కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w99 5/15 పేజీలు 21-24
  • “నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము”
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవా “నీ దోషములన్నిటిని క్షమించువాడు”
  • ఆయన “నీ ప్రాణమును విమోచించుచున్నాడు”
  • యెహోవా తన ప్రజలను విమోచిస్తాడు
  • “ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి”
  • యెహోవా కనికరం మనల్ని నిరాశనుండి రక్షిస్తుంది
    కావలికోట అధ్యయన ఆర్టికల్‌ల బ్రోషుర్‌
  • మనం కలిసి యెహోవా నామాన్ని గొప్ప చేద్దాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • యెహోవాపై పూర్తి నమ్మకముంచితే సురక్షితంగా ఉన్నట్లు భావిస్తాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2011
  • మారుతున్న జీవన పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు దేవుని ఆత్మపై ఆధారపడండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
w99 5/15 పేజీలు 21-24

“నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము”

“ఇటీవలి నెలల్లో, నా పరిచర్య నిరాసక్తంగా, ఆనందం లేకుండా ఉంది” అని నాన్సీ అంటోంది.a దాదాపు పది సంవత్సరాలుగా, ఆమె పయినీరుగా, అంటే పూర్తికాల సువార్త ప్రకటించే వ్యక్తిగా పని చేస్తోంది. అయితే, “ఇలా జరగడం నాకు ఇష్టం లేదు. నేను రాజ్య సందేశాన్ని ఏదో ఒక వాస్తవాన్ని గురించి మాట్లాడుతున్నట్లు అనిపించిందే తప్ప, అది అంతగా నా హృదయం నుండి వస్తున్నట్లు లేదు. నేను ఏమి చేయాలి?” అని కూడా ఆమె అంటోంది.

కీత్‌ విషయం కూడా తీసుకోండి. ఆయన యెహోవాసాక్షుల సంఘంలో ఒక పెద్ద. “మీ మనస్సులో ఏదో ఉండి ఉండాలి. ఇది భోజన సమయం కానప్పటికీ, మీరు ఇప్పుడు చేసిన ప్రార్థనలో, భోజనానికి కృతజ్ఞతలు చెప్పారు!” అని తన భార్య తనతో అన్నప్పుడు ఆయనెంతో ఆశ్చర్యపోయారు. “నా ప్రార్థనలు చాలా యాంత్రికంగా ఉన్నాయని చూడగల్గుతున్నాను” అని కీత్‌ ఒప్పుకుంటున్నారు.

నిస్సందేహంగా, మీరు యెహోవా దేవుడిని స్తుతిస్తూ చేసే మీ వ్యక్తీకరణలు నిరుత్సాహంగా, యాంత్రికంగా ఉండాలని కోరుకోరు. బదులుగా, అవి హృదయపూర్వకంగా ఉండాలనీ, అవి కృతజ్ఞతానుభూతి నుండి వచ్చేవై ఉండాలనీ మీరు కోరుకుంటారు. అయినప్పటికీ, ఒక అనుభూతిని ఒక వస్త్రాన్ని అన్నట్లు ధరించడమో తీసివేయడమో చేయలేం. అది మనిషి అంతరంగంలోనే ఉద్భవించాలి. ఒకరు తమ హృదయంలో కృతజ్ఞతానుభూతిని ఎలా పొందగలరు? ఈ విషయంలో 103వ కీర్తన మనకు అంతర్దృష్టిని ఇస్తుంది.

103వ కీర్తనను ప్రాచీనకాలపు రాజైన దావీదు కూర్చాడు. “నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము” అనే మాటలతో ఈ కీర్తనను ప్రారంభిస్తాడు. (కీర్తన 103:1) “సన్నుతించు అనే పదం దేవుడికి వర్తిస్తుంది కనుక, దాని అర్థం, ఆయన మీదున్న ప్రగాఢ ఆప్యాయతనూ అలాగే ఆయనకు కృతజ్ఞులమన్న స్పృహనూ ఎల్లప్పుడూ సూచిస్తూ స్తుతించు” అని ఒక రెఫరెన్సు పుస్తకం చెబుతుంది. ప్రేమా మెప్పుదలలతో నిండిన హృదయంతో యెహోవాను స్తుతించాలని కోరుకుంటూ, దావీదు తన సొంత ప్రాణానికి—తనకు తాను—“యెహోవాను సన్నుతించు” అని బోధించుకున్నాడు. తను ఆరాధించే దేవుడి మీద దావీదు హృదయంలో అంతటి వాత్సల్యానుభూతిని కలిగించినది ఏమిటి?

“ఆయన [యెహోవా] చేసిన ఉపకారములలో దేనిని మరువకుము” అని అంటూ దావీదు ముందుకు వెళ్తున్నాడు. (కీర్తన 103:2) నిస్సందేహంగా, యెహోవా ఎడల కృతజ్ఞతాభావంతో ఉండడమనేది “ఆయన చేసిన ఉపకారములను” ప్రశంసాపూర్వకంగా ధ్యానించడంతో ముడిపడివుంటుంది. యెహోవా చేసిన ఏ ఉపకారములు దావీదు మనస్సులో ఖచ్చితంగా ఉన్నాయి? నిర్మలమైన రాత్రిలో, నక్షత్రాలతో నిండి ఉన్న ఆకాశం వంటి, యెహోవా దేవుడి సృష్టిని చూడడం, సృష్టికర్త ఎడల హృదయం నిండా కృతజ్ఞతా భావాన్ని నిజంగా నింపగలదు. నక్షత్రాలతో ఉన్న ఆకాశం దావీదు హృదయాన్ని బాగా స్పృశించాయి. (కీర్తన 8:3, 4; 19:1) అయితే, 103వ కీర్తనలో, యెహోవా యొక్క మరో విధమైన కార్యశీలతను దావీదు గుర్తు చేసుకుంటున్నాడు.

యెహోవా “నీ దోషములన్నిటిని క్షమించువాడు”

దావీదు ఈ కీర్తనలో, యెహోవా ప్రేమా దయలతో చేసిన కార్యాలను తిరిగిచెబుతున్నాడు. వీటిలో మొదటిదీ, అన్నింటికన్నా ముఖ్యమైనదీ అయిన దానిని సూచిస్తూ, ‘యెహోవా నీ దోషములన్నిటిని క్షమించువాడు’ అని పాడుతున్నాడు. (కీర్తన 103:3) దావీదు తన సొంత పాపభరితమైన పరిస్థితిని గురించి నిశ్చయంగా స్పృహకలిగివున్నాడు. దావీదుకు బత్షెబతో ఉన్న వ్యభిచార సంబంధాన్ని గురించి ప్రవక్తయైన నాతాను ముఖాముఖిగా మాట్లాడిన తర్వాత, “నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను” అని దావీదు ఒప్పుకున్నాడు. (కీర్తన 51:4) నలిగిన హృదయంతో, ఆయన “దేవా, నీ కృపచొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుళ్యముచొప్పున నా అతిక్రమములు తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము” అని విజ్ఞాపన చేసుకున్నాడు. (కీర్తన 51:1, 2) తను క్షమించబడ్డాడన్న భావన కలిగినందుకు దావీదుకు ఎంత కృతజ్ఞత భావం కలిగివుండవచ్చు! అపరిపూర్ణ మానవుడిగా, ఆయన తన జీవితంలో వేరే తప్పిదాలను కూడా చేశాడు, కానీ ఆయన పశ్చాత్తాపపడడంలోగానీ, మందలింపును స్వీకరించడంలోగానీ, తన మార్గాలను సరిచేసుకోవడంలోగానీ, ఎన్నడూ విఫలుడవ్వలేదు. దేవుడు తనకు చేసిన దయాపూర్వకమైన అద్భుతకార్యాలను ధ్యానించడం, దావీదు యెహోవాను స్తుతించేందుకు కదిలించింది.

మనం కూడా పాపభరితులమే కాదా? (రోమీయులు 5:12) “అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?” అని అపొస్తలుడైన పౌలు కూడా బాధపడ్డాడు. (రోమీయులు 7:22-24) యెహోవా మన ఉల్లంఘనల లెక్కను ఉంచుకోడు గనుక మనమెంత కృతజ్ఞులమై ఉండాలి! మనం పశ్చాత్తాపపడి, క్షమాపణ అడిగితే, ఆయన వాటిని సంతోషంగా చెరిపేస్తాడు.

“[యెహోవా] నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు” అని దావీదు తనకు తాను గుర్తు చేసుకుంటున్నాడు. (కీర్తన 103:3) స్వస్థపరచడమనేది పునరుద్ధరణ ప్రక్రియ కనుక, అందులో, చేసిన తప్పును క్షమించడం కన్నా ఎక్కువే ఇమిడి ఉంటుంది. “సంకటములను”—మన పద్ధతుల్లోని తప్పిదాల వల్ల కలిగే చెడు పర్యవసానాలను తొలగించడం కూడా ఇమిడి ఉంటుంది. తను చేయబోయే క్రొత్త లోకంలో, రోగం మరణం వంటి పాపం వల్ల కలిగే శారీరక పర్యవసానాలను యెహోవా నిజంగానే నిర్మూలం చేస్తాడు. (యెషయా 25:8; ప్రకటన 21:1-4) అయినప్పటికీ, దేవుడు మన ఆధ్యాత్మిక సంకటములను ఈనాడు కూడా స్వస్థపరుస్తున్నాడు. కొందరి విషయానికొస్తే, వీటిలో, వేధిస్తున్న మనస్సాక్షి, ఆయనతో సంబంధం తెగతెంపులైపోవడం ఇమిడివున్నాయి. ఈ విషయమై, మనలో ప్రతి ఒక్కరి కోసం యెహోవా ఇప్పటికే చేసిన విషయాన్ని “మరువకుము.”

ఆయన “నీ ప్రాణమును విమోచించుచున్నాడు”

“సమాధిలోనుండి నీ ప్రాణమును [యెహోవా] విమోచించుచున్నాడు” అని దావీదు పాడాడు. (కీర్తన 103:4) “సమాధి” అంటే, మానవజాతి యొక్క సామాన్య సమాధి—షియోల్‌, లేదా హేడీస్‌. దావీదు, ఇశ్రాయేలు రాజు కాకముందు కూడా ఒకసారి మృత్యు కోరల్లో పడ్డాడు. ఉదాహరణకు, ఇశ్రాయేలు రాజైన సౌలు దావీదును చంపాలనేంత ద్వేషాన్ని పెంచుకుని, ఆయనను చంపాలని ఆయా సందర్భాల్లో ప్రయత్నం చేశాడు. (1 సమూయేలు 18:9-29; 19:10; 23:6-29) ఫిలిష్తీయులు కూడా దావీదు చనిపోవాలని కోరుకున్నారు. (1 సమూయేలు 21:10-15) కానీ ప్రతిసారీ, యెహోవా ఆయనను “సమాధి” గొయ్యి నుండి తప్పించాడు. యెహోవా చేసిన ఈ కార్యాలను గుర్తుచేసుకున్నప్పుడు దావీదు హృదయం ఎంత కృతజ్ఞతాభావంతో నిండివుంటుంది!

మీ విషయమేమిటి? మీరు డిప్రెషన్‌కు లోనైన సమయాల్లో, లేదా నష్టాలను అనుభవించవలసివచ్చిన సమయాల్లో యెహోవా మిమ్మల్ని రక్షించాడా? లేదా మన కాలాల్లో, షియోల్‌ గొయ్యి నుండి తన నమ్మకస్థులైన సాక్షుల ప్రాణాలను ఆయన విమోచించినప్పటి దృష్టాంతాలు మీకు తెలిశాయా? ఈ పత్రికలోని పేజీల్లో ఆయన చేసిన విమోచన కార్యాలను గురించిన వివరణలను చదవడం మీ హృదయాన్ని తాకి ఉంటాయి. సత్య దేవుడు చేసిన ఈ కార్యాలను మెప్పుదలతో ధ్యానించడానికి సమయాన్ని ఎందుకు తీసుకోకూడదు? నిజమే, పునరుత్థాన నిరీక్షణ విషయమై యెహోవాకు కృతజ్ఞులమై ఉండేందుకు మనందరికీ కారణముంది.—యోహాను 5:28, 29; అపొస్తలుల కార్యములు 24:15.

యెహోవా మనకు జీవితాన్నీ, దాన్ని ఆస్వాదించదగినదిగా, జీవించతగినదిగా చేసేదాన్నీ రెండింటినీ ఇచ్చాడు. దేవుడు “కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు” అని దావీదు ఉద్ఘాటిస్తున్నాడు. (కీర్తన 103:4) మనకు సహాయం అవసరమున్న సమయంలో, ఆయన మనలను ఉపేక్షించక, తన దృశ్య సంస్థ ద్వారా, నియమిత సంఘ పెద్దలు, లేదా సంఘకాపరుల ద్వారా మనకు సహాయాన్ని అందించడానికి వస్తాడు. అలాంటి సహాయం, మనం ఆత్మగౌరవాన్ని, హుందాతనాన్ని పోగొట్టుకోకుండానే శోధనాత్మకమైన పరిస్థితితో వ్యవహరించగల్గేలా చేస్తుంది. క్రైస్తవ కాపరులు మంద విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు. వాళ్ళు రోగులను, కృంగిపోయినవారిని ప్రోత్సహిస్తూ, పడిపోయినవారిని లేవనెత్తేందుకు తాము చేయగల్గేదంతా చేస్తూ ఉంటారు. (యెషయా 32:1, 2; 1 పేతురు 5:2, 3; యూదా 22, 23) కాపరులు మందకు సానుభూతినీ ప్రేమనూ చూపేవారుగా ఉండేందుకు యెహోవా ఆత్మ పురికొల్పునిస్తుంది. ఆయన “కరుణాకటాక్షములు” నిజంగానే ఒక కిరీటంలా మనలను అలంకరించి, మనకు హుందాతనాన్ని ఇస్తాయి! యెహోవా చేసిన కార్యాలను ఎన్నడూ మరువకుండా, మనం ఆయననూ, ఆయన పరిశుద్ధ నామాన్నీ స్తుతించుదాం.

దావీదు తనకు తాను ప్రబోధించుకుంటూ, “పక్షిరాజు యౌవనమువలె నీ యౌవనము క్రొత్తదగు చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు” అని దావీదు పాడుతున్నాడు. (కీర్తన 103:5) యెహోవా ఇచ్చే జీవితం సంతృప్తికరమైనది, ఆనందదాయకమైనది. అంతెందుకు, సత్యమును గూర్చిన జ్ఞానమే సాటిలేని నిక్షేపం, అత్యధిక ఆనందానికి మూలం! యెహోవా మనకు ఇచ్చిన, బోధించే, శిష్యులను చేసే పని ఎంత సంతృప్తికరమైనదో ఆలోచించి చూడండి. సత్య దేవుడ్ని గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని చూపించే ఒకరిని కనుగొనడమూ, యెహోవాను తెలుసుకుని, ఆయనను స్తుతించేందుకు అతడికి సహాయపడడమూ ఎంత ఆనందదాయకమైన విషయం! అయితే, మన ప్రాంతంలో ఉన్నవాళ్ళెవరైనా విన్నా, వినకపోయినా, యెహోవా నామాన్ని పవిత్రపరచడంతో, ఆయన సర్వాధిపత్యాన్ని స్థాపించడంతో సంబంధమున్న పనిలో పాలుపంచుకోగలగడం గొప్ప ఆధిక్యతే.

దేవుడి రాజ్యాన్ని ప్రకటించేపనిలో పట్టువదలక చేస్తుండగా, అలయనివారెవరు, సొమ్మసిల్లనివారెవరు? కాని యెహోవా తన సేవకులను ఆకాశంలో ఎంతో ఎత్తుకు ఎగిరే, బలమైన రెక్కలుగల ‘పక్షిరాజుల వలె’ చేస్తూ, వారి బలాన్ని పునర్నూతనపరుస్తూ ఉంటాడు. మనం దినదిన ప్రవర్థమానంగా మన పరిచర్యను నమ్మకంగా కొనసాగించగల్గేందుకు, పరలోకమందున్న మన ప్రేమగల తండ్రి మనకు అలాంటి “బలాభివృద్ధి కలుగ”జేస్తున్నందుకు మనమెంత కృతజ్ఞులమై ఉండగలం!—యెషయా 40:29-31.

ఉదాహరణకు: క్లారా పూర్తికాల ఉద్యోగాన్ని చేస్తుంది, అలాగే ప్రతి నెల ప్రాంతీయ పరిచర్యలో దాదాపు 50 గంటలు గడుపుతుంది. “కొన్నిసార్లు నేను అలిసిపోతాను, నాతో సేవ చేసేందుకు నేను మరొకర్ని ఏర్పాటు చేసుకున్న ఏకైక కారణం చేతనే, నేను ప్రాంతీయసేవకు వెళ్ళేందుకు నన్ను నేను బలవంతపెట్టుకుంటాను. నేను ఒకసారి ప్రాంతీయ సేవ చేయడం మొదలెట్టానంటే, ఇక చైతన్యం వచ్చేస్తుంది” అని ఆమె చెబుతుంది. క్రైస్తవ పరిచర్యలో దైవిక మద్దతు వల్ల కలిగే చైతన్యాన్ని మీరు కూడా పొంది ఉండవచ్చు. ఈ కీర్తనలోని ఆరంభంలో “నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము” అని దావీదు చెప్పినట్లు మీరు కూడా చెప్పడానికి పురికొల్పబడి ఉండవచ్చు.

యెహోవా తన ప్రజలను విమోచిస్తాడు

కీర్తన రచయిత “యెహోవా నీతిక్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికి న్యాయము తీర్చును ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను” అని కూడా పాడుతున్నాడు. (కీర్తన 103:6, 7) మోషే కాలంలో, అణచివేస్తున్న ఐగుప్తీయుల క్రింద ఇశ్రాయేలీయులు ‘బాధించబడడాన్ని’ గురించి ఆయన ఆలోచించి ఉండవచ్చు. యెహోవా తాను చేయబోయే విమోచన కార్యాన్ని గురించి మోషేకు ఎలా తెలియజేశాడో ధ్యానించడం దావీదు హృదయంలో, కృతజ్ఞతానుభూతిని నింపివుండవచ్చు.

ఇశ్రాయేలీయులతో దేవుడు వ్యవహరించిన విధానాన్ని గురించి అవలోకనం చేయడం ద్వారా మనం కూడా అలాంటి కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండేందుకు పురికొల్పబడగలం. యెహోవాసాక్షులు—దేవుని రాజ్యప్రచారకులు పుస్తకంలోని 29, 30 అధ్యాయాల్లో చెప్పబడినటువంటి ఆధునిక దిన యెహోవా సేవకుల అనుభవాలను ధ్యానించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. ఆ పుస్తకంలోనూ, అలాగే వాచ్‌టవర్‌ సొసైటీ యొక్క ఇతర ప్రచురణల్లోనూ వ్రాయబడిన అనుభవాలు, ఆధునిక కాలాల్లోని సేవకులు, ఖైదునూ, జనసమూహాల చర్యలనూ, నిషేధాలనూ, కాన్‌సెంట్రేషన్‌ క్యాంపులనూ, స్లేవ్‌-లేబర్‌ క్యాంపులనూ భరించడానికి యెహోవా ఎలా సహాయం చేశాడో చూడడానికి సహాయపడతాయి. బురుండీ, లైబీరియా, రువాండా, మరియు మునుపటి యుగోస్లేవియా వంటి యుద్ధపీడిత దేశాల్లో, ఎన్నో శోధనలు ఎదురయ్యాయి. తన నమ్మకమైన సేవకులు హింసకు గురైనప్పుడెల్లా, యెహోవా హస్తం ఎల్లప్పుడూ సంరక్షించింది. ఐగుప్తునుండి విడుదల చేసిన ఉదంతాన్ని గురించి ఆలోచించడం దావీదుకు ఏమైతే చేసిందో, మన గొప్ప దేవుడైన యెహోవా చేసిన ఈ కార్యాలను గురించి ఆలోచించడం మనకు అదే చేస్తుంది.

యెహోవా దేవుడు పాపపు భారం నుండి మనలను ఎంత మృదువుగా విమోచిస్తాడో కూడా ఆలోచించండి. ‘నిర్జీవ క్రియలను విడిచి . . . మనం మన మనస్సాక్షిని శుద్ధిచేసుకోవ’డానికి ఆయన “కీస్తుయొక్క రక్తము”ను ప్రదానం చేశాడు. (హెబ్రీయులు 9:14) మనం మన పాపాల విషయమై పశ్చాత్తాపపడి, క్రీస్తు చిందించిన రక్తం ఆధారంగా క్షమాపణను అడిగినప్పుడు, దేవుడు మన నుండి మన అతిక్రమములను ‘పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం’ చేసి, మనలను తిరిగి ప్రసాదిస్తాడు. క్రైస్తవ కూటాల ద్వారా, నిర్మాణాత్మక సహవాసం ద్వారా, సంఘంలోని కాపరుల ద్వారా, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ నుండి మనం పొందే బైబిలు ఆధార ప్రచురణల ద్వారా యెహోవా ప్రదానం చేసినవాటిని గురించి తలపోయండి. (మత్తయి 24:45) యెహోవా చేసే ఈ కార్యాలన్నీ, మనకు ఆయనతో ఉన్న సంబంధాన్ని బలపరచేందుకు మనకు సహాయపడవా? “యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధిగలవాడు. . . . మన పాపములనుబట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములనుబట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు” అని దావీదు ఉద్ఘాటిస్తున్నాడు. (కీర్తన 103:8-14) యెహోవా ప్రేమపూర్వకంగా చూపే శ్రద్ధను గురించి ధ్యానించడం మనం ఆయనను మహిమపరచేందుకు, ఆయన పరిశుద్ధ నామాన్ని ఘనపరచేందుకు మనల్ని తప్పకుండా కదిలించగలదు.

“ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి”

“నిత్యదేవుడైన” యెహోవా అమర్త్యతతో పోల్చి చూస్తే, మర్త్యుడైన “నరుని ఆయువు” నిజానికి చాలా చిన్నది—“గడ్డివలె నున్నది.” కానీ దావీదు ఎంతో మెప్పుదలతో, “ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడల ననుసరించి నడచుకొను వారిమీద యెహోవాయందు భయభక్తులు గలవారిమీద ఆయన కృప యుగయుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లపిల్ల తరమున నిలుచును” అని ధ్యానిస్తున్నాడు. (ఆదికాండము 21:33; కీర్తన 103:15-18) తనకు భయపడేవారిని యెహోవా మరిచిపోడు. తగిన సమయంలో, ఆయన వారికి నిత్యజీవాన్ని ఇస్తాడు.—యోహాను 3:16; 17:3.

యెహోవా రాజత్వాన్ని గురించిన తన మెప్పుదలను వ్యక్తీకరిస్తూ, “యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచియున్నాడు. ఆయన అన్నిటిమీద రాజ్యపరిపాలనచేయుచున్నాడు” అని దావీదు అంటున్నాడు. (కీర్తన 103:19) ఇశ్రాయేలు పరిపాలన ద్వారా యెహోవా రాజత్వం కొంతకాలం ప్రత్యక్షంగా వ్యక్తీకరించబడినప్పటికీ, ఆయన సింహాసనం ఉన్నది నిజానికి పరలోకంలోనే. యెహోవా విశ్వసర్వాధికారి కావడానికి కారణం ఆయన సృష్టికర్తృత్వమే. పరలోకంలోనూ, భూమిమీదా ఆయన తన సొంత ఉద్దేశాల ప్రకారంగా దైవికమైన తన చిత్తాన్ని చేస్తాడు.

దావీదు పరలోకంలో ఉన్న దూతల గణాల్లోని జీవులకు కూడా ప్రబోధిస్తున్నాడు. “యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకులోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరు ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము” అని ఆయన పాడుతున్నాడు. (కీర్తన 103:20-22) యెహోవా తన ప్రేమపూర్వకమైన దయతో మనకు చేసిన కార్యాలను మనం అవలోకించడం ఆయనను స్తుతించేందుకు మనలను కదిలించదా? తప్పకుండా! దేవుడిని వ్యక్తిగతంగా స్తుతించడంలో మన స్వరం, నీతిమంతులైన దూతలతో సహా, స్తుతిపాటకుల శక్తివంతమైన బృందగానంలో వినిపించకుండా పోదని మనం నమ్మకం కలిగివుండవచ్చు. మనం మన పరలోక తండ్రియైన యెహోవాను గురించి ఎల్లప్పుడూ మంచిగా మాట్లాడుతూ, హృదయపూర్వకంగా ఆయనను స్తుతించుదాం. మనం, దావీదు మాటలను, “నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము” అనే మాటలను నిజంగానే హృదయానికి తీసుకుందాం.

[అధస్సూచీలు]

a కొన్ని పేర్లు మార్చబడ్డాయి.

[23వ పేజీలోని చిత్రం]

యెహోవా ప్రేమపూర్వక దయతో చేసిన కార్యాలను గురించి దావీదు ధ్యానించాడు. మీరలా ధ్యానిస్తారా?

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి