బైబిలు అధ్యయనం సంపాదించుకోవడానికి తోడ్పడే ఐదు విషయాలు
1. మీరు పరిచర్య చేసే ప్రాంతంలో బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడేవాళ్లను కనుక్కోవడం కష్టంగా ఉంటే ఏంచేయాలి, ఎందుకు?
1 బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడేవాళ్లను కనుక్కోవడం మీకు కష్టమౌతోందా? పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉండండి. తన చిత్తం చేయడానికి పట్టుదలతో కృషి చేసేవాళ్లను యెహోవా ఆశీర్వదిస్తాడు. (గల. 6:9) కింద ఉన్న ఐదు విషయాలు మీకు తోడ్పడతాయి.
2. బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి దాని గురించి నేరుగా ఎలా ప్రస్తావించవచ్చు?
2 నేరుగా అడగండి: మనం పత్రికలు అందిస్తామని చాలామందికి తెలిసివుండవచ్చు, కానీ మనం బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తామనే విషయం బహుశా వాళ్లకు తెలియకపోవచ్చు. ఇంటింటి పరిచర్యలో ఆ విషయాన్నే గృహస్థులతో నేరుగా ఎందుకు చెప్పకూడదు? బైబిలు అధ్యయనం కావాలేమో అని మీరు కలిసే ఆసక్తిగల ప్రజలను అడగవచ్చు. వాళ్లు వద్దంటే, సాహిత్యాలను ఇస్తూ వాళ్ల ఆసక్తిని పెంచవచ్చు. ఒక సహోదరుడు ఎంతోకాలంగా పత్రికా మార్గంలో ఒక వివాహ జంటను కలుస్తున్నాడు. వాళ్లకు తాజా పత్రికలు ఇచ్చి, వెళ్లే ముందూ ఎందుకో ఒకసారి “మీకు బైబిలు అధ్యయనం కావాలా?” అని అడగాలనిపించి అడిగాడు. వాళ్లు కావాలనడంతో ఎంతో ఆశ్చర్చపోయాడు. వాళ్లిప్పుడు బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులు.
3. సంఘ కూటాలకు వచ్చే కొత్త వాళ్లంతా ఎవరో ఒకరి దగ్గర బైబిలు అధ్యయనం తీసుకుంటున్నవాళ్లేనని అనుకోవాలా? వివరించండి.
3 కూటాలకు వచ్చే కొత్త వాళ్లను అడగండి: సంఘ కూటాలకు వచ్చిన కొత్త వాళ్లంతా బైబిలు అధ్యయనం తీసుకుంటున్నవాళ్లేనని అనుకోకండి. ఒక సహోదరుడు ఇలా చెబుతున్నాడు: “నేను చేస్తున్న అధ్యయనాల్లో సగానికిపైగా, కూటాలకు హాజరైన వాళ్లతో మాట్లాడి మొదలుపెట్టినవే.” ఒక సహోదరి సంఘంలో ఇద్దరు సహోదరీల బిడియస్థురాలైన తల్లితో మాట్లాడాలని అనుకుంది. ఆవిడ దాదాపు 15 ఏళ్ల నుండి కూటాలకు హాజరౌతోంది. కాసేపట్లో కూటం మొదలౌతుందనగా రాజ్యమందిరానికి వచ్చి, కూటం అయిపోవడంతోనే ఇంటికి వెళ్లిపోయేది. ఆవిడ బైబిలు అధ్యయనానికి ఒప్పుకుని, చివరకు సత్యంలోకి వచ్చింది. ఆ సహోదరి ఇలా రాసింది: “ఆవిడకు బైబిలు అధ్యయనం కావాలేమో అడగడానికి 15 సంవత్సరాలు తీసుకున్నందుకు నాకు చాలా బాధగా ఉంది!”
4. అడిగి తెలుసుకోవడం ద్వారా బైబిలు అధ్యయనాన్ని ఎలా మొదలుపెట్టవచ్చు?
4 అడిగి తెలుసుకోండి: ఒక సహోదరి ఇతరులతో వాళ్ల బైబిలు అధ్యయనాలకు వెళుతుంది. ముగింపులో, అధ్యయనం నిర్వహించే వ్యక్తి అనుమతి తీసుకుని, బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడేవాళ్లు ఎవరైనా తెలుసేమో చెప్పమని విద్యార్థిని అడుగుతుంది. బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని ఆసక్తిగల వాళ్లకు ఇస్తున్నప్పుడు మీరిలా అడగవచ్చు: “మీకు తెలిసివాళ్లలో, ఈ పుస్తకం చదవడానికి ఇష్టపడేవాళ్లు ఎవరైనా ఉన్నారా?” కొన్నిసార్లు ప్రచారకులకు, పయినీర్లకు తాము పరిచర్య చేసే ప్రాంతంలో కలుసుకున్న వ్యక్తులతో బైబిలు అధ్యయనం నిర్వహించడం వీలవకపోవచ్చు. కాబట్టి మీరు ఒక బైబిలు అధ్యయనం నిర్వహించడానికి సన్నద్ధంగా ఉన్నారని వేరేవాళ్లకు తెలియనివ్వండి.
5. సంఘ సభ్యుల అవిశ్వాసులైన భాగస్వాములను బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడతారేమో అడగడం ఎందుకు మంచిది?
5 విశ్వాసికాని భాగస్వామిని అడగండి: మీ సంఘంలో అవిశ్వాసుల్ని పెళ్లి చేసుకున్న ప్రచారకులు ఎవరైనా ఉన్నారా? కొంతమంది అవిశ్వాసులు తమ క్రైస్తవ భాగస్వాములతో బైబిలు గురించి మాట్లాడడానికి సుముఖంగా ఉండరు, అదే బయటవాళ్లు అడిగితే బైబిలు అధ్యయనానికి ఒప్పుకుంటారు. ఎప్పుడైనా సరే, వాళ్లతో ఏ విషయాల గురించి మాట్లాడితే బావుంటుందో విశ్వాసి అయిన భర్తను లేదా భార్యను అడిగి తెలుసుకోవడం మంచిది.
6. బైబిలు అధ్యయనం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ప్రార్థన ఎంత శక్తివంతంగా పనిచేస్తుంది?
6 ప్రార్థించండి: ప్రార్థనకున్న శక్తిని తక్కువ అంచనా వేయకండి. (యాకో. 5:16) మనం తన చిత్తానికి అనుగుణంగా ఉన్నవాటి కోసం ప్రార్థిస్తే తప్పక వింటానని యెహోవా మాటిస్తున్నాడు. (1 యోహా. 5:14) ఎంతో పనిరద్దీలో ఉన్న ఒక సహోదరుడు బైబిలు అధ్యయనం కోసం ప్రార్థించడం మొదలుపెట్టాడు. విద్యార్థి గురించి శ్రద్ధ తీసుకోవడానికి, ముఖ్యంగా విద్యార్థికి ఎక్కువ సమస్యలు ఉంటే సహాయం చేయడానికి తన భర్తకు తగినంత సమయం ఉంటుందో లేదో అని భార్య ఆలోచించింది. తన భర్తకు బైబిలు అధ్యయనం దొరికేలా చేయమని యెహోవాను అడుగుతున్నప్పుడు ఆమె వీటిని ప్రార్థనలో పెట్టింది. వాళ్లు చేసిన ప్రార్థనలకు దాదాపు రెండువారాల్లో జవాబు దొరికింది. బైబిలు అధ్యయనం కావాలని ఒక వ్యక్తి అడగడంతో సంఘంలో ఉన్న ఒక పయినీరు సహోదరి ఆ అధ్యయనాన్ని నిర్వహించమని ఈ సహోదరుడిని అడిగింది. భార్య ఇలా రాసింది: “బైబిలు అధ్యయనం నిర్వహించలేమేమో అనుకునే వాళ్లకు నేనిదే చెప్తాను: ప్రార్థనలో విషయాన్ని స్పష్టంగా వివరించండి, దాని గురించి ప్రార్థిస్తూనే ఉండండి. మేము అనుకున్నదానికంటే ఎంతో ఎక్కువ ఆనందాన్ని పొందాం.” మీరూ పట్టుదలతో ప్రయత్నిస్తే, మీకూ బైబిలు అధ్యయనం దొరుకుంది, అప్పుడు మీరూ ‘జీవమునకు పోవు ద్వారములోకి’ ప్రవేశించడానికి మరొకరికి సహాయపడడం వల్ల వచ్చే ఆనందాన్ని పొందుతారు.—మత్త. 7:13, 14.