ప్రజల ప్రత్యేక ఆసక్తులను ఆకట్టుకొనే శీర్షికల్ని ఎంపికచేసుకోండి
1 తమ బాణాల్ని జాగ్రత్తగా ఎక్కుపెట్టే విలుకాండ్రవలే, సంఘంలోని అనేకమంది ప్రచారకులూ, పయినీర్లూ తమ టెరిటరీలో ఉన్న ప్రజల ప్రత్యేక ఆసక్తుల్ని ఆకట్టుకొనేందుకు కావలికోట, తేజరిల్లు! పత్రికల నుండి ఎంపికచేసుకొన్న శీర్షికల్ని ఉపయోగిస్తూ వాళ్లు ఎంతగానో సఫలీకృతులౌతున్నారు. పత్రికల్లోనుండి ఫలానా శీర్షికల్ని ఎలాంటి వ్యక్తులు చదవడానికి ఇష్టపడే అవకాశం ఎక్కువగా ఉందనే విషయాన్ని వాళ్లు నిర్ధారించి, ఆ సదరు వ్యక్తులు మన పత్రికలకు చందా కట్టేలా ప్రోత్సహించడానికి వాళ్లు ఆ శీర్షికల్ని ఉపయోగిస్తారు. వాళ్లు దీన్నెలా చేస్తారు?
2 మొదటిగా, వాళ్లు ప్రతీ సంచికనూ ఆమూలాగ్రం చదువుతారు. ఆపై, తాము చదివిన సంచికల్లోని ప్రతీ శీర్షికా ఎలాంటి వ్యక్తిని ఆకట్టుకుంటుంది అని వాళ్లు తమను తాము ప్రశ్నించుకుంటారు. అటు తర్వాత, ఆ ఫలానా శీర్షికను చదవడంలో ఎవరు ఎక్కువగా ఆసక్తిని చూపించే అవకాశం ఉందో ఆ వ్యక్తుల్ని కలవడానికి కృషిచేస్తారు. వాళ్ల ఆసక్తిని రేకెత్తించడానికి తగిన శీర్షికను చూపించిన తర్వాత, చందాను ప్రతిపాదిస్తారు. ఫలానా సంచికను తమ టెరిటరీలో ఉన్న ఎక్కువమంది తీసుకొనే అవకాశం ఉందని ముందుగా గ్రహించినప్పుడు, వాళ్లు ఆ సంచిక ప్రతుల్ని ఎక్కువ మొత్తంలో ఆర్డరు చేస్తారు.
3 మన పత్రికలు ఎంతో గౌరవాన్ని చూరగొన్నాయి: అత్యంత విస్తృతంగా చదువబడుతున్న నైజీరియా దేశపు అంతర్జాతీయ పత్రిక తరపున పనిచేస్తున్న మన పత్రిక చందాదారుడొకరు తేజరిల్లు! గురించి ఇలా అన్నారు: “అన్ని రకాల ప్రజల్ని ఆకట్టుకొనే ప్రపంచపు ఉత్తమ పత్రికకు అభినందనలు.” మన పత్రికల్ని ఎంతో ఆసక్తిగా చదివే పాఠకుడొకరు ఇలా పేర్కొన్నారు: “వెలకట్టలేని జ్ఞానాన్ని కల్గివున్న ఎంత అద్భుతమైన రత్నాలో కదా! నాకు ఆసక్తివున్న ప్రతీదీ ఈ [పత్రికల్లో] ఏదొక దానిలో చర్చించబడినట్టు నేను కనుగొన్నాను.”
4 బైబిలు విషయాంశాలూ, ప్రపంచ సంఘటనలూ, కుటుంబ వ్యవహారాలూ, సామాజిక సమస్యలూ, చరిత్ర, సైన్సు, జంతువుల మొక్కల జీవనపరిస్థితులూ వంటి వాటితోపాటూ వివిధ విషయాంశాలను ఈ పత్రికలు కవర్ చేస్తాయి. ఒక వ్యక్తి తన అవసరాలకూ, పరిస్థితులకూ, లేక వృత్తికీ సంబంధించిన విషయాంశాన్ని చదవడానికి ఖచ్చితంగా మరింత సుముఖతను చూపిస్తాడు. మనం అనేకమందితో అంటే తమ సొంత అభిరుచుల్ని, సమస్యల్ని కల్గివున్నటువంటి అనేకమందితో మాట్లాడతాం గనుక, మనం కలుసుకొనే ప్రజలను ప్రత్యేకంగా ఆకట్టుకొనే శీర్షికల్ని ఎంపికచేసుకోవడం ఎంతో ప్రభావవంతంగా ఉంటుంది.
5 సెప్టెంబరు 8, 1996 నాటి తేజరిల్లు! (ఆంగ్లం) సంచికను ఒక వార్తాపత్రిక విలేఖరికి ప్రతిపాదించినప్పుడు జరిగినదాన్ని గమనించండి. ఆయనిలా రాశాడు: “నాకు ఆసక్తిలేదని నేను చెప్పడానికి ముందే, వారిలో ఒకరిలా అన్నారు: ‘అమెరికన్ ఇండియన్ల గురించి ఓ శీర్షిక ఉంది. ఆ విషయాంశంపై మీరు ఎక్కువగా రాస్తూంటారని మాకు తెలుసు.’” ఆయన ఆ పత్రికను తీసుకొని, అల్పాహారాన్ని తీసుకొనే సమయంలో ఇండియన్ల గురించిన ఆ సమాచారాన్ని చదివాడు. ఆ తర్వాత “అది మహత్తరంగా ఉంది,” “పూర్తిగా యధాతధమైనది” అని ఒప్పుకున్నాడు.
6 మీ టెరిటరీలో ఉన్న ప్రజలు వేటిపై ఆసక్తిని చూపిస్తారు? మీ టెరిటరీలో ఉన్న షాపు యజమానుల్నీ, వృత్తి నైపుణ్యంగల ప్రజల్నీ, లేక మీ పొరుగువారినీ, తోటి ఉద్యోగస్థుల్నీ, తోటి విద్యార్థుల్నీ ఆకట్టుకొనే వేటిని మీరు ఇటీవలి నెలల్లో వచ్చిన పత్రికల్లో చూశారు? లాయర్లకూ, టీచర్లకూ, ప్రొఫెసర్లకూ, ప్రిన్సిపల్స్కూ, కుటుంబ జీవితంపై సలహాలిచ్చే కౌన్సిలర్లకూ, స్కూలు కౌన్సిలర్లకూ, యువతకు సలహాల్నిచ్చే వారికీ, సమాజ సేవకులకూ, డాక్టర్లకూ, నర్సులకూ విశేషంగా ఏవి ఆసక్తిని కల్గిస్తాయి? ప్రతీ సంచికనూ మీరు విశ్లేషించుకొనేటప్పుడు మీరు ప్రకటించే ప్రజల్ని మనస్సులో ఉంచుకోవడం, సత్యవాక్యాన్ని వ్యాపింపచేయడానికి ఉత్తమమైన మార్గాల్ని ఇస్తుంది.
7 ఫలానా కావలికోట శీర్షికనందు లేక తేజరిల్లు! శీర్షికనందు ప్రత్యేకమైన ఆసక్తిని చూపించే ఓ వ్యక్తి మీకు తారసపడి, ఆ పత్రికను అంగీకరించినప్పుడు, మీరిలా అనవచ్చు: “మీ ఆసక్తిని చూరగొంటుందని నేను భావించే ఏ శీర్షికైనా భావి సంచికల్లో వస్తే, ఆ సంచిక ప్రతినొకదాన్ని మీకివ్వడానికి నేను సంతోషంగా తీసుకొస్తాను.” అతి తరచుగా తాజా పత్రికలతో సందర్శిస్తూ మీ మ్యాగజిన్ రూట్లో ఆ వ్యక్తి పేరును చేర్చగల్గుతారు. విశేషంగా మన పత్రికల్లో వచ్చే కొన్ని శీర్షికలయందు ఆసక్తిని చూపించే వ్యక్తులను పునర్దర్శించేందుకు ఆహ్వానాన్ని పొందడానికి ఏం చేస్తామో అలాగే ఈ విషయంలోనూ చేయాల్సి ఉంటుంది.
8 ఆధ్యాత్మిక లక్ష్యాన్ని కల్గివుండండి: కొన్నేళ్ల క్రిందట, తన కెరీరే పరమావధిగా గల ఒక వ్యక్తి తనకు ఆసక్తి ఉన్న విషయాంశాన్ని చర్చించిన తేజరిల్లు! పత్రికను తీసుకొన్నాడు. అయితే, మతాసక్తి గల ఈ వ్యక్తి దాని జత సంచికయైన కావలికోటను కూడా చదివాడు, దానిలోని ఒక శీర్షిక త్రిత్వసిద్ధాంతంపై అతనికున్న చిరకాల నమ్మకాన్ని పరిశీలించేలా అతన్ని ప్రేరేపించింది. ఆరు నెలల తర్వాత ఆయన బాప్తిస్మం తీసుకొన్నాడు! అందుకే, మన పత్రికల పాఠకుల్ని ఆధ్యాత్మిక చర్చల్లో పాల్గొనేలా చేయడానికి వెనుకాడవద్దు. దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూర్ని మీరు పరిచయం చేసి, క్రొత్త పత్రికల్ని తీసుకొని మీరు వారిని సందర్శించే ప్రతీసారీ ఒక పాఠాన్ని చర్చించేందుకు కొన్ని నిమిషాలు మాత్రమే తీసుకొంటానని ప్రతిపాదించవచ్చు.
9 మీరు పునర్దర్శనం చేసే వ్యక్తుల్లో, మీరు కలుసుకొనే వ్యాపారస్థుల్లో కావలికోట, తేజరిల్లు! పత్రికలకు చందాల్ని కట్టడానికి సుముఖతను చూపించే వారిని జాగ్రత్తగా నిర్థారించుకోండి. ఆపై వారి దగ్గరకు వెళ్లడానికి తీవ్రంగా కృషి చేయండి. ఈ విలువైన పత్రికలతో ఎంతమందిని వీలైతే అంతమందిని కలుసుకోండి. వాళ్లు చందా కట్టకపోయినా ఆసక్తిని చూపించినట్లైతే, వారి దగ్గరకు తాజా పత్రికల్ని క్రమంగా తీసుకెళ్లండి. అలా పత్రికల్ని తీసుకెళ్లే ప్రతీసారీ ప్రత్యేకంగా వారి ఆసక్తిని చూరగొంటుందని మీరు భావించే ఒక శీర్షికను చూపించండి. మన పత్రికల్ని చదివేలా ఎక్కువమంది ప్రజలకు సహాయపడేందుకు మీరు కృషి చేస్తుండగా, మీరు ‘మీ ఆహారాన్ని నీళ్లమీద వేస్తున్నారనే’ విషయాన్ని ఎన్నటికీ మర్చిపోకండి. సకాలంలో, మీరు భావి శిష్యుల్ని కనుగొనడంలో సఫలీకృతులవ్వవచ్చు.—ప్రసం. 11:1, 6.