యెహోవాను ప్రేమించేవాళ్లు “తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు”
“నీ ధర్మశాస్త్రమును ప్రేమించువారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమియులేదు.”—కీర్త. 119:165.
1. పట్టువిడువకుండా కృషిచేయాలని ఓ క్రీడాకారిణి ఉదాహరణ ఎలా చూపిస్తోంది?
టీనేజీ నుండే మేరీ డెక్కర్ పరుగు పందెంలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుంది. 1984లో సమ్మర్ ఒలింపిక్స్‌లో 3,000 మీటర్ల పరుగుపందెంలో మేరీ బంగారు పతకం గెల్చుకుంటుందని ఎంతోమంది అనుకున్నారు. కానీ, ఆమె ఆ పందెమును కనీసం పూర్తిచేయలేకపోయింది. తోటి క్రీడాకారిణి కాలు తట్టుకొని ఆమె మధ్యలోనే కింద పడిపోయింది. గాయపడి కంటతడి పెట్టుకున్న ఆమెను పక్కకు మోసుకెళ్లాల్సి వచ్చింది. కానీ, ఆమెలో పట్టుదల చావలేదు. ఏడాదైనా గడవక ముందే ఆమె 1985లో మళ్లీ పాల్గొని ఒక మైలు దూరం పరుగెత్తే పందెంలో స్త్రీల విభాగంలో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది.
2. మనం ఎలాంటి పరుగుపందెంలో ఉన్నాం? మన ధ్యేయం ఏమై ఉండాలి?
2 ఒక రకంగా చెప్పాలంటే మనం కూడా పరుగుపందెంలోనే ఉన్నాం. అందులో మనం గెలుపే ధ్యేయంగా పరుగెత్తాలి. అయితే, ఇది వేగమే ప్రధానంగా సాగి, కొద్ది క్షణాల్లో ముగిసిపోయే వంద మీటర్ల పరుగుపందెం లాంటిది కాదు. అలాగని ఇది నింపాదిగా చేసే జాగింగ్ లాంటిది కూడా కాదు. గెలవడం కోసం ఓపిగ్గా పరుగెత్తాల్సిన మారథాన్ (సాధారణంగా 42 కి.మీ.) పందెంతో దాన్ని పోల్చవచ్చు. క్రీడలకు పేరుగాంచిన పట్టణమైన కొరింథులోని క్రైస్తవులకు రాస్తున్నప్పుడు అపొస్తలుడైన పౌలు పరుగుపందెమును ఉదాహరణగా తీసుకున్నాడు. ఆయన ఇలా రాశాడు: “పందెపు రంగమందు పరుగెత్తు వారందరు పరుగెత్తుదురు గాని యొక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి.”—1 కొరిం. 9:24.
3. నిత్యజీవం కోసమైన పరుగుపందెంలో ఎలా అందరూ గెలవవచ్చు?
3 క్రైస్తవ పరుగుపందెంలో పరుగెత్తమని బైబిలు మనకు చెబుతోంది. (1 కొరింథీయులు 9:25-27 చదవండి.) ఆ పందెంలో గెలిచే అభిషిక్తులకు పరలోకంలో, వేరే గొర్రెలకు భూమ్మీద నిత్యజీవం బహుమతిగా దొరుకుతుంది. సాధారణంగా జరిగే పరుగుపందెంలా కాక, ఈ పోటీలో పాల్గొని చివరివరకు పరుగెత్తే ప్రతీ ఒక్కరికి బహుమతి దొరుకుతుంది. (మత్త. 24:13) పోటీదారులు ఈ పందెంలోని నియమాలు పాటించనప్పుడు లేదా చివరివరకు పరుగెత్తనప్పుడు మాత్రమే ఓడిపోతారు. అన్నిటికీ మించి, నిత్యజీవం బహుమతిగా దొరికే పరుగుపందెం ఇదొక్కటే.
4. నిత్యజీవం కోసమైన పరుగుపందెంలో చివరివరకు పరుగెత్తడం ఎందుకు అంత సులభం కాదు?
4 అయితే, పరుగుపందెం చివరివరకు పరుగెత్తడం అంత సులభం కాదు. దానికి క్రమశిక్షణ, సంకల్పబలం ఉండాలి. ఇప్పటివరకు కేవలం ఒకే ఒక్కడు ఒక్కసారి కూడా తడబడకుండా ఆ పందెమును పూర్తిచేశాడు. ఆయనే యేసుక్రీస్తు. అయితే, క్రీస్తు అనుచరులు మాత్రం ‘అనేక విషయములలో తప్పిపోతుంటారు’ అని ఆయన శిష్యుడైన యాకోబు రాశాడు. (యాకో. 3:2) అది అక్షర సత్యం! మనమందరం సొంత అపరిపూర్ణతలతో, అలాగే ఇతరుల అపరిపూర్ణతలతో పోరాడక తప్పదు. కాబట్టి, కొన్నిసార్లు మనం తట్టుకుంటాం, తడబడతాం, వేగాన్ని కోల్పోతాం. ఒక్కోసారైతే కిందపడిపోతాం కూడా. కానీ మనం తిరిగి లేస్తాం, పరుగును కొనసాగిస్తాం. కొంతమందైతే తిరిగి లేవడానికి ఇతరుల సహాయం అవసరమైనంతగా పడ్డారు. కాబట్టి, మనం ఎప్పుడో ఒకసారి లేదా పదేపదే తడబడే, పడిపోయే అవకాశం లేకపోలేదు.—1 రాజు. 8:46.
మీరు పడిపోతే సహాయం తీసుకొని, లేచి పరుగెత్తండి!
తడబడినా పందెంలో నిలిచి ఉండండి
5, 6. (ఎ) క్రైస్తవులు “తొట్రిల్లుటకు కారణమేమియులేదు” అని ఎందుకు చెప్పవచ్చు? ఒకవేళ తొట్రిల్లినా తిరిగి లేవడానికి ఎలాంటి సహాయం అందుబాటులో ఉంది? (బి) తొట్రిల్లిన కొంతమంది ఎందుకు తిరిగి లేవరు?
5 ఒకరి ఆధ్యాత్మిక స్థితిని వర్ణించడానికి ‘తడబడడం,’ ‘కూలడం,’ ‘పడిపోవడం’ అనే పదాల్ని మీరు పర్యాయపదాలుగా వాడివుంటారు. బైబిల్లో ఈ పదాలకు అన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లు ఒకే అర్థం ఉంది. ఉదాహరణకు, సామెతలు 24:16లోని పదాల్ని గమనించండి. అక్కడ ఇలా ఉంది: “నీతిమంతుడు ఏడుమారులు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు.”
6 యెహోవా తనపై నమ్మకం పెట్టుకునే వాళ్లను లేవలేనంతగా తడబడనివ్వడు లేదా పడిపోనివ్వడు. అంటే వాళ్ల ఆరాధనకు అంత పెద్ద ఆటంకాన్ని రానివ్వడు. మనం తనను పూర్ణ భక్తితో ఆరాధించేందుకు ‘తిరిగి లేచేలా’ యెహోవా మనకు తప్పక సహాయం చేస్తాడనే భరోసా ఉంది. హృదయపూర్వకంగా యెహోవాను ప్రేమించేవాళ్లకు అది ఎంత ఊరటనిస్తుంది! భక్తిహీనులు తిరిగి లేవాలనుకోరు. వాళ్లు యెహోవా పరిశుద్ధాత్మ సహాయం కోసం, ఆయన ప్రజల సహాయం కోసం అడగరు. ఒకవేళ అలాంటి సహాయం అందించాలని ప్రయత్నించినా అంగీకరించరు. అయితే, ‘యెహోవా ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాళ్లను’ నిత్యజీవపు పరుగుపందెం నుండి శాశ్వతంగా తప్పించేది ఏదీ లేదు.—కీర్తన 119:165 చదవండి.
7, 8. ఒక వ్యక్తి ‘పడిపోయినా’ ఎలా దేవుని అనుగ్రహాన్ని పొందగలుగుతాడు?
7 కొంతమంది తమ బలహీనతల వల్ల అంత గంభీరంకాని పాపం చేస్తారు. కొన్నిసార్లైతే వాటిని మళ్లీమళ్లీ చేస్తారు. కానీ అలాంటి వాళ్లు ‘తిరిగి లేచి’ అంటే మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి, నమ్మకంగా దేవుని సేవలో కొనసాగితే యెహోవా వాళ్లను ఇంకా నీతిమంతులుగానే చూస్తాడు. ప్రాచీన ఇశ్రాయేలు జనాంగంతో యెహోవా వ్యవహరించిన తీరులో ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. (యెష. 41:9, 10) పైన ఇచ్చిన సామెతలు 24:16, ‘పడిపోవడం’ గురించి కాదుగానీ కనికరంగల దేవుని సహాయంతో ‘తిరిగి లేవడం’ గురించి నొక్కిచెబుతోంది. (యెషయా 55:7 చదవండి.) మనమీద నమ్మకంతో యెహోవా, యేసుక్రీస్తు మనల్ని ‘తిరిగి లెమ్మని’ ప్రోత్సహిస్తున్నారు.—కీర్త. 86:5; యోహా. 5:19.
8 మారథాన్ పందెంలో ఒక వ్యక్తి తడబడినా లేదా కింద పడినా, వెంటనే తమాయించుకుంటే పందెమును పూర్తి చేసుకునేంత సమయం ఆయనకు ఉంటుంది. మన నిత్యజీవపు పరుగుపందెం విషయానికొస్తే అది ముగిసే ‘దినం, గడియ’ మనకు తెలియదు. (మత్త. 24:36) అయినా, మనం ఎంత తక్కువగా తడబడితే అంత ఎక్కువగా స్థిరమైన వేగంతో, చివరికంటా పరుగెత్తి, పందెమును విజయవంతంగా పూర్తి చేస్తాం. ఇంతకీ, మనం తడబడకుండా ఎలా ఉండవచ్చు?
తడబడేలా చేసే విషయాలు
9. మనమిప్పుడు వేటిని పరిశీలిస్తాం?
9 తడబడేలా చేసే ఐదు విషయాలను మనమిప్పుడు పరిశీలిద్దాం. సొంత బలహీనతలు, శరీర కోరికలు, తోటి విశ్వాసులు చేసిన అన్యాయాలు, శ్రమలు లేదా హింసలు, సంఘంలోని ఇతరుల అపరిపూర్ణతలు. మనం తడబడితే యెహోవా గొప్ప సహనశీలి అని గుర్తుంచుకోవాలి. యెహోవా తొందరపడి మనం నమ్మకద్రోహులమనే ముద్ర వేయడు.
10, 11. దావీదు ఏ బలహీనతతో సతమతమయ్యాడు?
10 సొంత బలహీనతల్ని పరుగుపందెపు దారిలో పడివున్న చిన్నచిన్న రాళ్లతో పోల్చవచ్చు. రాజైన దావీదు, అపొస్తలుడైన పేతురు జీవితాల్లో జరిగిన సంఘటనల్ని పరిశీలిస్తే మనకు అలాంటి రెండు బలహీనతలు కనిపిస్తాయి. అవి: కొరవడిన ఆశానిగ్రహం, మనుష్యుల భయం.
11 బత్షెబ విషయంలో దావీదు రాజు ప్రవర్తించిన తీరును బట్టి చూస్తే కొన్ని సందర్భాల్లో ఆయనకు ఆశానిగ్రహం కొరవడిందని తెలుస్తోంది. నాబాలు తనను అవమానించినప్పుడు కూడా దావీదు తొందరపడి ఆగ్రహావేశాల్ని చూపించాడు. అలా ఆయా సందర్భాల్లో ఆశానిగ్రహం కోల్పోయినా ఆయన యెహోవాకు నచ్చినట్లు ఉండాలనే ప్రయత్నాల్ని ఎన్నడూ మానుకోలేదు. ఇతరుల సహాయం తీసుకొని ఆయన దేవునితో ఉన్న సంబంధాన్ని తిరిగి సంపాదించుకోగలిగాడు.—1 సమూ. 25:5-13, 32, 33; 2 సమూ. 12:1-13.
12. పేతురు తడబడినా తన పరుగును ఎలా కొనసాగించాడు?
12 ఇక పేతురు విషయానికొస్తే, ఆయన మనుష్యుల భయానికి లొంగిపోయి కొన్నిసార్లు దారుణంగా తడబడ్డాడు. అయినా యెహోవాకు, యేసుకు నమ్మకంగా ఉన్నాడు. ఉదాహరణకు, ఆయన పదిమంది ముందూ తన బోధకుడైన యేసు ఎవరో తెలియదన్నాడు, అలా ఒక్కసారి కాదు అక్షరాలా మూడుసార్లు! (లూకా 22:54-62) మరో సందర్భంలో పేతురు ఓ క్రైస్తవునిలా ప్రవర్తించలేదు. విశ్వాసులైన అన్యజనులు, సున్నతి పొందిన యూదా క్రైస్తవులతో సమానులు కారన్నట్లు ఆయన వ్యవహరించాడు. అయితే, సంఘంలో అలాంటి తారతమ్యాలకు చోటు లేదని అపొస్తలుడైన పౌలుకు స్పష్టంగా తెలుసు. అంటే పేతురు ఆలోచన తప్పే. పేతురు ప్రవర్తన వల్ల సహోదరుల ఐక్యత దెబ్బతినకముందే పౌలు ఆయనను ముఖాముఖిగా గద్దించాడు. (గల. 2:11-14) అప్పుడు పేతురు అహం దెబ్బతిని జీవపు పరుగుపందెం నుండి వైదొలిగాడా? లేదు. పౌలు ఇచ్చిన గద్దింపును మనస్ఫూర్తిగా స్వీకరించాడు, పాటించాడు, తన పరుగును కొనసాగించాడు.
13. అనారోగ్యం వల్ల తడబడే అవకాశం ఉందని ఎలా చెప్పవచ్చు?
13 కొంతమంది తడబడడానికి అనారోగ్యమే కారణం కావచ్చు. దానివల్ల ఆధ్యాత్మిక వేగాన్ని కోల్పోవచ్చు, కొన్నిసార్లు తడబడవచ్చు, అలసిపోవచ్చు. ఉదాహరణకు జపాన్‌లోని ఓ సహోదరి తాను బాప్తిస్మం తీసుకున్న 17 సంవత్సరాలకు ఓ ఆరోగ్య సమస్యతో బాధపడింది. దాని గురించిన చింత ఆమెను ఎంతగా తినేసిందంటే, ఆమె ఆధ్యాత్మికంగా బలహీనపడిపోయింది. కొంతకాలానికి ఆమె నిష్క్రియా స్థితిలోకి జారుకుంది. ఇద్దరు పెద్దలు వెళ్లి ఆమెతో మాట్లాడారు. వాళ్ల దయగల మాటలవల్ల ఆమె ప్రోత్సాహాన్ని పొంది, మళ్లీ కూటాలకు హాజరవడం మొదలుపెట్టింది. తర్వాత ఆమె ఇలా అంది: “సహోదరులు నన్ను ఆప్యాయంగా పలకరించడం చూసి నా కళ్లు చెమర్చాయి.” మన సహోదరి ఇప్పుడు మళ్లీ తన పరుగు అందుకుంది.
14, 15. తప్పుడు కోరికలు కలిగినప్పుడు మనం ఎలాంటి గట్టి చర్య తీసుకోవాలి? ఓ అనుభవం చెప్పండి.
14 చాలామంది శరీర కోరికల వల్ల తడబడ్డారు. ఒకవేళ మనకు ఆ శోధన ఎదురైతే మనం మానసికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా పరిశుభ్రంగా ఉండడానికి గట్టిగా ప్రయత్నించాలి. మనం తడబడేటట్లు చేసే దేన్నైనా అది మన కన్నైనా, చెయ్యైనా దాన్ని ‘పారేయమని’ యేసు ఇచ్చిన ఉపదేశాన్ని గుర్తుచేసుకోండి. కొంతమంది జీవపు పరుగుపందెం నుండి తప్పుకునేటట్లు చేసిన అనైతిక ఆలోచనల్ని, పనుల్ని కూడా తీసిపారేయాలని ఆ మాటల్లో ధ్వనించట్లేదా?—మత్తయి 18:8 చదవండి.
15 క్రైస్తవ కుటుంబంలో పెరిగిన ఓ సహోదరుడు ఒకప్పుడు తాను తోటి పురుషుల మీద లైంగిక వాంఛతో సతమతమయ్యానని చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “నేను ఎప్పుడూ చాలా ఇబ్బందిపడేవాణ్ణి. నేను ఎక్కడా ఇమడలేకపోతున్నానని అనిపించేది.” 20 ఏళ్లు వచ్చేసరికి ఆయన ఓ క్రమపయినీరుగా, పరిచర్య సేవకునిగా సేవచేశాడు. ఆ తర్వాత ఘోరంగా తడబడ్డాడు. అవసరమైన లేఖనాధార క్రమశిక్షణ ఇచ్చి పెద్దలు ఆయనకు కావాల్సిన సహాయాన్ని అందించారు. క్రమంగా ప్రార్థిస్తూ, దేవుని వాక్యం అధ్యయనం చేస్తూ, ఇతరులకు సహాయం చేయడంపై దృష్టి నిలుపుతూ ఉండడం వల్ల ఆయన తిరిగి తన ఆధ్యాత్మిక వేగాన్ని పుంజుకున్నాడు. ఎన్నో ఏళ్ల తర్వాత ఆయన ఇలా ఒప్పుకుంటున్నాడు: “ఇప్పటికీ ఆ తప్పుడు ఆలోచనలు అడపాదడపా పీడిస్తున్నా, నేను వాటిని అణచుకోగలుగుతున్నాను. మనం పోరాడలేనంత పెద్ద శోధనలు యెహోవా రానివ్వడని నేను గ్రహించాను. అందుకే, నేను వాటిని జయించగలననే నమ్మకం యెహోవాకు ఉందని నేను విశ్వసిస్తున్నాను.” ఆ సహోదరుడు ఇలా ముగించాడు: “నేను పడిన ప్రయాస అంతటికీ నూతనలోకంలో ఫలితం దక్కుతుంది. నాకు అది కావాలి! అప్పటివరకు నేను పోరాడుతూనే ఉంటాను.” ఆయన జీవపు పరుగుపందెంలో నిలిచి ఉండాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు.
16, 17. (ఎ) తనకు అన్యాయం జరిగిందని భావించిన సహోదరుడు తన వైఖరి ఎలా మార్చుకోగలిగాడు? (బి) తడబడకూడదంటే మన దృష్టి ఎక్కడ ఉండాలి?
16 తోటి విశ్వాసులు అన్యాయం చేసినప్పుడు కూడా మనం తడబడే అవకాశం ఉంది. ఫ్రాన్స్‌లో ఒకప్పుడు సంఘపెద్దగా సేవచేసిన సహోదరుడు తనకు అన్యాయం జరిగిందని భావించి మనస్తాపానికి గురయ్యాడు. ఫలితంగా, కూటాలకు రావడం మానేసి నిష్క్రియా స్థితిలోకి జారుకున్నాడు. ఇద్దరు పెద్దలు ఆయనను కలిసి, జరిగినదాని గురించి ఆయన తన అభిప్రాయం చెబుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకుండా సానుభూతితో విన్నారు. యెహోవాపై భారం వేయమని ప్రోత్సహించి, దేవునికి నచ్చిన విధంగా జీవించడమే అన్నిటికన్నా ముఖ్యమని నొక్కి చెప్పారు. దానికి ఆయన చక్కగా స్పందించి, సంఘ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ మళ్లీ జీవపు పరుగు పందెంలో తన పరుగును మొదలుపెట్టాడు.
17 క్రైస్తవులందరూ, నియమిత సంఘ శిరస్సైన యేసుక్రీస్తు మీద దృష్టి నిలపాలి, అపరిపూర్ణ మనుష్యుల మీద కాదు. “అగ్ని జ్వాలల” వంటి కళ్లతో చూసే యేసు ప్రతీదాన్ని ఉన్నదున్నట్లుగా, మనకంటే ఎంతో మెరుగ్గా చూస్తాడు. ఆయనలా చూడడం మన తరం కాదు! (ప్రక. 1:13-16) ఉదాహరణకు, మనం అపార్థం చేసుకున్న వాటినే అన్యాయంగా భావించే అవకాశం ఉందని ఆయనకు తెలుసు. సంఘ అవసరాల్ని లోపంలేని రీతిలో, సరైన సమయంలో ఆయన తీరుస్తాడు. కాబట్టి, తోటి క్రైస్తవుల పనుల వల్ల, నిర్ణయాల వల్ల మనం తడబడకూడదు.
18. మనం ఎలా శ్రమల్ని తట్టుకొని నిలబడవచ్చు?
18 శ్రమల లేదా హింసల వల్ల, సంఘంలోని ఇతరుల అపరిపూర్ణతల వల్ల కూడా మనం తడబడే అవకాశం ఉంది. “వాక్యము నిమిత్తము శ్రమయైనను, హింసయైనను” కలిగినప్పుడు కొందరు తడబడతారని విత్తువాని గురించిన ఉపమానంలో యేసు చెప్పాడు. కుటుంబం, పొరుగువారు లేదా ప్రభుత్వాలు ఇలా ఎవ్వరి నుండి హింసలు వచ్చినా ఆధ్యాత్మిక ‘వేరు’ లేనివాళ్లే దానికి తడబడతారు. (మత్త. 13:21) కానీ, మనం సరైన హృదయ స్థితిని కాపాడుకుంటే, రాజ్య విత్తనమే మన విశ్వాసం వేరుపారేలా చేస్తుంది. శ్రమలు వచ్చినప్పుడు “ఖ్యాతిగల” వాటి గురించే ఎక్కువగా ధ్యానించాలి. (ఫిలిప్పీయులు 4:6-9 చదవండి.) యెహోవా అండతో మనం కష్ట పరిస్థితుల్లో ఎంతమాత్రమూ తడబడకుండా శ్రమల్ని తట్టుకొని నిలబడతాం.
ఎన్ని అడ్డంకులు వచ్చినా గమ్యం చేరే వరకు పరుగెత్తండి!
19. ఇతరులు మనల్ని బాధపెట్టినా మనం తడబడకూడదంటే ఏమి చేయాలి?
19 విచారకరంగా, ఇతరుల అపరిపూర్ణతల్ని చూసి కొందరు జీవపు పరుగుపందెం నుండి తప్పుకున్నారు. మనస్సాక్షికి సంబంధించిన విషయాల్లో అభిప్రాయభేదాలు వచ్చి వాళ్లు అభ్యంతరపడ్డారు లేదా తడబడ్డారు. (1 కొరిం. 8:12, 13) ఎవరైనా మనకు బాధ కలిగిస్తే మనం దాన్ని రాద్ధాంతం చేస్తామా? ఇతరులకు తీర్పు తీర్చకూడదని, క్షమించాలని, సొంత హక్కుల కోసం పోరాడకూడదని బైబిలు క్రైస్తవులకు ఉపదేశిస్తోంది. (లూకా 6:37) మీకు అలాంటి తడబాటు ఎదురైతే, ఇలా ప్రశ్నించుకోండి: ‘సొంత ఇష్టాయిష్టాల్ని బట్టి ఇతరులకు తీర్పు తీరుస్తున్నానా? నా సహోదరులు అపరిపూర్ణులని తెలిసిన నేను వాళ్ల అపరిపూర్ణతల్ని చూసి జీవపు పరుగుపందెం నుండి తప్పుకుంటానా?’ యెహోవా మీద ప్రేమ ఉంటే మనం ఎవ్వరి అపరిపూర్ణతలు అడ్డు వచ్చినా, జీవపు పరుగుపందెంలో గమ్యాన్ని చేరుకుంటాం.
ఓపికగా పరుగెత్తండి, తడబడకండి
20, 21. జీవపు పరుగుపందెంలో ఏమి చేయాలని మీరు నిశ్చయించుకున్నారు?
20 మీరు ‘పరుగు కడ ముట్టించాలని’ దృఢంగా నిశ్చయించుకున్నారా? (2 తిమో. 4:7, 8) అలాగైతే తప్పకుండా వ్యక్తిగత అధ్యయనం చేయండి. బైబిలును, ఇతర ప్రచురణలను పరిశోధించండి, ధ్యానించండి, తడబాటుకు గురిచేసే కారణాలు తెలుసుకోండి. ఆధ్యాత్మిక బలం పొందేందుకు పరిశుద్ధాత్మ కోసం వేడుకోండి. ఎప్పుడో ఒకసారి తడబడినంత మాత్రాన లేదా పడిపోయినంత మాత్రాన పరుగు పందెంలో ఓటమే శరణ్యం కాదు. మళ్లీ లేచి, వేగాన్ని పుంజుకోవచ్చు. గతంలో విశ్వాసానికి వచ్చిన పరీక్షల నుండి గుణపాఠం నేర్చుకుంటూ, అడ్డుతగిలే రాళ్లనే విజయానికి మెట్లుగా మలుచుకోవచ్చు.
21 నిత్యజీవపు పరుగుపందెంలో గెలిచేలా పరుగెత్తాలంటే మన వంతు కృషి మనం చేస్తూ ఉండాలని బైబిలు వివరిస్తోంది. ఆ పందెంలో పాల్గొనడం, ప్రయాణీకులను గమ్యానికి చేర్చే బస్సు ఎక్కి కూర్చోవడం లాంటిది కాదు. జీవపు పరుగుపందెంలో మనమే పరుగెత్తాలి. ఆ ప్రయత్నంలో యెహోవా అనుగ్రహించే “నెమ్మది,” మన వెనక నుండి వీచే బలమైన గాలిలా పనిచేస్తుంది. (కీర్త. 119:165) పరుగుపందెమును పూర్తిచేసే వాళ్లందరి మీద యెహోవా ఇప్పుడు, భవిష్యత్తులో నిస్సందేహంగా అంతులేని దీవెనలు కుమ్మరిస్తాడు.—యాకో. 1:12.