కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w24 ఏప్రిల్‌ పేజీలు 2-7
  • “పరిణతి సాధించే దిశగా ముందుకు” సాగిపోండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “పరిణతి సాధించే దిశగా ముందుకు” సాగిపోండి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరిణతిగల క్రైస్తవులుగా అవ్వడం అంటే ఏంటి?
  • పరిణతిగల క్రైస్తవులుగా ఎలా ఎదగవచ్చు?
  • గట్టి ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?
  • పరిణతి సాధించేశాం అనుకోకండి
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • చివరివరకు నమ్మకంగా సహించడానికి సహాయం చేసే ఉత్తరం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
    2025-2026 ప్రాంతీయ సమావేశ కార్యక్రమం, ప్రాంతీయ పర్యవేక్షకునితో
  • మీరు క్రీస్తులాంటి పరిణతిని సాధించడానికి కృషిచేస్తున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
w24 ఏప్రిల్‌ పేజీలు 2-7

అధ్యయన ఆర్టికల్‌ 14

పాట 56 సత్య మార్గంలో నడవండి

“పరిణతి సాధించే దిశగా ముందుకు” సాగిపోండి!

“పరిణతి సాధించే దిశగా ముందుకు సాగిపోదాం.” —హెబ్రీ. 6:1.

ముఖ్యాంశం

ఒక పరిణతిగల క్రైస్తవుడు దేవుని ఇష్టానికి తగ్గట్టు ఎలా ఆలోచిస్తాడో, ఎలాంటి పనులు చేస్తాడో, దానివల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూస్తాం.

1. మనం ఎలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు?

పెళ్లయినవాళ్లకు బిడ్డ పుట్టినప్పుడు వాళ్ల సంతోషం అంతాఇంతా కాదు. వాళ్లు పసికందుగా ఉన్న ఆ బిడ్డను చూసి ఎంతో మురిసిపోతారు. అయితే, ఆ బిడ్డ అలా ఎప్పటికీ పసికందుగానే ఉండిపోవాలని వాళ్లు కోరుకోరు. నిజానికి ఆ బిడ్డ ఎదగకపోతుంటే వాళ్లలో గాభరా మొదలౌతుంది. అదేవిధంగా, మనం యేసును అనుసరించడానికి బుడిబుడి అడుగులు వేస్తున్నప్పుడు యెహోవా సంతోషం కూడా అంతాఇంతా కాదు. అలాగని మనం ఆధ్యాత్మికంగా పసికందులుగానే ఉండిపోవాలని ఆయన కోరుకోవట్లేదు. (1 కొరిం. 3:1) దానికి బదులు, మనం ఆధ్యాత్మికంగా “పెద్దవాళ్లలా” ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు.—1 కొరిం. 14:20.

2. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

2 ఆధ్యాత్మికంగా పెద్దవాళ్లలా ఉండడం అంటే ఏంటి? పరిణతిగల క్రైస్తవులుగా ఎలా ఎదగవచ్చు? అలా ఎదగాలంటే గట్టి ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? పరిణతి సాధించేశామని ఎందుకు అనుకోకూడదు? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

పరిణతిగల క్రైస్తవులుగా అవ్వడం అంటే ఏంటి?

3. ఆధ్యాత్మికంగా పెద్దవాళ్లలా ఉండడం అంటే ఏంటి?

3 బైబిల్లో, “పెద్దవాళ్లలా” ఉండడం అని అనువదించబడిన గ్రీకు పదానికి “పరిణతి” అనే అర్థం వస్తుంది.a (1 కొరిం. 2:6) చంటిబిడ్డలు ఎలాగైతే ఎదుగుతూ పెద్దవాళ్లు అవుతారో అదేవిధంగా, యెహోవాతో మన సంబంధం కూడా ఎదుగుతూ ఉండాలి. అప్పుడే మనం పరిణతిగల క్రైస్తవులుగా అవుతాం. అలా అయ్యాక కూడా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండాలి! (1 తిమో. 4:15) యౌవనులతో సహా, మనందరం ఆధ్యాత్మికంగా పరిణతి సాధించగలం. అయితే, ఒకవ్యక్తి పరిణతి సాధించాడని ఎలా తెలుస్తుంది?

4. పరిణతిగల క్రైస్తవుడు ఎలా ఉంటాడు?

4 ఒక పరిణతిగల క్రైస్తవుడు తనకు నచ్చింది చేయడు. అతనికి యెహోవా మాటే శాసనం! నిజమే, అతను అపరిపూర్ణుడు కాబట్టి కొన్నిసార్లు పొరపాట్లు చేయడం సహజం. అయినాసరే, తన జీవితంలో యెహోవా ఇష్టానికి తగ్గట్టుగా ఆలోచిస్తాడు, పనులు చేస్తాడు. అతను కొత్త వ్యక్తిత్వాన్ని ధరిస్తాడు, యెహోవా ఆలోచనల్ని తన ఆలోచనలుగా చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. (ఎఫె. 4:22-24) అతనికి ఇలా చేయాలి, అలా చేయాలి అనే రూల్స్‌ అవసరం ఉండదు. ఎందుకంటే యెహోవా నియమాలు, సూత్రాల ప్రకారం తెలివైన నిర్ణయాలు తీసుకునేలా తనకు తాను శిక్షణ ఇచ్చుకున్నాడు. తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండేంత క్రమశిక్షణ అతనికి ఉంటుంది.—1 కొరిం. 9:26, 27.

5. పరిణతి సాధించని క్రైస్తవుడు ఎలా ఉంటాడు? (ఎఫెసీయులు 4:14, 15)

5 ఇంకోవైపు, పరిణతి సాధించని క్రైస్తవుడైతే ‘కుయుక్తులకు, మోసం చేసేవాళ్ల తప్పుడు బోధలకు’ ఇట్టే పడిపోతాడు. మీడియాలో చక్కర్లు కొట్టే తప్పుడు విషయాలను, గాలి వార్తలను, పుకార్లను ఈజీగా నమ్మేస్తాడు. అతను మతభ్రష్టుల బుట్టలో కూడా పడిపోవచ్చు.b (ఎఫెసీయులు 4:14, 15 చదవండి.) అతను వేరేవాళ్లను చూసి కుళ్లుకుంటాడు, గొడవలు పెట్టుకుంటాడు, చిన్నచిన్న విషయానికే మొహం మాడ్చుకుంటాడు, ఒత్తిళ్లను అస్సలు తిప్పికొట్టలేడు.—1 కొరిం. 3:3.

6. పరిణతి సాధించడాన్ని పిల్లలు ఎదగడంతో ఎలా పోల్చవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

6 ఆధ్యాత్మికంగా పరిణతి సాధిస్తూ ఎదగడాన్ని, పిల్లవాడు ఎదుగుతూ పెద్దవ్వడంతో బైబిలు పోలుస్తుంది. ఒక పిల్లవాడు సొంతగా ఆలోచించుకోలేడు. కాబట్టి పెద్దవాళ్ల సంరక్షణ, నడిపింపు అవసరం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ గమనించండి. రోడ్డు దాటుతున్నప్పుడు ఒక తల్లి తన చేయి పట్టుకోమని తన పాపకు చెప్తుంది. ఆ పాప కాస్త ఎదుగుతున్నప్పుడు, సొంతగా రోడ్డు దాటడానికి ఆ తల్లి అనుమతిస్తుంది కానీ రోడ్డు దాటేటప్పుడు అటూఇటూ చూసుకోమని చెప్తుంది. ఆ పాప ఎదిగి పెద్దయ్యాక, తనే సొంతగా రోడ్డును జాగ్రత్తగా దాటేస్తుంది. పిల్లలు ప్రమాదాల్ని తప్పించుకోవడానికి పెద్దల సహాయం కావాలి. అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రమాదాలు తప్పించుకొని, తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి పరిణతి సాధించని క్రైస్తవులకు పరిణతి సాధించిన క్రైస్తవుల సహాయం అవసరం. మరోవైపు, పరిణతి సాధించిన క్రైస్తవుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు బైబిలు సూత్రాల మీద ఆధారపడి, యెహోవా ఆలోచనల్ని తెలుసుకుని, సరైంది చేస్తాడు.

చిత్రాలు: 1. ఒక టీనేజీ సిస్టర్‌ వాళ్ల మమ్మీడాడీ మాట్లాడుతుంటే వింటుంది. తన ట్యాబ్‌లో ఒక ఆర్టికల్‌ తెరిచి ఉంది, ఆమె మమ్మీడాడీ బైబిలు తెరిచి పట్టుకున్నారు. 2. ఆ సిస్టర్‌ తన బైబిలు, నోట్‌బుక్‌, ట్యాబ్‌ ఉపయోగించి వ్యక్తిగత అధ్యయనం చేస్తుంది. సర్కిల్‌లో ఉన్న చిత్రాలు: 1. ఒక తల్లి రోడ్డు దాటుతున్నప్పుడు తన పాప చేయి పట్టుకొని ఉంది, రోడ్డు దాటుతున్నప్పుడు అటూఇటూ చూసుకోమని పాపకు గుర్తుచేస్తుంది. 2. ఆ పాప పెద్దయ్యాక సొంతగా రోడ్డు దాటుతుంది.

పరిణతి సాధించని క్రైస్తవులు బైబిలు సూత్రాల్ని పాటిస్తూ తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలో నేర్చుకోవాలి (6వ పేరా చూడండి)


7. పరిణతి సాధించిన క్రైస్తవుడికి ఎవ్వరి సహాయం అవసరం లేదా?

7 పరిణతి సాధించిన క్రైస్తవుడికి ఇక ఎవ్వరి సహాయం అవసరం లేదా? కొన్నిసార్లు వాళ్లకు కూడా సహాయం అవసరమే! కానీ పరిణతి సాధించని వ్యక్తి ఏం చేయాలో, ఏ నిర్ణయం తీసుకోవాలో ఇతరులు తనకు చెప్పాలని ఆశిస్తాడు. అదే పరిణతి సాధించిన క్రైస్తవుడైతే తెలివి, అనుభవం ఉన్నవాళ్ల దగ్గర సలహా అడిగి, సొంతగా నిర్ణయం తీసుకుంటాడు. అలా యెహోవా కోరుకున్నట్టు, “తన బరువు తానే” మోసుకుంటాడు.—గల. 6:5.

8. పరిణతి సాధించిన క్రైస్తవుల్లో ఎలాంటి తేడాలుంటాయి?

8 ఎదిగిన పిల్లలు అందరూ చూడ్డానికి ఒకేలా ఉండరు. అదేవిధంగా, పరిణతి సాధించిన క్రైస్తవులు కూడా ఒకేలా ఉండరు. వాళ్లలో వేర్వేరు లక్షణాలు ఉంటాయి. ఉదాహరణకు, కొంతమందికి బాగా తెలివితేటలు ఉండవచ్చు. ఇంకొంతమందికి ధైర్యం ఎక్కువుండొచ్చు. మరికొంతమందికి ఇచ్చే గుణం ఉండవచ్చు. అలాగే ఇంకొంతమందికి, ఇతరుల్ని అర్థం చేసుకునే గుణం ఉండవచ్చు. అంతెందుకు, ఇద్దరు పరిణతి సాధించిన క్రైస్తవులకు ఒకేలాంటి పరిస్థితి వస్తే, వాళ్లిద్దరూ వేర్వేరు నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ ఆ నిర్ణయాలు బైబిలుకు అనుగుణంగానే ఉంటాయి. ముఖ్యంగా, మనస్సాక్షిని బట్టి తీసుకునే నిర్ణయాల్లో అలా జరుగుతుంది. కాబట్టి, వాళ్ల నిర్ణయాల్లో ఉన్న తేడాల్ని బట్టి వాళ్లు ఒకరినొకరు వేలెత్తి చూపించుకోరు గానీ ఐక్యంగా ఉంటారు.—రోమా. 14:10; 1 కొరిం. 1:10.

పరిణతిగల క్రైస్తవులుగా ఎలా ఎదగవచ్చు?

9. ఆధ్యాత్మికంగా పరిణతి సాధించడం దానంతటదే జరిగే పని కాదని ఎలా చెప్పవచ్చు?

9 పిల్లలు చూస్తుండగానే పెద్దవాళ్లు అయిపోతారు. కానీ ఆధ్యాత్మికంగా పరిణతి సాధించడం అనేది దానంతటదే జరిగే పనికాదు. ఉదాహరణకు, కొరింథులో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌నే తీసుకుంటే వాళ్లు మంచివార్తను అంగీకరించారు, బాప్తిస్మం తీసుకున్నారు, పవిత్రశక్తిని పొందారు, పౌలు స్వయంగా చెప్పిన విషయాల నుండి చాలా నేర్చుకున్నారు. (అపొ. 18:8-11) కానీ వాళ్లలో చాలామంది బాప్తిస్మం తీసుకున్న ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా పరిణతి సాధించకుండా అక్కడే ఆగిపోయారు. (1 కొరిం. 3:2) మరి మనం అలా ఉండకూడదంటే ఏం చేయాలి?

10. పరిణతి సాధించాలంటే మనమేం చేయాలి? (యూదా 20)

10 మనం పరిణతి సాధించాలంటే, ముందు పరిణతి సాధించాలనే కోరికను పెంచుకోవాలి. “అజ్ఞానాన్ని” ప్రేమించేవాళ్లు ఆధ్యాత్మికంగా పసి పిల్లలుగా ఉండిపోవాలని కోరుకుంటారు కాబట్టి వాళ్లలో ఎలాంటి ఎదుగుదల ఉండదు. (సామె. 1:22) కొంతమంది ఎంత పెద్దవాళ్లయినా సొంతగా నిర్ణయాలు తీసుకోవడానికి భయపడి, అమ్మానాన్నల్ని అడుగుతుంటారు. మనం వాళ్లలా ఉండాలని అస్సలు అనుకోం. బదులుగా, ఆధ్యాత్మికంగా పరిణతి సాధించే మన బాధ్యతను మనమే తీసుకుంటాం. (యూదా 20 చదవండి.) ఒకవేళ మీరు ఇంకా పరిణతి సాధించడానికి కృషి చేస్తుంటే ఆ “కోరికను, దాని ప్రకారం ప్రవర్తించే శక్తిని” ఇవ్వమని యెహోవాకు ప్రార్థించండి.—ఫిలి. 2:13.

11. పరిణతి సాధించడానికి యెహోవా మనకు ఎలా సహాయం చేస్తున్నాడు? (ఎఫెసీయులు 4:11-13)

11 మనంతట మనమే పరిణతి సాధించాలని యెహోవా కోరుకోవట్లేదు. ఆయన మనకోసం సంఘంలో కాపరుల్ని, బోధకుల్ని ఇచ్చాడు. వాళ్లు మనం ఆధ్యాత్మికంగా పెద్దవాళ్లం అయ్యేలా, “క్రీస్తులా పూర్తిస్థాయిలో పరిణతి” సాధించేలా సహాయం చేస్తారు. (ఎఫెసీయులు 4:11-13 చదవండి.) యెహోవా మనకు పవిత్రశక్తి కూడా ఇస్తాడు. దానివల్ల మనం “క్రీస్తు మనసు” కలిగివుండవచ్చు. (1 కొరిం. 2:14-16) అంతేకాదు, ఆయన నాలుగు సువార్త పుస్తకాల్ని కూడా మనకోసమే రాయించాడు. అందులో యేసు భూమ్మీదున్నప్పుడు ఎలా ఆలోచించేవాడో, ఎలా మాట్లాడేవాడో, ఎలా ప్రవర్తించేవాడో ఉంది. యేసులా ఆలోచించినప్పుడు, పనులు చేసినప్పుడు మీరు ఆధ్యాత్మికంగా పరిణతి సాధించవచ్చు.

గట్టి ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం?

12. “క్రీస్తు గురించిన ప్రాథమిక బోధలు” ఏంటి?

12 పరిణతి సాధించాలంటే, “మనం క్రీస్తు గురించిన ప్రాథమిక బోధలు నేర్చుకునే స్థాయి” దాటాలి. ఈ ప్రాథమిక బోధల్లో పశ్చాత్తాపం, విశ్వాసం, బాప్తిస్మం, పునరుత్థానం ఉన్నాయి. (హెబ్రీ. 6:1, 2) క్రైస్తవులకు ఆ బోధలే పునాది. అందుకే అపొస్తలుడైన పేతురు పెంతెకొస్తు రోజున ప్రజలకు వాటి గురించే చెప్పాడు. (అపొ. 2:32-35, 38) మనం యేసు శిష్యులవ్వాలంటే ప్రాథమిక బోధలన్నిటినీ అంగీకరించాలి. ఉదాహరణకు, పునరుత్థానాన్ని నమ్మనివాళ్లకు నిజక్రైస్తవులని చెప్పుకునే అర్హత ఉండదని పౌలు హెచ్చరించాడు. (1 కొరిం. 15:12-14) అయితే, మనం ఈ ప్రాథమిక బోధలతోనే సరిపెట్టుకోకూడదు, వాటికి మించి నేర్చుకోవాలి!

13. హెబ్రీయులు 5:14 లో చెప్పిన గట్టి ఆధ్యాత్మిక ఆహారం నుండి ప్రయోజనం పొందాలంటే మనమేం చేయాలి? (చిత్రం కూడా చూడండి.)

13 ప్రాథమిక బోధలకు మించి నేర్చుకోవాలంటే, మనం గట్టి ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకోవాలి. అందులో యెహోవా నియమాలే కాదు, సూత్రాలు కూడా ఉన్నాయి. అవి మనకు యెహోవా ఆలోచనల్ని తెలుసుకోడానికి సహాయం చేస్తాయి. దాన్నుండి పూర్తి ప్రయోజనం పొందాలంటే మనం బైబిల్ని అధ్యయనం చేయాలి, ధ్యానించాలి, నేర్చుకున్నవాటిని జాగ్రత్తగా పాటించాలి. మనమలా చేస్తూ ఉంటే యెహోవాను సంతోషపెట్టే నిర్ణయాల్ని తీసుకోగలుగుతాం.c—హెబ్రీయులు 5:14 చదవండి.

ఒక బ్రదర్‌ వ్యక్తిగత అధ్యయనం చేస్తున్నాడు. సర్కిల్‌లో ఉన్న చిత్రం: సముద్రం గురించిన ఒక వీడియో చూడాలని నిర్ణయించుకున్నాడు.

యెహోవాను సంతోషపెట్టే నిర్ణయాలు ఎలా తీసుకోవాలో గట్టి ఆధ్యాత్మిక ఆహారం నేర్పిస్తుంది (13వ పేరా చూడండి)d


14. కొరింథులో ఉన్నవాళ్లు పరిణతి సాధించేలా పౌలు ఎలా సహాయం చేశాడు?

14 బైబిల్లో ఏదైనా సూటైన నియమం లేనప్పుడు, పరిణతి సాధించని క్రైస్తవులు సరైన నిర్ణయం తీసుకోవడానికి తర్జనభర్జన పడతారు. ఎలాగో బైబిలు దీనిగురించి ఏం చెప్పట్లేదు కాబట్టి, తమకు నచ్చింది చేయవచ్చని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమందైతే, నియమాలు అవసరం లేని దగ్గర కూడా నియమాలు కావాలని అడుగుతారు. ఉదాహరణకు, విగ్రహాలకు అర్పించినదాన్ని తినాలా వద్దా అని చెప్పే నియమం అంటూ ఏమీ లేదు. కానీ ఆ సందర్భంలో ఏం చేయాలో చెప్పే ఒక నియమం కోసం కొరింథులో ఉన్న క్రైస్తవులు పౌలును అడిగారు. వాళ్లు ఏం చేయాలో పౌలు చెప్పే బదులు, మనస్సాక్షి అనేది ఒకటి ఉందనీ, దాన్నిబట్టి వాటిని తినాలా వద్దా సొంతగా నిర్ణయించుకునే “హక్కు” ప్రతీఒక్కరికి ఉంటుందనీ ఆయన గుర్తుచేశాడు. అంతేకాదు, తమ మనస్సాక్షి గద్దించకుండా, వేరేవాళ్లను అభ్యంతర పెట్టకుండా నిర్ణయాలు తీసుకునేలా కొన్ని బైబిలు సూత్రాల్ని కూడా పౌలు చెప్పాడు. (1 కొరిం. 8:4, 7-9) ఏం చేయాలో చెప్పమని ఇతరుల్ని అడిగే బదులు, తమ వివేచనా సామర్థ్యాల్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవడం పౌలు కొరింథులో ఉన్నవాళ్లకు నేర్పించాడు. అలా వాళ్లు పరిణతి సాధించేలా ఆయన సహాయం చేశాడు.

15. హెబ్రీ క్రైస్తవులు ఆధ్యాత్మికంగా పరిణతి సాధించడానికి పౌలు ఎలా సహాయం చేశాడు?

15 పౌలు హెబ్రీ క్రైస్తవులకు రాసిన ఉత్తరం నుండి మనం ఒక విలువైన పాఠం నేర్చుకోవచ్చు. కొంతమంది ఆధ్యాత్మికంగా ఎదగకుండా అక్కడే ఆగిపోయారు. చెప్పాలంటే వాళ్లు “మళ్లీ పాలు తాగే స్థితికి వచ్చారు, గట్టి [ఆధ్యాత్మిక] ఆహారం తినే స్థితిలో లేరు.” (హెబ్రీ. 5:12) సంఘం ద్వారా యెహోవా నేర్పిస్తున్న కొత్త విషయాల్ని వాళ్లు నేర్చుకోలేదు, అంగీకరించలేదు. (సామె. 4:18) ఉదాహరణకు, క్రీస్తు బలి ద్వారా ధర్మశాస్త్రం రద్దు అయిపోయినా, చాలామంది యూదా క్రైస్తవులు 30 ఏళ్లుగా ఇంకా మోషే ధర్మశాస్త్రాన్నే పట్టుకొని వేలాడుతున్నారు. (రోమా. 10:4; తీతు 1:10) వాళ్లిక ధర్మశాస్త్రం కింద లేరనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్లకు 30 సంవత్సరాలు అనేది చాలా ఎక్కువ! పౌలు హెబ్రీయులకు రాసిన ఉత్తరం ఎవరు చదివినా దాంట్లో గట్టి ఆధ్యాత్మిక ఆహారం ఉందని చెప్తారు. కాబట్టి ఆ ఉత్తరం, యెహోవాను కొత్త పద్ధతిలో ఆరాధించడం ధర్మశాస్త్రం కన్నా చాలా మెరుగైంది అనే విశ్వాసం అప్పటి క్రైస్తవుల్లో పెంచి ఉంటుంది. అలాగే యూదులు వ్యతిరేకించినా, వాళ్లు ఆపకుండా ప్రీచింగ్‌ చేయడానికి కావాల్సిన ధైర్యం ఇచ్చి ఉంటుంది.—హెబ్రీ. 10:19-23.

పరిణతి సాధించేశాం అనుకోకండి

16. పరిణతి సాధిస్తూ ఉండడంతోపాటు మనమేం చేయాలి?

16 మనం పరిణతి సాధించడానికే కాదు దాన్ని కాపాడుకోవడానికి కూడా కష్టపడాలి. కాబట్టి మనం పరిణతి సాధించేశాం అని ఎప్పుడూ అనుకోకూడదు. (1 కొరిం. 10:12) మనం పరిణతి సాధిస్తున్నామో లేదో ఎప్పటికప్పుడు “పరీక్షించుకుంటూ” ఉండాలి.—2 కొరిం. 13:5.

17. పరిణతిని కాపాడుకోవడం ముఖ్యమని పౌలు కొలస్సయులకు రాసిన ఉత్తరం ఎలా చూపిస్తుంది?

17 పౌలు కొలొస్సయులకు రాసిన ఉత్తరంలో కూడా పరిణతిని కాపాడుకోవడం ఎంత ప్రాముఖ్యమో చెప్పాడు. అది చెప్పే సమయానికే కొలొస్సీలోని క్రైస్తవులు ఆధ్యాత్మికంగా పెద్దవాళ్లలా ఉన్నారు. అయినా, ఈ లోక ఆలోచనలు వంటపట్టించుకోకుండా జాగ్రత్తపడాలని పౌలు వాళ్లని హెచ్చరించాడు. (కొలొ. 2:6-10) కొలొస్సీ సంఘంవాళ్ల గురించి బాగా తెలిసిన ఎపఫ్రా కూడా వాళ్లు “స్థిరంగా నిలబడాలని” లేదా వాళ్ల పరిణతి కాపాడుకోవాలని పట్టుదలగా ప్రార్థిస్తూ ఉన్నాడు. (కొలొ. 4:12) దీన్నుండి మనమేం నేర్చుకోవచ్చు? పరిణతిని కాపాడుకుంటూ ఉండాలంటే సొంత కృషితోపాటు దేవుని మద్దతు కూడా అవసరమని పౌలుకు, ఎపఫ్రాకు తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కొలొస్సీలోని క్రైస్తవులు పరిణతిని కాపాడుకుంటూ ఆధ్యాత్మికంగా పెద్దవాళ్లలా ఉండాలని వాళ్లు కోరుకున్నారు.

18. ఒక పరిణతి సాధించిన క్రైస్తవుడికి ఏం జరిగే ప్రమాదం ఉంది? (చిత్రం కూడా చూడండి.)

18 పరిణతి సాధించిన ఒక క్రైస్తవుడు కూడా దేవుని ఆమోదాన్ని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని పౌలు హెబ్రీ క్రైస్తవుల్ని హెచ్చరించాడు. ఆ క్రైస్తవుడి హృదయం ఎంతగా మొద్దుబారిపోవచ్చంటే, అతను పశ్చాత్తాపం చూపించడు దానివల్ల యెహోవా క్షమాపణ పొందడు. సంతోషకరమైన విషయమేమిటంటే, హెబ్రీ క్రైస్తవులు మరీ అంత దారుణమైన స్థితికి దిగిపోలేదు. (హెబ్రీ. 6:4-9) మరి, ఈరోజుల్లో నిష్క్రియులైనవాళ్లు లేదా బహిష్కరించబడినవాళ్లు తర్వాత పశ్చాత్తాపపడితే అప్పుడేంటి? వాళ్లు వినయంగా పశ్చాత్తాపం చూపించినప్పుడు, పౌలు హెచ్చరించిన ప్రమాదాన్ని తప్పించుకుంటారు. అయితే, వాళ్లు యెహోవా దగ్గరికి తిరిగొచ్చినప్పుడు ఆయనిచ్చే సహాయాన్ని తీసుకోవాలి. (యెహె. 34:15, 16) మళ్లీ వాళ్లు ఆధ్యాత్మికంగా గాడిలో పడడానికి సహాయం చేయమని సంఘపెద్దలు ఒక పరిణతి సాధించిన బ్రదర్‌కి లేదా సిస్టర్‌కి చెప్పవచ్చు.

ఒక పెద్దవయసు బ్రదర్‌ ఇంకో బ్రదర్‌ ఇంటికి వెళ్లి లేఖనాలతో ప్రోత్సహిస్తున్నాడు.

ఆధ్యాత్మికంగా గాడిలో పడాలనుకునే వాళ్లకు యెహోవా సహాయం చేస్తాడు (18వ పేరా చూడండి)


19. మనం ఏ గమ్యాన్ని చేరుకోవాలి?

19 గట్టి ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకుంటూ, యెహోవాలా ఆలోచించడానికి ఇంకా ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటే మీరు పరిణతి సాధించాలనే గమ్యాన్ని చేరుకుంటారు. ఒకవేళ మీరిప్పటికే పరిణతి సాధించి ఉంటే, దాన్ని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉండండి!

మీరెలా జవాబిస్తారు?

  • పరిణతిగల క్రైస్తవులుగా అవ్వడం అంటే ఏంటి?

  • పరిణతిగల క్రైస్తవులుగా ఎలా ఎదగవచ్చు?

  • పరిణతి సాధించేశాం అని ఎందుకు అనుకోకూడదు?

పాట 65 ముందుకు సాగిపోదాం!

a హీబ్రూ లేఖనాల్లో “పరిణతి సాధించడం,” “పరిణతి సాధించకపోవడం” లాంటి పదాలు లేకపోయినా, ఆ అర్థం వచ్చే విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు, అనుభవంలేని యౌవనులకు అలాగే జ్ఞానం, ఆలోచనా సామర్థ్యం ఉన్నవాళ్లకు మధ్యున్న వ్యత్యాసం గురించి సామెతల పుస్తకంలో ఉంది.—సామె. 1:4, 5.

b jw.org అలాగే JW లైబ్రరీలో ఉన్న “గాలి వార్తలా? వాస్తవాలా?” అనే వీడియో చూడండి.

c ఈ పత్రికలో ఉన్న “అధ్యయనం చేయడానికి ఐడియాలు” చూడండి.

d చిత్రం వివరణ: ఒక బ్రదర్‌ వినోదాన్ని ఎంచుకుంటున్నప్పుడు బైబిలు సూత్రాల్ని పాటిస్తున్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి