1996 కొరకైన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నుండి ప్రయోజనం పొందండి—భాగం 2
1 1943లో దైవపరిపాలనా పరిచర్య పాఠశాల ఆరంభమైన అనతికాలంలోనే, “వేదికమీద మరియు పరిచర్యలోను మరింత ప్రభావవంతంగా బహిరంగ ప్రసంగీకులు కాగలరని ఎన్నడూ ఊహించని అనేకమంది సహోదరులకు సహాయపడడంలో చాలా చక్కని ఈ ఏర్పాటు కొద్దికాలంలోని సాఫల్యతను సాధించగలిగింది” అని సొసైటీ బ్రాంచీలలో ఒకటి నివేదించింది. మనకందరికీ అవసరమైన విశిష్టమైన తర్ఫీదునివ్వడంలో పాఠశాల కొనసాగుతోంది.
2 బైబిలు చదవడం: పాఠశాల నుండి ప్రయోజనం పొందేది ప్రసంగ భాగాలు ఇవ్వబడినవారు మాత్రమే కాదు. నిజానికి, బైబిలు చదవడం అనే నియామకం మనకందరికీ ఉంది. ప్రతివారం బైబిలులోని ఏ అధ్యాయాలను చదవాలో పాఠశాల పట్టిక చూపిస్తుంది. ప్రతిదినం బైబిలును చదవవలసిన ప్రాముఖ్యతను నొక్కిచెప్పే అనేక లేఖనాధార జ్ఞాపికలున్నాయి. (యెహో. 1:8; కీర్త. 1:2; అపొ. 17:11) బైబిలు చదవడమనేది మంచి ఆత్మీయ ఆరోగ్యానికి అత్యవసరం; అది మనస్సును హృదయాన్ని పోషిస్తుంది. మనం ప్రతిదినం కనీసం ఐదు నిమిషాలు బైబిలును చదివినట్లయితే, మనం పట్టిక ప్రకారం వెళ్ళగలము. సంవత్సరాంతానికెల్లా, మనం దేవుని వాక్యం యొక్క 150 కన్నా ఎక్కువ అధ్యాయాలను చదివి ఉంటాము. మనం బైబిలును అందుబాటులో ఉంచుకున్నట్లయితే, ప్రతిదినం దానినుండి కొంత చదవగలుగుతాము.
3 ఉపదేశ ప్రసంగం: నమ్మకస్థులుగా ఆసక్తితో సేవచేసేందుకు సహోదరులను ప్రేరేపించడానికి, ఉపదేశ ప్రసంగమిచ్చే ప్రసంగీకుడు అవగాహనను కలిగించేలా, యెహోవా ఎడల ఆయన వాక్యం ఎడల మరియు ఆయన సంస్థ ఎడల మెప్పుదలను కలిగించేలా మంచి బోధనా పద్ధతులను ఉపయోగించవలసిన అవసరం ఉంది. పెద్దలు, పరిచర్య సేవకులు తమ ప్రసంగాన్ని బాగా సిద్ధపడి, అంశంపై కేంద్రీకరించి, దృఢవిశ్వాసంతో మాట్లాడుతూ ప్రసంగాంశాన్ని ప్రస్ఫుటం చేస్తూ దీనిని పూర్తి చేయగలరు. (హెబ్రీ. 4:12) ప్రసంగీకుడు తనకు ఇవ్వబడిన సమయంలో పూర్తిచేయడం చాలా ప్రాముఖ్యం. “ప్రతి లేఖనము” (ఆంగ్లం) అనే పుస్తకం బైబిలు లేఖనాలతో నిండి ఉండి, మనకు ఆత్మీయంగా ప్రయోజనమివ్వగల పురికొల్పేటటువంటి లేఖనాధార విషయాల పరంపరను అందిస్తుంది. ప్రచారకులు (ఆంగ్లం) అనే పుస్తకంలో యెహోవా దృశ్య సంస్థను గూర్చిన ఆధునికదిన చరిత్ర ఉంది, అది విశ్వాసాన్ని, ఆసక్తిని, భక్తిని, ప్రేమను ప్రదర్శించిన నిజమైన ప్రజల జీవితాల్లోని సంఘటనలను చెబుతోంది. మన దైవపరిపాలనా వారసత్వాన్ని గూర్చి మరియు యెహోవా తన ప్రజలను ఆధునిక కాలాల్లో ఆశీర్వదించిన విధాన్ని గూర్చి నేర్చుకోవలసినది ఎంతో ఉంది. యెహోవా వ్యక్తిత్వాన్ని గూర్చిన లోతైన అంతర్దృష్టిని పొందేందుకు, బైబిలు సూత్రాలను వ్యక్తిగతంగా అన్వయించుకోవడానికి ఆరాధనలో ఐక్యమగుట (ఆంగ్లం) అనే పుస్తకం మనకు సహాయపడుతుంది.
4 బైబిలు ఉన్నతాంశాలు: ఈ నియామకం ఇవ్వబడిన సహోదరులు సంఘ ప్రయోజనం కొరకు ఆచరణాత్మకమైన విధంగా అన్వయించగల నిర్దిష్టమైన వచనాలను ఎంపిక చేసుకోవాలి. ఇందుకు నియమించబడిన అధ్యాయాలను చదివి, వాటిని ధ్యానించి, ఆ లేఖనాల భావాన్ని స్పష్టం చేసే విషయాలను కనుగొనేందుకు ఎంపిక చేసుకున్న లేఖనాలను గూర్చి పరిశోధన చేయవలసిన అవసరముంది. నిర్దిష్టమైన బైబిలు వచనాలను గూర్చిన సమాచారాన్ని కనుగొనేందుకు వాచ్‌టవర్ పబ్లికేషన్ ఇన్డెక్స్ (ఆంగ్లం) వెనుక భాగంలోవున్న “స్క్రిప్చర్ ఇన్డెక్స్” సహాయకరంగా ఉండగలదు. ఈ భాగాన్ని చేసే సహోదరులు బాగా వివేచించాలి, అసంగతమైన విషయాలను చేర్చకుండా ఉండాలి. ఆరు నిమిషాల్లో సహేతుకంగా చెప్పగలిగే సమాచారానికన్నా ఎక్కువగా వారు సిద్ధపడకూడదు.
5 దైవపరిపాలనా పరిచర్య పాఠశాలనుండి మనమందరం ప్రయోజనం పొందగలం. మాట్లాడే మరియు బోధించే మన సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అది మనకు సహాయపడగలదు. ఈ ఏర్పాటునుండి పూర్తిగా ప్రయోజనం పొందడం మన ‘అభివృద్ధి అందరికీ తేటగా కనబరచేందుకు’ మనకు తప్పక సహాయపడుతుంది.—1 తిమో. 4:15.