కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 మే పేజీలు 20-25
  • యెహోవా పేరు—యేసు దానికి ఎంత విలువ ఇచ్చాడు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా పేరు—యేసు దానికి ఎంత విలువ ఇచ్చాడు?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • “నీ పేరును వీళ్లకు తెలియజేశాను, ఇంకా తెలియజేస్తాను”
  • “నువ్వు నాకు ఇచ్చిన నీ సొంత పేరు”
  • “తండ్రీ, నీ పేరును మహిమపర్చు”
  • “నేనే నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను”
  • ‘నువ్వు నాకు ఇచ్చిన పనిని పూర్తిచేశాను’
  • యెహోవా పేరు—మీరు దానికి ఎంత విలువ ఇస్తున్నారు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • “యెహోవా పేరును స్తుతించండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • విమోచన క్రయధనం నేర్పే పాఠాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • “మీరు ఎవర్ని సేవిస్తారో ఈ రోజే ఎంచుకోండి”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 మే పేజీలు 20-25

అధ్యయన ఆర్టికల్‌ 22

పాట 15 యెహోవా మొదటి కుమారుణ్ణి కీర్తించండి!

యెహోవా పేరు—యేసు దానికి ఎంత విలువ ఇచ్చాడు?

“నీ పేరును వీళ్లకు తెలియజేశాను, ఇంకా తెలియజేస్తాను.”—యోహా. 17:26.

ముఖ్యాంశం

యెహోవా పేరును యేసు ఎలా తెలియజేశాడో, ఆ పేరును ఎలా పవిత్రపర్చాడో, ఎలా సమర్థించాడో చూస్తాం.

1-2. (ఎ) చనిపోయే ముందురోజు రాత్రి యేసు ఏం చేశాడు? (బి) ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

అది గురువారం సాయంత్రం, నీసాను 14, క్రీ.శ. 33వ సంవత్సరం. యేసు తన నమ్మకమైన అపొస్తలులతో ప్రభువు రాత్రి భోజనాన్ని చేశాడు. ఇంకాసేపట్లో యూదా తనకు వెన్నుపోటు పొడుస్తాడని, తను చిత్రహింసలు అనుభవించి, శత్రువుల చేతిలో చనిపోతాడని యేసుకు తెలుసు. కాబట్టి ఆ భోజనం చేసిన తర్వాత తన అపొస్తలులకు ధైర్యం చెప్పాడు. ఇక అందరూ ఆ మేడగది నుండి వెళ్లిపోయే ముందు యేసు ఒక ముఖ్యమైన ప్రార్థన చేశాడు. దాన్ని అపొస్తలుడైన యోహాను, యోహాను 17వ అధ్యాయంలో రాశాడు.

2 యేసు ప్రార్థనలో తనను తొలిచేసిన విషయం ఏంటని అర్థమౌతుంది? భూమ్మీదున్నప్పుడు ఆయన చేసిన పరిచర్య అంతటిలో ఏది ఆయనకు చాలా ప్రాముఖ్యమని ఆ ప్రార్థన చూపిస్తుంది? వీటి గురించి ఈ ఆర్టికల్‌లో మనం చూస్తాం.

“నీ పేరును వీళ్లకు తెలియజేశాను, ఇంకా తెలియజేస్తాను”

3. యెహోవా పేరు గురించి యేసు ఏం చెప్పాడు? ఆయన ఉద్దేశం ఏంటి? (యోహాను 17:6, 26)

3 తన ప్రార్థనలో యేసు ఇలా అన్నాడు: “నీ పేరును వీళ్లకు తెలియజేశాను.” నిజానికి యెహోవా పేరును తన శిష్యులకు చెప్పానని యేసు రెండుసార్లు అన్నాడు. (యోహాను 17:6, 26 చదవండి.) దానర్థం ఏంటి? వాళ్లకు తెలియని పేరును యేసు చెప్పాడా? లేదు. యేసు శిష్యులు యూదులు కాబట్టి దేవుని పేరు యెహోవా అని వాళ్లకు తెలుసు. హీబ్రూ లేఖనాల్లో ఆ పేరు వేలసార్లు ఉంది. కాబట్టి దేవుని పేరు యెహోవా అని యేసు చెప్పలేదు గానీ ఆ పేరు వెనుకవున్న వ్యక్తిని ఆయన వాళ్లకు పరిచయం చేశాడు. అంటే ఆయన ఉద్దేశాలు, పనులు, లక్షణాల గురించి వాళ్లకు చెప్పాడు. యేసుకన్నా బాగా ఈ విశ్వంలో యెహోవా గురించి ఎవరైనా చెప్పగలరా!

4-5. (ఎ) ఒక వ్యక్తి పేరు ప్రాముఖ్యమైనదిగా, మరపురానిదిగా ఎలా మారుతుందో ఉదాహరణతో చెప్పండి. (బి) యెహోవా పేరును యేసు శిష్యులు ఎలా తెలుసుకోగలిగారు?

4 ఉదాహరణకు, మీ సంఘంలో డేవిడ్‌ అనే ఒక సంఘపెద్ద ఉన్నాడని అనుకుందాం, ఆయన ఒక డాక్టర్‌ కూడా. ఆయన మీకు చాలా సంవత్సరాలుగా తెలుసు. కానీ ఒకరోజు మీ ఆరోగ్యం పాడై, ప్రాణాల మీదికి వచ్చింది. మీరు గబగబ ఆయన పనిచేస్తున్న హాస్పిటల్‌కి వెళ్లారు. ఆ బ్రదర్‌ తనకున్న నైపుణ్యాన్ని ఉపయోగించి మీ ప్రాణాలు కాపాడాడు. ఇక ఇప్పుడు ఆ బ్రదర్‌ పేరు మీరు మర్చిపోతారా? ఆ పేరు విన్న ప్రతీసారి ఆయన చేసిన పని మీకు గుర్తొస్తుంది. ఇప్పుడు డేవిడ్‌ కేవలం మీకు తెలిసిన ఒక సంఘపెద్ద మాత్రమేకాదు, మీ ప్రాణాల్ని కాపాడిన ఒక డాక్టర్‌ కూడా.

5 అదేవిధంగా, యేసు శిష్యులకు యెహోవా పేరు అప్పటికే తెలుసు. కానీ యేసు చేసిన పరిచర్య వల్ల ఇప్పుడు వాళ్లకు ఆ పేరు చాలా ప్రాముఖ్యమైన, మరపురాని పేరుగా మారింది. ఎందుకలా చెప్పవచ్చు? ఎందుకంటే యేసు చెప్పిన ప్రతీ మాట, చేసిన ప్రతీ పని తన తండ్రి వ్యక్తిత్వానికి అద్దం పట్టాయి. కాబట్టి యేసు బోధించిన తీరు, ఆయన వ్యవహరించిన తీరు గమనించిన తర్వాత, అపొస్తలులు యెహోవా గురించి ఇంకా బాగా తెలుసుకున్నారు.—యోహా. 14:9; 17:3.

“నువ్వు నాకు ఇచ్చిన నీ సొంత పేరు”

6. యెహోవా తన సొంత పేరును యేసుకు ఇచ్చాడంటే అర్థం ఏంటి? (యోహాను 17:11, 12)

6 తన ప్రార్థనలో శిష్యుల గురించి యేసు ఇలా అడిగాడు: “నువ్వు నాకు ఇచ్చిన నీ సొంత పేరును బట్టి వాళ్లను కాపాడు.” (యోహాను 17:11, 12 చదవండి.) అంటే యేసును ఇక యెహోవా అని పిలవాలా? కాదు. తన ప్రార్థనలో యెహోవా అనే పేరును “నీ సొంత పేరు” అని యేసు అన్నాడని గమనించండి. అందుకే, యేసును యెహోవా అని పిలవం. మరి, “నువ్వు నాకు ఇచ్చిన నీ సొంత పేరు” అన్నప్పుడు యేసు ఉద్దేశం ఏంటి? మొదటిగా, యేసు యెహోవా ప్రతినిధిగా వచ్చాడు, ఆయన తరఫున మాట్లాడాడు. ఆయన తండ్రి పేరుమీద వచ్చాడు, ఆయన పేరుతోనే శక్తివంతమైన పనులు చేశాడు. (యోహా. 5:43; 10:25) రెండోది, యేసు పేరుకు అర్థం “యెహోవాయే రక్షణ.” అవును, యేసు పేరుకున్న అర్థంలో యెహోవా పేరు ఉంది.

7. యెహోవా తరఫున యేసు ఎలా మాట్లాడగలడో ఒక ఉదాహరణతో చెప్పండి.

7 ఈ ఉదాహరణ గమనించండి, ఒక పరిపాలకుడు తన తరఫున మాట్లాడడానికి ఒక ప్రతినిధిని పంపిస్తాడు. ఇప్పుడు ఆ ప్రతినిధి మాటలకు ఆ పరిపాలకుడి మాటలకు ఉన్న శక్తే ఉంటుంది. అదేవిధంగా, యేసు యెహోవా ప్రతినిధిగా వచ్చాడు కాబట్టి తన తండ్రి తరఫున మాట్లాడతాడు.—మత్త. 21:9; లూకా 13:35.

8. యేసు యెహోవా “పేరున వస్తున్నాడు” అంటే దానర్థం ఏంటి? (నిర్గమకాండం 23:20, 21)

8 బైబిలు యేసును వాక్యం అని పిలుస్తుంది. ఎందుకంటే యెహోవా దేవదూతలకు, మనుషులకు చెప్పాలనుకుంటున్న విషయాల్ని యేసును ఉపయోగించుకుని చెప్పాడు. (యోహా. 1:1-3) ఎడారిలో ఇశ్రాయేలీయుల్ని నడిపించడానికి యెహోవా పంపించిన దేవదూత బహుశా యేసే అయ్యుంటాడు. ఆ దేవదూతకు లోబడండి అని ఇశ్రాయేలీయులకు చెప్తున్నప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “అతను నా పేరున వస్తున్నాడు.”a (నిర్గమకాండం 23:20, 21 చదవండి.) అంటే యేసు యెహోవా ప్రతినిధిగా ఉన్నాడు. యెహోవా చేసే ప్రతీది సరైనదని, ఆయన పేరు చాలా పవిత్రమైనదని నిరూపించే వాళ్లలో యేసే చాలా ముఖ్యమైనవాడు!

“తండ్రీ, నీ పేరును మహిమపర్చు”

9. యెహోవా పేరును యేసు ఎంత ప్రాముఖ్యంగా చూశాడో వివరించండి.

9 మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నట్టు యేసు భూమ్మీదకు రావడానికి ముందే యెహోవా పేరును చాలాచాలా ప్రాముఖ్యంగా చూశాడు. యెహోవా పేరును యేసు ఎంత ప్రాముఖ్యంగా చూశాడో, ఆయన భూమ్మీదున్నప్పుడు చేసిన ప్రతీ పనిలో కనిపిస్తుంది. తన పరిచర్య ముగింపులో యేసు ఇలా అన్నాడు: “తండ్రీ, నీ పేరును మహిమపర్చు.” వెంటనే తన తండ్రి పరలోకం నుండి పెద్ద స్వరంతో ఇలా అన్నాడు: “నేను దాన్ని మహిమపర్చాను, మళ్లీ మహిమపరుస్తాను.”—యోహా. 12:28.

10-11. (ఎ) యేసు యెహోవా పేరును ఎలా మహిమపర్చాడు? (చిత్రం కూడా చూడండి.) (బి) యెహోవా పేరు ఎందుకు పవిత్రపర్చబడాలి, సమర్థించబడాలి?

10 యేసు కూడా తన తండ్రి పేరును మహిమపర్చాడు. ఎలా? ఆయన చేసిన ఒక పని ఏంటంటే, తన తండ్రికి ఉన్న అద్భుతమైన లక్షణాల్ని, ఆయన చేసిన అద్భుతమైన పనుల్ని ఇతరులకు చూపించాడు. అయితే, ఆ పేరును మహిమపర్చడానికి ఇంకొక పని కూడా చేయాలి. యేసు యెహోవా పేరును పవిత్రపర్చాలి, దాన్ని సమర్థించాలి.b అది తనకు ఎంత ప్రాముఖ్యమో తన అనుచరులకు నేర్పించిన మాదిరి ప్రార్థనలో చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి.”—మత్త. 6:9.

11 యెహోవా పేరు ఎందుకు పవిత్రపర్చబడాలి, సమర్థించబడాలి? ఎందుకంటే ఏదెను తోటలో సాతాను యెహోవా పేరును అగౌరవపర్చాడు, ఆయన గురించి అబద్ధాలు చెప్పాడు. యెహోవా అబద్ధం చెప్పాడని, ఆదాముహవ్వలకు మంచిదేదో దక్కకుండా చేస్తున్నాడని సాతాను నిందించాడు. (ఆది. 3:1-5) అలా చేయడం వల్ల యెహోవా చేసే పనులు కరెక్ట్‌ కాదని సాతాను చూపించాలని అనుకున్నాడు. సాతాను చెప్పిన అబద్ధాలు నేరుగా యెహోవా పేరు మీద బురద చల్లాయి. ఆ తర్వాత, యోబు రోజుల్లో మనుషులు యెహోవా నుండి ఏదో ఆశించి, స్వార్థంతోనే ఆరాధిస్తారని సాతాను అన్నాడు. మనుషులెవ్వరూ అస్సలు యెహోవాను ప్రేమించరని, కష్టాలు వస్తే ఆయన్ని వదిలేస్తారని సాతాను నిందించాడు. (యోబు 1:9-11; 2:4) అసలు అబద్ధం చెప్పింది యెహోవానా, సాతానా అని నిరూపించడానికి సమయం అవసరమైంది.

ఒక పెద్ద గుంపుకు యేసు కొండ మీది ప్రసంగాన్ని ఇస్తున్నాడు.

దేవుని పేరును పవిత్రపర్చడం ఎంత ప్రాముఖ్యమో తన అనుచరులకు యేసు నేర్పించాడు (10వ పేరా చూడండి)


“నేనే నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను”

12. యెహోవా పేరు మీదున్న ప్రేమతో యేసు ఏం చేయడానికి ఇష్టపడ్డాడు?

12 యేసుకు యెహోవా మీదున్న ప్రేమవల్ల ఆయన పేరును పవిత్రపర్చడానికి, సమర్థించడానికి ఏం చేయడానికైనా వెనకాడలేదు. “నేను నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను” అని ఆయన అన్నాడు. (యోహా. 10:17, 18) అవును, యెహోవా పేరు కోసం యేసు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు.c మొట్టమొదటి పరిపూర్ణ మనుషులైన ఆదాముహవ్వలు యెహోవాను వద్దనుకొని, సాతాను వైపు వెళ్లారు. వాళ్లకు భిన్నంగా, యేసు ఇష్టంగా భూమ్మీదకు వచ్చాడు. ఆయన చేసిన ప్రతీ పనిలో, చెప్పిన ప్రతీ మాటలో యెహోవాకు లోబడ్డాడు. (హెబ్రీ. 4:15; 5:7-10) యేసు చనిపోయేంతవరకు యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. (హెబ్రీ. 12:2) అలా యెహోవాను, ఆయన పేరును ప్రేమిస్తున్నాడని యేసు నిరూపించాడు.

13. సాతాను అబద్ధికుడని నిరూపించడానికి యేసు ఎందుకు సరైన వ్యక్తి? (చిత్రం కూడా చూడండి.)

13 యేసు బ్రతికిన విధానం బట్టి యెహోవా కాదు, సాతానే అబద్ధికుడని తిరుగులేని విధంగా నిరూపించాడు. (యోహా. 8:44) యెహోవా గురించి యేసుకన్నా బాగా ఇంకెవ్వరికీ తెలీదు! ఒకవేళ యెహోవా గురించి సాతాను చెప్పిన దాంట్లో ఇసుమంత నిజం ఉన్నా, అది యేసుకు తెలిసే ఉండాలి కదా! కానీ యేసు యెహోవా పేరును సమర్థిస్తూ గట్టిగా నిలబడ్డాడు. ఆఖరికి, యెహోవా తనను విడిచిపెట్టినట్లుగా కనిపించినా సరే, యేసు చనిపోవడానికే ఇష్టపడ్డాడు గానీ తన పరలోక తండ్రికి అవిధేయత చూపించలేదు.—మత్త. 27:46.d

యేసు హింసాకొయ్య మీద వేలాడుతున్నాడు.

యేసు బ్రతికిన విధానంలో యెహోవా కాదు, సాతానే అబద్ధికుడని రవ్వంత అనుమానం కూడా లేకుండా నిరూపించాడు! (13వ పేరా చూడండి)


‘నువ్వు నాకు ఇచ్చిన పనిని పూర్తిచేశాను’

14. చివరివరకు నమ్మకంగా ఉన్నందుకు యెహోవా యేసుకు ఏ ప్రతిఫలం ఇచ్చాడు?

14 చనిపోవడానికి ముందు రాత్రి చేసిన ప్రార్థనలో యేసు ఇలా అన్నాడు: ‘నువ్వు నాకు ఇచ్చిన పనిని పూర్తిచేశాను.’ చివరివరకు నమ్మకంగా ఉన్నందుకు యెహోవా తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడని యేసు నమ్మాడు. (యోహా. 17:4, 5) ఆ నమ్మకాన్ని యెహోవా వమ్ము చేయలేదు. యేసు సమాధిలోనే ఉండిపోయేలా యెహోవా అనుమతించలేదు. (అపొ. 2:23, 24) ఆయన్ని పునరుత్థానం చేశాడు, పరలోకంలో అందరికన్నా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. (ఫిలి. 2:8, 9) కొంతకాలానికి, యేసు దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలించడం మొదలుపెట్టాడు. ఆ రాజ్యం ఏం సాధిస్తుంది? మాదిరి ప్రార్థనలో ఉన్న రెండో భాగం ఇలా చెప్తుంది: “నీ రాజ్యం రావాలి. నీ [యెహోవా] ఇష్టం పరలోకంలోలాగే భూమ్మీద కూడా నెరవేరాలి.”—మత్త. 6:10.

15. యేసు ఏం చేస్తాడు?

15 త్వరలోనే, యేసు దేవుని శత్రువులతో యుద్ధం చేస్తాడు. చెడ్డవాళ్లందర్నీ హార్‌మెగిద్దోన్‌లో నాశనం చేస్తాడు. (ప్రక. 16:14, 16; 19:11-16) ఆ తర్వాత సాతానును ‘అగాధంలోకి’ నెట్టేస్తాడు. ఇక అప్పుడు సాతాను చేతులు కట్టిపడేసినట్టు అవుతుంది! (ప్రక. 20:1-3) యేసు వెయ్యి సంవత్సరాలు భూమిని పరిపాలిస్తాడు, భూమ్మీదికి శాంతిని తిరిగి తీసుకొస్తాడు, మనుషులందర్నీ పరిపూర్ణతకు నడిపిస్తాడు. చనిపోయినవాళ్లను మళ్లీ బ్రతికిస్తాడు. ఈ భూమిని అందమైన పరదైసుగా మారుస్తాడు. ఇక యెహోవా ఇష్టం నెరవేరుతుంది!—ప్రక. 21:1-4.

16. వెయ్యేండ్ల పరిపాలన తర్వాత ఏం జరుగుతుంది?

16 వెయ్యేండ్ల పరిపాలన తర్వాత ఏం జరుగుతుంది? మనుషుల పాపం, అపరిపూర్ణత కనుమరుగౌతాయి. విమోచన క్రయధనం ఆధారంగా తమ పాపాల విషయంలో క్షమాపణ అడగాల్సిన అవసరం ఇక మనుషులకు ఉండదు. ఇక వాళ్లకు మధ్యవర్తి గానీ, యాజకత్వం గానీ అవసరం ఉండదు. అంతేకాదు “చివరి శత్రువు, మరణం” ఇక ఉండదు. చనిపోయిన వాళ్లందరూ తిరిగి బ్రతుకుతారు కాబట్టి సమాధులన్నీ ఖాళీ అవుతాయి. భూమ్మీదున్న ప్రతిఒక్కరూ పరిపూర్ణులౌతారు.—1 కొరిం. 15:25, 26.

17-18. (ఎ) వెయ్యేండ్ల పరిపాలన చివర్లో ఏం జరుగుతుంది? (బి) తన పరిపాలన అయిపోయిన తర్వాత యేసు ఏం చేస్తాడు? (1 కొరింథీయులు 15:24, 28) (చిత్రం కూడా చూడండి.)

17 వెయ్యేండ్ల పరిపాలన చివర్లో ఇంకేం జరుగుతుంది? అప్పుడు ఒక ప్రత్యేకమైన విషయం జరుగుతుంది. యెహోవా పేరు పవిత్రతకు సంబంధించిన వివాదం ముగిసిపోతుంది. ఎందుకు? యెహోవా అబద్ధికుడని, ఆయన ప్రేమతో పరిపాలించడని ఏదెను తోటలో సాతాను నిందించాడు. అప్పటినుండి తనకు నమ్మకంగా సేవ చేసేవాళ్లందరూ యెహోవా పేరు పవిత్రమైనదని పదేపదే నిరూపిస్తూ వచ్చారు. కాబట్టి, వెయ్యేండ్ల పరిపాలన చివర్లో, యెహోవా పేరు పూర్తిగా సమర్థించబడుతుంది. తను ఒక ప్రేమగల పరలోక తండ్రి అని యెహోవా తిరుగులేని విధంగా నిరూపించుకుంటాడు.

18 వెయ్యేండ్ల పరిపాలన తర్వాత యెహోవా గురించి సాతాను చెప్పిన ప్రతీది పచ్చి అబద్ధమని ప్రతీఒక్కరికి తెలుస్తుంది. అయితే తన పరిపాలన అయిపోయిన తర్వాత యేసు ఏం చేస్తాడు? సాతానులాగే యెహోవాకు ఎదురుతిరుగుతాడా? లేదు! (1 కొరింథీయులు 15:24, 28 చదవండి.) ఆయన తన రాజ్యాన్ని తిరిగి తండ్రికి ఇస్తాడు. యెహోవా పరిపాలనకు ఆయన లోబడతాడు. అవును, యేసు సాతానులా కాదు, యెహోవా మీదున్న ప్రేమవల్ల ఆయన ఏం వదులుకోవడానికైనా సిద్ధంగా ఉంటాడు.

పరలోకం ఉన్న యేసు, తన కిరీటాన్ని యెహోవాకు ఇచ్చేస్తున్నాడు.

వెయ్యేండ్ల పరిపాలన తర్వాత యేసు రాజ్యాన్ని తిరిగి యెహోవాకు ఇష్టంగా ఇచ్చేస్తాడు (18వ పేరా చూడండి)


19. యేసు యెహోవా పేరుకు ఎంత విలువిచ్చాడు?

19 యెహోవా తన పేరును యేసుకు ఇవ్వడంలో ఆశ్చర్యంలేదు. తన తండ్రికి ఆయన పరిపూర్ణ ప్రతినిధి అని యేసు నిరూపించుకున్నాడు. కాబట్టి యేసు యెహోవా పేరుకు ఎంత విలువిచ్చాడు? ఆయనకు ఆ పేరే సర్వస్వం! ఆ పేరు కోసం ఆయన చనిపోవడానికి కూడా వెనకాడలేదు. వెయ్యేండ్ల పరిపాలన తర్వాత తన దగ్గరున్న ప్రతీది యెహోవాకు ఇవ్వడానికి సిద్ధపడతాడు. మనం యేసులా ఎలా ఉండవచ్చు? దీని గురించి తర్వాతి ఆర్టికల్‌లో చూస్తాం.

మీరెలా జవాబిస్తారు?

  • యేసు తన శిష్యులకు యెహోవా పేరును ఎలా తెలియజేశాడు?

  • యెహోవా తన పేరును యేసుకు ఇచ్చాడంటే అర్థం ఏంటి?

  • యెహోవా పేరు కోసం యేసు ఏం చేయడానికి ఇష్టపడ్డాడు? ఎందుకు?

పాట 16 అభిషిక్త కుమారుణ్ణి బట్టి యెహోవాను స్తుతించండి

a కొన్ని సందర్భాల్లో, దేవుని పేరుతో సందేశాల్ని చేరవేసిన దేవదూతలు కూడా యెహోవాకు ప్రాతినిధ్యం వహించారు. అందుకే, బైబిల్లో కొన్నిసార్లు ఫలానా దేవదూతను యెహోవా అని పిలవడం చూస్తాం లేదా స్వయంగా యెహోవానే అన్నట్టుగా సంబోధించడం చూస్తాం. (ఆది. 18:1-33) మోషేకు యెహోవాయే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడని లేఖనాలు చెప్తున్నప్పటికీ, యెహోవా మోషేకు ఆ ధర్మశాస్త్రాన్ని దేవదూతల ద్వారా ఇచ్చాడని వేరే వచనాలు చూస్తే అర్థమౌతుంది.—లేవీ. 27:34; అపొ. 7:38, 53; గల. 3:19; హెబ్రీ. 2:2-4.

b పదాల వివరణ: “పవిత్రపర్చడం” అంటే గౌరవించడం, పవిత్రంగా చూడడం, లేదా భక్తితో చూడడం. “సమర్థించడం” అంటే అభాండాల నుండి ఒక వ్యక్తి పేరును కాపాడడం లేదా ఆరోపణల నుండి ఒక వ్యక్తిని విడుదల చేయడం లేదా ఒక వ్యక్తి మీద పడ్డ నిందలు అబద్ధమని నిరూపించడం.

c యేసు మరణం, మనుషులు శాశ్వతకాల జీవితాన్ని సొంతం చేసుకోవడానికి కూడా మార్గం తెరిచింది.

d కావలికోట, ఏప్రిల్‌ 2021, 30-31 పేజీల్లో ఉన్న “పాఠకుల ప్రశ్న” చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి