కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w25 ఆగస్టు పేజీలు 14-19
  • యెహోవా మిమ్మల్ని క్షమించాడని నమ్మండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యెహోవా మిమ్మల్ని క్షమించాడని నమ్మండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా మనల్ని క్షమించాడని ఎందుకు నమ్మాలి?
  • యెహోవా మనల్ని క్షమించాడని నమ్మడానికి ఏది సహాయం చేస్తుంది?
  • యెహోవా గుర్తుపెట్టుకున్న వాటిని మీరు మర్చిపోకండి
  • మీ మనసును ఒప్పిస్తూ ఉండండి
  • యెహోవా మిమ్మల్ని క్షమిస్తున్నాడు—మీరెలా ప్రయోజనం పొందవచ్చు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • యెహోవా, “క్షమించుటకు సిద్ధమైన మనస్సుగల” దేవుడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • “క్షమించడానికి సిద్ధంగా” ఉండే దేవుడు
    యెహోవాకు దగ్గరవ్వండి
  • యెహోవా అందరికంటే గొప్పగా క్షమిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
w25 ఆగస్టు పేజీలు 14-19

అధ్యయన ఆర్టికల్‌ 34

పాట 3 మా బలం, మా నిరీక్షణ, మా ధైర్యం

యెహోవా మిమ్మల్ని క్షమించాడని నమ్మండి

“నువ్వు నా తప్పును, నా పాపాల్ని క్షమించావు.”—కీర్త. 32:5.

ముఖ్యాంశం

యెహోవా మనల్ని క్షమించాడని ఎందుకు నమ్మాలో, పశ్చాత్తాపం చూపించిన పాపుల్ని ఆయన క్షమిస్తాడనే భరోసా బైబిలు ఎలా ఇస్తుందో చూస్తాం.

1-2. పశ్చాత్తాపం చూపించినవాళ్లు ఎలాంటి ఉపశమనం పొందుతారు? (చిత్రం కూడా చూడండి.)

గతంలో చేసిన పాపాల వల్ల నలిగిపోవడం అంటే ఏంటో దావీదుకు బాగా తెలుసు. (కీర్త. 40:12; 51:3; పైవిలాసం) ఆయన తన జీవితంలో ఎన్నో పెద్దపెద్ద తప్పులు చేశాడు. కానీ మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడడం వల్ల యెహోవా ఆయన్ని క్షమించాడు. (2 సమూ. 12:13) అలా యెహోవా క్షమించడం వల్ల మనసుకు ఎంత హాయిగా ఉంటుందో దావీదు అర్థం చేసుకున్నాడు.—కీర్త. 32:1.

2 యెహోవా పెద్ద మనసుతో మన పాపాల్ని క్షమించినప్పుడు, మన మనసుకు కలిగే హాయిని దావీదులాగే మనమూ రుచిచూడవచ్చు. మనం ఎంత పెద్ద పాపం చేసినా, ఆ పాపాన్ని ఒప్పుకుని, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి, దాని జోలికి మళ్లీ వెళ్లకుండా ఉంటే, యెహోవా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడని తెలుసుకోవడం ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. (సామె. 28:13; అపొ. 26:20; 1 యోహా. 1:9) యెహోవా ఒక్కసారి మన పాపాల్ని క్షమించాడంటే, మనం అసలు ఆ పాపమే చేయలేదన్నట్టుగా చూస్తాడు. అది మనకు ఎంత భరోసాను ఇస్తుందో కదా!—యెహె. 33:16.

దావీదు రాజు వసారాలో (బాల్కనీలో) కూర్చుని వీణ వాయిస్తూ, పాటలు పాడుతున్నాడు.

యెహోవా క్షమాపణ గురించి దావీదు రాజు ఎన్నో కీర్తనలు రాశాడు (1-2 పేరాలు చూడండి)


3-4. ఒక సిస్టర్‌కి బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా ఏమనిపించింది? ఈ ఆర్టికల్‌లో ఏం చూస్తాం?

3 కొన్నిసార్లు యెహోవా తమను క్షమించాడని నమ్మడం కొంతమందికి కష్టంగా ఉండొచ్చు. సత్యంలోనే పుట్టిపెరిగిన జెన్నిఫర్‌ అనే సిస్టర్‌ అనుభవం చూడండి. ఆమె టీనేజీలో ఉన్నప్పుడు చాలా చెడు తిరుగుళ్లు తిరిగింది. ఇంట్లో ఒకలా, బయట ఒకలా బ్రతికింది. సంవత్సరాల తర్వాత, ఆమె మనసు యెహోవా వైపు మళ్లింది. ఆ తర్వాత బాప్తిస్మం తీసుకుంది. ఆమె ఇలా చెప్తుంది: “ఒకప్పుడు నా జీవితమంతా డబ్బు చుట్టూ, లైంగిక పాపం చుట్టే తిరిగింది. నేను విపరీతంగా తాగేదాన్ని, కోపంతో ఊగిపోయేదాన్ని. అయితే, నేను పశ్చాత్తాపపడి, యెహోవాను క్షమాపణ అడిగితే, యేసుక్రీస్తు విమోచన క్రయధనం నా పాపాల్ని కడిగేస్తుందని నాకు తెలుసు. కానీ ఇప్పటికీ యెహోవా నన్ను క్షమించాడని నా మనసును మాత్రం ఒప్పించలేకపోతున్నాను.”

4 మీరు గతంలో చేసిన పాపాల్ని యెహోవా క్షమించాడని మీ మనసును ఒప్పించడం కొన్నిసార్లు కష్టంగా ఉందా? యెహోవా తన కరుణతో మనల్ని క్షమించాడని, దావీదులాగే మనమూ నమ్మాలని ఆయన కోరుకుంటున్నాడు. యెహోవా మనల్ని క్షమించాడని ఎందుకు నమ్మాలో, అలా నమ్మడానికి మనకు ఏది సహాయం చేస్తుందో ఈ ఆర్టికల్‌లో చూస్తాం.

యెహోవా మనల్ని క్షమించాడని ఎందుకు నమ్మాలి?

5. మనం ఏం నమ్మాలని సాతాను కోరుకుంటున్నాడు? ఒక ఉదాహరణ చెప్పండి.

5 యెహోవా మనల్ని క్షమించాడని నమ్మడం వల్ల, సాతాను వేసే ఒక ఎత్తుకు మనం చిత్తవ్వకుండా ఉంటాం. మనం యెహోవా సేవ ఆపేలా చేయడానికి సాతాను ఏం చేయడానికైనా వెనకాడడని గుర్తుంచుకోండి. దానికోసం మనం క్షమించరాని పాపాల్ని చేశామని నమ్మేలా సాతాను ప్రయత్నిస్తాడు. కొరింథు సంఘంలో లైంగిక పాపం చేసి, సంఘం నుండి తొలగించబడిన వ్యక్తి గురించి ఆలోచించండి. (1 కొరిం. 5:1, 5, 13) ఆయన పశ్చాత్తాపం చూపించిన తర్వాత కూడా, సంఘంలో ఉన్నవాళ్లు ఆయన్ని క్షమించకూడదని, తిరిగి సంఘంలోకి చేర్చుకోకూడదని సాతాను కోరుకున్నాడు. అదే సమయంలో పశ్చాత్తాపం చూపించిన వ్యక్తి కూడా, తనను సంఘంలోవాళ్లే క్షమించకపోతే యెహోవా అస్సలుకే క్షమించడని, “తీవ్రమైన దుఃఖంలో” మునిగిపోయి దేవుని సేవ ఆపేయాలని సాతాను కోరుకున్నాడు. సాతాను గానీ, అతని ఎత్తులు గానీ ఇప్పటికీ మారలేదు. కానీ మంచి విషయం ఏంటంటే, అతని “పన్నాగాలు మనకు తెలియనివి కావు.”—2 కొరిం. 2:5-11.

6. తప్పుచేశామనే బాధతో నలిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి?

6 యెహోవా మనల్ని క్షమించాడని నమ్మడం వల్ల, తప్పుచేశామనే బాధతో నలిగిపోకుండా ఉండగలుగుతాం. మనం ఏదైనా పాపం చేసినప్పుడు బాధతో నలిగిపోవడం సహజమే. (కీర్త. 51:17) అది మంచిది కూడా. మన తప్పుదిద్దుకొని, మంచి వైపు అడుగులు వేసేలా మనస్సాక్షి సహాయం చేస్తుంది. (2 కొరిం. 7:10, 11) అయితే, మనం పశ్చాత్తాపం చూపించిన చాలాకాలం తర్వాత కూడా బాధతో నలిగిపోతూ ఉంటే, నిరుత్సాహంలో కూరుకుపోయి యెహోవా సేవను ఆపేసే ప్రమాదం ఉంది. యెహోవా మనల్ని క్షమించాడని నమ్మినప్పుడు, తప్పుచేశామనే బాధను వెనక్కి నెట్టి, దాన్ని ఎక్కడుంచాలో అక్కడ ఉంచుతాం. ఆ తర్వాత మంచి మనస్సాక్షితో, మనసు నిండా సంతోషంతో యెహోవా సేవలో ముందుకు సాగుతాం. (కొలొ. 1:10, 11; 2 తిమో. 1:3) అయితే, దేవుడు మనల్ని క్షమించాడని నమ్మడానికి మనం ఏం చేయవచ్చు?

యెహోవా మనల్ని క్షమించాడని నమ్మడానికి ఏది సహాయం చేస్తుంది?

7-8. యెహోవా మోషేకు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు? అది మనలో ఏ ధైర్యాన్ని నింపుతుంది? (నిర్గమకాండం 34:6, 7)

7 యెహోవా తన గురించి తాను ఏం చెప్పుకున్నాడో ఆలోచించండి. ఉదాహరణకు, సీనాయి పర్వతం దగ్గర మోషేతో యెహోవా ఏం చెప్పాడో గమనించండి.a (నిర్గమకాండం 34:6, 7 చదవండి.) తన లక్షణాల గురించి, తన పనుల గురించి చెప్పుకోవడానికి చాలా విషయాలున్నా, యెహోవా తననుతాను “కరుణ, కనికరం గల దేవుడు” అని చెప్పుకున్నాడు. మరి అలాంటి దేవుడు, ఎవరైనా పాపం చేసి, నిజంగా పశ్చాత్తాపపడితే క్షమించకుండా ఉండగలడా? అలా క్షమించకపోతే ఆయనకు కరుణ, కనికరం లేనట్టు అవుతుంది. యెహోవా అలా క్షమించకుండా ఉండడం అసంభవం!

8 యెహోవా అబద్ధం చెప్పడు. ఆయన కనికరం చూపిస్తాను అన్నాడంటే, కనికరం చూపిస్తాడంతే! ఎందుకంటే ఆయన సత్యవంతుడైన దేవుడు. (కీర్త. 31:5) ఆయన ఇచ్చిన మాటను మనం కళ్లు మూసుకుని నమ్మవచ్చు! ఒకవేళ మీరు గతం తాలూకు పాపాల వల్ల, బాధతో నలిగిపోతుంటే ఇలా ఆలోచించుకోండి: ‘యెహోవా కరుణ, కనికరంగల దేవుడని, పశ్చాత్తాపం చూపిస్తే ఎవ్వరినైనా క్షమిస్తాడని నేను నమ్ముతున్నానా? ఆ నమ్మకం నాకు ఉందంటే, ఆయన నన్ను కూడా క్షమిస్తాడు అన్నట్టేగా!’

9. యెహోవా మన పాపాల్ని క్షమించడం గురించి కీర్తన 32:5 ఏం చెప్తుంది?

9 యెహోవా ఎలా క్షమిస్తాడు అనే దానిగురించి బైబిలు ఏం చెప్తుందో లోతుగా ఆలోచించండి. ఉదాహరణకు, దావీదు యెహోవా క్షమాపణ గురించి ఏం రాశాడో ఆలోచించండి. (కీర్తన 32:5 చదవండి.) “నువ్వు నా తప్పును, నా పాపాల్ని క్షమించావు” అని దావీదు అన్నాడు. “క్షమించు” అని అనువదించబడిన గ్రీకు పదానికి “పైకి ఎత్తడం,” “తీసుకెళ్లడం” అనే అర్థాలు ఉన్నాయి. అంటే యెహోవా దావీదును క్షమించినప్పుడు, ఒకరకంగా ఆయన చేసిన పాపాల్ని పైకి ఎత్తాడు లేదా వాటిని తీసుకెళ్లిపోయాడు. (కీర్త. 32:2-4) దానివల్ల అప్పటివరకు దావీదు మోస్తున్న ఆ పాపం తాలూకు భారాన్ని ఆయన దింపేసుకోగలిగాడు. మన విషయంలో కూడా అదే జరగవచ్చు. మన తప్పుల విషయంలో నిజంగా పశ్చాత్తాపపడినప్పుడు, యెహోవా అప్పటికే పైకెత్తేసి, మన నుండి తీసుకెళ్లిపోయిన పాపం తాలూకు భారాన్ని మనం మోస్తూ ఉండాల్సిన అవసరంలేదు!

10-11. “క్షమించడానికి సిద్ధంగా” ఉంటాడు అనే మాటలు యెహోవా గురించి ఏం చెప్తున్నాయి? (కీర్తన 86:5)

10 కీర్తన 86:5 చదవండి. దావీదు ఇక్కడ, యెహోవా “క్షమించడానికి సిద్ధంగా” ఉండే దేవుడు అని అన్నాడు. ఆ మాట గురించి ఒక బైబిలు రెఫరెన్స్‌ పుస్తకం ఇలా చెప్తుంది: “యెహోవా క్షమించే దేవుడు, అది ఆయన మనస్తత్వం.” క్షమించడం యెహోవా మనస్తత్వం అని ఎందుకు చెప్పవచ్చు? ఆ వచనంలోని రెండో భాగం ఇలా చెప్తుంది: “నీకు మొరపెట్టే వాళ్లందరి మీద అపారమైన విశ్వసనీయ ప్రేమ చూపిస్తావు.” అవును, ముందటి ఆర్టికల్‌లో మనం నేర్చుకున్నట్టు, యెహోవాకు ఉన్న విశ్వసనీయ ప్రేమవల్లే కొలవలేని, తరగని ఒక దగ్గరి బంధాన్ని ఆయన తన ఆరాధకులతో ఏర్పరచుకున్నాడు. ఆయనకున్న విశ్వసనీయ ప్రేమవల్లే, పశ్చాత్తాపం చూపించిన పాపులందర్నీ “ధారాళంగా క్షమిస్తాడు.” (యెష. 55:7, అధస్సూచి) యెహోవా మిమ్మల్ని క్షమించాడని నమ్మడం మీకు కష్టంగా ఉంటే ఇలా ప్రశ్నించుకోండి: ‘యెహోవా క్షమించే దేవుడని, పశ్చాత్తాపం చూపించే వాళ్లందర్నీ క్షమించడానికి సిద్ధంగా ఉంటాడని నేను నమ్ముతున్నానా? అలాగైతే ఆయన నన్ను కూడా క్షమిస్తాడు అన్నట్టేగా!’

11 మనం పుట్టుకతోనే పాపులం అని యెహోవాకు తెలుసు. కాబట్టి ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు. అది తెలుసుకోవడం మనకు ఎంత ఓదార్పునిస్తుందో కదా! (కీర్త. 139:1, 2) ఈ విషయం, దావీదు రాసిన ఇంకో కీర్తన నుండి మనకు అర్థమౌతుంది. అది యెహోవా మనల్ని క్షమిస్తున్నాడని నమ్మడానికి సహాయం చేస్తుంది.

యెహోవా గుర్తుపెట్టుకున్న వాటిని మీరు మర్చిపోకండి

12-13. కీర్తన 103:14 ప్రకారం, యెహోవా మన గురించి ఏం గుర్తుపెట్టుకుంటాడు? దానివల్ల ఏం చేస్తాడు?

12 కీర్తన 103:14 చదవండి. “మనం మట్టివాళ్లమని ఆయన గుర్తుచేసుకుంటాడు” అని దావీదు యెహోవా గురించి చెప్పాడు. ఆ మాటల్నిబట్టి, యెహోవా పశ్చాత్తాపం చూపించినవాళ్లను క్షమించడానికి ఎందుకు సిద్ధంగా ఉంటాడో ఒక కారణం అర్థమౌతుంది. మనం పాపులమని ఆయన ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాడు. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి దావీదు మాటల్ని కాస్త లోతుగా చూద్దాం.

13 “మనం ఎలా తయారుచేయబడ్డామో” యెహోవాకు తెలుసని కూడా దావీదు అన్నాడు. యెహోవా ఆదామును “నేల మట్టితో” చేశాడు. అంటే, పరిపూర్ణ మనుషులకు కూడా సహజంగానే కొన్ని పరిమితులు ఉంటాయని ఆయనకు తెలుసు. ఉదాహరణకు, వాళ్లు ప్రాణాలతో ఉండాలంటే తినాలి, నిద్రపోవాలి, ఊపిరి పీల్చుకోవాలి. (ఆది. 2:7) అయితే, ఆదాముహవ్వలు పాపం చేసినప్పుడు, “మనం మట్టివాళ్లం” అనే మాటకు ఇంకో అర్థం వచ్చింది. వాళ్ల పిల్లలుగా మనం పాపాన్ని వారసత్వంగా పొందాం కాబట్టి, తప్పుచేయాలనే కోరిక మనలో బలంగా ఉంటుంది. అయితే, మనం పాపులం అని యెహోవాకు తెలవడం మాత్రమే కాదు, దాన్ని “గుర్తుచేసుకుంటాడు” అని దావీదు చెప్పాడు. ఇక్కడ “గుర్తుచేసుకుంటాడు” అని ఉపయోగించిన హీబ్రూ పదానికి, యెహోవా ఏదో శిక్షిస్తాడు అని కాదుగానీ, మనకు సహాయం చేయడానికి చర్య తీసుకుంటాడని అర్థం. అంటే, ఒక రకంగా దావీదు మాటల్ని ఇలా అర్థం చేసుకోవచ్చు: మనం అప్పుడప్పుడు తప్పులు చేస్తామని యెహోవాకు తెలుసు. అలా తప్పటడుగులు వేసినప్పుడు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడితే, ఆయన కరుణతో మనల్ని క్షమిస్తాడు.—కీర్త. 78:38, 39.

14. (ఎ) యెహోవా మనల్ని ఏ స్థాయిలో క్షమిస్తాడని దావీదు వివరించాడు? (కీర్తన 103:12) (బి) యెహోవా మనల్ని క్షమించాడంటే వాటి ఛాయలు ఏవీ లేకుండా చేస్తాడని దావీదు ఉదాహరణ ఎలా చూపిస్తుంది? (“యెహోవా క్షమిస్తాడు, తప్పును మర్చిపోతాడు” అనే బాక్స్‌ చూడండి)

14 యెహోవా మన పాపాల్ని ఏ స్థాయిలో క్షమిస్తాడు? (కీర్తన 103:12 చదవండి.) యెహోవా క్షమాపణ గురించి దావీదు ఇలా చెప్పాడు: ఆయన మన పాపాల్ని “పడమటికి తూర్పు ఎంత దూరంలో ఉంటుందో” అంతదూరంలో ఉంచుతాడు. తూర్పు, పడమరకు ఊహకందనంత దూరంలో ఉంటుంది. ఆ రెండు దిక్కులు ఎప్పటికీ కలవవు. ఇది యెహోవా క్షమాపణ గురించి మనకు ఏం చెప్తుంది? ఒక రెఫరెన్స్‌ పుస్తకం దాన్ని ఇలా ఉదహరిస్తుంది: “యెహోవా మన పాపాల్ని ఎంత దూరంలో ఉంచుతాడంటే వాటి వాసన, గుర్తులు, ఆనవాలు ఏవీ లేకుండా వాటి జ్ఞాపకాలతో సహా పూర్తిగా తుడిచేస్తాడు.” సాధారణంగా, మనకు ఏదైనా వాసన తగలగానే దాని తాలూకు జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అయితే, యెహోవా మనల్ని క్షమించాడంటే, మన పాపం తాలూకు ఛాయలేవీ లేకుండా తన జ్ఞాపకంలో నుండి పూర్తిగా తుడిచేస్తాడు. మళ్లీ వాటిని ఎప్పుడూ ఎత్తి చూపించి, శిక్షించడు.—యెహె. 18:21, 22; అపొ. 3:19.

చిత్రాలు: 1. బత్షెబ స్నానం చేస్తుంటే మేడ మీద నుండి దావీదు రాజు చూస్తున్నాడు. 2. ఆయన పట్టుదలగా ప్రార్థన చేస్తున్నాడు. 3. ఆయన బాగా ఆలోచించి కీర్తనలు రాస్తున్నాడు.

యెహోవా క్షమిస్తాడు, తప్పును మర్చిపోతాడు

యెహోవా మనల్ని క్షమించినప్పుడు, ఆయన మన పాపాల్ని మర్చిపోతాడు. అంటే, వాటిని గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో మనల్ని శిక్షించడు. (యెష. 43:25) దావీదు రాజు గురించే ఆలోచించండి. మనం పెద్దపెద్ద తప్పులు చేసినా, తిరిగి యెహోవాతో మంచి స్నేహం కలిగి ఉండవచ్చని దావీదు ఉదాహరణ చూపిస్తుంది.

దావీదు వ్యభిచారం, హత్య లాంటి ఘోరమైన పాపాలు చేశాడు. కానీ ఆయన మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడ్డాడు కాబట్టి, యెహోవా ఆయన్ని క్షమించాడు. దావీదు యెహోవా ఇచ్చిన దిద్దుబాటును తీసుకున్నాడు, తన మార్గాన్ని సరిచేసుకున్నాడు, ఆ తర్వాత సత్యారాధన నుండి అస్సలు పక్కకు తిరగలేదు.—2 సమూ. 11:1-27; 12:13.

దావీదు జీవితం గురించి యెహోవా గుర్తుచేసుకుంటూ సొలొమోనుతో ఇలా అన్నాడు: “నీ తండ్రి దావీదులా నా ఎదుట యథార్థ హృదయంతో, నిజాయితీగా నడుచుకో.” (1 రాజు. 9:4, 5) ఇక్కడ, యెహోవా దావీదు చేసిన పాపాల గురించి అసలు చెప్పలేదని గమనించారా. బదులుగా, దావీదు జీవితాన్ని రెండు ముక్కల్లో చెప్తూ ఆయన యథార్థ హృదయంతో, నిజాయితీతో బ్రతికాడని యెహోవా చెప్పాడు. అలాగే దావీదు చూపించిన నమ్మకానికి యెహోవా ఆయన్ని “మెండుగా ఆశీర్వదించాడు.”—కీర్త. 13:6.

మనకేంటి పాఠం? యెహోవా మనల్ని క్షమిస్తే, ఆయన క్షమించేసిన తప్పులను చూడడు గానీ, మనల్ని దీవించడానికి మనలో ఉన్న మంచిని చూస్తాడు. (హెబ్రీ. 11:6) కాబట్టి, యెహోవా మర్చిపోయిన మన పాపాల్ని మనం గుర్తుచేసుకుంటూ కూర్చోవద్దు!

15. ఒకప్పుడు పాపం చేశామని బాధపడుతూ ఆ భారాన్ని మోస్తూ ఉంటే మనం ఏం చేయాలి?

15 యెహోవా మనల్ని క్షమిస్తాడని నమ్మడానికి, 103వ కీర్తనలో దావీదు అన్న మాటలు ఎలా సహాయం చేస్తాయి? ఒకప్పుడు పాపం చేశామనే బాధతో ఆ భారాన్ని మోస్తూ ఉంటే, మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘యెహోవా గుర్తుపెట్టుకున్న విషయాన్ని నేను మర్చిపోతున్నానా? అంటే నేను పాపంలోనే పుట్టి పెరిగానని, నాలాంటి పాపుల్ని ఆయన క్షమిస్తాడని నేను మర్చిపోతున్నానా? యెహోవా మర్చిపోవాలని అనుకునే విషయాన్ని నేను గుర్తు పెట్టుకుంటున్నానా? అంటే యెహోవా క్షమించేసిన పాపాల్ని నేను ఇంకా గుర్తుచేసుకుంటూ బాధపడుతున్నానా?’ మనం ఒకప్పుడు చేసిన పాపాల మీద యెహోవా అస్సలు మనసుపెట్టడు. మనం కూడా ఆయనలాగే ఉండాలి. (కీర్త. 130:3) యెహోవా మనల్ని క్షమించాడని నమ్మినప్పుడు, మనల్ని మనం క్షమించుకోగలుగుతాం. గతంలోనే బ్రతకకుండా భవిష్యత్తువైపు సాగుతాం.

16. గతంలో చేసిన పాపాల గురించి బాధపడుతూ కూర్చోవడం ప్రమాదమని ఉదాహరణతో చెప్పండి. (చిత్రం కూడా చూడండి.)

16 మనం గతంలో చేసిన పాపాల గురించి అదేపనిగా బాధపడుతూ కూర్చోవడాన్ని, ఈ ఉదాహరణతో పోల్చవచ్చు. కారు నడుపుతున్నప్పుడు వెనకాల వచ్చే వాహనాల్ని చూడడానికి కారు మధ్యలో ఉన్న అద్దాన్ని అప్పుడప్పుడు చూడడం మంచిదే. కానీ మధ్యలో ఉన్న అద్దాన్ని అదేపనిగా చూస్తూ నడిపితే ప్రమాదాలు జరుగుతాయి. అలాగే, అప్పుడప్పుడు మనం గతంలో చేసిన పాపాల గురించి ఆలోచించడం మంచిదే. వాటినుండి మనం పాఠాలు నేర్చుకోగలుగుతాం, అవి మళ్లీ చేయకూడదని గట్టిగా నిర్ణయించుకోగలుగుతాం. కానీ గతంలో చేసిన పాపాల గురించి అదేపనిగా ఆలోచిస్తూ కూర్చుంటే, అవి మనల్ని యెహోవా సేవలో ముందుకు వెళ్లనివ్వకుండా అక్కడే ఆపేస్తాయి. అలా కాకుండా, మన ముందు ఉన్న భవిష్యత్తును చూస్తూ ప్రయాణించాలి. మనం దేవుడు మాటిచ్చిన కొత్తలోకం అనే దారిలో ప్రయాణిస్తున్నాం. ఆ కొత్తలోకంలో, గతం తాలూకు జ్ఞాపకాలేవీ మన “హృదయంలో” ఉండవు.—యెష. 65:17; సామె. 4:25.

వంపులు తిరిగిన రోడ్డులో కారు నడుపుతూ, కారు మధ్యలో ఉన్న అద్దాన్ని చూస్తున్న ఒకతను.

కారు నడిపే వ్యక్తి, కారు మధ్యలో ఉన్న అద్దాన్ని కాకుండా ముందున్న రోడ్డును చూసి నడపాలి. అదేవిధంగా, మనం గతంలో చేసిన తప్పుల గురించి కాకుండా భవిష్యత్తులో పొందబోయే దీవెనల గురించి ఆలోచించాలి (16వ పేరా చూడండి)


మీ మనసును ఒప్పిస్తూ ఉండండి

17. యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని, మనల్ని క్షమిస్తాడని మన మనసును ఒప్పిస్తూ ఉండడం ఎందుకు అవసరం?

17 యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడని, మనల్ని క్షమిస్తాడని మన మనసును ఎప్పటికప్పుడు ఒప్పిస్తూనే ఉండాలి. (1 యోహా. 3:19, అధస్సూచి) ఎందుకంటే, యెహోవా మనల్ని ప్రేమించడని, క్షమించడని నమ్మించడానికి సాతాను విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఏం చేసైనాసరే, మనం యెహోవా సేవను ఆపాలన్నదే సాతాను ఏకైక లక్ష్యం! అతనికి రోజులు దగ్గరపడ్డాయి కాబట్టి తన ప్రయత్నాలతో విరుచుకుపడతాడని మనకు తెలుసు. (ప్రక. 12:12) కాబట్టి అతన్ని అస్సలు గెలవనివ్వద్దు!

18. యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, క్షమించాడని మీ మనసును ఒప్పించడానికి మీరేం చేయవచ్చు?

18 యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే నమ్మకాన్ని పెంచుకోవడానికి, ముందటి ఆర్టికల్‌లో ఉన్న సలహాల్ని పాటించండి. యెహోవా మిమ్మల్ని క్షమించాడని మీ మనసును ఒప్పించడానికి, తన గురించి తాను ఏం చెప్పాడో ఆలోచించండి. యెహోవా ఎలా క్షమిస్తాడనే దానిగురించి బైబిలు ఏం చెప్తుందో లోతుగా ఆలోచించండి. మీరు పాపంలోనే పుట్టి పెరిగారనే విషయం యెహోవాకు తెలుసని, ఆయన మీతో దయగా వ్యవహరిస్తాడని అస్సలు మర్చిపోకండి. అలాగే, ఆయన ఒక్కసారి క్షమించాడంటే, దాని ఆనవాలతో సహా పూర్తిగా మర్చిపోతాడని గుర్తుపెట్టుకోండి. అప్పుడు యెహోవా కరుణ గురించి దావీదులాగే మీరు చాలా నమ్మకంతో ఇలా చెప్పగలుగుతారు: “‘నా తప్పును, నా పాపాల్ని క్షమించినందుకు’ థ్యాంక్యూ యెహోవా.”—కీర్త. 32:5.

మీరెలా జవాబిస్తారు?

  • యెహోవా మిమ్మల్ని క్షమించాడని ఎందుకు నమ్మాలి?

  • యెహోవా మిమ్మల్ని క్షమించాడని నమ్మడానికి ఏది సహాయం చేస్తుంది?

  • యెహోవా మిమ్మల్ని క్షమించాడని మీ మనసును ఎందుకు ఒప్పిస్తూ ఉండాలి?

పాట 1 యెహోవా గుణాలు

a అక్టోబరు 1, 2009 కావలికోట పత్రికలో ఉన్న “దేవునికి దగ్గరవ్వండి—యెహోవా తన లక్షణాలను వెల్లడిజేశాడు” అనే ఆర్టికల్‌ చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి