దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి నేర్చుకోవడానికి ఇతరులకు సహాయపడండి
1 క్రైస్తవులమని చెప్పుకునేవారనేకమంది, ఆలాగే ఇతరులు సంవత్సరంలో వేరే సమయాలకంటే డిశంబరు నెలలో యేసును గూర్చి ఎక్కువగా ఆలోచిస్తారు. కాబట్టి, జీవించినవారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని అందించడానికి ఇది చక్కని నెల. ఇది అమూల్యమైన సాహిత్యం కాబట్టి, పరిచర్యలో అనుకూలమైనప్పుడు దీన్ని చూపించడానికి, గృహస్థులకు అందించడానికి మనం అన్నివిధాల ప్రయత్నించాలి, తద్వారా వారు దానినుండి ప్రయోజనం పొందవచ్చు. మరి మనమెలా అందించగలం?
2 యేసుపై అవధానం నిలిపే బైబిలు ఆధారిత సంభాషణలోనికి నేరుగా దించడానికి ప్రయత్నించండి.
గృహస్థునికి నమస్కారం చెప్పిన తర్వాత, మీరు ఈవిధంగా చెప్పవచ్చు:
◼ “నిరంతరం జీవించే విషయాన్నిగూర్చి తమ బైబిలులో చదివిన తర్వాత వారేమి ఆలోచిస్తారోనని మేము ఈరోజు మా పొరుగువారిని అడుగుతున్నాము. [జవాబు చెప్పనివ్వండి.] ఇది ప్రత్యేకంగా ఆసక్తికరమైంది, ఎందుకంటే నిత్యం జీవించడం సాధ్యమౌతుందని బైబిలు దాదాపు 40 సార్లు దీన్నిగూర్చి తెలుపుతుంది. అలాంటి జీవితం మనకు ఎలాంటి భావాన్నివ్వగలదు? ప్రకటన 21:4 ఏం చెబుతుందో గమనించండి. [చదవండి.] ఏమని వాగ్దానం చేయబడిందో మీరు గమనించారా? [జవాబు చెప్పనివ్వండి.] నిత్యజీవాన్ని మనమెలా పొందగలం?” యోహాను 17:3న చదివి, దేవునిగూర్చి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని పొందే అవసరతను నొక్కితెల్పండి. ఆ తర్వాత గృహస్థునికి యింకా ఆసక్తిని రేకెత్తించడానికి మహాగొప్ప మనిషి పుస్తకాన్ని చూపి, పరిచయ భాగంలో ఉన్న ఉపశీర్షికలను ఉపయోగిస్తూ, దాన్ని అతనికి 40.00 రూ.ల చందాకు అందించండి.
3 ఒకవేళ ఈ పద్ధతి, ఈ సాహిత్యం ఆ గృహస్థునికి తగినది కాదని మీరనుకుంటే, కావలికోట, తేజరిల్లు! అనే పత్రికల సరిక్రొత్త సంచికలను అందించవచ్చు లేదా విల్ దిస్ వరల్డ్ సర్వైవ్? అనే కరపత్రాన్ని ఇవ్వవచ్చు. అందించిన సాహిత్యంలోని ఒకటి లేదా రెండు ప్రత్యేకమైన విషయాలపై అవధానం నిల్పండి. ఆయనతో ఈ విషయాన్ని యింకనూ చర్చించడానికి, అనుకూలమైన సమయంలో పునర్దర్శనం చేస్తానని చెప్పండి.
4 గృహస్థుడు పనిరద్దీలో ఉన్నట్లుగా కనబడితే, పైన పేర్కొన్న అందింపును కుదించి చెప్పడం వివేకంగా ఉండవచ్చు. క్రొత్త ప్రచారకులు కూడా ఈ క్రింది అందింపును ఉపయోగించడం సులభమైందిగా గమనించవచ్చు.
మనల్ని పరిచయం చేసుకున్న తర్వాత, మనమిలా అనవచ్చు:
◼ “నిత్యజీవం పొందడాన్ని గూర్చి వారు తమ బైబిలులో చదివినప్పుడు తామేమని తలుస్తున్నారోనని ఈరోజు మేము మా పొరుగువారిని అడుగుతున్నాము. ఉదాహరణకు, యోహాను 17:3లో యేసు ఏమని చెప్పాడో గమనించండి. [చదవండి.] యేసుక్రీస్తును గూర్చి, ఆయన బోధించినదాన్ని గూర్చి ఎక్కువగా తెలుసుకొనేందుకు సహాయపడడానికే ఈ పుస్తకం ముద్రించబడింది.” మహాగొప్ప మనిషి పుస్తకంలో కొన్ని సుందరమైన చిత్రాలను తెరచిచూపండి. పరిచయ భాగానికి త్రిప్పి, “ఆయననుగూర్చి నేర్చుకొనుటద్వారా కలుగు ప్రయోజనము” అనే ఉపశీర్షిక క్రిందనున్న రెండవ పేరాను చదవండి. ఆ తర్వాత అతనికి సాహిత్యాన్ని అందించండి.
5 మీరు పుస్తకాన్ని అందించినట్లైతే, “పరలోకమునుండి వర్తమానములు” అనే మొదటి అధ్యాయాన్ని ఆ సమయంలో లేదా కొన్ని రోజుల తర్వాత పునర్దర్శనంలో చర్చిస్తానని చెప్పడం ద్వారా బైబిలు పఠనానికి పునాది వేయండి. తర్వాతి దర్శనంలో నిర్ణయించిన సమయాన్ని గడపాలని చెప్పే బదులు, కేవలం కొన్ని నిమిషాల్లోనే తాను దేవుని వాక్యమైన బైబిలు నుండి యేసుక్రీస్తును గూర్చిన ఎక్కువ ఆసక్తికర సమాచారాన్ని నేర్చుకోగలడని చెప్పండి.
6 నిత్యజీవ మార్గంలో ప్రవేశించడానికి ఇతరులకు సహాయపడేందుకుగాను, దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గూర్చిన సత్యంపై అవధానముంచడానికి మనమందరం కూడ లోకసంబంధమైన ఈ సెలవుదినాలను ఉపయోగించుకుందాము.—మత్త. 7:14.