పరిచర్య చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి
1. పరిచర్య చేస్తున్నప్పుడు మనమెందుకు జాగ్రత్తగా ఉండాలి?
1 ‘తోడేళ్లమధ్య గొర్రెల్లా’ దేవుని సేవకులు “మూర్ఖమైన వక్రజనము మధ్య” ప్రకటిస్తున్నారు. (మత్త. 10:16; ఫిలి. 2:14, 15) అల్లకల్లోల పరిస్థితులు, అల్లరిమూకల దాడులు, నిర్దాక్షిణ్యంగా చేస్తున్న కిడ్నాపుల గురించిన కలవరపెట్టే వార్తలు మనం తరచూ వింటున్నాం. దుష్టులు ‘అంతకంతకూ చెడిపోతున్నారు’ అనడానికి అవి రుజువులు. (2 తిమో. 3:13) పరిచర్య చేస్తున్నప్పుడు మనం ‘వివేకులుగా’ లేదా జాగ్రత్తగా ఉండాలంటే లేఖనాల్లోని ఏ సూత్రాలను పాటించాలి?—మత్త. 10:16.
2. ఎలాంటి పరిస్థితుల్లో, మనం పనిచేస్తున్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతంలో సేవచేయడం మంచిది?
2 తెలివిగా నడుచుకోండి: అపాయం రావడం చూసి దాక్కోవడం తెలివైన పనని సామెతలు 22:3 చెబుతోంది. కాబట్టి, అప్రమత్తంగా ఉండండి! ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ప్రాంతాల్లో కూడా పరిస్థితులు ఉన్నపళంగా మారిపోవచ్చు. కొన్నిసార్లు, పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు పోలీసులు ఎక్కువగా కనిపించడం, వీధిలో జనాలు ఎక్కువగా గుమికూడడం వంటివి మీరు గమనించవచ్చు. మరికొన్నిసార్లు, దయగల గృహస్థులు రాబోయే ప్రమాదం గురించి హెచ్చరిక చేయవచ్చు. అలాంటప్పుడు, ఏమి జరుగుతుందో చూద్దామని కుతూహలంతో అక్కడే ఉండే బదులు, వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతంలో పరిచర్య చేయడం తెలివైన పని.—సామె. 17:14; యోహా. 8:59; 1 థెస్స. 4:10-12.
3. పరిచర్యలో, ప్రసంగి 4:9లోని సూత్రం మనకెలా ఉపయోగపడుతుంది?
3 కలిసి పనిచేయండి: “ఒంటిగాడై యుండుటకంటె ఇద్దరు కూడి యుండుట మేలు” అని ప్రసంగి 4:9 చెబుతోంది. ఎలాంటి అపాయంలో పడకుండా ఒంటరిగా పరిచర్య చేయడానికి మీరు అలవాటుపడి ఉండవచ్చు. అయితే, ప్రస్తుత పరిస్థితిలో అలా చేయడం సురక్షితమేనా? కొన్ని ప్రాంతాల్లో అది సురక్షితమే. కానీ వేరే ప్రాంతాల్లో, సహోదరీలు, యౌవనులు ఒంటరిగా ఇంటింటి పరిచర్య చేయడం, అదీ సూర్యాస్తమయం తర్వాత చేయడం మంచిది కాదు. అప్రమత్తంగా ఉండే భాగస్వామి తోడుగా ఉంటే ఎన్నో ప్రయోజనాలున్నాయని అనేక అనుభవాలను బట్టి తెలుస్తోంది. (ప్రసం. 4:10, 12) పరిచర్య చేస్తున్నప్పుడు మీ క్షేమం గురించే కాక మీ గుంపులోనివాళ్ల క్షేమం గురించి కూడా ఆలోచించండి. పరిచర్యను పూర్తిచేసుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు, క్షేత్రంలో ఉన్న ప్రచారకుల్లో ఎవరో ఒకరికి చెప్పి వెళ్లడం అలవాటు చేసుకోండి.
4. సంఘంలోని వాళ్లందరి సంక్షేమం కోసం మనమెలా పాటుపడవచ్చు?
4 ‘మన ఆత్మలను కాసేవారిగా,’ స్థానిక పరిస్థితుల్లో మనం పరిచర్యను ఎలా చేయాలో వివరించాల్సిన బాధ్యత పెద్దలకు ఉంది. (హెబ్రీ. 13:17) మనం దీనమనస్సు లేదా అణకువ కలిగివుంటూ, వాళ్లకు పూర్తి సహకారం అందిస్తే యెహోవా మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. (మీకా 6:8; 1 కొరిం. 10:12) దేవుని సేవకులమైన మనందరం ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటూ, మన ప్రాంతంలో చక్కగా సాక్ష్యమివ్వడంలో మన వంతు కృషి చేద్దాం.