అది ఫలితాల్ని తెస్తే, దాన్నే ఉపయోగించండి!
1 పరిచర్యలో ఉపయోగించడానికి మన రాజ్య పరిచర్య సూచించబడిన వివిధ అందింపులను మనకు ఎడతెగకుండా అందిస్తోంది. రాజ్య సందేశమందు ఆసక్తినెలా పెంపొందించవచ్చనే దానిపై తాజా ఐడియాలనిది మనకు అందిస్తోంది. ఈ అందింపుల్లో ఒకటో లేక అంతకన్నా ఎక్కువో నేర్చుకోవడానికి ప్రతినెలా మీరు కృషిచేయవచ్చు. అయితే, ఈ అందింపుల్లో ఒకదాన్ని ప్రచారకుల్లో కొందరు కొన్ని పర్యాయాలు ఉపయోగించేటప్పటికి, మన రాజ్య పరిచర్య యొక్క మరొక సంచిక క్రొత్త అందింపుల్ని ఇస్తున్నట్లు వారు కనుగొనవచ్చు. మునుపటి సంచికలో ఇవ్వబడిన అందింపును ఉపయోగించడంలో ప్రావీణ్యాన్ని సంపాదించక ముందే మరో క్రొత్త అందింపును నేర్చుకోవడం ప్రతి ఒక్కరికీ సాధ్యంకాకపోవొచ్చనే విషయం సుస్పష్టమే.
2 నిజమే, ప్రాంతీయ సేవలో ఎక్కువ సమయాన్ని వెచ్చించే వేలాదిమంది పయినీర్లూ, మరితర ప్రచారకులూ ఉన్నారు. అంతేగాక, అనేక సంఘాలు తమ పూర్తి నియమిత ప్రాంతాన్ని ప్రతి కొన్ని వారాలకొకసారి పూర్తి చేస్తాయి. ఈ పరిస్థితుల్లో, సందేశాన్ని అందించేందుకు క్రొత్త క్రొత్త పద్ధతుల్నీ, ఆలోచనల్నీ ప్రచారకులు ఆహ్వానిస్తారు. ఇది వారి నైపుణ్యాల్ని మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుంది. ఇది వారి పరిచర్యను మరింత ఆసక్తికరమైనదిగానూ, ప్రతిఫలదాయకమైనదిగానూ చేసి, వాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు సహాయపడుతుంది.
3 మీ పరిస్థితి ఏదైనప్పటికీ, ఆసక్తిని పెంపొందించడంలో ప్రతిభావంతంగా ఉన్న ఒక అందింపును మీరు సిద్ధపడినట్లైతే, తప్పక దాన్నే ఉపయోగిస్తూ ఉండండి! చక్కని ఫలితాల్ని తెస్తున్న ప్రభావవంతమైన అందింపును ఉపయోగించడాన్ని మానివేయాల్సిన అవసరమేమీలేదు. ఈ నెల కొరకైన సాహిత్య ప్రతిపాదనకు దాన్ని అన్వయిస్తే సరిపోతుంది. మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడిన అందింపులను మీరు పునఃసమీక్షిస్తుండగా, మీ అందింపులో మీరు చేర్చాలనుకొనే ఆసక్తికరమైన విషయాల కొరకు చూడండి.
4 మన రాజ్య పరిచర్య క్రొత్త సంచికను మీరు పొందినప్పుడు, దానిలో ఉన్న అందింపులు కేవలం సలహాలేనని గుర్తుంచుకోండి. మీరు వాటిని ఉపయోగించగలిగితే మంచిదే. మీ నియమిత ప్రాంతంలో ఒక ప్రత్యేక అందింపు సత్ఫలితాల్ని ఇస్తున్నదని మీరిప్పటికే కనుగొంటే, దాన్నే ఉపయోగించండి! యోగ్యులైనవారిని కనుగొంటూ, శిష్యులయ్యేలా వారికి సహాయపడుతూ, శ్రేష్ఠమైన రీతిలో ‘మీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించడమే’ ప్రాముఖ్యమైన విషయం.—2 తిమో. 4:5.