కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w96 7/1 పేజీలు 28-31
  • రబ్బి అని పిలువబడేందుకు ఎవరు యోగ్యులు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • రబ్బి అని పిలువబడేందుకు ఎవరు యోగ్యులు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మోషే ఒక రబ్బినా?
  • గురువును అనుకరించడం
  • యుగాల్లో రబ్బిలు
  • ‘మీరైతే రబ్బిలని పిలువబడవద్దు’
  • మాదిరికర్తను అనుకరించండి
  • మౌఖిక ధర్మశాస్త్రం—వ్రాతలో ఎందుకు పెట్టబడింది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • తోరహ్‌ అంటే ఏమిటి?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • టాల్‌ముడ్‌ అంటే ఏమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • మిష్నా మరియు మోషేకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
w96 7/1 పేజీలు 28-31

రబ్బి అని పిలువబడేందుకు ఎవరు యోగ్యులు?

ఆ పరిస్థితిని గురించి ఊహించని పర్యాటకుడు, విమానాశ్రయానికి సమయానికి చేరుకునే అవకాశం ఎంతమాత్రం లేదు. యెరూషలేము వీధుల్లో క్రిక్కిరిసి ఉన్న రోధిస్తున్న 3,00,000 మందిని నియంత్రిస్తూ, ట్రాఫిక్‌కు మార్గం చూపేందుకు వందలాది మంది పోలీసులు ప్రయత్నించారు. “సాధారణంగా దేశాధ్యక్షులు, రాజులు లేక నిరంకుశ నియంతలకు మాత్రమే లభించేంత పెద్ద అంతిమ యాత్ర” అని ద జెరుషలేమ్‌ పోస్ట్‌ దాన్ని వర్ణించింది. ఇశ్రాయేలు రాజధాని కార్యకలాపాలను కొన్ని గంటల వరకూ స్తంభింపజేస్తూ, అంత భక్తిపారవశ్యాలు ఎవరి మూలంగా కురిపించబడి ఉంటాయి? ఎంతో గౌరవింపబడిన ఒక రబ్బి. యూదుల్లో రబ్బిల స్థానానికి అంత భక్తి గౌరవాలు ఎందుకు చూపబడతాయి? “రబ్బి” అనే పదం మొదట ఎప్పుడు ఉపయోగింపబడింది? అది వాస్తవానికి ఎవరికి కచ్చితంగా అన్వయిస్తుంది?

మోషే ఒక రబ్బినా?

యూదుల మతంలోని అత్యంత గౌరవింపబడిన పేరు, ఇశ్రాయేలు ధర్మశాస్త్ర నిబంధనకు మధ్యవర్తియగు మోషేదే. మత నిష్ఠగల యూదులు ఆయనను “మోషే ‘మా రబ్బి’” అని పిలుస్తారు. అయితే, బైబిలులో ఎక్కడా కూడా మోషేకు “రబ్బి” అనే బిరుదు సూచింపబడలేదు. వాస్తవానికి, “రబ్బి” అనే పదం హెబ్రీ లేఖనాల్లో ఎక్కడా కనిపించదు. మరి, యూదులు మోషేకు ఆ బిరుదును ఎందుకు సూచించడం ప్రారంభించారు?

హెబ్రీ లేఖనాల ప్రకారం, ధర్మశాస్త్రాన్ని బోధించి, వివరించే బాధ్యత మరియు అధికారం లేవీ గోత్రానికి చెందిన యాజకులైన, అహరోను వంశీకులకు ఇవ్వబడింది. (లేవీయకాండము 10:8-11; ద్వితీయోపదేశకాండము 24:8; మలాకీ 2:7) అయితే, సా.శ.పూ. రెండవ శతాబ్దంలో, యూదా మతంలో విప్లవం చెలరేగింది, అది అప్పటినుండి యూదుల తలంపుల్లో చెరగని మార్పులను తెచ్చింది.

ఈ ఆత్మీయ మార్పుదలను గురించి, యూదా మతం యొక్క చరిత్ర (ఆంగ్లం) అనే తన పుస్తకంలో డానియెల్‌ జెరిమీ సిల్వర్‌ ఇలా వ్రాస్తున్నాడు: “[ఆ] కాలంలో, తోరాను [మోషే ధర్మశాస్త్రం] వివరించి చెప్పే హక్కు యాజకులకు మాత్రమే ఉండటాన్ని, యాజకులు కాని శాస్త్రుల మరియు పండితుల ఓ వర్గం సవాలు చేయడాన్ని ప్రారంభించింది. ఆలయ కార్యకలాపాలు చేసే వారిగా యాజకులు అవసరమని ప్రతి ఒక్కరూ అంగీకరించినప్పటికీ, తోరాకు సంబంధించిన విషయాల్లో వారు చెప్పిందే వేదవాక్కు ఎందుకు కావాలి?” యాజక వర్గం అధికారాన్ని సవాలు చేయడానికి రెచ్చగొట్టిన వారు ఎవరు? పరిసయ్యులు అని పిలువబడే వీరు, యూదా మతంలోని ఒక క్రొత్త గుంపు. సిల్వర్‌ ఇలా కొనసాగిస్తున్నాడు: “పరిసయ్యులు తమ పాఠశాలల్లో ప్రవేశాన్ని, జన్మ ఆధారంగా [యాజక వంశానికి చెందడం] కాక యోగ్యతనుబట్టి ఇచ్చే వారు, అలా వారు యూదుల ఓ క్రొత్త వర్గాన్ని మతపరమైన నాయకత్వంలోకి తెచ్చారు.”

సా.శ. మొదటి శతాబ్దంకల్లా, ఈ పరిసయ్యుల పాఠశాలల్లో పట్టభద్రులైన వారు, యూదా ధర్మశాస్త్రం యొక్క బోధకులు లేక గురువులయ్యారు. గౌరవ సూచకంగా, ఇతర యూదులు వారిని “నా బోధకుడు,” లేక “నా గురువు” అని పిలువడం ప్రారంభించారు, హెబ్రీలో దాని అర్థం రబ్బి.

ఈ క్రొత్త బిరుదును, యూదా చరిత్రలో మహాగొప్ప బోధకునిగా దృష్టించబడే మోషేకు అన్వయించడం కంటే మరింకేమి కూడ ఎక్కువ అధికారాన్ని ఇవ్వదు. దాని ప్రభావం, యాజకత్వంపై ఉన్న ప్రాముఖ్యతను తగ్గించి అత్యంత ప్రాచుర్యం పొందిన పరిసయ్యుల నాయకత్వానికి మరింత ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంది. అలా, మోషే మరణించిన 1,500 సంవత్సరాలకు, ఆ బిరుదు ఆయనకు పూర్వంనుండి అన్వయింపబడి ఆయన “రబ్బి”గా నియమింపబడ్డాడు.

గురువును అనుకరించడం

“రబ్బి” (“నా గురువు”) అనే పదం, సామాన్య జనం ఎవరికి ఎక్కువ గౌరవాన్ని ఆపాదిస్తారో ఆ బోధకులకు అన్వయించేందుకు వారిచే కొన్నిసార్లు ఉపయోగింపబడినప్పటికీ, ఆ పదం సాధారణంగా, పరిసయ్యులలోని ప్రముఖ బోధకులకు అంటే “జ్ఞానులకు” అన్వయింపబడేది. యాజకుల అధికారాన్ని పూర్తిగా అంతమొందిస్తూ, సా.శ. 70లో ఆలయం నాశనం చేయబడటంతో పరిసయ్యుల రబ్బిలు యూదా మతం యొక్క తిరుగులేని నాయకులయ్యారు. ప్రత్యర్థులు లేని ఈ స్థానం, రబ్బిల జ్ఞానులపై ఆధారపడిన ఒక విధమైన మతవిధానం వృద్ధి చెందడాన్ని ప్రోత్సహించింది.

సా.శ. మొదటి శతాబ్దంలోని ఈ మారుతున్న పరిస్థితిని గురించి చర్చిస్తూ, ఆచార్యుడైన డోవ్‌ జ్లాట్‌నీక్‌ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “‘జ్ఞానులను నిశితంగా గమనించడం’ తోరా పఠనం కంటే ఎక్కువ ప్రాముఖ్యమైన దానిగా అయ్యింది.” యూదా పండితుడైన జేకబ్‌ నాయిస్‌నర్‌ ఇంకా ఇలా వివరిస్తున్నాడు: “‘జ్ఞానుల శిష్యుడు,’ ఒక రబ్బిని అంటిపెట్టుకుని ఉండే విద్యార్థి. అతను ‘తోరాను’ నేర్చుకోదలచుకున్నాడు గనుక అతనలా చేస్తాడు. . . . తోరా ధర్మశాస్త్రం ద్వారా కాక, సజీవుడైన జ్ఞాని కదలికలు మరియు చర్యల్లో మూర్తీభవించిన దాన్ని చూడటం ద్వారా నేర్చుకోబడుతుంది. వారు చెప్పేదాన్నిబట్టి మాత్రమే కాక వారు చేసే దాన్నిబట్టి కూడా వారు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారు.”

తాల్ముద్‌ పండితుడైన ఆడీన్‌ స్టైన్‌సాల్ట్‌స్‌ ఇలా వ్రాస్తూ, దీన్ని రూఢీపరుస్తున్నాడు: “‘జ్ఞానుల సాధారణ సంభాషణను, హాస్యాలాడటాన్ని, లేక మామూలు వ్యాఖ్యానాలను అధ్యయనం చేయాలి’ అని జ్ఞానులు తామే చెప్పారు.” దీన్ని ఎంతమేరకు అన్వయించుకోవాలి? స్టైన్‌సాల్ట్‌స్‌ ఇలా పేర్కొంటున్నాడు: “తన గొప్ప బోధకుడు తన భార్యతో ఎలా ప్రవర్తిస్తాడో కనుగొనేందుకు అతని పరుపు క్రింద దాగి కూర్చున్నాడని నివేదింపబడిన ఒక శిష్యుడు దీనికి మరీ విపరీతమైన ఉదాహరణ. అతని జిజ్ఞాస విషయమై ప్రశ్నింపబడినప్పుడు, ఆ యౌవన శిష్యుడు ఇలా సమాధానమిచ్చాడు: ‘అది తోరా, దాన్ని కూడా అధ్యయనం చేయాల్సిన యోగ్యత ఉంది.’ అలా చేయడం సరైనదని రబ్బిలు మరియు విద్యార్థులు కూడా అంగీకరించారు.”

తోరా కంటే రబ్బిపై ఎక్కువ అవధానాన్ని నిలుపడంతో—రబ్బి ద్వారా తోరాను నేర్చుకోవడంతో—సా.శ. మొదటి శతాబ్దంనుండి యూదా మతం రబ్బిలు ప్రధానులుగాగల మతం అయ్యింది. ప్రేరేపిత లిఖిత వాక్యం ఆధారంగా కాక వ్యక్తిగత మాదిరికర్త, ఒక గురువు, రబ్బి ఆధారంగా ఒకరు దేవునికి సన్నిహితులు అవుతారు. అలా, ప్రేరేపిత లేఖనాలపైనుండి ఈ రబ్బిలు బోధించిన మౌఖిక ధర్మశాస్త్రం మరియు పారంపర్యాచారాలపైకి అవధానం మరలింది. అప్పటినుండి, తాల్ముద్‌ వంటి యూదా సాహిత్యాలు, దేవుని ప్రకటనల కంటే రబ్బిల చర్చలు, ముచ్చట్లు మరియు ప్రవర్తనపై ఎక్కువ ధ్యానముంచుతున్నాయి.

యుగాల్లో రబ్బిలు

ఎంతో ఎక్కువ అధికారాన్ని మరియు ప్రభావాన్ని కలిగి ఉన్నప్పటికీ, తొలి కాలంనాటి రబ్బిలు తమ మతపర కార్యకలాపాల ద్వారా తమ జీవనోపాధి సంపాదించుకోలేదు. ఎన్‌సైక్లోపీడియా జుడైకా ఇలా పేర్కొంటుంది: “తాల్ముద్‌ యొక్క రబ్బి . . . నేడు ఈ బిరుదును కలిగి ఉన్న వారినుండి ఎంతో భిన్నంగా ఉండేవాడు. తాల్ముద్‌ యొక్క రబ్బి బైబిలు మరియు మౌఖిక ధర్మశాస్త్రాన్ని అనువదించి, వివరించే వాడు, మరి అతను దాదాపు ఎల్లవేళలా వేరే పనిని కలిగి ఉండే వాడు, దాని ద్వారా అతను తన జీవనోపాధి గడించేవాడు. కేవలం మధ్య యుగాల్లోనే . . . ఈ రబ్బి యూదా సంఘానికి లేక సమాజానికి బోధకుడు, ప్రచారకుడు మరియు ఆత్మీయ నాయకుడయ్యాడు.”

రబ్బిలు తమ స్థానాన్ని జీతం ఆర్జించే పనిగా మార్చుకోవడం ప్రారంభించినప్పుడు, కొందరు దాన్ని విమర్శించారు. ఒక వైద్యునిగా తన జీవనోపాధి గడించిన, 12వ శతాబ్దపు ప్రఖ్యాత రబ్బి అయిన మైమోనిడెస్‌, అలాంటి రబ్బిలను తీవ్రంగా ఖండించాడు. “[వారు] తమ కొరకు సొమ్ము ఇవ్వమని వ్యక్తులను మరియు సమాజాలను అడుగుతున్నారు, జ్ఞానులు, పండితులు మరియు తోరాను చదివే వారికి [ఆర్థికంగా] సహాయం చేయడం తమ బాధ్యత అని, అది సరైనదే అని ప్రజలు అవివేకంగా ఆలోచించేలా చేశారు, అలా వారి తోరానే వారి వ్యాపారం అయ్యింది. అయితే అదంతా తప్పు. ఈ బోధకు మద్దతును ఇచ్చేందుకు తోరాలో గానీ లేక జ్ఞానులు చెప్పిన వాటిలో గానీ ఒక్క మాటైనా లేదు.” (కమెంటరీ ఆన్‌ ద మిష్‌నా, అవాట్‌ 4:5) అయితే మైమోనిడెస్‌ విమర్శలను, రబ్బిల తర్వాతి తరాల వారు చెవినబెట్టలేదు.

యూదా మతం ఆధునిక కాలాల్లో ప్రవేశిస్తుండగా, సంస్కరణ, పూర్వాచార సంరక్షణ మరియు ఆర్థడాక్స్‌ నమ్మకాల చీలికలుగా అది విభజింపబడింది. అనేకమంది యూదులకు మతపరమైన నమ్మకాలు మరియు ఆచారాలు ఇతర విషయాల తర్వాతే ప్రాముఖ్యమైన విషయాలుగా అయ్యాయి. తత్ఫలితంగా, రబ్బిల స్థానం బలహీనమైంది. చాలా మేరకు ఈ రబ్బి, డబ్బు చెల్లింపబడే వృత్తిపరమైన బోధకునిగా మరియు తన గుంపులోని సభ్యులకు సలహాదారునిగా, సంఘం యొక్క నియమిత శిరస్సు అయ్యాడు. అయితే, అల్ట్రాఆర్థడాక్స్‌ హసీడిక్‌ గుంపుల్లో, రబ్బి ఒక గురువుగా మరియు మాదిరికర్తగా ఉండే అభిప్రాయమందు మరింతగా పరిణామం చెందింది.

హసీడిక్‌ ఛాబాద్‌-లుబావిట్చ్‌ ఉద్యమాన్ని గురించిన తన పుస్తకంలోని ఎడ్‌వర్డ్‌ హుఫ్‌మన్‌ వ్యాఖ్యానాలను గమనించండి: “ప్రతి తరంలోను ఒక యూదా నాయకుడు, ఒక జడ్డిక్‌ [ఓ నీతిమంతుడు] ఉంటాడు, అతను తన కాలంలోని ‘మోషే,’ అతని పాండిత్యం మరియు ఇతరుల ఎడల ఉండే భక్తి తిరుగులేనిదని కూడా తొలి హసీడిమ్‌ నొక్కిచెప్పింది. తన మహిమాన్విత శుద్ధత ద్వారా, తమ రెబ్బా [యిదిష్‌ భాషలో “రబ్బి”] మహోన్నతుని శాసనాలను కూడా ప్రభావితం చేయగలడని హసీడిమ్‌ యొక్క ప్రతి గుంపూ భావించింది. అతను తన జ్ఞానోపదేశాల ద్వారా ఒక మాదిరికర్తగా గుర్తింపబడటమే కాక, అతని అస్తిత్వమే (‘అతను తన చెప్పుల వారును ఎలా కట్టుకుంటాడో’ అని వ్యక్తపరచినట్లు) మానవాళిని సమున్నతం చేస్తుందని మరియు దైవం వైపుకు వెళ్లే మార్గాన్ని గూర్చిన అతి సూక్ష్మ సూచనలను అందిస్తుందని కనిపించింది.”

‘మీరైతే రబ్బిలని పిలువబడవద్దు’

క్రైస్తవత్వాన్ని స్థాపించిన మొదటి శతాబ్దపు యూదుడైన యేసు, రబ్బిలను గూర్చిన పరిసయ్యుల అభిప్రాయం యూదా మతాన్ని ప్రభావితం చేయడం ప్రారంభమౌతున్న కాలంలో జీవించాడు. ఆయనొక పరిసయ్యుడు కాదు, ఆయన వారి పాఠశాలల్లో తర్ఫీదుపొందలేదు, అయినప్పటికీ ఆయన కూడా రబ్బి అని పిలువబడ్డాడు.—మార్కు 9:5; యోహాను 1:38; 3:2.

యూదా మతంలోని రబ్బిల పరంపరను ఖండిస్తూ, యేసు ఇలా చెప్పాడు: “శాస్త్రులును పరిసయ్యులును మోషే పీఠమందు కూర్చుండువారు. [వారు] విందులలో అగ్రస్థానములను సమాజమందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను మనుష్యులచేత బోధకులని [“రబ్బి,” NW] పిలువబడుటయు కోరుదురు. మీరైతే బోధకులని [“రబ్బి,” NW] పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరు సహోదరులు.”—మత్తయి 23:2, 6-8.

యూదా మతంలో వృద్ధి చెందుతూ ఉండిన మతగురువులకు సామాన్య ప్రజలకు మధ్యగల తేడాకు విరుద్ధంగా యేసు హెచ్చరించాడు. మనుష్యులకు అయుక్తమైన ప్రాధాన్యతను అలా ఇవ్వడాన్ని ఆయన విమర్శించాడు. “ఒక్కడే మీ బోధకుడు” అని ఆయన ధైర్యంగా ఉద్ఘాటించాడు. ఆ బోధకుడు ఎవరు?

“యెహోవా ముఖాముఖిగా ఎరిగియున్న,” మరియు జ్ఞానుల చేత “మా రబ్బి” అని పిలువబడిన మోషే, ఒక అపరిపూర్ణ మానవుడు. ఆయన కూడా తప్పులు చేశాడు. (ద్వితీయోపదేశకాండము 32:48-51; 34:12 10 , NW; ప్రసంగి 7:20) మోషేను అంతిమ ఉదాహరణగా ఉన్నతపరిచే బదులు, యెహోవా ఆయనకు ఇలా చెప్పాడు: “వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణచేసెదను.”—ద్వితీయోపదేశకాండము 18:18, 19.

ఈ మాటలు మెస్సీయ అయిన యేసునందు నెరవేరాయని బైబిలు ప్రవచనాలు నిరూపిస్తున్నాయి.a యేసు మోషే “వంటి” వాడు మాత్రమే కాదు; ఆయన మోషే కంటే గొప్పవాడు. (హెబ్రీయులు 3:1-3) యేసు ఒక పరిపూర్ణ మానవునిగా జన్మించాడని లేఖనాలు బయల్పరుస్తున్నాయి, మోషే వలె కాక ఆయన ‘పాపము లేకుండా’ దేవున్ని సేవించాడు.—హెబ్రీయులు 4:15.

మాదిరికర్తను అనుకరించండి

రబ్బి యొక్క ప్రతి క్రియను, మాటను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం యూదులను దేవునికి సన్నిహితులను చేయలేదు. ఒక అసంపూర్ణ మానవుడు నమ్మకత్వం విషయంలో ఒక చక్కని మాదిరి కాగలిగినప్పటికీ, మనం అతని ప్రతి చర్యను అధ్యయనం చేసి, అనుకరిస్తే మనం అతని మంచి లక్షణాలతోపాటు అతని తప్పులను మరియు అసంపూర్ణతలను కూడా అనుకరిస్తాము. మనం సృష్టికర్తకు బదులు సృష్టానికి అయుక్తమైన మహిమను చెల్లించిన వారమౌతాము.—రోమీయులు 1:25.

అయితే యెహోవా మానవజాతి కొరకు ఒక మాదిరికర్తను అందించాడు. యేసు మానవపూర్వపు ఉనికిని కలిగి ఉన్నాడని లేఖనాలు చెబుతున్నాయి. వాస్తవానికి, ఆయన ‘అదృశ్యదేవుని స్వరూపి, సర్వసృష్టికి ఆదిసంభూతుడు’ అని పిలువబడ్డాడు. (కొలొస్సయులు 1:15) దేవుని “ప్రధానశిల్పి”గా కోటాను కోట్ల సంవత్సరాలు పరలోకంలో సేవ చేసిన యేసు, మనం యెహోవాను తెలుసుకునేందుకు మనకు సహాయం చేయగల అతి శ్రేష్ఠమైన స్థానంలో ఉన్నాడు.—సామెతలు 8:22-30; యోహాను 14:9, 10.

అందుకే పేతురు ఇలా వ్రాయగలిగాడు: “క్రీస్తుకూడ మీకొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు మీకు మాదిరియుంచిపోయెను.” (1 పేతురు 2:21) “విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు” ఉండాలని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులను ప్రోత్సహించాడు. “బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి” అని కూడా ఆయన వివరించాడు. (హెబ్రీయులు 12:2; కొలొస్సయులు 2:3) ఏ ఇతర మనిషి—మోషే గాని మరితర రబ్బిల జ్ఞాని కూడా—అలాంటి అవధానాన్ని పొందనర్హులు కారు. ఎవరైనా సన్నిహితంగా అనుసరించవలసింది యేసునే. రబ్బి అనే బిరుదుకుగల ఆధునిక దిన భావార్థాల దృష్ట్యా, దేవుని సేవకులకు అటువంటి బిరుదుల అవసరత ఎంతమాత్రం లేదు, అయితే రబ్బి అని ఎవరి చేతనైనా పిలువబడేందుకు యేసు మాత్రమే యోగ్యుడు.

[అధస్సూచీలు]

a వాగ్దానం చేయబడిన మెస్సీయ యేసే అనే రుజువును గురించిన సమాచారం కొరకు, వాచ్‌టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రచురించిన యుద్ధంలేని లోకం ఎన్నడైనా ఉంటుందా? (ఆంగ్లం) అనే బ్రోషూర్‌ 24-30 పేజీలను చూడండి.

[28వ పేజీలోని చిత్రసౌజన్యం]

© Brian Hendler 1995. All Rights Reserved

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి