యేసు ప్రేమతో చేసిన ప్రార్థనకు అనుగుణంగా ప్రవర్తించండి
“తండ్రీ . . . నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము.”—యోహా. 17:1, 2.
1, 2. యేసు పస్కాను ఆచరించిన తర్వాత ఏమి చేశాడో వివరించండి.
అది సా.శ. 33, నీసాను 14 రాత్రి. దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి తమ పూర్వికులను ఎలా విడిపించాడో గుర్తుచేసే పస్కా ఆచరణను యేసు ఆయన సహచరులు కాసేపటి క్రితమే ముగించారు. అయితే, యేసు నమ్మకమైన శిష్యులు మరింత గొప్ప విడుదల అంటే “నిత్యమైన విమోచన” పొందనున్నారు. ఏ పాపం ఎరుగని వాళ్ల నాయకుడు, ఆ మరుసటి రోజే శత్రువుల చేతుల్లో చనిపోబోతున్నాడు. అయితే, ఆయన మరణం ఓ ఆశీర్వాదంగా మారనుంది, ఎందుకంటే యేసు చిందించిన రక్తం మానవాళిని పాపమరణాల నుండి విడుదల చేసే మార్గాన్ని సుగమం చేస్తుంది.—హెబ్రీ. 9:12-14.
2 ఆ ప్రేమపూర్వకమైన ఏర్పాటును మనం గుర్తుపెట్టుకోవడానికి యేసు, పస్కా ఆచరణ స్థానంలో ఓ కొత్త వార్షిక ఆచరణను ప్రవేశపెట్టాడు. ఆయన పులియని పిండితో చేసిన రొట్టెను విరిచి, తన 11 మంది నమ్మకస్థులైన అపొస్తలులకు ఇచ్చి ఆ ఆచరణను ప్రారంభించాడు. అప్పుడు ఆయన ఇలా అన్నాడు: “ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి.” తర్వాత ఆయన ఎర్రని ద్రాక్షారసం ఉన్న ఓ గిన్నెను పట్టుకొని ఇలా చెప్పాడు: “ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన.”—లూకా 22:19, 20.
3. (ఎ) యేసు మరణం తర్వాత ఏ పెద్ద మార్పు వచ్చింది? (బి) యేసు ప్రార్థనను పరిశీలిస్తున్నప్పుడు మనం ఏ ప్రశ్నలు వేసుకోవాలి?
3 దేవునికి, సహజ ఇశ్రాయేలీయులకు మధ్య ఉన్న ధర్మశాస్త్ర నిబంధన ఇంకాసేపట్లో రద్దుకానుంది. దాని స్థానంలో, యెహోవాకూ యేసు అభిషిక్త అనుచరులకూ మధ్య ఓ కొత్త నిబంధన రానుంది. ఈ కొత్త ఆధ్యాత్మిక జనాంగపు శ్రేయస్సు విషయంలో యేసుకు ఎంతో శ్రద్ధ ఉంది. సహజ ఇశ్రాయేలు జనాంగం మతపరంగా, సామాజికంగా విడిపోయి దేవుని పరిశుద్ధ నామానికి ఎంతో కళంకం తీసుకొచ్చింది. (యోహా. 7:45-49; అపొ. 23:6-9) దానికి భిన్నంగా, తన అనుచరులు ఎప్పటికీ ఐక్యంగా సేవచేస్తూ దేవుని నామానికి ఘనత తీసుకురావాలని యేసు కోరుకున్నాడు. అందుకోసం ఆయనేమి చేశాడు? యేసు ఓ మనోహరమైన ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన చదవడం మనకు దొరికిన ఓ గొప్ప అవకాశం. (యోహా. 17:1-26; ప్రారంభ చిత్రం చూడండి.) మనం ఆ ప్రార్థనను పరిశీలిస్తూ ఈ రెండు ప్రశ్నల గురించి ఆలోచిద్దాం: “యేసు ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడా? ఆ ప్రార్థనకు తగ్గట్లుగా నేను ప్రవర్తిస్తున్నానా?”
యేసుకు అన్నిటికన్నా ఏది ప్రాముఖ్యం?
4, 5. (ఎ) యేసు ప్రార్థనలోని ప్రారంభ మాటల్ని బట్టి మనమేమి నేర్చుకోవచ్చు? (బి) తన గురించి యేసు చేసుకున్న విన్నపానికి యెహోవా ఎలా స్పందించాడు?
4 యేసు, తన శిష్యులకు ఎన్నో అద్భుతమైన విషయాలను బోధిస్తూ అర్థరాత్రి వరకూ మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ఆకాశంవైపు కన్నులెత్తి ఇలా ప్రార్థించాడు: “తండ్రీ, నా గడియ వచ్చియున్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీదను ఆయనకు అధికారమిచ్చితివి . . . చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని. తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము.”—యోహా. 17:1-5.
5 యేసు ప్రార్థనలో ఉన్న ప్రారంభ మాటల్ని గమనించండి. తన పరలోక తండ్రి నామాన్ని ఘనపర్చడమే యేసు ముఖ్య కర్తవ్యమని అక్కడున్న మాటల్నిబట్టి అర్థమౌతుంది. ఆ మాటలు, “తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక” అని యేసు చేసిన మాదిరి ప్రార్థనలోని మొదటి విన్నపానికి తగ్గట్టుగా ఉన్నాయి. (లూకా 11:2) తర్వాత యేసు తన శిష్యుల అవసరాల గురించి ప్రార్థిస్తూ ‘వారందరికి నిత్యజీవము అనుగ్రహించుము’ అని అభ్యర్థించాడు. ఆ తర్వాత, యేసు ఓ వ్యక్తిగత విన్నపం చేస్తూ ఇలా అడిగాడు: “తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమపరచుము.” యెహోవా తన నమ్మకస్థుడైన కుమారునికి అడిగిన దానికంటే ఎంతో ఎక్కువగా ఇచ్చాడు, యేసుకు ‘దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠమైన నామము’ ఇచ్చి ఆశీర్వదించాడు.—హెబ్రీ. 1:3, 4.
‘అద్వితీయ సత్యదేవుణ్ణి తెలుసుకోవడం’
6. నిత్యజీవం సంపాదించుకోవాలంటే అపొస్తలులు ఏమి చేయాల్సివుంది? వాళ్లు అలా చేశారని మనకెలా తెలుసు?
6 పాపులమైన మనం దేవుని కృప వల్ల వచ్చే నిత్యజీవమనే బహుమానాన్ని పొందాలంటే ఏమి చేయాలో కూడా యేసు తన ప్రార్థనలో తెలియజేశాడు. (యోహాను 17:3 చదవండి.) మనం యెహోవా గురించి, తన గురించి ‘ఎరుగుతూ’ ఉండాలని యేసు చెప్పాడు. దాన్ని మనమెలా చేయవచ్చు? మొదటిగా యెహోవా గురించి, ఆయన కుమారుని గురించి నేర్చుకోవడానికి మనం చేయగలిగినదంతా చేయాలి. రెండవదిగా, మనం నేర్చుకున్న వాటిని జీవితంలో పాటించాలి. అపొస్తలులు అదే చేశారు. అందుకే యేసు ప్రార్థనలో, ‘నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను; వారామాటలను అంగీకరించిరి’ అని అన్నాడు. (యోహా. 17:8) అయితే, నిత్యజీవాన్ని సంపాదించుకోవాలంటే, వాళ్లు దేవుని మాటల్ని ఎల్లప్పుడు ధ్యానిస్తూ వాటిని తమ జీవితంలో పాటించాలి. మరి అపొస్తలులు జీవించినంత కాలం అలా చేస్తూనే ఉన్నారా? అవును. అపొస్తలుల పేర్లు కొత్త యెరూషలేము 12 పునాదులపై శాశ్వతంగా రాయబడివున్నాయి కాబట్టి వాళ్లలా చేశారని చెప్పవచ్చు.—ప్రక. 21:14.
7. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే అర్థం ఏమిటి? అది ఎందుకు ప్రాముఖ్యం?
7 మనం నిత్యం జీవించాలంటే, దేవుని గురించి ‘ఎరుగుతూ’ లేదా తెలుసుకుంటూ ఉండాలి. దానర్థం ఏమిటి? మనం ఆయన గురించి ఇంకాఇంకా నేర్చుకుంటూనే ఉండాలని దానర్థం. అయితే, అలా తెలుసుకోవడంలో ఆయన లక్షణాల గురించి, సంకల్పం గురించి తెలుసుకోవడం కన్నా ఎక్కువే ఉంది. మనం దేవుణ్ణి ప్రగాఢంగా ప్రేమించాలి, ఆయనతో మంచి స్నేహబంధం కలిగివుండాలి. అంతేకాకుండా, మనం మన తోటి సహోదరసహోదరీలను కూడా ప్రేమించాలి. “ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు” అని బైబిలు చెబుతుంది. (1 యోహా. 4:8) అలా, దేవుణ్ణి తెలుసుకోవడంలో ఆయనకు విధేయత చూపించడం కూడా ఉంది. (1 యోహాను 2:3-5 చదవండి.) యెహోవాను తెలుసుకున్న వాళ్లలో ఒకరిగా ఉండడం ఎంత అరుదైన అవకాశమో కదా! కానీ, ఇస్కరియోతు యూదా విషయంలో జరిగినట్లే దేవునితో మనకున్న అమూల్యమైన బంధం తెగిపోయే ప్రమాదం ఉంది. అందుకే, ఆ బంధాన్ని కాపాడుకోవడానికి కృషిచేద్దాం. అలాచేస్తే మనం దేవుని కృపవల్ల వచ్చే నిత్యజీవ బహుమానం పొందడానికి అర్హులం అవుతాం.—మత్త. 24:13.
“నీ నామమందు వారిని కాపాడుము”
8, 9. యేసు భూపరిచర్యలో దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు? ఏ బోధను తిరస్కరించాడు?
8 యోహాను 17వ అధ్యాయంలో నమోదైన యేసు ప్రార్థనను చదివిన తర్వాత, ఆయనకు అపొస్తలుల పైనే కాకుండా, భవిష్యత్తులో తన శిష్యులయ్యే వాళ్లమీద కూడా ఎంతో ప్రేమ ఉందని నిస్సందేహంగా ఒప్పుకుంటాం. (యోహా. 17:20, 21) అదే సమయంలో, మన రక్షణ ఒక్కటే యేసుకు ప్రాముఖ్యం కాదని అర్థంచేసుకోవాలి. ఆయన భూపరిచర్య ఆరంభం నుండి చివరి వరకూ తన తండ్రి నామానికి ఘనతను, మహిమను తీసుకురావాలనే తాపత్రయపడ్డాడు. ఉదాహరణకు, యేసు తన పని గురించి నజరేతులోని సమాజమందిరంలో చెబుతున్నప్పుడు, యెషయా గ్రంథపు చుట్ట నుండి ఇలా చదివాడు: “ప్రభువు [“యెహోవా,” NW] ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను.” యేసు ఆ మాటలను చదివినప్పుడు యెహోవా నామాన్ని స్పష్టంగా పలికాడనడంలో సందేహం లేదు.—లూకా 4:16-21.a
9 యేసు భూమ్మీదకు రావడానికి చాలాకాలం ముందే యూదా మతనాయకులు దేవుని నామాన్ని ఉపయోగించకూడదని బోధించారు. అయితే, యేసు భూమ్మీదున్నప్పుడు ఆ బోధను తీవ్రంగా వ్యతిరేకించాడని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆయన తన వ్యతిరేకులతో ఇలా అన్నాడు: “నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను; మీరు నన్ను అంగీకరింపరు; మరి యొకడు తన నామమున వచ్చినయెడల వానిని అంగీకరింతురు.” (యోహా. 5:43) ఆ తర్వాత, ఆయన ఇక కొన్నిరోజులకు చనిపోతాడనగా, తన జీవితంలోని అత్యంత ప్రాముఖ్యమైన విషయం గురించి చెబుతూ ఇలా ప్రార్థించాడు: “తండ్రీ, నీ నామము మహిమపరచుము.” (యోహా. 12:28) కాబట్టి, మనమిప్పుడు పరిశీలిస్తున్న ప్రార్థనలో యేసు తన తండ్రి నామ మహిమకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడని స్పష్టంగా తెలుస్తుంది.
10, 11. (ఎ) యేసు తన తండ్రి నామాన్ని ఎలా తెలియజేశాడు? (బి) యేసు శిష్యులు ఏ లక్ష్యం కోసం పని చేయాలి?
10 యేసు ఇలా ప్రార్థించాడు: “లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారై యుండిరి, నీవు వారిని నాకనుగ్రహించితివి; వారు నీ వాక్యము గైకొని యున్నారు. . . . నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగున వారును ఏకమై యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.”—యోహా. 17:6, 11.
11 యేసు తన శిష్యులకు తండ్రి నామాన్ని తెలియజేశాడంటే, కేవలం ఆ నామాన్ని ఉచ్చరించడం కన్నా ఎక్కువే చేశాడు. యెహోవా ఎలాంటి వ్యక్తో అర్థం చేసుకోవడానికి వాళ్లకు సహాయం చేశాడు. యెహోవా అద్భుతమైన లక్షణాల గురించి, ప్రేమతో ఆయన వ్యవహరించే విధానం గురించి యేసు బోధించాడు. (నిర్గ. 34:5-7) అంతేకాకుండా, ప్రస్తుతం పరలోకంలో రాజుగా పరిపాలిస్తున్న యేసు, తన శిష్యులు భూమంతటా యెహోవా నామాన్ని తెలియజేసేలా సహాయం చేస్తున్నాడు. ఎందుకు? అంతం రాక ముందే వీలైనంత ఎక్కువమంది యెహోవా గురించి తెలుసుకునేలా సహాయం చేయడమే ఆయన లక్ష్యం. అంతం వచ్చినప్పుడు, యెహోవా తన నమ్మకమైన సాక్షులను రక్షిస్తాడు, దాంతో ఆయన మహాగొప్ప నామాన్ని ప్రతీ ఒక్కరు తెలుసుకుంటారు.—యెహె. 36:23.
“లోకము నమ్మునట్లు”
12. ప్రాణాల్ని కాపాడే పనిలో మనం విజయం సాధించాలంటే ఏ మూడు విషయాలు అవసరం?
12 యేసు భూమ్మీదున్నప్పుడు, బలహీనతలను అధిగమించడానికి తన శిష్యులకు ఎంతో సహాయం చేశాడు. యేసు మొదలుపెట్టిన పనిని వాళ్లు పూర్తిచేయాలంటే అలాంటి సహాయం వాళ్లకు అవసరం. “నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని” అని యేసు ప్రార్థించాడు. ప్రాణాల్ని కాపాడే ఈ పనిలో విజయం సాధించడానికి వాళ్లకు అవసరమయ్యే మూడు అంశాలను యేసు తన ప్రార్థనలో నొక్కిచెప్పాడు. మొదటిగా, సాతాను లోకంలో వాళ్లు భాగంగా ఉండకూడదని చెప్పాడు. రెండవదిగా, దేవుని వాక్యంలోని సత్యాలను పాటిస్తూ తమను తాము ప్రతిష్ఠపర్చుకోవాలని లేదా పరిశుద్ధపర్చుకోవాలని చెప్పాడు. మూడవదిగా తాను, తన తండ్రి ఐక్యంగా ఉన్నట్లే తన శిష్యులు కూడా ఐక్యంగా ఉండాలని చెప్పాడు. కాబట్టి మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవాలి: “యేసు చేసిన మూడు విన్నపాలకు తగ్గట్లుగా నేను ప్రవర్తిస్తున్నానా?” తన శిష్యులు ఆ విషయాలను పాటిస్తే, వాళ్లు ప్రకటించే సందేశాన్ని ప్రజలు తప్పకుండా అంగీకరిస్తారనే నమ్మకాన్ని యేసు వ్యక్తం చేశాడు.—యోహాను 17:15-21 చదవండి.
మొదటి శతాబ్దపు క్రైస్తవులు పరిశుద్ధాత్మ సహాయంతో ఐక్యంగా ఉన్నారు (13వ పేరా చూడండి)
13. యేసు ప్రార్థనకు సా.శ. మొదటి శతాబ్దంలో యెహోవా ఎలా జవాబిచ్చాడు?
13 యేసు చేసిన ప్రార్థనలకు యెహోవా జవాబిచ్చాడని అపొస్తలుల కార్యముల పుస్తకాన్ని పరిశీలిస్తే అర్థమౌతుంది. మొదటి శతాబ్దపు క్రైస్తవుల్లో యూదులు-అన్యులు, పేదలు-ధనికులు, దాసులు-యజమానులు ఇలా రకరకాల వాళ్లు ఉన్నారు, కాబట్టి వారిమధ్య తలెత్తగల విభేదాల గురించి ఆలోచించండి. అయినా, వాళ్లు ఎంత ఐక్యంగా ఉన్నారంటే, వాళ్లను క్రీస్తు శిరసత్వం కింద ఉన్న శరీర భాగాలతో బైబిలు పోలుస్తుంది. (ఎఫె. 4:15, 16) విభజనలతో నిండిన సాతాను లోకంలో అలా ఐక్యంగా ఉండడం ఎంతటి అద్భుతమైన విజయమో కదా! బలమైన తన పరిశుద్ధాత్మను ఉపయోగించి దాన్ని సాధ్యపర్చినందుకు ఘనతంతా యెహోవాకే చెందాలి.—1 కొరిం. 3:5-7.
ప్రపంచవ్యాప్తంగా యెహోవా ప్రజలు ఐక్యంగా ఉన్నారు (14వ పేరా చూడండి)
14. యేసు ప్రార్థనకు మన కాలంలో ఎలాంటి జవాబు వచ్చింది?
14 విచారకరంగా, అపొస్తలులు చనిపోయిన తర్వాత ఆ అద్భుతమైన ఐక్యత కనుమరుగైంది. బైబిలు ముందే చెప్పినట్లు గొప్ప భ్రష్టత్వం సంభవించి, కుప్పలుతెప్పలుగా క్రైస్తవమత శాఖలు పుట్టుకొచ్చాయి. (అపొ. 20:29, 30) అయితే, యేసు 1919వ సంవత్సరంలో తన అభిషిక్త అనుచరులను ఆ అబద్ధమత బంధకాల నుండి విడిపించి, ‘పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమలో’ ఐక్యం చేశాడు. (కొలొ. 3:14) వాళ్లు ఐక్యంగా చేసిన ప్రకటనా పనికి ఎలాంటి ఫలితం వచ్చింది? ‘ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్లలో నుండి వచ్చిన’ 70 లక్షలకన్నా ఎక్కువమంది “వేరేగొర్రెలు” అభిషిక్తులతో పాటు ఐక్యంగా యెహోవాను ఆరాధిస్తున్నారు. (యోహా. 10:16; ప్రక. 7:9) ‘నీవు నన్ను పంపావని, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడ ప్రేమించావని లోకం తెలుసుకోవాలి’ అని యేసు చేసిన విన్నపానికి అది ఎంత అద్భుతమైన జవాబో కదా!—యోహా. 17:23.
హృదయాన్ని హత్తుకునే ముగింపు
15. యేసు తన అభిషిక్త శిష్యుల కోసం ఏ ప్రత్యేక విన్నపం చేశాడు?
15 అపొస్తలులు తన రాజ్యంలో తనతోపాటు పరిపాలించేలా యేసు నీసాను 14 సాయంత్రం వాళ్లతో రాజ్య నిబంధనను చేసి వాళ్లకు మహిమ, గౌరవం ఇచ్చాడు. (లూకా 22:28-30; యోహా. 17:22) కాబట్టి, భవిష్యత్తులో అభిషిక్తులయ్యే వాళ్లందరి గురించి ప్రార్థిస్తూ యేసు ఇలా అన్నాడు: “తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడ ఉండవలెననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించితివి.” (యోహా. 17:24) అభిషిక్తులు పొందే ఆ బహుమానాన్ని బట్టి వేరేగొర్రెలు ఈర్ష్యపడరు కానీ సంతోషిస్తారు. అది, నేడు ఈ భూమ్మీద ఉన్న నిజ క్రైస్తవులందరి మధ్య విలసిల్లే ఐక్యతకు మరో రుజువు.
16, 17. (ఎ) యేసు ఏమి చేస్తూ ఉంటానని తన ప్రార్థన ముగింపులో చెప్పాడు? (బి) మనకు ఏమి చేయాలనే కృతనిశ్చయం ఉండాలి?
16 యెహోవాను నిజంగా తెలుసుకుని, ఆయనను ఐక్యంగా సేవించే ప్రజలు ఉన్నారనే వాస్తవాన్ని నేడు చాలామంది విస్మరిస్తున్నారు. దానికి ప్రధాన కారణం వాళ్ల మత బోధకులు చెప్పే అబద్ధాలే. యేసు కాలంలో కూడా పరిస్థితి అలాగే ఉండేది. అందుకే, మనసును హత్తుకునే ఈ మాటలతో ఆయన తన ప్రార్థనను ముగించాడు: “నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగి యున్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియజేసెదను.”—యోహా. 17:25, 26.
17 యేసు నిజంగానే తన తండ్రి నామాన్ని తెలియజేశాడు. ప్రస్తుతం సంఘ శిరస్సుగా ఆయన తన తండ్రి నామాన్ని, సంకల్పాన్ని అందరికీ తెలియజేయడానికి మనకు కావాల్సిన సహాయం అందిస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రకటించమని, శిష్యులను చేయమని ఆయన ఇచ్చిన నియామకాన్ని ఉత్సాహంగా చేస్తూ, ఆయన శిరసత్వానికి లోబడుతూ ఉందాం. (మత్త. 28:19, 20; అపొ. 10:42) అలాగే, మన మధ్యవున్న అమూల్యమైన ఐక్యతను కాపాడుకోవడానికి కూడా కృషిచేద్దాం. ఇవన్నీ చేస్తే మనం యేసు చేసిన ప్రార్థనకు అనుగుణంగా ప్రవర్తించిన వాళ్లమౌతాం. దానివల్ల, మనం యెహోవా నామాన్ని మహిమపరుస్తాం, ఎల్లప్పుడు సంతోషంగా ఉంటాం.
a యేసు లూకా 4:18 లో, యెహోవా వ్యక్తిగత నామం ఉన్న యెషయా 61:1 వచనాన్ని ఎత్తి చెప్పాడు.