కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w97 4/15 పేజీలు 13-19
  • నిజమైన శాంతిని వెదకి దానిని వెంటాడండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నిజమైన శాంతిని వెదకి దానిని వెంటాడండి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రజలు శాంతిపరులు కాగలరు
  • శాంతిని వెంటాడుతున్నవారు
  • మరింత గొప్ప మార్పు
  • సమాధానకర్తయగు అధిపతి ద్వారా పరిపాలన
  • మానవులను ఎవరు శాంతికి నడుపగలరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1991
  • నిజమైన శాంతి—ఏ మూలం నుండి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • “దేవుని సమాధానము” మీ హృదయములకు కావలిగా ఉండనీయుడి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • దైవిక శాంతి సందేశకులుగా సేవచేయడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
w97 4/15 పేజీలు 13-19

నిజమైన శాంతిని వెదకి దానిని వెంటాడండి!

“జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు . . . కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును [“శాంతిని,” NW] వెదకి దాని వెంటాడవలెను.”—1 పేతురు 3:10, 11.

1. యెషయా యొక్క ఏ ప్రసిద్ధ మాటలు తప్పక నెరవేరుతాయి?

“వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ యీటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జనముమీదికి జనము ఖడ్గమెత్తక యుండును. యుద్ధముచేయ నేర్చుకొనుట ఇక మానివేయును.” (యెషయా 2:4) న్యూయార్క్‌ నగరంలో ఐక్యరాజ్య సమితి ప్రపంచ ప్రధాన కార్యాలయం వద్ద ఈ ప్రసిద్ధ లేఖనం ప్రదర్శించబడినప్పటికీ, ఆ ప్రపంచ సంస్థ ఆ మాటలను నెరవేర్చిందని చెప్పడం అసాధ్యం. అయితే, యెహోవా దేవుని విఫలంకాని మాటలో భాగంగా, ఆ ప్రకటన నిష్ఫలంగా ఉండదు.—యెషయా 55:10, 11.

2. యెషయా 2:2, 3 ప్రకారం “అంత్యదినములలో” ఏమి జరుగుతుంది?

2 యెషయా 2:4 నందు కనుగొనబడిన మాటలు వాస్తవానికి ఒక అద్భుతమైన ప్రవచనం, అంటే నిజమైన శాంతిని గూర్చిన ప్రవచనంలోని భాగం, అది మన కాలంలోనే ఇప్పుడే నెరవేరుతోంది. యుద్ధాలూ, యుద్ధాయుధాలూ ఉండని ఉత్తేజవంతమైన ఉత్తరాపేక్షల గురించి ప్రకటించడానికి ముందు, ఆ ప్రవచనం ఇలా చెబుతుంది: “అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటె ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సీయోనులోనుండి ధర్మశాస్త్రము, యెరూషలేములోనుండి యెహోవా వాక్కు బయలు వెళ్లును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి—యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనము వెళ్లుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతము అని చెప్పుకొందురు.”—యెషయా 2:2, 3.

ప్రజలు శాంతిపరులు కాగలరు

3. యుద్ధ పిపాసియైన వ్యక్తి శాంతిపరునిగా ఎలా మారగలడు?

3 ప్రజలు శాంతికరమైన విధానాన్ని వెంటాడడానికి ముందు, వారు యెహోవా మార్గాల విషయమై బోధించబడాలని గమనించండి. యెహోవా బోధకు వినయంగా ప్రతిస్పందించడం ఒక వ్యక్తి ఆలోచనా విధానాన్ని ప్రవర్తనను మార్చి, యుద్ధ పిపాసులైన ప్రజలు శాంతిపరులయ్యేలా చేయగలదు. ఈ మార్పు ఎలా సాధ్యమౌతుంది? రోమీయులు 12:2 ఇలా చెబుతుంది: “మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సు మారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.” దేవుని వాక్యంలోని సూత్రాలతోనూ, బోధలతోనూ మన మనస్సును నింపుకోవడం ద్వారా మనం మన మనస్సును మార్చుకుని నూతన పర్చుకుంటాము లేక దాన్ని మరో దిశలో వెళ్లేలా పురికొల్పుకుంటాము. క్రమంగా బైబిలును పఠించడం ఈ మార్పు చేసుకోవడానికి మనకు సహాయం చేసి, మనం వెళ్లవలసిన మార్గాన్ని స్పష్టంగా చూడగలిగేలా మన ఎడల యెహోవా చిత్తం ఏమైవుందో మనకు మనం నిరూపించుకోవడానికి దోహదపడుతుంది.—కీర్తన 119:105.

4. ఒకరు శాంతికరమైన నూతన వ్యక్తిత్వాన్ని ఎలా ధరిస్తారు?

4 బైబిలు సత్యం మన ఆలోచనా విధానాన్నే కాదుగాని మన చర్యలనూ, వ్యక్తిత్వాన్నీ కూడా మారుస్తుంది. “మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశలవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను” అని అపొస్తలుడైన పౌలు ఉద్బోధించినదానిని చేయడానికి అది మనకు సహాయం చేస్తుంది. (ఎఫెసీయులు 4:22-24) చిత్తవృత్తిని నూతనపరిచే శక్తి అంతర్గతమైనది. యెహోవా ఎడల, ఆయన సూత్రాల ఎడల మనకున్న ప్రేమ అధికమౌతుండగా అది మారి, శక్తివంతమౌతుంది, అది మనల్ని ఆత్మీయ ప్రజలనుగా, శాంతిపరులనుగా చేస్తుంది.

5. యేసు తన శిష్యులకిచ్చిన “క్రొత్త ఆజ్ఞ” వారి మధ్య శాంతి నెలకొనడానికి ఎలా దోహదపడుతుంది?

5 యేసు తన శిష్యులతో గడిపిన చివరి ఘడియల్లో ఇచ్చిన ఉపదేశంలో ఈ మార్పు యొక్క అవసరతను చూడవచ్చు: ‘మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను; నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరి నొకరు ప్రేమింపవలెను. మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందురు.’ (యోహాను 13:34, 35) క్రీస్తు-వంటి ఈ నిస్వార్థ ప్రేమ శిష్యులను పరిపూర్ణ ఐక్యతలో కలిపి ఉంచుతుంది. (కొలొస్సయులు 3:14) ఈ “క్రొత్త ఆజ్ఞ”ను అంగీకరించి దానికి అనుగుణంగా జీవించడానికి ఇష్టపడేవారే దేవుడు వాగ్దానం చేస్తున్న శాంతిని అనుభవిస్తారు. నేడు దీన్ని అనుభవిస్తున్న ప్రజలెవరైనా ఉన్నారా?

6. లోక ప్రజలకు భిన్నంగా యెహోవాసాక్షులు ఎందుకు శాంతిని అనుభవిస్తారు?

6 యెహోవాసాక్షులు తమ ప్రపంచవ్యాప్త సహోదరత్వంలో ప్రేమ కనబర్చడానికి ప్రయాసపడతారు. వారు ప్రపంచంలోని అన్ని దేశాల నుండి తీసుకొనబడినప్పటికీ, తీవ్రమైన రాజకీయ, మత సంబంధమైన ఒత్తిడికి గురైనప్పుడు కూడా వారు ప్రపంచ వివాదాల్లో నిమగ్నులు కారు. ఐక్యప్రజలుగా వారు యెహోవాచే బోధించబడుతున్నారు, వారు శాంతిని అనుభవిస్తున్నారు. (యెషయా 54:13) వారు రాజకీయ వివాదాల్లో తటస్థంగా ఉంటారు, వారు యుద్ధాల్లో పాల్గొనరు. మునుపు హింసాత్మకంగా ఉండిన కొందరు ఆ జీవన విధానాన్ని విడిచిపెట్టారు. వారు క్రీస్తు యేసు ఉదాహరణను అనుకరిస్తూ, శాంతి కాముకులైన క్రైస్తవులయ్యారు. వారు పేతురు ఇచ్చిన ఈ సలహాను హృదయపూర్వకంగా అనుసరిస్తారు: “జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును [“శాంతిని,” NW] వెదకి దాని వెంటాడవలెను.”—1 పేతురు 3:10, 11; ఎఫెసీయులు 4:3.

శాంతిని వెంటాడుతున్నవారు

7, 8. యుద్ధాన్ని విడిచిపెట్టి నిజమైన శాంతిని వెంటాడేవారిగా మారిన వారి ఉదాహరణలను ఇవ్వండి. (మీకు తెలిసిన ఇతరుల గురించి చెప్పండి.)

7 ఉదాహరణకు, రామీ ఓవద్‌ అనే వ్యక్తి ప్రత్యేక యాంటీ టెర్రరిస్టు వ్యతిరేక దళంలో మాజీ అధికారి. ఆయన తన శత్రువులను చంపడంలో తర్ఫీదు పొందాడు. తాను ప్రేమించిన అమ్మాయి ఆసియాకు చెందినది గనుక అంటే అన్యురాలు గనుక తానామెను వివాహం చేసుకోవడం రబ్బీలకు ఇష్టం లేదని ఆయన తలుసుకునే దినం వరకు ఆయన ఇజ్రయెల్‌ జాతీయవాదంలో దృఢ నమ్మకాన్ని కలిగివున్నాడు. ఆయన బైబిలులో సత్యం కొరకు వెదకడం ప్రారంభించాడు. అప్పుడాయన యెహోవాసాక్షులను కలిశాడు. సాక్షులతో ఆయన చేసిన బైబిలు పఠనం, తాను ఇక ఎంతమాత్రం ఉన్మాద జాతీయవాదిగా ఉండలేడని ఆయనను ఒప్పించింది. క్రైస్తవ ప్రేమ అంటే యుద్ధాన్ని, ఆయుధాలను విడిచి పెట్టి, అన్ని జాతులవారిని ప్రేమించడమని భావం. “నా సహోదరుడైన రామీ” అనే తొలిపలుకులున్న దయాపూర్వకమైన ఉత్తరాన్ని అందుకున్నప్పుడు ఆయనెంతగా ఆశ్చర్యపోయాడో కదా! దానిలో అంత అసాధారణమైనదేం ఉంది? ఆ వ్రాసిన వ్యక్తి పాలస్తీనాకు చెందిన స్త్రీ. “అది నమ్మశక్యం కానిదని నేను తలంచాను, ఎందుకంటే పాలస్తీనా వాళ్లు నా శత్రువులు, వారిలో ఒకామె నన్ను ‘నా సహోదరుడు’ అని పిలిచింది” అని రామీ చెబుతున్నాడు. రామీ, ఆయన భార్య ఇప్పుడు దేవుని మార్గంలో నిజమైన శాంతిని వెంటాడుతున్నారు.

8 మరో ఉదాహరణ గేర్గ్‌ రూటర్‌, ఈయన రెండవ ప్రపంచ యుద్ధకాలంలో రష్యాపై దండెత్తిన జర్మను సైన్యంలో సేవ చేశాడు. త్వరలోనే, ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవాలనే హిట్లరు గొప్ప పథకంతో ఆయన నిరాశ చెందాడు. ఆయన యుద్ధం నుండి తిరిగివచ్చాక యెహోవాసాక్షులతో బైబిలు పఠించడం ప్రారంభించాడు. ఆయనిలా వ్రాశాడు: “చివరికి నాకు విషయాలు అర్థం కాసాగాయి. రక్తపాతానికి బాధ్యుడు దేవుడు కాదని నేను గుర్తించాను . . . విధేయులైన మానవజాతికి నిత్య ఆశీర్వాదాలతో భూవ్యాప్త పరదైసును స్థాపించాలన్నది ఆయన సంకల్పమని నేను తెలుసుకున్నాను. . . . హిట్లరు తన ‘వెయ్యేళ్ల రైక్‌’ గురించి ప్రగల్భాలు పలికాడు కాని కేవలం 12 [సంవత్సరాలే] పరిపాలించాడు, అది కూడా ఎంతటి భయంకరమైన ఫలితంతో! భూమిపై వెయ్యేళ్ల పరిపాలనను స్థాపించగలిగేది, స్థాపించేది . . . హిట్లరు కాదుగాని క్రీస్తే.” ఇప్పటికి 50 సంవత్సరాలుగా, గేర్గ్‌ పూర్తికాల పరిచర్యలో నిజమైన శాంతికి రాయబారిగా సేవచేస్తున్నాడు.

9. నాజీ జర్మనీలోని యెహోవాసాక్షుల అనుభవం వారు శాంతిపరులైనప్పటికీ ధైర్యవంతులని ఎలా నిరూపించింది?

9 నాజీ పరిపాలన సమయంలో జర్మనీలోని యెహోవాసాక్షుల యథార్థతా తటస్థతలు ఇప్పటికి కూడా, అంటే 50 కంటే ఎక్కువ సంవత్సరాల తర్వాత కూడా, దేవుని ఎడలా శాంతి ఎడలా వారికున్న ప్రేమకు నిదర్శనంగా కొనసాగుతున్నాయి. వాషింగ్‌టన్‌ డి.సి. నందలి యునైటెడ్‌ స్టేట్స్‌ హోలోకాస్ట్‌ మెమోరియల్‌ మ్యూజియమ్‌ ప్రచురించిన చిన్న పుస్తకం ఇలా తెలియజేస్తుంది: “నాజీ పరిపాలన క్రింద యెహోవాసాక్షులు తీవ్రమైన హింసను సహించారు. . . . హింస, కాన్‌సన్‌ట్రేషన్‌ క్యాంపుల్లో దుర్వ్యవహారం, కొన్నిసార్లు చంపబడడం వంటివి ఉన్నప్పటికీ [తమ మతాన్ని విడిచిపెట్టడానికి] నిరాకరించడంలో ఎక్కువశాతం మంది చూపించిన ధైర్యం, వారి సమకాలీనులనేకులు వారిని గౌరవించేలా చేసింది.” ఆ తర్వాత అదిలా జతచేస్తోంది: “క్యాంపుల విముక్తి సమయంలో యెహోవాసాక్షులు కాపాడబడినవారితో కలివిడిగా ఉంటూ, వారిని మారుస్తూ తమ పనిని కొనసాగించారు.”

మరింత గొప్ప మార్పు

10. (ఎ) నిజమైన శాంతి రావాలంటే ఏ గొప్ప మార్పు అవసరం? (బి) ఇది దానియేలు గ్రంథంలో ఎలా చూపించబడింది?

10 క్రైస్తవ తటస్థతా విశ్వాసంలోకి సామూహిక మతమార్పిడులు చేయడం ద్వారా యెహోవాసాక్షులు మొత్తం ప్రపంచానికి శాంతిని తీసుకురాగలరని దీని భావమా? కాదు! భూమిపై శాంతి పునరుద్ధరించబడాలంటే, మరింత గొప్ప మార్పు అవసరం. అదేమిటి? అనైక్యత కలిగించే, అణిచివేసే, హింసాత్మకమైన మానవ పరిపాలన స్థానంలో, యేసు తన శిష్యులకు ఏ రాజ్యం కొరకైతే ప్రార్థించమని నేర్పించాడో ఆ దేవుని రాజ్యం రావాలి. (మత్తయి 6:9, 10) కాని అదెలా జరుగుతుంది? అంత్యదినములలో, ‘చేతిసహాయము లేక తీయబడిన’ ఒక పెద్ద రాయిలా దేవుని రాజ్యము భూమిపై మానవజాతి యొక్క రాజకీయ పరిపాలనకు ప్రాతినిధ్యం వహించే గొప్ప విగ్రహాన్ని తునాతునకలు చేస్తుందని ప్రవక్తయైన దానియేలు దైవికంగా ప్రేరేపించబడిన ఒక దర్శనం ద్వారా తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆయనిలా ప్రకటించాడు: “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికినీ నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయునుగాని అది యుగముల వరకు నిలుచును.”—దానియేలు 2:31-44.

11. శాంతి కొరకు అవసరమైన మార్పును యెహోవా దేని ద్వారా తీసుకువస్తాడు?

11 ప్రపంచ పరిస్థితిలో ఈ విపరీతమైన మార్పు ఎందుకు సంభవిస్తుంది? ఎందుకంటే, భూమిని కలుషితం చేసి దాన్ని పాడు చేస్తున్నవారినందరినీ భూమిపై నుండి నిర్మూలిస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. (ప్రకటన 11:18) సాతానుకు మరియు అతని దుష్ట ప్రపంచానికి వ్యతిరేకంగా యెహోవా చేసే నీతియుక్తమైన యుద్ధమప్పుడు ఈ మార్పు జరుగుతుంది. ప్రకటన 16:14, 15 నందు మనమిలా చదువుతాము: “అవి [అంటే, అపవిత్రాత్మలు] సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే; అవి సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులను [రాజకీయ పరిపాలకులను] పోగు చేయవలెనని వారియొద్దకు బయలు వెళ్లి, హెబ్రీ భాషలో హార్‌మెగిద్దోనను, చోటుకు వారిని పోగుచేసెను.”

12. అర్మగిద్దోను ఎలా ఉంటుంది?

12 అర్మగిద్దోను ఎలా ఉంటుంది? అది అణు యుద్ధమై ఉండదు, లేక మానవులు రేకెత్తించే వినాశనమై ఉండదు. అది మానవ యుద్ధాలన్నిటినీ అంతమొందించే దేవుని యుద్ధం, అంతేగాక అలాంటి యుద్ధాలను పెంపొందింపజేసే వారందరినీ నిర్మూలించే దేవుని యుద్ధం. శాంతిని ప్రేమించేవారికి నిజమైన శాంతిని తీసుకురావడానికి అది దేవుని యుద్ధం. అవును, యెహోవా సంకల్పించినట్లుగానే అర్మగిద్దోను వస్తోంది. అది ఆలస్యం కాదు. ఆయన ప్రవక్తయైన హబక్కూకు ఇలా వ్రాయడానికి ప్రేరేపించబడ్డాడు: “ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.” (హబక్కూకు 2:3) మన మానవ భావాల మూలంగా అది ఆలస్యమని అనిపించవచ్చు, కాని యెహోవా తన కాలపట్టికను అనుసరిస్తాడు. యెహోవా ముందుగానే నిర్ణయించిన సమయంలో అర్మగిద్దోను ప్రారంభమౌతుంది.

13. అసలు దోషియైన అపవాదియగు సాతానుతో దేవుడు ఎలా వ్యవహరిస్తాడు?

13 ఈ నిర్ణయాత్మకమైన చర్య నిజమైన శాంతికి మార్గాన్ని సరాళం చేస్తుంది! కాని నిజమైన శాంతి స్థిరంగా స్థాపించబడాలంటే, మరింకేదో జరగాలి, అంటే అనైక్యతకు, ద్వేషానికి, కలహానికి కారణమైనవారు నిర్మూలించబడాలి. తర్వాత అదే జరుగుతుందనీ—యుద్ధాన్ని పురికొల్పేవాడు, అబద్ధాలకు జనకుడు అయిన సాతాను అగాధంలో బంధించబడడం జరుగుతుందనీ బైబిలు ప్రవచిస్తోంది. ప్రకటన 20:1-3 నందు వ్రాయబడివున్నట్లుగా, అపొస్తలుడైన యోహాను ప్రవచనార్థక దర్శనములో ఈ సంఘటనను చూశాడు: “పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధముయొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి, ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్రవేసెను.”

14. సాతానుకు వ్యతిరేకంగా యెహోవా తీసుకునే విజయవంతమైన చర్యను ఎలా వర్ణించవచ్చు?

14 అది కల కాదు; అది దేవుని వాగ్దానం—‘దేవుడు అబద్ధమాడజాలడని’ బైబిలు చెబుతుంది. (హెబ్రీయులు 6:17) అందుకే యెహోవా తన ప్రవక్తయైన యిర్మీయా ద్వారా ఇలా చెప్పగలిగాడు: “భూమిమీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచునున్న యెహోవాను నేనే . . . అట్టి వాటిలో నేనానందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (యిర్మీయా 9:24) యెహోవా న్యాయంతో, నీతితో చర్య గైకొంటాడు, ఆయన తాను భూమి కొరకు తీసుకువచ్చే శాంతిని బట్టి ఆనందిస్తాడు.

సమాధానకర్తయగు అధిపతి ద్వారా పరిపాలన

15, 16. (ఎ) రాజుగా పరిపాలించడానికి యెహోవా ఎవరిని ఎంపిక చేసుకున్నాడు? (బి) ఆ పరిపాలన ఎలా వర్ణించబడింది, దానిలో ఎవరు భాగం వహిస్తారు?

15 యెహోవా తన రాజ్య ఏర్పాటు క్రింద జీవించే వారందరికీ నిజమైన శాంతి లభించేలా చూడడానికి నిజమైన సమాధానకర్తయగు అధిపతియైన యేసుక్రీస్తుకు పరిపాలనను అప్పగించాడు, యెషయా 9:6, 7 నందు అదిలా ప్రవచించబడింది: “ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను; ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు . . . సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తికలిగి దీనిని నెరవేర్చును.” మెస్సీయ యొక్క శాంతియుతమైన పరిపాలన గురించి కీర్తనల గ్రంథకర్త కూడా ప్రవచనార్థకంగా ఇలా వ్రాశాడు: “అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును.”—కీర్తన 72:7.

16 అంతేగాక, క్రీస్తు యొక్క 1,44,000 మంది ఆత్మాభిషిక్త సహోదరులు ఆయనతోపాటు పరలోకంలో పరిపాలిస్తారు. వీరు క్రీస్తుతోడి వారసులు, వారి గురించి పౌలు ఇలా వ్రాశాడు: “సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక.” (రోమీయులు 16:20) అవును, యుద్ధ పిపాసియైన అపవాదియగు సాతానుపై విజయం సాధించడంలో వీరు క్రీస్తుతోపాటు పాల్గొంటారు!

17. నిజమైన శాంతిని పొందడానికి మనం ఏమి చేయాలి?

17 కాబట్టి ఇప్పుడు ప్రశ్నేమిటంటే, నిజమైన శాంతిని పొందడానికి మీరేమి చేయాలి? నిజమైన శాంతి కేవలం దేవుని మార్గంలోనే రాగలదు, దాన్ని పొందడానికి మీరు అనుకూలమైన చర్యలు తీసుకోవాలి. మీరు సమాధానకర్తయగు అధిపతిని అంగీకరించి, ఆయనవైపు తిరగాలి. అంటే, మీరు పాపులైన మానవజాతి కొరకు విమోచన క్రయధనాన్ని చెల్లించే విమోచకుని పాత్రలోని క్రీస్తును అంగీకరించాలని భావం. యేసు తానే ప్రఖ్యాతి గాంచిన ఈ మాటలను చెప్పాడు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.” (యోహాను 3:16) నిజమైన శాంతినీ, రక్షణనూ తీసుకురావడానికైన దేవుని ప్రతినిధిగా క్రీస్తుయేసునందు విశ్వాసముంచడానికి మీరు ఇష్టపడుతున్నారా? శాంతిని నెలకొల్పి, దానికి హామీ ఇచ్చే మరో నామమేదీ ఆకాశం క్రింద లేదు. (ఫిలిప్పీయులు 2:8-11) ఎందుకు? ఎందుకంటే యేసు, దేవుడు ఎంపిక చేసుకున్న వ్యక్తి. ఆయన భూమిపై నడిచిన శాంతి సందేశకుల్లోకెల్లా అత్యంత గొప్పవాడు. మీరు యేసు చెప్పేది విని ఆయన మాదిరిని అనుసరిస్తారా?

18. యోహాను 17:3, NW నందు వ్రాయబడివున్న యేసు మాటలకు ప్రతిస్పందించి మనం ఏమి చేయాలి?

18 యేసు ఇలా చెప్పాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నునూ నీవు పంపిన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని పొందడమే నిత్యజీవము.” (యోహాను 17:3, NW) రాజ్యమందిరంలో యెహోవాసాక్షుల కూటాలకు క్రమంగా హాజరవ్వడం ద్వారా కచ్చితమైన జ్ఞానాన్ని పొందడానికి సమయమిదే. ఈ విద్యాసంబంధ కూటాలు మీరు మీ జ్ఞానాన్ని మీ నిరీక్షణను ఇతరులతో పంచుకునేలా మిమ్మల్ని పురికొల్పుతాయి. మీరు కూడా దేవుని శాంతికి రాయబారులు కావచ్చు. యెషయా 26:3 నందు చెప్పబడినట్లుగా, ఇప్పుడు యెహోవా దేవునియందు నమ్మకం ఉంచడం ద్వారా మీరు శాంతిని పొందవచ్చు, అక్కడిలా చెప్పబడింది: “ఎవనిమనస్సు నీమీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతిగలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు.” ఎవరియందు మీరు విశ్వాసముంచాలి? “యెహోవా యెహోవాయే నిత్యాశ్రయదుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి.”—యెషయా 26:4.

19, 20. నేడు శాంతిని వెదకి, దాన్ని వెంటాడేవారి కొరకు ఏమి వేచివుంది?

19 దేవుని శాంతియుతమైన నూతన లోకంలో నిత్యజీవం కొరకు మీరు ఇప్పుడే చర్య తీసుకోండి. ప్రకటన 21:3, 4 నందు, “ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని” దేవుని వాక్యం మనకు అభయమిస్తోంది. మీరు ఆకాంక్షించే శాంతియుతమైన భవిష్యత్తు అది కాదా?

20 మరి దేవుడు ఏమి వాగ్దానం చేశాడో జ్ఞాపకం చేసుకోండి. “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. బహు క్షేమము కలిగి సుఖించెదరు. నిర్దోషులను కనిపెట్టుము యథార్థవంతులను చూడుము సమాధానపరచువారి సంతతి నిలుచును.” (కీర్తన 37:11, 37) ఆ సంతోషభరితమైన దినం వచ్చినప్పుడు, మనం కృతజ్ఞతతో ఇలా చెబుదాము, “చివరికి నిజమైన శాంతి! నిజమైన శాంతికి మూలమైన యెహోవా దేవునికి కృతజ్ఞతలు!”

మీరు వివరించగలరా?

◻ ఆలోచనలోనూ, చర్యలోనూ మార్పులు చేసుకోవడానికి ఒకరికి ఏది సహాయం చేయగలదు?

◻ నిజమైన శాంతి ఎడల తమకున్న ప్రేమను యెహోవాసాక్షులు వ్యక్తిగతంగానూ, సామూహికంగానూ ఎలా చూపించారు?

◻ ద్వేషాన్ని, యుద్ధాన్ని వృద్ధి చేసేవారందరితో యెహోవా ఎలా వ్యవహరిస్తాడు?

◻ సమాధానకర్తయగు అధిపతి పరిపాలన మానవజాతి కొరకు ఏమి చేస్తుంది?

[14వ పేజీలోని చిత్రం]

యెషయా మాటలు ఐక్యరాజ్య సమితి ద్వారా కాదుగాని యెహోవా బోధకు ప్రతిస్పందించే వారి ద్వారా నెరవేర్చబడతాయి

[15వ పేజీలోని చిత్రం]

శాంతిని వెంటాడడానికి వీరిద్దరూ మార్పులు చేసుకున్నారు

రామీ ఓవెద్‌

గేర్గ్‌ రూటర్‌

[16వ పేజీలోని చిత్రం]

సమాధానకర్తయగు అధిపతి పరిపాలన క్రింద నిజమైన శాంతి వ్యాపిస్తుంది

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి