యెహోవా అనేకులైన కుమారులను మహిమకు తెస్తాడు
“అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట [దేవునికి] తగును.”—హెబ్రీయులు 2:10.
1. మానవాళి ఎడల యెహోవా సంకల్పం నెరవేరుతుందని మనమెందుకు నిశ్చయత కలిగి ఉండగలం?
యెహోవా అనంత జీవాన్ని అనుభవించే పరిపూర్ణ మానవ కుటుంబానికి నిత్య గృహంగా ఉండేందుకు భూమిని సృష్టించాడు. (ప్రసంగి 1:4; యెషయా 45:12, 18) నిజమే, మన పితరుడైన ఆదాము పాపం చేసి, పాపాన్నీ మరణాన్నీ తన సంతానానికి సంక్రమింపజేశాడు. కానీ మానవాళి ఎడల దేవుని సంకల్పం, ఆయన వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు ద్వారా నెరవేరుతుంది. (ఆదికాండము 3:15; 22:18; రోమీయులు 5:12-21; గలతీయులు 3:16) “తన అద్వితీయకుమారునిగా (జనితైక కుమారునిగా) పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహిం[చడానికి],” మానవాళి ఎడలగల ప్రేమ యెహోవాను కదిలించింది. (యోహాను 3:16) “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ని[వ్వడానికి]” యేసును కదిలించింది కూడా ప్రేమే. (మత్తయి 20:28) ఈ “[తత్సమానమైన] విమోచన క్రయధనము” ఆదాము మూలంగా పోగొట్టుకొన్న హక్కుల్నీ ఉత్తరాపేక్షల్నీ తిరిగి కొని, నిత్యజీవాన్ని సాధ్యంచేస్తుంది.—1 తిమోతి 2:5, 6; యోహాను 17:3.
2. ఇశ్రాయేలు వార్షిక ప్రాయశ్చిత్తార్థ దినం యేసు విమోచన క్రయధన బలి అన్వయింపుకు ఎలా సాదృశ్యంగా ఉంది?
2 వార్షిక ప్రాయశ్చిత్తార్థ దినం యేసు విమోచన క్రయధన బలి అన్వయింపుకు సాదృశ్యంగా ఉంది. ఆ దినాన, ఇశ్రాయేలు ప్రధాన యాజకుడు మొదట పాపపరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి, దాని రక్తాన్ని గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న పవిత్ర మందసంవద్దా, అటు తర్వాత కాలంలోనైతే ఆలయంలోని అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న పవిత్ర మందసంవద్దా అర్పించేవాడు. తన కోసమూ, తన ఇంటివారి కోసమూ, లేవీ గోత్రం కోసమూ ఇలా చేయడం జరిగేది. అదే విధంగా, యేసుక్రీస్తు తన రక్తం యొక్క విలువను మొదట తన ఆధ్యాత్మిక ‘సహోదరుల’ పాపాల్ని పరిహరించేందుకు దేవునికి అర్పించాడు. (హెబ్రీయులు 2:12; 10:19-22; లేవీయకాండము 16:6, 11-14) ప్రాయశ్చిత్తార్థ దినాన, ప్రధాన యాజకుడు పాపపరిహారార్థ బలిగా ఒక మేకను కూడా అర్పించి, దాని రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలో అర్పించేవాడు. ఆ విధంగా యాజకులుకాని ఇశ్రాయేలు 12 గోత్రాలవారి పాపాలకూ ప్రాయశ్చిత్తం జరిగేది. అదే విధంగా, విశ్వసించే మానవాళి పాపాల్ని తుడిచివేస్తూ వారి పక్షాన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు తన జీవరక్తాన్ని అన్వయిస్తాడు.—లేవీయకాండము 16:15.
మహిమకు తేబడ్డారు
3. హెబ్రీయులు 2:9, 10 ప్రకారంగా, 1,900 సంవత్సరాలుగా దేవుడు ఏమి చేస్తున్నాడు?
3 యేసు ‘సహోదరుల’ విషయమై దేవుడు 1,900 సంవత్సరాలుగా విశిష్టమైన ఒక పనిని చేస్తూ ఉన్నాడు. దీన్ని గురించి, అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున, మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, యెవనివలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన [ఆ యెహోవా దేవుడు] అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమలద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును.” (హెబ్రీయులు 2:9, 10) భూమిపై మానవునిగా జీవిస్తున్నప్పుడు తాననుభవించిన శ్రమలద్వారా సంపూర్ణ విధేయతను నేర్చుకున్న యేసుక్రీస్తే ఆ రక్షణకర్త. (హెబ్రీయులు 5:7-10) దేవుని ఆధ్యాత్మిక కుమారులుగా ఆత్మజనితులుగా చేయబడిన వారిలో యేసే మొదటివాడు.
4. యేసు దేవుని ఆధ్యాత్మిక కుమారునిగా ఎప్పుడు, ఎలా ఆత్మజనితునిగా చేయబడ్డాడు?
4 యేసును తన ఆధ్యాత్మిక కుమారునిగా ఆత్మజనితుణ్ణి చేయడానికీ, ఆయనను పరలోక మహిమకు తేవడానికీ యెహోవా తన పరిశుద్ధాత్మను లేక చురుకైన శక్తిని ఉపయోగించాడు. బాప్తిస్మమిచ్చు యోహానుతో ఒంటరిగా ఉన్నప్పుడు యేసు తనను తాను దేవునికి సమర్పించుకున్నదానికి గుర్తుగా నీటి బాప్తిస్మాన్ని పొందాడు. లూకా సువార్త వృత్తాంతమిలా చెబుతోంది: “ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసుకూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగివచ్చెను. అప్పుడు—నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.” (లూకా 3:21, 22) పరిశుద్ధాత్మ యేసు మీదికి రావడాన్ని యోహాను చూశాడు, యేసును తన ప్రియ కుమారునిగా బహిరంగంగా అంగీకరిస్తూ యెహోవా మాట్లాడడాన్ని కూడా ఆయన విన్నాడు. యెహోవా ఆ సమయంలోనే, ‘మహిమకు తేబడిన అనేకులైన కుమారుల్లో’ మొదటివానిగా యేసును పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మజనితుణ్ణి చేశాడు.
5. యేసు బల్యర్పణనుండి మొదట ప్రయోజనం పొందిన వారు ఎవరు, వారి సంఖ్య ఎంత?
5 యేసు బల్యర్పణనుండి మొదట ప్రయోజనాన్ని పొందినది ఆయన ‘సహోదురులే.’ (హెబ్రీయులు 2:12-18) గొఱ్ఱెపిల్లయైన పునరుత్థానుడైన ప్రభువగు యేసుక్రీస్తుతోపాటు పరలోక సీయోను పర్వతంపై వాళ్లు అప్పటికే మహిమలో ఉన్నట్లు అపొస్తలుడైన యోహాను దర్శనంలో చూశాడు. “నేను చూడగా, ఇదిగో, ఆ గొఱ్ఱెపిల్ల సీయోను పర్వతముమీద నిలువబడియుండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్లయందు లిఖింపబడియున్న నూట నలువది నాలుగు వేలమంది ఆయనతోకూడ ఉండిరి. . . . వీరు దేవుని కొరకును గొఱ్ఱెపిల్లకొరకును ప్రథమఫలముగా ఉండుటకై మనుష్యులలోనుండి కొనబడినవారు. వీరినోట ఏ అబద్ధమును కనబడలేదు; వీరు అనింద్యులు” అని చెబుతూ యోహాను వారి సంఖ్యను కూడా బయల్పర్చాడు. (ప్రకటన 14:1-5) కాబట్టి పరలోకంలో ‘మహిమకు తేబడిన అనేకులైన కుమారుల’ సంఖ్య—యేసూ, ఆయన ఆధ్యాత్మిక సహోదరులూ కలిపి మొత్తం—లక్షా నలుబది నాలుగువేల ఒకటి మాత్రమే.
‘దేవుని మూలముగా పుట్టడం’
6, 7. ‘దేవుని మూలంగా పుట్టిన’ వాళ్లెవరు, వారి విషయంలో దీని భావమేమిటి?
6 యెహోవాచే ఆత్మజనితులుగా చేయబడిన వారే ‘దేవుని మూలముగా పుట్టినవారు.’ అలాంటి వ్యక్తుల్ని సంబోధిస్తూ అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: “దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన [యెహోవా] బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు.” (1 యోహాను 3:9) ఈ “బీజము” దేవుని పరిశుద్ధాత్మే. అది ఆయన వాక్యంతో కలిసి పనిచేస్తూ, 1,44,000 మందిలోని ప్రతి ఒక్కరికీ పరలోక నిరీక్షణకు “క్రొత్త జన్మ”ను ఇచ్చింది.—1 పేతురు 1:3-5, 23, పవిత్ర గ్రంథం వ్యాఖ్యాన సహితం.
7 పరిపూర్ణుడైన ఆదాము ‘దేవుని కుమారుడై’ ఉండినట్టుగానే, యేసు తాను మానవునిగా పుట్టినప్పటినుండీ దేవుని కుమారునిగా ఉన్నాడు. (లూకా 1:35; 3:38) అయితే, యేసు బాప్తిస్మం పొందిన తర్వాత, “నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని” యెహోవా ప్రకటించడం విశిష్టమైన విషయమైవుంది. (మార్కు 1:11) ఈ విధమైన ప్రకటన చేయడంతో పాటు పరిశుద్ధాత్మను కుమ్మరించడం ద్వారా దేవుడు తన ఆధ్యాత్మిక కుమారునిగా అప్పుడు యేసును ఆత్మజనితుణ్ణి చేశాడన్న విషయం స్పష్టమయ్యింది. అలంకారికంగా చెప్పాలంటే, పరలోకంలో దేవుని ఆత్మకుమారునిగా మరోసారి జీవాన్ని పొందే హక్కుతో యేసుకు ‘క్రొత్త జన్మ’ అప్పుడు ఇవ్వబడింది. ఆయన వలే, ఆయన 1,44,000 మంది ఆధ్యాత్మిక సహోదరులు కూడా ‘క్రొత్తగా జన్మించారు.’ (యోహాను 3:1-8; కావలికోట ఫిబ్రవరి 15, 1993, పేజీలు 3-6 చూడండి.) యేసు వలే, వాళ్లు దేవునిచే అభిషేకించబడి, సువార్త ప్రకటించేందుకు నియమించబడ్డారు.—యెషయా 61:1, 2; లూకా 4:16-21; 1 యోహాను 2:20.
ఆత్మజనితులుగా చేయబడ్డారనడానికి రుజువు
8. ఆత్మజనితత్వాన్ని గూర్చిన ఏ రుజువులు (ఎ) యేసు విషయంలోనూ (బి) ఆయన తొలి శిష్యుల విషయంలోనూ ఉన్నాయి?
8 యేసు ఆత్మజనితునిగా చేయబడ్డాడనడానికి రుజువుంది. యేసు మీదికి ఆత్మ దిగి రావడాన్ని బాప్తిస్మమిచ్చు యోహాను చూశాడు, క్రొత్తగా అభిషిక్తుడైన మెస్సీయా ఆధ్యాత్మిక పుత్రత్వాన్ని గూర్చిన దేవుని ప్రకటనను ఆయన విన్నాడు. కానీ తామూ ఆత్మజనితులముగా చేయబడ్డామని యేసు శిష్యులెలా తెలుసుకుంటారు? యేసు తాను పరలోకానికి ఆరోహణమయ్యే రోజున ఇలా అన్నాడు: “యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెద[రు].” (అపొస్తలుల కార్యములు 1:5) సా.శ. 33 పెంతెకొస్తు పండుగనాడు యేసు శిష్యులు “పరిశుద్ధాత్మలో బాప్తిస్మము” పొందారు. పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు, ‘ఆకాశమునుండి వచ్చిన వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని’ వినిపించింది. “అగ్నిజ్వాలలవంటి నాలుకలు” వారిలో ఒక్కొక్కని మీద వ్రాలాయి. అన్నిటికన్నా గమనార్హమైన విషయం, “ఆ ఆత్మ వారికి వాక్‌శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలా[డేలా]” శిష్యులకివ్వబడిన సామర్థ్యమే. కాబట్టి క్రీస్తు అనుచరులు, దేవుని కుమారులుగా పరలోక మహిమలోనికి ప్రవేశించడానికి మార్గం తెరవబడిందనడానికి దృశ్య, శ్రవణ రుజువనేది ఉంది.—అపొస్తలుల కార్యములు 2:1-4, 14-21; యోవేలు 2:28, 29.
9. సమరయులూ, కొర్నేలీ, మొదటి శతాబ్దంలోని మరితరులూ ఆత్మజనితులయ్యారనడానికి ఏ రుజువు ఉంది?
9 అటు తర్వాత కొంత కాలానికి, సువార్తికుడైన ఫిలిప్పు సమరయలో ప్రకటించాడు. సమరయులు ఆయన సందేశాన్ని అంగీకరించి, బాప్తిస్మం పొందినప్పటికీ, దేవుడు తమను తన కుమారులుగా ఆత్మజనితులను చేశాడనే రుజువు వారికి లేదు. అపొస్తలులైన పేతురు యోహానులు ప్రార్థనచేసి, ఆ విశ్వాసులపై చేతులుంచినప్పుడు “వారు పరిశుద్ధాత్మను పొందిరి.” ఆ విషయం చూపరులకు ఏదొకరీతిలో స్పష్టమయ్యింది. (అపొస్తలుల కార్యములు 8:4-25) విశ్వసిస్తున్న సమరయులు దేవుని కుమారులుగా ఆత్మజనితులయ్యారనడానికి ఇది రుజువైవుంది. అదే విధంగా, సా.శ. 36లో కొర్నేలీ మరితర అన్యులూ దేవుని సత్యాన్ని అంగీకరించారు. పేతురూ ఆయనతోపాటు వెళ్లిన విశ్వాసులైన యూదులూ, “పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింపబడుట చూచి, విభ్రాంతినొందిరి. ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి.” (అపొస్తలుల కార్యములు 10:44-48) భాషలలో మాట్లాడడంవంటి “ఆత్మసంబంధమైన వరముల”ను మొదటి శతాబ్దంలోని అనేకమంది క్రైస్తవులు పొందారు. (1 కొరింథీయులు 14:12, 31) ఆ విధంగా, తాము ఆత్మజనితులుగా చేయబడ్డామనే స్పష్టమైన రుజువును ఆ వ్యక్తులు కల్గివున్నారు. కానీ తాము ఆత్మజనితులముగా చేయబడ్డామా లేదా అనే విషయం తర్వాతి కాలాల్లోని క్రైస్తవులెలా తెలుసుకుంటారు?
ఆత్మ సాక్ష్యం
10, 11. రోమీయులు 8:15-17 వచనాల ఆధారంగా, క్రీస్తు సహవారసులైన వారితో ఆత్మ సాక్ష్యమిస్తుందన్న విషయాన్ని మీరెలా వివరిస్తారు?
10 తమకు దేవుని ఆత్మ ఉందనే సంపూర్ణ రుజువును అభిషేకించబడిన క్రైస్తవులైన మొత్తం 1,44,000 మందీ కల్గివున్నారు. ఈ విషయంలో, పౌలు ఇలా రాశాడు: “మీరు . . . దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగినవారమై మనము—అబ్బా తండ్రీ అని మొఱ్ఱ పెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడ సాక్ష్యమిచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము; క్రీస్తుతో కూడ మహిమపొందుటకు ఆయనతో శ్రమపడినయెడల, క్రీస్తుతోడి వారసులము.” (ఇటాలిక్కులు మావి.) (రోమీయులు 8:15-17) అభిషిక్త క్రైస్తవులకు తమ పరలోకపు తండ్రి ఎడల కుమారులు చూపించే ప్రేమ అంటే ప్రబలమైన పుత్రత్వపు భావన ఉంటుంది. (గలతీయులు 4:6, 7) పరలోకపు రాజ్యంలో క్రీస్తుతో సహపాలకులుగా ఆధ్యాత్మిక పుత్రత్వాన్ని పొందేందుకు దేవుడు తమను ఆత్మజనితులనుగా చేశాడనడంలో వాళ్లకు ఇసుమంతైనా సంశయంలేదు. ఈ విషయంలో, యెహోవా పరిశుద్ధాత్మ ఓ నిర్దిష్టమైన పాత్రను పోషిస్తోంది.
11 దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం క్రింద, అభిషిక్తుల స్ఫూర్తి లేక వారి ప్రబల మనోవైఖరి, పరలోక నిరీక్షణ గురించి దేవుని వాక్యం చెబుతున్న దానికి అనుకూలమైన రీతిలో ప్రతిస్పందించేలా వారిని ప్రేరేపిస్తుంది. ఉదాహరణకు, యెహోవా దేవుని ఆధ్యాత్మిక పిల్లల్ని గురించి లేఖనాలు చెబుతున్న వాటిని వాళ్లు చదివినప్పుడు, ఆ మాటలు తమకు వర్తిస్తాయని వాళ్లు వెంటనే గుర్తిస్తారు. (1 యోహాను 3:2) “క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము” పొందామనీ, ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందామనీ వారికి తెలుసు. (రోమీయులు 6:3) యేసువలే, తామూ మరణించి పరలోక మహిమలోనికి పునరుత్థానం కాబోయే దేవుని ఆధ్యాత్మిక కుమారులమేనన్న దృఢ నమ్మకం వారికుంది.
12. అభిషిక్త క్రైస్తవుల్లో దేవుని ఆత్మ దేన్ని పుట్టించింది?
12 ఆధ్యాత్మిక పుత్రత్వాన్ని పొందేందుకు ఆత్మజనితులుగా చేయబడటమనేది పెంపొందించుకొనిన అభిలాషకాదు. ఆత్మజనితులు భూమిపైనున్న ప్రస్తుత కష్టాలకు కలతచెందినందున పరలోకానికి వెళ్లాలనుకోరు. (యోబు 14:1) బదులుగా, నిజంగా అభిషేకించబడిన వ్యక్తులలో యెహోవా ఆత్మ, సామాన్య మానవాళికి అసాధారణమైన నిరీక్షణనూ కోరికనూ పుట్టిస్తుంది. సంతోషకరమైన కుటుంబంతోనూ, స్నేహితులతోనూ నిండివుండే పరదైసు భూమిపై మానవ పరిపూర్ణతతో కూడిన నిత్యజీవం అద్భుతకరంగా ఉంటుందని అలాంటి ఆత్మజనితులకు తెలుసు. అయితే, వారి హృదయాల్లోని ప్రధానమైన అభిలాష అలాంటి జీవితం కాదు. భూ సంబంధమైన ఉత్తరాపేక్షలన్నిటినీ, బాంధవ్యాలన్నిటినీ ఇష్టపూర్వకంగా త్యజించేంతటి బలమైన పరలోక నిరీక్షణ అభిషిక్తులకుంటుంది.—2 పేతురు 1:13, 14.
13. రెండవ కొరింథీయులు 5:1-5 వచనాల ప్రకారంగా, పౌలు యొక్క ‘తీవ్రమైన అపేక్ష’ ఏమిటి, ఆత్మజనితుల్ని గూర్చి ఇదేమి సూచిస్తుంది?
13 అలాంటి వారిలో దేవుడు అనుగ్రహించిన పరలోక జీవ నిరీక్షణ అనేది ఎంత బలంగా ఉంటుందంటే, “భూమిమీద మన గుడారమైన యీ నివాసము శిధిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనినవారముగా కనబడుదుము. కాబట్టి పరలోకమునుండివచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసికొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని మర్త్యమైనది జీవముచేత మ్రింగివేయబడునట్లు, ఆ నివాసమును దీనిపైని ధరించుకొన గోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరచినవాడు దేవుడే; మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు” అని రాసిన పౌలుకున్న భావాలవంటి భావాలనే వాళ్లూ కల్గివున్నారు. (2 కొరింథీయులు 5:1-5) అమర్త్యమైన ఆత్మప్రాణిగా పరలోకానికి పునరుత్థానమవ్వాలనేది పౌలు యొక్క ‘తీవ్రమైన అపేక్ష.’ మానవ దేహాన్ని సూచిస్తూ, గృహాంతో పోల్చినప్పుడు, నాజూకుగా తాత్కాలికమైనదిగా ఉండే, సులభంగా మడతపెట్టి తీసుకుపోగలిగే గుడారాన్ని గూర్చిన రూపకాలంకారాన్ని ఆయన ఉపయోగించాడు. పొందబోయే పరలోక జీవపు సంచకరువుగా పరిశుద్ధాత్మను కల్గివున్న క్రైస్తవులు మర్త్యమైన భౌతిక శరీరంతో భూమిపై జీవిస్తున్నప్పటికీ, అమర్త్యమైన అక్షయమైన ఆత్మ శరీరమైనటువంటి, ‘దేవునిచే కట్టబడిన నివాసం’ కొరకు ఎదురు చూస్తారు. (1 కొరింథీయులు 15:50-53) “మేము నిబ్బరంగా ఉండి, శరీరంలో ఉండడంకంటె [మానవ] శరీరాన్ని విడిచివెళ్లి ప్రభువుతో, ఆయన నివాసంలో [పరలోకంలో] ఉండడమే మాకు ఇష్టం” అని పౌలు వలే వాళ్లూ హృదయపూర్వకంగా చెప్పగలరు.—2 కొరింతు 5:8, పవిత్ర గ్రంథం—వ్యాఖ్యాన సహితం.
ప్రత్యేక నిబంధనలలోకి తీసుకోబడ్డారు
14. జ్ఞాపకార్థ దిన ఆచరణను ప్రారంభిస్తున్నప్పుడు, యేసు ఏ నిబంధనను మొదట ప్రస్తావించాడు, ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులకు సంబంధించి అది ఏ పాత్రను నిర్వహిస్తోంది?
14 తాము రెండు ప్రత్యేకమైన నిబంధనలలోనికి తీసుకోబడ్డామని ఆత్మజనిత క్రైస్తవులకు కచ్చితంగా తెలుసు. తాను పొందబోయే మరణం యొక్క జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించేందుకు పులియని రొట్టెనూ, ద్రాక్షారసాన్నీ యేసు ఉపయోగించినప్పుడు, ఈ నిబంధనల్లో ఒకదాన్ని ఆయన ప్రస్తావించి, ద్రాక్షారసపు గిన్నెను గూర్చి ఇలా చెప్పాడు: “ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన.” (లూకా 22:20; 1 కొరింథీయులు 11:25) క్రొత్త నిబంధనలోని ఇరు వర్గాలవారు ఎవరెవరు? యెహోవా దేవుడూ, ఎవరినైతే పరలోక మహిమలోనికి తేవాలని యెహోవా సంకల్పించాడో ఆ ఆధ్యాత్మిక ఇశ్రాయేలులోని సభ్యులూ. (యిర్మీయా 31:31-34; గలతీయులు 6:15, 16; హెబ్రీయులు 12:22-24) యేసు చిందించిన రక్తంచే అమలులోనికి వచ్చిన ఈ క్రొత్త నిబంధన, జనాంగాల్లోనుండి యెహోవా నామం కొరకు ఒక ప్రజను ఏర్పాటుచేసి, అలా ఏర్పాటు చేసిన ఆత్మజనిత క్రైస్తవుల్ని అబ్రాహాము ‘సంతానంలో’ భాగంగా చేస్తుంది. (గలతీయులు 3:26-29; అపొస్తలుల కార్యములు 15:14) ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులందరూ పరలోకంలో అమర్త్యమైన జీవాన్ని పొందేందుకు పునరుత్థానం చేయబడడం ద్వారా మహిమలోనికి తేబడేలా క్రొత్త నిబంధన ఏర్పాటు చేస్తోంది. ఇది ‘నిత్య నిబంధన’ అయ్యున్నందున, దీని ప్రయోజనాలూ నిత్యం ఉంటాయి. ఈ నిబంధన వెయ్యేండ్ల పరిపాలనా కాలంలోనూ, అటు తర్వాతా ఇతర విధాలుగా ఒక పాత్రను నిర్వహిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.—హెబ్రీయులు 13:20.
15. లూకా 22:28-30 వచనాలకు అనుగుణ్యంగా, యేసు అభిషిక్త అనుచరులు ఏ ఇతర నిబంధనలోనికి తీసుకోబడడం ప్రారంభమైంది, ఎప్పుడు?
15 ‘మహిమకు తెచ్చేందుకు’ యెహోవా సంకల్పించిన “అనేకులైన కుమారులు” పరలోక రాజ్యం కొరకైన నిబంధనలోనికి ఒక్కొక్కరుగా కూడా తీసుకోబడ్డారు. తనకూ, తన అడుగుజాడల్లో నడిచే అనుచరులకూ మధ్యనున్న ఈ నిబంధనను గూర్చి యేసు ఇలా అన్నాడు: “నా శోధనలలో నాతో కూడ నిలిచి యున్నవారు మీరే; గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని, సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి మీరు తీర్పుతీర్చుటకై, నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను.” (లూకా 22:28-30) సా.శ. 33 పెంతెకొస్తునాడు యేసు శిష్యులు పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు ఈ రాజ్య నిబంధన ప్రారంభించబడింది. క్రీస్తుకూ, ఆయన సహ రాజులకూ మధ్య ఆ నిబంధన నిత్యమూ అమలులో ఉంటుంది. (ప్రకటన 22:5) కాబట్టి, తాము క్రొత్త నిబంధనలోనూ, రాజ్యం కొరకైన నిబంధనలోనూ ఉన్నామనే విషయం ఆత్మజనిత క్రైస్తవులకు రూఢిగా తెలుసు. కాబట్టి, సాపేక్షికంగా చూస్తే భూమిపై మిగిలివున్న చాలా కొద్దిమంది అభిషిక్తులు మాత్రమే ప్రభురాత్రి భోజన ఆచరణలలో అంటే పాపరహితమైన యేసు శరీరానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రొట్టెలోనూ, క్రొత్త నిబంధనను అమలులోకి తెచ్చేందుకు యేసు మరణమందు చిందించబడిన ఆయన పరిపూర్ణ రక్తాన్ని సూచిస్తున్న ద్రాక్షారసంలోనూ భాగం వహిస్తారు.—1 కొరింథీయులు 11:23-26; కావలికోట ఫిబ్రవరి 1, 1990 పేజీలు 17-20.
పిలువబడినవారు, ఏర్పరచబడినవారు, నమ్మకమైనవారు
16, 17. (ఎ) మహిమలోనికి తేబడేందుకు 1,44,000 మందిలోని అందరి విషయంలో ఏది వాస్తవమై ఉండాలి? (బి) “పదిమంది రాజులు” ఎవరు, క్రీస్తు భూసంబంధ ‘సహోదరుల’ శేషంతో వారెలా వ్యవహరిస్తున్నారు?
16 యేసు అర్పించిన విమోచన క్రయధన బలి మొదటి అన్వయింపు, 1,44,000 మంది పరలోక జీవానికి పిలువబడిన వారిగా ఉండడాన్నీ, దేవునిచే ఆత్మజనితులుగా చేయబడడం ద్వారా ఏర్పర్చబడిన వారిగా ఉండడాన్నీ సాధ్యం చేస్తుంది. అయితే, వాళ్లు మహిమకు తేబడేందుకు ‘తమ పిలుపునూ ఏర్పాటునూ నిశ్చయపర్చుకోవడానికి తమ శక్తిమేరకు తాము చేయాలి,’ వాళ్లు మరణం వరకూ నమ్మకముగా ఉండాలి. (2 పేతురు 1:10; ఎఫెసీయులు 1:3-7; ప్రకటన 2:10) ఇప్పటికీ భూమిపై మిగిలివున్న అభిషిక్తుల చిన్న గుంపు, రాజకీయ శక్తులన్నింటినీ సూచిస్తున్న “పదిమంది రాజు[ల]”చే వ్యతిరేకించబడుతున్నప్పటికీ తమ యథార్థతను కాపాడుకుంటూ ఉంది. “వీరు గొఱ్ఱెపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచబడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును” అని ఒక దేవదూత చెప్పాడు.—ప్రకటన 17:12-14.
17 ‘రాజులకు రాజైన’ యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నందున మానవ పాలకులు ఆయన్నేమీ చేయలేరు. కానీ ఇప్పటికీ భూమిపై ఉన్న ఆయన ‘సహోదరుల్లో’ శేషించిన వారి ఎడల వాళ్లు శత్రుత్వాన్ని ప్రదర్శిస్తారు. (ప్రకటన 12:17) ‘రాజులకు రాజు’కూ ‘పిలువబడినవారూ, యేర్పరచబడినవారూ, నమ్మకమైనవారూ’ అయిన ఆయన సహోదరులకూ విజయం తథ్యమైనప్పుడు అంటే, దేవుని యుద్ధమైన అర్మగిద్దోనులో ఆ శతృత్వం అంతమౌతుంది. (ప్రకటన 16:14, 16) ఈలోగా, ఆత్మజనిత క్రైస్తవులు ఎంతో బిజీగా ఉన్నారు. యెహోవా వారిని మహిమలోనికి తేవడానికి మునుపు, వాళ్లిప్పుడేం చేస్తున్నారు?
మీ జవాబు ఏమిటి?
◻ దేవుడు ఎవరిని ‘పరలోక మహిమలోనికి తెస్తాడు’?
◻ ‘దేవుని మూలంగా పుట్టడం’ అంటే భావమేమిటి?
◻ కొంతమంది క్రైస్తవులతో ‘ఆత్మ’ ఎలా ‘సాక్ష్యమిస్తుంది’?
◻ ఆత్మజనితులు ఏ నిబంధనలలోనికి తీసుకోబడ్డారు?
[15వ పేజీలోని చిత్రం]
సా.శ. 33 పెంతెకొస్తునాడు, పరలోక మహిమలోనికి మార్గం తెరవబడిందనడానికి రుజువు ఇవ్వబడింది