యెహోవా నుండి వీలైనంత ఎక్కువగా నేర్చుకుంటున్నారా?
1. మనం నేర్చుకోవడం గురించి యెహోవా ఎలా భావిస్తున్నాడు?
1 మన ‘మహోపదేశకుడైన’ యెహోవా, మనం నేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. (యెష. 30:20, NW) తన మొట్టమొదటి కుమారుణ్ణి సృష్టించిన తర్వాత ఆయన బోధించడం మొదలుపెట్టాడు. (యోహా. 8:28) ఆదాము తిరుగుబాటు చేసిన తర్వాత కూడా ఆయన బోధించడం ఆపకుండా అపరిపూర్ణ మనుష్యులకు ప్రేమతో ఉపదేశం ఇచ్చాడు.—యెష. 48:17, 18; 2 తిమో. 3:14, 15.
2. నేడు ఏ విద్యా కార్యక్రమం జరుగుతోంది?
2 చరిత్రలోనే అత్యంత గొప్ప విద్యా కార్యక్రమాన్ని నేడు యెహోవా నిర్దేశిస్తున్నాడు. యెషయా ప్రవచించినట్లు, ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది సూచనార్థకమైన ‘యెహోవా మందిర పర్వతానికి’ ప్రవాహంలా వెళ్తున్నారు. (యెష. 2:2) మనం అక్కడికి ఎందుకు వెళ్లాలి? దేవుని మార్గాల గురించి ఉపదేశం పొందాలంటే, అంటే యెహోవా నుండి నేర్చుకోవాలంటే మనం అక్కడికి వెళ్లాలి. (యెష. 2:3) 2010 సేవా సంవత్సరంలో యెహోవాసాక్షులు ప్రజలకు సాక్ష్యమివ్వడానికి, బైబిలు సత్యం బోధించడానికి 160 కోట్ల కన్నా ఎక్కువ గంటలు వెచ్చించారు. అంతేకాక భూవ్యాప్తంగా 1,05,000 కన్నా ఎక్కువ సంఘాల్లో ప్రతీవారం దేవుని గురించిన ఉపదేశం ఇవ్వబడుతోంది, మనకు నేర్పించడం కోసం నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు 500 కన్నా ఎక్కువ భాషల్లో ప్రచురణలు ముద్రిస్తున్నాడు.
3. యెహోవా ఇస్తున్న విద్యనుండి మీరెలా ప్రయోజనం పొందారు?
3 పూర్తిగా ప్రయోజనం పొందండి: దేవుడు ఇస్తున్న ఈ విద్య వల్ల మనం ఎంతగా ప్రయోజనం పొందాం! దేవునికి ఒక పేరు ఉందని, ఆయనకు మనమీద శ్రద్ధ ఉందని మనం నేర్చుకున్నాం. (కీర్త. 83:18; 1 పేతు. 5:6, 7) మనుష్యులు ఎందుకు బాధపడి, చనిపోతున్నారు? నిజమైన సంతోషాన్ని ఎలా పొందవచ్చు? జీవితానికున్న అర్థం ఏమిటి? వంటి అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాం. మన ‘మార్గాన్ని వర్ధిల్లజేసుకునేలా’ నైతిక విషయాల్లో కావాల్సిన నిర్దేశాన్ని కూడా యెహోవా మనకు ఇచ్చాడు.—యెహో. 1:8.
4. నేర్చుకోవడానికి దేవుని సేవకులకు అందుబాటులో ఉన్న కొన్ని అవకాశాలు ఏమిటి? మనం యెహోవా నుండి వీలైనంత ఎక్కువగా ఎందుకు నేర్చుకోవాలి?
4 అంతేకాక, తన సేవకుల్లో ఎక్కువమంది మరింతగా సేవ చేసేలా యెహోవా వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నాడు. కొందరికి అందుబాటులో ఉన్న అలాంటి అవకాశాల గురించి 4-6 పేజీల్లో ఉంది. అక్కడున్న శిక్షణలు పొందేందుకు మన పరిస్థితులు కొన్నిసార్లు అనుకూలించకపోవచ్చు, అయితే మనకు అందుబాటులో ఉన్న దైవిక విద్య నుండి మనం పూర్తిగా ప్రయోజనం పొందుతున్నామా? లోకంలోని ఉన్నత విద్యను అభ్యసించమని టీచర్లు, ఇతరులు యౌవనులను ఒత్తిడి చేస్తున్నారు. అలాంటి యౌవనులను ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోమని, అత్యంత ఉన్నతమైన విద్యను అంటే దైవిక విద్యను నేర్చుకోమని మనం ప్రోత్సహిస్తున్నామా? యెహోవా నుండి వీలైనంత ఎక్కువగా నేర్చుకుంటే ఇప్పుడు సంతోషంగా జీవిస్తాం, భవిష్యత్తులో నిత్యజీవం పొందుతాం.—కీర్త. 119:105; యోహా. 17:3.
నేర్చుకోవడానికి యెహోవా సంస్థలో అందుబాటులోవున్న కొన్ని అవకాశాలు
అక్షరాస్యతా తరగతులు
• ఉద్దేశం: బైబిలును అధ్యయనం చేసేలా, ఇతరులకు సత్యం బోధించేలా ప్రజలకు చదవడం, రాయడం నేర్పించడం.
• ఎంతకాలం: అవసరానికి తగ్గట్టు.
• స్థలం: స్థానిక రాజ్యమందిరం.
• ఎవరు హాజరుకావచ్చు: ప్రచారకులందరు, ఆసక్తివున్నవాళ్లు.
• ఎలా దరఖాస్తు చేసుకోవాలి: స్థానిక అవసరాన్నిబట్టి సంఘ పెద్దలు అక్షరాస్యతా తరగతులను ఏర్పాటు చేసి వాటినుండి ప్రయోజనం పొందగల వాళ్లందర్నీ హాజరవమని ప్రోత్సహిస్తారు.
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల
• ఉద్దేశం: సువార్త చక్కగా ప్రకటించడానికి, బోధించడానికి ప్రచారకులకు శిక్షణ ఇవ్వడం.
• ఎంతకాలం: జరుగుతూనే ఉంటుంది.
• స్థలం: స్థానిక రాజ్యమందిరం.
• ఎవరు చేరవచ్చు: ప్రచారకులందరు. అలాగే సంఘంతో చురుగ్గా సహవసిస్తూ, బైబిలు బోధలు అంగీకరించి, క్రైస్తవ ప్రమాణాల ప్రకారం జీవిస్తున్న వాళ్లు.
• ఎలా దరఖాస్తు చేసుకోవాలి: దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పర్యవేక్షకునితో మాట్లాడండి.
వేరే భాషా తరగతులు
• ఉద్దేశం: వేరే భాషలో సువార్త ఎలా ప్రకటించాలో ప్రచారకులకు నేర్పించడం.
• ఎంతకాలం: నాలుగు లేదా ఐదు నెలలు. ఈ తరగతులు సాధారణంగా శనివారం ఉదయం ఒకటి లేదా రెండు గంటలపాటు జరుగుతాయి.
• స్థలం: సాధారణంగా దగ్గర్లోని రాజ్యమందిరం.
• ఎవరు చేరవచ్చు: వేరే భాషలో ప్రకటించాలని కోరుకునే యోగ్యులైన ప్రచారకులు.
• ఎలా దరఖాస్తు చేసుకోవాలి: అవసరాన్ని బట్టి బ్రాంచి కార్యాలయం ఈ తరగతులను ఏర్పాటు చేస్తుంది.
రాజ్యమందిర నిర్మాణం
• ఉద్దేశం: రాజ్యమందిరాలు నిర్మించడం, బాగుచేయడం. ఇది పాఠశాల కాదు, కానీ ఈ ఏర్పాటులో స్వచ్ఛంద సేవకులకు నిర్మాణ ప్రాజెక్టుల్లో సహాయం చేయడానికి కావాల్సిన నైపుణ్యాలు నేర్పిస్తారు.
• ఎంతకాలం: స్వచ్ఛంద సేవకుల పరిస్థితులకు అనుగుణంగా.
• స్థలం: రీజనల్ బిల్డింగ్ కమిటీ పర్యవేక్షణ కింద ఉన్న ప్రాంతంలో ఎక్కడైనా. విపత్తు సహాయక చర్యల్లో మద్దతివ్వడానికి కొంతమంది స్వచ్ఛంద సేవకులను దూర ప్రాంతాలకు పంపించవచ్చు.
• అర్హతలు: బాప్తిస్మం పొందిన సహోదరసహోదరీలు అయివుండాలి, పెద్దల సభ వాళ్లను ఆమోదించాలి. వాళ్లకు నైపుణ్యం ఉన్నా లేకపోయినా ఫర్వాలేదు.
• ఎలా దరఖాస్తు చేసుకోవాలి: స్థానిక పెద్దల నుండి అప్లికేషన్ ఫర్ కింగ్‌డమ్‌హాల్ కన్స్ట్రక్షన్ వాలంటీర్ ప్రోగ్రామ్ (A-25) ఫారమ్‌ను తీసుకుని నింపాలి.
పయినీరు సేవా పాఠశాల
• ఉద్దేశం: తమ “పరిచర్యను సంపూర్ణముగా” నెరవేర్చేలా పయినీర్లకు సహాయం చేయడం.—2 తిమో. 4:5.
• ఎంతకాలం: రెండు వారాలు.
• స్థలం: బ్రాంచి కార్యాలయం నిర్ణయిస్తుంది. సాధారణంగా దగ్గర్లోని రాజ్యమందిరం.
• అర్హతలు: కనీసం ఒక సంవత్సరం పాటు క్రమ పయినీరు సేవ చేసి ఉండాలి.
• ఎలా చేరవచ్చు: అర్హులైన వాళ్లకు ప్రాంతీయ పర్యవేక్షకుడే తెలియజేస్తాడు.
బెతెల్ ప్రవేశ పాఠశాల
• ఉద్దేశం: కొత్తగా బెతెల్‌కు వచ్చినవాళ్లు ఆ సేవలో రాణించేలా సహాయం చేయడానికి ఈ పాఠశాల ఏర్పాటుచేయబడింది.
• ఎంతకాలం: వారానికి ఒక గంట చొప్పున పదహారు వారాలు.
• స్థలం: బెతెల్.
• అర్హతలు: బెతెల్ కుటుంబంలో శాశ్వత సభ్యులై ఉండాలి లేదా ఎంతో కాలం నుండి (సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువకాలం) స్వచ్ఛంద సేవ చేస్తున్న తాత్కాలిక సభ్యులై ఉండాలి.
• ఎలా చేరవచ్చు: అర్హులైన బెతెల్ కుటుంబ సభ్యులను బ్రాంచి కార్యాలయం ఎంపికచేస్తుంది.
రాజ్య పరిచర్య పాఠశాల
• ఉద్దేశం: పర్యవేక్షించే పనిలో, సంస్థాపరమైన బాధ్యతలు నిర్వర్తించే విషయంలో శ్రద్ధ తీసుకునేలా పెద్దలకు, పరిచర్య సేవకులకు శిక్షణ ఇవ్వడం. (అపొ. 20:28) ఈ పాఠశాల పరిపాలక సభ నిర్ణయం ప్రకారం కొన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.
• ఎంతకాలం: ఇటీవలి సంవత్సరాల్లో పెద్దల కోసం ఒకటిన్నర రోజులు, పరిచర్య సేవకుల కోసం ఒక రోజు నిర్వహించబడుతోంది.
• స్థలం: సాధారణంగా దగ్గర్లోని రాజ్యమందిరంలో లేదా సమావేశ హాలులో జరుగుతుంది.
• అర్హతలు: పెద్దలు లేదా పరిచర్య సేవకులై ఉండాలి.
• ఎలా చేరవచ్చు: అర్హులైన పెద్దలను, పరిచర్య సేవకులను ప్రాంతీయ పర్యవేక్షకుడు ఆహ్వానిస్తాడు.
సంఘ పెద్దల కోసం పాఠశాలa
• ఉద్దేశం: తమ సంఘ బాధ్యతలు నెరవేర్చేలా పెద్దలకు సహాయం చేయడం.
• ఎంతకాలం: ఐదు రోజులు.
• స్థలం: బ్రాంచి కార్యాలయం నిర్ణయిస్తుంది. సాధారణంగా దగ్గర్లోని రాజ్యమందిరంలో లేదా సమావేశ హాలులో జరుగుతుంది.
• అర్హతలు: సంఘ పెద్దలు అయివుండాలి.
• ఎలా చేరవచ్చు: అర్హులైన పెద్దలను బ్రాంచి కార్యాలయం ఆహ్వానిస్తుంది.
ప్రయాణ పర్యవేక్షకులకు, వారి భార్యలకు పాఠశాలb
• ఉద్దేశం: మరింత సమర్థవంతంగా సంఘాలకు సేవ చేయడానికి, ‘వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడడానికి,’ తమకు అప్పగించబడిన వారిని కాయడానికి ప్రాంతీయ, జిల్లా పర్యవేక్షకులకు సహాయం చేయడం.—1 తిమో. 5:17; 1 పేతు. 5:2, 3.
• ఎంతకాలం: రెండు నెలలు.
• స్థలం: బ్రాంచి కార్యాలయం నిర్ణయిస్తుంది.
• అర్హతలు: ప్రాంతీయ లేదా జిల్లా పర్యవేక్షకులై ఉండాలి.
• ఎలా చేరవచ్చు: అర్హులైన ప్రయాణ పర్యవేక్షకులను వారి భార్యలను బ్రాంచి కార్యాలయం ఆహ్వానిస్తుంది.
ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాలc
• ఉద్దేశం: మరిన్ని బాధ్యతలు చేపట్టేలా పెళ్లికాని పెద్దలను, పరిచర్య సేవకులను సిద్ధం చేయడం. దీనిలో పట్టభద్రులైన వారిలో చాలామందిని తమ దేశంలోనే అవసరం ఎక్కువున్న చోట సేవ చేయడానికి నియమిస్తారు. తమను తాము అందుబాటులో ఉంచుకున్న కొందరిని వేరే దేశంలో సేవ చేయడానికి నియమించే అవకాశం ఉంది.
• ఎంతకాలం: రెండు నెలలు.
• స్థలం: బ్రాంచి కార్యాలయం నిర్ణయిస్తుంది. సాధారణంగా సమావేశ హాలులో లేదా రాజ్యమందిరంలో జరుగుతుంది.
• అర్హతలు: 23 నుండి 62 సంవత్సరాల మధ్య వయసుగల ఒంటరి సహోదరులై ఉండాలి, వాళ్లకు మంచి ఆరోగ్యం ఉండాలి. సహోదరులకు సేవచేయాలనే, రాజ్య సంబంధ విషయాల్లో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సేవ చేయాలనే కోరిక ఉండాలి. (మార్కు 10:29, 30) క్రమంగా రెండు సంవత్సరాలైనా పెద్దలుగా లేదా పరిచర్య సేవకులుగా సేవ చేసి ఉండాలి.
• ఎలా దరఖాస్తు చేసుకోవాలి: మీ బ్రాంచి కార్యాలయం ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తే, దానిలో చేరాలనుకునేవాళ్ల కోసం ప్రాంతీయ సమావేశంలో ఒక కూటం జరుగుతుంది. ఆ కూటంలో దీని గురించి మరింత సమాచారం ఇస్తారు.
క్రైస్తవ దంపతుల కోసం బైబిలు పాఠశాలd
• ఉద్దేశం: యెహోవాకు, ఆయన సంస్థకు ఎక్కువగా ఉపయోగపడేలా వివాహిత దంపతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం. దీనిలో పట్టభద్రులైన వారిలో చాలామందిని తమ దేశంలోనే అవసరం ఎక్కువున్న చోట సేవ చేయడానికి నియమిస్తారు. తమను తాము అందుబాటులో ఉంచుకున్న కొందరిని వేరే దేశంలో సేవ చేయడానికి నియమించే అవకాశం ఉంది.
• ఎంతకాలం: రెండు నెలలు.
• స్థలం: మొదటి కొన్న తరగతులు అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ప్యాటర్సన్లోని వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్లో జరుగుతున్నాయి. ఆ తర్వాత, బ్రాంచి కార్యాలయం నిర్ణయించిన స్థలాల్లో ఈ పాఠశాల జరుగుతుంది. సాధారణంగా సమావేశ హాలులో లేదా రాజ్యమందిరంలో జరుగుతుంది.
• అర్హతలు: 25 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు ఉండి, మంచి ఆరోగ్యం ఉన్న దంపతులు. అవసరం ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లడానికి వాళ్ల పరిస్థితులు అనుకూలంగా ఉండాలి, వాళ్లకు “నేనున్నాను నన్ను పంపుము” అనే స్వభావం ఉండాలి. (యెష. 6:8) పెళ్లయి కనీసం రెండేళ్లు అయివుండాలి, క్రమంగా రెండు సంవత్సరాలైనా పూర్తికాల సేవ చేసివుండాలి.
• ఎలా దరఖాస్తు చేసుకోవాలి: మీ బ్రాంచి కార్యాలయం ఈ పాఠశాలను ఏర్పాటు చేస్తే, దానిలో చేరాలనుకునేవాళ్ల కోసం ప్రత్యేక దిన సమావేశంలో ఒక కూటం జరుగుతుంది. ఆ కూటంలో దీని గురించి ఎక్కువ సమాచారం ఇస్తారు.
వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్
• ఉద్దేశం: మిషనరీ సేవచేసేందుకు పయినీర్లకు, ఇతర పూర్తికాల సేవకులకు శిక్షణ ఇవ్వడం.
• ఎంతకాలం: ఐదు నెలలు.
• స్థలం: అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ప్యాటర్సన్లోని వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్.
• అర్హతలు: మొదటిసారి దరఖాస్తు చేసుకునేటప్పుడు 21 నుండి 38 సంవత్సరాల మధ్య వయసు ఉండి, బాప్తిస్మం పొంది కనీసం మూడు సంవత్సరాలు అయివుండాలి. వాళ్లు ఆంగ్లం మాట్లాడగలగాలి, వాళ్లకు పెళ్లయి కనీసం రెండేళ్లు అయివుండాలి, క్రమంగా రెండు సంవత్సరాలైనా పూర్తికాల సేవ చేసివుండాలి. మంచి ఆరోగ్యం ఉండాలి. విదేశాల్లో సేవచేస్తున్న పయినీర్లు (మిషనరీ హోదా ఉన్నవాళ్లు కూడా), ప్రయాణ పర్యవేక్షకులు, బెతెల్ కుటుంబ సభ్యులు, ఇప్పుడు ‘ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాల’ అని పిలువబడుతున్న ‘పరిచర్య శిక్షణా పాఠశాల’ పట్టభద్రులు, ‘క్రైస్తవ దంపతుల కోసం బైబిలు పాఠశాల’ పట్టభద్రులు కూడా తగిన అర్హతలుంటే దరఖాస్తు చేసుకోవచ్చు.
• ఎలా దరఖాస్తు చేసుకోవాలి: కొన్ని బ్రాంచీల్లో, ఈ పాఠశాలలో చేరాలనుకునేవాళ్ల కోసం జిల్లా సమావేశమప్పుడు ఒక కూటం జరుగుతుంది. ఆ కూటంలో దీని గురించి మరింత సమాచారం ఇస్తారు. మీకు దరఖాస్తు చేయాలని ఉన్నప్పటికీ మీ ప్రాంతంలో సమావేశమప్పుడు అలాంటి కూటం జరగకపోతే, మీ బ్రాంచి కార్యాలయానికి ఉత్తరం రాసి మరింత సమాచారం పొందవచ్చు.
బ్రాంచి కమిటీ సభ్యులకు, వారి భార్యలకు పాఠశాల
• ఉద్దేశం: బెతెల్ గృహాలను, తమ క్షేత్రంలోని ప్రాంతాలను, జిల్లాలను పర్యవేక్షించడానికి, సంఘాల మీద ప్రభావం చూపించే సేవకు సంబంధించిన విషయాల గురించి శ్రద్ధ తీసుకోవడానికి బ్రాంచి కమిటీల్లో సేవ చేస్తున్న వారికి సహాయం చేయడం. అలాగే అనువదించడం, ముద్రించడం, ప్రచురణలు రవాణా చేయడం, ఇతర విభాగాలను పర్యవేక్షించడం వంటి పనులను చక్కగా చూసుకునేందుకు వాళ్లకు శిక్షణ ఇవ్వడం.—లూకా 12:48బి.
• ఎంతకాలం: రెండు నెలలు.
• స్థలం: అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న ప్యాటర్సన్లోని వాచ్‌టవర్ ఎడ్యుకేషనల్ సెంటర్.
• అర్హతలు: బ్రాంచి కమిటీ లేదా దేశపు కమిటీ సభ్యులు లేదా అలా నియామకం పొందే వాళ్లు.
• ఎలా దరఖాస్తు చేసుకోవాలి: అర్హులైన సహోదరులను, వారి భార్యలను పరిపాలక సభ ఆహ్వానిస్తుంది.
[అధస్సూచి]
a ప్రస్తుతం ఈ పాఠశాల కొన్ని దేశాల్లోనే ఉంది.
b ప్రస్తుతం ఈ పాఠశాల కొన్ని దేశాల్లోనే ఉంది.
c ప్రస్తుతం ఈ పాఠశాల కొన్ని దేశాల్లోనే ఉంది.
d ప్రస్తుతం ఈ పాఠశాల కొన్ని దేశాల్లోనే ఉంది.