సిద్ధపాటు–సాఫల్యానికి కీలకం
1 పరిచర్య కొరకు ముందుగా సిద్ధపడడం ప్రాంతీయ సేవలో భాగం వహించడానికి ఒకరికి కలిగే ఏ మాత్రం సంకోచాన్నైనా కూడా అధిగమించడానికి సహాయపడుతుంది. మీరు ఇండ్ల ద్వారాలను సమీపిస్తుండగా గృహస్థులకు మీరు ఏమి చెప్పాలో మీకు తెలుస్తుంది. ఎదురవ్వగల సవాళ్ళను గురించి మీరు వ్యాకులపడనవసరం లేదు. సేవ నుండి ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, మీరు పరిచర్యలో బాగా ప్రయత్నం చేశారని ఎరిగి మీరు ప్రోత్సహించబడినట్లు భావిస్తారు. అవును, ప్రకటించే మరియు బోధించే మన నైపుణ్యాలకు పదును పెట్టేందుకు బాగా సిద్ధపడడమే కీలకం.
2 “పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు” తొడుగుకొని ఉండమని మనకు బోధిస్తూ సిద్ధపడి ఉండడాన్ని పౌలు నొక్కి చెప్పాడు. (ఎఫె. 6:15) మన మనస్సును హృదయాన్ని సిద్ధం చేయడం అలాగే అనుకూల దృష్టిని మరియు సిద్ధంగా ఉండే దృక్పథాన్ని పొందడం ఇందులో ఇమిడి ఉన్నాయి. మనం సత్యాన్ని ఇతరులతో పంచుకోవడానికి సిద్ధపడినప్పుడు, మన ప్రయాస రాజ్య ఫలంతో ప్రతిఫలమిచ్చి, మనలను సంతోషపరుస్తుంది.–అపొ. 20:35.
3 ప్రకటన పనికి ఎలా సిద్ధపడాలి: బహుశ తర్కించుట (ఆంగ్లం) అనే పుస్తకంలో ఇవ్వబడిన లేదా మన రాజ్య పరిచర్య చివరి పేజీలో కనిపించే అందింపులనుండి మనకు సులభంగా అనిపించే ఒక అందింపును మనం ఎంపిక చేసుకోవాలి. ప్రత్యేకంగా కనిపించే మీ ప్రధాన అంశాన్ని తెలియజేసేందుకు ఏ పదాలను ఉపయోగించాలి, ఏ పదబంధాన్ని నొక్కి చెప్పాలి అని నిర్ణయించుకుంటూ మీరు ఉపయోగించుకోవాలనుకునే లేఖనాన్ని గూర్చి శ్రద్ధపూర్వకంగా తలంచాలి. అందింపును కంఠస్థం చేయనవసరం లేదు; బదులుగా, భావాన్ని మనస్సులో ఉంచుకొని, వాటిని మీ స్వంత మాటల్లో పెట్టి, మీ శ్రోతకు ఆకర్షణీయంగా అనిపిస్తుందని మీరనుకునే విధంగా దానిని వ్యక్తం చేయడం మంచిది.
4 మీరు ప్రతిపాదించాలనుకునే ప్రచురణను పరిశీలించి, కొన్ని ఆసక్తికరమైన సంభాషణా విషయాలను ఎన్నుకోండి. మీ ప్రాంతంలో ప్రజలకు ఆసక్తికరమైనదని మీరు భావించేదాన్ని ఎన్నుకోండి. వేర్వేరు గృహస్థులకు అంటే పురుషునికి, స్త్రీకి, వృద్ధునికి, లేదా యౌవనునికి, సరిపోయేలా మీ అందింపును ఎలా సవరించుకోవాలో ఆలోచించండి.
5 అభ్యాస భాగాలను చేయడానికి ప్రయత్నించారా? కుటుంబ సభ్యులతో లేదా ఇతర ప్రచారకులతో కలిసి ఏ అందింపులు ఫలవంతంగా ఉంటాయో చర్చించి, వాటిని బిగ్గరగా అభ్యసించండి, అలా అందరూ వాటిని గుర్తుంచుకుంటారు. నిజజీవితంలో కనిపించేటటువంటి పరిస్థితులను, పరిచర్య ప్రాంతంలో ఎదుర్కునే అభ్యంతరాలను అనుకరించడానికి ప్రయత్నించండి. అలాంటి అభ్యాసం మీరు అనర్గళంగా మాట్లాడడాన్ని మెరుగుపరుస్తుంది, ప్రకటనలో మీ సామర్థ్యాన్ని అధికం చేసి, మీ నమ్మకాన్ని పెంపొందిస్తుంది.
6 మీ అందింపును సిద్ధపడి, అభ్యసించడమే కాక, ‘నేను వేసుకోవాలనుకుంటున్న దుస్తులు పరిచర్యకు తగ్గవేనా? నా బ్యాగ్‌లో నేను ఉపయోగించుకోవాలనుకునే సాహిత్యంతో సహా నాకు కావలసినవన్నీ ఉన్నాయా? అవి మంచిగా ఉన్నాయా? తర్కించుట అనే పుస్తకం, కరపత్రాలు, ఇంటింటి రికార్డులు, కలమూ ఉన్నాయా?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవలసి ఉంటుంది. ఆలోచనాపూర్వకంగా ముందుగా పథకం వేసుకోవడం సేవలో మరింత ఫలవంతమైన రోజుకు దోహదపడుతుంది.
7 మనకు మనం సిద్ధపడేందుకు మనకు సాధ్యమైనదంతా చేసిన తరువాత సఫలులమయ్యేందుకు మనకు సహాయపడేందుకు యెహోవా ఆత్మ కొరకు మనం ప్రార్థించాలి. (1 యోహా. 5:14, 15) సిద్ధపాటుకు జాగ్రత్తపూర్వకమైన శ్రద్ధనివ్వడం మనం ‘పరిచర్యను సంపూర్ణంగా జరిగిస్తూ’ ఉండగా మన పనిలో మరింత సంతోషాన్ని కనుగొనేందుకు కారణమౌతుంది.–2 తిమో. 4:5.