వీధి సాక్ష్యంలో మంచి ఫలితాలు పొందడానికి ఏమి చేయాలి?
1. యేసును అనుకరించే ఒక పద్ధతి ఏమిటి?
1 యేసు భూమ్మీద ఉన్నప్పుడు, తనకు దారిలోనూ ఇతర బహిరంగ స్థలాల్లోనూ కనిపించిన వాళ్లతో మాట్లాడడానికి వెనుకాడలేదు. (లూకా 9:57-61; యోహా. 4:7) ఆయన తన దగ్గరున్న ప్రాముఖ్యమైన సందేశాన్ని సాధ్యమైనంత ఎక్కువమందితో పంచుకోవాలనుకున్నాడు. నేడు కూడా, దేవుని గురించిన జ్ఞానాన్ని ప్రజలకు తెలియజేయడానికి వీధి సాక్ష్యం చాలా మంచి పద్ధతి. (సామె. 1:20) ప్రజల్ని కలుసుకోవడానికి చొరవ తీసుకుని, వివేచన ఉపయోగిస్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి.
2. వీధి సాక్ష్యమిస్తున్నప్పుడు మనమెలా చొరవ తీసుకోవచ్చు?
2 చొరవ తీసుకోండి: ఒక చోట నిలబడిగానీ కూర్చునిగానీ వాళ్లే మన దగ్గరకు వస్తారని ఎదురు చూసే బదులు మనమే వాళ్ల దగ్గరకు వెళ్లడం మంచిది. వాళ్ల వైపు చూసి చిరునవ్వు నవ్వండి. ప్రశాంతంగా, స్నేహపూర్వకంగా మాట్లాడండి. ఇద్దరు ప్రచారకులు కలిసి వెళ్తే, సాధారణంగా ఇద్దరూ విడివిడిగా సాక్ష్యం ఇవ్వడం మంచిది. ఎవరైనా ఆసక్తి చూపిస్తే, వాళ్లను మళ్లీ కలుసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకోండి. సముచితమనిపిస్తే, వాళ్లను మళ్లీ ఎలా కలుసుకోవచ్చో గౌరవపూర్వకంగా అడగండి. కొందరు ప్రచారకులు, వీధి సాక్ష్యం ఇవ్వడానికి వెళ్లినచోటికే మళ్లీమళ్లీ వెళ్తారు, దానివల్ల కలిసినవాళ్లనే మళ్లీ కలిసి వాళ్ల ఆసక్తిని ఎక్కువ చేయగలుగుతారు.
3. వీధి సాక్ష్యమిచ్చేటప్పుడు వివేచన ఎలా చూపించాలి?
3 వివేచన ఉపయోగించండి: వీధిలో ఎక్కడ నిలబడాలో, ఎవరితో మాట్లాడాలో నిర్ణయించుకునేటప్పుడు వివేచన ఉపయోగించండి. దారిలో వెళ్లే ప్రతీ ఒక్కరికి సాక్ష్యమివ్వాల్సిన అవసరం లేదు. పరిస్థితులను బాగా గమనించండి. ఉదాహరణకు, ఎవరైనా హడావిడిగా వెళ్తుంటే వాళ్లను ఆపకపోవడమే మంచిది. ఏదైనా షాపు ముందు నిలబడి సాక్ష్యమిస్తుంటే, ఆ షాపు యజమానికి ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి. సాధారణంగా, షాపులోకి వెళ్లేవాళ్లకు కాకుండా షాపు నుండి బయటకు వచ్చేవాళ్లకు సాక్ష్యమివ్వడం మంచిది. మీరు వాళ్ల దగ్గరకు వెళ్తున్నప్పుడు వాళ్లు కంగారుపడేలా, బెదిరిపోయేలా చేయకండి. పుస్తకాలు, పత్రికలు ఇచ్చేటప్పుడు కూడా వివేచన ఉపయోగించండి. అంతగా ఆసక్తి చూపించనివాళ్లకు పత్రికలు ఇచ్చే బదులు కరపత్రం ఇస్తే సరిపోతుంది.
4. వీధి సాక్ష్యంలో పాల్గొంటే సంతోషాన్ని, మంచి ఫలితాలను పొందుతామని ఎందుకు చెప్పవచ్చు?
4 తక్కువ సమయంలో ఎక్కువ సత్యపు విత్తనాలను వెదజల్లడానికి వీధి సాక్ష్యం ఎంతగానో దోహదపడుతుంది. (ప్రసం. 11:6) ఇంటింటి పరిచర్యలో మనం కలుసుకోలేని కొందరిని వీధి సాక్ష్యంలో కలిసే అవకాశముంది. వీధి సాక్ష్యంలో పాల్గొంటే మనమెంతో సంతోషాన్ని, ఎన్నో మంచి ఫలితాలను పొందుతాం. కాబట్టి, దానిలో పాల్గొనడానికి మీరూ ప్రయత్నించండి.