తల్లిదండ్రుల్లారా—మీ పిల్లలకు బాల్యము నుండే శిక్షణనివ్వండి
1 “బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు.” (సామె. 22:6) తల్లిదండ్రుల్లారా, మీ పిల్లలు సత్య మార్గమునుండి “తొలగి” పోకుండా ఉండాలని మీరు కోరుకుంటే, అలాంటి శిక్షణను ఎప్పుడు ఆరంభించాలి? బాల్యము నుండే!
2 తిమోతి ఆధ్యాత్మిక విద్య “బాల్యమునుండి” మొదలైంది అని పౌలు అన్నప్పుడు, ఆయన పసితనాన్ని సూచిస్తున్నట్లు వ్యక్తమవుతోంది. (2 తిమో. 3:14, 15) తత్ఫలితంగా, తిమోతి అత్యుత్తమ ఆధ్యాత్మిక పురుషుడిగా ఎదిగాడు. (ఫిలి. 2:19-22) తల్లిదండ్రుల్లారా, మీరు కూడా మీ పిల్లలు ‘యెహోవా సన్నిధిలో యెదగడానికి’ కావలసిన శిక్షణను, ‘బాల్యమునుండే’ ఆరంభించండి.—1 సమూ. 2:21.
3 వారు ఎదగడానికి కావలసిన నీటిని పోయండి: లేత మొక్కలు ఎత్తైన చెట్లుగా ఎదగడానికి ఎలాగైతే నిరంతరం నీటి సరఫరా అవసరమో, అదే విధంగా పరిణతి పొందిన దేవుని సేవకులుగా ఎదగడానికి, అన్ని వయస్సుల పిల్లలకు బైబిలు సత్యపు నీటి సరఫరా నిరంతరం అవసరం. పిల్లలకు సత్యం నేర్పించి, యెహోవాకు సన్నిహితమయ్యేలా వారికి సహాయపడేందుకు క్రమమైన కుటుంబ బైబిలు అధ్యయనమే ప్రధానమైన మార్గం. కానీ తల్లిదండ్రుల్లారా, ప్రతి పిల్లవాడి అవగాహనా శక్తిని దృష్టిలో పెట్టుకోండి. చిన్న పిల్లలకు, ఎక్కువ సమయం తీసుకొని బోధించే బదులు, తక్కువ సమయం తీసుకొంటూ తరచుగా బోధించడం ఎక్కువ ఫలవంతంగా ఉంటుంది.—ద్వితీ. 11:18, 19.
4 మీ పిల్లల నేర్చుకునే శక్తిని తక్కువగా అంచనా వేయకండి. బైబిలు వ్యక్తుల కథలు చెప్పండి. బైబిలులోని సంఘటనల బొమ్మలు వేయించండి లేదా అభినయింపజేయండి. మన ఆడియో, వీడియో క్యాసెట్లను, డ్రామా క్యాసెట్లను కూడా సద్వినియోగం చేసుకోండి. కుటుంబ అధ్యయనం మీ పిల్లల వయస్సులకు, నేర్చుకునే సామర్థ్యాలకు అనుగుణంగా ఉండేలా చూడండి. తొలి శిక్షణ ప్రాథమిక విషయాలతో చిన్న చిన్న మోతాదుల్లో ఉండాలి, కానీ పిల్లవాడు ఎదుగుతుండగా వాడికిచ్చే శిక్షణ మరింత విస్తృతమైనదిగా ప్రగతిదాయకంగా ఉండాలి. బైబిలు బోధ ఆహ్లాదకరంగా, వైవిధ్యంగా ఉండేలా చూడండి. మీ పిల్లలు వాక్యాన్ని ‘అపేక్షించాలని’ మీరు కోరుకుంటే, అధ్యయనాన్ని సాధ్యమైనంత రసవంతంగా చేయండి.—1 పేతు. 2:1-3.
5 సంఘ కార్యకలాపాల్లో వారు పాల్గొనేలా చెయ్యండి: మీ పిల్లలు సంఘ కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నులయ్యేలా వారికి అభివృద్ధికరమైన లక్ష్యాలను పెట్టండి. వారి మొదటి లక్ష్యం ఏమై ఉండాలి? ఇద్దరు చిన్న పిల్లలున్న తల్లిదండ్రులు ఇలా అన్నారు: “రాజ్య మందిరంలో నిశ్శబ్దంగా కూర్చోవడానికి ఇద్దరూ శిక్షణ పొందడం ఆరంభించారు.” తర్వాత, కూటాల్లో తమ సొంత మాటల్లో వ్యాఖ్యానించేలా, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో చేరడాన్ని లక్ష్యంగా పెట్టుకొనేలా పిల్లలకు సహాయపడండి. ఇంటింటికి ఒక కరపత్రం ఇవ్వడం, ఒక లేఖనం చదవడం, ఒక పత్రికను ప్రతిపాదించడం, గృహస్థులతో అర్థవంతమైన సంభాషణలను ప్రారంభించడం వంటివి, క్షేత్ర పరిచర్యలో సాధించగల మంచి లక్ష్యాలు.
6 ఉత్సాహవంతమైన మాదిరిగా ఉండండి: మీరు యెహోవా గురించి మాట్లాడడాన్ని, ఆయనకు ప్రార్థించడాన్ని మీ పిల్లలు ప్రతిరోజు వింటున్నారా? మీరు దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడాన్ని, కూటాలకు హాజరవ్వడాన్ని, క్షేత్ర పరిచర్యలో పాల్గొనడాన్ని, దేవుని చిత్తం చేయడంలో ఆనందం పొందడాన్ని వారు చూస్తున్నారా? (కీర్త. 40:8) ఇవి వాళ్ళు చేయడము, మీరు వాళ్ళతో కలిసి చేయడము చాలా ప్రాముఖ్యం. ఆరుగురు పిల్లలను నమ్మకమైన సాక్షులు అయ్యేలా పెంచిన తన తల్లి గురించి, ఎదిగిన ఒక కూతురు ఇలా అంది: “మాపై మా అమ్మ మాదిరే ఎక్కువగా ప్రభావం చూపింది, ఆమె మాదిరి మాటలకంటే ఎక్కువ ప్రభావాన్ని చూపించింది.” నలుగురు పిల్లల ఒక తల్లి ఇలా చెప్పింది: “‘మొదటి స్థానం యెహోవాకే’ అనేది మాకు కేవలం ఊతపదం లాంటిది కాదు, మేము ఆ విధంగానే జీవించాము.”
7 తల్లిదండ్రుల్లారా, మీ పిల్లలకు బాల్యము నుండే శిక్షణ ప్రారంభించండి, దేవుని వాక్యం నుండి సత్యాన్ని నేర్పించండి, పురోగమన లక్ష్యాలను పెట్టండి, శాయశక్తులా మంచి మాదిరిని ఉంచండి. మీరలా చేసినట్లైతే, తప్పకుండా సంతోషిస్తారు!