ప్రత్యేక ఆసక్తిగల పత్రికలు సిద్ధముగా యున్నవి
1 సంతోషమైన భవిష్యత్తును వెదకు వారందరికి ఎంతో ఆసక్తికరమైన శీర్షికలను ఏప్రిల్ మరియు మే మాసముల ది వాచ్‌టవర్ మరియు అవేక్! సంచికలు అందించనైయున్నవి. ఉదాహరణకు “మానవజాతిని సమాధానమునకు ఎవరు నడుపుదురు?” “ప్రపంచశాంతి—నిజముగా దాని భావమేమి?” అను అంశములు ఏప్రిల్ 1, మరియు 15 వాచ్‌టవర్ సంచికలలో యుండును. (ప్రాంతీయ భాషలలోని పత్రికలు: “ఒక క్రొత్తలోకము అతిసమీపముగా యున్నది,” “నూతనలోకపు పరదైసు తిరిగి పొందబడినది” మరియు “మీరు క్రొత్త తలంపులను అంగీకరింతురా” అనునవి వరుసగా ఏప్రిల్ మరియు మే సంచికలలో యుండును.)
2 ఏప్రిల్ మరియు మే అవేక్ సంచికలలో “దీర్ఘకాల జీవితమునకు ఏ ఉత్తరాపేక్షలు కలవు?,” “పరిశుభ్రమైన భూమి—దానిని చూచుటకు మీరు జీవించియుందురా?,” “తుపాకులు లేని లోకము—అది సాధ్యమా” (ప్రాంతీయ భాషలో: “విలువలకు ఏమి సంభవించుచున్నది?” మరియు “సమూలనాశనము—దాని విషయములో ఎందుకు మీరు జాగ్రత వహించవలెను?” అను అంశములుండును.) మీ ప్రాంతములోని ప్రజలు ఈ పత్రికలను చదువు అవకాశమును పొందవలెనని మీరు అంగీకరింతురా?
ఎక్కువగా పాలుపొందుట
3 ఏప్రిల్ మరియు మే నెలలలో రాబోవుచున్న మిక్కిలి ఉన్నతమైన ఈ సంచికలను పంచుటలో పూర్తిగా పాల్గొనుటకు ఇప్పుడే మనము పథకమును వేసుకొనవలెను. సాధారణముగా గడుపు దానికంటే ఎక్కువ సమయమును ఈ పత్రికలను పంచుటలో గడుపుటకు ఎందుకు ఏర్పాటులను చేసుకొనకూడదు? సమయమునకు తగిన అట్టి అంశములను పరిశీలించు పత్రికలను నమ్మకము మరియు ఉత్సాహముతో మనము అందించగలము.
4 మన పత్రికా అందింపులను వృద్ధిచేయుటకు మనకు ఏమి సహాయపడును? మొదటిగా చెప్పవలెనంటే ఆ పత్రికలను మనము సవివరముగా చదువవలెను. వాటితో ఎంత ఎక్కువ పరిచయమును కలిగియుంటే అంత ఎక్కువ ఆసక్తితో వాటిని అందించగలము. అలా చదువునప్పుడు వివిధ శీర్షికలలో ఉన్నతపరచగల అంశములను కనుగొనుటకు మనము ప్రయత్నించవలెను. కొన్ని విధములైన ప్రజలకు యింపైనదానిగా ఉండు ఏ విషయము ఒక్కొక్క శీర్షికలో యున్నది? మనకై మనము ఇలా అడుగుకొనవచ్చును: “ఈ శీర్షికలను ప్రత్యేకముగా ఎవరు మెచ్చుకొందురు? పొరుగువారికి, పరిచయస్థునికి, వ్యాపారస్తునికి, విద్యార్థికి మొదలగు వారికి ఏది యిష్టకరముగా యుండును?” నిజముగా ఫలభరితముగా యుండుటకు, సమయానుకూలమైన అట్టి శీర్షికల యెడలగల మన జ్ఞానము మరియు వాటితో పొందిన ఆనందమునుబట్టి వాటిని మనము వ్యక్తిగతముగా సిఫారసు చేయగలవారమై యుండవలెను.
వ్యక్తిగత గురిని పెట్టుకొనుము
5 కొందరు ఏప్రిల్ మరియు మే మాసములలో పత్రికలను అందించుటకు వ్యక్తిగతగురిని పెట్టుకొనగొరవచ్చును. అలాగైన దానికి సరిపడురీతిగా మీ పత్రికల అర్డర్‌ను పెంచమని కోరుటకు తప్పిపోవద్దు. ప్రత్యేకముగా నీవు ఈ మాసములలో ఆక్జలరీ పయినీరుగా చేయుటకు పథకము వేసుకొనుచున్నట్లయిన దానిని వెంటనే చేయవలెను.
6 అయినను, పత్రికలను అందించుటకు యింటింటి పరిచర్యయందేగాక అనేకమైన యితరమార్గములును ఉన్నవి. వీధిసాక్ష్యమందును, వ్యాపారముయొద్దకు వెళ్లినప్పుడును పత్రికలను అందించవచ్చును. అనేకమంది సహోదరులు పత్రికా మార్గములను (మాగజైన్ రూట్స్) ఏర్పరచుకొనిరి. ఆసక్తిగలవారియొద్దకు పునర్దర్శనములకై వెళ్లునప్పుడును పత్రికలను విడిచిరావచ్చును. తటస్థసాక్ష్యము కూడా సాక్ష్యమిచ్చుటకును పత్రికలనందించుటకు శ్రేష్టమైన మార్గము. కొన్నిసార్లు కేవలము దృష్టినాకర్షించు పైకవరును చూపించుటయే సంభాషణను ప్రారంభించుటకు లేక పత్రికను అందించుటకు సరిపోవును.
7 మన పత్రికలు ప్రత్యేకమైనవను విషయమును గుర్తించుకొనుము. సమాధానము, సంతోషము, నిత్యజీవపు మార్గమును అవి చూపును. (యోహాను 17:3) కావున ఏప్రిల్ మరియు మే ది వాచ్‌టవర్ మరియు అవేక్ సంచికలలో ప్రచురింపబడు ఉన్నతమైన శీర్షికలద్వారా మరియెక్కువగా పనిలో పాల్గొని ఆనందించుటకు పథకమును వేసుకొనుము.