మీరు ఎలాంటి వ్యక్తులుగా ఉండాలి?
“ఇవన్నియు ఇట్లు లయమైపోవునవి గనుక . . . మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.”—2 పేతు. 3:11.
1. పేతురు రాసిన రెండవ పత్రికలో, అప్పటి ప్రజలకు సమయానుకూలమైన ఉపదేశముందని ఎలా చెప్పవచ్చు?
అపొస్తలుడైన పేతురు తన రెండవ పత్రికను రాసేనాటికే క్రైస్తవ సంఘం ఎన్నో హింసల్ని సహించింది. అయినా ఆ హింసల వల్ల సంఘ సభ్యుల ఉత్సాహం నీరుగారలేదు, లేదా సంఘ ప్రగతి కుంటుపడలేదు. కాబట్టే, అపవాది గతంలో ప్రయోగించి ఎన్నోసార్లు విజయం సాధించిన మరో పన్నాగాన్ని ఈసారి కూడా ఉపయోగించాడు. పేతురు చెప్పినట్లుగా ‘వ్యభిచారిణిని చూచి ఆశించే కన్నులు గలవారు, లోభత్వమందు సాధకము చేయబడిన హృదయముగలవారు’ అయిన అబద్ధ బోధకుల ద్వారా సాతాను దేవుని ప్రజలను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నించాడు. (2 పేతు. 2:1-3, 14; యూదా 4) అందుకే, దేవునికి నమ్మకంగా ఉండమని పేతురు తన రెండవ పత్రికలో హృదయపూర్వకంగా ప్రోత్సహించాడు.
2. రెండవ పేతురు మూడవ అధ్యాయంలో ఏ విషయాలు వివరించబడ్డాయి? మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?
2 “నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని యెరిగి, నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను. నేను మృతిపొందిన తరువాత కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసి కొనునట్లు జాగ్రత్తచేతును [‘చేయగలిగినదంతా చేస్తాను,’ NW].” (2 పేతు. 1:13-15) తాను త్వరలో చనిపోతానని పేతురుకు తెలుసు. కానీ తానిచ్చిన సమయానుకూలమైన ఉపదేశాన్ని మాత్రం ప్రజలు భవిష్యత్తులో కూడా గుర్తుంచుకోవాలని ఆయన ఆశించాడు. ఆయన కోరుకున్నట్లుగానే అవి బైబిల్లో భాగమయ్యాయి, వాటిని మనమందరం ఇప్పుడు చదవగలుగుతున్నాం. పేతురు రాసిన రెండవ పత్రికలోని మూడవ అధ్యాయం మనకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ముఖ్యంగా, అది ప్రస్తుత విధానపు ‘అంత్యదినాల’ గురించేకాక, సూచనార్థక ఆకాశములు, భూమి నాశనం కావడం గురించి కూడా వివరిస్తోంది. (2 పేతు. 3:3, 7, 10) పేతురు మనకు ఏ ఉపదేశాన్నిచ్చాడు? ఆయనిచ్చిన ఉపదేశాన్ని అన్వయించుకోవడం వల్ల మనం ఎలా యెహోవా ఆమోదాన్ని పొందగలుగుతాం?
3, 4. (ఎ) పేతురు ఏ హెచ్చరికనిచ్చాడు? (బి) మనం ఏ మూడు విషయాలను పరిశీలిస్తాం?
3 సాతాను లోకం లయమైపోవడం గురించి మాట్లాడిన తర్వాత పేతురు ఇలా అన్నాడు: “మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.” (2 పేతు. 3:11, 12) యెహోవా చిత్తాన్ని చేసి ఆయన ఇష్టపడే లక్షణాలను చూపించినవారు మాత్రమే “ప్రతిదండన దినమును” తప్పించుకుంటారని పేతురుకు తెలుసు. (యెష. 61:2) అందుకే ఆయన ఇంకా ఇలా హెచ్చరించాడు: “ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల [అబద్ధ బోధకుల] తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచుకొనియుండుడి.”—2 పేతు. 3:17.
4 అలా ‘ముందుగా తెలిసికొనివున్నవారిలో’ పేతురు కూడా ఉన్నాడు. కాబట్టే, అంత్యదినాల్లో క్రైస్తవులు తమ యథార్థతను కాపాడుకోవాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయనకు తెలుసు. ఆ తర్వాత అపొస్తలుడైన యోహాను అలా ఎందుకు జాగ్రత్తగా ఉండాలో వివరించాడు. ఆయన ఓ దర్శనంలో, సాతాను పరలోకం నుండి పడద్రోయబడడాన్ని, “దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవా[రిపై]” అతడు “బహు క్రోధము” వెళ్లగ్రక్కడాన్ని చూశాడు. (ప్రక. 12:9, 12, 17) దేవుని యథార్థమైన అభిషిక్తులు, వారి సహచరులైన ‘వేరే గొర్రెలు’ సాతానును జయిస్తారు. (యోహా. 10:16) మరి మన విషయమేమిటి? మనం ఎల్లప్పుడూ యథార్థంగా ఉంటామా? మనం (1)దేవుడు ఇష్టపడే లక్షణాలను పెంపొందించుకోవడానికి, (2) నైతిక విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో నిష్కళంకులముగా, నిందారహితులముగా ఉండడానికి, (3) పరీక్షల విషయంలో సరైన అభిప్రాయాన్ని కలిగివుండడానికి ప్రయత్నిస్తే మనం యథార్థంగా ఉండగలుగుతాం. ఇప్పుడు ఈ మూడు విషయాలను మనం చర్చిద్దాం.
దేవుడు ఇష్టపడే లక్షణాలను పెంపొందించుకోండి
5, 6. మనం ఏ లక్షణాలను పెంపొందించుకునేందుకు కృషిచేయాలి? దాని కోసం ఎందుకు ‘తీవ్రంగా కృషి చేయాలి?’
5 పేతురు తన రెండవ పత్రిక ప్రారంభంలో ఇలా రాశాడు: “ఆ హేతువుచేతనే మీమట్టుకు మీరు పూర్ణజాగ్రత్తగలవారై [‘తీవ్రంగా కృషిచేసి,’ NW] మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదరప్రేమను, సహోదరప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించినయెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అనుభవజ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండచేయును.”—2 పేతు. 1:5-8.
6 దేవుడు ఇష్టపడే లక్షణాలను పెంపొందించుకునేందుకు సహాయం చేసే కార్యకలాపాల్లో పాల్గొనాలంటే ‘తీవ్రంగా కృషిచేయాలి.’ ఉదాహరణకు, క్రైస్తవ కూటాలన్నిటికీ హాజరుకావడానికి, ప్రతీరోజు బైబిలు చదవడానికి, వ్యక్తిగత అధ్యయనాన్ని క్రమపద్ధతిలో చేసుకోవడానికి కృషిచేయాల్సి ఉంటుంది. కుటుంబ ఆరాధనా సాయంత్రాన్ని క్రమంగా, సంతోషకరంగా, ప్రయోజనం చేకూర్చే విధంగా జరుపుకోవాలంటే కృషి చేయాల్సి రావచ్చు, మంచి ప్రణాళిక కూడా వేసుకోవాల్సి రావచ్చు. అయితే, మనం ఆ ప్రణాళికకు ఒకసారి అలవాటుపడితే, మరిముఖ్యంగా మనం దాని ప్రయోజనాలను చవిచూస్తే మంచి అలవాట్లను కలిగివుండడం సులభమౌతుంది.
7, 8. (ఎ) కుటుంబ ఆరాధనా సాయంత్రం గురించి కొందరు ఏమన్నారు? (బి) మీరు కుటుంబ ఆరాధన నుండి ఎలా ప్రయోజనం పొందుతున్నారు?
7 కుటుంబ ఆరాధనా ఏర్పాటు గురించి ఓ సహోదరి ఇలా రాసింది: “ఈ ఏర్పాటువల్ల మేము ఎన్నో విషయాల గురించి నేర్చుకోగలుగుతున్నాం.” మరో సహోదరి ఇలా అంటోంది: “నిజం చెప్పాలంటే, పుస్తక అధ్యయన ఏర్పాటు అలాగే కొనసాగాలని నేను అనుకున్నాను. ఆ కూటాన్ని నేను ఎంతో ఇష్టపడ్డాను. కానీ ఇప్పుడు, దాని స్థానంలో కుటుంబ అధ్యయన ఏర్పాటు వచ్చింది కాబట్టి, మాకు ఏది ఎప్పుడు అవసరమో యెహోవాకు తెలుసని గుర్తించాను.” ఓ కుటుంబ పెద్ద ఇలా చెప్పాడు: “కుటుంబ ఆరాధన మాకు ఎంతో సహాయం చేసింది. భార్యాభర్తలముగా మాకున్న నిర్దిష్ట అవసరాలకు తగ్గట్టు మలచుకునే కూటాన్ని కలిగివుండడం నిజంగా ఓ అద్భుతం! మేము ఇప్పుడు మరింత మెరుగ్గా ఆత్మఫలాన్ని కనబరుస్తున్నామని, మా పరిచర్యలో మేము మునుపటికన్నా ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నామని మా ఇద్దరికీ అనిపిస్తోంది.” మరో కుటుంబ పెద్ద ఇలా అన్నాడు: “పిల్లలు ఇప్పుడు సొంత పరిశోధన చేసి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నారు. వారు అలా చేయడాన్ని ఇష్టపడుతున్నారు. మన అవసరాలేమిటో యెహోవాకు తెలుసనే, ఆయన మన ప్రార్థనలను ఆలకిస్తాడనే నమ్మకం ఈ ఏర్పాటువల్ల మాలో పెరిగింది.” ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ఏర్పాటు గురించి మీకు కూడా అలాగే అనిపిస్తుందా?
8 చిన్నచిన్న విషయాలు మీ కుటుంబ ఆరాధనకు ఆటంకంగా మారకుండా చూసుకోండి. ఓ వివాహిత జంట ఇలా అంది: “గత నాలుగు వారాలుగా ప్రతీ గురువారం మా ఇంట్లో ఏదో ఒకటి అవుతూనే ఉంది. మేము దాదాపు మా అధ్యయనాన్ని ఆపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, కానీ మేము దాన్ని ఆపలేదు.” కొన్నిసార్లు, మీరు వేరే సమయంలో కుటుంబ ఆరాధనను చేసుకోవాల్సి రావచ్చు. అయినా, ఒక్కవారం కూడా దాన్ని మానకూడదనే కృతనిశ్చయంతో ఉండండి!
9. యెహోవా యిర్మీయాను ఎలా పోషించాడు? ఆయన మాదిరి నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
9 యిర్మీయా ప్రవక్త ఈ విషయంలో మనకు మంచి మాదిరి ఉంచాడు. యెహోవా ఇచ్చే ఆధ్యాత్మిక పోషణ ఆయనకు అవసరమైంది, ఆయన దాన్ని ఎంతో ఇష్టపడ్డాడు కూడా. ఆ పోషణ వల్ల ఆయన తన సందేశాన్ని ఇష్టపడనివారికి సహనంతో ప్రకటించగలిగాడు. “యెహోవా మాట . . . అగ్నివలె మండుచు నా యెముకలలోనే మూయబడి యున్నట్లున్నది” అని ఆయన అన్నాడు. (యిర్మీ. 20:8, 9) యెరూషలేము నాశనమయ్యేంతవరకు కొనసాగిన కష్ట కాలాలను సహించేందుకు కూడా అది ఆయనకు సహాయం చేసింది. మనకైతే ఇప్పుడు దేవుని వాక్యం మొత్తం లిఖితపూర్వకంగా అందుబాటులో ఉంది. దాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసి దేవునిలా ఆలోచిస్తే, యిర్మీయాలాగే పరిచర్యలో సంతోషంగా కొనసాగగలుగుతాం, శ్రమలు వచ్చినా నమ్మకంగా ఉంటూ నైతిక, ఆధ్యాత్మిక విషయాల్లో పరిశుభ్రంగా ఉండగలుగుతాం.—యాకో. 5:10.
‘నిష్కళంకులుగా, నిందారహితులుగా’ ఉండండి
10, 11. మనం ‘నిష్కళంకులముగా, నిందారహితులముగా’ ఉండాలంటే ఎందుకు చేయగలిగినదంతా చేయాలి? దాని కోసం ఏమి చేయాలి?
10 అంత్యదినాల్లో జీవిస్తున్నామని క్రైస్తవులముగా మనకు తెలుసు. కాబట్టి, యెహోవా అసహ్యించుకునే దురాశ, లైంగిక దుర్నీతి, హింస వంటివాటిలో ఈ లోకం మునిగిపోవడం చూసి మనం ఆశ్చర్యపోము. ప్రకటన 2:13, 14 ప్రకారం, సాతాను పన్నాగం ఈ విధంగా ఉంటుంది: ‘దేవుని సేవకుల్ని భయపెట్టాలి, అది కుదరకపోతే కనీసం వారిని భ్రష్టుపట్టించాలి.’ అందుకే పేతురు ప్రేమతో ఇచ్చిన ఈ ఉపదేశాన్ని మనం లక్ష్యపెట్టాలి: “[దేవుని] దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి [‘చేయగలిగినదంతా చేయండి,’ NW].”—2 పేతు. 3:14.
11 ‘తీవ్రంగా కృషిచేయండి’ అని పేతురు ముందు చెప్పిన మాటకు, ‘చేయగలిగినదంతా చేయండి’ అని ఇప్పుడు చెప్పిన మాటకు సంబంధముంది. సాతాను లోక మలినం అంటకుండా ‘నిష్కళంకులముగా, నిందారహితులముగా’ ఉండాలంటే మనం ఎంతో కృషి చేయాలని ఆ మాటలు రాసేలా పేతురును ప్రేరేపించిన యెహోవాకు తెలుసు. మనం అలా కృషి చేయాలంటే తప్పుడు కోరికలకు బానిసలు కాకుండా కూడా చూసుకోవాలి. (సామెతలు 4:23; యాకోబు 1:14, 15 చదవండి.) అంతేకాక, మన క్రైస్తవ జీవిత విధానం చూసి ఆశ్చర్యపోతూ మనల్ని ఎల్లప్పుడూ ‘దూషించే’ వారి దూషణను తట్టుకొని నిలబడాలి.—1 పేతు. 4:4.
12. లూకా 11:13లో మనకు ఏ అభయం ఇవ్వబడింది?
12 మన అపరిపూర్ణత వల్ల సరైనది చేయడం అంత సులభం కాదు. (రోమా. 7:21-25) మనం యెహోవా సహాయం కోరితేనే సరైనది చేయగలుగుతాం. ఆయన నిజాయితీగా తనను అడిగే వారికి తన పరిశుద్ధాత్మను ఎంతో ధారాళంగా ఇస్తాడు. (లూకా 11:13) ఆ పరిశుద్ధాత్మ, దేవుడు ఇష్టపడే లక్షణాలను మనలో వృద్ధిచేస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే శోధనల్నేకాక, శ్రమల్ని కూడా సహించేందుకు ఆ లక్షణాలు మనకు సహాయం చేస్తాయి. యెహోవా దినం సమీపిస్తుండగా ఆ శ్రమలు మరింత పెరిగే అవకాశం ఉంది.
పరీక్షల్ని బలపడేందుకు దొరికిన అవకాశాలుగా పరిగణించండి
13. మన జీవితంలో ఎదురయ్యే పరీక్షల్ని మనమెలా సహించగలుగుతాం?
13 ఈ పాత విధానంలో జీవించినంతకాలం మనం ఏదో ఒక పరీక్షను ఎదుర్కొంటూనే ఉంటాం. అలాంటి సందర్భాల్లో కృంగిపోయే బదులు దేవునిపై, ఆయన వాక్యంపై మీకున్న ప్రేమను నిరూపించుకోవడానికి, మీ విశ్వాసాన్ని బలపర్చుకోవడానికి దొరికిన అవకాశాలుగా వాటిని పరిగణించండి. శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు: “నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని యెరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.” (యాకో. 1:2-4) ‘భక్తులను శోధనలో నుండి తప్పించుటకు యెహోవా సమర్థుడు’ అని కూడా గుర్తుంచుకోండి.—2 పేతు. 2:9.
14. యోసేపు మాదిరి మిమ్మల్ని ఎలా ప్రోత్సహిస్తుంది?
14 యాకోబు కుమారుడైన యోసేపు ఉదాహరణనే తీసుకోండి. ఆయన సొంత అన్నలే ఆయనను బానిసగా అమ్మేశారు. (ఆది. 37:23-28; 42:21) తన అన్నల చేతుల్లో అంత క్రూరత్వాన్ని అనుభవించినందుకు యోసేపు విశ్వాసం బలహీనపడిందా? కష్టాలను అనుమతించినందుకు యెహోవా మీద ఆయన కోపాన్ని పెంచుకున్నాడా? లేదని దేవుని వాక్యం స్పష్టంగా చూపిస్తోంది. యోసేపు కష్టాలు అంతటితో ఆగిపోలేదు. మానభంగం చేయడానికి ప్రయత్నించాడనే తప్పుడు ఆరోపణ మోపి ఆయనను చెరసాలలో వేశారు. ఈసారి కూడా ఆయన తన దైవభక్తిని వదులుకోలేదు. (ఆది. 39:9-21) బదులుగా, పరీక్షల్ని బలపడేందుకు అవకాశాలుగా ఆయన మలచుకున్నాడు, దానివల్ల ఎంతో ఆశీర్వదించబడ్డాడు.
15. నయోమి ఉదాహరణ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
15 నిజమే, పరీక్షలు మనకు బాధ కలిగించవచ్చు లేదా మనల్ని కృంగదీయవచ్చు. బహుశా యోసేపుకు కూడా కొన్నిసార్లు అలా అనిపించివుంటుంది. చాలామంది దేవుని నమ్మకమైన సేవకులకూ అలాగే అనిపించింది. మరో ఉదాహరణను పరిశీలించండి. నయోమి తన భర్తను, ఇద్దరు కుమారులను కోల్పోయింది. ఆమె ఇలా అంది: “సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా [అంటే ‘చేదు’ అని అర్థం] అనుడి.” (రూతు 1:20, 21, అధస్సూచి) ఆమె అలా స్పందించడం సహజమే, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు కూడా. యోసేపులాగే ఆమె కూడా ఆధ్యాత్మికంగా బలహీనపడలేదు లేదా తన యథార్థతను కోల్పోలేదు. అందుకే యెహోవా తన ప్రియమైన సేవకురాలిని ఆశీర్వదించాడు. (రూతు 4:13-17, 22) అదే విధంగా, రాబోయే పరదైసులో సాతాను వల్ల, అతని దుష్ట లోకం వల్ల కలిగిన హానినంతా యెహోవా తీసేస్తాడు. “మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు.”—యెష. 65:17.
16. ప్రార్థన విషయంలో మనకెలాంటి అభిప్రాయం ఉండాలి? ఎందుకు?
16 మనం ఎలాంటి పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చినా సరే, దేవుని ప్రేమ సదా మనల్ని బలపరుస్తుంది. (రోమీయులు 8:35-39 చదవండి.) సాతాను మనల్ని నిరుత్సాహపర్చడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ, మనం ‘స్వస్థ బుద్ధిగలవారమై, ప్రార్థనలు చేయడానికి మెలకువగా’ ఉన్నట్లైతే వాడు విజయం సాధించలేడు. (1 పేతు. 4:7) యేసు ఇలా అన్నాడు: “కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు [‘విజ్ఞాపనచేయుచు,’ NW] మెలకువగా ఉండుడి.” (లూకా 21:36) యేసు ఇక్కడ ఉపయోగించిన ‘విజ్ఞాపనచేయుచు’ అనే మాట పట్టుదలతో ప్రార్థన చేయడాన్ని సూచిస్తోంది. యేసు అలా చెప్పడం ద్వారా తనతో, తన తండ్రితో మనకున్న సంబంధాన్ని తేలిగ్గా తీసుకోకూడదని నొక్కిచెప్పాడు. యెహోవా ఇష్టపడే ప్రజలు మాత్రమే ఆయన దినాన్ని తప్పించుకునే అవకాశముంది.
యెహోవా సేవలో చురుగ్గా పాల్గొనండి
17. మీ ప్రాంతంలో ప్రకటించడం కష్టంగా ఉన్నట్లైతే ప్రాచీనకాల ప్రవక్తల మాదిరి నుండి మీరెలా ప్రయోజనం పొందవచ్చు?
17 ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొంటే మనం సేదదీరుతాం. ఇది మనకు పేతురు చెప్పిన మాటల్ని గుర్తుచేస్తోంది. “మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను [‘భక్తితోకూడిన క్రియలతోను,’ NW] ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను” అని ఆయన అన్నాడు. (2 పేతు. 3:11) భక్తితోకూడిన క్రియల్లో అత్యంత ప్రాముఖ్యమైనది రాజ్య సువార్త ప్రకటించడమే. (మత్త. 24:14) నిజానికి, ప్రజలు వినడానికి ఇష్టపడకపోవడంవల్లనో వ్యతిరేకతవల్లనో ప్రజలు జీవిత చింతల్లో మునిగిపోయి ఉండడంవల్లనో కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం కష్టమనిపించవచ్చు. ప్రాచీన కాలంలోని దేవుని సేవకులు కూడా ఇలాంటి వైఖరిగల ప్రజలతో వ్యవహరించాల్సి వచ్చింది. అయినా, వారు ఎన్నడూ వెనుదీయకుండా దేవుడు తమకిచ్చిన సందేశాన్ని ప్రకటించడానికి పదేపదే ప్రజల దగ్గరికి వెళ్లారు. (2 దినవృత్తాంతములు 36:15, 16 చదవండి; యిర్మీ. 7:24-26) అలాంటి పరిస్థితుల్లో వారు ఎలా నెట్టుకురాగలిగారు? వారు తమ నియామకం విషయంలో ఈ లోక అభిప్రాయాన్ని కాదుగానీ యెహోవా అభిప్రాయాన్ని కనబరిచారు. అంతేకాక, దేవుని పేరును ధరించడాన్ని తమకు లభించిన ఓ గొప్ప గౌరవంగా వారు భావించారు.—యిర్మీ. 15:16.
18. మన ప్రకటనాపని వల్ల భవిష్యత్తులో యెహోవా నామం ఎలా ఘనపర్చబడుతుంది?
18 యెహోవా పేరును, ఆయన సంకల్పాన్ని ప్రకటించే గొప్ప అవకాశం మనకు కూడా ఉంది. ఒకసారి దీని గురించి ఆలోచించండి. మన ప్రకటనాపని కారణంగా, దేవుని మహా దినంలో ఆయన శత్రువులు ఆయన గురించిగానీ ఆయన సంకల్పం గురించిగానీ తాము వినలేదని చెప్పలేరు. ప్రాచీన కాలంలోని ఫరోలాగే వారు కూడా యెహోవాయే తమపై చర్య తీసుకుంటున్నాడని గ్రహిస్తారు. (నిర్గ. 8:1, 20; 14:25) అదే సమయంలో, యెహోవా తన నమ్మకమైన సేవకులే తన ప్రతినిధులని స్పష్టంగా చూపించడం ద్వారా వారిని ఘనపరుస్తాడు.—యెహెజ్కేలు 2:5; 33:33 చదవండి.
19. యెహోవా దీర్ఘశాంతాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నామని ఎలా చూపించవచ్చు?
19 పేతురు తన రెండవ పత్రిక చివర్లో తన తోటి విశ్వాసులకు ఇలా రాశాడు: “మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి.” (2 పేతు. 3:15) కాబట్టి, యెహోవా చూపిస్తున్న దీర్ఘశాంతాన్ని మనం చక్కగా సద్వినియోగం చేసుకుందాం. ఏ విధంగా? యెహోవా ఇష్టపడే లక్షణాలను వృద్ధి చేసుకుంటూ ‘నిష్కళంకంగా, నిందారహితంగా’ ఉండడం ద్వారా, పరీక్షల విషయంలో సరైన అభిప్రాయం కలిగివుండడం ద్వారా, రాజ్య సేవలో చురుగ్గా పాల్గొనడం ద్వారా మనం దేవుని దీర్ఘశాంతాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అలా చేస్తే, ‘కొత్త ఆకాశాలకు, కొత్త భూమికి’ సంబంధించి వాగ్దానం చేయబడిన నిరంతర ఆశీర్వాదాలను చవిచూసేవారిలో మనమూ ఉంటాం.—2 పేతు. 3:13.
మీకు జ్ఞాపకమున్నాయా?
• మనం దేవుడు ఇష్టపడే లక్షణాలను ఎలా అలవర్చుకోవచ్చు?
• మనం ‘నిష్కళంకులముగా, నిందారహితులముగా’ ఎలా ఉండవచ్చు?
• యోసేపు, నయోమి మాదిరుల నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
• ప్రకటనా పనిలో పాల్గొనడం ఎందుకు ఓ గొప్ప అవకాశం?
[9వ పేజీలోని చిత్రం]
భర్తలారా, మీరూ మీ కుటుంబస్థులూ దేవుడు ఇష్టపడే లక్షణాలను అలవర్చుకోవడానికి మీరేమి చేయవచ్చు?
[10వ పేజీలోని చిత్రాలు]
యోసేపు పరీక్షలను ఎదుర్కొన్న తీరు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?