కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 ఏప్రిల్‌ పేజీలు 26-31
  • యౌవన సహోదరులారా—మార్కును, తిమోతిని చూసి నేర్చుకోండి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యౌవన సహోదరులారా—మార్కును, తిమోతిని చూసి నేర్చుకోండి!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మార్కులా వేరేవాళ్లకు ఇష్టంగా సేవ చేయండి
  • తిమోతిలా ఇతరుల మీద నిజమైన ప్రేమ కురిపించండి
  • తండ్రిలాంటి పౌలు ఇచ్చే సలహాను పాటించండి
  • వేరేవాళ్లకు సేవచేస్తే మీ జీవితం ఆనందమయం అవుతుంది
  • “సంఘాల్ని బలపరుస్తూ” ఉన్నారు
    “దేవుని రాజ్యం గురించి పూర్తిస్థాయిలో” సాక్ష్యం ఇవ్వండి
  • సహోదరులారా—మీకు సంఘ పరిచారకులు అవ్వాలనే లక్ష్యం ఉందా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించే నిర్ణయాలు
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • తిమోతి—‘విశ్వాసమునుబట్టి నిజమైన కుమారుడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 ఏప్రిల్‌ పేజీలు 26-31

అధ్యయన ఆర్టికల్‌ 18

పాట 65 ముందుకు సాగిపోదాం

యౌవన సహోదరులారా—మార్కును, తిమోతిని చూసి నేర్చుకోండి!

“నువ్వు వచ్చేటప్పుడు మార్కును వెంటబెట్టుకుని రా, అతను పరిచర్యలో నాకు సహాయంగా ఉంటాడు.”—2 తిమో. 4:11.

ముఖ్యాంశం

యౌవన సహోదరులు మార్కును, తిమోతిని ఆదర్శంగా తీసుకుని, వేరేవాళ్లకు ఎక్కువ సేవ చేయడానికి ఏ లక్షణాలు పెంచుకోవాలో చూస్తాం.

1-2. వేరేవాళ్లకు సేవచేయకుండా మార్కుకు, తిమోతికి ఏది అడ్డుపడి ఉండేది?

యౌవన సహోదరులారా మీకు యెహోవా సేవ ఎక్కువ చేయాలని ఉందా? సంఘానికి ఎక్కువ సహాయం చేయాలని ఉందా? మీకు ఖచ్చితంగా ఆ కోరిక ఉందని మాకు తెలుసు. వేరేవాళ్లకు ఇష్టంగా సేవచేయడానికి చాలామంది యౌవన సహోదరులు ముందుకురావడం చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది! (కీర్త. 110:3) అయితే, బహుశా మీకు కొన్ని సవాళ్లు రావచ్చు. ముక్కుమొహం తెలియనివాళ్లతో మాట్లాడడానికి భయమేసి పరిచర్య ఎక్కువ చేయడానికి వెనకడుగు వేస్తున్నారా? మీకు ఇచ్చిన నియామకాన్ని చేయలేరేమో అనే భయంతో వెనక్కి తగ్గుతున్నారా? అలాగైతే, మీ ఒక్కరికే కాదు చాలామందికి ఇలాంటి భయాలు ఉంటాయి.

2 మార్కుకు, తిమోతికి కూడా అలాగే అనిపించింది. కానీ వాళ్లు వేరేవాళ్లకు సేవచేయకుండా తమ భయాల్ని అడ్డుపడనివ్వలేదు. అపొస్తలుడైన పౌలు, బర్నబా తమ మొదటి మిషనరీ యాత్రకు తమతోపాటు రమ్మని మార్కును పిలిచినప్పుడు బహుశా మార్కు వాళ్ల అమ్మవాళ్లతో సౌకర్యవంతమైన ఇంటిలో ఉండివుంటాడు. (అపొ. 12:12, 13, 25) కానీ తన పరిచర్యను ఇంకా ఎక్కువ చేయడానికి మార్కు పుట్టిపెరిగిన ఇంటిని, ప్రాంతాన్ని వదిలేసి వచ్చాడు. ముందుగా ఆయన అంతియొకకు వెళ్లాడు. ఆ తర్వాత పౌలు, బర్నబాలతో కలిసి చాలా దూరాలు ప్రయాణించాడు. (అపొ. 13:1-5) తిమోతి కూడా అంతే! తనతోపాటు పరిచర్యకు రమ్మని పౌలు ఆహ్వానించే టైంకి తిమోతి బహుశా వాళ్ల అమ్మానాన్నలతో ఉండివుంటాడు. అసలే చిన్న వయసు, జీవితంలో పెద్దగా అనుభవం కూడా లేదు, కాబట్టి తనకు ఇచ్చిన నియామకాన్ని చేయలేనేమో అని తిమోతి భయంతో వెనక్కి తగ్గాడా? లేదు. (1 కొరింథీయులు 16:10, 11 అలాగే 1 తిమోతి 4:12 పోల్చండి.) బదులుగా, ఆయన పౌలు ఇచ్చిన ఆహ్వానాన్ని తీసుకున్నాడు, దానివల్ల ఎన్నో దీవెనల్ని రుచి చూశాడు.—అపొ. 16:3-5.

3. (ఎ) మార్కు, తిమోతి అంటే పౌలుకు ఎంత ఇష్టం? (2 తిమోతి 4:6, 9, 11) (చిత్రాలు కూడా చూడండి.) (బి) ఈ ఆర్టికల్‌లో ఏ ప్రశ్నలు చూస్తాం?

3 యౌవనంలో ఉన్నప్పుడే మార్కు, తిమోతి వెలకట్టలేని అనుభవాన్ని సంపాదించుకున్నారు. పెద్దపెద్ద బాధ్యతల్ని చక్కగా చేయడం నేర్చుకున్నారు. ఈ ఇద్దరు యౌవనస్థులంటే పౌలుకు చాలా ఇష్టం. అందుకే, ఆయన ఇక త్వరలో చనిపోతాడని తెలిసినప్పుడు తనతో ఉండడానికి వాళ్లిద్దర్ని రమ్మన్నాడు. (2 తిమోతి 4:6, 9, 11 చదవండి.) మార్కులో, తిమోతిలో పౌలుకు ఏ లక్షణాలు నచ్చాయి? యౌవన సహోదరులు వాళ్లిద్దరిలాగే ఎలా ఉండవచ్చు? తండ్రిలాంటి పౌలు ఇచ్చిన సలహా నుండి యౌవన సహోదరులు ఎలా ప్రయోజనం పొందవచ్చు?

చిత్రాలు: 1. పౌలు, బర్నబాలకు ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని వడ్డిస్తున్న మార్కు. 2. తిమోతి ఉత్తరం చదువుతుంటే శ్రద్ధగా వింటున్న పెద్దల గుంపు.

మార్కు అలాగే తిమోతి చిన్న వయసులోనే పెద్దపెద్ద బాధ్యతల్ని చక్కగా చేయడం పౌలుకు బాగా నచ్చింది (3వ పేరా చూడండి)c


మార్కులా వేరేవాళ్లకు ఇష్టంగా సేవ చేయండి

4-5. మార్కు వేరేవాళ్లకు సేవ చేయడానికి ఇష్టపడ్డాడని ఎలా చూపించాడు?

4 ఒక రిఫరెన్స్‌ ప్రకారం వేరేవాళ్లకు సేవచేయడం అంటే “కష్టపడి, కష్టం అనుకోకుండా వాళ్లకు సహాయం చేయడం.” ఈ విషయంలో మార్కు మంచి ఆదర్శం ఉంచాడు. పౌలు తనతోపాటు రెండో మిషనరీ యాత్రకు మార్కును తీసుకెళ్లనని చెప్పినప్పుడు ఆయన బహుశా బాధపడి, నొచ్చుకొని ఉంటాడు కానీ, నిరుత్సాహపడలేదు. (అపొ. 15:37, 38) తన బ్రదర్స్‌సిస్టర్స్‌కి ఇష్టంగా సేవ చేస్తూనే ఉన్నాడు.

5 మార్కు తన బంధువైన బర్నబాతో కలిసి పనిచేసే నియామకాన్ని ఒప్పుకున్నాడు. దాదాపు 11 సంవత్సరాల తర్వాత, రోములో పౌలు మొదటిసారి ఖైదీ అయినప్పుడు ఆయనకు సహాయం చేయడానికి వెళ్లినవాళ్లలో మార్కు కూడా ఉన్నాడు. (ఫిలే. 23, 24) నిజానికి మార్కు చేసిన సహాయాన్ని పౌలు ఎంతగా మెచ్చుకున్నాడంటే మార్కు ‘నాకు ఎంతో ఊరటను ఇచ్చాడు’ అని రాశాడు.—కొలొ. 4:10, 11.

6. మార్కు పరిణతిగల క్రైస్తవులతో సమయం గడపడం వల్ల ఎలాంటి ప్రయోజనం పొందాడు? (అధస్సూచి చూడండి.)

6 మార్కు పరిణతిగల క్రైస్తవులతో సమయం గడపడం వల్ల చాలా ప్రయోజనం పొందాడు. రోములో పౌలుతో కొంత సమయం గడిపిన తర్వాత, మార్కు అపొస్తలుడైన పేతురుతో బబులోనులో కలిసి పనిచేశాడు. వాళ్లిద్దరి మధ్య ఎంత సన్నిహిత బంధం ఉండేదంటే పేతురు మార్కును “నా కుమారుడు” అని పిలిచాడు. (1 పేతు. 5:13) వాళ్లిద్దరు కలిసి పనిచేసినప్పుడు బహుశా పేతురు తన యౌవన స్నేహితుడైన మార్కుకు యేసు జీవితం, పరిచర్య గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుంటాడు. వాటినే మార్కు తన పేరు మీదున్న సువార్త పుస్తకంలో రాశాడు.a

7. సురేష్‌ అనే బ్రదర్‌ మార్కును ఎలా అనుకరించాడు? (చిత్రం కూడా చూడండి.)

7 మార్కు యెహోవా సేవలో బిజీగా ఉన్నాడు, పరిణతిగల సహోదరులతో సన్నిహితంగా పనిచేశాడు. మీరు మార్కును ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు? మీకు ఏదైనా సేవావకాశం రాలేదని అనిపిస్తే, ఓపిగ్గా ఉండండి. యెహోవాకు అలాగే సంఘానికి వేరే విధాలుగా సేవచేస్తూ ఉండండి. సురేష్‌b అనే సంఘపెద్ద అనుభవాన్ని చూడండి. ఆయన యౌవనస్థుడిగా ఉన్నప్పుడు, తన తోటి యౌవనులతో పోల్చుకునేవాడు. వాళ్లలో కొంతమందికి తనకన్నా ముందే సేవావకాశాలు వచ్చాయి. అప్పుడు తను చేసే పనిని ఎవరూ గుర్తించట్లేదని సురేష్‌ ముఖం చిన్నబుచ్చుకున్నాడు. కొన్ని రోజులు అయ్యాక పరిణతిగల సహోదరుల దగ్గరికి వెళ్లి, తన మనసులో మాట చెప్పాడు. తను చేసే మంచి పనుల్ని ఇతరులు గమనించినా గమనించకపోయినా వేరేవాళ్లకు సేవ చేస్తూనే ఉండమని ఒక సంఘపెద్ద సురేష్‌కు సలహా ఇచ్చాడు. దానివల్ల సురేష్‌ వయసు పైబడిన బ్రదర్స్‌సిస్టర్స్‌ మీటింగ్స్‌కి రావడానికి సహాయం చేయడం మొదలుపెట్టాడు. తన జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటూ సురేష్‌ ఇలా అన్నాడు: “వేరేవాళ్లకు సేవచేయడం అంటే ఏంటో నేను అర్థం చేసుకున్నాను. ఇతరులకు సేవ చేయడంలో ఉన్న ఆనందాన్ని రుచి చూశాను.”

ఒక యౌవన సహోదరుడు వృద్ధ సహోదరున్ని తన కారులో మీటింగ్‌కి తీసుకొచ్చాడు.

పరిణతిగల క్రైస్తవులతో ఎక్కువ సమయం గడిపితే యౌవన సహోదరులు ఎలా ప్రయోజనం పొందవచ్చు? (7వ పేరా చూడండి)


తిమోతిలా ఇతరుల మీద నిజమైన ప్రేమ కురిపించండి

8. పౌలు తనతో పాటు ప్రయాణించడానికి తిమోతిని ఎందుకు ఎంచుకున్నాడు? (ఫిలిప్పీయులు 2:19-22)

8 వ్యతిరేకత వచ్చిన ప్రాంతాలకు పౌలు మళ్లీ వెళ్లాలంటే, తనతోపాటు గుండె ధైర్యం ఉన్న సహోదరులు కావాలి. అందుకే ఆయన ముందుగా ఎంతో అనుభవం ఉన్న సీలను ఎంచుకున్నాడు. (అపొ. 15:22, 40) ఆ తర్వాత, తనతోపాటు తిమోతిని తీసుకెళ్లాడు. ఇంతకీ తిమోతిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఒకటేంటంటే, సహోదరుల మధ్య ఆయనకు మంచి పేరు ఉంది. (అపొ. 16:1, 2) అంతేకాదు, తిమోతి ప్రజల మీద నిజమైన శ్రద్ధ చూపించేవాడు.—ఫిలిప్పీయులు 2:19-22 చదవండి.

9. తన తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌ని నిజంగా పట్టించుకున్నాడని తిమోతి ఎలా చూపించాడు?

9 పౌలుతో తన పరిచర్యను మొదలుపెట్టినప్పుటి నుండే తిమోతి వేరేవాళ్ల గురించి ఎక్కువ పట్టించుకునేవాడు. అందుకే పౌలు కొత్తగా శిష్యులైన వాళ్లను ప్రోత్సహించడానికి తిమోతిని చాలా నమ్మకంతో బెరయలోనే ఉండనిచ్చాడు. (అపొ. 17:13, 14) అప్పుడు తిమోతితో పాటు సీల కూడా ఉన్నాడు. ఆయన నుండి తిమోతి చాలా విషయాలు నేర్చుకుని ఉంటాడు. ఆ తర్వాత పౌలు, తిమోతిని థెస్సలోనికలో ఉన్న క్రైస్తవుల్ని బలపర్చడానికి ఒంటరిగా పంపించాడు. (1 థెస్స. 3:2, అధస్సూచి.) అప్పటినుండి దాదాపు 15 సంవత్సరాల వరకు ‘ఏడ్చేవాళ్లతో ఏడ్వడం,’ వేరేవాళ్ల బాధను తన బాధగా పట్టించుకోవడం తిమోతి నేర్చుకున్నాడు. (రోమా. 12:15; 2 తిమో. 1:4) అయితే, యౌవన సహోదరులు తిమోతిని ఎలా అనుకరించవచ్చు?

10. విజయ్‌ అనే బ్రదర్‌ వేరేవాళ్ల మీద శ్రద్ధ చూపించడం ఎలా నేర్చుకున్నాడు?

10 విజయ్‌ అనే బ్రదర్‌ వేరేవాళ్ల గురించి ఎక్కువ పట్టించుకోవడం నేర్చుకున్నాడు. యౌవనస్థుడిగా ఉన్నప్పుడు వృద్ధులతో మాటలు కలపడం ఆయనకు కష్టంగా అనిపించేది. అందుకే ఆయన రాజ్యమందిరంలో వాళ్లని జస్ట్‌ పలకరించి, వెళ్లిపోయేవాడు. అయితే, తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌లో తనకు ఏ విషయం నచ్చుతుందో దాంతో మాటలు కలపమని ఒక సంఘపెద్ద విజయ్‌కి సలహా ఇచ్చాడు. అలాగే వేరేవాళ్లకు ఏ విషయాలు ఆసక్తిగా అనిపిస్తాయో వాటిగురించి ఆలోచించమని కూడా చెప్పాడు. విజయ్‌ ఆ సలహాల్ని పాటించాడు. ప్రస్తుతం సంఘ పెద్దగా సేవ చేస్తున్న విజయ్‌ ఇలా చెప్తున్నాడు: “నేను ఇప్పుడు వేర్వేరు వయసు వాళ్లతో ఈజీగా మాటలు కలపగలుగుతున్నాను. వేరేవాళ్ల పరిస్థితుల్ని ఇప్పుడు ఇంకా బాగా అర్థంచేసుకోవడం నాకు మంచిగా అనిపిస్తుంది. దానివల్ల నేను వాళ్లకు సహాయం చేయగలుగుతున్నాను.”

11. సంఘంలో ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌ని పట్టించుకోవడం యౌవన సహోదరులు ఎలా నేర్చుకోవచ్చు? (చిత్రం కూడా చూడండి.)

11 యౌవన సహోదరులారా, వేరేవాళ్ల అవసరాలను నిజంగా పట్టించుకోవడం నేర్చుకోండి. మీటింగ్స్‌లో ఉన్నప్పుడు వేర్వేరు వయసువాళ్ల మీద నిజమైన శ్రద్ధ చూపించండి. వాళ్లు ఎలా ఉన్నారో అడగండి, వాళ్లు చెప్పేది వినండి. అలా మెల్లమెల్లగా వాళ్లకు ఏ విషయాల్లో సహాయం అవసరమో మీకు తెలుస్తుంది. బహుశ పెద్ద వయసువాళ్లకి JW లైబ్రరీ యాప్‌ని ఉపయోగించడంలో సహాయం అవసరంకావచ్చు. లేదా వాళ్లతో కలిసి ప్రీచింగ్‌ చేయడానికి ఎవరూ లేకపోవచ్చు. మరి అలాంటివాళ్లకు ఫోన్లు-ట్యాబ్‌లు ఉపయోగించడంలో లేదా వాళ్లతో పాటు ప్రీచింగ్‌ చేయడంలో మీరు సహాయం చేయగలరా? ఇతరులకి సహాయం చేయడానికి మీరే ఒక అడుగు ముందుకు వేస్తే, అందరికీ మంచి ఆదర్శం ఉంచిన వాళ్లౌతారు.

ఒక యౌవన సహోదరుడు, వృద్ధ సహోదరుడు కలిసి ప్రీచింగ్‌ చేస్తున్నారు. వృద్ధ సహోదరుడు ఇంటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వీడియో చూపించడంలో యౌవన సహోదరుడు సహాయం చేస్తున్నాడు.

యౌవన సహోదరులు సంఘానికి చాలా రకాలుగా సహాయం చేయవచ్చు (11వ పేరా చూడండి)


తండ్రిలాంటి పౌలు ఇచ్చే సలహాను పాటించండి

12. పౌలు తిమోతికి ఇచ్చిన సలహా నుండి యౌవన సహోదరులు ఎలా ప్రయోజనం పొందవచ్చు?

12 తిమోతి తన జీవితంలో అలాగే పరిచర్యలో విజయం సాధించాలంటే ఏం చేయాలో పౌలు మంచి సలహా ఇచ్చాడు. (1 తిమో. 1:18; 2 తిమో. 4:5) యౌవనులారా తండ్రి లాంటి పౌలు ఇచ్చిన ఆ సలహా నుండి మీరు కూడా ప్రయోజనం పొందవచ్చు. ఎలా? పౌలు తిమోతికి రాసిన రెండు ఉత్తరాల్ని మీ కోసమే రాసినట్టుగా చదవండి. ఆ తర్వాత, మీ జీవితంలో ఏ సలహాను పాటించాలో ఆలోచించండి. ఇప్పుడు కొన్ని సలహాల్ని చూద్దాం.

13. దైవభక్తిని పెంచుకోవాలంటే ఏం చేయాలి?

13 “దైవభక్తి చూపించడమే లక్ష్యంగా పెట్టుకుని నీకు నువ్వే శిక్షణ ఇచ్చుకో.” (1 తిమో. 4:7బి) ఇంతకీ దైవభక్తి అంటే ఏంటి? ఒకవ్యక్తి యెహోవాకు నమ్మకంగా ఉంటూ ఆయన్ని సంతోషపెట్టాలని అనుకోవడం. నిజానికి, మనకు పుట్టుకతోనే ఆ లక్షణం రాలేదు, కాబట్టి మనం దాన్ని సంపాదించుకోవాలి. ఎలా? ‘నీకు నువ్వే శిక్షణ ఇచ్చుకో’ అని అనువదించబడిన గ్రీకు మాటను, సాధారణంగా పోటీకి సిద్ధపడే క్రీడాకారుడు తీసుకునే కఠినమైన శిక్షణను వర్ణించడానికి ఉపయోగించేవాళ్లు. ఈ క్రీడాకారులకు చాలా క్రమశిక్షణ అవసరం. మనం కూడా దేవునికి దగ్గరయ్యే అలవాట్లను పెంచుకోవాలంటే, క్రమశిక్షణ చాలా అవసరం.

14. బైబిలు చదువుతున్నప్పుడు మన లక్ష్యం ఏమై ఉండాలి? ఒక ఉదాహరణ చెప్పండి.

14 మీరు బైబిలు చదివే అలవాటును పెంచుకుంటున్నప్పుడు, యెహోవాకు దగ్గరవ్వాలనే మీ లక్ష్యాన్ని మనసులో ఉంచుకోండి. ఉదాహరణకు, యేసు దగ్గరికి వచ్చిన ధనవంతుడైన యువ అధిపతి నుండి ఏం నేర్చుకోవచ్చో ఆలోచించండి. (మార్కు 10:17-22) ఆ యువకుడు యేసే మెస్సీయ అని నమ్మాడు. కానీ ఆయన్ని అనుసరించేంత విశ్వాసం అతనికి లేదు. అయినాసరే, యేసు అతని మీద ప్రేమ చూపిస్తూ చాలా దయగా మాట్లాడాడు. నిజమే, ఆ యువకుడు తెలివైన నిర్ణయం తీసుకోవాలని యేసు కోరుకున్నాడు. అందుకే, తన తండ్రైన యెహోవాలా ఆ యువకుని మీద ప్రేమ చూపించాడు. (యోహా. 14:9) ఈ సందర్భం గురించి అలాగే మీ పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇలా ప్రశ్నించుకోండి: ‘నేను యెహోవాకు దగ్గరై, వేరేవాళ్లకు ఇంకా ఎక్కువ సేవచేయడానికి ఏం చేయాలి?’

15. ఒక యువ సహోదరుడు ఎందుకు ఇతరులకు మంచి ఆదర్శం ఉంచాలి? ఒక ఉదాహరణతో చెప్పండి. (1 తిమోతి 4:12, 13)

15 “నమ్మకమైన సేవకులకు ఆదర్శంగా ఉండు.” (1 తిమోతి 4:12, 13 చదవండి.) తిమోతి చదవడం, బోధించడం లాంటి నైపుణ్యాలే కాదు ప్రేమ, విశ్వాసం, పవిత్రత లాంటి లక్షణాల్ని కూడా పెంచుకోవాలని పౌలు చెప్పాడు. ఎందుకంటే, మాటల కన్నా చేతలే గట్టిగా మాట్లాడతాయి. ఉదాహరణకు, పరిచర్యలో ఉత్సాహాన్ని ఎలా పెంచుకోవాలి అనే దానిగురించి మీరు ప్రసంగం చేయాల్సివస్తే, పరిచర్యలో మీరు చేయగలిగినదంతా చేసినప్పుడే, దానిగురించి ధైర్యంగా మాట్లాడగలుగుతారు కదా. ఆ విషయంలో మీ ఆదర్శమే మీ మాటలకు అందాన్ని తెస్తుంది!—1 తిమో. 3:13.

16. (ఎ) యౌవన సహోదరులు ఏ ఐదు విషయాల్లో ఆదర్శంగా ఉండాలి? (బి) “మాట్లాడే విషయంలో” యౌవన సహోదరులు ఎలా ఆదర్శంగా ఉండవచ్చు?

16 1 తిమోతి 4:12 లో ఉన్నట్టు, ఒక యువ సహోదరుడు ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన ఐదు విషయాల గురించి పౌలు చెప్పాడు. మీ వ్యక్తిగత అధ్యయనంలో ప్రతీ అంశం గురించి అధ్యయనం చేయండి. ఉదాహరణకు, మీరు “మాట్లాడే విషయంలో” ఇతరులకు మంచి ఆదర్శంగా ఉండాలనుకుంటే, మీ మాటలు ఏయే విధాలుగా వేరేవాళ్లను బలపర్చేవిగా ఉండాలో ఆలోచించండి. మీరు ఒకవేళ మీ అమ్మానాన్నలతో ఉంటుంటే, వాళ్లు మీకోసం చేసే వాటన్నిటికీ ఎప్పుడైనా థ్యాంక్స్‌ చెప్పారా? మీటింగ్‌ తర్వాత, ఆరోజు ఎవరైనా తమ నియామకాన్ని మంచిగా చేస్తే వాళ్లను మెచ్చుకున్నారా? మీటింగ్స్‌లో కామెంట్స్‌ని మీ సొంత మాటల్లో చెప్పడానికి ప్రయత్నించారా? మాట్లాడే విషయంలో ఆదర్శంగా ఉండడానికి మీరు చేసే ప్రతీ ప్రయత్నం, మీరు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధిస్తున్నారని అందరికీ స్పష్టంగా తెలిసేలా చేస్తుంది.—1 తిమో. 4:15.

17. ఒక యౌవన సహోదరుడు ఆధ్యాత్మిక లక్ష్యాలు చేరుకోవడానికి ఏది సహాయం చేస్తుంది? (2 తిమోతి 2:22)

17 ‘యౌవన కోరికల నుండి పారిపోండి, నీతిని అలవర్చుకోండి.’ (2 తిమోతి 2:22 చదవండి.) తన ఆధ్యాత్మిక లక్ష్యాలకు అడ్డొచ్చి, యెహోవాతో తనకున్న బంధాన్ని పాడుచేసే లాంటి కోరికలతో పోరాడాలని పౌలు తిమోతికి సలహా ఇచ్చాడు. బహుశా మీరు కొన్ని పనులు చేయడం తప్పు కాకపోయినా, అవి చేయడం వల్ల ఆధ్యాత్మిక పనులకు సమయం మిగలకపోవచ్చు. ఉదాహరణకు మీరు ఆటలకు, ఇంటర్నెట్‌కు లేదా వీడియో గేమ్స్‌కి ఎంత టైం ఇస్తున్నారో ఆలోచించుకోండి. దాంట్లో కొంత టైం ఆధ్యాత్మిక పనులకు ఇవ్వగలరా? బహుశా రాజ్యమందిరంలో ఏదైనా పని ఉంటే చేయగలరా? లేదా కార్ట్‌ విట్నెసింగ్‌కి మద్దతు ఇవ్వగలరా? మీరు అలాంటి పనులు చేస్తే, మీకు కొత్త ఫ్రెండ్స్‌ దొరుకుతారు. మీరు ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకుని, వాటిని చేరుకునేలా వాళ్లు సహాయం చేస్తారు.

వేరేవాళ్లకు సేవచేస్తే మీ జీవితం ఆనందమయం అవుతుంది

18. మార్కు అలాగే తిమోతి జీవితంలో ఎంతో సంతృప్తి, ఎన్నో మధుర క్షణాలు ఉన్నాయని ఎలా చెప్పవచ్చు?

18 తమ శక్తి లోపం లేకుండా వేరేవాళ్లకు సేవ చేయడానికి మార్కు అలాగే తిమోతి చాలా త్యాగాలు చేశారు. దానివల్ల వాళ్ల జీవితంలో ఎంతో సంతృప్తి, ఎన్నో మధుర క్షణాలు మిగిలాయి. (అపొ. 20:35) తన తోటి బ్రదర్స్‌సిస్టర్స్‌కి సేవ చేయడానికి మార్కు ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాలకు తిరిగాడు. అలాగే యేసు జీవితం, పరిచర్య గురించి ఆసక్తికరమైన పుస్తకం రాశాడు. తిమోతి విషయానికొస్తే, పౌలు ఎన్నో సంఘాలు స్థాపించి, బ్రదర్స్‌సిస్టర్స్‌ని బలపర్చేలా ఆయనకు చేదోడువాదోడుగా ఉన్నాడు. మార్కు అలాగే తిమోతి వేరేవాళ్లకు సేవ చేయడానికి చేసిన ప్రతీ త్యాగాన్ని యెహోవా చూశాడు, వాటిని బట్టి సంతోషించాడు.

19. పౌలు తిమోతికి ఇచ్చిన సలహాను యౌవన సహోదరులు ఎందుకు మనసుకు తీసుకోవాలి? దానివల్ల ఏమౌతుంది?

19 తిమోతి మీద పౌలుకు ఎంత ప్రేమ ఉందో ఆయన రాసిన ఉత్తరంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పవిత్రశక్తి ప్రేరణతో రాసిన ఈ ఉత్తరాలు, యెహోవా యౌవన సహోదరుల్ని ఎంత ప్రేమిస్తున్నాడో చూపిస్తున్నాయి. యౌవనులారా, జీవితంలో మీరు విజయం సాధించాలని యెహోవా కోరుకుంటున్నాడు. కాబట్టి తండ్రి లాంటి పౌలు ఇచ్చిన సలహాను మనసుకు తీసుకుని, మీ శక్తి లోపం లేకుండా వేరేవాళ్లకు సేవ చేయాలనే కోరికను పెంచుకోండి. అలా చేస్తే, ఇప్పుడు మీరు ఎన్నో మధుర క్షణాల్ని సొంతం చేసుకుంటారు. భవిష్యత్తులో రాబోయే, “వాస్తవమైన జీవితం మీద గట్టి పట్టు సాధించగలుగుతారు.”—1 తిమో. 6:18, 19.

మీరెలా జవాబిస్తారు?

  • మార్కు నుండి మీరు ఏం నేర్చుకున్నారు?

  • వేరేవాళ్లతో వ్యవహరిస్తున్నప్పుడు తిమోతిని ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?

  • ఒక యౌవన సహోదరుడు ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించడానికి పౌలు ఇచ్చిన ఏ సలహాలు సహాయం చేస్తాయి?

పాట 80 యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి

a పేతురుకు ఫీలింగ్స్‌ ఎక్కువ కాబట్టి యేసు వేర్వేరు సందర్భాల్లో ఎలా వ్యవహరించాడో మార్కుకు కళ్లకు కట్టినట్టు చూపించి ఉంటాడు. అందుకేనేమో యేసు భావాల్ని, పనుల్ని మార్కు చక్కగా రాశాడు.—మార్కు 3:5; 7:34; 8:12.

b కొన్ని పేర్లను మార్చాం.

c చిత్రం వివరణ : పౌలు, బర్నబా మిషనరీ యాత్రలో ఉన్నప్పుడు మార్కు వాళ్లకు కావాల్సిన పనులు చేసి పెడుతూ చేదోడువాదోడుగా ఉన్నాడు. తిమోతి బ్రదర్స్‌సిస్టర్స్‌ని బలపర్చడానికి, ప్రోత్సహించడానికి వేర్వేరు సంఘాలకు ఇష్టంగా వెళ్లాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి