అతిగొప్ప బహుమతి ఇచ్చినందుకు దేవునికి ఎలా కృతజ్ఞత చూపించాలి?
1. ప్రత్యేకంగా యెహోవాపట్ల మనమెందుకు కృతజ్ఞతతో ఉంటాం?
1 యెహోవా ఇచ్చిన ఎన్నో ‘శ్రేష్ఠమైన యీవుల్లో’ తన ప్రియమైన కుమారుని ద్వారా అనుగ్రహించిన విమోచన క్రయధనం అతిగొప్పది. (యాకో. 1:17) దానివల్ల మన పాపాలకు క్షమాపణతోపాటు ఎన్నో ఆశీర్వాదాలు లభిస్తాయి. (ఎఫె. 1:7) దీనికి మనమెల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం. జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఈ అమూల్యమైన బహుమతి గురించి ధ్యానించడానికి ప్రత్యేకంగా సమయం తీసుకుంటాం.
2. విమోచన క్రయధనంపట్ల మన కృతజ్ఞతను ఎలా పెంచుకోవచ్చు, మన కుటుంబ సభ్యుల కృతజ్ఞతను ఎలా పెంచవచ్చు?
2 కృతజ్ఞత పెంచండి: మీ కుటుంబ సభ్యుల కృతజ్ఞత పెంచడానికి, జ్ఞాపకార్థ ఆచరణ జరిగే మార్చి 30 ముందువారాల్లో, విమోచన క్రయధనానికి సంబంధించిన సమాచారాన్ని కుటుంబ ఆరాధనలో ఎందుకు పరిశీలించకూడదు? జ్ఞాపకార్థ ఆచరణ బైబిలు పఠనాన్ని కూడా కుటుంబంగా ప్రతీరోజు చదవండి. విమోచన క్రయధనం ద్వారా మీరెలా ప్రయోజనం పొందారో, యెహోవా గురించి, మీ గురించి, ఇతరుల గురించి, భవిష్యత్తు గురించి మీ అభిప్రాయాన్ని అదెలా మార్చిందో ఆలోచించండి.—కీర్త. 77:12.
3. మనమెలా కృతజ్ఞత చూపించవచ్చు?
3 కృతజ్ఞత చూపించడం: యెహోవా గురించి, తన కుమారుణ్ణి పంపించడం ద్వారా ఆయన చూపించిన గొప్ప ప్రేమ గురించి ఇతరులకు చెప్పినప్పుడు విమోచన క్రయధనంపట్ల మనకున్న కృతజ్ఞతను చూపిస్తాం. (కీర్త. 145:2-7) తమ కుటుంబంలో కనీసం ఒక్కరు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సహాయ పయినీరు సేవ చేసేలా ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని కుటుంబాలు తమ కృతజ్ఞతను చూపిస్తాయి. అలా వీలుకాకపోతే, అవకాశమున్నంతవరకు ‘సమయాన్ని పోనివ్వక’ పరిచర్యలో ఎక్కువగా పాల్గొనగలరా? (ఎఫె. 5:15, 16) అంతేకాక, ఇతరులూ మనతో పాటు జ్ఞాపకార్థ ఆచరణకు హాజరయ్యేలా సహాయం చేయడంద్వారా మనం కృతజ్ఞత చూపించవచ్చు. (ప్రక. 22:17) మనం ఆహ్వానించాలనుకుంటున్న బైబిలు విద్యార్థుల, బంధువుల, తోటి ఉద్యోగస్థుల, పునర్దర్శనం చేస్తున్నవాళ్ల, పొరుగువాళ్ల పేర్లను రాసిపెట్టుకోవడం మొదలుపెట్టండి. ఆ తర్వాత జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రికలను పంచే ప్రత్యేక కార్యక్రమంలో సాధ్యమైనంత ఎక్కువగా పాల్గొనండి.
4. జ్ఞాపకార్థ ఆచరణ కాలాన్ని చక్కగా ఉపయోగించుకోవాలంటే మనం ఏమి చేయవచ్చు?
4 జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో, యెహోవా మానవజాతికి ఇచ్చిన బహుమతిని ఎంత విలువైనదిగా ఎంచుతున్నామో చూపించడానికి ఎన్నో అవకాశాలు దొరుకుతాయి. విమోచన క్రయధనం పట్ల, “శోధింపశక్యం కాని క్రీస్తు ఐశ్వర్యం” పట్ల మన కృతజ్ఞతను పెంచుకోవడానికి, చూపించడానికి ఈ సమయాన్ని చక్కగా ఉపయోగించుకుందాం.—ఎఫె. 3:8.