దేవుడు చెప్పేది వినడానికి ప్రజలకు సహాయం చేయండి
1. “దేవుని రాజ్యం వచ్చుగాక!” అనే జిల్లా సమావేశంలో ఏ బ్రోషుర్లు విడుదలయ్యాయి, అవి ఉపయోగకరమైన ఉపకరణాలని ఎందుకు చెప్పవచ్చు?
1 “దేవుని రాజ్యం వచ్చుగాక!” అనే జిల్లా సమావేశంలో, దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి, అలాగే దాని సరళ ప్రతియైన దేవుడు చెప్పేది వినండి అనే రెండు కొత్త బ్రోషుర్లు విడుదలయ్యాయి. వాటిలో ఎక్కువ సమాచారం లేదు కాబట్టి వాటిని త్వరగా, సులభంగా అనువదించవచ్చు. నిజానికి, దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి అనే బ్రోషురు విడుదలైనప్పుడే దాన్ని 431 భాషల్లోకి అనువదించడానికి ఆమోదం లభించింది.
2. ఈ బ్రోషుర్లు ఎవరికి ఉపయోగపడతాయి?
2 ఈ బ్రోషుర్లు ముఖ్యంగా ఎవరికి ఉపయోగపడతాయి? ప్రపంచమంతటా తరచూ తలెత్తే ఈ పరిస్థితులను గమనించండి:
• ఒక ప్రచారకుడు గృహస్థునితో మొదటిసారిగా మాట్లాడుతున్నప్పుడు లేదా పునర్దర్శనంలో మాట్లాడుతున్నప్పుడు ఆ గృహస్థుడు చదువుకోలేదని లేదా సరిగ్గా చదవలేడని తెలుసుకుంటాడు.
• ఒక ప్రచారకుడు మన ప్రచురణల్లో కేవలం కొన్నే అనువాదమైన లేదా ఒక్క ప్రచురణ కూడా అనువాదం కాని భాష మాట్లాడే ప్రజలకు ప్రకటిస్తాడు. లేదా క్షేత్రంలో చాలామంది, తాము మాట్లాడే భాషను చదవలేరు.
• ఒక ప్రచారకుడు తన క్షేత్రంలోని బధిరులకు సంజ్ఞా భాషలో ప్రకటిస్తాడు.
• ఒక తండ్రి ఇంకా చదవడం రాని తన పిల్లవాడికి సత్యాన్ని బోధించాలనుకుంటాడు.
3. దేవుడు చెప్పేది వినండి అనే బ్రోషురును ఎలా రూపొందించారు?
3 వాటినెలా రూపొందించారు: దేవుడు చెప్పేది వినండి అనే బ్రోషురులో చాలా తక్కువ సమాచారం ఉంది. ప్రతీ పేజీ కింది భాగంలో ముఖ్యాంశాలను నొక్కిచెప్పే చిన్న వాక్యం, ఒక లేఖనం మాత్రమే ఉన్నాయి. ఎందుకు? ఎవరైనా, మీరు చదవలేని, కనీసం అక్షరాలను కూడా గుర్తుపట్టలేని భాషలో ఉన్న ఒక బ్రోషురు మీకు ఇచ్చారనుకోండి. దానిలో అందమైన చిత్రాలున్నా, అది మీకు ఆసక్తికరంగా అనిపిస్తుందా? అనిపించకపోవచ్చు. అలాగే, చదవడం రానివాళ్లు రాతపూర్వక సమాచారం ఉన్న ప్రచురణలు చూడగానే వాటిని పక్కన పెట్టేస్తారు. అందుకే ప్రతీ పేజీలోనూ ఎంతో శ్రద్ధతో తయారుచేసిన చిత్రాలు ప్రముఖంగా కనిపిస్తాయి. ఏ చిత్రం తర్వాత ఏ చిత్రాన్ని చర్చించాలో తెలుసుకోవడానికి సూచికలు ఉన్నాయి.
4. దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి అనే బ్రోషురును ఎలా రూపొందించారు?
4 దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి అనే బ్రోషురులో కూడా దేవుడు చెప్పేది వినండి అనే బ్రోషురులో ఉన్న చిత్రాలే ఉన్నాయి. అంతగా చదవడం రానివాళ్లతో, చదువు నేర్చుకుంటున్న వాళ్లతో అధ్యయనం చేయడానికి దీన్ని రూపొందించారు. దేవుడు చెప్పేది వినండి అనే బ్రోషురును ఉపయోగించి ఎవరితోనైనా అధ్యయనం చేస్తున్నప్పుడు, బోధిస్తున్న వ్యక్తి ఈ బ్రోషురులో చూసుకోవచ్చు. రెండేసి పేజీలుండే ప్రతీ పాఠంలో ఎడమవైపు పైనున్న ప్రశ్నకు ఆ రెండు పేజీల్లో జవాబు ఉంటుంది. చిత్రాలతోపాటు వ్యాఖ్యానాలు, లేఖనాలు ఉన్నాయి. చాలా పేజీల్లో కింది మూలల్లో ఒక తెలుపు రంగు బాక్సు ఉంది, అందులో అదనపు అంశాలు, లేఖనాలు ఉన్నాయి, విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి వాటిని చర్చించవచ్చు.
5. ఈ బ్రోషుర్లను ఎప్పుడు, ఎలా ఇవ్వాలి?
5 వాటిని ఎలా ఉపయోగించాలి: ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు, బ్రోషురు ఇవ్వడం ప్రయోజనకరంగా ఉంటుందనిపించినప్పుడు ఈ రెండిటిలో ఏదైనా ఒక దాన్ని ఇవ్వవచ్చు. ఆ నెలలో ఇవ్వాల్సిన ప్రచురణల్లో ఈ బ్రోషుర్లు లేకపోయినా వాటిని ఇవ్వవచ్చు. (“వాటిని ఎలా ఇవ్వవచ్చు?” అనే బాక్సు చూడండి.) ఆసక్తిగల వ్యక్తిని పునర్దర్శించినప్పుడు, ఆయనకు చూపించడానికి మీ దగ్గర ఒక బ్రోషురు ఉందని చెప్పి దాన్ని ఇవ్వవచ్చు.
6. మనం ఈ బ్రోషుర్లను ఉపయోగించి అధ్యయనం ఎలా నిర్వహించాలి?
6 దేవుడు చెప్పేది వినండి అనే బ్రోషురులో ముద్రిత ప్రశ్నలు లేవు కాబట్టి, మీరు బైబిలు బోధిస్తోంది పుస్తకంతో అధ్యయనం చేసినట్లుగా ప్రశ్నాజవాబుల పద్ధతిలో దాన్ని అధ్యయనం చేయడం కుదరదు. అన్ని సంస్కృతుల్లోనూ ప్రజలు కథలు వినడానికి ఇష్టపడతారు. కాబట్టి బైబిల్లోని ప్రేరేపిత కథలను చెప్పడానికి చిత్రాలను ఉపయోగించండి. చిత్రాల్లో ఏముందో వివరించండి. ఉత్సాహంగా చెప్పండి. విద్యార్థి ఏమి గమనించాడో చెప్పమనండి. పేజీ కింది భాగంలో ఉన్న లేఖనాలను చదవండి, ఆ లేఖనాలు ఏమి చెబుతున్నాయో విద్యార్థితో తర్కించండి. ఆయనకు అర్థమైందో లేదో తెలుసుకోవడానికి ప్రశ్నలడిగి ఆయన కూడా మాట్లాడేలా చేయండి. విద్యార్థి దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి అనే బ్రోషురును ఉపయోగిస్తుంటే, ఒక్కొక్క చిత్రాన్ని చర్చిస్తున్నప్పుడు, వాటి ప్రక్కన ఉన్న సమాచారాన్ని, లేఖనాలను ఆయనతో కలిసి చదవండి.
7. విద్యార్థి ప్రగతి సాధించడానికి మనమెలా సహాయం చేయవచ్చు?
7 విద్యార్థి ప్రగతి సాధించడానికి సహాయం చేయండి: ఈ అధ్యయనం, యెహోవాను గురించిన జ్ఞానాన్ని తనకు తానుగా సంపాదించుకోవడానికి చదవడం నేర్చుకోవాలన్న కోరికను మీ విద్యార్థిలో కలిగించే అవకాశం ఉంది. (మత్త. 5:3; యోహా. 17:3) కాబట్టి, మీరు దేవుడు చెప్పేది వినండి అనే బ్రోషురు నుండి అధ్యయనం చేస్తుంటే, కొంతకాలానికి విద్యార్థికి చదువు నేర్పించడం మొదలుపెట్టి దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి అనే బ్రోషురుతో అధ్యయనాన్ని కొనసాగించవచ్చు. మీరు ఈ బ్రోషుర్లలో దేన్ని ఉపయోగించి అధ్యయనం పూర్తిచేసినా, విద్యార్థి బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధమైపోయాడని చెప్పలేం. ఆయన బైబిలును మరింత బాగా అర్థం చేసుకునేలా బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని లేదా సముచితమైన మరో పుస్తకాన్ని ఉపయోగించి బైబిలు అధ్యయనం చేయాలి.
8. పరిచర్యలో ఉపయోగపడే ఈ కొత్త ఉపకరణాల విషయంలో మీరెందుకు కృతజ్ఞులై ఉన్నారు?
8 ప్రజలు నిత్యం జీవించాలంటే విశ్వ సర్వాధిపతి చెప్పేది వినాలి. (యెష. 55:3) చదవడం రానివాళ్లతో సహా “మనుష్యులందరు” తన మాట వినడం ఎలాగో నేర్చుకోవాలనేది యెహోవా చిత్తం. (1 తిమో. 2:3, 4) అలా నేర్చుకోవాలంటే ఏమి చేయాలో ప్రజలకు బోధించడానికి ఈ కొత్త ఉపకరణాలు ఇచ్చినందుకు మనమెంతో కృతజ్ఞులం.
[3వ పేజీలోని బాక్సు]
వాటిని ఎలా ఇవ్వవచ్చు?
గృహస్థునికి 2, 3 పేజీలు చూపించి ఇలా చెప్పండి: “ఇలాంటి లోకంలో జీవించడం మీకు ఇష్టమేనా? [ఏమి చెబుతారో వినండి.] దేవుడు త్వరలోనే ఈ లోకాన్ని పేదరికం, వ్యాధులు లేని అందమైన, ప్రశాంతమైన ప్రదేశంగా మారుస్తాడని లేఖనాలు వాగ్దానం చేస్తున్నాయి [లేదా ఈ పరిశుద్ధ గ్రంథం వాగ్దానం చేస్తోంది.] మనమక్కడ ఉండాలంటే ఏమి చేయాలో చూడండి. [3వ పేజీలో పైన ఉన్న యెషయా 55:3 చదవండి.] దేవుని దగ్గరకు ‘రండి,’ ఆయన చెప్పేది ‘వినండి’ అని ఈ లేఖనం చెబుతోంది. మరి దేవుడు చెప్పేది వినాలంటే మనం ఏమి చేయాలి?” 4, 5 పేజీలు తెరచి అక్కడున్న జవాబును ఆయనతో చర్చించండి. ఆయనకు సమయం లేకపోతే, బ్రోషురు ఆయనకు ఇచ్చి మళ్లీ వెళ్లి ఆ జవాబును చర్చించడానికి ఏర్పాట్లు చేసుకోండి.