మీ బైబిలు విద్యార్థి హృదయాన్ని చేరుకోండి
1 మీ బైబిలు విద్యార్థి నేర్చుకున్న దాన్నిబట్టి ఆయన ప్రవర్తించాలని మీరు కోరుకుంటారా? ఆయన తాను పొందుతున్న జ్ఞానాన్నుండి ప్రయోజనం పొందాలంటే, తానలా చేయాల్సి ఉంటుంది. మీ బైబిలు విద్యార్థి చురుకుగా ప్రతిస్పందించాలంటే, మీరతని హృదయాన్ని చేరుకోవాలి. సా.శ. 33లో, పెంతెకొస్తు దినమున అపొస్తలుడైన పేతురు యిచ్చిన ఉత్తేజపూరిత ప్రసంగం దాదాపు 3,000 మంది “హృదయాలలో నొచ్చుకొను”నట్లు చేయగా, వారు ‘ఆయన వాక్యమును అంగీకరించి’ ఆ దినమే బాప్తిస్మం పొందారు. (అపొ. 2:37, 41) మీ బైబిలు విద్యార్థి హృదయాన్ని మీరెలా చేరుకోగలరు?
2 బాగుగా సిద్ధపడండి: ఎక్కువ సమాచారాన్ని వివరించడానికి ప్రయత్నించవద్దు, అలాచేస్తే విద్యార్థితో తర్కించడానికి తక్కువ సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. మీరు ఉన్నతపర్చబోయే విషయాలను ముందుగానే నిర్ణయించుకొని, మీరు లేఖనాలను అర్థంచేసికొని, ప్రభావవంతంగా అన్వయించగలరను నిశ్చయతను కల్గియుండండి. విద్యార్థి గతజీవితాన్నిబట్టి ఒకవేళ ఆయనలో ఉద్భవించే ప్రశ్నలను ముందుగానే పరిశీలించండి. మీరు మీ విద్యార్థితో బాగా పరిచయం కల్గియున్నట్లైతే, ప్రత్యేకంగా ఆయనకు సరిపడే సమాచారంతో సిద్ధపడి ఉండటానికి ఆ జ్ఞానం మీకు సహాయపడుతుంది.
3 యేసు బోధనా పద్ధతిని అనుకరించండి: కష్టమైన విషయాలను సరళమైనవిగా చేయడానికి, ఒక పరిస్థితిలోని జ్ఞానాన్ని గ్రహించి, స్పందించడానికి తన విద్యార్థులకు సహాయపడటానికి యేసు దృష్టాంతాలను ఉపయోగించాడు. (లూకా 10:29-37) అదేవిధంగా, మీ దృష్టాంతాలను నిజజీవితంలోని సాధారణ విషయాలనుండి తీసుకొని, సరళమైనవిగా ఉంచుతూ, వాటిని ప్రత్యేకంగా విద్యార్థి పరిస్థితులకు అన్వయిస్తూ మీరు విద్యార్థి హృదయంపై ముద్రవేయగలరు.
4 యేసు తరచు ప్రదర్శించినట్లుగానే, బైబిలు విద్యార్థుల హృదయాన్ని చేరుటలో ప్రాముఖ్యంగా ప్రశ్నలు సహాయపడతాయి. (లూకా 10:36) కాని ఒకవేళ విద్యార్థి కేవలం పుస్తకంనుండే సమాధానాన్ని చదువుతుంటే, దానితో సరిపెట్టుకోవద్దు. అతడు ఇంతకుముందు వాటిని పరిశీలించలేదేమో అని తన మనస్సులో తీర్మానించుకోవడానికి నడిపే ప్రశ్నలను ఉపయోగించండి. ఈ పద్ధతి కూడ విద్యార్థి ఆలోచనాశక్తిని వృద్ధిచేసుకోవడానికి సహాయపడుతుంది. ఒక విషయాన్ని ఆయన వ్యక్తిగతంగా ఏమని విశ్వసిస్తాడో తెలుసుకోవడానికి దృష్టినిలిపే ప్రశ్నలను అడగండి. ఏ పరిస్థితుల్లో సహాయం అవసరమో ఆ తర్వాత మీరు గ్రహించవచ్చు, మరి ఎక్కువ ప్రత్యేకమైన సహాయాన్నందించేందుకు మీరు పునర్దర్శించవచ్చు.
5 ఒకవేళ బైబిలు విద్యార్థి అభివృద్ధిని సాధించకపోతే, దానికిగల కారణాలను ఆయన మనస్సులోనుండి రాబట్టవలసిన అవసరముంది. క్రమంగా జరిపే బైబిలు పఠన సమయంలో కాకుండా వేరే సమయంలో దర్శించడం దీనిలో యిమిడియుండవచ్చు. స్పందించడానికి ఎందుకతడు మొహమాటపడుతున్నాడు? అతడు అర్థం చేసుకోనటువంటి లేఖనానుసార అంశం ఏదైనా ఉందా? తన జీవన పద్ధతిలో ప్రత్యేకమైన సర్దుబాట్లు చేసుకోవడానికి విముఖత కల్గియున్నాడా? ఒకవేళ బైబిలు విద్యార్థి ‘రెండు తలంపుల మధ్య తడబడుతుంటే,’ అలా చేయడంలో గల అపాయాన్ని గుర్తించడంలో సహాయపడండి.—1 రాజు. 18:21.
6 ఆసక్తిగల వ్యక్తులకు బైబిలు సత్యాలను బోధించడమనేది జీవితాన్ని కాపాడే పనియని అపొస్తలుడైన పౌలు గుర్తించాడు, మరి అందువల్లే ఆయన క్రైస్తవులందరినీ ‘తమ బోధనుగూర్చి నిలకడగా ఉండుడని’ సలహా యిచ్చాడు. (1 తిమో. 4:16) మీరు బైబిలు పఠనాలు నిర్వహించే వ్యక్తులు కేవలం బైబిలును గూర్చిన, లోకసంఘటనలను గూర్చిన సత్యాలకంటే ఎక్కువగా గ్రహించాల్సి ఉంది. వారు యెహోవాను, యేసునుగూర్చి సరియైన జ్ఞానాన్ని పొంది, వారితో ఒక మంచి వ్యక్తిగత సంబంధాన్ని వృద్ధిచేసుకొనేలా వారికి సహాయం చేయబడాలి. కేవలం అలా చేయడం ద్వారానే వారు తమ విశ్వాసాన్ని క్రియలద్వారా ప్రదర్శించగలరు. (యాకో. 2:17, 21, 22) విద్యార్థి హృదయాన్ని చేరుకున్నట్లైతే, యెహోవాను ఘనపరచే పద్ధతిలో నడుచుకోవడానికి పురికొల్పబడతాడు, మరి తన సొంత ప్రాణాన్ని కాపాడుకుంటాడు.—సామె. 2:20-22.