సువార్తను అన్నిచోట్ల ప్రకటించండి
1 తొలి క్రైస్తవులు సువార్తను అన్నిచోట్ల ప్రకటించారు. వారు ఎంత ఆసక్తితో ఉండేవారంటే, యేసు పునరుత్థానం అయిన 30 సంవత్సరాలలోగా రాజ్య వర్తమానం ‘ఆకాశముక్రింద ఉన్న సమస్తసృష్టికి ప్రకటింపబడింది.’—కొలొ. 1:23.
2 యెహోవా యొక్క ఆసక్తిగల నేటి సేవకులకు కూడా అదే లక్ష్యమే—రాజ్య సువార్తతో ప్రతి ఒక్కరిని చేరుకోవడమనే లక్ష్యమే ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు మనకేది సహాయపడగలదు? చాలా మంది ప్రజలు పూర్తికాల పనిని చేస్తారు కనుక, మనం వాళ్ళ ఇండ్లకు వెళ్ళినప్పుడు తరచూ వాళ్ళుండరు. ఇంట్లో ఉండనివారి రికార్డును ఉంచుకుని, వారిని తిరిగి వెళ్ళి కలవడాన్ని గూర్చి జ్ఞాపకముంచుకోవలసిన అవసరతను అది నొక్కి చెబుతుంది. అయితే కొన్నిసార్లు, కొన్ని ఇండ్లకు మనమెన్ని సార్లు తిరిగి వెళ్ళినా, మనమెవరినీ కలవలేకపోతాము. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు పని చేయనప్పుడు, ప్రయాణం చేస్తుండవచ్చు, షాపింగ్‌కు వెళ్ళి ఉండవచ్చు, ఏదో ఒక రకమైన వినోదంలో మునిగి ఉండవచ్చు. వారిలో అర్హులైనవారికి రాజ్య సువార్త ఎలా చేరవేయబడుతుంది?—మత్త. 10:11.
3 కొందరిని వారి ఉద్యోగస్థలాల్లో కలవడం జరిగింది. చిన్న పట్టణాల్లో కూడా వ్యాపార స్థలాలున్నాయి, చాలా మంది ప్రజలు దాదాపు దినంలోని సమయమంతా అక్కడే ఉంటారు. నగరాల్లో, పారిశ్రామిక ప్రాంతాల్లో లేదా కార్యాలయ కట్టడాల్లో పనిచేసే ప్రజలు, అమిత భద్రతా ఏర్పాట్లు గల అపార్ట్‌మెంట్‌లలో లేదా కాలనీలలో నివసించే ప్రజలు సాక్ష్యాన్ని పొందుతున్నారు—చాలా మంది సాక్ష్యం వినడం ఇదే మొదటిసారి. వారాంతాల్లో పార్క్‌లలో, బీచ్‌ల దగ్గర, సినిమాహాల్‌లకు బయట విరామంగా ఉన్నవారిని, పార్కింగ్ స్థలాల్లో లేదా షాపింగ్ చేసే ప్రాంతాల్లో వేచి ఉన్నవారిని కొందరు కలిసినప్పుడు వారు సువార్తను అనుకూల భావంతో స్వీకరించినట్లు కనుగొన్నారు.
4 బహిరంగ స్థలాల్లో, ఎక్కడైనా సరే ప్రజలు కలిసినప్పుడు సాక్ష్యమిచ్చేందుకు చాలా మంది ప్రచారకులు ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నారు. ఈ సాక్షులు ఎక్కువగా ఇంటింటా ప్రకటించడం వంటి నియత పద్ధతులకు ఎక్కువ అలవాటు పడినందున మొదట జంకే వారు, కొంత భయపడేవారు. వాళ్ళు ఇప్పుడు ఎలా భావిస్తున్నారు?
5 “ఇది నా పరిచర్యను నవోత్తేజం కలదిగా చేసింది!” అని అనుభవజ్ఞుడైన ఒక సహోదరుడు సంతోషంగా అన్నాడు. “ఇది నేను మరింత ప్రయత్నం చేసేలా చేస్తుంది” అని మరొకరు చెప్పారు. “అది మానసికంగాను, శారీరకంగాను, ఆత్మీయంగాను ఉత్తేజాన్నిస్తుంది, . . . నేనిప్పటికీ ఎదుగుతున్నాను” అని ఒక వృద్ధ పయినీరు అంటున్నారు. యౌవనస్థులు కూడా ఆనందాన్ని పొందగల ఈ పనిలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. “చాలా మంది ప్రజలతో మాట్లాడగలుగుతాం కనుక సరదాగా ఉంటుంది” అని ఒక యౌవనస్థుడు తన విషయం చెబుతున్నాడు. “నేను ముందెన్నటికన్నా ఎక్కువ సాహిత్యాన్ని అందజేస్తున్నాను!” అని మరొకరు చెప్పారు. మళ్ళీ మళ్ళీ చేస్తున్న ప్రాంతంలోనే ఇదంతా జరుగుతోంది.
6 ప్రయాణ కాపరులు నాయకత్వం వహిస్తున్నారు: “ఈ లోకపు నటన గతించుచున్నది” అని గుర్తించిన సొసైటీ సాధ్యమైనంత మంది ప్రజలకు సువార్త చేరుకునేలా తమ ప్రాంతీయ సేవా పట్టికను ఒక్కోవారం సవరించుకోవాలని ప్రయాణ కాపరులకు ఇటీవల సలహా ఇచ్చింది. (1 కొరిం. 7:31) ప్రయాణ కాపరులు సంవత్సరాలుగా, వారాంతాలు కాని రోజుల్లో ఇంటింటి పరిచర్య కొరకు ఉదయాలను, పునర్దర్శనాలు చేసేందుకు, గృహ బైబిలు పఠనాలను నిర్వహించేందుకు మధ్యాహ్నాలను కేటాయించారు. ఈ దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆ పట్టిక ఇప్పటికీ ఆచరణయోగ్యమే కావచ్చు. ఇతర ప్రాంతాల్లో కొన్ని రోజుల్లో ఉదయాల్లో ఇంటింటి పరిచర్య చేయడం వలన పెద్దగా ఏమీ సాధించలేకపోవచ్చు. అలాంటప్పుడు, రోజు ఆరంభంలో అంగడంగడి పరిచర్య లేదా వీధి సాక్ష్యంలో పాల్గొనడం మంచిదని ప్రయాణ కాపరి తీర్మానించవచ్చు. లేదా కార్యాలయ కట్టడాల్లో, వ్యాపార ప్రాంతాల్లో, పార్కింగ్ స్థలాల్లో, లేదా మరితర బహిరంగ స్థలాల్లో సాక్ష్యమిచ్చేందుకు చిన్న గుంపులను ఆయన ఏర్పాటుచేయవచ్చు. ప్రాంతీయ సేవకు లభ్యమయ్యే సమయాన్ని ప్రచారకులు మరింత ఫలకరంగా ఉపయోగించడం ద్వారా, చాలా మంది ప్రజలను కలవవచ్చు.
7 ఈ సవరింపును ప్రయాణకాపరులు, ప్రచారకులూ ఒకేలా అంగీకరించారని నివేదికలు చూపిస్తున్నాయి. స్థానికంగా అవధానం అవసరమైన వివిధ పరిచర్య పనుల్లో కొంతమంది ప్రచారకులకు తర్ఫీదునివ్వమని పెద్దల సభలోని అనేక మంది సభ్యులు ప్రయాణ కాపరిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమాల్లో ఒక దానిలో ప్రయాణ కాపరి పాల్గొంటున్నప్పుడు ఆయనతోపాటు వెళ్ళడం ఈ ప్రచారకులకు చాలా సహాయకరంగా ఉంటోంది. దాని ఫలితంగా, వారు మిగిలినవారికి తర్ఫీదివ్వగలుగుతున్నారు. (2 తిమో. 2:2) ఆ విధంగా ఇప్పుడు చాలా మంది ప్రజల దగ్గరికి సువార్త చేరుకుంటోంది.
8 నిజమే, ప్రకటించే ఈ ఇతర మార్గాలను ప్రయత్నించేందుకు ప్రాంతీయ కాపరి దర్శించే వరకు మీరు వేచి ఉండనవసరం లేదు. మీ ప్రాంతంలో ఆచరణయోగ్యమని మీరు కనుగొనగల కొన్ని తలంపులు ఇక్కడ మీకు ఇవ్వబడ్డాయి:
9 వీధి సాక్ష్యం: నిర్మానుష్యంగా ఉన్న నివాస ప్రాంతాన్ని మనం వారంలో ఒక రోజు ఉదయాన సందర్శించినప్పుడు ‘అందరూ ఎక్కడికి వెళ్ళారు?’ అని కొన్ని సార్లు మనం ఆశ్చర్యపోతాం. కొందరు ప్రజలు చిన్న పనుల మీద ప్రయాణాలు చేస్తుండవచ్చు లేదా షాపింగ్ చేస్తుండవచ్చు. వీధి సాక్ష్యం ద్వారా వారిని కలవడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? మీరా పని చక్కగా చేసినట్లయితే, ఈ విధమైన పరిచర్య చాలా ఫలకరంగా ఉండగలదు. పత్రికలతో ఒక చోట నిలబడేదాని కన్నా, ప్రజల దగ్గరికి వెళ్ళి స్నేహపూర్వకంగా సంభాషణను ఆరంభించడం మంచిది. వెళ్ళే ప్రతి ఒక్కరికి సాక్ష్యమివ్వవలసిన అవసరం లేదు. దుకాణాల అద్దాల గుండా కనిపించే వస్తువులను చూస్తూ వెళ్ళేవారు, పార్క్ చేసిన కారుల్లో ఉన్నవారు, లేదా ప్రజా రవాణా కొరకు వేచివున్నవారు వంటి వెళ్ళే తొందరలో లేనివారితో మాట్లాడండి. మొదట మీరు స్నేహపూర్వకంగా పలకరించి, ప్రతిస్పందన కొరకు వేచి ఉండండి. ఆ వ్యక్తి మాట్లాడడానికి ఇష్టపడుతున్నట్లయితే, అతనికి ఆసక్తికరంగా ఉంటుందని మీరు తలంచే విషయాన్ని గూర్చి వారి అభిప్రాయాన్ని అడగండి.
10 ఒక ప్రయాణ కాపరి వీధి సాక్ష్యంలో తనతోను తన భార్యతోను చేరమని ఆరుగురు ప్రచారకులను ఆహ్వానించాడు. ఫలితం ఏమిటి? “మేమా ఉదయం చాలా సంతోషించాం! ప్రజలను ఇండ్లలో కలవలేదనే సమస్య మాకు లేదు. మేము ఎనభై పత్రికలను మరియు అనేక కరపత్రాలను ఇచ్చాము. మేము ప్రేరణాత్మకమైన అనేక సంభాషణలను జరిపాము. వీధి సాక్ష్యంలో మొదటిసారిగా పాల్గొన్న ఒక ప్రచారకుడు, ‘నేను అనేక సంవత్సరాలుగా సత్యంలో ఉన్నాను, కాని నేను దేనిని కోల్పోతున్నానో నేను గ్రహించలేదు!’ ఆ వారాంతానికల్లా, సంఘంలో అధికంగా నిల్వ ఉన్న పత్రికలన్నీ అయిపోయాయి” అని ఆయన నివేదించాడు.
11 ఆ ప్రయాణ కాపరి తరువాతి సంఘంలో సేవ చేస్తుండగా, చాలా మంది ప్రచారకులు ఒక రోజు పెందలకడనే వీధి సాక్ష్యంలో పాల్గొన్నారు గానీ, ఎక్కువ సఫలతను పొందలేదని గ్రహించాడు. ఒక సహోదరి కలిసిన వారందరూ ఉద్యోగానికి వెళ్ళే తొందరలో ఉన్నందువల్ల సాక్ష్యమిచ్చిన ఆ సమయమంతటిలో, ఆమె ఇద్దరు వ్యక్తులతోనే మాట్లాడింది. అందరూ అదే వీధికి ఉదయం కొంత సమయం గడిచిన తర్వాత తిరిగి రావాలని ప్రయాణ కాపరి సలహా ఇచ్చాడు. వాళ్ళు తిరిగి వచ్చి, మధ్యాహ్నం దాకా అక్కడ ఉండిపోయారు. ఉదయం రెండుసార్లు మాత్రమే సంభాషించిన సహోదరి, తిరిగి వచ్చిన తర్వాత చాలా చక్కగా చేసింది. ఆమె 31 పత్రికలను మరియు 15 బ్రోషూర్‌లను ఇచ్చి, ఏడుగురు వ్యక్తుల పేర్లను, చిరునామాలను తీసుకుని, రెండు బైబిలు పఠనాలను ప్రారంభించింది! ఆ గుంపులోని ఇతరులకు కూడా అలాంటి ప్రోత్సాహకరమైన ఫలితాలు దక్కాయి.
12 ఆసక్తి చూపించే వారు కనిపించినప్పుడు, ఆ వ్యక్తి యొక్క పేరును, చిరునామాను లేదా టెలిఫోన్ నెంబరును తీసుకోవడానికి ప్రయత్నించండి. సమాచారాన్ని నేరుగా అడిగే బదులు మీరీ విధంగా అనవచ్చు: “మీతో సంభాషించినందుకు సంతోషంగా ఉంది. మనం దీనిని మరో సమయంలో కొనసాగించగల్గేందుకు వీలౌతుందా?” లేదా ఇలా అడగండి: “నేను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర కలవడానికి వీలౌతుందా?” ఈ విధంగా కలిసిన అనేకులు పునర్దర్శనానికి ఒప్పుకున్నారు. ఉపయోగించేందుకు కావలసినన్ని కరపత్రాలున్నాయని నిశ్చయపర్చుకోండి, మన కూటాలకు హాజరు కావడానికి ఆసక్తిని చూపించేవారిని ఆహ్వానిస్తుండగా అతి సమీపంలో ఉన్న కూటాల స్థలాన్ని, కూటాల సమయాన్ని బహుశా ఒక కరపత్రం మీద వెంటనే వ్రాసిచ్చేందుకు సిద్ధంగా ఉండండి.
13 మీరు మాట్లాడిన ఆసక్తిగల వ్యక్తి మరో సంఘానికి నియమించిన ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే, ఆసక్తిగల ఆ వ్యక్తి దగ్గరికి అక్కడి సహోదరులు వెళ్ళగల్గేందుకు మీరు వారికి ఆ సమాచారాన్ని తెలపాలి. మీ ప్రాంతంలో సువార్తను వ్యాపింపజేసేందుకు వీధి సాక్ష్యం ఫలకరమైన మార్గంగా ఉండగలదా? అలాగైతే, మన రాజ్య పరిచర్య 1994 జూలై సంచికలోని “ప్రభావవంతమైన వీధి సాక్ష్యమివ్వడంద్వారా ఆసక్తిగల వారిని కనుగొనుట” అనే శీర్షికను పునఃసమీక్షించండి. తర్వాత, పగలు సాధ్యమైనంత మందిని మీరు చేరుకోగల సముచితమైన సమయంలో వీధి సాక్ష్యంలో పాల్గొనేందుకు ఏర్పాటు చేసుకోండి.
14 ప్రజా రవాణాలో సాక్ష్యమివ్వడం: స్థానిక కాలేజీ దగ్గర బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు సాక్ష్యమివ్వాలని ఒక ఉదయం చాలా మంది పయినీర్లు నిర్ణయించుకున్నారు. వారు ఆహ్లాదకరమైన సంభాషణలను జరుపుతుండేసరికి ఒక సమస్య తలెత్తేది. వాళ్ళ సంభాషణ చక్కగా ముందుకు సాగుతుండగా, బస్సు వచ్చి, వారి సంభాషణను మధ్యలో ఆపేసేది. పయినీర్లు ఆ బస్సెక్కి ఆ ప్రయాణికులు పట్టణం గుండా ప్రయాణిస్తుండగా సంభాషణను కొనసాగించి ఆ సమస్యను పరిష్కరించారు. బస్సు రూట్ చివరికి వచ్చే సరికి పయినీర్లు ఆ బస్సులోనే తిరుగు ప్రయాణం మొదలుపెట్టి, బస్సులోనే సాక్ష్యమిచ్చేవారు. అనేక సార్లు రాక పోకలు జరిపిన తర్వాత వారు సాధించిన వాటిని లెక్కించగా వచ్చిన మొత్తం: 200 కన్నా ఎక్కువ పత్రికలు ఇవ్వబడ్డాయి, ఆరు బైబిలు పఠనాలు ప్రారంభించబడ్డాయి. కొందరు ప్రయాణికులు తమను ఇంటి దగ్గర కలిసేందుకు చిరునామాలను ఫోన్ నెంబర్లను ఇష్టపూర్వకంగా ఇచ్చారు. తరువాతి వారం, ఆ పయినీర్లు ఆ బస్ స్టాప్‌కు తిరిగి వచ్చారు, ముందు చేసిన అదే పద్ధతిని అవలంబించారు. వాళ్ళు 164 పత్రికలను అందించారు, మరో బైబిలు పఠనాన్ని ప్రారంభించారు. ఒక స్టాపుకు వచ్చేసరికి ఒక యాత్రికుడు బస్సెక్కి, ఉన్న ఒకే ఒక సీట్లో—పయినీర్ ప్రక్కన ఉన్న సీట్లో కూర్చున్నాడు. అతడు సహోదరుని వైపు చూసి, చిరునవ్వుతో, “నా కోసం మీ దగ్గర ఒక కావలికోట ఉందని నాకు తెలుసు” అని అన్నాడు.
15 చాలా మంది ప్రచారకులు బస్సులోనో రైలులోనో ప్రయాణం చేసేటప్పుడు ఫలకరమైన సాక్ష్యాన్నిస్తారు. మీ ప్రక్కన కూర్చున్న ప్రయాణికునితో మీరెలా సంభాషణను ప్రారంభించగలరు? బస్సులో తన ప్రక్కన కూర్చున్న కౌమార ప్రాయంలోని అమ్మాయి జిజ్ఞాసను రేకెత్తించాలనే కోరికతో 12 ఏండ్ల ఒక ప్రచారకుడు తేజరిల్లు! ప్రతిని చదవనారంభించాడంతే. ఆ ప్రయత్నం ఫలించింది. తను ఏం చదువుతున్నాడని ఆ అమ్మాయి అడిగింది, యౌవనస్థులు ఎదుర్కోవలసిన సమస్యల పరిష్కారాన్ని గూర్చి చదువుతున్నానని ఆ బాలుడు జవాబిచ్చాడు. తను దాని నుండి ఎంతో ప్రయోజనం పొందాడని, అది తప్పకుండా ఆమెకు కూడా సహాయపడగలదని కూడా చెప్పాడు. ఆమె సంతోషంగా ఆ పత్రికలను తీసుకుంది. వారి సంభాషణను విన్న మిగిలిన పిల్లలు కూడా ఆ పత్రికల ప్రతులు కావాలని అడిగారు. దీనితో, బస్సు డ్రైవర్ బస్సును రోడ్డు ప్రక్కన నిలిపి, ఆ పత్రికల్లో ఇంత ఆసక్తి ఎందుకని అడిగాడు. ఆయనకు కూడ ఆసక్తిగా అనిపించి, తను కూడా ప్రతులను తీసుకున్నాడు. ఆసక్తి చూపించిన ప్రతి ఒక్కరికి ఇచ్చేందుకు కావలసినన్ని పత్రికలను ఆ చిన్ని ప్రచారకుడు తెచ్చుకోకపోతే, కచ్చితంగా ఇదేమీ జరిగుండేది కాదు!
16 పార్కుల్లోను పార్కింగ్ ప్రాంతాల్లోనూ సాక్ష్యమివ్వడం: పార్కుల్లోను పార్కింగ్ ప్రాంతాల్లోను సాక్ష్యమివ్వడం ప్రజలను చేరుకునే ఉత్తమమైన మార్గం. వ్యాపార కేంద్రంలోని పార్కింగ్ ప్రాంతాల్లో సాక్ష్యమివ్వడానికి మీరెప్పుడైనా ప్రయత్నం చేశారా? మీ పరిసరాలను పరికించేందుకు ఎల్లప్పుడూ కొన్ని నిమిషాలను తీసుకోండి. తొందరలో లేనివారి కోసం, లేదా పార్క్ చేసి ఉన్న కారులో లేదా స్కూటర్ ప్రక్కన వేచివున్న వారి కోసం చూసి, స్నేహపూర్వకమైన సంభాషణను మొదలుపెట్టేందుకు ప్రయత్నించండి. సంభాషణ కొనసాగినట్లయితే రాజ్యసువార్తను సంభాషణలోకి తీసుకురండి. ఒంటరిగా చేయడానికి ప్రయత్నించండి, కానీ చుట్టు ప్రక్కల మరో ప్రచారకుడు ఉండాలి. పెద్ద బరువైన సంచీని, లేదా వేరే విధాలుగా మీ పనిమీదికి అవధానాన్ని ఆకర్షించే పద్ధతులను నివారించండి. వివేచనగలవారై ఉండండి. పార్క్ చేసే ఒకే ప్రాంతంలో కొంచెం సేపే చేసి, మరో చోటికి వెళ్ళడం మంచిది. మీతో సంభాషించాలని ఎవరైనా ఇష్టపడనట్లైతే, నమ్రతతో మీ దారిన మీరు వెళ్ళి, వేరెవరి దగ్గరికైనా వెళ్ళడానికి ప్రయత్నించండి. ఈ పద్ధతులను ఉపయోగించి, ఒక సహోదరుడు పార్కింగ్ ప్రాంతాల్లో సాక్ష్యమిచ్చి ఒక నెలలో 90 పత్రికలను ఇచ్చాడు.
17 కొంత మంది ప్రజలు విశ్రాంతి తీసుకునేందుకు పార్కుకు వెళ్తారు; ఇతరులు ఆటలు ఆడుకోడానికి లేదా తమ పిల్లలతో సమయాన్ని గడిపేందుకు అక్కడికి వెళ్తారు. వారి కార్యక్రమాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా, సాక్ష్యమిచ్చే అవకాశం కొరకు వేచి ఉండండి. ఒక సహోదరుడు పార్క్‌లో తోటపని చేసే ఒకతనితో సంభాషణను ఆరంభించి, అతడు మత్తు మందులను గూర్చి, తన పిల్లల భవిష్యత్తును గూర్చి వ్యాకులపడుతున్నాడని కనుగొన్నాడు. ఒక గృహ బైబిలు పఠనం ఆరంభించబడి, పార్క్‌లో క్రమంగా నిర్వహించబడింది.
18 వ్యాపార స్థలాల్లో అనియత సాక్ష్యమివ్వడం: షాపింగ్ కాంప్లెక్స్‌లలో నియతంగా అంగడంగడికి ప్రకటించడం మీద కొన్ని నియంత్రణలు ఉంటాయి కనుక, అలాంటి కార్యక్రమాలు ఎల్లప్పుడూ సాధ్యం కాకపోయినప్పటికీ, కొందరు ప్రచారకులు అక్కడ అనియతంగా ప్రకటించే అవకాశాలను సృష్టించుకుంటారు. వారు ఒక బెంచీ మీద కూర్చుని, విశ్రాంతి తీసుకోవడానికి ఆగే వారితో స్నేహపూర్వకంగా సంభాషణను ఆరంభిస్తారు. ఆసక్తి చూపించినప్పుడు వారు వివేచనాపూర్వకంగా ఒక కరపత్రాన్నో లేక ఒక పత్రికనో ప్రతిపాదించి, పునర్దర్శనానికి ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సంతలో ఒక చోట కొన్ని నిమిషాలు సాక్ష్యమిచ్చిన తర్వాత, వారు మరో చోటికి వెళ్ళి మరొకరితో సంభాషిస్తారు. అవును, ఈ విధంగా అనియత సాక్ష్యమిస్తుండగా, అనవసరమైన అవధానాన్ని ఆకర్షించకుండా జాగ్రత్త తీసుకోవాలి.
19 ఒక వ్యక్తికి అభివాదం చేసేటప్పుడు, స్నేహభావాన్ని చూపిస్తూ సంభాషణను ఆరంభించండి. మీ శ్రోత ప్రతిస్పందిస్తున్నట్లయితే, ఒక ప్రశ్న అడిగి, ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటప్పుడు అవధానమిచ్చి ఆలకించండి. ఆయన చెబుతున్న దానిలో వ్యక్తిగత శ్రద్ధను తీసుకోండి. ఆయన అభిప్రాయానికి మీరు విలువిస్తున్నారని చూపించండి. సాధ్యమైనప్పుడు, ఆయనతో ఏకీభవించండి.
20 జీవన వ్యయం ఎంత పెరిగిపోయింది అని పేర్కోవడం ద్వారా ఒక సహోదరి పెద్ద వయస్సు గల ఒక స్త్రీతో ఆహ్లాదరకరమైన సంభాషణను చేయగలిగింది. ఆ స్త్రీ వెంటనే ఏకీభవించింది, దాని ఫలితంగా ఒక ఉత్సాహంతోకూడిన చర్చ జరిగింది. ఆ సహోదరి ఆ స్త్రీ పేరును చిరునామాను తీసుకుంది, అదే వారంలో పునర్దర్శనం జరిగింది.
21 అంగడంగడికి పరిచర్య చేయడం: చాలా సంఘాలకు తమ పరిచర్య ప్రాంతంలో వ్యాపార స్థలాలు ఒక భాగంగా ఉన్నాయి. ఆ ప్రాంతానికి బాధ్యత తీసుకుంటున్న సహోదరుడు వ్యాపార స్థలాలు మరియు సంతలు అత్యధికంగా కేంద్రీకరించబడిన ప్రదేశాల ప్రత్యేక పటాన్ని తయారు చేయవచ్చు. ఏదైన నివాస ప్రాంతపు పటం కార్డులో ఆ ప్రదేశాలు మిళితమై ఉన్నట్లయితే, ఆ ప్రాంతపు భాగమన్నట్లు ఆ ప్రదేశాల్లో పరిచర్య చేయకూడదని స్పష్టంగా సూచించాలి. ఇతర ప్రాంతాల్లో నివాస స్థలాలతో పాటు వ్యాపార స్థలాల్లోను పరిచర్య చేయవచ్చు. వ్యాపార ప్రాంతాల్లో క్రమంగా పరిచర్య చేసేందుకు యోగ్యతగల ప్రచారకులను పెద్దలు ఆహ్వానించవచ్చు. అంగడంగడి పని నిర్లక్ష్యం చేయబడకుండా ఉంటుంది.
22 ఈ పనిలో పాల్గొనేందుకు మీరు ఆహ్వానించబడినట్లయితే, మీరు క్రితమెన్నడూ ఈ పని చేయనట్లైతే, మొదట చిన్న దుకాణాల్లో చేయడం ‘ధైర్యం తెచ్చుకోవడానికి’ మంచి మార్గం; తర్వాత మరింత ఆత్మవిశ్వాసం కలిగినట్లు మీరు భావించినప్పుడు పెద్ద దుకాణాల్లో చేయండి. (1 థెస్స. 2:2) మీరు అంగడంగడికి పరిచర్య చేసేటప్పుడు, మీరు రాజ్యమందిరంలోని కూటాలకు వెళ్ళేటప్పుడు ఎలా తయారవుతారో అలా తయారుకండి. సాధ్యమైతే, సరుకులను కొనుక్కోవడానికి వినియోగదారులు ఎక్కువగా రాని సమయంలో ఆ దుకాణాలకు వెళ్ళండి. మేనేజరుతో లేదా ఇన్‌చార్జ్‌లో ఉన్న వ్యక్తితో మాట్లాడాలని కోరండి. ఆప్యాయతతో మాట్లాడండి, అంత కన్నా ముఖ్యంగా క్లుప్తంగా మాట్లాడండి. క్షమాపణ అడగనవసరం లేదు. చాలా వ్యాపారాలు వినియోగదారులనుద్దేశించినవే కనుక, వారు తమ పనికి అంతరాయం కలగడాన్ని వ్యాపారస్థులు నిరీక్షిస్తారు.
23 దుకాణదారునికి అభివాదం చేసిన తర్వాత మీరీ విధంగా చెప్పవచ్చు: “వ్యాపారస్థులు తీరికగా ఉండరు కనుక, వారిని ఇంటి దగ్గర చాలా అరుదుగా కలుస్తాము, కనుక ఆలోచనను రేకెత్తించే ఒక శీర్షికను చదివేందుకు మీకివ్వడానికి మీ వ్యాపారస్థలంలో మిమ్మల్ని సందర్శించడానికి వచ్చాము.” ప్రతిపాదిస్తున్న పత్రికను గూర్చి ఒకటి లేక రెండు వ్యాఖ్యలు చేయండి.
24 ఒక మేనేజరును సమీపించినప్పుడు మీరీ విధంగా చెప్పవచ్చు: “వ్యాపారస్థులు ఏ సమాచారాన్నైనా బాగా తెలుసుకొని ఉండాలని కోరుకుంటారని మేము గ్రహించాము. మనందరిపైనా వ్యక్తిగతంగా ప్రభావం చూపే ఒక శీర్షికను కావలికోట (లేదా తేజరిల్లు!) యొక్క క్రొత్త పత్రిక చర్చిస్తుంది.” అదేమిటో వివరించి, “మీరు తప్పకుండా దానిని చదివి ఆనందించగలరని మాకు నమ్మకముంది” అని అంటూ ముగించండి.
25 ఉద్యోగస్థులున్నట్లయితే, సముచితమనిపిస్తే, మీరీ విధంగా కూడా చెప్పవచ్చు: “మీకిచ్చిన అదే క్లుప్త సమాచారాన్ని మీ క్రింది ఉద్యోగస్థులకు అందజేయడానికి అనుమతినిస్తారా?” అనుమతి ఇవ్వబడినట్లయితే, మీరు క్లుప్తంగా చెప్తామన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి, మీరు మీ మాటను పాటిస్తారని మేనేజరు నిరీక్షిస్తాడు. ఎవరైనా ఉద్యోగస్థులు ఎక్కువగా చర్చించాలని కోరుకుంటున్నట్లయితే, వాళ్ళను వాళ్ళ ఇండ్లలో కలవడం శ్రేష్ఠం.
26 ఇటీవలే, చిన్న పట్టణంలోని కొందరు ప్రచారకులు అంగడంగడి పరిచర్యలో ప్రాంతీయ కాపరితో కలిశారు. కొందరు ప్రచారకులు క్రితమెన్నడూ చేయనందువల్ల, మొదట బిడియపడ్డారు; కాని త్వరలోనే నెమ్మది చెంది ఆ పనిని ఆస్వాదించగలిగారు. గంట కూడా కాకముందే వాళ్ళు 37 మందితో మాట్లాడి 24 పత్రికలను 4 బ్రోషూర్‌లను అందించారు. తాము ఒక నెల ఇంటింటి పరిచర్య చేస్తే సాధారణంగా కలవనంత మందిని తాము ఆ కొద్ది సమయంలో కలవగలిగామని ఒక సహోదరుడు అభిప్రాయపడ్డాడు.
27 ప్రకటించే అవకాశాలను సృష్టించుకోవడం: యేసు తన సాక్ష్యపు పనిని నియత సందర్భాలకు మాత్రమే పరిమితం చేసుకోలేదు. సముచితమైన ప్రతి సందర్భంలోను ఆయన సువార్తను వ్యాపింపజేశాడు. (మత్త. 9:9; లూకా 19:1-10; యోహా. 4:6-15) కొందరు ప్రచారకులు ప్రకటించే అవకాశాలను ఎలా సృష్టించుకుంటున్నారో గమనించండి.
28 కొందరు పాఠశాల ద్వారం దగ్గర తమ పిల్లల కోసం వేచివున్న తలిదండ్రులకు సాక్ష్యమివ్వడం అలవాటు చేసుకుంటారు. చాలా మంది తలిదండ్రులు దాదాపు 20 నిమిషాలు ముందుగానే చేరుకుంటారు కనుక, లేఖనాధార విషయంపై, పురికొల్పే విధంగా వారితో సంభాషించేందుకు సమయముంటుంది.
29 మన పత్రికల్లో చర్చించబడిన ఒక ప్రత్యేక విషయంపై విశేష ఆసక్తివున్న ప్రజలను చేరుకునేందుకు చాలా మంది పయినీర్లు శ్రద్ధ కలిగి ఉంటారు. ఉదాహరణకు, ఒక సహోదరి “పాఠశాలలు సంకట పరిస్థితిలో” అనే పరంపర గల డిశంబరు 22, 1995 తేజరిల్లు! (ఆంగ్లం) తీసుకుని తన సంఘ ప్రాంతంలోని ఆరు పాఠశాలలకు వెళ్ళింది. ఆమె అలాగే కుటుంబ జీవితము మరియు పిల్లలపై అత్యాచారం అనే విషయాలను చర్చించే పత్రికలతో సందర్శించి, ఇలాంటి అంశాలపై ఉండే భవిష్యత్ శీర్షికలను ఇవ్వమన్న స్థిరమైన ఆహ్వానాన్ని పొందింది. నిరుద్యోగాన్ని గూర్చిన ఏప్రిల్ 8, 1996 తేజరిల్లు! పత్రికను తీసుకుని ఉపాధి కల్పన కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఆమెకు లభించిన ప్రతిస్పందన “చాలా గొప్పది” అని వర్ణించబడింది.
30 తను, తన భార్యా కిరాణా దుకాణానికి వెళ్ళినప్పుడెల్లా క్రమంగా అనియత సాక్ష్యాన్నిస్తామని ఒక జిల్లా కాపరి నివేదిస్తున్నాడు. దుకాణాల్లో మరీ రద్దీ లేనప్పుడు, వినియోగదారులు విరామంగా అటు ఇటు నడుస్తున్నప్పుడు వారు దుకాణానికి వెళ్తారు. అనేక మంచి సంభాషణలను జరిపామని వాళ్ళు చెబుతున్నారు.
31 చాలా మంది ప్రచారకులు సినిమాహాల్‌లకు బయట, లాండ్రీలకు, లేదా క్లినిక్‌లకు, ఆసుపత్రులకు దగ్గర ఉన్న లేదా బయట ఉన్న ప్రజలకు సాక్ష్యమిచ్చి మంచి ఫలితాలను పొందినట్లు నివేదించారు. ఆసుపత్రులు మరియు క్లినిక్‌లకు వెళ్ళినప్పుడు వారు రిసెప్షన్ దగ్గర కేవలం కరపత్రాలను, పాత పత్రికలను విడిచి వెళ్ళలేదు. సువార్తతో ప్రజలను చేరుకోవాలన్నది వారి లక్ష్యం కనుక, వారు సముచితమైనచోట ఖాళీగా ఉన్న, సంభాషించడానికి సిద్ధంగా ఉన్నవారితో వ్యక్తిగతంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు.
32 కొన్ని ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్లకు లేదా బస్‌స్టాప్‌లకు సమీపంలో ఉన్న ప్రజలతో ప్రచారకులు మాట్లాడతారు. అలాంటి స్థలాల్లో అనవసరంగా ప్రవేశించడాన్ని, ఎక్కువసేపు అక్కడే ఉండడాన్ని చట్టం నియంత్రిస్తుంది కనుక, ప్లాట్‌ఫారమ్‌లపై ఉండి పత్రికలనివ్వడం చట్టవిరుద్ధం అయ్యుండవచ్చు కనుక, ప్రచారకులు స్టేషన్‌కు బయట ఉన్నవారిని అంటే, ట్రెయిన్ వచ్చినప్పుడు ఎవరినైనా కలవడాని కోసం బహుశ ఎదురు చూస్తూ అలా, విరామంగా, ఖాళీగా ఉన్న వారితో యుక్తిగా మాట్లాడుతారు.
33 సంఘ ప్రాంతంలోని అత్యధిక భద్రతా ఏర్పాట్లుగల అపార్ట్‌మెంట్లలో, కాలనీలలో ఉన్న నివాసులకు వ్యక్తిగతంగా సాక్ష్యమిచ్చేందుకు అనుమతించబడనట్లైతే, డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్‌లతో లేదా కాలనీ మేనేజర్‌లతో కొందరు యుక్తిగా మాట్లాడడం అలవాటు చేసుకుంటారు. సంరక్షణ ఏర్పాట్లు చేయబడిన వ్యక్తిగత కట్టడాలున్న లేదా కంపెనీ కట్టడాలున్న ప్రదేశాల్లోకి వెళ్ళడాన్ని సెక్యూరిటీ గేట్లు నియంత్రించే చోట అదే పద్ధతి ఉపయోగించబడుతుంది. ఒక ప్రాంతీయ కాపరి మరియు కొందరు ప్రచారకులు ఇదే పద్ధతిలో ఏడు కాంప్లెక్స్‌లను సందర్శించారు. ప్రతి కాంప్లెక్స్‌లోని మేనేజర్‌తో, తమ సాధారణ పద్ధతి చొప్పున ఇంటింటికి వెళ్ళి చెప్పడానికి అనుమతించబడనప్పటికీ, క్రొత్త పత్రికలోని సమాచారాన్ని ఆయన కోల్పోకూడదని తాము ఆశిస్తున్నామని చెప్పారు. ఆ ఏడు కాంప్లెక్స్‌లలోని మేనేజర్లూ పత్రికలను సంతోషంగా స్వీకరించి, తరువాతి సంచికలు కూడా కావాలని కోరారు! అలాంటి కాంప్లెక్స్‌లలోని నివాసులకు ఉత్తరం ద్వారా లేదా టెలిఫోన్ ద్వారా సమాచారాన్ని తెలిపారు.
34 ప్రతిచోట బోధించేందుకు మీరు శ్రమపడండి: మన సమర్పణకు తగినట్లు జీవించడంలో, రాజ్య వర్తమానాన్ని ప్రకటించమనే మన నియామకాన్ని గూర్చిన అత్యవసర భావాన్ని కలిగి ఉండడం ఇమిడి ఉంది. ఈ దేశంలో మనమిప్పటికీ చాలా మంది ప్రజలను ఇండ్లలో కలుస్తున్నప్పటికీ, ఒకే సమయంలో చాలా మందిని వారికి వీలుగా ఉన్న సమయంలో చేరుకునేందుకు, మనం ‘ఏ విధంగానైనా కొందరిని రక్షించేందుకు’ మనం మన వ్యక్తిగత ఇష్టాలను ప్రక్కన పెట్టవలసి ఉంటుంది. “నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను” అని పౌలు చెప్పినట్లుగా యెహోవాకు సమర్పించుకున్న సేవకులందరూ చెప్పగల్గాలని కోరుకుంటారు.—1 కొరిం. 9:22, 23.
35 పౌలు ఇంకా ఇలా వ్రాశాడు: “కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.” (2 కొరిం. 12:9, 10) మరో మాటలో చెప్పాలంటే మనలో ఎవరూ మన సొంత శక్తిచేత ఈ పనిని పూర్తిచేయలేరు. ఆయన శక్తివంతమైన పరిశుద్ధాత్మ కొరకు మనం యెహోవాకు ప్రార్థన చేయవలసిన అవసరముంది. మనం దేవుని శక్తి కోసం ప్రార్థించినట్లయితే, ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడని మనం నమ్మకముంచగలం. అప్పుడు ప్రజల ఎడల మనకు గల ప్రేమ, వారెక్కడ కనిపించినా వారికి సువార్తను ప్రకటించే అవకాశం కొరకు చూసేందుకు మనలను పురికొల్పుతుంది. రానున్న వారంలో, ఈ ఇన్‌సర్ట్‌లో ఇవ్వబడిన ఒక సలహాను ఎందుకు ప్రయత్నించి చూడకూడదు?