మీ బోధకు ఎడతెగక శ్రద్ధనివ్వండి
1 క్రొత్త దైవపరిపాలనా పాఠశాల కార్యక్రమము జనవరి 1995 లో ప్రారంభమవుతుంది. ఇంగ్లీషులోని పాఠశాల పట్టికను అనుసరించే సంఘాల్లో యివ్వబడే దాదాపు అన్ని ఉపదేశ ప్రసంగాల అంశము, యెహోవాసాక్షుల ఆధునిక-దిన సంస్థయొక్క పులకరింపజేసే చరిత్రయై ఉంటుంది. ఆ సంవత్సరంలో యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఆంగ్లము) అనే పుస్తకంలోని 178 పేజీలు ఆయా సంఘాల్లో పరిశీలించబడతాయి. ఉపదేశ ప్రసంగం తర్వాత ప్రచారకులు పుస్తకంలో పునఃసమీక్ష ప్రశ్నలు లేనందున, మన బోధకు శ్రద్ధనివ్వడానికి, ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి మనం ఏమి చేయగలము?—1 తిమో. 4:16.
2 అనేకమంది యిప్పటికే, ప్రచారకులు పుస్తకాన్ని చదివినప్పటికీ, పాఠశాల పట్టిక ప్రకారం యీ సమాచారాన్ని పరిశీలించడం తమ దైవపరిపాలనా వారసత్వం యెడల మరింత మెప్పుదల చూపడానికి అందరికి సహాయం చేస్తుంది. (కీర్త. 71:17, 18) పట్టికలో చేర్చబడిన ప్రచారకులు అనే పుస్తకంలోని సమాచారాన్ని పునఃసమీక్షించేందుకు ప్రతి వారం కొంత సమయాన్ని ఎందుకు కేటాయించకూడదు?
3 ఉత్సాహపూరితమైన, ఆసక్తిని కలిగించే విధమైన ఉపదేశ ప్రసంగాలు: ప్రచారకులు అనే పుస్తకంనుండి చేసే ఉపదేశ ప్రసంగాలు ఉత్సాహపూరితంగాను, ఆసక్తిని కలిగించే విధంగాను ఉండాలి. ఆ ప్రసంగాలు దాన్ని ఉపయోగించి, యెహోవా సంస్థయెడల గౌరవాన్ని, దేవుని సేవకులుగా మన ఆధిక్యతలయెడల మెప్పును అధికం చేస్తూ, సమాచారం యొక్క ఆచరణాత్మక విలువను కూడా నొక్కి చెప్పాలి. పాఠశాలకు హాజరయ్యే ప్రతి కుటుంబం ఒక్కో ప్రచారకులు పుస్తకాన్ని తెచ్చుకున్నట్లయితే, కుటుంబ సభ్యులు ఉపదేశ ప్రసంగాన్ని మరింత శ్రద్ధగా వింటూ, పుస్తకంలోని దృష్టాంతాల నుండి, చిత్రాల నుండి, ప్రయోజనం పొందగలరు. ప్రాంతీయ భాషలోని పాఠశాల పట్టికను అనుసరిస్తున్న సంఘాలు అద్వితీయ సత్యదేవుని ఆరాధనలో ఐక్యమగుట అనే పుస్తకాన్ని 1994 లోలాగే ఉపయోగించడంలో కొనసాగుతాయి.
4 ఆలోచింపజేసే విధంగా బైబిలు చదవడం: సముచితంగా భావాన్ని నొక్కి పలుకుతూ, అనుభూతిని వ్యక్తపరుస్తూ సరైన విధంగా చదవడం ఫలవంతమైన బోధలోని ప్రాముఖ్యమైన భాగము. అంతేకాక, రెండవ ప్రసంగంలోని పట్టిక చేయబడిన భాగం పెద్దదేమీ కాదు, ప్రసంగీకునికి ఉపోద్ఘాత వ్యాఖ్యానాలు, ముగింపు వ్యాఖ్యానాలు యివ్వగలిగేంత సమయముంటుంది. ఉపోద్ఘాతం ఇవ్వబడిన భాగంలో ఆసక్తిని కలిగించాలి, దాని ఆచరణాత్మక విలువను గ్రహించేలా ప్రేక్షకులను సంసిద్ధం చేయాలి. ప్రసంగీకుడు అనుమతించబడిన సమయాన్ని పూర్తిగా ఉపయోగిస్తూ, ముగింపులో వివరణాత్మకమైన వ్యాఖ్యానాలను, ఆ సమాచారపు అన్వర్తింపును చేర్చవచ్చు.
5 పాఠశాల కార్యక్రమాన్ని గూర్చిన అదనపు సమాచారం, మరియు యితర ప్రసంగాలను ఎలా నిర్వర్తించాలి అనే విషయాలు “దైవపరిపాలనా పరిచర్య పాఠశాల షెడ్యూలు 1995”లో ఉంటుంది. ప్రసంగించే, బోధించే కళను మెరుగుపర్చుకోడానికి ఈ సమాచారంలో యివ్వబడిన ఉపదేశాలను పునఃసమీక్షించడం ద్వారా, ప్రసంగాలకు చక్కగా సిద్ధం కావడం ద్వారా, మనకివ్వబడిన సలహాను పాటించడం ద్వారా మన బోధకు శ్రద్ధనివ్వవచ్చు. పాఠశాలలో యింత వరకూ చేరనివారు చేరవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానించబడుతున్నారు.