టాల్‌ముడ్ అంటే ఏమిటి?
“టాల్‌ముడ్ నిస్సందేహంగా అన్ని కాలాల్లోని అత్యంత విశేషమైన సాహితీకృతుల్లో ఒకటి.”—ది యూనివర్సల్ జూయిష్ ఎన్‌సైక్లోపీడియా.
“[టాల్‌ముడ్] మానవుల గొప్ప మేధాపర సాఫల్యాలలో ఒకటి, అది గ్రహించకష్టసాధ్యమైనదీ, ఎంతో అర్థవంతమైనదీ, మర్మగర్భమైనదీ, అంటే అది దాదాపు ఒకటిన్నర సహస్రాబ్దిలకంటే ఎక్కువకాలం పాటు ఉత్కృష్టమైన మెదళ్లకు పనికల్పించింది.”—జేకబ్ నోయ్‌స్నెర్, యూదా పండితుడు, రచయిత.
“టాల్‌ముడ్ యూదుల జీవితాల్లోని మొత్తం ఆధ్యాత్మిక మరియు మేధా వ్యవస్థలకు మద్దతునిస్తున్న [యూదామత] మూలస్తంభం.”—అడీన్ స్టైన్‌సాల్ట్‌స్, టాల్‌ముడ్ పండితుడు, రబ్బీ.
టాల్‌ముడ్ యూదా ప్రజలపై శతాబ్దాలపాటు నిస్సందేహంగా విపరీతమైన ప్రభావాన్ని చూపించింది. అయితే పైన పేర్కొనబడిన ప్రశంసలకు విరుద్ధంగా, టాల్‌ముడ్ అప్రతిష్ఠపాలు చేయబడి, “అస్పష్టత అయోమయాల సముద్రం” అని పిలువబడింది. అది అపవాది యొక్క దైవదూషణకరమైన సాహితీకృతిగా నిందించబడింది. పోప్ శాసనం ద్వారా అది పదే పదే సెన్సార్ చేయబడింది, జప్తు చేయబడింది, చివరికి యూరప్ నందలి బహిరంగ స్థలాల్లో పెద్ద సంఖ్యల్లో కాల్చివేయబడింది.
అంత వివాదాన్ని రేపిన ఈ సాహితీకృతి వాస్తవానికి ఏమిటి? యూదా వ్రాతల్లో టాల్‌ముడ్‌ను విశేషమైనదిగా చేస్తున్నది ఏమిటి? అది ఎందుకు వ్రాయబడింది? అది యూదా మతంపై అంత ప్రభావాన్ని ఎలా చూపించగలిగింది? యూదేతర ప్రపంచానికి అది ఏ భావాన్నైనా కలిగివుందా?
సా.శ. 70లో యెరూషలేములోని ఆలయం నాశనం చేయబడిన తర్వాత 150 సంవత్సరాల్లోపల, ఇశ్రాయేలు అంతటా ఉన్న రబ్బీ జ్ఞానుల అకాడమీలు యూదా రివాజును కొనసాగించడానికి ఒక క్రొత్త ఆధారాన్ని అత్యవసరంగా వెదికి సంపాదించుకున్నాయి. వాళ్లు వాదోపవాదాలు జరిపి తమ మౌఖిక చట్టంలోని వివిధ సంప్రదాయాలను సంఘటిత పరిచారు. ఈ పునాదిపై నిర్మిస్తూ, ఆలయం లేకుండానే పవిత్రమైన అనుదిన జీవితాన్ని గడపడానికి నడిపింపునిస్తూ, వాళ్లు యూదా మతానికి క్రొత్త పరిధులను ఏర్పరచారు, క్రొత్త కట్టడలను విధించారు. ఈ క్రొత్త ఆధ్యాత్మిక రచన మిష్నాలో తెలియజేయబడింది, సా.శ. మూడవ శతాబ్దారంభంలో జూడా హ-నసీ దీన్ని సంపుటీకరించాడు.a
మిష్నా దేనిపైనా ఆధారపడలేదు, అది బైబిలు రెఫరెన్సుల ఆధారంగా తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నించదు. దాని చర్చా విధానమూ, చివరికి దాని హెబ్రీ శైలీ విశేషమైనవి, బైబిలు యొక్క హెబ్రీ పాఠ్యగ్రంథం నుండి భిన్నమైనవి. మిష్నాలో ఉదాహరించబడిన రబ్బీల నిర్ణయాలు సర్వత్రా ఉన్న యూదుల అనుదిన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. వాస్తవానికి, జేకబ్ నోయ్‌స్నెర్ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “మిష్నా ఇశ్రాయేలీయులకు రాజ్యాంగమయ్యింది. . . . అది దాని సూత్రాలకు కట్టుబడి ఉండడాన్నీ, వాటికి అనుగుణ్యంగా ఉండడాన్నీ కోరింది.”
మిష్నాలో ఉదాహరించబడిన జ్ఞానుల అధికారం, నిజంగా బయల్పర్చబడిన లేఖనాలకు సమానమైనదేనా అని కొంతమంది ప్రశ్నిస్తే అప్పుడేమిటి? మిష్నాలో కనుగొనబడే టనయీమ్‌ల (వీరు మౌఖిక చట్ట బోధకులు) బోధలు హెబ్రీ లేఖనాలతో సంపూర్ణ పొందిక కల్గివున్నాయని రబ్బీలు చూపించాల్సి ఉంటుంది. మరింత వ్యాఖ్యానం తప్పనిసరి అయ్యింది. మిష్నాను వివరించి, సమర్థించవలసిన అవసరత ఉందనీ, సీనాయి పర్వతంపైన మోషేకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం నుండే అది వచ్చిందని నిరూపించాల్సిన అవసరం ఉందనీ వాళ్లు భావించారు. మౌఖిక ధర్మశాస్త్రం మరియు వ్రాతపూర్వక ధర్మశాస్త్రం ఒకే భావాన్నీ, ఒకే సంకల్పాన్నీ కలిగివున్నాయని నిరూపించడానికి రబ్బీలు ప్రేరేపించబడ్డారు. మిష్నా యూదా మతంపై చివరి వ్యాఖ్యానంగా ఉండే బదులు, మతసంబంధమైన చర్చకూ, వాగ్వివాదానికి క్రొత్త పునాది అయ్యింది.
తయారీలో టాల్‌ముడ్
ఈ క్రొత్త సవాలును చేపట్టిన రబ్బీలు అమొరియమ్ అని పిలువబడ్డారు, అంటే మిష్నా “దుబాసీలు” లేక “వివరించేవారు” అని భావం. ప్రతి అకాడమీలో ఒక ప్రముఖ రబ్బీ ముఖ్యునిగా ఉంటాడు. పండితులూ విద్యార్థులతో కూడిన చిన్న గుంపు సంవత్సరమంతా చర్చలు జరిపేది. కాని అతి ప్రాముఖ్యమైన చర్చలు మాత్రం సంవత్సరానికి రెండుసార్లు జరిగేవి, వ్యవసాయ పనులు ముగిసాక వందలాదిమంది లేక ఒక్కోసారి వేలాదిమంది హాజరవ్వగలిగేలా ఆదార్ మరియు ఎలూల్ నెలల్లో జరిగేవి.
అడిన్ స్టైన్‌సాల్ట్‌స్ ఇలా వివరిస్తున్నాడు: “అకాడమీ ముఖ్యుడు ఒక కుర్చీ మీదనో ప్రత్యేకమైన తివాసీ మీదనో కూర్చుని అధ్యక్షత వహించేవాడు. ఆయనకు ఎదురుగా ముందు వరసల్లో ఆయన సహోద్యోగులతోపాటు లేక విశిష్టమైన విద్యార్థులతోపాటు ముఖ్య పండితులు కూర్చునేవారు, వారి వెనుక మిగిలిన పండితులందరూ కూర్చునేవారు. . . . [ప్రాముఖ్యత ఆధారంగా] కూర్చునే స్థలాలు నిర్థారించబడేవి.” మిష్నాలోని ఒక భాగం అప్పజెప్పబడుతుంది. తర్వాత ఇది మిష్నాలో లేని, టనయీమ్ సేకరించిన సమాంతర లేక అనుబంధ సమాచారంతో పోల్చబడుతుంది. విశ్లేషించే ప్రక్రియ ప్రారంభమౌతుంది. బోధల మధ్యనున్న అంతర్గత అనుగుణ్యతను కనుగొనడానికి ప్రశ్నలు వేయబడతాయి, విభేదాలు విశ్లేషించబడతాయి. రబ్బీల బోధలను సమర్థించడానికి హెబ్రీ లేఖనాల నుండి ధృవీకరణ లేఖనాలను వెదకడం జరుగుతుంది.
జాగ్రత్తగా రూపొందించబడినప్పటికీ, ఈ చర్చలు తీవ్రమైనవిగా కొన్నిసార్లు కల్లోలభరితంగా ఉండేవి. వాగ్వివాదం సమయంలో రబ్బీల నోళ్ల మధ్య “అగ్గి రవ్వలు” దూసుకుపోతుండడం గురించి టాల్‌ముడ్‌లో ఉటంకించబడిన ఒక జ్ఞాని ప్రస్తావించాడు. (హుల్లిన్ 137బి, బాబిలోనియన్ టాల్‌ముడ్) ఈ కార్యవ్యవహారాల గురించి స్టైన్‌సాల్ట్‌స్ ఇలా చెబుతున్నాడు: “అకాడమీ ముఖ్యుడు లేదా ప్రసంగిస్తున్న జ్ఞాని సమస్యల గురించి తన స్వంత వివరణను ఇస్తాడు. ప్రేక్షకులలోని పండితులు తరచూ ఇతర మూలాల ఆధారంగా, ఇతర వ్యాఖ్యానకర్తల దృక్కోణాల ఆధారంగా లేక తమ స్వంత తార్కిక నిర్ధారణల ఆధారంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తారు. కొన్నిసార్లు చర్చ సంక్షిప్తంగా ఉండి, నిర్దిష్టమైన ప్రశ్నకు సుస్పష్టమైన నిశ్చయాత్మకమైన సమాధానానికి పరిమితమై ఉండేది. ఇతర సందర్భాల్లో, ఇతర పండితులు ప్రత్యామ్నాయ పరిష్కారాలను అందజేసేవారు, భారీ ఎత్తున వాగ్వివాదం జరిగేది.” హాజరైన వారందరూ పాల్గొనేవారు. చర్చల్లో స్పష్టం చేయబడిన అంశాలను ఇతర పండితులు పునఃపరిశీలించడానికి అవి ఇతర అకాడమీలకు పంపబడేవి.
అయితే, ఈ చర్చలు కేవలం అంతులేని చట్టపరమైన వాగ్వివాదాలు మాత్రమై ఉండేవికావు. యూదా మత జీవితానికి సంబంధించిన సూత్రాలూ కట్టడలతో వ్యవహరించే న్యాయసంబంధ విషయాలు హలకహ అని పిలువబడేవి. “వెళ్లడం” అనే హెబ్రీ మూల పదం నుండి ఈ పదం వస్తుంది, అది ‘ఒకరు నడుచుకోవలసిన తీరును’ సూచిస్తుంది. మిగతా అన్ని విషయాలు—రబ్బీలు మరియు బైబిలులోని వ్యక్తుల గురించిన కథలు, జ్ఞాన వచనాలు, నమ్మకాల మరియు తాత్విక విషయాల భావనలు—హగ్గదహ అని పిలువబడేవి, అది “చెప్పడం” అనే హెబ్రీ మూలపదం నుండి వచ్చింది. రబ్బీల వాగ్వివాదం సమయంలో హలకహ మరియు హగ్గదహ కలగలిసిపోయేవి.
ది వరల్డ్ ఆఫ్ ది టాల్‌ముడ్ అనే తన పుస్తకంలో మొరిస్ అడ్లర్ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “జ్ఞానవంతుడైన బోధకుడు ఒక సుదీర్ఘమైన, క్లిష్టమైన న్యాయబద్ధమైన వాదనకు అంతరాయం కలిగిస్తూ, తక్కువ శ్రమతో కూడిన అధిక ప్రోత్సాహకరమైన చర్చవైపుకు మళ్లిస్తాడు. . . . కాబట్టి పురాణం మరియు చరిత్ర, సమకాలీన విజ్ఞానశాస్త్రం మరియు జానపదం, బైబిలు సంబంధిత వ్యాఖ్యానం మరియు స్వీయచరిత్ర, మత సంబంధమైన ప్రసంగం మరియు దైవశాస్త్రం అన్నీ కలిపి అల్లబడినట్లుగా ఉండి, అది అకాడమీల విధానాల గురించి పరిచయం లేని వారికి కలగాపులగంగా ఉన్న సమాచారపు కిచిడీగా కనిపించవచ్చు.” అకాడమీలలో ఉండే పండితుల దృష్టిలో, అలాంటి అసందర్భ విషయాలన్నీ ఒక సంకల్పం కొరకైనవి, చర్చించబడుతున్న అంశానికి సంబంధించినవి. రబ్బీల అకాడమీలలో నిర్మాణంలో ఉన్న క్రొత్త వ్యవస్థలకు హలకహ మరియు హగ్గదహ ఇటుకల వంటివి.
రెండు టాల్‌ముడ్‌ల తయారీ
చివరికి, పాలస్తీనాలోని రబ్బీల ముఖ్య కేంద్రం టైబిరియస్‌కు మార్చబడింది. ఇతర ప్రముఖ అకాడమీలు సఫారస్, సెసరయ, లిడ్డాలలో నెలకొల్పబడ్డాయి. క్షీణించిపోతున్న ఆర్థిక పరిస్థితి, ఎడతెగని రాజకీయ అస్థిరత, చివరికి భ్రష్ట క్రైస్తవత్వం నుండి వచ్చిన ఒత్తిడి మరియు హింస, యూదా జనాభా ఎక్కువగాగల మరో ప్రముఖ కేంద్రమైన బాబిలోనియకు అంటే తూర్పుకు పెద్ద పెట్టున వలస వెళ్లిపోవడానికి కారణమయ్యాయి.
శతాబ్దాలపాటు, అకాడమీలలోని గొప్ప రబ్బీల క్రింద అధ్యయనం చేయడానికి విద్యార్థులు బాబిలోనియ నుండి పాలస్తీనాకు తరలివచ్చేవారు. అలాంటి ఒక విద్యార్థి అబ్బా బెన్ ఈబో, ఆయన అబ్బా అరీకా—పొడగరియైన అబ్బా—అని కూడా పిలువబడ్డాడు, కాని ఆ తర్వాత ఆయన కేవలం రాబ్‌గానే అందరికీ తెలుసు. జూడా హ-నసి క్రింద అధ్యయనం చేసిన ఆయన సా.శ. 219లో బాబిలోనియకు తిరిగి రావడం, బాబిలోన్‌లోని యూదా సమాజ ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు ఒక మలుపురాయి అయ్యింది. రాబ్ సుర వద్ద ఒక అకాడమీ స్థాపించాడు, అక్కడ చాలామంది యూదులు ఉండేవారు కాని కేవలం కొంతమందే పండితులు ఉండేవారు. ఆయన పేరుప్రతిష్ఠలు ఆయన అకాడమీకి 1,200 మంది క్రమ విద్యార్థులను ఆకర్షించింది, యూదా నెలలైన ఆదార్ మరియు ఎలూల్‌లో ఇంకా వేలాదిమంది హాజరయ్యేవారు. రాబ్ యొక్క ప్రముఖ సమకాలీనుడైన సామ్యెల్ నెహర్డియలో ఒక అకాడమీని స్థాపించాడు. ఇతర ప్రాముఖ్యమైన అకాడమీలు పుంబెడిత మరియు మెహోజలలో నెలకొల్పబడ్డాయి.
అప్పుడిక పాలస్తీనాకు వెళ్లవలసిన అవసరత లేదు ఎందుకంటే ఎవరైనా బాబిలోనియలోని గొప్ప పండితుల క్రింద అధ్యయనం చేయగల్గేవారు. మిష్నాను ప్రత్యేకమైన లేఖనాలుగా రూపొందించడం బాబిలోనియన్ అకాడమీల పూర్తి స్వేచ్ఛకు మార్గాన్ని సిద్ధం చేసింది. పాలస్తీన మరియు బాబిలోనియలలో ఇప్పుడు వివిధ అధ్యయన శైలులూ పద్ధతులూ వృద్ధి చేయబడినప్పటికీ, తరచుగా సంభాషించుకోవడం మరియు బోధకుల పరస్పర మార్పిడి అకాడమీల ఐక్యతను కాపాడాయి.
సా.శ. నాలుగవ శతాబ్దాంతంలోనూ ఐదవ శతాబ్దారంభంలోనూ ప్రాముఖ్యంగా పాలస్తీనాలోని యూదులకు పరిస్థితి కష్టతరంగా మారింది. పెరుగుతున్న భ్రష్టమైన క్రైస్తవ సామ్రాజ్యపు అధికారం క్రింద నిర్బంధాల వెల్లువ, హింసాజ్వాలలు దాదాపు సా.శ. 425 కల్లా సమాజమందిరాన్నీ మరియు నాసి (మూలపురుషుడు) స్థానాన్నీ నిషేధించడానికి కారణమయ్యాయి. అకాడమీలలో జరిగే వాగ్వివాదాల సారాంశాలను భద్రపర్చడానికి పాలస్టీనియన్ అమొరియమ్ సంగతమైన ఒకే సాహితీకృతిని సంఘటిత పర్చడం ప్రారంభించింది. సా.శ. నాలుగవ శతాబ్దపు చివరి భాగంలో హడావుడిగా సంపుటీకరించబడిన ఈ సాహితీకృతి పాలస్టీనియన్ టాల్‌ముడ్ అని పిలువబడింది.b
పాలస్తీనాలోని అకాడమీలు తగ్గిపోతుండగా, బాబిలోనియన్ అమొరియమ్ తన సామర్థ్యాల విషయంలో ఉన్నత శిఖరాలను చేరుకుంది. అబయ్ మరియు రాబ్‌లు వాగ్వివాద స్థాయిని అస్పష్టమైన, కుయుక్తితో కూడిన వాదనలోకి మళ్లించారు, అది ఆ తర్వాత టాల్‌ముడ్ సంబంధ విశ్లేషణలకు ఒక మాదిరి అయ్యింది. తర్వాత, సురలో (సా.శ. 371-427) ఉన్న అకాడమీ ముఖ్యుడైన అషీ వాగ్వివాదాల సంగ్రహ వివరణలను సంపుటీకరించి, ఎడిట్ చేయడం ప్రారంభించాడు. “అది ఎంతో అస్తవ్యస్తంగా ఉన్నందున, అందులోని ఎక్కువ సమాచారం మౌఖికమైనదే అయినందున అది మరుగున పడిపోయే ప్రమాదం గురించి భయపడుతూ” ఆయనలా చేశాడని స్టైన్‌సాల్ట్‌స్ చెబుతున్నాడు.
పెద్ద మొత్తంలో ఉన్న ఈ సమాచారమంతా ఒక వ్యక్తిగాని లేక చివరికి ఒక తరంగాని చక్కపరచలేనంత ఎక్కువగా ఉంది. సా.శ. ఐదవ శతాబ్దంలో బాబిలోనియలో అమొరియమ్‌ల కాలం ముగిసింది, కాని బాబిలోనియన్ టాల్‌ముడ్‌ను ఎడిట్ చేసేపని సా.శ. ఆరవ శతాబ్దంలోకి కూడా కొనసాగింది, ఆ పనిని సబోరియమ్ అనే గుంపు చేసింది, అది ఒక అరామిక్ పదం, “వివరించేవారు” లేక “అభిప్రాయం కల్గివున్నవారు” అని దాని భావం. ఈ చివరి సంపాదకులు అసంపూర్తిగా ఉండిపోయిన ఆ సాహితీకృతి యొక్క వేలాది భాగాలనూ, రబ్బీలు శతాబ్దాలపాటు చేసిన వాగ్వివాదాలనూ ఒక దగ్గర చేర్చి, పూర్వపు అన్ని యూదా వ్రాతలనుండి బాబిలోనియన్ టాల్‌ముడ్‌ను ప్రత్యేకంగా ఉంచిన ఒక శైలినీ రూపాన్నీ దానికిచ్చారు.
టాల్‌ముడ్ ఏమి సాధించింది?
టాల్‌ముడ్ యొక్క రబ్బీలు హెబ్రీ లేఖనాల మూలం నుండే మిష్నా కూడా వచ్చిందని నిరూపించడానికి పూనుకున్నారు. కాని ఎందుకు? జేకబ్ నోయ్‌స్నెర్ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “వివాదంలో ఉన్న అంశం ఏమిటంటే మిష్నా యొక్క కీర్తి. అయితే తేల్చబడవలసిన విషయంగా మారింది మాత్రం జ్ఞానికి స్వయంగా ఉన్న అధికారం.” ఈ అధికారాన్ని బలపర్చడానికి, మిష్నాలోని ప్రతి వాక్యం, కొన్నిసార్లు ప్రతి పదం, పరీక్షించబడి, సవాలు చేయబడి, వివరించబడి, ఒక ప్రత్యేకమైన విధానంలో పొందిక ఏర్పర్చబడేది. ఈ విధంగా రబ్బీలు “మిష్నా యొక్క గమనాన్ని ఒక దిశ నుండి మరో దిశకు మళ్లించారని” నోయ్‌స్నెర్ పేర్కొంటున్నాడు. సంపూర్ణమైన సాహితీకృతిగానే సృష్టించబడినప్పటికీ, మిష్నా ఇప్పుడు క్షుణ్ణంగా విశ్లేషించబడింది. ఈ ప్రక్రియలో, అది పునఃసృష్టించబడి, పునఃనిర్వచించబడింది.
ఈ క్రొత్త సాహితీకృతి—టాల్‌ముడ్—రబ్బీల సంకల్పాన్ని నెరవేర్చింది. వాళ్లు విశ్లేషణా నియమాలను ఏర్పరచారు, కాబట్టి రబ్బీలలా ఆలోచించిడాన్ని అది ప్రజలకు నేర్పింది. తమ అధ్యయన మరియు విశ్లేషణ విధానం దేవుని మనస్సును ప్రతిబింబిస్తుందని రబ్బీలు విశ్వసించారు. టాల్‌ముడ్ అధ్యయనమే ఒక లక్ష్యమైంది, ఒక ఆరాధనా విధానమైంది, అలా మనస్సును ఉపయోగించడం దేవుడ్ని అనుకరించడంగా భావించబడేది. రానైయున్న తరాలలో, టాల్‌ముడ్ ఇదే విధానంలోనే విశ్లేషించబడనైయ్యుంది. ఫలితం? చరిత్రకారుడైన సెసిల్ రోత్ ఇలా వ్రాస్తున్నాడు: “టాల్‌ముడ్ . . . [యూదులను] ఇతరుల నుండి వేరుచేసి చూపిన విలక్షణమైన గుర్తింపు చిహ్నాన్ని వారికిచ్చింది, అలాగే మారకుండా ఉండేందుకు వారికున్న విశేషమైన నిరోధక శక్తిని, ఐక్యతను వారికిచ్చింది. దాని తర్కం వారి బుద్ధిసూక్ష్మతకు పదునుపెట్టింది, వారికి . . . మానసిక కుశాగ్రతను ఇచ్చింది. . . . మధ్య యుగాలకు చెందిన హింసింపబడుతున్న యూదుడు తప్పించుకుని పారిపోవడానికి టాల్‌ముడ్ అతనికి మరో ప్రపంచాన్ని ఇచ్చింది. . . . తాను తన స్వదేశాన్ని కోల్పోయినప్పుడు తనతో తీసుకువెళ్లగలిగేలా అది అతనికి పితృదేశాన్నిచ్చింది.”
రబ్బీల ఆలోచనా విధానాన్ని ఇతరులకు బోధించడం ద్వారా, టాల్‌ముడ్ నిజంగానే అధికారాన్ని ప్రదర్శించింది. అయితే అందరికీ—యూదులకూ, యూదాయేతరులకూ ఒకేలా తలెత్తే—ప్రశ్నేమిటంటే, టాల్‌ముడ్ నిజంగా దేవుని మనస్సును ప్రతిబింబింపజేస్తుందా?—1 కొరింథీయులు 2:11-16.
[అధస్సూచీలు]
a మిష్నా యొక్క అభివృద్ధి మరియు దానిలోని విషయాల గురించి మరింత సమాచారం కొరకు, నవంబరు 15, 1997 కావలికోట నందలి “మిష్నా మరియు మోషేకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం” అనే శీర్షికను చూడండి.
b పాలస్టీనియన్ టాల్‌ముడ్ జెరూసలేమ్ టాల్‌ముడ్‌గా ప్రసిద్ధి గాంచింది. అయితే, ఇది తప్పు పేరు, ఎందుకంటే అమొరియమ్ కాలంలోని ఎక్కువ భాగంలో యూదులు యెరూషలేములోకి ప్రవేశించడానికి అనుమతించబడేవారు కాదు.
[31వ పేజీలోని బాక్సు]
రెండు టాల్‌ముడ్‌లు—వాటి మధ్యనున్న తేడా ఏమిటి?
“టాల్‌ముడ్” అనే హెబ్రీ పదానికి “అధ్యయనం” లేక “నేర్చుకోవడం” అనే భావాలున్నాయి. పాలస్తీనా మరియు బాబిలోనియల అమొరియమ్‌లు మిష్నాను అధ్యయనం చేయడానికి లేక విశ్లేషించడానికి పూనుకున్నాయి. రెండు టాల్‌ముడ్‌లు (పాలస్టీనియన్, బాబిలోనియన్) అలా విశ్లేషిస్తాయి, అయితే వాటి మధ్యనున్న తేడా ఏమిటి? జేకబ్ నోయ్‌స్నెర్ ఇలా వ్రాస్తున్నాడు: “మొదటి టాల్‌ముడ్ రుజువును విశ్లేషిస్తుంది, రెండవది అనుమాన వాక్యాలను పరిశోధిస్తుంది; మొదటిది పూర్తిగా తన పరిశోధనా పరిధుల్లోనే ఉంటుంది, కాని రెండవది వాటిని ఎంతగానో మించిపోతుంది.”
బాబిలోనియన్ టాల్‌ముడ్ యొక్క అధిక తీవ్రమైన, సంపూర్ణమైన సంపాదకత్వం దాన్ని ఎంతో విస్తృతమైనదానిగా చేయడమే గాక అది దాన్ని ఆలోచనా విశ్లేషణల విధానంలో ఎంతో లోతుగా, మరింత చొచ్చుకుపోయేదిగా చేసింది. “టాల్‌ముడ్” అనే పదం ప్రస్తావించబడినప్పుడు, అలా చెప్పబడేది సాధారణంగా బాబిలోనియన్ టాల్‌ముడ్ గురించే. గత శతాబ్దాలన్నింటిలోనూ ఎక్కువగా అధ్యయనం చేసి వ్యాఖ్యానించబడింది ఈ టాల్‌ముడ్ గురించే. నోయ్‌స్నెర్ అభిప్రాయం ప్రకారం, పాలస్టీనియన్ టాల్‌ముడ్ “సంపూర్ణమైన సాహితీకృతి,” బాబిలోనియన్ టాల్‌ముడ్ “ప్రతిభావంతమైన సాహితీకృతి.”