కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w17 జూలై పేజీలు 12-16
  • “ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్వండి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్వండి”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా “ఓదార్పును ఇచ్చే దేవుడు”
  • యేసు కూడా మన బాధను అర్థంచేసుకుంటాడు
  • “లేఖనాల నుండి దొరికే ఊరట”
  • సంఘంలో మనకు ఓదార్పు దొరుకుతుంది
  • ఇతరుల్ని ఓదారుస్తూ ఉండండి
  • “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుని” నుండి ఓదార్పు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
  • దుఃఖిస్తున్నవారిని ఓదార్చండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • ‘దుఃఖిస్తున్న వాళ్ళందర్నీ ఓదార్చండి’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • ఇతరులు ఎలా సహాయం చేయవచ్చు?
    మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
w17 జూలై పేజీలు 12-16
హాస్పిటల్‌ వెయిటింగ్‌ రూమ్‌లో ఏడుస్తూ ఉన్న ఇద్దరు వ్యక్తులు

“ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్వండి”

“ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండండి.”—1 థెస్స. 5:11.

పాటలు: 90, 111

మీకు గుర్తున్నాయా?

  • యెహోవా మనల్ని ఎలా ఓదారుస్తాడు?

  • దుఃఖంలో ఉన్నవాళ్లకు ఏ లేఖనాలు ఓదార్పునిస్తాయి?

  • దుఃఖంలో ఉన్నవాళ్లను సంఘంలోని వాళ్లు ఎలా ఓదార్చవచ్చు?

1, 2. దుఃఖంలో ఉన్నవాళ్లను ఎలా ఓదార్చాలో మనమెందుకు చర్చించుకోవాలి? (ప్రారంభ చిత్రం చూడండి.)

“మా అబ్బాయి చనిపోయిన దాదాపు సంవత్సరం వరకు గుండెలు పిండేసే బాధను అనుభవించాం” అని సుసీ చెప్పింది. ఒక సహోదరుడు, తన భార్య చనిపోయిన తర్వాత “తీవ్రమైన బాధను” అనుభవించానని చెప్పాడు. విచారకరంగా అలాంటి బాధను చాలామంది అనుభవిస్తున్నారు. నేడు క్రైస్తవ సంఘంలో ఎంతోమంది సహోదరసహోదరీలు హార్‌మెగిద్దోను రాకముందే తమ ప్రియమైనవాళ్లను కోల్పోవాల్సి వస్తుందని ఊహించివుండరు. బహుశా మీకు ఇష్టమైనవాళ్లు కూడా చనిపోయి ఉండవచ్చు లేదా తమకు ఇష్టమైనవాళ్లు చనిపోయారనే బాధలో ఉన్నవాళ్లు మీకు తెలిసుండవచ్చు. అయితే, ‘దుఃఖంలో ఉన్నవాళ్లు ఎలా ఓదార్పు పొందవచ్చు?’ అనే ప్రశ్న మీకు వచ్చివుంటుంది.

2 కాలం అన్నిరకాల గాయాలను మాన్పుతుందని కొంతమంది అంటారు. కానీ అది అన్నిసార్లూ జరుగుతుందా? భర్తను కోల్పోయిన ఒకామె ఇలా చెప్పింది, “ఒకరు తమ సమయాన్ని ఉపయోగించే విధానంబట్టే కాలం వాళ్ల బాధను మాన్పుతుందని అనుభవంతో తెలుసుకున్నాను.” శరీరానికి తగిలిన గాయం మానాలంటే సమయం, శ్రద్ధ అవసరం. అలాగే మన మనసుకు అయిన గాయం మానాలంటే కూడా సమయం, శ్రద్ధ అవసరం. అయితే మనోవేదన నుండి ఉపశమనం పొందడానికి దుఃఖంలో ఉన్నవాళ్లకు ఏది సహాయం చేస్తుంది?

యెహోవా “ఓదార్పును ఇచ్చే దేవుడు”

3, 4. యెహోవా మన బాధను అర్థంచేసుకుంటాడని ఎందుకు చెప్పవచ్చు?

3 వేరే ఎవ్వరికన్నా ఎక్కువగా కనికరంగల తండ్రైన యెహోవాయే మనకు కావాల్సిన ఓదార్పునిస్తాడు. (2 కొరింథీయులు 1:3, 4 చదవండి.) సహానుభూతి చూపించే విషయంలో ఆయనే అత్యంత గొప్ప ఆదర్శం, ‘నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను’ అని యెహోవా తన ప్రజలకు మాటిస్తున్నాడు.—యెష. 51:12; కీర్త. 119:50, 52, 76.

4 యెహోవా ప్రేమించిన తన సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, రాజైన దావీదు వంటివాళ్లు చనిపోయారు. కాబట్టి ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు కలిగే బాధేంటో మన ప్రేమగల తండ్రైన యెహోవాకు కూడా తెలుసు. (సంఖ్యా. 12:6-8; మత్త. 22:31, 32; అపొ. 13:22) ఆ నమ్మకమైన వాళ్లను పునరుత్థానం చేసే రోజు కోసం యెహోవా ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నాడని బైబిలు చెప్తోంది. (యోబు 14:14, 15) పునరుత్థానం అయ్యాక వాళ్లు పూర్తి ఆరోగ్యంతో సంతోషంగా ఉంటారు. యెహోవా తన ప్రియ కుమారుడైన యేసు చనిపోవడం కూడా చూశాడు. నిజానికి యేసు అంటే యెహోవాకు ఎంతో ఇష్టమని బైబిలు చెప్తోంది. (మత్త. 3:17) తన కుమారుడు తీవ్రమైన బాధ అనుభవిస్తూ చనిపోవడం చూసినప్పుడు యెహోవా ఎంత వేదన అనుభవించి ఉంటాడో మనం కనీసం ఊహించలేం కూడా.—యోహా. 5:20; 10:17.

5, 6. యెహోవా మనల్ని ఎలా ఓదారుస్తాడు?

5 యెహోవా మనకు సహాయం చేస్తాడనే పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. కాబట్టి ఆయనకు ప్రార్థించి మన వేదనను, దుఃఖాన్ని చెప్పుకోవడానికి ఎన్నడూ వెనకాడకూడదు. యెహోవా మన బాధను అర్థంచేసుకుంటాడని, కావాల్సిన ఓదార్పునిస్తాడని తెలుసుకోవడం ఎంత ఊరటనిస్తుందో కదా! మరి యెహోవా మనల్ని ఎలా ఓదారుస్తాడు?

6 యెహోవా మనల్ని ఎన్నో విధాలుగా ఓదారుస్తాడు. వాటిలో ఒక విధానం ఏమిటంటే, తన పవిత్రశక్తిని ఇవ్వడం. (అపొ. 9:31) తన శక్తివంతమైన పవిత్రశక్తి కోసం అడిగే ప్రతీఒక్కరికి యెహోవా తప్పకుండా దాన్ని ఇస్తాడని యేసు మాటిచ్చాడు. (లూకా 11:13) పై పేరాలో ప్రస్తావించిన సుసీ అనే సహోదరి ఇలా చెప్తోంది, “మేము ఎన్నోసార్లు మోకాళ్ల మీద ఉండి, ఓదార్పు కోసం యెహోవాను వేడుకున్నాం. నిజానికి అలా వేడుకున్న ప్రతీసారి, ‘దేవుని శాంతి’ మా మనసుల్ని, హృదయాల్ని కాపాడింది.”—ఫిలిప్పీయులు 4:6, 7 చదవండి.

యేసు కూడా మన బాధను అర్థంచేసుకుంటాడు

7, 8. యేసు మనల్ని ఓదారుస్తాడని ఎందుకు ఖచ్చితంగా చెప్పవచ్చు?

7 యేసు భూమ్మీదున్నప్పుడు తన మాటల్లో, పనుల్లో యెహోవాకున్న అద్భుతమైన లక్షణాల్ని పరిపూర్ణంగా చూపించాడు. (యోహా. 5:19) “నలిగిన హృదయముగలవారిని,” ‘దుఃఖించే’ వాళ్లందర్నీ ఓదార్చడానికి యెహోవా భూమ్మీదకు యేసును పంపించాడు. (యెష. 61:1, 2; లూకా 4:17-21) యేసు తమ బాధను అర్థంచేసుకున్నాడనీ, తమకు సహాయం చేయాలని నిజంగా కోరుకుంటున్నాడనీ ప్రజలకు తెలుసు.—హెబ్రీ. 2:17.

8 యేసు యౌవనంలో ఉన్నప్పుడు తన సన్నిహిత స్నేహితులు, బంధువులు చనిపోవడం చూసుంటాడు. ఉదాహరణకు, యేసు యౌవనంలో ఉండగానే ఆయన తండ్రైన యోసేపు చనిపోయివుంటాడు.a ఇతరులపట్ల శ్రద్ధ చూపించే యేసుకు ఆ చిన్నవయసులో అంత దుఃఖాన్ని తట్టుకోవడం, అలాగే తన తల్లిని, తమ్ముళ్లను, చెల్లెళ్లను ఓదార్చడం ఎంత కష్టమైవుంటుందో ఆలోచించండి.

9. లాజరు చనిపోయినప్పుడు యేసు సహానుభూతిని ఎలా చూపించాడు?

9 తాను ప్రజల బాధల్ని అర్థంచేసుకున్నానని, వాళ్లపట్ల తనకు సహానుభూతి ఉందని యేసు తన భూపరిచర్య అంతటిలో చూపించాడు. ఉదాహరణకు, తన సన్నిహిత స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు, మార్త మరియల వేదనను యేసు కూడా అనుభవించాడు. వాళ్లపట్ల ఎంత సహానుభూతి చూపించాడంటే, తాను ఇంకాసేపట్లో లాజరును పునరుత్థానం చేయబోతున్నానని తెలిసి కూడా యేసు ఏడ్చాడు.—యోహా. 11:33-36.

10. నేడు మన బాధను యేసు ఖచ్చితంగా అర్థంచేసుకుంటాడని ఎలా చెప్పవచ్చు?

10 గతంలో యేసు మాట్లాడిన ఓదార్పుకరమైన మాటల నుండి నేడు మనమెలా ఊరట పొందవచ్చు? యేసు మారలేదు. “యేసుక్రీస్తు నిన్న, నేడు ఒకేలా ఉన్నాడు, ఎప్పటికీ ఒకేలా ఉంటాడు” అని బైబిలు చెప్తోంది. (హెబ్రీ. 13:8) “జీవాన్ని ఇవ్వడానికి నియమించబడిన ముఖ్య ప్రతినిధి” అనే పేరు యేసుకు ఉంది, ఎందుకంటే ఆయన ద్వారా మనం శాశ్వత జీవితాన్ని పొందుతాం. యేసు మన బాధను అర్థంచేసుకుంటాడు, “పరీక్షలు ఎదుర్కొంటున్నవాళ్లకు ఆయన సహాయం చేయగలడు.” (అపొ. 3:15; హెబ్రీ. 2:10, 18) కాబట్టి ఇతరులు బాధపడుతున్నప్పుడు యేసు ఇప్పటికీ చలించిపోతాడనే నమ్మకంతో మనం ఉండవచ్చు. ఆయన ప్రజల దుఃఖాన్ని అర్థంచేసుకుని, “సహాయం అవసరమైనప్పుడు” వాళ్లను ఓదారుస్తాడు.—హెబ్రీయులు 4:15, 16 చదవండి.

“లేఖనాల నుండి దొరికే ఊరట”

11. మీకు ఏ లేఖనాలు ఓదార్పునిచ్చాయి?

11 లాజరు చనిపోయినప్పుడు యేసు పడిన వేదనను వివరించే వృత్తాంతం బైబిల్లో ఉంది. లేఖనాల్లో మనకు దొరికే ఓదార్పుకు అది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే. నిజానికి, “పూర్వం రాయబడినవన్నీ మనకు బోధించడానికే రాయబడ్డాయి. మన సహనం ద్వారా, లేఖనాల నుండి దొరికే ఊరట ద్వారా మనం నిరీక్షణ కలిగివుండేందుకు అవి రాయబడ్డాయి.” (రోమా. 15:4) ఒకవేళ మీరు దుఃఖంలో ఉంటే అలాంటి లేఖనాల నుండి ఎంతో ఓదార్పు పొందవచ్చు. వాటిలో కొన్నేమిటంటే:

  • “విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.”—కీర్త. 34:18, 19.

  • “నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ [యెహోవా] గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది.”—కీర్త. 94:19.

  • “మనల్ని ప్రేమిస్తున్న మన తండ్రైన దేవుడు అపారదయతో మనకు శాశ్వతమైన ఊరటను, గొప్ప నిరీక్షణను ఇచ్చాడు. దేవుడు, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు మీకు ఊరటను ఇవ్వాలని . . . మిమ్మల్ని స్థిరపర్చాలని కోరుకుంటున్నాను.”—2 థెస్స. 2:16, 17.b

సంఘంలో మనకు ఓదార్పు దొరుకుతుంది

12. మనం ఇతరుల్ని ఎలా ఓదార్చవచ్చు?

12 దుఃఖంలో ఉన్నవాళ్లకు క్రైస్తవ సంఘంలో కూడా ఓదార్పు దొరుకుతుంది. (1 థెస్సలొనీకయులు 5:11 చదవండి.) “నలిగిన మనస్సు” ఉన్నవాళ్లను మీరు ఎలా బలపర్చి, ఓదార్చవచ్చు? (సామె. 17:22) ‘మౌనంగా ఉండడానికి మాట్లాడడానికి’ సమయం ఉంటుందని గుర్తుంచుకోండి. (ప్రసం. 3:7) దుఃఖంలో ఉన్నవాళ్లు తమ మనసులోని ఆలోచనల్ని, భావాల్ని బయటకు చెప్పాల్సిన అవసరం ఉందని భర్తను కోల్పోయిన డాలీన్‌ అనే సహోదరి చెప్తోంది. కాబట్టి మీరు చేయాల్సిన ముఖ్యమైన పనేమిటంటే దుఃఖంలో ఉన్నవాళ్లు చెప్పేది వినడమే. యూనీయ వాళ్ల అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె ఇలా అంటోంది, “దుఃఖంలో ఉన్నవాళ్ల బాధను మీరు పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ వాళ్లను అర్థంచేసుకోవాలనే కోరిక మీలో ఉండడం ప్రాముఖ్యం.”

13. మనం ఏ విషయాన్ని గుర్తుంచుకోవాలి?

13 మనందరం ఒకేలా బాధపడమని, దాన్ని ఒకేలా చూపించమని గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు మనమెంత వేదనను అనుభవిస్తున్నామో బయటకు చెప్పడం అసాధ్యం. బైబిలు ఇలా చెప్తుంది, “ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియును ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు.” (సామె. 14:10) ఒకవేళ ఎవరైనా తమ బాధను చెప్పినా, దాన్ని ఇతరులు అంత తేలిగ్గా అర్థంచేసుకోలేరు.

14. దుఃఖంలో ఉన్నవాళ్లను మనమెలా ఓదార్చవచ్చు?

14 ఒక్కోసారి దుఃఖంలో ఉన్నవాళ్లతో ఏమి మాట్లాడాలో కూడా మనకు తెలియకపోవచ్చు. కానీ ‘జ్ఞానముగలవాని మాటలు బాధను నయం చేస్తాయి’ అని బైబిలు చెప్తోంది. (సామె. 12:18, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌వర్షన్‌) మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే అనే బ్రోషుర్‌లో ఓదార్పునిచ్చే మాటల్ని చాలామంది కనుగొన్నారు.c అయితే దుఃఖంలో ఉన్నవాళ్లకు మీరు చేయగల అత్యంత గొప్ప సహాయం ఏమిటంటే, ‘ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్వడం.’ (రోమా. 12:15) గాబీ అనే సహోదరి భర్త చనిపోయాడు. కొన్నిసార్లు తన బాధను బయటకు చెప్పడానికి ఉన్న ఒకేఒక్క మార్గం ఏడ్వడమేనని ఆమె చెప్తోంది. ఆమె ఇంకా ఇలా అంటోంది, “అందుకే నా స్నేహితులు నాతోపాటు ఏడిస్తే నాకు ఊరటగా ఉంటుంది. నా బాధను పంచుకునేవాళ్లు ఉన్నారని ఆ సమయంలో నాకనిపిస్తుంది.”

15. దుఃఖంలో ఉన్నవాళ్లను ఓదార్చడానికి వాళ్ల దగ్గరకు వెళ్లలేకపోతే ఏమి చేయవచ్చు? (“ఓదార్పునిచ్చే మృదువైన మాటలు” అనే బాక్సు చూడండి.)

15 మీరు దుఃఖంలో ఉన్నవాళ్లను ఓదార్చడానికి వాళ్ల దగ్గరకు వెళ్లలేకపోతే ఒక కార్డుగానీ, ఈ-మెయిల్‌గానీ, ఒక మెసేజ్‌గానీ లేదా ఉత్తరంగానీ వాళ్లకు పంపించవచ్చు. అందులో ఓదార్పునిచ్చే ఒక లేఖనాన్నిగానీ, చనిపోయిన వ్యక్తిలో ఉన్న ఒక మంచి లక్షణం గురించిగానీ, లేదా ఆ వ్యక్తితో మీకున్న ఒక తీపి జ్ఞాపకం గురించి గానీ రాసి పంపించవచ్చు. యూనీయ ఇలా అంటోంది, “ప్రోత్సాహాన్నిచ్చే ఒక చిన్న మెసేజ్‌ లేదా తమతో సమయం వెచ్చించమనే పిలుపు ఎంత సహాయం చేస్తుందో మాటల్లో చెప్పలేను. అలాంటివాటి వల్ల నన్ను ప్రేమించేవాళ్లు, నామీద శ్రద్ధ చూపించేవాళ్లు ఉన్నారని అనిపిస్తుంది.”

16. ఇతరుల్ని ఓదార్చడానికి మరో చక్కని మార్గం ఏమిటి?

16 మన ప్రార్థనలు కూడా దుఃఖంలో ఉన్న సహోదరసహోదరీలకు సహాయం చేస్తాయి. మనం వాళ్లకోసం ప్రార్థించవచ్చు లేదా వాళ్లతో కలిసి ప్రార్థించవచ్చు. ప్రార్థించేటప్పుడు మీకు ఏడ్పు వస్తుందేమోనని అనిపించినప్పటికీ, మీ హృదయపూర్వక ప్రార్థన దుఃఖంలో ఉన్నవాళ్లకు చాలా ఓదార్పునివ్వవచ్చు. డాలీన్‌ ఇలా గుర్తుచేసుకుంటోంది, “కొన్నిసార్లు నన్ను ఓదార్చడానికి వచ్చిన సహోదరీలను ప్రార్థన చేయమని అడుగుతాను. వాళ్లు ప్రార్థన మొదలుపెట్టినప్పుడు ఏమి చెప్పాలో తెలియక తడబడతారు. కానీ కాసేపటికి వాళ్లు బిగ్గరగా, హృదయపూర్వకంగా ప్రార్థిస్తారు. వాళ్ల బలమైన విశ్వాసం, ప్రేమ, శ్రద్ధ వల్ల నా విశ్వాసం ఎంతో బలపడింది.”

ఇతరుల్ని ఓదారుస్తూ ఉండండి

17-19. మనమెందుకు ఇతరుల్ని ఓదారుస్తూ ఉండాలి?

17 ఒక వ్యక్తి ఎంతకాలం దుఃఖిస్తాడో ఖచ్చితంగా చెప్పలేం. ఇష్టమైనవాళ్లను పోగొట్టుకున్నప్పుడు ఓదార్చడానికి మొదట్లో చాలామంది స్నేహితులు, బంధువులు ఉంటారు. అయితే కొంతకాలానికి వాళ్లు తమ రోజూవారి పనుల్లో పడిపోతారు. కానీ దుఃఖంలో ఉన్నవాళ్లకు మాత్రం ఓదార్పు ఇంకా అవసరమే. కాబట్టి వాళ్లకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండండి. ‘నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు, దుర్దశలో అట్టివాడు సహోదరునిగా ఉంటాడు.’ (సామె. 17:17) వాళ్లు బాధ నుండి పూర్తిగా తేరుకునే వరకు మనం ఓదారుస్తూనే ఉండాలి.—1 థెస్సలొనీకయులు 3:7 చదవండి.

18 ఒక వ్యక్తి ఏ సమయంలోనైనా ఉన్నట్టుండి దుఃఖంలో మునిగిపోయే అవకాశం ఉందని గుర్తుంచుకోండి. బహుశా వాళ్ల పెళ్లి రోజునో, ఏదైనా సంగీతం విన్నప్పుడో, ఫోటోలు చూసినప్పుడో, ఏదైనా పనిచేసినప్పుడో, లేదా కొన్ని వాసనలు, శబ్దాలు వచ్చినప్పుడో, లేదా వాతావరణం మారినప్పుడో వాళ్లకు తమ ప్రియమైనవాళ్లు గుర్తుకురావచ్చు. భర్తను లేదా భార్యను కోల్పోయిన వ్యక్తికి, ఏదైనా పనిని మొదటిసారి ఒంటరిగా చేసినప్పుడు అంటే సమావేశానికి లేదా జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవ్వడం వంటివి చేసినప్పుడు చాలా బాధ అనిపించవచ్చు. ఒక సహోదరుడు ఇలా చెప్పాడు, “నా భార్య చనిపోయిన తర్వాత వచ్చిన మొదటి పెళ్లిరోజు చాలా బాధాకరంగా సాగుతుందని అనుకున్నాను, ఆ రోజు నేను ఉండలేనని అనుకున్నాను. కానీ నన్ను ఒంటరిగా వదలకుండా కొంతమంది సహోదరసహోదరీలు నా సన్నిహిత స్నేహితుల దగ్గర పార్టీ ఏర్పాటు చేశారు.”

19 అయితే దుఃఖంలో ఉన్నవాళ్లకు కేవలం ప్రత్యేకమైన సందర్భాల్లోనే ప్రోత్సాహం అవసరమని అనుకోకండి. యూనీయ ఇలా చెప్తోంది, “ఏ ప్రత్యేక సందర్భం లేనప్పుడు కూడా సహాయం చేయడం, నాతో సమయం వెచ్చించడం వల్ల చాలా ప్రయోజనం పొందాను. అలా అనుకోకుండా చేసిన సహాయం ఎంతో విలువైనది, చాలా ఓదార్పునిస్తుంది.” వాస్తవానికి, దుఃఖంలో ఉన్నవాళ్ల బాధను లేదా ఒంటరితనాన్ని మనం పూర్తిగా తీసివేయలేం, కానీ ఏదోకటి చేసి వాళ్లను ఓదార్చవచ్చు. (1 యోహా. 3:18) గాబీ ఇలా అంటున్నాడు, “నా కష్టాలన్నిటిలో నాకు తోడుగా ఉన్న ప్రేమగల సంఘపెద్దలను బట్టి యెహోవాకు నేనెంతో కృతజ్ఞుణ్ణి. వాళ్ల ద్వారా యెహోవా తన ప్రేమగల చేతులతో నన్ను హత్తుకున్నట్లు అనిపించింది.”

20. యెహోవా చేసిన వాగ్దానాలు ఎందుకు చాలా ఓదార్పునిస్తాయి?

20 సమస్తమైన ఓదార్పునిచ్చే యెహోవా చనిపోయినవాళ్లను పునరుత్థానం చేయడం ద్వారా దుఃఖాన్నంతటిని తీసేస్తాడని తెలుసుకోవడం ఎంత ఓదార్పుకరంగా ఉందో కదా! (యోహా. 5:28, 29) “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును” అని ఆయన మాటిస్తున్నాడు. (యెష. 25:8) అప్పుడు మనం ‘ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్వాల్సిన’ అవసరం ఉండదు. బదులుగా భూమ్మీదున్న వాళ్లందరూ ‘సంతోషించేవాళ్లతో కలిసి సంతోషిస్తారు.’—రోమా. 12:15.

a యేసుకు 12 ఏళ్లు ఉన్నప్పుడు యోసేపు ఇంకా బ్రతికేవున్నాడని బైబిల్లో గమనిస్తాం. కానీ యేసు మొట్టమొదటి అద్భుతాన్ని చేస్తున్నప్పుడు అంటే నీళ్లను ద్రాక్షారసంగా మార్చినప్పుడుగానీ ఆ తర్వాతగానీ బైబిల్లో యోసేపు ప్రస్తావన లేదు. బహుశా ఆ సమయానికల్లా యోసేపు చనిపోయివుంటాడు. అంతేకాదు యేసు హింసా కొయ్య మీద ఉన్నప్పుడు, తన తల్లిని జాగ్రత్తగా చూసుకోమని అపొస్తలుడైన యోహానుకు చెప్పాడు. ఒకవేళ యోసేపు ఆ సమయానికి బ్రతికే ఉంటే యేసు అలా చెప్పి ఉండేవాడు కాదు.—యోహా. 19:26, 27.

b చాలామందికి ఓదార్పునిచ్చిన మరికొన్ని లేఖనాలు: కీర్తన 20:1, 2; 31:7; 38:8, 9, 15; 55:22; 121:1, 2; యెషయా 57:15; 66:13; ఫిలిప్పీయులు 4:13; 1 పేతురు 5:7.

c కావలికోట (సార్వజనిక ప్రతి) 2016, నం.3 సంచికలోని “బాధపడుతున్నవాళ్లను ఓదార్చండి” అనే ఆర్టికల్‌ కూడా చూడండి.

ఓ కార్డు మీద ఓదార్పునిచ్చే లేఖనాన్ని రాస్తున్న వ్యక్తి

ఓదార్పునిచ్చే మృదువైన మాటలు

దుఃఖంలో ఉన్న తమ స్నేహితుల్ని ఓదార్చడానికి కొంతమంది రాసిన మాటలు:

  • “మేము నిన్ను ప్రేమిస్తున్నామని తప్ప ఇంకేమి చెప్పాలో తెలియట్లేదు. నీ భావాల్ని మేము పూర్తిగా అర్థంచేసుకోలేకపోవచ్చు, కానీ యెహోవా అర్థంచేసుకుంటాడు ఆయనే నిన్ను ఆదరిస్తాడు. మా ప్రార్థనలు నీకు కొంచెం ఊరటనిస్తాయని నమ్ముతున్నాం.”

  • “ఇంత దుఃఖంలో ఉన్న నిన్ను యెహోవాయే కాపాడతాడు.”

  • “నువ్వు ఎంతో ప్రేమించే వ్యక్తి దేవుని జ్ఞాపకంలో పదిలంగా ఉన్నాడని తెలుసుకొని నువ్వు ఓదార్పు పొందాలని కోరుకుంటున్నాను. దేవుడు అతని గురించిన ప్రతీ చిన్న విషయాన్ని గుర్తుంచుకొని తనను తిరిగి ప్రాణాలతో నీకిస్తాడు.”

  • “నువ్వు ప్రేమించిన వ్యక్తి పరదైసులో ప్రాణాలతో లేచే వరకు విశ్వాసంతో అతను చేసిన మంచి పనులు సజీవంగా ఉంటాయి.”

  • “మనం ప్రేమించే వ్యక్తి చనిపోయినప్పుడు మాటల్లో వర్ణించలేని బాధ కలుగుతుంది. కానీ తనను మన పరలోక తండ్రైన యెహోవా తిరిగి ప్రాణాలతో నీముందు నిలబెట్టే ఆనంద క్షణాల కోసం మేము ఎదురుచూస్తున్నాం.”

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి