మన వెలుగును ఎడతెగక ప్రకాశింపజేయడం
1 వెలుగు అంటే ఏమిటి? “చూడడాన్ని సాధ్యపర్చేది” అని నిఘంటువు దాన్ని నిర్వచిస్తోంది. అయితే నిజానికి, యోబు 38:24 నందు యెహోవా లేవదీసిన ప్రశ్నకు మానవుడు తన ఆధునాతన సాంకేతికత మినహా ఇంకా జవాబును కనుగొనలేదు. మనం వెలుగు లేకుండా జీవించగలమా? వెలుగులేకుండా మనం ఉండేవాళ్లమే కాదు. భౌతిక దృష్టికి వెలుగు అవసరం మరియు ఆత్మీయ భావంలో “దేవుడు వెలుగై యున్నాడు” అని బైబిలు చెబుతోంది. (1 యోహా. 1:5) “మనకు వెలుగు ననుగ్రహిం[చే]” వానిపై మనం పూర్తిగా ఆధారపడివున్నాము.—కీర్త. 118:27.
2 భౌతిక భావంలో ఇది వాస్తవమే, కానీ ఆత్మీయ భావంలో ఇది మరీ వాస్తవమైవుంది. అబద్ధ మతం అనేకమంది ప్రజలను, “గోడ కొరకు గ్రుడ్డివారివలె తడవులా[డేలా]” వారిని ఆత్మీయ అంధకారంలో పెట్టి తప్పుదోవపట్టించింది. (యెష. 59:9, 10) తన అమితమైన ప్రేమ, వాత్సల్యాలవల్ల యెహోవా ‘వెలుగును సత్యమును పంపిస్తాడు.’ (కీర్త. 43:3) అక్షరార్థంగా “చీకటిలోనుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి” వస్తూ మెప్పుదలగల లక్షలాదిమంది ప్రతిస్పందించారు.—1 పేతు. 2:9.
3 ఈ వెలుగును లోకంలోకి తీసుకురావడంలో యేసుక్రీస్తు ప్రాముఖ్యమైన పాత్రను నిర్వహించాడు. ఆయన ఇలా చెప్పాడు: “నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను.” (యోహా. 12:46) ఆయన సమయం, శక్తి మరియు వనరులు సత్యపు వెలుగు తెలియజేయబడేందుకు ఉపయోగించబడ్డాయి. ఆయన ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రకటిస్తూ బోధిస్తూ తన స్వదేశమంతా ప్రయాణించాడు. ప్రతి దిశనుండి ఆయన ఎడతెగని హింసను సహించాడు, అయితే సత్యపు వెలుగును ప్రసరింపజేయాలన్న తన పనిలో ఆయన దృఢంగా కొనసాగాడు.
4 ఒక నిర్దిష్టమైన గమ్యాన్ని మనస్సులో ఉంచుకుని శిష్యులను ఎన్నుకోవడం, శిక్షణనివ్వడం మరియు వారిని సంస్థీకరించడంపై యేసు తన అవధానాన్ని నిలిపాడు. మత్తయి 5:14-16 నందు, ఆయన వారికిచ్చిన ఉపదేశాలను గూర్చి మనం ఇలా చదువుతాము: “మీరు లోకమునకు వెలుగైయున్నారు. . . . మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి.” యేసువలె వారు సత్యపు వెలుగును నలుమూలలా ప్రసరింపజేస్తూ “లోకమందు జ్యోతుల” వలె ఉండాలి. (ఫిలి. 2:15) జీవితంలో తమ ముఖ్య సంకల్పం అదేనన్న దృష్టితో వారు ఆనందంగా ఆ బాధ్యతను స్వీకరించారు. కొంతకాలం తర్వాత, సువార్త “ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింప[బడెను]” అని పౌలు చెప్పగలిగాడు. (కొలొ. 1:23) ఆ గొప్ప కార్యాన్ని చేయడంలో క్రైస్తవ సంఘమంతా ఏకమైంది.
5 “అంధకార క్రియలను విసర్జించి” వచ్చిన వారి మధ్య మనం ఉండగలుగుతున్నందుకు మనం నేడు కృతజ్ఞులమై ఉండాలి. (రోమా. 13:12, 13) యేసు మాదిరిని మరియు గతంలోని నమ్మకమైన క్రైస్తవుల మాదిరిని అనుకరించడం ద్వారా మనం మన మెప్పుదలను కనపర్చగలం. మానవ చరిత్రలో మునుపెన్నటికన్నా ఇప్పుడు ఇతరులు సత్యాన్ని వినడం ఎంతో అత్యవసరం మరియు ప్రాముఖ్యం. ఈ కార్యమంతటి అత్యవసర కార్యం మరొకటిలేదు మరియు దీని దీర్ఘకాలిక ప్రయోజనాలతో పోల్చదగిన కార్యమూ మరొకటి లేదు.
6 మనం జ్యోతులవలె ఎలా ప్రకాశించగలం? మన వెలుగును ప్రకాశింపజేయడంలో ముఖ్య మార్గం రాజ్య ప్రకటన పనిలో భాగం వహించడం. ప్రతి సంఘానికీ, వాటివాటి నియమిత ప్రాంతాల్లో క్రమమైన, సంస్థీకరించబడిన ఏర్పాట్లు ఉన్నాయి. అనేక రకాల్లోనూ మరియు అనేక భాషల్లోనూ అధికమొత్తంలో ప్రచురణలు అందించబడ్డాయి. పొడిగించబడిన విద్య, కూటాల ద్వారా అందించబడుతుంది మరియు అనుభవజ్ఞులైనవారు ఇతరులకు వ్యక్తిగతంగా తర్ఫీదివ్వడంలో సహాయపడుతున్నారు. ఇందులో భాగంవహించే అవకాశాలు స్త్రీపురుషులకూ పెద్దలకూ చివరికి పిన్నలకు సహితం ఉన్నాయి. సంఘంలోని ప్రతి వ్యక్తి, తన సామర్థ్యం, పరిస్థితులూ అనుమతించినంతమేరకు భాగం వహించమని ఆహ్వానించబడుతున్నారు. ప్రతి సభ్యుడూ ఏదోక విధంగా భాగం వహించేలా సహాయపడేందుకుగానూ సంఘంలోని పనులన్నీ ప్రకటనపనిపై కేంద్రీకరించబడివున్నాయి. మన వెలుగు ప్రకాశిస్తూ ఉండేలా చేసేందుకు సంఘంతో క్రమమైన మరియు సన్నిహితమైన సహవాసం శ్రేష్ఠమైన విధానం.
7 మౌఖిక సాక్ష్యం కాకుండ ఇతర విధానాల్లో కూడా మనం మన వెలుగు ప్రకాశింపజేయగలం. మన క్రియలతోనే మనం ఇతరుల అవధానాన్ని పొందవచ్చు. “మీ సత్క్రియలను చూచి, వాటినిబట్టి . . . దేవుని మహిమపరచునట్లు, [అన్యజనుల] మధ్యను మంచి ప్రవర్తనగలవారై యుండవలె[ను]” అని పేతురు ఉద్బోధించినప్పుడు ఈ విషయమే ఆయన మనస్సులో ఉంది. (1 పేతు. 2:12) ఓ పనిని లేక ఓ వ్యవస్థను దానితో సహవసించేవారి ప్రవర్తనను బట్టి అనేకులు తీర్పుతీరుస్తారు. నైతికంగా శుభ్రంగానూ యథార్థంగానూ శాంతియుతంగానూ మరియు చట్టానికి లోబడేవారిగా ఉన్న ప్రజలను చూపరులు గమనించినప్పుడు వారు అలాంటి ప్రజలను భిన్నమైనవారిగా దృష్టిస్తారు మరియు వారు అనేకులు అనుసరించే ప్రమాణాలకన్నా ఉన్నతమైనవాటిని అనుసరించేవారని గమనిస్తారు. కనుక, ఓ భర్త తన భార్యను ప్రేమపూర్వకంగా గౌరవించి, ఇష్టపడినప్పుడు భర్త తన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు; తన భర్త శిరస్సత్వాన్ని గౌరవిస్తూ భార్య కూడా అదే చేస్తుంది. పిల్లలు తమ తలిదండ్రుల మాటవిని, లైంగిక అనైతికతను మరియు మాదకద్రవ్య దురుపయోగాన్ని నిరాకరించినప్పుడు వారు భిన్నంగా కనబడతారు. తన పని విషయంలో జాగ్రత్తగా నిజాయితీగా ఉండి, ఇతరుల ఎడల శ్రద్ధగల ఉద్యోగిని ఇతరులు ఉన్నతంగా ఎంచుతారు. ఈ క్రైస్తవ లక్షణాలను ప్రదర్శించడం ద్వారా, మన జీవిత విధానాన్ని ఇతరులకు సిఫారసు చేస్తూ మనం మన వెలుగును ప్రకాశింపజేస్తున్నాము.
8 దేవుని వాక్యంనుండి మనం నేర్చుకున్నవాటిని గురించి ఇతరులతో మాట్లాడడమే ప్రకటించడం. అది ప్రసంగాల ద్వారా లేక ఇంటింటి పని ద్వారా చేయబడుతుంది, కానీ అది అలాంటి సందర్భాలకు మాత్రమే పరిమితమైనది కాదు. మన ప్రతిదిన కార్యాలు మనం అనేకమందిని కలిసేలా చేస్తాయి. మీ పక్కింటి వారితో మీరు ఒకరోజులో ఎన్నిసార్లు మాట్లాడతారు? మీ ఇంటికి ఎంత తరచుగా ప్రజలు వస్తుంటారు? షాపింగ్‌కి వెళ్లినప్పుడు, బస్సులో ఉన్నప్పుడు లేక ఉద్యోగ స్థలంలో మీరు ఎంత మంది విభిన్న వ్యక్తులను కలుస్తారు? మీరు పాఠశాలలోని యౌవస్థులైనట్లైతే, ప్రతిరోజూ మీరు మాట్లాడే వ్యక్తుల సంఖ్యను మీరు లెక్కించగలరా? వాస్తవానికి, ఇతరులతో మాట్లాడే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. మీరు చేయవల్సిందల్లా కొన్ని లేఖనాధార విషయాలను మీ మనస్సులో ఉంచుకోవాలి, ఓ బైబిలునూ కొన్ని కరపత్రాలను అందుబాటులో ఉంచుకుని అవకాశం దొరికినప్పుడు మీరు మాట్లాడేందుకు చొరవ తీసుకోవడమే.
9 అనియత సాక్ష్యం ఎంతో సులభమైనప్పటికీ, అలా చేసేందుకు ప్రయత్నించడానికి కొందరు ఇష్టపడరు. క్రొత్తవారితో మాట్లాడాలంటే వారికి చాలా భయమని లేక ఎంతో సిగ్గని చెబుతూ వారు ముభావంగా ఉండవచ్చు. ఎక్కువ అవధానాన్ని పొందడం విషయంలో లేక ఎదుటివారు కటువుగా ప్రతిస్పందిస్తారనే విషయంలో భయాన్ని వారు కల్గివుండవచ్చు. అనియత సాక్ష్యంలో అనుభవంగలవారు, చింతించాల్సిన అవసరం ఎప్పుడోగానీ రాదని మీతో చెప్పవచ్చు. ప్రాథమికంగా ఇతరులూ మనలాంటివారే; వారికీ అవే అవసరతలున్నాయి, అవే చింతలున్నాయి, మరి తమకూ తమ కుటుంబాలకూ అలాంటి విషయాలే అవసరం. ఉల్లాసభరితమైన చిరునవ్వుకూ లేక ఓ స్నేహపూరితమైన పలకరింపుకు అనేకులు దయగానే ప్రతిస్పందిస్తారు. మొదట్లో మీరు ‘ధైర్యం తెచ్చుకోవల్సి’ ఉండవచ్చు. (1 థెస్స. 22:22:2) అయితే ఒకసారి మీరు అలవాటుపడితే, దానివల్ల వచ్చే ఫలితాలకు మీరు ఆశ్చర్యానందాలను పొందుతారు.
10 మనం మన వెలుగును ప్రకాశింపజేసినప్పుడు మనం ఆశీర్వదించబడతాము: అనియత సాక్ష్యం వల్ల వచ్చిన కొన్ని సేదదీర్చే అనుభవాలు ఇక్కడున్నాయి: 55 సంవత్సరాల ఓ స్త్రీ వీధిని దాటే ప్రయత్నంలో ఉంది. ఓ కారు వచ్చి ఆమెను కొట్టబోతుండగా ఓ సహోదరి ఆమె చెయ్యిపట్టుకుని సురక్షితంగా ప్రక్కకులాగి, “జాగ్రత్త సుమండీ. మనం అపాయకరమైన కాలంలో జీవిస్తున్నాము!” అని చెప్పింది. ఆ తర్వాత, ఈ కాలాలు ఎందుకింత అపాయకరంగా ఉన్నాయో ఆమె వివరించింది. “మీరు యెహోవాసాక్షా?” అని ఆ స్త్రీ అడిగింది. మన ప్రచురణల్లో ఒక దాన్ని ఆ స్త్రీ తన అక్కనుండి పొందిన తర్వాత, యెహోవాసాక్షుల్లో ఎవరినైనా కలవాలని అనుకుంది, మరి ఈ సంఘటన దాన్ని సాధ్యపర్చింది.
11 ఓ వైద్యుని కార్యాలయంలోని వెయిటింగ్ రూమ్‌లో ఓ సహోదరి ఒక స్త్రీతో సంభాషణను ప్రారంభించింది. ఆ స్త్రీ జాగ్రత్తగా విని ఆ తర్వాత ఇలా చెప్పింది: “నేను యెహోవాసాక్షులను కలిశాను, కానీ ఒకవేళ నేను భవిష్యత్తులో యెహోవాసాక్షినైనట్లైతే అది కేవలం మీరు ఇప్పుడు నాతో చెప్పిన దానివల్లనే. మీరు చెప్పిన దాన్ని వినడం చీకటి ప్రాంతంలో వెలుగును చూడడం ప్రారంభించినట్లుగా ఉంది.”
12 దయను కనపర్చడం, ఇతరులు సత్యాన్ని నేర్చుకునేందుకు సహాయపడడంలో మొదటి మెట్టుకావచ్చు. ప్రాంతీయ సేవనుండి ఇంటికి వెళ్లేటప్పుడు, అనారోగ్యంతో ఉన్న ఓ వృద్ధ స్త్రీ బస్సునుండి క్రిందికి దిగడాన్ని ఇద్దరు సహోదరీలు గమనించారు. వారు ఆగి, సహాయం కావాలా అని ఆమెనడిగారు. ఏ పరిచయమూ లేని ఇద్దరు వ్యక్తులు తన విషయంలో ఆసక్తి కనపర్చినందుకు ఆమె ఎంతగా ఆశ్చర్యపోయిందంటే, వారు అంత దయగా వ్యవహరించేందుకు వారిని ఏది ప్రేరేపించిందో చెప్పమని వారిని బ్రతిమిలాడింది. అది సాక్ష్యమిచ్చేందుకు నడిపింది. ఆ స్త్రీ తన చిరునామాను వెంటనే ఇచ్చింది మరియు తనను దర్శించేందుకు వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించింది. ఓ పఠనం ప్రారంభించబడింది. త్వరలోనే ఆ స్త్రీ కూటాలకు హాజరుకావడం ప్రారంభించింది, మరిప్పుడు సత్యాన్ని ఇతరులతో పంచుకుంటోంది.
13 వయస్సుమళ్లిన ఓ సహోదరి, సముద్ర తీరంగుండా ఉదయాన్నే సాక్ష్యమివ్వడం వల్ల ప్రయోజనాన్ని పొందేది. ఆమె ఇంటిపని చేసేవారిని, పిల్లలను చూసుకునేవారిని, బ్యాంక్ గుమస్తాలను, ఉదయం తీరం వెంబడి నడవడానికి వచ్చే ఇతరులనూ ఆమె కలుస్తుంది. ఇసుక వద్ద బెంచీలమీద కూర్చుని ఆమె బైబిలు పఠనాలను నిర్వహిస్తుంది. అనేకమంది ప్రజలు ఆమెనుండి సత్యాన్ని నేర్చుకున్నారు మరియు ఇప్పుడు వారు యెహోవాసాక్షులు.
14 ప్రపంచ సమస్యలను పరిష్కరిస్తుందని తాననుకున్న ఓ రాజకీయ పార్టీని గూర్చి తన ఉద్యోగ స్థలంలో, తన తోటి ఉద్యోగస్థురాలు మాట్లాడడం ఓ సహోదరి వినింది. దేవుని రాజ్యం చేయబోయే వాటిని గూర్చిన వాగ్దానాలను చెబుతూ ఈ సహోదరి మాట్లాడింది. ఉద్యోగ స్థలంలోని ఈ చర్చ, గృహంలో క్రమమైన బైబిలు పఠనానికి నడిపించింది, చివరికి ఆమె మరియు ఆమె భర్త సాక్షులయ్యారు.
15 మీరు సాక్షి అన్న విషయాన్ని ఎన్నడూ మర్చిపోవద్దు! యేసు తన శిష్యులను “లోకానికి వెలుగు” అని వర్ణించినప్పుడు, వారు దేవుని వాక్యపు ఆత్మీయ జ్ఞానం నుండి ప్రయోజనం పొందేందుకు ఇతరులకు సహాయం చేయాలని ఆయన తర్కించాడు. యేసు సలహాను మనం అన్వయించుకున్నట్లయితే, మనం మన పరిచర్యను ఎలా దృష్టిస్తాము?
16 ఉద్యోగం కొరకు వెదుకుతున్నప్పుడు, కొందరు పార్ట్‌టైమ్ ఉద్యోగాలను ఎన్నుకుంటారు. దాని కొరకు వారు ఎంత సమయాన్ని శక్తిని వ్యయపర్చాలన్న విషయంపై వారు హద్దులనేర్పర్చుకుంటారు, ఎందుకంటే తమ సమయంలో అధిక మొత్తాన్ని తమకు మరింత ఫలవంతమైన కార్యాలు అని వారు కనుగొన్న వాటిని చేయడంలో వ్యయపర్చుకోవాలని వారు ఇష్టపడతారు. మనం మన పరిచర్య విషయంలో అలాంటి దృష్టినే కల్గివున్నామా? దానికి మనం బాధ్యులమని భావించినా మరియు పరిచర్య కొరకు కొంత సమయాన్ని ప్రక్కకు పెట్టేందుకు ఇష్టపడినా, మన ముఖ్య ఆసక్తులు మరెక్కడైనా ఉండాలా?
17 పార్ట్‌టైమ్ క్రైస్తవుడన్న విషయం ఎక్కడా లేదని గ్రహిస్తూ, ‘మనల్ని మనం ఉపేక్షించుకుని’ యేసును “ఎడతెగక” అనుసరించేందుకు అంగీకరిస్తూ మనం సమర్పించుకున్నాము. (మత్త. 16:24) ప్రజలు ఎక్కడ ఉన్నప్పటికీ మన వెలుగును వారికి ప్రకాశింపజేసేందుకుగల ప్రతి అవకాశాన్ని మనం వినియోగించుకుంటూ “మనస్ఫూర్తిగా” కొనసాగడమే మన కోరిక. (కొలొ. 3:23, 24) మనం ప్రపంచ దృక్పథాలను నిరాకరించాలి, మొదట్లో మనకున్న ఆసక్తిని మనం కాపాడుకోవాలి మరియు మన వెలుగు కాంతివంతంగా ఎడతెగక తప్పక ప్రకాశించేలా మనం చూసుకోవాలి. కొందరు తమ ఆసక్తి సన్నగిల్లేందుకు మరియు సమీపంనుండి సహితం తమ వెలుగు సన్నగా మాత్రమే ప్రసరించేలా అనుమతించివుంటారు. పరిచర్య విషయంలో తాము పోగొట్టుకున్న ఆసక్తిని తిరిగిపొందేందుగాను అలాంటివారికి సహాయం అవసరంకావచ్చు.
18 మన సువార్త అనేకులకు అపరిచితం కనుక కొందరు వెనుకంజ వేయగలరు. క్రీస్తును గూర్చిన సమాచారం “నశించుచున్న వారికి వెఱ్ఱితనము” అని పౌలు చెప్పాడు. (1 కొరిం. 1:18) అయితే, ఇతరులు ఏమి చెప్పినప్పటికీ, ఆయన దృఢంగా ఇలా ప్రకటించాడు: “సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను.” (రోమా. 1:16) సిగ్గుపడేవాడు అల్పునిగా లేక అనర్హునిగా భావిస్తాడు. సర్వోన్నత సర్వాధిపతిని గూర్చి మరియు మన నిత్యానందం కొరకు ఆయన చేసిన అద్భుతమైన ఏర్పాట్లను గూర్చి మాట్లాడేటప్పుడు మనము ఎందుకు సిగ్గుపడాలి? మనం ఇతరులతో సత్యాన్ని గూర్చి మాట్లాడేటప్పుడు అల్పులంగానూ లేక పనికిరానివారంగాను భావించడాన్ని ఊహించలేము కూడా. బదులుగా, “సిగ్గుపడనక్కర” లేదన్న మన నమ్మకాన్ని కనపరుస్తూ మనకు చేతనైనంతమేరకు మనం చేసేందుకు మనం పురికొల్పబడతాము.—2 తిమో. 2:15.
19 భూవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఇప్పుడు ప్రకాశిస్తున్న సత్యపు వెలుగు, ఓ నూతన లోకంలో నిత్యజీవ నిరీక్షణను ఆప్యాయంగా అందిస్తుంది. మన వెలుగును ఎడతెగక ప్రకాశింపజేయమన్న ఉద్బోధను మనం గైకొన్నామని మనం కనపర్చుదాము! మనం అలా చేసినట్లైతే, ప్రతిదినమూ “మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచు” ఆనందించిన శిష్యులవలె మనం ఆనందించేందుకు కారణముంటుంది.—అపొ. 5:42.