చేయవలసిన అవసరం ఉండవచ్చు. 1998వ సంవత్సరంలో ఇటలీలో అలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఒక పత్రికా విలేఖరి, యెహోవాసాక్షులు “ఆచరణాత్మకమైన విధంగా పనిచేస్తారు, బాధపడుతున్నవారు ఏ మతానికి చెందినవారని ఆలోచించకుండా వారు సహాయాన్ని అందజేస్తారు” అని వ్యాఖ్యానించాడు. కొన్ని ప్రాంతాల్లో, అంత్యదినాల్లో జరుగుతాయని ప్రవచించబడిన సంఘటనలు ఎంతో బాధను కలిగిస్తాయి. ఆ ప్రాంతాల్లో యెహోవాసాక్షులు ప్రజలకు బైబిలు ప్రవచనాలను చూపించి, దేవుని రాజ్యం మానవజాతికి నిజమైన భద్రతను తెస్తుందని బైబిలు ఇస్తున్న హామీతో ఓదార్పునిస్తారు.—సామెతలు 1:33; మీకా 4:4.

కుటుంబ సభ్యులు చనిపోయినప్పుడు ఓదార్చండి

18-20. ఒక కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు, మీరు వారిని ఓదార్చడానికి ఏమి చేయవచ్చు లేదా ఏమి చెప్పవచ్చు?

18 ప్రతీరోజు లక్షలాది మంది తమ ప్రియమైన వారిని కోల్పోయి దుఃఖపడుతుంటారు. మీరు క్రైస్తవ పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు లేదా అనుదిన కార్యకలాపాలు చేసుకుంటున్నప్పుడు అలాంటి వారిని కలిసే అవకాశముంది. వారిని ఓదార్చడానికి మీరేమి చేయవచ్చు లేదా ఏమి చెప్పవచ్చు?

19 ఆ వ్యక్తి భావోద్వేగపరంగా కలతపడుతున్నట్లు కనిపిస్తున్నాడా? ఆ ఇల్లంతా దుఃఖిస్తున్న బంధువులతో నిండివుందా? మీరు ఎన్నో విషయాలు చెప్పడానికి ఇష్టపడవచ్చు కానీ వివేచన ఉపయోగించడం ప్రాముఖ్యం. (ప్రసంగి 3:1, 7) బహుశా మీరు మీ విచారాన్ని వ్యక్తం చేసి, తగిన బైబిలు ప్రచురణను (ఒక బ్రోషుర్‌, పత్రిక లేదా ఒక కరపత్రం) వారికిచ్చి, అదనపు సహాయం చేయవచ్చేమో చూడడానికి కొన్ని రోజుల తర్వాత తిరిగి సందర్శిస్తే బాగుంటుంది. సముచితమైన సమయంలో బైబిలు నుండి కొన్ని ప్రోత్సాహకరమైన విషయాలను వారితో పంచుకోవడానికి ప్రయత్నించండి. ఇది వారిని శాంతింపజేసి, వారికి ఊరట కలుగజేస్తుంది. (సామెతలు 16:24; 25:11) యేసు చనిపోయినవారిని పునరుత్థానం చేసినట్లు మీరు చేయలేరు. కానీ చనిపోయిన వారి పరిస్థితి గురించి బైబిలు చెబుతున్న విషయాలను మీరు వారికి తెలియజేయవచ్చు, అయితే అవతలివారి తప్పు అభిప్రాయాలను ఖండించే ప్రయత్నం చేయడానికి అది తగిన సమయం కాకపోవచ్చు. (కీర్తన 146:4; ప్రసంగి 9:5, 10; యెహెజ్కేలు 18:4) పునరుత్థానం గురించిన బైబిలు వాగ్దానాలను మీరు కలిసి చదవవచ్చు. (యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:14) మీరు వాటి భావమేమిటో చర్చించవచ్చు, అలా చేయడానికి బహుశా పునరుత్థానం గురించిన ఒక బైబిలు నివేదికను ఉపయోగించవచ్చు. (లూకా 8:49-56; యోహాను 11:39-44) అంతేకాక ఇలాంటి నిరీక్షణనిచ్చే ప్రేమపూర్వకమైన దేవుని లక్షణాలవైపు అవధానం మళ్ళించండి. (యోబు 14:14, 15; యోహాను 3:16) ఈ బోధనలు మీకు ఎలా ప్రయోజనాన్ని చేకూర్చాయో, వాటిలో మీకు ఎందుకు విశ్వాసముందో వివరించండి.

20 దుఃఖిస్తున్న వ్యక్తిని రాజ్య మందిరానికి ఆహ్వానిస్తే, తమ పొరుగువారిని నిజంగా ప్రేమించే ప్రజలను, ఒకరినొకరు ఎలా ప్రోత్సహించుకోవచ్చో తెలిసిన ప్రజలను ఆయన కలుసుకోవడానికి సహాయపడుతుంది. స్వీడన్‌లోని ఒక స్త్రీ తాను తన జీవితమంతా ఇలాంటి దాని కోసమే వెదికానని చెబుతోంది.—యోహాను 13:35; 1 థెస్సలొనీకయులు 5:11.

21, 22. (ఎ) ఓదార్పునివ్వడానికి మనమేమి చేయవలసిన అవసరం ఉంది? (బి) అప్పటికే లేఖనాలు బాగా తెలిసిన వ్యక్తిని మీరెలా ఓదార్చవచ్చు?

21 ఒక వ్యక్తి ఎంతో దుఃఖంతో ఉన్నాడని మీకు తెలిసినప్పుడు, ఆ వ్యక్తి క్రైస్తవ సంఘానికి చెందినవాడైనా కాకపోయినా, ఆ వ్యక్తిని ఓదార్చడానికి ఏమి చేయాలి లేదా ఏమి చెప్పాలి అని మీరు సంశయిస్తారా? బైబిలులో తరచూ “ఓదార్పు” అని అనువదించబడిన గ్రీకు పదానికి “ఒకరిని దగ్గరకు తీసుకోవడం” అని అక్షరార్థ భావం. నిజమైన ఓదార్పునిచ్చేవారిగా ఉండడమంటే దుఃఖిస్తున్నవారికి మీరు సహాయం చేయడానికి ముందుకు రావడమే.—సామెతలు 17:17.

22 మీరు ఓదార్చాలనుకునే వ్యక్తికి అప్పటికే మరణం గురించి, విమోచన క్రయధనం గురించి, పునరుత్థానం గురించి బైబిలు ఏమి చెబుతుందో తెలిసివుంటే అప్పుడెలా? తనలాంటి నమ్మకాలు గల స్నేహితుడి సమక్షంలో ఉండడం ఆ వ్యక్తికి ఎంతో ఓదార్పుకరంగా ఉండవచ్చు. ఆయన మాట్లాడాలనుకుంటే, మీరు శ్రద్ధగా వినండి. మీరు ప్రసంగం ఇవ్వాలని భావించకండి. ఒకవేళ లేఖనాలను చదివితే, వాటిని మీ ఇద్దరి హృదయాలను బలపరచడానికి దేవుడు చెబుతున్న మాటలుగా పరిగణించండి. ఆ లేఖనాలు వాగ్దానం చేస్తున్న విషయాలు తప్పకుండా నెరవేరతాయని మీ ఇద్దరికీ ఉన్న దృఢ నమ్మకాన్ని వ్యక్తం చేయండి. మీరు దేవుని కనికరాన్ని అనుకరించడం ద్వారా, దేవుని వాక్యంలోని విలువైన సత్యాలను పంచుకోవడం ద్వారా “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” అయిన యెహోవా నుండి వచ్చే ఉపశమనాన్ని, బలాన్ని పొందడానికి దుఃఖిస్తున్నవారికి సహాయం చేయవచ్చు.—2 కొరింథీయులు 1:3.

[అధస్సూచీలు]

a నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంలో 8వ అధ్యాయం; లేఖనాల నుండి తర్కించడం (ఆంగ్లం) పుస్తకంలో 393-400, 427-31 పేజీలు; మీపట్ల శ్రద్ధగల సృష్టికర్త ఉన్నాడా? (ఆంగ్లం) పుస్తకంలో 10వ అధ్యాయం; దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? బ్రోషుర్‌ను చూడండి.

b ఈ లేఖనం యొక్క సరైన అనువాదం: “యెహోవా దీవెన ఐశ్వర్యవంతులను చేస్తుంది, దానితో ఆయన ఏ బాధను చేర్చడు” NW.

[23వ పేజీలోని చిత్రాలు]

కష్టసమయాల్లో నిజమైన ఓదార్పునిచ్చే సందేశాన్ని తెలియజేయండి

[చిత్రసౌజన్యం]

శరణార్థి శిబిరం: UN PHOTO 186811/J. Isaac

[24వ పేజీలోని చిత్రం]

స్నేహితురాలి సమక్షంలో ఉండడం ఓదార్పుకరంగా ఉంటుంది

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి