పరిచారకులుగా ఉండడానికి మీ పిల్లలకు తర్ఫీదునివ్వండి
1. కీర్తన 148:12, 13 వచనాలు ఏ చర్య తీసుకునేలా క్రైస్తవ తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నాయి?
1 యెహోవా తనను స్తుతించమని పిల్లలను ఆహ్వానిస్తున్నాడు. (కీర్త. 148:12, 13) కాబట్టి, క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు బైబిలు సత్యాల గురించి, దేవుని నైతిక సూత్రాల గురించి బోధించడం కన్నా ఎక్కువే చేస్తారు. వాళ్లు తమ పిల్లలు సువార్త పరిచారకులుగా ఉండడానికి కూడా వాళ్లకు తర్ఫీదునిస్తారు. ఈ తర్ఫీదు క్రమంగా ఎలా ఇవ్వవచ్చు?
2. ఆదర్శవంతులైన తల్లిదండ్రులను చూసి పిల్లలు ఎలా ప్రతిస్పందిస్తారు?
2 ఆదర్శంగా ఉండండి: న్యాయాధిపతియైన గిద్యోను తన 300 మంది మనుష్యులతో ఇలా చెప్పాడు, ‘నన్ను చూసి నేర్చుకోండి.’ (న్యాయా. 7:17, NW) సహజంగా పిల్లలు తమ తల్లిదండ్రులు చేసే వాటిని చూసి అలాగే చేస్తారు. ఒక తండ్రిది రాత్రుల్లో పనిచేసే ఉద్యోగం, ఆయన శనివారం ఉదయం ఇంటికి వచ్చేసరికి ఎంతో అలసిపోయి ఉన్నా నిద్రపోకుండా తన పిల్లలను పరిచర్యకు తీసుకువెళతాడు. అలా ఆయన ఒక్కమాట కూడా చెప్పకుండానే, పరిచర్య చేయడం ఎంత ప్రాముఖ్యమో తన పిల్లలకు బోధిస్తున్నాడు. (మత్త. 6:33) ప్రార్థించడం, బైబిలు చదవడం, వ్యాఖ్యానించడం, ప్రకటించడం వంటి ఆరాధనకు సంబంధించిన వాటన్నిటిని మీరు ఆనందంగా చేయడం మీ పిల్లలు చూస్తున్నారా? నిజమే, మీరు పరిపూర్ణమైన ఆదర్శవంతులుగా ఉండలేరు. అయితే, మీరు ఎంతో ఆసక్తిగా యెహోవా సేవ చేయడం మీ పిల్లలు చూస్తే, ఆయనను ఆరాధించమని వాళ్లకు బోధించడానికి మీరు చేసే ప్రయత్నాలకు ప్రతిస్పందించడానికి వాళ్లు ఇష్టపడతారు.—ద్వితీ. 6:6, 7; రోమా. 2:21, 22.
3. పిల్లలు ఎలాంటి ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకోవడానికి, వాటిని ఒక్కొక్కటిగా చేరుకోవడానికి తల్లిదండ్రులు సహాయం చేయాలి?
3 లక్ష్యాలు పెట్టండి: తల్లిదండ్రులు తమ పిల్లలకు నడవడం, మాట్లాడడం, వాళ్లంతట వాళ్లు బట్టలు వేసుకోవడం వంటివి నేర్పించడానికి అలుపు లేకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు. పిల్లలు పెద్దవాళ్లవుతూ ఒక్కో లక్ష్యాన్నీ చేరుకుంటున్నప్పుడు, వాళ్ల ముందు కొత్త లక్ష్యాలు పెడతారు. తల్లిదండ్రులు క్రైస్తవులైతే, పిల్లలు తమ వయస్సుకు, తమ సామర్థ్యానికి తగిన ఆధ్యాత్మిక లక్ష్యాలను పెట్టుకొని వాటిని చేరుకోవడానికి కూడా సహాయం చేస్తారు. (1 కొరిం. 9:26) సొంత మాటల్లో వ్యాఖ్యానించడం, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ప్రసంగాలివ్వడానికి సొంతగా సిద్ధపడడం మీ పిల్లలకు నేర్పిస్తున్నారా? (కీర్త. 35:18) పరిచర్యకు సంబంధించిన వివిధ అంశాల్లో పాల్గొనడానికి వాళ్లకు తర్ఫీదునిస్తున్నారా? బాప్తిస్మం తీసుకోవడం, పూర్తికాల సేవ చేయడం వంటి లక్ష్యాలను పెట్టుకోమని వాళ్లను ప్రోత్సహిస్తున్నారా? ఆనందంగా, ఉత్సాహంగా సువార్త ప్రకటిస్తూ అలాగే చేయమని మీ పిల్లలను ప్రోత్సహించేవాళ్లతో సహవసించడానికి వాళ్లకు తోడ్పడుతున్నారా?—సామె. 13:20.
4. పరిచారకులుగా ఉండడానికి చిన్న వయసు నుండే తర్ఫీదునివ్వడం మొదలుపెట్టే తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఎలా ప్రయోజనం పొందుతారు?
4 కీర్తనకర్త ఇలా చెప్పాడు, “దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని.” (కీర్త. 71:17) మీ పిల్లలు పరిచారకులుగా ఉండడానికి తర్ఫీదునివ్వడం చాలా చిన్న వయస్సు నుండే మొదలుపెట్టండి. ఆధ్యాత్మిక పునాది వేసుకోవడానికి చిన్న వయసు నుండే మీరు వాళ్లకు చేసే ఈ సహాయం రేపు వాళ్లు పెద్దవాళ్లయిన తర్వాత కూడా వాళ్లకు ప్రయోజనకరంగా ఉంటుంది.—సామె. 22:6.