ప్రాంతీయ సేవలో బైబిలును ఉపయోగించుము
1 బైబిలునందలి ప్రేరేపిత మాటలు ప్రజలపై శక్తివంతమైన ప్రభావమును కలిగియుండగలవు. ఈ హేతువుచేతనే మొదటి శతాబ్దపు క్రైస్తవులు సువార్త ప్రకటించినప్పుడు లేఖనములను బహుగా ఉపయోగించారు. పౌలు లేఖనములను ‘తర్కించి తన అంశములను వచనముల ఆధారముతో నిరూపించి వివరించెను.’ (అపొ. కార్య. 17:2, 3) అపొల్లొ యూదులకు సాక్ష్యమిచ్చినప్పుడు, “యేసేక్రీస్తని లేఖనముల ద్వారా దృష్టాంతపరచెను.”—అపొ. కార్యములు 18:24-28.
2 యెహోవా సాక్షులు నేడు ఈ మాదిరినే అనుసరించుచున్నారు. వాచ్‌టవర్ మార్చి 1, 1986 పుట 26 నందు పేర్కొనినట్లుగా: “బహిరంగ పరిచర్యలో వారు పాల్గొనునప్పుడు, వారు ప్రకటించు వర్తమానము వారి స్వంత వాక్యములోనిదని ప్రజలు గుర్తించగోరుదురు. కనుక వారు బైబిలును ప్రత్యక్షంగా ఉపయోగించి, వీలైనప్పుడల్లా దాని నుండి ఇతరులకు వాస్తవంగా చదువుతారు.” మీ పరిచర్యలో మీరు బైబిలును సంపూర్ణంగా వాడగలుగుచున్నారా? మీ ప్రాంతమందలి ప్రధాన భాషలో బైబిలును ఎల్లవేళల మీతోపాటు తీసుకువెళ్లి, వీలైనప్పుడెల్లా దానినుపయోగించుటకు ఎందుకు ప్రయత్నించకూడదు.
ఎందుకు ప్రభావముగలదై యున్నది
3 బైబిలు ఎందుకంత ప్రభావము గలదైయున్నది? అది దేవుని వాక్యము గనుక, మరియు అది “హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధింపగలదై” యున్నది. (హెబ్రీ. 4:12) లేఖన సత్యము చూపబడినప్పుడు వ్యక్తుల అసలు దృక్పథములు బయటపడును. యథార్థ హృదయులు దానికి ఆకర్షితులగుదురు. దృష్టాంతమునకు, యెహోవాను సేవించుటలో త్వరిత అభివృద్ధిని సాధించిన ఒక యువ జంటను, సువార్తకు అంత త్వరగా మరియు వేగంగా ఎందుకు ప్రతిస్పందించారని ప్రశ్నిస్తే, దానికి వారి సమాధానము? “అది బైబిలు” అని చెప్పారు. తమ్మును దర్శించిన ప్రచారకులు వారి అవధానమును బైబిలుకు మరల్చినప్పుడు “మంచి గొర్రెల కాపరి” స్వరమును వారు గుర్తించారు.—యోహా. 10:14; W78 6/1 పుటలు, 22-3.
4 ప్రాంతీయ సేవలో కొన్నిసార్లు బైబిలును సంపూర్ణంగా ఉపయోగించలేకపోవుచున్నట్లు మీరు భావించారా? క్రైస్తవ కూటములన్నింటికి సిద్ధపడి హాజరగుటతోపాటు ఒక మంచి వ్యక్తిగత పఠనా కార్యక్రమము నిన్ను ప్రతిసత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడునట్లుచేసి మీకు మరింత ధైర్యమును చేకూర్చును. (2 తిమో. 3:16, 17) సేవా సహవాసులు, కుటుంబ సభ్యులు సంభాషణ అంశమును ఒకరితోనొకరు అభ్యాసము చేయవచ్చును. మరియు రీజనింగ్ స్తకములోని పుటలు 9-15 నందలి పరిచయములందు సంభాషణ ప్రారంభములో ఒక లేఖనము చదువుట చేర్చబడింది. వీటిలో కొన్నింటిని ఎందుకు అభ్యసించకూడదు? మీ ప్రాంతమందలి ప్రజలకు ఏది ఆచరణాత్మకమో, ఏది ఆసక్తిని రేకెత్తించునో దానిని ఉపయోగించుము.
మంచి వివేచన ఉపయోగించుము
5 గృహస్థులను తమ స్వంత బైబిలును తెచ్చి మనతోపాటు లేఖనములను చూడమని ఆహ్వానించు సమయములుండును. అట్టి పరిస్థితులలో మంచి వివేచనను ఉపయోగించుము. (రీజనింగ్ పుస్తకములో పుట 67, పేరా 3, పుట 279, పేరా 2, చూడుము.) క్లుప్తంగా చెప్పవలసివస్తే, సంభాషణ అంశమందలి ఏదో ఒక లేఖనమును చదువుటకు మనము నిశ్చయించుకొనవచ్చును. గృహస్థుడు నిజంగానే పనితొందరలో ఉంటే, మనము కేవలం ఒక వాక్యమును పేర్కొని, అది బైబిలునుండి తీసుకొనబడినదని అతనికి తెలియజేయవలెను. యేసు మరియు అపొస్తలులు ప్రకటించేటప్పుడు తమతోపాటు తీసుకువెళ్లేందుకు వారి వద్ద హెబ్రీ లేఖనముల వ్యక్తిగత ప్రతులు లేవు. అయితే వాటినుండి వారు బహు విస్తారంగా పేర్కొన్నారు. మనముకూడ లేఖనములను మనస్సునందుంచుకొని మన పరిచర్యలో ఉపయోగించులాగున వాటిని జ్ఞాపకముంచుకొన ప్రయత్నించవలెను.
6 ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగా ఉండుమని’ పౌలు తిమోతిని హెచ్చరించెను. (2 తిమో. 2:15) నేడు మనకును అదే హెచ్చరిక అన్వయించును. మన ప్రాంతీయ పరిచర్యలో బైబిలును బహు తరచుగా వాడుటద్వారా మనము యేసును, అపొస్తలులను అనుకరించుటకు కోరుకొందము. వీలైనప్పుడెల్లా దానినుండి చదువుము. అయితే అవసరమైనప్పుడు జ్ఞాపకమున్న దానిని పేర్కొనుము. దీనిని ప్రభావితముగా చేయుటవలన మనము దేవుని పరిచారకులమని, మన వర్తమానము స్థిరముగా ఆయన వాక్యముపై ఆధారపడినదేనని స్పష్టీకరించగలము.