పునర్దర్శనముల బాధ్యతను అంగీకరించుము
1 పునర్దర్శనములు చేయుటలో సాధ్యమైనంత పూర్తిగా భాగము వహించుటకు ప్రేరకమైన కారణములు అనేకము కలవు. పౌలుకు వలెనే, మనకు ఇవ్వబడిన పనిని సంపూర్ణముగా నెరవేర్చుటకు మనమిష్టపడుదుము. (అపొ. 20:21, 24) ఆసక్తి చూపిన వారందరిని తిరిగి సందర్శించుటను మనము సమగ్రముగా చేసినట్లయిన, మన పరిచర్యను సంపూర్ణముగా నెరవేర్చుటకు కృషిచేయుచుండగా మనము మంచి మనస్సాక్షిని కాపాడుకొందుము.—2 తిమో. 4:5.
2 జ్ఞానము మనలను బాధ్యులను చేయుచున్నది: జీవితములు ప్రమాదములో ఉన్నవను వాస్తవము పునర్దర్శనములు చేయుటలో పట్టుదల కలిగియుండుటకు మనలను కదిలించవలెను. (యోహా. 17:3) యెహోవా తీర్పు మరియు హార్మెగిద్దోను సమీపమైనదను మన జ్ఞానము దుష్టులను హెచ్చరించుటకు మాత్రమే కాక, ‘భూమిపై జరిగించబడుచున్న వాటివిషయమై మూల్గులిడుచు ప్రలాపించుచున్న’ వారికి సహాయము చేయుటకును మనలను పురికొల్పవలెను. (యెహె. 9:4) యెహోవా దృశ్య సంస్థ సహవాసములోనికి వారిని తెచ్చుట అవసరము.
3 సత్యమును ఖచ్ఛితముగా అర్థము చేసికొనుటకు ప్రజలకు సహాయము అవసరము. (అపొ. 8:30, 31; 18:26) మనము విత్తిన సత్యమను విత్తనములకు “నీరుపోయుటకు” తిరిగి సందర్శించు మన బాధ్యతను అంగీకరించుటకు ఇది మరొక కారణమై యున్నది. యెహోవాను గూర్చి ఆయన అద్భుతకరమైన సంకల్పమును గూర్చి ఎవరో ఒకరు సమయము తీసికొని అనేకమార్లు వచ్చియుండకపోతే మనమెంత ఆత్మీయ అభివృద్ధి సాధించి యుండేవారము?—మత్త. 7:12.
4 ప్రేమ మరియు ఆసక్తి చూపుము: పునర్దర్శనములు చేయుట ప్రజల కొరకైన ప్రేమను ప్రదర్శించుటకు శ్రేష్ఠమైన మార్గమైయున్నది. క్రమ పయినీరుగా ఉన్న ఒక అంధ సహోదరుడు ఇట్లనెను: “నా బాప్తిస్మము దగ్గరనుండి, బైబిలునుండి నేను నేర్చుకొనినది ఇతరులకు తెల్పవలెననుటయే నా కోరిక. దీనిని చేయుటనుండి నా వైకల్యత నన్ను అడ్డగించకుండుట నాకు సంతోషముగా ఉన్నది. . . . వీధిలోని ప్రతి ఇంటినిగూర్చి మనస్సునందు వ్రాసికొనుటకు కూడ నేను నేర్చుకున్నాను, కాగా ఈ విధముగా నేను బైబిలు పఠనమందు ఆసక్తిగల వ్యక్తులను తిరిగి సందర్శించుట సాధ్యమాయెను.” ఈ అంధ సహోదరుడు నిజముగా తన హృదయముతో చూడగలిగి, పునర్దర్శనములు చేయుటనుండి, ఇతరులయెడల తన క్రైస్తవ ప్రేమను వ్యక్తపర్చుటనుండి వెనుదీయుట లేదు.
5 పునర్దర్శనములు చేయునప్పుడు, తరచు మనము బైబిలును, మనయందలి నిరీక్షణ కొరకైన హేతువులను తెల్పు మంచి అవకాశములను కలిగియుందుము. (1 పేతు. 3:15) ఇది గృహస్థునికి సహాయము చేయుటయే గాకుండా మన స్వంత ఆసక్తిని, సత్యము కొరకైన ప్రశంసను కూడ రగుల్చును. మరేవిధముగానైనను పొందలేని సంతోషమును పునర్దర్శనములు చేయుట తీసికొనివచ్చును. మరియు ఆ ఆనందముయొక్క నాణ్యత ఎన్నడును కాంతివిహీనము కానవసరము లేదు. ఆసక్తిగా పునర్దర్శనములు చేయుట ద్వారా మనము దానిని ఎడతెగక నూతనపర్చుకోగలము.—సామె. 10:22.
6 పునర్దర్శనములు చేయు మన బాధ్యతను మనము గంభీరముగా తీసికొనవలెను. ఇతరులకు ప్రయోజనార్థమైన దానిని యెహోవా ప్రజలు చేయకుండా ఉండరు, దీనిని మనము 1991వ సేవాసంవత్సరములో ప్రపంచవ్యాప్తముగా జరిగించబడిన కార్యక్రమము ద్వారా చూడవచ్చును. (సామె. 3:27) మనము 34,49,26,952 పునర్దర్శనములను, 39,47,261 గృహబైబిలు పఠనములు నిర్వహించాము. యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మము తీసికొనిన క్రొత్త శిష్యులు 3,00,945 మంది ఉండిరి. పునర్దర్శనములు చేయు మన బాధ్యతను అంగీరించుటకు మనము ఇష్టపడి యుండనట్లయిన ఈ అద్భుతకరమైన అభివృద్ధి ఎన్నడును జరిగియుండేది కాదు.—1 థెస్స. 2:8.