సూచించబడిన ప్రతిపాదనలను ఉపయోగించే విధానం
1. సూచించబడిన ప్రతిపాదనలను మనమెలా దృష్టించాలి?
1 మన పత్రికలను, ఇతర ప్రచురణలను ప్రతిపాదించేందుకు మన రాజ్య పరిచర్యలో క్రమంగా కొన్ని ప్రతిపాదనలు సూచించబడుతున్నాయి. ఇక్కడ సూచించిన ప్రతిపాదనలను మనం పరిచర్యలో భాగం వహిస్తున్నప్పుడు ఉన్నదున్నట్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి మనం ఏమి చెప్పవచ్చో అని సాధారణ అభిప్రాయాన్ని కలుగజేసేందుకే ఇవ్వబడ్డాయి. సాధారణంగా, ప్రతిపాదనలను మన సొంత మాటల్లో చెబితే మనం పరిచర్యలో మరింత సమర్థవంతంగా ఉంటాం. అలా మనం సహజమైన రీతిలో మాట్లాడితే ఇంటి యజమాని సావధానంగా వినేందుకు సహాయకరంగా ఉంటుంది, అది మన చిత్తశుద్ధిని, దృఢనమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది.—2 కొరిం. 2:17; 1 థెస్స. 1:5.
2. మనం ప్రతిపాదనలను సిద్ధం చేసుకునేటప్పుడు స్థానిక ఆచారాలను ఎందుకు పరిగణలోనికి తీసుకోవాలి?
2 మీ ప్రతిపాదనలను పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోండి: మనం సువార్తను ప్రకటించే విధానం స్థానిక ఆచారాలనుబట్టి మారుతుంటుంది. మీరు ఇంటి యజమానిని పరిచయం చేసుకున్న తర్వాత మీ ప్రతిపాదన గురించి చెప్పే అవకాశముందా లేక మీ క్షేత్రంలోని ప్రజలు విషయమేమిటో సూటిగా వినడానికే ఇష్టపడతారా? అది ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది, కొన్నిసార్లు ఒక్కో వ్యక్తినిబట్టి కూడా మారుతుంటుంది. ప్రశ్నలు ఉపయోగించడం విషయంలో కూడా వివేచన అవసరం. కొన్ని ప్రాంతాలకు అనువైన ప్రశ్నలు వేరే ప్రాంతాల ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించవచ్చు. కాబట్టి, మనం సరైన వివేచనను ఉపయోగించి, స్థానికంగా ఆమోదకరంగా ఉండే విధంగా మన ప్రతిపాదనలను పరిస్థితులకు అనుగుణంగా మలచుకోవాలి.
3. మనం మాట్లాడే ప్రజల నేపథ్యాన్ని, ఆలోచనా విధానాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలి?
3 దానితోపాటు, మనం క్షేత్రసేవకు సిద్ధపడుతున్నప్పుడు మన క్షేత్రంలోని ప్రజల నేపథ్యాన్ని, ఆలోచనా విధానాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు, మీరు మత్తయి 6:9, 10 ని ఒక నిష్ఠగల క్యాథలిక్కుతో చర్చించిన విధంగా “ప్రభువు ప్రార్థన”తో పరిచయంలేని వ్యక్తితో చర్చించకపోవచ్చు. ముందుగా ఆలోచించుకోవడం ద్వారా, పరిచర్యలో మనం కలుసుకొనే ప్రజలకు మరింత ఆకర్షణీయంగా ఉండేలా మన ప్రతిపాదనలను పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోవచ్చు.—1 కొరిం. 9:20-23.
4. చక్కగా సిద్ధపడడం ఎందుకు ప్రాముఖ్యం?
4 ఒకవేళ సూచించబడిన ప్రతిపాదనను మనం ఉన్నదున్నట్లు ఉపయోగించాలనుకున్నా కూడా చక్కగా సిద్ధపడడానికి ప్రత్యామ్నాయం లేదు. మనం ప్రతిపాదించదలచిన ఆర్టికల్‌ను లేదా అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివి ఆసక్తి రేకెత్తించే అంశాల కోసం చూడాలి. ఆ తర్వాత వాటిని మన ప్రతిపాదనలో చేర్చాలి. మన ప్రచురణల్లోని చక్కని సమాచారం మనకు సుపరిచితమైతేనే వాటిని ఉత్సాహంగా ప్రతిపాదించగలుగుతాము.
5. మనం ఇతర ప్రతిపాదనలను ఎందుకు సిద్ధపడవచ్చు, ఎలా సిద్ధపడవచ్చు?
5 ప్రతిపాదించడానికి ఇతర పద్ధతులు: మనం సూచించబడిన ప్రతిపాదనల్లో ఇచ్చిన ప్రతిపాదనలకే కట్టుబడి ఉండాలా? లేదు. వేరే పద్ధతిని లేక వేరే లేఖనాన్ని ఉపయోగించడం మీకు సులభమనిపిస్తే, వాటిని కూడా ఉపయోగించండి. ప్రత్యేకంగా పత్రికల విషయంలో, మీ క్షేత్రంలోని వారికి మరింత ఆసక్తికరంగా ఉండగల మధ్య ఆర్టికల్‌లను చూపించే అవకాశాల కోసం చూడండి. సేవా కూటంలో క్షేత్రసేవా ప్రతిపాదనలను ప్రదర్శించాల్సి ఉన్నప్పుడు, స్థానిక క్షేత్రంలో మంచి ఫలితాలను తీసుకురాగల ప్రతిపాదనలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఈ విధంగా సమర్థవంతంగా సువార్తను ప్రకటించేందుకు అందరూ సహాయం పొందవచ్చు.