అధ్యయన ఆర్టికల్ 23
పాట 2 యెహోవా నీ పేరు
యెహోవా పేరు—మీరు దానికి ఎంత విలువ ఇస్తున్నారు?
“‘మీరే నా సాక్షులు’ అని యెహోవా అంటున్నాడు”—యెష. 43:10.
ముఖ్యాంశం
యెహోవా పేరును పవిత్రపర్చడానికి, సమర్థించడానికి మనం ఏం చేయవచ్చో చూస్తాం.
1-2. యేసు యెహోవా పేరుకు విలువిచ్చాడని మనకు ఎలా తెలుసు?
యేసుకు యెహోవా పేరే ప్రపంచం. ఈ లోకానికి యెహోవా పేరును పరిచయం చేసినవాళ్లలో యేసుకు మించినోళ్లు లేరు! ముందటి ఆర్టికల్‌లో చూసినట్టు యెహోవా పేరును పవిత్రపర్చడానికి, సమర్థించడానికి యేసు తన ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డాడు. (మార్కు 14:36; హెబ్రీ. 10:7-9) భవిష్యత్తులో వెయ్యేండ్ల పరిపాలన తర్వాత యేసు తనకున్న అధికారాన్నంతా యెహోవాకు ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఘనతంతా యెహోవాకే రావాలి. (1 కొరిం. 15:26-28) తనకు దేవుని పేరుమీద ఎంత ఇష్టం ఉందో ఆ తండ్రీకొడుకుల మధ్యవున్న బంధంలో కనిపిస్తుంది. యేసు యెహోవా పేరునే కాదు ఆ పేరు వెనుకున్న వ్యక్తిని కూడా ప్రేమించాడని ఆ బంధం తిరుగులేని విధంగా నిరూపిస్తుంది.
2 యేసు తన తండ్రి పేరున భూమ్మీదకు వచ్చాడు. (యోహా. 5:43; 12:13) తన తండ్రి పేరును తన అనుచరులకు తెలియజేశాడు. (యోహా. 17:6, 26) ఆయన యెహోవా పేరున బోధించాడు, ఆ పేరున అద్భుతాలు చేశాడు. (యోహా. 10:25) అంతేకాదు, “నీ సొంత పేరును బట్టి వాళ్లను కాపాడు” అని తన శిష్యుల గురించి యేసు ప్రార్థన చేశాడు. (యోహా. 17:11) కాబట్టి, యేసు యెహోవా పేరుకు అంత విలువిస్తుంటే, క్రీస్తును నిజంగా అనుసరిస్తున్నామని చెప్పుకునేవాళ్లకు యెహోవా పేరు తెలీకపోయినా, వాళ్లు ఆ పేరు ఉపయోగించకపోయినా ఎంత విడ్డూరంగా ఉంటుందో కదా!
3. ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?
3 క్రీస్తు అడుగుజాడల్లో నడిచే క్రైస్తవులుగా మనం యెహోవా పేరును చాలా గొప్పగా చూస్తాం. (1 పేతు. 2:21) రాజ్యం గురించిన మంచివార్తను ప్రకటించేవాళ్లకు తన పేరును యెహోవా ఎందుకు ఇచ్చాడో ఈ ఆర్టికల్‌లో చూస్తాం. (మత్త. 24:14) అలాగే మనలో ప్రతీఒక్కరం యెహోవా పేరుకు ఎంత విలువ ఇవ్వాలో కూడా చూస్తాం.
“తన పేరుతో పిలువబడే ప్రజలు”
4. (ఎ) పరలోకానికి వెళ్లబోయే ముందు యేసు తన శిష్యులకు ఏం చెప్పాడు? (బి) దానివల్ల మనకు ఏ ప్రశ్న రావచ్చు?
4 ఇంకాసేపట్లో పరలోకానికి వెళ్లబోయే ముందు యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: “పవిత్రశక్తి మీ మీదికి వచ్చినప్పుడు మీరు బలం పొందుతారు; అప్పుడు యెరూషలేములో, యూదయ అంతటిలో, సమరయలో, భూమంతటా మీరు నాకు సాక్షులుగా ఉంటారు.” (అపొ. 1:8) కాబట్టి మంచివార్త కేవలం ఇశ్రాయేలులోనే కాదు భూమంతటా ప్రకటించబడుతుంది. అలా అన్నిదేశాల ప్రజలకు యేసు అనుచరులయ్యే అవకాశం దొరుకుతుంది. (మత్త. 28:19, 20) అయితే, యేసు ఇలా చెప్పాడు: “మీరు నాకు సాక్షులుగా ఉంటారు.” అంటే కొత్తగా శిష్యులైనవాళ్లు యెహోవా పేరు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? వాళ్లు కేవలం యేసుకు మాత్రమే సాక్షులుగా ఉంటారా? అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో ఉన్న సంఘటనలు దానికి జవాబిస్తాయి.
5. ప్రజలందరూ యెహోవా పేరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అపొస్తలులు, యెరూషలేములో ఉన్న పెద్దలు ఎలా చూపించారు? (చిత్రం కూడా చూడండి.)
5 సున్నతి పొందని అన్యులు క్రైస్తవులుగా మారాలంటే ఏం చేయాలో మాట్లాడుకోవడానికి క్రీ.శ. 49 లో అపొస్తలులు అలాగే యెరూషలేములో ఉన్న పెద్దలు కలుసుకున్నారు. వాళ్ల చర్చ ముగింపులో యేసు తమ్ముడైన యాకోబు ఇలా చెప్పాడు: “దేవుడు తన పేరు కోసం అన్యజనుల్లో నుండి కూడా ప్రజల్ని ఎంచుకోవడానికి, ఇప్పుడు వాళ్లను అంగీకరిస్తున్నాడని ఇంతకుముందే [పేతురు] వివరంగా చెప్పాడు.” ఇక్కడ యాకోబు ఎవరి పేరు గురించి మాట్లాడుతున్నాడు? ఆమోసు ప్రవక్త మాటల్ని ఎత్తి చెప్తూ ఆయనిలా అన్నాడు: “అప్పుడు మిగిలినవాళ్లు, నా పేరుతో పిలవబడే అన్నిదేశాల ప్రజలతో కలిసి పట్టుదలగా యెహోవాను వెతుకుతారని వీటిని చేస్తున్న యెహోవా చెప్తున్నాడు.” (అపొ. 15:14-18) అంటే, ఈ కొత్త శిష్యులు యెహోవా గురించి నేర్చుకోవడమే కాదు ‘ఆయన పేరుతో పిలువబడతారు.’ అంటే వాళ్లకు ఆయన పేరు ఉంటుంది, ఆ పేరుతో వాళ్లు గుర్తించబడతారు.
క్రైస్తవులు దేవుని పేరుతో పిలవబడాలని మొదటి శతాబ్దంలోని పరిపాలక సభ మీటింగ్‌లో ఆ నమ్మకమైన పురుషులు స్పష్టంగా అర్థంచేసుకున్నారు (5వ పేరా చూడండి)
6-7. (ఎ) యేసు భూమ్మీదకు ఎందుకు వచ్చాడు? (బి) ఆయన భూమ్మీదకు రావడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఏంటి?
6 యేసు పేరుకు అర్థం “యెహోవాయే రక్షణ.” తన మీద, తన కుమారుని మీద విశ్వాసం ఉంచే ప్రజలందర్నీ కాపాడడానికి యెహోవా యేసును ఉపయోగించుకున్నాడు. మనుషులందరి కోసం తన ప్రాణం ఇవ్వడానికి యేసు ఈ భూమ్మీదకు వచ్చాడు. (మత్త. 20:28) విమోచన క్రయధనం ద్వారా మనుషులందర్నీ కాపాడి, వాళ్లకు శాశ్వతకాలం జీవించే అవకాశాన్ని యెహోవా ఇచ్చాడు.—యోహా. 3:16.
7 అసలు మనుషులందరికీ రక్షణ ఎందుకు అవసరమైంది? ఎందుకంటే, మనం ముందటి ఆర్టికల్‌లో చూసినట్టు మన మొదటి తల్లిదండ్రులైన ఆదాముహవ్వలు యెహోవాకు ఎదురుతిరిగి, శాశ్వతకాలం జీవించే అవకాశాన్ని పోగొట్టుకున్నారు. (ఆది. 3:6, 24) కేవలం మనుషులను రక్షించడానికే కాదు. యేసు ఈ భూమ్మీదకు రావడానికి ఇంకో ముఖ్యమైన కారణమే ఉంది. సాతాను యెహోవా గురించి అబద్ధాలు చెప్పి ఆయన పేరు మీద బురద చల్లాడు. (ఆది. 3:4, 5) కాబట్టి ఆదాముహవ్వల పిల్లల్ని కాపాడడం ఇంకో పెద్ద సమస్యకు ముడిపడివుంది, అదే యెహోవా పేరును పవిత్రపర్చడం. యేసు యెహోవాకు ప్రతినిధి, ఆయన పేరున వచ్చాడు కాబట్టి ఆ పేరును పవిత్రపర్చడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.
క్రీస్తును నిజంగా అనుసరిస్తున్నామని చెప్పుకునేవాళ్లకు యెహోవా పేరు తెలీకపోయినా, వాళ్లు ఆ పేరు ఉపయోగించకపోయినా ఎంత విడ్డూరంగా ఉంటుందో కదా!
8. యేసును అనుసరించే వాళ్లందరూ ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలి?
8 యేసు మీద విశ్వాసం ఉంచే వాళ్లందరూ అంటే యూదులైనా, అన్యులైనా తమ రక్షణకు మూలం ఎవరో తెలుసుకోవాలి. అంటే యేసుకు తండ్రైన యెహోవా తమ రక్షణకు మూలమని వాళ్లు తెలుసుకోవాలి. (యోహా. 17:3) అంతేకాదు, యేసులాగే వాళ్లు కూడా యెహోవా పేరుతోనే గుర్తించబడతారు. కాబట్టి యెహోవా పేరును పవిత్రపర్చడం ఎంత ముఖ్యమో వాళ్లు గుర్తించాలి. వాళ్ల రక్షణ దానిమీదే ఆధారపడి ఉంది. (అపొ. 2:21, 22) కాబట్టి యేసు నమ్మకమైన అనుచరులందరూ యెహోవా గురించి అలాగే యేసు గురించి తెలుసుకోవాలి. అందుకే యేసు తన ప్రార్థనను ఈ మాటలతో ముగించాడని యోహాను 17వ అధ్యాయంలో చూస్తాం: “నువ్వు నామీద చూపించిన ప్రేమను వీళ్లు ఇతరుల మీద చూపించేలా, నేను వీళ్లతో ఐక్యంగా ఉండేలా నీ పేరును వీళ్లకు తెలియజేశాను, ఇంకా తెలియజేస్తాను.”—యోహా. 17:26.
“మీరు నాకు సాక్షులుగా ఉంటారు”
9. యెహోవా పేరే అన్నిటికన్నా ముఖ్యమని మనం ఎలా చూపించాలి?
9 యేసును నిజంగా అనుసరించే వాళ్లందరూ యెహోవా పేరును పవిత్రపర్చాలి. (మత్త. 6:9, 10) వాళ్లు అన్నిటికన్నా ఎక్కువ యెహోవా పేరుకే ముఖ్యమైన స్థానం ఇవ్వాలి. అంటే వాళ్లవైపు నుండి వాళ్లు దాన్ని ప్రాముఖ్యంగా చూస్తున్నారని పనుల్లో చూపించాలి. అయితే, యెహోవా పేరును పవిత్రపర్చడానికి లేదా ఆ పేరు మీద సాతాను వేసిన నిందల్ని తీసేయడానికి మనవంతు మనం ఏం చేయవచ్చు?
10. యెషయా 42 నుండి 44 అధ్యాయాల్లో ఎలాంటి కోర్టు కేసు గురించి చదువుతాం? (యెషయా 43:9; 44:7-9) (చిత్రం కూడా చూడండి.)
10 యెహోవా పేరును పవిత్రపర్చడంలో మనకున్న ముఖ్యమైన పాత్ర గురించి యెషయా 42 నుండి 44 అధ్యాయాల్లో ఉంది. ఆ అధ్యాయాల్లో ఒక కోర్టు సన్నివేశం కనిపిస్తుంది. అందులో, ఎవరు నిజమైన దేవుడో నిరూపించుకునే ఒక ప్రక్రియను చూస్తాం. అంటే, తాము దేవుళ్లని చెప్పుకునేవాళ్లను యెహోవా సవాలు చేస్తున్నాడు. వాళ్లవైపు నుండి సాక్షుల్ని ప్రవేశపెట్టి, దాన్ని నిరూపించుకోమని యెహోవా చెప్తున్నాడు. కానీ దాన్ని ఎవ్వరూ నిరూపించలేరు!—యెషయా 43:9; 44:7-9 చదవండి.
చాలా విధాలుగా మనం ఒక కోర్టు కేసులో ఉన్నామని చెప్పవచ్చు (10-11 పేరాలు చూడండి)
11. యెషయా 43:10-12 లో ఉన్నట్టు యెహోవా తన ప్రజలకు ఏం చెప్తున్నాడు?
11 యెషయా 43:10-12 చదవండి. యెహోవా తన ప్రజల గురించి ఇలా అంటున్నాడు: “మీరే నా సాక్షులు . . . నేనే దేవుణ్ణి.” వాళ్లను ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వమని అడుగుతున్నాడు: “నేను తప్ప వేరే దేవుడు ఉన్నాడా?” (యెష. 44:8) కాబట్టి ఆ ప్రశ్నకు జవాబిచ్చే గొప్ప అవకాశం మనందరికీ ఉంది. మన మాటల్లో, పనుల్లో యెహోవాయే నిజమైన దేవుడని నిరూపిస్తాం. ఆయన పేరే ఈ విశ్వంలో అన్నిటికన్నా గొప్పది. మనం యెహోవాను నిజంగా ప్రేమిస్తున్నామని, సాతాను ఎలాంటి కష్టాలు తీసుకొచ్చినా యెహోవాకు నమ్మకంగా ఉంటామని మనం బ్రతుకుతున్న విధానంలో నిరూపిస్తాం. ఇలా యెహోవా పేరును పవిత్రపర్చడానికి మనవంతు మనం చేసే అవకాశం ఉంది.
12. యెషయా 40:3, 5 లో ఉన్న ప్రవచనం ఎలా నెరవేరింది?
12 మనం యెహోవా పేరుకు మద్దతిచ్చినప్పుడు మనం యేసును అనుకరించిన వాళ్లమౌతాం. ఒక వ్యక్తి “యెహోవా మార్గాన్ని సిద్ధం” చేస్తాడని యెషయా ముందే చెప్పాడు. (యెష. 40:3) ఆ మాటలు ఎలా నెరవేరాయి? యెహోవా పేరున వచ్చిన, యెహోవా తరఫున మాట్లాడిన యేసు కోసం బాప్తిస్మమిచ్చే యోహాను మార్గం సిద్ధం చేశాడు. (మత్త. 3:3; మార్కు 1:2-4; లూకా 3:3-6) అదే ప్రవచనం ఇలా చెప్తుంది: “యెహోవా మహిమ వెల్లడి చేయబడుతుంది.” (యెష. 40:5) ఎలా? యేసు భూమ్మీదకు వచ్చినప్పుడు యెహోవాకు ఎంత పరిపూర్ణమైన ప్రతినిధిగా ఉన్నాడంటే ఒకరకంగా యెహోవాయే భూమ్మీదకు వచ్చాడా అన్నట్టుగా అనిపించింది.—యోహా. 12:45.
13. మనం యేసును ఎలా అనుకరించవచ్చు?
13 యేసులాగే మనం కూడా యెహోవాకు సాక్షులం. మనం యెహోవా పేరు పెట్టుకున్నాం. మనం కలిసిన ప్రతీఒక్కరికి యెహోవా చేసిన అద్భుతమైన పనుల్ని చెప్తాం. అయితే దీన్ని చక్కగా చేయాలంటే, యెహోవా పేరును పవిత్రపర్చడంలో యేసుకున్న పాత్ర గురించి కూడా వాళ్లకు చెప్పాలి. (అపొ. 1:8) యేసే మొట్టమొదటి యెహోవాసాక్షి! ఆయన నాయకత్వంలోనే మనం నడుస్తున్నాం. (ప్రక. 1:5) అయితే, యెహోవా పేరుని మనం విలువైనదిగా చూస్తున్నామని ఇంకెలా చూపించవచ్చు?
మనం యెహోవా పేరుకు ఎంత విలువ ఇస్తున్నాం?
14. కీర్తన 105:3 ప్రకారం, యెహోవా పేరు గురించి మనకు ఎలా అనిపిస్తుంది?
14 యెహోవా పేరునుబట్టి మనం గర్వపడతాం. (కీర్తన 105:3 చదవండి.) తన పేరు గురించి గొప్పలు చెప్పుకునేవాళ్లను చూస్తే యెహోవాకు చాలా సంతోషం అనిపిస్తుంది. (యిర్మీ. 9:23, 24; 1 కొరిం. 1:31; 2 కొరిం. 10:17) యెహోవా పేరు గురించి గొప్పలు చెప్పుకోవడం అంటే మన దేవునిగా యెహోవాను చూసి మనం గర్వపడతాం. ఆయన పేరును ఘనపర్చడం, ఆయన చేసే పనులన్నిటి గురించి చెప్పడం మనకు దొరికిన ఒక గొప్ప అవకాశంగా చూస్తాం. మనతోపాటు పనిచేసేవాళ్లకు, క్లాస్‌మేట్స్‌కి, ఇరుగు పొరుగువాళ్లకు, ఇంకా వేరేవాళ్లకు మనం యెహోవాసాక్షులం అని చెప్పుకోవడానికి అస్సలు సిగ్గుపడకూడదు! మనం యెహోవా పేరును ఎవ్వరికీ చెప్పొద్దని సాతాను అనుకుంటున్నాడు. (యిర్మీ. 11:21; ప్రక. 12:17) నిజానికి, ప్రజలందరూ యెహోవా పేరును మర్చిపోవాలని సాతాను, అతని అబద్ధ ప్రవక్తల చిరకాల కోరిక. (యిర్మీ. 23:26, 27) కానీ యెహోవా పేరుమీద మనకున్న ఇష్టం బట్టి “రోజంతా” ఆనందిస్తాం.—కీర్త. 5:11; 89:16.
15. యెహోవా పేరును ఉపయోగించడం అంటే ఏంటి?
15 మనం యెహోవా పేరును ఉపయోగించడం మానం. (యోవే. 2:32; రోమా. 10:13, 14) యెహోవా పేరును ఉపయోగించడం అంటే కేవలం ఆ పేరు తెలుసుకోవడం లేదా దాన్ని పలకడం మాత్రమే కాదు. మనం దేవుణ్ణి ఒక వ్యక్తిగా తెలుసుకుంటాం, ఆయన్ని నమ్ముతాం, సహాయం కోసం, నిర్దేశం కోసం ఆయనవైపు చూస్తాం. (కీర్త. 20:7; 99:6; 116:4; 145:18) అంతేకాదు ఆయన పేరు గురించి, లక్షణాల గురించి వేరేవాళ్లకు చెప్తాం. వాళ్లు తమ జీవితాల్లో మార్పులు చేసుకుని యెహోవాను సంతోషపెట్టేలా బ్రతకడం నేర్పిస్తాం.—యెష. 12:4; అపొ. 2:21, 38.
16. సాతాను అబద్ధికుడని ఎలా నిరూపించవచ్చు?
16 యెహోవా పేరు కోసం కష్టాన్ని ఇష్టంగా సహిస్తాం. (యాకో. 5:10, 11) కష్టాలు వచ్చినప్పుడు మనం యెహోవాకు నమ్మకంగా ఉంటే సాతాను అబద్ధికుడని నిరూపిస్తాం. యోబు రోజుల్లో యెహోవాను ఆరాధించేవాళ్ల గురించి సాతాను ఈ నింద వేశాడు: “తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తనకున్నవన్నీ మనిషి ఇచ్చేస్తాడు.” (యోబు 2:4) అంటే పరిస్థితులన్నీ బాగున్నప్పుడే యెహోవాను ఆరాధిస్తామని సాతాను నిందించాడు. ఒకవేళ కష్టాలు వస్తే యెహోవాను వదిలేస్తాం అని చెప్పాడు. ఆ నింద పచ్చి అబద్ధం అని యోబు నమ్మకంగా ఉండి నిరూపించాడు. మనల్ని కూడా సాతాను ఎలాంటి కష్టాల్లో నెట్టేసినా, మనం యెహోవాను అస్సలు వదిలి పెట్టమని నిరూపించుకునే అవకాశం మనకు ఉంది. అంతేకాదు, తన సొంత పేరును బట్టి యెహోవా మనల్ని కాపాడతాడనే గట్టి నమ్మకంతో ఉండవచ్చు.—యోహా. 17:11.
17. మొదటి పేతురు 2:12 లో ఉన్నట్టు మనం యెహోవా పేరుకు ఇంకా ఏ విధంగా ఘనత తేవచ్చు?
17 మనం యెహోవా పేరును గౌరవిస్తాం. (సామె. 30:9; యిర్మీ. 7:8-11) ప్రజలకు మనం యెహోవాసాక్షులం అని తెలుసు కాబట్టి మనం చేసే పనులు ఆయన పేరుకు ఘనత తెస్తాయి లేదా అపకీర్తి తెస్తాయి. (1 పేతురు 2:12 చదవండి.) కాబట్టి మనం మాటల్లో, పనుల్లో యెహోవాను స్తుతించడానికి చేయగలిగినదంతా చేద్దాం. ఇలా మనం అపరిపూర్ణులమైనా సరే, మనకున్న సామర్థ్యాలన్నీ ఉపయోగించి యెహోవా పేరును మహిమపరుస్తాం.
18. యెహోవా పేరే మనకు అన్నిటికన్నా ప్రాముఖ్యమని మనం ఇంకా ఏవిధంగా కూడా చూపించవచ్చు? (అధస్సూచి కూడా చూడండి.)
18 మనం మన సొంత పేరుకన్నా యెహోవా పేరు గురించే ఎక్కువ ఆలోచిస్తాం. (కీర్త. 138:2) ఎందుకిది చాలా ప్రాముఖ్యం? ఎందుకంటే, యెహోవా పేరుమీద మనకున్న ప్రేమ వల్ల కొన్నిసార్లు నలుగురిలో మన పేరు పాడవ్వవచ్చు.a యెహోవా పేరును ఘనపర్చడం కోసం యేసు ఒక నేరస్తుడు అనే నిందతో, అవమానకరంగా చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. వేరేవాళ్లు తన గురించి ఏం అనుకుంటారో అని యేసు అతిగా ఆందోళనపడలేదు లేదా బాధపడలేదు. ఆయన ‘అవమానాన్ని లెక్కచేయలేదు.’ (హెబ్రీ. 12:2-4) ఆయన దృష్టంతా దేవుని ఇష్టం చేయడం మీదే ఉంది.—మత్త. 26:39.
19. యెహోవా పేరు గురించి మీకు ఏం అనిపిస్తుంది? ఎందుకు?
19 యెహోవా పేరునుబట్టి మనం గర్వపడతాం. యెహోవాసాక్షులని పిలవబడడం మనకు ఒక గొప్ప గౌరవం. అందుకే దానికోసం మనం ఎలాంటి నిందను భరించడానికైనా సిద్ధపడతాం. మన సొంత పేరుకన్నా కూడా యెహోవా పేరే మనకు అన్నిటికన్నా ముఖ్యం. కాబట్టి సాతాను మనమీద ఎలా విరుచుకుపడ్డా యెహోవా పేరును మహిమపరుస్తూనే ఉండాలని గట్టిగా నిర్ణయించుకుందాం! అప్పుడు యేసుక్రీస్తులాగే మనకు కూడా యెహోవా పేరే అన్నిటికన్నా ముఖ్యమని నిరూపిస్తాం!
పాట 10 మన దేవుడైన యెహోవాను స్తుతించండి!
a ఎంతో నమ్మకస్థుడైన యోబు కూడా తన ముగ్గురు స్నేహితులు తన పేరు మీద నింద వేసినప్పుడు సరిగ్గా ఆలోచించలేకపోయాడు. మొదట్లో తన పిల్లలు, ఆస్తులు పోయినా “యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు తప్పు చేశాడని నిందించలేదు.” (యోబు 1:22; 2:10) కానీ, యోబు ఏదో తప్పు చేయడం వల్లే ఇదంతా జరుగుతుంది అన్నప్పుడు మాత్రం తనను తాను సమర్థించుకోవడానికి “వెర్రిమాటలు” మాట్లాడాడు. దేవుని పేరును పవిత్రపర్చే బదులు, తన పేరును సమర్థించుకోవడానికే యోబు ప్రయత్నించాడు.—యోబు 6:3; 13:4, 5; 32:2; 34:5.