బైబిలు పఠనములను ప్రారంభించుటకు మెలకువగా యుండుడి
1 గృహ బైబిలు పఠనములను ప్రారంభించి వాటిని నడిపించుట యెహోవాసాక్షులుగా మనకప్పగింపబడిన పనిలో భాగమైయున్నది. (మత్త. 28:19, 20) కాబట్టి దీనిని చేయుటలో దేవుని జతపనివారలలో నీవును ఒకనిగా ఉందువా? (1 కొరిం. 3:9) విశ్వములోనున్న అత్యంత గొప్ప వ్యక్తిని ఎరుగుటకు ఇతరులకు సహాయము చేయుట ఎంతటి ఆధిక్యత!
2 వేగముగా మారుతున్న లోకసంఘటనల సంబంధముగా యున్న అనేక సమస్యలను బట్టి యథార్థహృదయులైన అనేకమంది వ్యక్తులు ఈ సంగతులు ఎందుకు జరుగుతున్నవో అని సమాధానముల కొరకు చూచుచున్నారు. వారి ప్రశ్నలకు ఎంతో కాలక్రితమే యెహోవా సమాధానములనిచ్చియున్నాడు. యథార్థపరులైనవారు దేవుని వాక్యముచే బోధింపబడినప్పుడు ఆదరింపబడుదురు. కావున మనము బైబిలు పఠనములను ప్రారంభించు అవకాశముల విషయములో మెలకువగా ఉండవలెను.—సామె. 3:27.
అవకాశములయెడల మెలకువ కలిగియుండుడి
3 దగ్గర బంధువుతోనో లేక పరిచయస్తునితోనో బైబిలు పఠనమును ప్రారంభించుటను మీరు తలంచియున్నారా? వారిని తెలిసికొనియుండుట వారితో విషయమును చర్చించుటకు తగిన అనుకూల సమయమును గ్రహించి ఉపయోగించుటకు వీలు కల్పించును. సరైన సమయమునకు బాగుగా ఎన్నుకొనబడిన ప్రశ్న లేక మాట సత్యమందు వారి ఆసక్తిని రేకెత్తించగలదను విషయమును మనస్సునందుంచుకొనుము. వ్యక్తి యొక్క ఆతురత పురికొల్పబడినప్పుడు, ఫలవంతమగు చర్చలు మొదలై బైబిలు పఠనము ప్రారంభించబడవచ్చును.
4 అనేక సందర్భాలలో క్రైస్తవ జతయొక్క మంచి ప్రవర్తన అవిశ్వాసి సత్యములోనికి వచ్చునట్లు మార్గమును తెరచినది. (1 పేతు. 3:1, 2) అవిశ్వాసులైన జతలు మరియు అవిశ్వాసులైన కుటుంబ సభ్యులు సంఘసభ్యుల వలన గుర్తించబడి, వారితో గౌరవింపబడినప్పుడు సాధారణంగా వారు దానిని మెచ్చుకొందురు. వారియందు వ్యక్తిగత శ్రద్ధ తీసుకొనుట వారితో స్నేహపూర్వకమైన సంబంధాలు ఏర్పరచుకొనుట యందు ఎంతగానో తోడ్పడగలదు. జతతో కలిసి పనిచేయుట లేక సత్యములోనున్న కుటుంబసభ్యునితో పనిచేయుటద్వారా నీవు బైబిలు పఠనమును ప్రారంభించగలగవచ్చును.
5 ఇంటింటి పరిచర్యలో పనిచేయునప్పుడు, మొదటిసారి కలిసినప్పుడే మనము బైబిలు పఠనమును ప్రారంభించుటకు ప్రయత్నించవచ్చును. దీనిని మనమెట్లు చేయగలము? యింటివారు నేరుగా సాహిత్యములోనుండే సమాధానమివ్వగల ప్రశ్నలను అడిగినప్పుడు కొందరు ప్రచారకులు అట్లు చేయుటలో విజయవంతులైరి. ఒకవేళ వ్యక్తి సాహిత్యమును చదువుటకు లేక మనము చదువుటకు ఆహ్వానించినట్లయిన ఆ అవకాశమును చర్చను కొనసాగించుటకు లేక పఠనమును ప్రదర్శించుటకు ఉపయోగించవచ్చును. మొదటిసారి కలిసినప్పుడు ఎంతసేపు ఉండవలెననుటకు మీరు మీ స్వంత వివేచనను ఉపయోగించుము. తర్వాత ఎప్పుడైనా, లేక మరొక రోజున వచ్చి చర్చను కొనసాగించుట ప్రయోజనకరమగును. భవిష్యత్తులో మాట్లాడుటయందు మొదటిసారి కలిసినప్పుడు మీరు పరిచయము చేసిన అంశమునే కొనసాగించుటకు మీరు యిష్టపడవచ్చును. లేక గత దర్శన ముగింపునందు వేయబడిన ప్రశ్నను అంశముగా తీసుకొనవచ్చును.
తటస్థముగా దొరకు సమయములు
6 గృహబైబిలు పఠనములను ప్రారంభించుటకు మనము చేయు ప్రయత్నములందు తటస్థముగా సాక్ష్యమిచ్చుట ఇంకొక ఫలదాయకమైన ప్రాంతము కాగలదు. మన అనుదిన కార్యములలో పఠనము చేయుటకు యిష్టపడు అనేకమంది వ్యక్తులతో మనకు పరిచయమేర్పడవచ్చును. ఇందు ఫలవంతముగా ఉండుటకు సహాయపడుటకై పరీక్షించి చూడబడిన రీజనింగ్ పుస్తకములోని కొన్ని ఉపోద్ఘాతములను సంభాషణను ప్రారంభించుటకు ఉపయోగించవచ్చును. మొదట్లో ఆ వ్యక్తి ఎక్కడో ఉంటాడు గనుక మనము వ్యక్తిగతముగా అక్కడకు వెళ్లి పఠనము జరిగించే అవకాశములేదని పఠనమును అందించుటకు వెనుకాడకుము.
7 తటస్థసాక్ష్యమిచ్చుటకు లభించు సమయముల విషయములో మెలకువగా ఉండుము. వినువారియొక్క ఆసక్తిని సత్యమునందు హెచ్చించునటువంటి కరపత్రములను లేక పత్రికలను ఎక్కువ మొత్తములో కలిగియుండుము. (ప్రసం. 11:1) ఒక వ్యక్తి సత్యమందు ఆసక్తిని కనపరచి, ఆయన మీ సంఘ ప్రాంతమందు ఉంటుండక పోయినట్లయిన ఆయన అడ్రసును, లేక కావలసిన ఇతర సమాచారమును తీసుకొని తాను నివసించు ప్రాంతములోని సంఘమునకు పంపించుము. ఆ విధముగా ఎవరో ఒకరు ఆయనను గూర్చి తగిన శ్రద్ధ తీసుకొన వీలగును.
8 శిష్యులను తయారు చేయుపని ఎవరో కొద్దిమందికి మాత్రమే కాదు. అది సంఘములోనున్న వారందరికొరకు, శిష్యులను తయారు చేయువారిగా నుండుట క్రైస్తవులకు నియమింపబడినపని అని మనస్సునందుంచుకొనుట బైబిలు పఠనములను ప్రారంభించు అవకాశములయెడల మెలకువ కలిగియుండుటకు మనలను ప్రోత్సహించును.