అక్టోబరు 16—నవంబరు 12 వరకు జరిగే ప్రత్యేక ప్రచార కార్యక్రమం!
1 “మతం పేరిట జరుగుతున్న దుష్క్రియలు అంతమౌతాయా?” అనే రాజ్యవార్త నం. 37ను ప్రపంచవ్యాప్తంగా అందించడం, వచ్చే నెలలో ఆరంభమౌతుంది. అక్టోబరు నెలలో పదిహేను రోజుల వరకు మనం కావలికోట, తేజరిల్లు! పత్రికలను అందిస్తాం. అక్టోబరు 16 సోమవారం మొదలుకొని నవంబరు 12 ఆదివారం వరకు రాజ్యవార్త నం. 37ను ఇవ్వడంలో మనం సంపూర్ణంగా భాగం వహిస్తాం. ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమమున్న వారాంతాల్లో ఆ కరపత్రాన్ని తాజా పత్రికలతోపాటు అందిస్తాం.
2 ఎవరు పాల్గొనవచ్చు: సువార్తను చురుకుగా ప్రకటించేవారందరూ ఈ ప్రచార కార్యక్రమంలో సంపూర్ణంగా పాల్గొనవచ్చు. కొంతమంది సహాయ పయినీరు సేవ చేయగలుగుతారు. ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తున్న బైబిలు విద్యార్థులుగానీ, పిల్లలుగానీ మీకున్నారా? బాప్తిస్మం తీసుకోని ప్రచారకులు కావడానికి తమకు అర్హతలున్నాయో లేదో తెలుసుకునేందుకు పెద్దలను అడగమని ప్రోత్సహించండి. నిష్క్రియులైన ప్రచారకులు బహుశా అనుభవజ్ఞులైన ప్రచారకులతో కలిసి పనిచేయడం ద్వారా, ఈ కార్యక్రమంలో పాల్గొనేలా వారిని ప్రోత్సహించేందుకు పెద్దలు చొరవ తీసుకొని వారితో మాట్లాడాలి.
3 ప్రచారకులలో, పయినీర్లలో ప్రతీ ఒక్కరూ కనీసం 50 కరపత్రాలు పొందే విధంగా రాజ్యవార్త నం. 37 సంఘాలన్నిటికీ వారి స్వంత భాషలో పంపించబడుతోంది. ఇంకా ప్రచారకులుకాని ఆసక్తిపరులు, తమ బంధువులకు, స్నేహితులకు ఇవ్వడానికి 5 కరపత్రాలు పొందవచ్చు. అందరూ ఎన్నెన్ని కరపత్రాలు అందించారో నమోదు చేసుకొని వాటిని అక్టోబరు, నవంబరు నెలాఖరున తమ క్షేత్రసేవా రిపోర్టు వెనక వ్రాయాలి. సంఘం అందించిన మొత్తం కరపత్రాలను లెక్కవేసి కార్యదర్శి ఆ సంఖ్యను ప్రతీ నెలాఖరున బ్రాంచి కార్యాలయానికి నివేదిస్తాడు. ప్రత్యేక ప్రచార కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంకా కరపత్రాలు మిగిలివుంటే వాటిని ఏ విధమైన ప్రచారపు పద్ధతిలోనైనా ఉపయోగించవచ్చు.
4 ఏమి చెప్పాలి: మీ ప్రతిపాదనను క్లుప్తంగా ఉంచండి, మీరు సందేశాన్ని అనేకమందికి చెప్పేందుకు అది సహాయం చేస్తుంది. మీరిలా అనవచ్చు: “నేను స్వచ్ఛంద సేవలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అందించబడుతున్న ఈ ప్రాముఖ్యమైన సందేశాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. నేను దీనిని మీకు ఉచితంగా ఇస్తున్నాను. దయచేసి చదవండి.” దీనిలోని సమాచారం చాలా శక్తివంతమైనది కాబట్టి నేర్పుగా వ్యవహరించండి, వాగ్వివాదాలకు దారితీయకుండా వివేచనను ఉపయోగించండి. ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రకటనా బ్యాగు తీసుకెళ్ళకుండా ఉండడం ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఆసక్తి కనపరచినవారందరి వివరాలను వ్రాసి పెట్టుకోవడం మరచిపోకండి.
5 మీ క్షేత్రాన్ని ఎలా పూర్తిచేయాలి: వీధిలో రాజ్యవార్తను అందించడంకన్నా, సాధ్యమైనంత మేరకు మీరు ఇంటింటి పరిచర్యలో, వ్యాపార క్షేత్రంలో పనిచేయడానికే ప్రయత్నించండి. సున్నితమైన, సమస్యాత్మక ప్రాంతాలను విడిచిపెట్టండి. తాళం వేసిన ఇళ్ళ నంబర్లు వ్రాసిపెట్టుకోండి, వేరే సమయంలో లేదా వారంలో మరోరోజు తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించండి. నవంబరు 6, సోమవారం నుండి తాళం వేసిన ఇళ్ళ దగ్గర ఒక కరపత్రాన్ని వదిలిపెట్టవచ్చు. ఇచ్చిన గడువులో పూర్తిచేయలేనంత ఎక్కువ క్షేత్రం ఉంటే, ప్రచార కార్యక్రమం అంతటిలో రాజ్యవార్తను ఇళ్ళలో లేనివాళ్ళ దగ్గర వదిలిపెట్టడానికి పెద్దలు నిర్ణయించవచ్చు.
6 “మహాబబులోను” నాశనం వేగంగా సమీపిస్తోంది. అది పూర్తిగా నాశనం కాకముందే ప్రజలు దానిని విడిచి బయటికి రావాలి. (ప్రక. 14:8; 18:8) మతం పేరిట జరుగుతున్న దుష్క్రియలన్నీ అంతమౌతాయని అందరూ తెలుసుకొనేలా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పూర్తిగా పాల్గొనేందుకు ఇప్పుడే ప్రణాళిక వేసుకోండి!