దైవపరిపాలన పరిచర్య పాఠశాల
ఉద్దేశం: వార్త చక్కగా ప్రకటించడానికి, బోధించడానికి ప్రచారకులకు శిక్షణ ఇవ్వడం.
ఎంత కాలం: జరుగుతూనే ఉంటుంది.
స్థలం: స్థానిక రాజ్యమందిరం.
అర్హతలు: క్రమంగా సంఘంతో సహవసిస్తూ, బైబిలు బోధలు అంగీకరించి, క్రైస్తవ ప్రమాణాల ప్రకారం జీవిస్తూ ఉండాలి.
ఎలా చేరవచ్చు: దైవపరిపాలన పరిచర్య పాఠశాల పర్యవేక్షకునితో మాట్లాడాలి. మెదడులోని, వెన్నుపాములోని నరాలు దెబ్బ తినడం వల్ల పక్షవాతం వచ్చిన షారన్ ఇలా అంటోంది: “ఎలా పరిశోధన చేయాలో, విషయాలను తర్కబద్ధంగా ఎలా వివరించాలో దైవపరిపాలన పరిచర్య పాఠశాల నాకు బోధించింది. అంతేకాక, నేను నా సొంత ఆధ్యాత్మిక అవసరాలతో పాటు ఇతరుల ఆధ్యాత్మిక అవసరాలను ఎలా పట్టించుకోవాలో అది నేర్పించింది.”
ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణ పర్యవేక్షకుడిగా సేవచేస్తున్న ఆర్నీ ఇలా అన్నాడు: “నాకు చిన్నప్పటి నుండి నత్తి ఉండేది, వేరేవాళ్ల కళ్లల్లోకి చూసి మాట్లాడడం పెద్ద సమస్యగా ఉండేది. ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుకోవడానికి నాకు ఈ పాఠశాల దోహదపడింది. యెహోవా నాకు ఈ శిక్షణ ద్వారా సహాయం చేయడం వల్ల మాట్లాడేటప్పుడు శ్వాసను ఎలా నియంత్రించుకోవాలో, ఎలా ఏకాగ్రత నిలపాలో నేర్చుకున్నాను. సంఘంలో, పరిచర్యలో యెహోవాను స్తుతించే నైపుణ్యాన్ని సంపాదించుకోగలిగినందుకు నేను ఆయనకు కృతజ్ఞుణ్ణి.”
బెతెల్ ప్రవేశ పాఠశాల
ఉద్దేశం: కొత్తగా బెతెల్‌కు వచ్చినవాళ్లు ఆ సేవలో రాణించేలా సహాయం చేయడం.
ఎంతకాలం: వారానికి 45 నిమిషాల చొప్పున పదహారు వారాలు.
స్థలం: బెతెల్.
అర్హతలు: బెతెల్ కుటుంబంలో శాశ్వత సభ్యులై ఉండాలి లేదా సంవత్సరం, అంతకన్నా ఎక్కువకాలం బెతెల్‌లో సేవ చేయడానికి ఆమోదం పొందిన తాత్కాలిక సభ్యులై ఉండాలి.
ఎలా చేరవచ్చు: తెల్ కుటుంబంలో చేరిన కొత్త సభ్యుల్ని బ్రాంచి కార్యాలయమే ఎంపిక చేస్తుంది.
1980లలో ఈ పాఠశాలకు హాజరైన డమీట్రీయస్ ఇలా అన్నాడు: “ఈ కోర్సు నా అధ్యయన అలవాట్లను మెరుగుపర్చింది, బెతెల్‌లో ఎక్కువ కాలం సేవ చేయడానికి నన్ను సిద్ధం చేసింది. యెహోవా నాపై ప్రేమపూర్వక శ్రద్ధను కలిగి ఉన్నాడని, నేను బెతెల్ సేవను ఆనందభరితం చేసుకోవాలని ఆశిస్తున్నాడని గట్టిగా నమ్మడానికి తరగతి ఉపదేశకులు సహాయం చేశారు. అంతేకాక ఈ విషయంలో పాఠ్యాంశాలు, ఆచరణాత్మక సలహాలు కూడా ఎంతో సహాయం చేశాయి.”
ట్లిన్ ఇలా అంది: “ప్రాముఖ్యంగా నేను ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండడంపై దృష్టి నిలపడానికి అది నాకు సహాయం చేసింది. యెహోవా పట్ల, ఆయన గృహం పట్ల, ఆయన సంస్థ పట్ల నాకున్న కృతజ్ఞతా భావాన్ని ఆ పాఠశాల మరింత పెంచింది.”
రాజ్య పరిచర్య పాఠశాల
ఉద్దేశం: పర్యవేక్షించే పనిలో, సంస్థాపరమైన బాధ్యతలు నిర్వర్తించే విషయంలో శ్రద్ధ తీసుకునేలా ప్రయాణ పర్యవేక్షకులకు, పెద్దలకు శిక్షణ ఇస్తారు, అప్పుడప్పుడు పరిచర్య సేవకులకు కూడా శిక్షణ ఇస్తారు. (అపొ. 20:28) సంఘాల్లోని ప్రస్తుత పరిస్థితుల గురించి, మార్పుల గురించి మరితర అత్యవసరమైన విషయాల గురించి ఈ పాఠశాలలో చర్చిస్తారు. ఇది, పరిపాలక సభ నిర్ణయం ప్రకారం కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎంతకాలం: ఇటీవలి సంవత్సరాల్లో ప్రయాణ పర్యవేక్షకుల కోసం రెండు-రెండున్నర రోజులు, పెద్దల కోసం ఒకటిన్నర రోజులు, పరిచర్య సేవకుల కోసం ఒక రోజు నిర్వహించబడుతోంది.
స్థలం: సాధారణంగా రాజ్యమందిరంలో లేదా సమావేశ హాలులో జరుగుతుంది.
అర్హతలు: ప్రయాణ పర్యవేక్షకులు లేదా పెద్దలు లేదా పరిచర్య సేవకులు అయ్యుండాలి.
ఎలా చేరవచ్చు: అర్హులైన పెద్దలను, పరిచర్య సేవకులను ప్రాంతీయ పర్యవేక్షకుడు ఆహ్వానిస్తాడు. ప్రయాణ పర్యవేక్షకులను బ్రాంచి కార్యాలయం ఆహ్వానిస్తుంది. “ఈ పాఠశాలలో ఎక్కువ సమాచారాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసినప్పటికీ, అది యెహోవా సేవలో ‘పౌరుషంగా’ ముందుకు సాగేలా, ఆనందాన్ని కాపాడుకునేలా సంఘ పెద్దలకు సహాయం చేస్తుంది. కొత్తగా సేవచేస్తున్న పెద్దలైనా, చాలా కాలంగా సేవ చేస్తున్న పెద్దలైనా సంఘాన్ని సమర్థవంతంగా కాయడానికి, ‘ఏకతాత్పర్యంతో’ ఉండడానికి ఏమి చేయాలో ఈ పాఠశాల నేర్పిస్తుంది.”—క్విన్ (కింద).
“ఈ పాఠశాల విశ్వాసానికి సంబంధించిన విషయాల పట్ల మరింత అవగాహన పెంచడానికి, ప్రమాదాల విషయంలో హెచ్చరించడానికి, మందను శ్రద్ధగా చూసుకోవడానికి ఆచరణాత్మకమైన సలహాలను అందించింది.”—మైకల్.
పయినీరు సేవా పాఠశాల
ఉద్దేశం: తమ “పరిచర్యను సంపూర్ణముగా” నెరవేర్చేలా పయినీర్లకు సహాయం చేయడం.—2 తిమో. 4:5.
ఎంతకాలం: రెండు వారాలు.
స్థలం: బ్రాంచి కార్యాలయం నిర్ణయిస్తుంది. సాధారణంగా రాజ్యమందిరం.
అర్హతలు: ఒక సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువకాలం క్రమ పయినీరు సేవ చేసి ఉండాలి.
ఎలా చేరవచ్చు: అర్హులైన వాళ్లకు ప్రాంతీయ పర్యవేక్షకుడే తెలియజేస్తాడు.
“నా పరిచర్యలో, నా జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఈ పాఠశాల సహాయం చేసింది. నేను బైబిలు అధ్యయనం చేసే తీరు, బోధించే తీరు, పరిచర్యలో బైబిలు ఉపయోగించే తీరు చాలా మెరుగైంది. ఇతరులకు సహాయం చేయడానికి, సంఘ పెద్దలకు మద్దతు ఇవ్వడానికి, సంఘ అభివృద్ధికి దోహదపడడానికి నన్ను సంసిద్ధురాల్ని చేసింది.”—లిలీ (కుడివైపు).
రెండుసార్లు ఈ పాఠశాలకు హాజరైన బ్రెండ ఇలా అంది: “నేను నూటికి నూరు శాతం ఆధ్యాత్మిక విషయాల్లో నిమగ్నమవ్వడానికి, మనస్సాక్షిని బలపర్చుకోవడానికి, ఇతరులకు సహాయం చేయడంపై దృష్టి నిలపడానికి ఈ పాఠశాల నాకు సహాయం చేసింది. యెహోవా ఎంతో ఉదారత చూపిస్తాడని నాకు అర్థమైంది.”
సంఘ పెద్దల కోసం పాఠశాల
ఉద్దేశం: తమ సంఘ బాధ్యతలు నెరవేర్చేలా, తమ ఆధ్యాత్మికతను పెంచుకునేలా పెద్దలకు సహాయం చేయడం.
ఎంతకాలం: ఐదు రోజులు.
స్థలం: బ్రాంచి కార్యాలయం నిర్ణయిస్తుంది. సాధారణంగా రాజ్యమందిరంలో లేదా సమావేశ హాలులో జరుగుతుంది.
అర్హతలు: సంఘ పెద్దలు అయివుండాలి.
ఎలా చేరవచ్చు: అర్హులైన పెద్దలను బ్రాంచి కార్యాలయం ఆహ్వానిస్తుంది.
అమెరికాలో, 92వ తరగతికి హాజరైన కొంతమంది ఏమంటున్నారో చూద్దాం:
“పాఠశాల నాకు చాలా ప్రయోజనాన్ని చేకూర్చింది. నన్ను నేను పరిశీలించుకోవడానికి, యెహోవా మందపై ఎలా శ్రద్ధ చూపించాలో తెలుసుకోవడానికి అది నాకు సహాయపడింది.”
“లేఖనాల్లోని ముఖ్యాంశాలను నొక్కి చెప్పడం ద్వారా నేను ఇతరులను ప్రోత్సహించడానికి సంసిద్ధుణ్ణి అయ్యాను.”
“నేను పొందిన శిక్షణను నా జీవితమంతా ఉపయోగిస్తాను.”
ప్రయాణ పర్యవేక్షకులకు, వారి భార్యలకు పాఠశాల
ఉద్దేశం: ప్రాంతీయ, జిల్లా పర్యవేక్షకులు ‘వాక్యమందును, ఉపదేశమందును ప్రయాసపడుతుండగా’ వాళ్లు మరింత సమర్థవంతంగా సంఘాలకు సేవచేసేలా వాళ్లకు సహాయం చేయడం.—1 తిమో. 5:17; 1 పేతు. 5:2, 3.
ఎంతకాలం: రెండు నెలలు.
స్థలం: బ్రాంచి కార్యాలయం నిర్ణయిస్తుంది.
అర్హతలు: సహోదరులు ప్రాంతీయ లేదా జిల్లా పర్యవేక్షకులై ఉండాలి.
ఎలా చేరవచ్చు: అర్హులైన ప్రయాణ పర్యవేక్షకులను, వారి భార్యలను బ్రాంచి కార్యాలయం ఆహ్వానిస్తుంది.
“సంస్థపై యేసుకున్న శిరస్సత్వం పట్ల మా కృతజ్ఞత పెరిగింది. మేము సేవచేస్తున్న ప్రాంతాల్లోని సహోదరులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ప్రతీ సంఘంలో ఐక్యతను బలపర్చాల్సిన అవసరం ఉందని మేము గ్రహించాం. ప్రయాణ పర్యవేక్షకులు సలహాలను ఇస్తూ, అవసరమైనప్పుడు దిద్దుబాటును ఇచ్చినా, యెహోవా తమను ప్రేమిస్తున్నాడని సంఘంలోని సహోదరులు తెలుసుకునేలా చేయడమే వాళ్ల ముఖ్య ఉద్దేశమని ఆ కోర్సు మాకు నేర్పించింది.”—జోయల్, మొదటి తరగతి, 1999.
ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాల
ఉద్దేశం: యెహోవా సంస్థలో మరిన్ని బాధ్యతలు చేపట్టేలా ఒంటరి పెద్దలను, పరిచర్య సేవకులను సిద్ధం చేయడం. దీనిలో పట్టభద్రులైన వారిలో చాలామందిని తమ దేశంలోనే అవసరం ఎక్కువున్న చోట సేవ చేయడానికి నియమిస్తారు. తమను తాము అందుబాటులో ఉంచుకున్న కొందరిని వేరే దేశంలో సేవ చేయడానికి నియమించే అవకాశం ఉంది. కొన్ని మారుమూల ప్రాంతాల్లో సువార్త పనిని ప్రారంభించి, ఆ పనిని విస్తృతపర్చడానికి కొందరిని తాత్కాలిక ప్రత్యేక పయినీర్లుగా నియమించవచ్చు.
ఎంతకాలం: రెండు నెలలు.
స్థలం: బ్రాంచి కార్యాలయం నిర్ణయిస్తుంది. సాధారణంగా సమావేశ హాలులో లేదా రాజ్యమందిరంలో జరుగుతుంది.
అర్హతలు: 23 నుండి 62 సంవత్సరాల మధ్య వయసుగల ఒంటరి సహోదరులై ఉండాలి, వాళ్లకు మంచి ఆరోగ్యం ఉండాలి. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సేవ చేయాలనే కోరిక ఉండాలి. (మార్కు 10:29, 30) రెండు సంవత్సరాలైనా క్రమ పయినీర్లుగా సేవచేసి ఉండాలి. అంతేకాక, క్రమంగా కనీసం రెండు సంవత్సరాలైనా పెద్దలుగా లేదా పరిచర్య సేవకులుగా సేవ చేసి ఉండాలి.
ఎలా చేరవచ్చు: ఆసక్తిగల వాళ్ల కోసం ప్రాంతీయ సమావేశంలో ఒక కూటం జరుగుతుంది. ఆ కూటంలో దీని గురించి సమాచారం ఇస్తారు.
అమెరికాలో, 23వ తరగతి నుంచి పట్టభద్రుడైన రిక్ ఇలా అన్నాడు: “ఈ కోర్సులో పూర్తిగా నిమగ్నమవ్వడం వల్ల నేను నా వ్యక్తిత్వంలో అవసరమైన మార్పులు చేసుకోవడానికి యెహోవా ఆత్మ నాకు సహాయం చేసింది. యెహోవా ఒక నియామకాన్ని ఇచ్చినప్పుడు, అది నిర్వర్తించడానికి కావాల్సిన మద్దతునిస్తాడు. నా ఇష్టప్రకారం కాకుండా దేవుని ఇష్టప్రకారం చేయడంపై దృష్టి నిలిపితే, ఆయన నన్ను బలపరుస్తాడని నేను నేర్చుకున్నాను.”
జర్మనీలో సేవ చేస్తున్న ఆండ్రేయాస్ ఇలా అన్నాడు: “దేవుని సంస్థ ఒక ఆధునిక కాల అద్భుతమని గుర్తించాను. రాబోయే రోజుల్లో చేయాల్సిన సేవ కోసం ఈ పాఠశాల నన్ను సిద్ధం చేసింది. అంతేకాక మేము పరిశీలించిన చాలా బైబిలు ఉదాహరణలు, ‘యెహోవాకు, సహోదరులకు సేవచేయడం వల్ల నిజమైన సంతోషం మన సొంతమౌతుంది’ అనే ప్రాథమిక సత్యాన్ని నేర్పించాయి.”
క్రైస్తవ దంపతుల కోసం బైబిలు పాఠశాల
ఉద్దేశం: యెహోవాకు, ఆయన సంస్థకు ఎక్కువగా ఉపయోగపడేలా వివాహ దంపతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం. దీనిలో పట్టభద్రులైన వారిలో చాలామందిని తమ దేశంలోనే అవసరం ఎక్కువున్న చోట సేవ చేయడానికి నియమిస్తారు. తమను తాము అందుబాటులో ఉంచుకున్న కొందరిని వేరే దేశంలో సేవ చేయడానికి నియమించే అవకాశం ఉంది. కొన్ని మారుమూల ప్రాంతాల్లో సువార్త పనిని ప్రారంభించి, ఆ పనిని విస్తృతపర్చడానికి కొందరిని తాత్కాలిక ప్రత్యేక పయినీర్లుగా నియమించవచ్చు.
ఎంతకాలం: రెండు నెలలు.
స్థలం: అమెరికాలో మొదలైన ఈ పాఠశాల 2012 సెప్టెంబరు నుండి ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేయబడిన కొన్ని బ్రాంచి క్షేత్రాల్లో జరుగుతుంది. ఇది సాధారణంగా సమావేశ హాలులో గానీ రాజ్యమందిరంలో గానీ నిర్వహించబడుతుంది.
అర్హతలు: 25 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు ఉండి, మంచి ఆరోగ్యం ఉన్న వివాహ దంపతులు. అవసరం ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లడానికి వాళ్ల పరిస్థితులు అనుకూలంగా ఉండాలి, వాళ్లకు “నేనున్నాను నన్ను పంపుము” అనే స్వభావం ఉండాలి. (యెష. 6:8) పెళ్లై కనీసం రెండేళ్లు అయివుండాలి, క్రమంగా రెండు సంవత్సరాలైనా పూర్తికాల సేవ చేసివుండాలి. భర్త సంఘ పెద్దగా లేదా పరిచర్య సేవకునిగా క్రమంగా కనీసం రెండు సంవత్సరాలైనా సేవ చేసి ఉండాలి.
ఎలా చేరవచ్చు: ఆసక్తి గలవాళ్ల కోసం జిల్లా సమావేశంలో ఒక కూటం జరుగుతుంది. ఆ కూటంలో దీని గురించి ఎక్కువ సమాచారం ఇస్తారు. ఒకవేళ జిల్లా సమావేశాల్లో అలాంటి కూటం జరగకపోతే, హాజరవ్వాలనే కోరిక ఉన్న మీరు మరింత సమాచారం కోసం బ్రాంచి కార్యాలయానికి ఉత్తరం రాయవచ్చు.
“ఈ ఎనిమిది వారాల కోర్సు యెహోవా సేవలో మరింత ఎక్కువగా చేయాలని కోరుకునే వివాహ దంపతుల జీవితాన్నే మార్చేస్తుంది, దానికి హాజరవ్వడం ఓ గొప్ప అవకాశం! మేము ఇప్పుడు సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడానికి వీలుగా ఒక సమతుల్యమైన జీవితాన్ని గడపాలనే కృత నిశ్చయంతో ఉన్నాం.”—ఎరిక్, కరీనా (కింద), మొదటి తరగతి, 2011.
వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్
ఉద్దేశం: అధిక జనాభాగల ప్రాంతాల్లో మిషనరీలుగా సేవచేసేందుకు, అలాగే ప్రయాణ పర్యవేక్షకులుగా లేదా బెతెల్ సభ్యులుగా సేవచేసేందుకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం. క్షేత్ర వ్యవస్థీకరణను, బ్రాంచి కార్యాలయ వ్యవస్థీకరణను బలపర్చి, పటిష్ఠపర్చాలన్నదే ఈ పాఠశాల ముఖ్య ఉద్దేశం.
ఎంతకాలం: ఐదు నెలలు.
స్థలం: అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ప్యాటర్సన్లోని వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్.
అర్హతలు: ఇప్పటికే ఏదో ఒక ప్రత్యేక పూర్తికాల సేవలో అంటే ప్రత్యేక పయినీర్లుగా, ప్రయాణ పర్యవేక్షకులుగా లేదా బెతెల్ సేవకులుగా, గిలియడ్ పాఠశాలకు హాజరుకాకుండా క్షేత్రంలో మిషనరీలుగా సేవచేస్తున్న వివాహ దంపతులై ఉండాలి. ఇద్దరూ కలిసి కనీసం మూడు సంవత్సరాల నుండైనా క్రమంగా ప్రత్యేక పూర్తికాల సేవ చేస్తూ ఉండాలి. వాళ్లు చక్కగా ఇంగ్లీషు మాట్లాడగలగాలి, చదవగలగాలి, రాయగలగాలి.
ఎలా చేరవచ్చు: దరఖాస్తు పెట్టుకోమని బ్రాంచి కమిటీయే వివాహ దంపతులను ఆహ్వానిస్తుంది.
అమెరికాకు చెందిన లాడే, మనీక్ అనే వివాహ దంపతులు ఇప్పుడు ఆఫ్రికాలో సేవచేస్తున్నారు. “ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి నడుం బిగించి మన ప్రియ సహోదరులతో కలిసి పనిచేయడానికి గిలియడ్ పాఠశాల మమ్మల్ని సంసిద్ధుల్ని చేసింది” అని లాడే అన్నాడు.
ఆయన చెప్పినదానికి మాటలు జోడిస్తూ మనీక్ ఇలా అంది: “దేవుని వాక్యంలో నేను నేర్చుకున్నవాటిని అలవర్చుకుంటుండగా నా నియామకంలో ఎంతో సంతోషాన్ని పొందుతున్నాను. యెహోవా చూపించే ప్రేమకు అది ఇంకో నిదర్శనమని భావిస్తున్నాను.”
బ్రాంచి కమిటీ సభ్యులకు, వారి భార్యలకు పాఠశాల
ఉద్దేశం: బెతెల్ గృహాలను, తమ క్షేత్రంలోని ప్రాంతాలను, జిల్లాలను పర్యవేక్షించడానికి, సంఘాల మీద ప్రభావం చూపించే సేవకు సంబంధించిన విషయాల గురించి శ్రద్ధ తీసుకోవడానికి బ్రాంచి కమిటీల్లో సేవ చేస్తున్న వాళ్లకు సహాయం చేయడం. అలాగే అనువాదం, ముద్రణ, ప్రచురణల రవాణా వంటి విభాగాల గురించి కూడా శిక్షణ ఇవ్వడం.
ఎంతకాలం: రెండు నెలలు.
స్థలం: అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ప్యాటర్సన్లోని వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్.
అర్హతలు: ఇప్పటికే బ్రాంచి కమిటీ లేదా కంట్రీ కమిటీ సభ్యులుగా సేవచేస్తున్న వాళ్లు లేదా ఆ నియామకాన్ని పొందబోయే వాళ్లు.
ఎలా చేరవచ్చు: అర్హులైన సహోదరులను, వారి భార్యలను పరిపాలక సభ ఆహ్వానిస్తుంది.
లోవల్, కారా అనే వివాహ జంట 25వ తరగతిలో శిక్షణ పొంది ఇప్పుడు నైజీరియాలో సేవచేస్తున్నారు. లోవల్ ఇలా అన్నాడు: “మనం ఎంత బిజీగా ఉన్నా, ఏ నియామకాన్ని చేపట్టినా యెహోవాను సంతోషపర్చాలంటే ఆయనకు ఇష్టమైన విధంగానే పనిచేయాలి. మనం ఇతరులతో వ్యవహరిస్తున్నప్పుడు యెహోవా చూపించేలాంటి ప్రేమనే చూపించాలని ఆ కోర్సు నొక్కిచెప్పింది.”
తన భర్తతో ఏకీభవిస్తూ కారా ఇలా అంది: “ఏదైనా విషయాన్ని సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పడం నాకు రాకపోతే, ఇతరులకు బోధించడానికి ముందు నేను ఆ విషయం గురించి అధ్యయనం చేయాల్సిందేనని నాకు బలంగా అనిపిస్తుంది.”