సువార్తనందించుట—వ్యక్తిగత నిశ్చయతతో
1 థెస్సలోనిక సంఘము కష్టపడి చేసిన పనిని గుర్తు చేసుకొనుచు అపొస్తలుడైన పౌలు యిలా అనెను: “మా సువార్త, మాటతో మాత్రముగాక, శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చిన సంగతి మాకు తెలియును. . . . మీరు . . . మమ్మును ప్రభువును పోలినడుచు కొనిన వారైతిరి.” (1 థెస్స. 1:5, 6) ఔను, పౌలు తన సహచరులకు, థెస్సలోనిక సంఘమునకు, తాము దేవుని సరైన రీతిగా ఆరాధించుచున్నామను విషయము నిశ్చయముగా తెలియును. ఈ నిశ్చయత వారి మాటలలో ప్రతిబింబించెను. అలాగే, మన పరిచర్యయు వ్యక్తిగత సంపూర్ణ నిశ్చయతను (వ్యక్తిగత ఒప్పుదలను) ప్రతిబింబించవలెను.
హృదయమునుండి మాట్లాడుము
2 మన పరిచర్యలో వ్యక్తిగత నిశ్చయతను మనమెట్లు ప్రతిబింబించగలము? అందులో మన హృదయములోయున్న దానిని వ్యక్తపరచుట ముఖ్యముగా యిమిడియున్నది. మనము సువార్తనందించు పద్ధతి చెప్పుదానిని మనము నిజముగా నమ్ముచున్నామని చూపురీతిగా యుండవలెను. మనము హృదయములో నుండి మాట్లాడినట్లయిన మన యథార్థత, వ్యక్తిగత నిశ్చయత చాలా బాగా అగపడును. ఎందుకనగా ‘హృదయమునిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును.’—లూకా 6:45.
3 వ్యక్తిగత నిశ్చయతను మనము కనపరచవలెనన్న, సత్యము యెడల మరియు యెహోవా సంస్థయెడల బలమైన మెప్పుదలను మనము తప్పక కలిగియుండవలెను. సత్యమును కలిగియున్న నీవు దానిని నేర్చుకొనునట్లు ఇతరులకు సహాయము చేయు బాధ్యతను కలిగియున్నావు. వీటినిగూర్చి అనుకూలముగా తలంచుట సత్యమును నీవు నిశ్చయతతో అందించులాగున ప్రేరేపింపబడుటకు సహాయము చేయును. సమరయ స్త్రీతో మాట్లాడుటయందు యేసు ఈ విషయములో మనకు మంచి మాదిరినుంచియున్నాడు.—యోహాను 4:21-24.
4 సాహిత్యములను అందించు మన పద్ధతికూడా మనము హృదయమునుండి మాట్లాడుచున్నామా లేదా అను విషయమును ప్రతిబింబించును. సువార్తనందించునప్పుడు సాహిత్యపు అందింపుతో మనము బాగుగా పరిచయము గలవారమై యుండి, యింటివారి యిచ్ఛకు సరిపడు నిర్దిష్ట అంశములను ఎన్నుకొనవలెను. ఇది సాహిత్యమునందించునప్పుడు మన నమ్మకమును కూడా పెంచును.
అయుక్తమైన అలవాట్లను విసర్జించుము
5 కొన్నిసార్లు కొన్ని విధములైన అయుక్తపు చేష్టలు యింటివారు మన యథార్థతను నిశ్చయతను దృష్టించు తీరుపై ప్రభావము చూపును. అనవసరముగా మన సాహిత్యములవైపు చూచుట యింటివారితో మాట్లాడునప్పుడు మన చూపులను అటుయిటు తిరుగనిచ్చుట వారితో మనము యథార్థ భావముతో మాట్లాడుటలేదను అభిప్రాయమును కలుగజేయును.
6 మన ముఖభావములు మన హృదయములోయున్న వాటిని బయలుపరచును గనుక అవియు ప్రాముఖ్యమై యున్నవి. సంపూర్ణ నిశ్చయత, మరియు యింటివారియెడలగల నిష్కపటమైన శ్రద్ధ మీ ముఖ ఆకృతిలో కనిపించవలెను.
7 మన పదముల ఎన్నికయు మనము వదలివచ్చు అభిప్రాయముపై ఎక్కువ ప్రభావమును కలిగియుండును. మనము పదే పదే ‘నేననుకుంటున్నాను’ ‘ఉండవచ్చు’ అను మాటలను వాడుచున్నట్లయిన యింటివారు మనము చెప్పు దానియెడల నిశ్చయతను కలిగిలేమని అభిప్రాయమును పొందవచ్చును. మనము ఎన్నుకొను పదములను మనము కలిగియున్న నిశ్చయతను ప్రతిబింబించవలెను.—మత్తయి 7:28, 29ని పోల్చుము.
8 వ్యక్తిగత నిశ్చయతతో సువార్తను అందింప మీరు కష్టించి పని చేయుకొలది, ‘మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాద’ను నిశ్చయతను మీరు కలిగియుండవచ్చును.—1 కొరిం. 15:58.