కృతజ్ఞత చూపిద్దాం జ్ఞాపకార్థ ఆచరణ ఏప్రిల్ 17న జరుపుకుంటాం
1. జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో, కీర్తనకర్త వ్యక్తంచేసిన ఎలాంటి భావాలను మనం కూడా కలిగివుంటే మంచిది?
1 యెహోవా ఎన్నో విధాలుగా కృప చూపించినందుకు, విడుదల దయచేసినందుకు కృతజ్ఞతతో కీర్తనకర్త ఇలా అడిగాడు, “యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?” (కీర్త. 116:12) ఈ రోజుల్లో, కృతజ్ఞత చూపించడానికి దేవుని సేవకులకు మరింత కారణం ఉంది. ఈ ప్రేరేపిత మాటలు రాయబడిన శతాబ్దాల తర్వాత యెహోవా మానవులకు ఒక గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు, అదే విమోచన క్రయధన ఏర్పాటు. ఏప్రిల్ 17న, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణను జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా మనకు కృతజ్ఞత చూపించడానికి మంచి కారణం ఉంది.—కొలొ. 3:15.
2. మనం విమోచన క్రయధనాన్ని విలువైనదిగా ఎంచడానికి కొన్ని కారణాలేమిటి?
2 విమోచన క్రయధనం వల్ల కలిగే ఆశీర్వాదాలు: విమోచన క్రయధనం వల్ల మనం “పాపక్షమాపణ” పొందగలుగుతున్నాం. (కొలొ. 1:13, 14) దీనివల్ల మనం పవిత్రమైన మనస్సాక్షితో యెహోవాను ఆరాధించగలుగుతున్నాం. (హెబ్రీ. 9:13, 14) యెహోవాకు ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతున్నాం. (హెబ్రీ. 4:14-16) అంతేకాదు, విమోచన క్రయధనం మీద విశ్వాసముంచే వాళ్లు నిత్యజీవం కోసం ఆశతో ఎదురుచూడవచ్చు!—యోహా. 3:16.
3. విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేసినందుకు మనం యెహోవాకు ఎలా కృతజ్ఞత చూపించవచ్చు?
3 కృతజ్ఞత చూపించండి: మనకున్న ప్రగాఢమైన కృతజ్ఞత చూపించడానికి ఒక మార్గం, ప్రతీరోజు జ్ఞాపకార్థ ఆచరణ కోసం ఇవ్వబడిన బైబిలు భాగాన్ని చదివి, దాన్ని ధ్యానించడం. విమోచన క్రయధనాన్ని ఎంత విలువైనదిగా ఎంచుతున్నామన్న విషయాన్ని హృదయపూర్వకంగా మనం చేసే ప్రార్థన ద్వారా కూడా యెహోవాకు తెలియజేయవచ్చు. (1 థెస్స. 5:17, 18) యేసు ఆజ్ఞాపించినట్లు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరవడం ద్వారా కూడా మనం మన కృతజ్ఞతను తెలియజేయవచ్చు. (1 కొరిం. 11:24, 25) అంతేకాదు, అందర్నీ ప్రేమించే యెహోవాను మనం ఆదర్శంగా తీసుకుని, జ్ఞాపకార్థ ఆచరణకు వీలైనంతమందిని ఆహ్వానిద్దాం.—యెష. 55:1-3.
4. మనం ఏమని నిశ్చయించుకోవాలి?
4 కృతజ్ఞతగల యెహోవా సేవకులు జ్ఞాపకార్థ ఆచరణ అన్ని కూటాల్లాంటిదేనని అనుకోరు. ఆ కూటం సంవత్సరమంతటిలో జరిగే అన్ని కూటాలకన్నా ప్రాముఖ్యమైనది! ఆ ఆచరణ జరుపుకునే సమయం దగ్గరపడుతున్న కొద్దీ, “నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము” అని రాసిన కీర్తనకర్త నిశ్చయించుకున్నట్టు మనం కూడా నిశ్చయించుకుందాం.—కీర్త. 103:2.