మీరు సహాయ పయినీరు సేవ చేయగలరా?
1. మన పరిచర్యను విస్తృతపర్చుకోవడానికి జ్ఞాపకార్థ ఆచరణ కాలం ఎందుకు అనువుగా ఉంటుంది?
1 మన పరిచర్యను విస్తృతపర్చుకోవడానికి జ్ఞాపకార్థ ఆచరణ కాలం అనువుగా ఉంటుంది. యెహోవా తన కుమారుణ్ణి విమోచన క్రయధన బలిగా ఇవ్వడం ఆయన గొప్ప ప్రేమకు నిదర్శనం. దాని గురించి, జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో లోతుగా ఆలోచిస్తాం. (యోహా. 3:16) దానివల్ల, మన హృదయం యెహోవా పట్ల కృతజ్ఞతతో నిండిపోతుంది. ఆయన గురించి, మానవుల కోసం ఆయన చేస్తున్నవాటి గురించి ఇతరులకు చెప్పాలనే కోరిక పెరుగుతుంది. (యెష. 12:4, 5; లూకా 6:45) అలాగే, ఆ సమయంలో ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగం వహిస్తూ మనకు తెలిసినవాళ్లను, మన క్షేత్రంలో ఉన్నవాళ్లను జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానిస్తాం. హాజరైనవాళ్లను మళ్లీ కలిసి, వాళ్ల ఆసక్తి పెంచడానికి కృషిచేస్తాం. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఏదైనా ఒక నెల మీరు సహాయ పయినీరు సేవ చేయగలరా?
2. సహాయ పయినీరు సేవ చేయడానికి మార్చి నెల ఎందుకు చాలా అనువుగా ఉంటుంది?
2 మార్చి నెలను ప్రత్యేకమైనదిగా చేసుకోండి: సహాయ పయినీరు సేవ చేయడానికి మార్చి నెల చాలా అనువుగా ఉంటుంది. ఆ నెలలో సహాయ పయినీరు సేవ చేసేవాళ్లకు, ఈసారి కూడా 30 లేదా 50 గంటలు చేసే వెసులుబాటు కల్పించారు. ఒకవేళ అదే నెలలో ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనం ఉంటే ఆయన క్రమ పయినీర్లతో, ప్రత్యేక పయినీర్లతో జరిపే కూటానికి సహాయ పయినీర్లు కూడా హాజరై, చివరివరకూ ఉండవచ్చు. ఈ సంవత్సరం, ఆహ్వానపత్రాలను పంచిపెట్టే ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని గత సంవత్సరాల్లో కన్నా కాస్త ముందు నుండే మనం ప్రారంభిస్తాం. అంటే, మార్చి 26, మంగళవారం రోజు జరిగే జ్ఞాపకార్థ ఆచరణకు, మార్చి 1 నుండే ఆహ్వానపత్రాలను అందిస్తాం. దానికితోడు, ఈసారి మార్చి నెలలో ఐదు శనివారాలు, ఐదు ఆదివారాలు ఉన్నాయి. కాబట్టి, ఎక్కువ పరిచర్య చేసి ఆ నెలను ప్రత్యేకమైనదిగా చేసుకోగలరేమో జాగ్రత్తగా ఆలోచించండి.
3. పరిచర్యను ఎక్కువగా చేయడానికి మనం ఎలాంటి ప్రణాళికలు వేసుకోవచ్చు?
3 ఇప్పుడే ప్రణాళిక వేసుకోండి: సహాయ పయినీరు సేవ చేసేందుకు మీరు ఎలాంటి సర్దుబాట్లు చేసుకోవాలో పరిశీలించుకోవడానికి ఇదే మంచి సమయం. అందుకు మీ ఇంట్లోవాళ్ల సహకారం కూడా అవసరం కాబట్టి, కుటుంబ ఆరాధనా సాయంత్రమప్పుడు మీ మీ లక్ష్యాల్ని చర్చించుకొని తగిన పట్టిక వేసుకోండి. (సామె. 15:22) ఒకవేళ మీరు సహాయ పయినీరు సేవ చేయలేకపోతే నిరుత్సాహపడకండి. మామూలుగా పరిచర్యకు వెళ్లినప్పుడే కాస్త ఎక్కువ సమయం గడపగలరా? లేదా వారంలో అదనంగా ఇంకో రోజు కూడా పరిచర్య చేయగలరా?
4. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువగా పరిచర్య చేస్తే వచ్చే ప్రయోజనాలు ఏమిటి?
4 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మనం ఎంత ఎక్కువగా పరిచర్య చేస్తే యెహోవాను సేవించడంవల్ల, ఇతరులకు ఇవ్వడంవల్ల అంత ఎక్కువ ఆనందం, సంతృప్తి పొందుతాం. (యోహా. 4:34; అపొ. 20:35) అంతకంటే ముఖ్యంగా, మనం చేసే త్యాగాల వల్ల యెహోవా సంతోషిస్తాడు.—సామె. 27:11.