దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషుర్ను ఎలా ఉపయోగించాలి?
పునర్దర్శనాలు చేయడానికి, బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి రూపొందించిన కొత్త బ్రోషుర్
1. పునర్దర్శనాలు చేయడానికీ బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడానికీ సహాయం చేసే ఏ కొత్త బ్రోషుర్, “మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి!” జిల్లా సమావేశంలో విడుదలైంది?
1 “మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి!” జిల్లా సమావేశంలో, దేవుడు చెబుతున్న మంచివార్త! అనే బ్రోషుర్ను అందుకోవడం మనకు చాలా సంతోషాన్నిచ్చింది. పునర్దర్శనాలు చేయడానికి, బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టడానికి అది చక్కగా సహాయం చేస్తుంది. దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్లో లాగే ఈ కొత్త బ్రోషుర్లో కూడా పాఠాలు చిన్నవిగా ఉంటాయి. అయితే ఇప్పటినుండి, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్ స్థానంలో మంచివార్త బ్రోషుర్ను ఉపయోగిస్తాం. గుమ్మం దగ్గరే బైబిలు అధ్యయనాలు చేయడానికి ఈ బ్రోషుర్ చాలా అనువుగా ఉంటుంది. దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్, క్రైస్తవులకు ఉండాల్సిన అర్హతల గురించి చెబుతుంది. వాటిని అంగీకరించడం, కొందరు బైబిలు విద్యార్థులకు కష్టంగా ఉండేది. అయితే ఈ కొత్త బ్రోషుర్, బైబిలులో ఉన్న మంచివార్త గురించే ఎక్కువగా చెబుతుంది.—1 థెస్స. 2:9.
2. మంచివార్త బ్రోషుర్ను ఎందుకు తయారుచేశారు?
2 దాన్ని ఎందుకు తయారుచేశారు? ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సహోదరులు, ప్రజలను సత్యం వైపు ఆకర్షించడానికి, బైబిలు బోధిస్తోంది పుస్తకం వైపు నడిపించడానికి ఏదైనా సులువైన ఉపకరణం ఉంటే బావుంటుందని అడుగుతున్నారు. బైబిలు అధ్యయనాలు చేయడానికి మనం ఉపయోగించే ప్రాథమిక ప్రచురణ బైబిలు బోధిస్తోంది పుస్తకమే. అయితే, పుస్తకంతో బైబిలు అధ్యయనం చేయడానికి జంకేవాళ్లు బ్రోషుర్తో అధ్యయనం చేయడానికి మొగ్గుచూపుతారు. అంతేకాదు, బ్రోషుర్నైతే ఎక్కువ భాషల్లోకి సునాయాసంగా అనువదించవచ్చు.
3. ఈ బ్రోషుర్, ఇతర అధ్యయన ప్రచురణలకు ఎలా వేరుగా ఉంది?
3 దాన్నెలా రూపొందించారు? మనం అధ్యయనం చేయడానికి ఉపయోగించే చాలా ప్రచురణలు, చదివేవాళ్లు ఎవరి సహాయం లేకుండా తమంతట తామే బైబిలు సత్యాలను అర్థం చేసుకునేలా ఉంటాయి. కానీ, ఈ ప్రచురణ అలా కాదు. దీన్ని, ఒక ఉపదేశకునితో కలిసి బైబిలు అధ్యయనం చేసేలా రూపొందించారు. అందుకే, ఈ బ్రోషుర్ను ఎవరికైనా అందిస్తున్నప్పుడు, దానిలోని ఒకట్రెండు పేరాలను వాళ్లతో చర్చించండి. పేరాలు చిన్నగా ఉంటాయి, కాబట్టి మీరు వాళ్ల గుమ్మం దగ్గరే లేదా పని స్థలం దగ్గరే వాటిని పరిశీలించవచ్చు. పాఠాలను మొదటినుండి పరిశీలించడం మంచిదే, అయినా మీరు ఏ పాఠం నుండైనా అధ్యయనం మొదలుపెట్టేలా దీన్ని రూపొందించారు.
4. నేరుగా బైబిలు నుండి బోధించడానికి ఈ బ్రోషుర్ మనకెలా సహాయం చేస్తుంది?
4 సాధారణంగా, మన ప్రచురణల్లో ఉండే ప్రశ్నలకు జవాబులు అందులోని పేరాల్లోనే ఉంటాయి. అయితే, ఈ బ్రోషుర్లోని ప్రశ్నలకు జవాబులు ముఖ్యంగా బైబిల్లోనే ఉంటాయి. చాలామంది, మన ప్రచురణల నుండి కాక బైబిలు నుండే నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అందుకే, ఇచ్చిన లేఖనాల్లో వేటినీ పేరాల్లో ఎత్తి రాయలేదు. వాటిని బైబిలు తెరిచి చదవాల్సిందే. దానివల్ల, విద్యార్థులు తాము దేవుని వాక్యం నుండే నేర్చుకుంటున్నామని గుర్తిస్తారు.—యెష. 54:13.
5. అధ్యయనం చేసే ప్రతీసారి మనం బాగా సిద్ధపడడం ఎందుకు ప్రాముఖ్యం?
5 ఈ బ్రోషుర్లో ప్రతీ లేఖనానికి వివరణ లేదు. ఎందుకంటే, ప్రశ్నలు అడగడానికి విద్యార్థిని ప్రోత్సహించేలా, నిర్వహించే వ్యక్తి తన బోధనా సామర్థ్యం ఉపయోగించి జవాబు చెప్పేలా దీన్ని రూపొందించారు. కాబట్టి, అధ్యయనం చేసే ప్రతీసారి బాగా సిద్ధపడడం ప్రాముఖ్యం. కానీ ఒక విషయంలో జాగ్రత్త వహించాలి, మనమే ఎక్కువగా మాట్లాడకూడదు. లేఖనాలను వివరించడమంటే మనకు ఎంతో ఇష్టం. అయితే చాలా సందర్భాల్లో, ఫలానా లేఖనం నుండి విద్యార్థి ఏమి అర్థం చేసుకున్నాడో అడగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. మనం నేర్పుగా ప్రశ్నలు అడుగుతూ, ప్రతీ లేఖనాన్ని సరిగ్గా అర్థంచేసుకునేలా విద్యార్థికి సహాయం చేయవచ్చు.—అపొ. 17:2, 3.
6. (ఎ) దేవునిపై, బైబిలుపై నమ్మకం లేనివాళ్లతో మాట్లాడడానికి, (బి) ఇంటింటి పరిచర్యలో, (సి) నేరుగా బైబిలు అధ్యయనం గురించి చెప్పి అధ్యయనాలు మొదలుపెట్టడానికి, (డి) పునర్దర్శనాలు చేయడానికి ఈ బ్రోషుర్ను ఎలా ఉపయోగించవచ్చు?
6 బైబిలు అధ్యయనాలు చేయడానికి ఉపయోగించే ఇతర ప్రచురణల్లాగే ఈ బ్రోషుర్ను కూడా, నెలలో అందించాల్సిన ప్రచురణలతో సంబంధం లేకుండా ఎప్పుడైనా అందించవచ్చు. నేరుగా బైబిలు అధ్యయనం గురించి చెప్పి ఇంటి గుమ్మం దగ్గరే అధ్యయనాలు మొదలుపెట్టడానికి ఇది అనువుగా ఉంటుంది. అలాగే జిల్లా సమావేశంలో చెప్పినట్లు, దాన్ని ఉపయోగిస్తూ ఆసక్తి చూపించినవాళ్లతో “పునర్దర్శనాలు చేయడం చాలా బాగుంటుంది!”—6 నుండి 8 పేజీల్లోవున్న బాక్సులు చూడండి.
7. ఈ బ్రోషుర్ను ఉపయోగిస్తూ బైబిలు అధ్యయనాన్ని ఎలా చేయవచ్చు?
7 అధ్యయనాన్ని ఎలా నిర్వహించాలి? మనం ముద్దక్షరాల్లో ఉన్న ఏదైనా ప్రశ్నను చదివి చర్చను మొదలుపెట్టవచ్చు. తర్వాత, దాని కింది పేరాను, ఏటవాలు ముద్దక్షరాల్లో ఉన్న లేఖనాలను చదవండి. లేఖనాలు ఏమి చెబుతున్నాయో విద్యార్థి అర్థం చేసుకునేలా నేర్పుగా ప్రశ్నలు వేయండి. తర్వాతి ప్రశ్న చర్చించే ముందు, ముందటి ప్రశ్నకు జవాబు అర్థమైందో లేదో తెలుసుకోవడానికి ముద్దక్షరాల్లో ఉన్న ప్రశ్న మళ్లీ అడగండి. మొదటి కొన్ని వారాలపాటు, ప్రతీసారి ఒక్క ప్రశ్ననే చర్చించడం మంచిది. తర్వాత్తర్వాత ఆ సమయాన్ని పొడిగిస్తూ పూర్తి పాఠాన్ని చర్చించవచ్చు.
8. మనం లేఖనాలను ఎలా పరిచయం చేయాలి? ఎందుకు?
8 ముద్దక్షరాల్లోని ప్రశ్నకు సూటైన జవాబు, “చదవండి” అని ఉన్న లేఖనాల్లో ఉంటుంది. ఏదైనా లేఖనాన్ని చదివేముందు “అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు” లేదా “యిర్మీయా ప్రవచనాన్ని గమనించండి” అని చెప్పకండి. అలా చెప్తే, మనం ఎవరో మనుష్యులు రాసిన మాటలు చదువుతున్నామని వాళ్లు అనుకోవచ్చు. దానికి బదులు “దేవుని వాక్యం ఇలా చెబుతోంది,” లేదా “బైబిలు ముందే ఏమి చెప్పిందో గమనించండి” వంటి మాటలు ఉపయోగించడం మంచిది.
9. అధ్యయనం చేస్తున్నప్పుడు లేఖనాలన్నీ చదవాలా?
9 మనం అన్ని లేఖనాలు చదవాలా? లేక, “చదవండి” అని ఉన్న లేఖనాలు మాత్రమే చదవాలా? అది, విద్యార్థి పరిస్థితులను బట్టి నిర్ణయించుకోవాలి. అక్కడ ఇచ్చిన ప్రతీ లేఖనానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ప్రతీదానిలో, చర్చించాల్సిన ముఖ్యమైన సమాచారం ఉంటుంది. కాకపోతే కొన్ని సందర్భాల్లో, అంటే విద్యార్థికి సమయం, ఆసక్తి లేదా చదివే సామర్థ్యం అంతగా లేనప్పుడు, “చదవండి” అని ఉన్న లేఖనాలే చదువుతాం.
10. బైబిలు బోధిస్తోంది పుస్తకానికి ఎప్పుడు మారవచ్చు?
10 బైబిలు బోధిస్తోంది పుస్తకానికి ఎప్పుడు మారవచ్చు? చాలా పునర్దర్శనాలు చేసి క్రమంగా బైబిలు అధ్యయనం జరుగుతుంటే, బైబిలు బోధిస్తోంది పుస్తకానికి మారవచ్చు లేదా మంచివార్త బ్రోషుర్ పూర్తయ్యేవరకు దానితోనే అధ్యయనం కొనసాగించవచ్చు. అలా ఎప్పుడు మారాలో ప్రచారకులు ఆచితూచి నిర్ణయించుకోవాలి. బైబిలు బోధిస్తోంది పుస్తకానికి మారాక, ఒకటవ అధ్యాయం నుండే మొదలుపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. అయితే, అంతకుముందు చర్చించిన అంశాలనే బైబిలు బోధిస్తోంది పుస్తకంనుండి విశదంగా చర్చించినప్పుడు చాలామంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు.
11. ఈ కొత్త బ్రోషుర్ను ఎందుకు చక్కగా ఉపయోగించుకోవాలి?
11 మంచివార్తలే కరువౌతున్న ఈ రోజుల్లో, అత్యంత శ్రేష్ఠమైన వార్తను ప్రకటించే గొప్ప అవకాశం మనకు దక్కింది. దేవుని రాజ్యం పరిపాలిస్తోంది, త్వరలోనే అది నీతి నివసించే కొత్త లోకాన్ని తీసుకొస్తుందనేదే ఆ మంచివార్త. (మత్త. 24:14; 2 పేతు. 3:13) ఆ వార్తను వినే చాలామందికి ఇలాగే అనిపిస్తుందని మా నమ్మకం: “సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములమీద ఎంతో సుందరములై యున్నవి.” (యెష. 52:7) మన క్షేత్రంలో, సత్యం కోసం తపించేవాళ్లకు ఈ కొత్త బ్రోషుర్ను ఉపయోగించి మంచివార్తను చేరవేద్దాం!
[6వ పేజీలోని చిత్రం]
దేవుని మీద, బైబిలు మీద నమ్మకం లేని ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు . . .
● కొన్ని ప్రాంతాల్లో “దేవుడు,” “యేసు,” “బైబిలు” అనే పదాలు వాడితే, ప్రజలు వ్యతిరేకించే ప్రమాదముందని ప్రచారకులు గుర్తించారు. అలాంటి సందర్భాల్లో, ఇంటివాళ్లను మొదటిసారి కలిసినప్పుడు మీ ప్రాంతంలోని ప్రజలు సాధారణంగా ఆలోచించే విషయాల గురించి మాట్లాడవచ్చు. అంటే, మంచి ప్రభుత్వం ఎందుకు అవసరం? కుటుంబాలకు కావాల్సిన సహాయం ఎక్కడ దొరుకుతుంది? భవిష్యత్తు ఎలా ఉంటుంది? వంటి విషయాల గురించి మాట్లాడడం మంచిది. బహుశా, మనం దేవుడున్నాడనీ బైబిలు నమ్మదగినదనీ చూపించే రుజువులను పరిశీలించిన తర్వాత, మంచివార్త బ్రోషురును పరిచయం చేయవచ్చు.
[7వ పేజీలోని చిత్రం]
ఇంటింటి పరిచర్య చేస్తున్నప్పుడు . . .
● “దేవుడు బాధల్ని తీసేస్తాడని మీకెప్పుడైనా అనిపించిందా? [వాళ్లేమి చెప్తారో వినండి.] ఈ విషయం గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయో చూపించమంటారా? [వాళ్లు ఆసక్తి చూపిస్తే, కొనసాగించండి.] ఆ ప్రశ్నకు సమాధానం బైబిల్లో ఎక్కడుందో ఈ బ్రోషుర్ చూపిస్తుంది. [వాళ్లకు ఒక బ్రోషుర్ ఇచ్చి, 1వ పాఠంలోని మొదటి పేరాను, యిర్మీయా 29:11ను చదవండి.] దీన్నిబట్టి, దేవుడు మనకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకుంటున్నాడని మీకనిపిస్తుందా? [వాళ్లేమి చెప్తారో వినండి.] మీకిష్టమైతే ఈ బ్రోషుర్ను తీసుకోవచ్చు. ఈసారి వచ్చినప్పుడు, ‘మన బాధలన్నిటినీ దేవుడు ఎలా తీసేస్తాడు?’ అనే ప్రశ్నకు బైబిలిచ్చే సమాధానం రెండో పేరాలో చూద్దాం.” మొదటిసారి కలిసినప్పుడు ఇంటివాళ్లు తీరిగ్గా ఉంటే రెండో పేరాను, అక్కడున్న మూడు లేఖనాలను కూడా అప్పుడే చదివి చర్చించవచ్చు. మళ్లీ వచ్చినప్పుడు ఆ పాఠంలోని రెండో ప్రశ్నను చర్చిద్దామని చెప్పండి.
● “చాలామంది ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు, ముఖ్యంగా ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు. మీరు కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంటారా? [వాళ్లేమి చెప్తారో వినండి.] దేవుడు అందరి ప్రార్థనలు వింటాడని మీకనిపిస్తుందా? లేక, దేవుడు ఇష్టపడని ప్రార్థనలు కూడా ఉంటాయా? [వాళ్లేమి చెప్తారో వినండి.] ఈ విషయం గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయో మీకు చూపించవచ్చా? [వాళ్లు ఆసక్తి చూపిస్తే, కొనసాగించండి.] ఆ ప్రశ్నలకు సమాధానాలు బైబిల్లో ఎక్కడున్నాయో చూపించే బ్రోషుర్ నా దగ్గరుంది. [వాళ్లకు ఒక బ్రోషుర్ ఇచ్చి, 12వ పాఠంలోని మొదటి పేరాను, “చదవండి” అని ఉన్న లేఖనాలను పరిశీలించండి.] దేవుడు మన ప్రార్థనలు వినడానికి ఇష్టపడుతున్నాడని తెలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది కదా? కానీ మన ప్రార్థనలు అర్థవంతంగా ఉండాలంటే, మనం దేవుని గురించి బాగా తెలుసుకోవాలి. [2వ పాఠానికి తిప్పి, ఉపశీర్షికలు చూపించండి.] మీకిష్టమైతే ఈ బ్రోషుర్ను తీసుకోవచ్చు, మళ్లీ వచ్చినప్పుడు ఆసక్తికరమైన ఆ ప్రశ్నలకు బైబిలు ఇచ్చే సమాధానాలు తెలుసుకుందాం.”
● “ఈ రోజుల్లో ప్రజలు, లోకం ఏమైపోతుందో అని ఆలోచిస్తున్నారు, దాని గురించి మాట్లాడడానికే నేను వచ్చాను. పరిస్థితులు ఎప్పటికైనా మెరుగౌతాయని మీకనిపిస్తుందా? [వాళ్లేమి చెప్తారో వినండి.] ఈ విషయం గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయో చూపించమంటారా? [వాళ్లు ఆసక్తి చూపిస్తే, కొనసాగించండి.] మన జీవితాల్లో ఆశను నింపే మంచివార్త బైబిల్లో ఉందని తెలుసుకొని చాలామంది ఆశ్చర్యపోతుంటారు. బైబిలు సమాధానమిచ్చే ప్రశ్నల్లో కొన్నిటిని చూడండి.” వాళ్లకు ఒక బ్రోషుర్ ఇచ్చి, చివరి పేజీలో ఉన్న ప్రశ్నల్లో వాళ్లకు నచ్చిన ఒక ప్రశ్నను ఎంచుకోమని అడగండి. తర్వాత, ఆ పాఠాన్ని తీసి అధ్యయనం ఎలా చేస్తామో చూపించండి. ఆ పాఠంలో తర్వాతి ప్రశ్నను పరిశీలించడానికి మళ్లీ కలుసుకునేలా ఏర్పాట్లు చేసుకోండి.
[8వ పేజీలోని చిత్రం]
(బైబిలు అంటే గౌరవం ఉన్నవాళ్లతో) నేరుగా బైబిలు అధ్యయనం గురించి చెప్పి అధ్యయనాలు మొదలుపెట్టడానికి . . .
● “నేను ఒకపని మీద ఇటువైపే వెళ్తూ, బైబిలు అధ్యయనం చేయడానికి రూపొందించిన కొత్త ప్రచురణను మీకు పరిచయం చేద్దామని ఆగాను. ఈ బ్రోషుర్లో 15 పాఠాలున్నాయి. ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు బైబిల్లో ఎక్కడున్నాయో అవి చూపిస్తాయి. [ముఖపేజీని, చివరిపేజీని చూపించండి.] బైబిలును అర్థం చేసుకోవడానికి మీరెప్పుడైనా ప్రయత్నించారా? [వాళ్లేమి చెప్తారో వినండి.] ఈ పాఠాలు ఎంత సులువుగా ఉన్నాయో చూడండి. [3వ పాఠంలో, 3వ ప్రశ్న కిందవున్న మొదటి పేరాను పరిశీలించి, ప్రకటన 21:4, 5 చదవండి. సముచితమనిపిస్తే, తర్వాతి పేరానూ “చదవండి” అని ఇచ్చిన లేఖనాలనూ పరిశీలించండి.] మీకిష్టమైతే ఈ బ్రోషుర్ను తీసుకోవచ్చు. దీనితో ఒకసారి బైబిలు అధ్యయనం చేసి చూడమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీకు నచ్చితే, కొనసాగించవచ్చు. మళ్లీ వచ్చినప్పుడు మొదటి పాఠాన్ని పరిశీలిద్దాం. చూశారా, ఇది ఒక పేజీ అంతే ఉంది.”
[8వ పేజీలోని చిత్రం]
పునర్దర్శనం చేస్తున్నప్పుడు . . .
● మీరిలా చెప్పవచ్చు: “మిమ్మల్ని మళ్లీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆసక్తికరమైన ఎన్నో ప్రశ్నలకు బైబిలిచ్చే జవాబులు ఈ బ్రోషుర్లో ఉన్నాయి, దీన్ని మీ కోసమే తీసుకొచ్చాను. [వాళ్లకు ఒక బ్రోషుర్ ఇచ్చి, చివరి పేజీ చూడమని అడగండి.] వీటిలో ఏ అంశం గురించి పరిశీలించాలని మీరనుకుంటున్నారు? [వాళ్లేమి చెప్తారో వినండి. తర్వాత, వాళ్లు ఎంచుకున్న పాఠానికి తిప్పండి.] ఈ బ్రోషుర్ ఉపయోగిస్తూ బైబిల్లోని జవాబులు ఎలా కనుగొనవచ్చో మీకు చూపిస్తాను.” ఒకట్రెండు పేరాలనూ “చదవండి” అని ఉన్న లేఖనాలనూ పరిశీలించి, అధ్యయనం ఎలా చేస్తారో చూపించండి. అంతే, మీరు బైబిలు అధ్యయనం మొదలుపెట్టినట్లే! ఆ బ్రోషుర్ను వాళ్లకిచ్చి, తిరిగి కలుసుకునేందుకు ఏర్పాట్లు చేసుకోండి. ఆ పాఠం అయిపోయాక, వాళ్లకు నచ్చిన మరో పాఠాన్ని చర్చించవచ్చు లేదా బ్రోషుర్లోని మొదటి అధ్యాయం నుండి ప్రారంభించవచ్చు.