క్రీస్తు ధర్మశాస్త్రం ప్రకారం జీవించడం
“ఒకని భారముల నొకడు భరించి, యీలాగు క్రీస్తు నియమమును [“ధర్మశాస్త్రము,” NW] పూర్తిగా నెరవేర్చుడి.”—గలతీయులు 6:2.
1. క్రీస్తు ధర్మశాస్త్రం నేడు మంచిని సాధించేందుకు అతి గొప్ప శక్తి అని ఎందుకు చెప్పవచ్చు?
రువాండాలో, హుటు మరియు టుట్సీలైన యెహోవాసాక్షులు, ఇటీవలనే ఆ దేశాన్ని అల్లకల్లోలపరిచిన జాత్యహంకార ఊచకోతలనుండి ఒకరినొకరు కాపాడుకునేందుకు తమ జీవితాలను ప్రమాదంలో పడవేసుకున్నారు. జపాన్ నందలి కోబీలోని వినాశకర భూకంపంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన యెహోవాసాక్షులు, వారిని కోల్పోయినందుకు కుప్పకూలిపోయారు. అయినప్పటికీ, ఇతర బాధితులను రక్షించేందుకు వారు వెంటనే చర్య గైకొన్నారు. అవును, ప్రపంచ నలుమూలల నుండి వస్తున్న హృదయాన్ని స్పర్శించే ఉదాహరణలు క్రీస్తు ధర్మశాస్త్రం నేడు క్రియాశీలంగా ఉందని చూపుతున్నాయి. అది మంచికి సంబంధించి అతి గొప్ప శక్తి అయ్యుంది.
2. క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క భావాన్ని క్రైస్తవమత సామ్రాజ్యం ఎలా తప్పిపోయింది, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి మనమేమి చేయగలం?
2 అదే సమయంలో, ఈ అపాయకరమైన “అంత్యదినముల”ను గురించిన ఒక బైబిలు ప్రవచనం నెరవేరుతోంది. అనేకులు “పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు.” (2 తిమోతి 3:1, 5) ప్రాముఖ్యంగా క్రైస్తవమత సామ్రాజ్యంలో, మతం అనేది తరచూ ఒక ఆనవాయితియే కానీ అది హృదయానికి సంబంధించినది కాదు. క్రీస్తు ధర్మశాస్త్రం ప్రకారం జీవించడం ఎంతో కష్టం గనుక పరిస్థితి అలా ఉందా? కాదు. అనుసరింపలేని ధర్మశాస్త్రాన్ని క్రీస్తు మనకు ఇవ్వడు. క్రైస్తవమత సామ్రాజ్యం ఆ ధర్మశాస్త్రం యొక్క అసలు భావాన్ని ఎంతమాత్రం గ్రహించలేదు. ఈ ప్రేరేపిత మాటలకు చెవియొగ్గడంలో అది విఫలమైంది: “ఒకని భారముల నొకడు భరించి, యీలాగు క్రీస్తు నియమమును [“ధర్మశాస్త్రము,” NW] పూర్తిగా నెరవేర్చుడి.” (గలతీయులు 6:2) మనం పరిసయ్యులను అనుకరించడం ద్వారా మరియు మన సహోదరుల భారాలకు అన్యాయంగా మరిన్ని జతచేయడం ద్వారా కాక, ఒకరి భారాలను మరొకరం మోయడం ద్వారా మనం “క్రీస్తు నియమమును [“ధర్మశాస్త్రము,” NW] పూర్తిగా నెరవేర్చు”తాము.
3. (ఎ) క్రీస్తు ధర్మశాస్త్రానికి జత చేయబడిన కొన్ని ఆజ్ఞలు ఏవి? (బి) క్రైస్తవ సంఘం క్రీస్తు నుండి సూటిగా పొందిన ఆజ్ఞలను తప్ప మరింకే సూత్రాలనూ కలిగి ఉండకూడదని ముగించి చెప్పడం ఎందుకు తప్పై ఉంటుంది?
3 క్రీస్తు ధర్మశాస్త్రంలో క్రీస్తుయేసు యొక్క ఆజ్ఞలన్నీ అంటే, ప్రకటించడం మరియు బోధించడం, కంటిని పవిత్రంగా మరియు తేటగా ఉంచుకోవడం, మన పొరుగు వారితో సమాధానాన్ని కలిగి ఉండేందుకు కృషి చేయడం, లేక సంఘం నుండి అపరిశుభ్రతను తీసివేయడం ఇత్యాది ఏవైనప్పటికీ అవన్నీ ఇమిడివున్నాయి. (మత్తయి 5:27-30; 18:15-17; 28:19, 20; ప్రకటన 2:14-16) వాస్తవానికి, క్రీస్తు అనుచరుల కొరకు బైబిలులో ఏ ఆజ్ఞలు ఇవ్వబడ్డాయో వాటన్నిటినీ అనుసరించాల్సిన బాధ్యత క్రైస్తవులకుంది. మరి అదనపు విషయాలు కూడా ఉన్నాయి. యెహోవా సంస్థ, అలాగే ఆయా సంఘాలు, మంచి క్రమాన్ని కాపాడేందుకు అవసరమైన సూత్రాలను మరియు విధానాలను నెలకొల్పాల్సి ఉంటుంది. (1 కొరింథీయులు 14:33, 40) అంతెందుకు, అలాంటి కూటాలను ఎప్పుడు, ఎక్కడ మరియు ఎలా జరుపుకోవాలనే విషయాల్లో క్రైస్తవులకు ఏ నియమాలూ గనుక లేకుంటే వారు కూడుకోవడం కూడా సాధ్యపడేది కాదు! (హెబ్రీయులు 10:24, 25) సంస్థలో అధికారమివ్వబడిన వారు నియమించిన సహేతుకమైన నడిపింపు సూత్రాలతో సహకరించడం కూడా క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంలో ఒక భాగమే.—హెబ్రీయులు 13:17.
4. స్వచ్ఛారాధన వెనుకనున్న పురికొల్పే శక్తి ఏది?
4 అయినప్పటికీ, నిజ క్రైస్తవులు తమ ఆరాధన నియమాల అర్థరహిత సముదాయంగా తయ్యారయ్యేందుకు అనుమతించరు. ఎవరో వ్యక్తులు లేక ఏదో సంస్థ చెబుతున్నందుకు కాదు వారు యెహోవాను సేవించేది. బదులుగా, వారి ఆరాధన వెనుకనున్న ప్రేరేపణా శక్తి ప్రేమే. పౌలు ఇలా వ్రాశాడు: ‘క్రీస్తు ప్రేమ మనలను బలవంతము చేయుచున్నది.’ (2 కొరింథీయులు 5:14) ఒకరినొకరు ప్రేమించాలని యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. (యోహాను 15:12, 13) స్వయంత్యాగ పూరితమైన ప్రేమ క్రీస్తు ధర్మశాస్త్రానికి ఆధారం, అది కుటుంబంలోని మరియు సంఘంలోని నిజ క్రైస్తవులనందరినీ బలవంతం చేస్తుంది లేక పురికొల్పుతుంది. ఎలాగో మనం చూద్దాం.
కుటుంబంలో
5. (ఎ) తలిదండ్రులు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని గృహంలో ఎలా నెరవేర్చగలరు? (బి) పిల్లలకు తమ తలిదండ్రులనుండి ఏమి అవసరము, దాన్ని అందించేందుకు కొందరు తలిదండ్రులు ఏ అడ్డంకులను అధిగమించాల్సి ఉంటుంది?
5 అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: “పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తు కూడ సంఘమును ప్రేమించి, . . . దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను.” (ఎఫెసీయులు 5:25-27) ఒక భర్త క్రీస్తును అనుకరించి తన భార్య ఎడల ప్రేమ మరియు అవగాహనతో వ్యవహరిస్తే, క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యమైన అంశాన్ని ఆయన నెరవేర్చుతున్నాడు. అంతేకాకుండా, యేసు చిన్న పిల్లలను ఎత్తి కౌగిలించుకుని, వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించి వారి ఎడల ఆప్యాయతను బాహాటంగా చూపాడు. (మార్కు 10:16) క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే తలిదండ్రులు కూడా తమ పిల్లల ఎడల ప్రేమను వ్యక్తం చేస్తారు. నిజమే, ఈ విషయంలో యేసు మాదిరిని అనుకరించడం సవాలుదాయకంగా ఉందని భావించే తలిదండ్రులు కూడా ఉన్నారు. కొందరు స్వతఃసిద్ధంగానే, తమ భావాలను బాహాటంగా వ్యక్తం చేయలేరు. తలిదండ్రులారా, అలాంటి ఇబ్బందులు మీరు మీ పిల్లల ఎడల కలిగివున్న ప్రేమను వాళ్లకు చూపకుండా ఉండేందుకు అనుమతించకండి! మీరు మీ పిల్లలను ప్రేమిస్తున్నారని మీకు తెలిసివుండటం మాత్రమే సరిపోదు. అది వారికి కూడా తెలియాలి. మీ ప్రేమను చూపేందుకు మార్గాలను మీరు కనుగొనకపోతే వారు దాన్ని తెలుసుకోలేరు.—మార్కు 1:11 పోల్చండి.
6. (ఎ) పిల్లలకు తలిదండ్రుల సూత్రాలు అవసరమా, మీరు అలా ఎందుకు జవాబు చెబుతారు? (బి) గృహ సూత్రాల వెనుకనున్న ఏ కారణాన్ని పిల్లలు అర్థం చేసుకోవలసిన అవసరత ఉంది? (సి) క్రీస్తు ధర్మశాస్త్రం గృహంలో ఉంటే ఏ ప్రమాదాలు నివారించబడతాయి?
6 అదే సమయంలో, పిల్లలకు హద్దులు అవసరం, అంటే వారి తలిదండ్రులు సూత్రాలను నెలకొల్పాలని మరియు కొన్నిసార్లు ఈ సూత్రాలను క్రమశిక్షణ ద్వారా అన్వయించాలనీ దాని అర్థం. (హెబ్రీయులు 12:7, 9, 11) అయినప్పటికీ, ఈ సూత్రాల వెనుక ఉన్న కారణాన్ని, అంటే తమ తలిదండ్రులు తమను ప్రేమిస్తున్నారని తెలుసుకునేందుకు పిల్లలకు క్రమబద్ధంగా సహాయపడాలి. వారు తమ తలిదండ్రులకు విధేయత చూపేందుకు గల శ్రేష్ఠమైన కారణం ప్రేమేనని వారు తెలుసుకోవాలి. (ఎఫెసీయులు 6:1; కొలొస్సయులు 3:20; 1 యోహాను 5:3) తుదకు పిల్లలు తమ స్వంతగా మంచి నిర్ణయాలను తీసుకోగలిగేలా వారు తమ “వివేచనాశక్తి”ని ఉపయోగించడాన్ని బోధించడమే వివేచించే తల్లి/తండ్రి యొక్క గమ్యం. (రోమీయులు 12:1, NW; 1 కొరింథీయులు 13:11 పోల్చండి.) మరోవైపు, సూత్రాలు మరీ ఎక్కువగా లేక క్రమశిక్షణ మరీ కఠినంగా ఉండకూడదు. పౌలు ఇలా చెబుతున్నాడు: “తండ్రులారా, మీ పిల్లల మనస్సు క్రుంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి.” (కొలొస్సయులు 3:21; ఎఫెసీయులు 6:4) కుటుంబంలో క్రీస్తు ధర్మశాస్త్రం నెలకొన్నప్పుడు, అదుపులేని కోపంతో లేక గాయపరిచే ఎత్తిపొడుపులుగల క్రమశిక్షణకు ఎలాంటి స్థానమూ ఉండదు. అలాంటి గృహంలో, పిల్లలు భద్రత కలిగి ఉన్నట్లు మరియు ప్రోత్సహింపబడినట్లు భావిస్తారు గానీ భారం మోపబడినట్లు లేక కించపరచబడినట్లు భావించరు.—కీర్తన 36:7 పోల్చండి.
7. గృహంలో సూత్రాలను నియమించడం విషయానికొస్తే బేతేలు గృహాలు ఏ విధాలుగా మాదిరినుంచగలవు?
7 ప్రపంచవ్యాప్తంగా ఉన్న బేతేలు గృహాలను దర్శించిన కొందరు, కుటుంబం కలిగి ఉండవలసిన సూత్రాల విషయంలో సమతూకానికి సంబంధించి అవి మంచి ఉదాహరణలు అని చెబుతారు. ఆ గృహాల్లో పెద్దవారే ఉన్నప్పటికీ, అలాంటి సంస్థాపనాలు కుటుంబాల వలెనే పని చేస్తాయి.a బేతేలు కార్యకలాపాలు సంక్లిష్టంగా ఉంటాయి మరి అనేక సూత్రాలు అవసరం, అంటే ఒక కనీస కుటుంబం కలిగివుండే వాటికంటే తప్పకుండా ఎంతో ఎక్కువే అవసరమౌతాయి. అయినప్పటికీ, బేతేలి గృహాల్లో, కార్యాలయాల్లో, మరియు కర్మాగార కార్యకలాపాల్లో నాయకత్వం వహించే పెద్దలు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని అన్వయించేందుకు కృషి చేస్తారు. పనిని సంస్థీకరించడం మాత్రమే కాక, తమ తోటి పని వారి మధ్య, ఆత్మీయ పురోభివృద్ధిని మరియు “యెహోవా యొక్క ఆనందాన్ని” పెంపొందింపజేయడం కూడా తమ నియామకమన్నట్లు వారు దృష్టిస్తారు. (నెహెమ్యా 8:10, NW) కాబట్టి, విషయాలను అనుకూలమైన మరియు ప్రోత్సాహకరమైన పద్ధతిలో చేసేందుకు వారు కృషి చేస్తారు మరియు సహేతుకంగా ఉండేందుకు వారు ప్రయత్నిస్తారు. (ఎఫెసీయులు 4:31, 32) బేతేలు కుటుంబాలు తమ ఆనందభరిత స్ఫూర్తి విషయమై ప్రఖ్యాతి గాంచడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు!
సంఘంలో
8. (ఎ) సంఘంలో మన లక్ష్యం ఎల్లప్పుడూ ఏమైవుండాలి? (బి) ఏ కొన్ని పరిస్థితుల్లో కొందరు సూత్రాలు కావాలని అడగటం లేక వాటిని చేయడానికి ప్రయత్నించడం జరిగింది?
8 సంఘంలో కూడా ప్రేమ భావంతో ఒకరినొకరం పురికొల్పుకోవాలన్నదే మన లక్ష్యం. (1 థెస్సలొనీకయులు 5:11) కాబట్టి, వ్యక్తిగతంగా ఎంపిక చేసుకోగల విషయాల్లో తమ స్వంత అభిప్రాయాలను నెలకొల్పడమే తమ పని అన్నట్లు చేయడం ద్వారా, ఇతరులు ఇప్పటికే కలిగివున్న భారానికి మరి కాస్త జత చేయకుండా ఉండేందుకు క్రైస్తవులందరూ జాగ్రత్త వహించాలి. కొన్నిసార్లు, కొన్ని నిర్దిష్టమైన చిత్రాలు, పుస్తకాలు మరియు ఆట బొమ్మల గురించి కూడా తాము ఏ అభిప్రాయాన్ని కలిగివుండాలి అనే విషయాల వంటి వాటిపై సూత్రాలను అడుగుతూ కొందరు వాచ్‌టవర్ సంస్థకు వ్రాస్తుంటారు. అయినప్పటికీ, అలాంటి విషయాలను నిశితంగా పరిశీలించి, వాటిపై తమ తీర్పును చెప్పే అధికారం సంస్థకు లేదు. అనేక సందర్భాల్లో, బైబిలు సూత్రాల ఎడల తమకుగల ప్రేమ ఆధారంగా, ఆయా వ్యక్తులు లేక కుటుంబ శిరస్సులు నిర్ణయించుకోవల్సిన విషయాలు ఇవి. ఇతరులు సంస్థ సలహాలను మరియు మార్గనిర్దేశకాలను సూత్రాలుగా మార్చుతారు. ఉదాహరణకు, మార్చి 15, 1996 కావలికోట సంచికలో, సంఘ సభ్యులను ఆత్మీయంగా ప్రోత్సహిస్తూ సందర్శించాలని పెద్దలను ప్రోత్సహిస్తున్న చక్కని శీర్షిక ప్రచురింపబడింది. సూత్రాలను స్థాపించడం దాని సంకల్పమా? కాదు. ఆ సలహాలను అనుసరించగల వారు అనేక ప్రయోజనాలను పొందగలిగినప్పటికీ, కొందరు పెద్దలు అలా చేసే స్థితిలో లేరు. అదే విధంగా, ఏప్రిల్ 1, 1995 కావలికోట సంచిక నందలి “పాఠకుల ప్రశ్నలు” శీర్షిక, హద్దులు మీరిన కార్యకలాపాలు లేక వేడుకలను జరుపుకోవడం ద్వారా విపరీతాలకు పోయి బాప్తిస్మ సందర్భం యొక్క ఘనతను తక్కువ చేయడాన్ని గురించి హెచ్చరించింది. ఈ సందర్భంలో ప్రోత్సహిస్తూ ఓ కార్డును పంపుకోవడం కూడా తప్పు అనే సూత్రాన్ని స్థాపిస్తూ, కొందరు పరిణతి చెందిన ఈ సలహాను విపరీతమైన ధోరణిలో అన్వయించుకున్నారు!
9. మనం ఒకరినొకరం విపరీతంగా విమర్శించుకోవడాన్ని మరియు తీర్పు తీర్చుకోవడాన్ని నివారించడం ఎందుకు ప్రాముఖ్యము?
9 ఈ విషయాన్ని పరిశీలించండి, “స్వాతంత్ర్యము నిచ్చు సంపూర్ణమైన నియమము” మన మధ్య ఉండాలంటే, క్రైస్తవులందరి మనస్సాక్షులూ విభిన్నంగా ఉంటాయని మనం అంగీకరించాలి. (యాకోబు 1:25) లేఖన సూత్రాలను ఉల్లంఘించని వ్యక్తిగత అభిరుచులను ప్రజలు కలిగివుంటే మనం దానికి పెద్ద రాద్ధాంతం చేయాలా? చేయకూడదు. మనం అలా చేయడం విభజనలను కలిగిస్తుంది. (1 కొరింథీయులు 1:10) పౌలు తోటి క్రైస్తవున్ని తీర్పు తీర్చ కూడదని మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, ఇలా చెప్పాడు: “అతడు నిలిచియుండుటయైనను పడియుండుటయైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తిగలవాడు.” (రోమీయులు 14:4) వ్యక్తిగత మనస్సాక్షికి వదిలేయవలసిన విషయాల్లో మనం ఒకరికి వ్యతిరేకంగా మరొకరం మాట్లాడితే మనం దేవున్ని అప్రీతిపరచే ప్రమాదం ఉంది.—యాకోబు 4:10-12.
10. సంఘంపై పర్యవేక్షించడానికి ఎవరు నియమింపబడ్డారు, మరి మనం వారికి ఎలా మద్దతునివ్వాలి?
10 దేవుని మందపై పర్యవేక్షణ చేసే నియామకం పెద్దలకు ఉందనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం ఉంచుకుందాము. (అపొస్తలుల కార్యములు 20:28) సహాయం చేసేందుకు వారు ఉన్నారు. సలహాల కొరకు మనం వారిని సమీపించేందుకు సంకోచించకూడదు, ఎందుకంటే వారు బైబిలు విద్యార్థులు మరియు వాచ్‌టవర్ సంస్థ ప్రచురణల్లో ఏమి చర్చింపబడిందో దానితో వారు ఎంతో పరిచయం కలిగివుంటారు. లేఖన సూత్రాలను ఉల్లంఘించడానికి నడుపగలదనేలాంటి ప్రవర్తనను పెద్దలు గమనిస్తే, అవసరమైన సలహాను వారు నిర్భయంగా అందిస్తారు. (గలతీయులు 6:1) తమ మధ్య నాయకత్వం వహించే ఈ ప్రియ కాపరులతో సహకరించడం ద్వారా సంఘ సభ్యులు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు.—హెబ్రీయులు 13:7.
పెద్దలు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని అన్వయిస్తారు
11. పెద్దలు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని సంఘంలో ఎలా అన్వయిస్తారు?
11 సంఘంలో క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలని పెద్దలు ఆత్రుతతో ఉన్నారు. సువార్తను ప్రకటించడంలో వారు నాయకత్వం వహిస్తారు, హృదయాలను చేరుకునేలా బైబిలు నుండి బోధిస్తారు మరియు ప్రేమగల, శాంతమైన కాపరుల వలె “క్రుంగిన ప్రాణముల”తో మాట్లాడతారు. (1 థెస్సలొనీకయులు 5:14, NW) క్రైస్తవమత సామ్రాజ్యపు అనేక మతాల్లో ఉండే క్రైస్తవ వ్యతిరేక దృక్పథాలను వారు నివారిస్తారు. నిజమే, ఈ లోకం త్వరితంగా నశించిపోతోంది, మరి పౌలు వలె, మంద విషయమై పెద్దలు చింతించవచ్చు; అలాంటి చింతల విషయంలో చర్య తీసుకునేటప్పుడు వారు సమతూకాన్ని కలిగివుంటారు.—2 కొరింథీయులు 11:28.
12. సహాయం కొరకు ఒక క్రైస్తవుడు ఒక పెద్దను సమీపించినప్పుడు, పెద్ద ఎలా ప్రతిస్పందించవచ్చు?
12 ఉదాహరణకు, లేఖనాలను సూటిగా అన్వయించడం ద్వారా చర్చించబడని ఏదైనా ఒక విషయాన్ని గురించి లేక వేర్వేరు క్రైస్తవ సూత్రాలను సమతూకపరచడం అవసరమయ్యే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి ఒక క్రైస్తవుడు ఓ పెద్దను సంప్రదించాలని ఇష్టపడవచ్చు. బహుశ ఎక్కువ జీతం వచ్చేదైనప్పటికీ అధిక బాధ్యతలను కలిగివుండే ప్రమోషన్ ఆయనకు తన కార్యాలయం వద్ద ప్రతిపాదించబడవచ్చు. లేక ఒక యౌవన క్రైస్తవుని అవిశ్వాసియైన తండ్రి తన కుమారుని పరిచర్యను ప్రభావితం చేయగల వాటిని చేయమని కోరుతుండవచ్చు. అలాంటి సందర్భాల్లో పెద్ద తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేయడు. బదులుగా, ఆయన బహుశ బైబిలును తెరిచి, తగిన సూత్రాల గురించి తర్కించేందుకు ఆ వ్యక్తికి సహాయం చేయవచ్చు. ఆ అంశాన్ని గురించి కావలికోట మరియు ఇతర ప్రచురణల పుటల్లో, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ ఏమి చెప్పాడో దాన్ని కనుగొనేందుకు, ఒకవేళ అందుబాటులో ఉంటే కావలికోట ప్రచురణల ఆకారాధి సూచికను ఆయన ఉపయోగించవచ్చు. (మత్తయి 24:45) ఆ తర్వాత ఆ క్రైస్తవుడు తీసుకున్న నిర్ణయం, జ్ఞానవంతమైనది కాదని పెద్దకు అనిపిస్తే అప్పుడేమిటి? ఆ నిర్ణయం బైబిలు సూత్రాలను లేక నియమాలను సూటిగా ఉల్లంఘించకపోతే, “ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను” అనే విషయం తెలుసు గనుక, నిర్ణయం తీసుకునేందుకు ప్రతి వ్యక్తికి ఉన్న హక్కును పెద్ద గుర్తిస్తున్నాడని ఆ క్రైస్తవుడు తెలుసుకుంటాడు. అయితే, “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును” అని ఆ క్రైస్తవుడు తప్పక జ్ఞాపకముంచుకోవాలి.—గలతీయులు 6:5, 7.
13. ప్రశ్నలకు సూటైన సమాధానాలు చెప్పే బదులు లేక తమ స్వంత అభిప్రాయాలు చెప్పే బదులు, విషయాలను గురించి ఇతరులే తర్కించేందుకు పెద్దలు వారికి ఎందుకు సహాయం చేస్తారు?
13 అనుభవంగల పెద్ద ఇలా ఎందుకు ప్రవర్తిస్తాడు? కనీసం రెండు కారణాలనుబట్టి. మొదటిది, పౌలు ఒక సంఘంతో, నేను ‘మీ విశ్వాసము మీద ప్రభువును’ కాదని చెప్పాడు. (2 కొరింథీయులు 1:24) లేఖనాలను గురించి తర్కించి, తర్వాత జ్ఞానం ఆధారంగా తన స్వంత నిర్ణయాన్ని తీసుకునేందుకు తన సహోదరునికి సహాయం చేయడం ద్వారా, ఆ పెద్ద పౌలు దృక్పథాన్ని అనుకరిస్తున్నాడు. తన అధికారానికి హద్దులు ఉన్నాయని యేసు గ్రహించిన విధంగానే, తన అధికారానికి హద్దులు ఉన్నాయని అతను గ్రహిస్తాడు. (లూకా 12:13, 14; యూదా 9) అదే సమయంలో, పెద్దలు ఇష్టపూర్వకంగా సహాయాన్ని అందిస్తారు, మరి అవసరమైన చోట గట్టి లేఖనాధార ఉపదేశాన్ని కూడా ఇస్తారు. రెండవదిగా, ఆయన తన తోటి క్రైస్తవునికి తర్ఫీదునిస్తున్నాడు. అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు: “వయస్సు వచ్చిన వారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును.” (హెబ్రీయులు 5:14) గనుక పరిపక్వతకు ఎదగాలంటే, మన కొరకు నిర్ణయాలు తీసుకునేందుకు ఎవరిపైనో ఆధారపడకుండా, మనం మన స్వంత వివేచనాశక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది. లేఖనాలను గురించి ఎలా తర్కించాలో తోటి క్రైస్తవునికి చూపడం ద్వారా అతను అభివృద్ధి చెందేందుకు ఈ విధంగా ఆ పెద్ద సహాయం చేస్తున్నాడు.
14. తాము యెహోవా యందు విశ్వాసం ఉంచుతున్నామని పరిణతి చెందిన వారు ఎలా చూపగలరు?
14 యెహోవా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా సత్యారాధికుల హృదయాలను ప్రభావితం చేయగలడని మనం విశ్వాసం కలిగివుండవచ్చు. అలా, పరిణతి చెందిన పెద్దలు, అపొస్తలుడైన పౌలు చేసిన విధంగా తమ సహోదరులను వేడుకుంటూ, వారి హృదయాలను చేరుకుంటారు. (2 కొరింథీయులు 8:8; 10:1; ఫిలేమోను 8, 9) తమను సరైన రీతిలో ఉంచేందుకు వివరమైన నియమాలు కావలసింది ప్రాముఖ్యంగా అనీతిమంతులకే గానీ నీతిమంతులకు కాదని పౌలుకు తెలుసు. (1 తిమోతి 1:9) ఆయన తన సహోదరుల ఎడల అనుమానాన్ని లేక అపనమ్మకాన్ని కాదుగాని విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఒక సంఘానికి ఆయన ఇలా వ్రాశాడు: “ప్రభువునందు మిమ్మునుగూర్చి నమ్మకము కలిగియున్నాము.” (2 థెస్సలొనీకయులు 3:4) పౌలు యొక్క విశ్వాసం, నమ్మకం మరియు ధైర్యం ఆ క్రైస్తవులను పురికొల్పేందుకు తప్పకుండా ఎంతో చేశాయి. పెద్దలకు మరియు ప్రయాణ కాపరులకు నేడు అదే విధమైన లక్ష్యాలున్నాయి. ఈ నమ్మకస్థులైన వ్యక్తులు దేవుని మంద ఎడల ప్రేమపూర్వకంగా కాపుదలనిస్తుండగా ఎంత ఉత్తేజాన్ని కలుగజేస్తారో కదా!—యెషయా 32:1, 2; 1 పేతురు 5:1-3.
క్రీస్తు ధర్మశాస్త్రం ప్రకారం జీవించడం
15. మన సహోదరులతో మనకుగల సంబంధం విషయంలో మనం క్రీస్తు ధర్మశాస్త్రాన్ని అన్వయిస్తున్నామో లేదో చూచుకునేందుకు మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన కొన్ని ప్రశ్నలు ఏవి?
15 మనందరం క్రీస్తు ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్నామో లేదో మరియు దాన్ని ప్రోత్సహిస్తున్నామో లేదో మనల్ని మనం క్రమంగా పరిశీలించుకోవలసిన అవసరముంది. (2 కొరింథీయులు 13:5) వాస్తవంగా, ఇలా ప్రశ్నించుకోవడం ద్వారా మనందరం ప్రయోజనం పొందవచ్చు: ‘నేను పురికొల్పునిస్తున్నానా లేక విమర్శనాత్మకంగా ఉన్నానా? నేను సమతుల్యంగా ఉన్నానా లేక విపరీతంగా ఉన్నానా? నేను ఇతరులను పరిగణలోకి తీసుకుంటున్నానా లేక నా స్వంత హక్కుల విషయంలో పట్టుదల కలిగివున్నానా?’ బైబిలులో ప్రత్యేకంగా సూచింపబడని విషయాల్లో తన సహోదరుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలి లేక తీసుకోకూడదు అనే వాటిని నియంత్రించడానికి ఒక క్రైస్తవుడు ప్రయత్నించడు.—రోమీయులు 12:1; 1 కొరింథీయులు 4:6.
16. మనం క్రీస్తు ధర్మశాస్త్రంలోని ఒక అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని నెరవేర్చుతూ, తమను గురించి తాము ప్రతికూల భావాలను కలిగివున్న వారికి ఎలా సహాయం చేయగలము?
16 ఈ క్లిష్ట సమయాల్లో, ఒకరినొకరం ప్రోత్సహించుకునేందుకు మనం మార్గాలను వెదకడం చాలా ప్రాముఖ్యం. (హెబ్రీయులు 10:24, 25; మత్తయి 7:1-5 పోల్చండి.) మనం మన సహోదరసహోదరీల వైపు చూసినప్పుడు, వారి బలహీనతల కంటే వారి మంచి లక్షణాలు మనకు ఎంతో ఎక్కువ కాదంటారా? యెహోవా దృష్టిలో ప్రతి ఒక్కరు ప్రశస్తమైన వారే. అసంతోషకరంగా, అందరూ అలా భావించరు, మరి తమ గురించి కూడా అలా భావించరు. అనేకులు తమ స్వంత వ్యక్తిగత లోపాలను మరియు అసంపూర్ణతలను మాత్రమే చూసేందుకు మొగ్గు చూపుతారు. అలాంటి వారిని మరి ఇతరులను ప్రోత్సహించేందుకు, సంఘంలో వారు అందజేసే ప్రాముఖ్యమైన తోడ్పాటును మరియు వారి ఉపస్థితిని మనం ఎందుకు విలువైనదిగా ఎంచుతున్నామో వారికి తెలియజేస్తూ, మనం ప్రతి కూటంలో ఒకరు లేక ఇద్దరితో మాట్లాడేందుకు ప్రయత్నించగలమా? ఈ విధంగా వారి భారాన్ని తగ్గించి తద్వారా క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడంలో ఎంత ఆనందం ఉందో కదా!—గలతీయులు 6:2.
క్రీస్తు ధర్మశాస్త్రం క్రియాశీలంగా ఉంది!
17. మీ సంఘంలో క్రీస్తు ధర్మశాస్త్రం ఏ విభిన్న మార్గాల్లో క్రియాశీలంగా ఉండడాన్ని మీరు చూడగలుగుతున్నారు?
17 క్రైస్తవ సంఘంలో క్రీస్తు ధర్మశాస్త్రం క్రియాశీలమై ఉంది. మనం దాన్ని ప్రతి రోజూ చూస్తాం—తోటి సాక్షులు ఆతురతతో సువార్తను పంచుకున్నప్పుడు, వారు ఒకరినొకరు ఆదరించుకుని, ప్రోత్సహించుకున్నప్పుడు, అత్యంత క్లిష్టమైన సమస్యలు ఉన్నప్పటికీ వారు యెహోవాను సేవించేందుకు పోరాడేటప్పుడు, తమ పిల్లలు యెహోవాను ఆనందభరిత హృదయాలతో ప్రేమించేలా వారిని పెంచేందుకు తలిదండ్రులు కృషి చేస్తున్నప్పుడు, యెహోవాను నిత్యం సేవించాలనే తీవ్ర ఆసక్తిని మంద కలిగివుండేందుకు వారిని పురికొల్పుతూ అధ్యక్షులు దేవుని వాక్యాన్ని ప్రేమ మరియు వాత్సల్యంతో బోధించినప్పుడు, మనం దాన్ని చూస్తాం. (మత్తయి 28:19, 20; 1 థెస్సలొనీకయులు 5:11, 14) వ్యక్తులుగా మనం మన స్వంత జీవితాల్లో క్రీస్తు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే, యెహోవా ఎంత ఆనందిస్తాడో కదా! (సామెతలు 23:15) తన పరిపూర్ణ ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారందరూ నిత్యం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. రాబోయే పరదైసులో, మన హృదయాలోచనలు అన్నీ అదుపులో ఉండే సమయాన్ని, న్యాయాన్ని ఉల్లంఘించే వారు లేని సమయాన్ని, మానవజాతి పరిపూర్ణంగా ఉండే సమయాన్ని మనం చూస్తాం. క్రీస్తు ధర్మశాస్త్రం ప్రకారం జీవించడం ద్వారా లభించే ఎంత మహిమాన్విత ప్రతిఫలమో కదా అది!
[అధస్సూచీలు]
a అలాంటి గృహాలు క్రైస్తవమత సామ్రాజ్యపు సన్యాసుల మఠాల వలె ఉండవు. ఆ భావంలో, అక్కడ “అబ్బోట్‌లు” లేక “తండ్రులు” అనే వారెవ్వరూ ఉండరు. (మత్తయి 23:9) బాధ్యతగల సహోదరులకు గౌరవం ఇవ్వబడుతుంది, అయితే పెద్దలందరినీ నడిపించే సూత్రాల ద్వారానే వారి సేవ కూడా నడిపింపబడుతుంది.
మీరు ఏమి భావిస్తున్నారు?
◻ క్రైస్తవమత సామ్రాజ్యం క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క భావాన్ని ఎందుకు తప్పిపోయింది?
◻ కుటుంబంలో మనం క్రీస్తు ధర్మశాస్త్రాన్ని ఎలా అన్వయించగలము?
◻ సంఘంలో క్రీస్తు ధర్మశాస్త్రాన్ని అన్వయించేందుకు, మనం ఏమి చేయకూడదు మరియు ఏమి చేయాలి?
◻ సంఘంతో వ్యవహరించేటప్పుడు పెద్దలు క్రీస్తు ధర్మశాస్త్రానికి ఎలా విధేయత చూపవచ్చు?
[23వ పేజీలోని చిత్రం]
మీ పిల్లవానికి ప్రేమ యొక్క గొప్ప అవసరత ఉంది
[24వ పేజీలోని చిత్రం]
మన ప్రేమగల కాపరులు ఎంత సేదదీర్పునిచ్చే వారో కదా!