నేటి లోకంలో బైబిలు విలువ
1 నేడు చాలామంది బైబిలు పాతబడిందని, అది అవాస్తవికమని భావిస్తారు. బైబిలే విస్తృతంగా అందజేయబడిన, చరిత్ర అంతటిలో ఎక్కువగా తర్జుమా చేయబడిన గ్రంథమైనప్పటికీ, దానిని కొంతమంది మాత్రమే చదువుతారు, అంతకన్నా తక్కువ మంది మాత్రమే దాని నడిపింపులను అనుసరిస్తారు.
2 అయితే మనం బైబిలును దేవుని వాక్యంగా గౌరవిస్తాం. వాస్తవాలు అది చరిత్రాత్మకంగా సత్యమని తెలుపుతున్నాయి. అంతేకాక, దాని గుర్తించదగిన అనుగుణ్యత, అందులోని ప్రవచనాలు, దాని జ్ఞానం, ప్రజల జీవితాల్లో ప్రయోజనం తెచ్చే దాని బలమైన ప్రభావం బైబిలు “దైవావేశము వలన కలిగిన”దేనని చూపిస్తున్నాయి. (2 తిమో. 3:16) మన అనుభవం, మరియు ఈ అద్భుతమైన కానుకయెడల మనకున్న మెప్పు, ఇతరులు దాని నిజమైన విలువను పరిశోధించడానికి వారిని ప్రోత్సహించేలా మనల్ని ప్రేరేపించాలి.
3 ఇలా ప్రారంభించవచ్చు:
◼ “మానవజాతి ఎదుర్కొనే గంభీరమైన సమస్యల దృష్ట్యా చాలామంది ప్రజలు దేవుడున్నాడని నమ్మలేమని అనుకుంటారు. మనం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించే దేవుని సామర్థ్యాన్ని ప్రశ్నిస్తారు. దాన్నిగూర్చి మీరేమనుకుంటారు? [జవాబు చెప్పనివ్వండి.] ఈ కరపత్రమును చూడండి, వై యు కెన్ ట్రస్ట్ ది బైబిల్.” కవరు మీది చిత్రం వైపు వారి శ్రద్ధను మళ్ళించి, ఆ పిమ్మట 2వ పేజీలోని మొదటి రెండు పేరాలు చదవండి. ఇంటివారు శ్రద్ధ చూపించినట్లయితే, మీరు రెండవ పేరాలో ఉదహరించబడిన లేఖనాలను చదివి వాటిని చర్చించండి. కరపత్రమందలి విషయంపై ఆసక్తిని పెంచడానికి, ఒక ప్రశ్న రూపంలో దానిలోని ఉపశీర్షికలను చర్చించడానికి పునర్దర్శించే ఏర్పాట్లు చేయండి.
4 దీనికి సారూప్యంగానే మరో విధంగా యిలా ప్రారంభించవచ్చు:
◼ “జీవిత సమస్యలతో వ్యవహరించుటకు మానవజాతికి నడిపింపు అవసరమని మీరు అంగీకరించరా? [జవాబు చెప్పనివ్వండి.] గతంలో, ప్రజలు తరచూ నడిపింపు కొరకు బైబిలు చూసేవారు, కాని కాలం మారిపోయింది. నేడు బైబిలు ఆచరణయోగ్యమని మీరనుకుంటున్నారా? [జవాబు చెప్పనివ్వండి.] రెండవ తిమోతి 3:16లో ఏమి చెప్పబడిందో చూడండి. [చదవండి.] దేవుని లిఖిత వాక్యం వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోడానికి మనకు సహాయం చేయడమే కాక, భవిష్యత్తుకొరకైన నమ్మదగిన నిరీక్షణను కూడ యిస్తుంది.” యోహాను 17:3 చదవండి. ఇంటివారు అనుకూలంగా స్పందిస్తే, బైబిలు ఆచరణాత్మక విలువను ఉదహరించుటకు ది బైబిల్—గాడ్స్ వర్డ్ ఆర్ మ్యాన్స్? అనే పుస్తకం నుండి మీరు ముందే సిద్ధపడిన ఒకటి రెండు నిర్దిష్ట అంశాలను చూపించండి.
5 రీజనింగ్ పుస్తకమునందలి 10వ పేజీలో “బైబిల్/గాడ్” అనే ఉపశీర్షిక కింద ఇవ్వబడిన ఉపోద్ఘాతాలు ఉపయోగించడం మీకు సహాయకరంగా ఉండవచ్చు. ఇంటివారి ప్రశ్నలకు, అభ్యంతరాలకు జవాబివ్వడానికి 58-68 పేజీలలో ఇవ్వబడిన అదనపు సమాచారం మీకు తోడ్పడవచ్చు.
6 న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్‌ను అందించుట: మొదటి దర్శనంలోనో, పునర్దర్శనంలోనో తగినంత ఆసక్తిని పురికొల్పినట్లయితే, న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్‌ను పరిచయం చేయవచ్చు. ఇంటివారికి ఒక బైబిలు ఉందా, ఉంటే అది చదవడానికి సులభంగా ఉందా అని మీరడగవచ్చు. జవాబును బట్టి, న్యూ వరల్డ్ ట్రాన్స్‌లేషన్‌లోని సహాయకరమైన అంశాలవైపు వారి శ్రద్ధను మళ్ళించండి. రీజనింగ్ పుస్తకంనందలి 276 నుండి 280 పేజీల్లోని ఒకటి రెండు అంశాలను నొక్కి చెప్పండి.
7 బైబిలు చదువమని ప్రజలను ప్రోత్సహించడానికి దొరికే అవకాశాలను గూర్చి అప్రమత్తంగా ఉండండి. ఆసక్తి ఉన్న వ్యక్తులు లిఖిత దేవుని వాక్యం యెడల గౌరవాన్ని, ప్రేమను అభివృద్ధిచేసుకొనుటకు సహాయం చేయండి. వారి వ్యక్తిగత జీవితంలో దాని సూత్రాలను అన్వయించి, సత్యమును గూర్చిన జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా వారు ఇప్పుడు, అలాగే భవిష్యత్తులో కూడా అనేక ప్రయోజనాలు అనుభవించగలరు.—కీర్త. 119:105.