“ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”
1-4. (ఎ) మన అట్టమీది చిత్రమందలి ఏ అంశములయందు భాగము వహించుటలో మీరు ఆనందింతురు? (బి) ఇక్కడ ఏ దివ్యమైన ఉత్తరాపేక్ష మీ కొరకు ఉంచబడినది? (సి) అటువంటి నిరీక్షణకు మద్దతునిచ్చుచున్న బైబిలు లేఖనములు కొన్ని ఏమైయున్నవి?
ఈ చిన్నపుస్తకముయొక్క అట్టమీది చిత్రములో సంతోషముగానున్న ప్రజలను చూడుము. మీరును వారిలో ఒకరై యుండగోరుదురా? ‘దానికి సందేహమెందుకు, అవును,’ అని మీరందురు. ఎందుకనగా ఇక్కడ మానవులందరు కోరుకొను సమాధానము సామరస్యము కలదు. అన్ని జాతుల ప్రజలు—నలుపు, తెలుపు, పసుపు పచ్చని వర్ణములవారు—ఒకే కుటుంబముగా కలిసియున్నారు. ఎంత ఆనందము! ఎంత ఐక్యత! స్పష్టముగా ఈ ప్రజలు అణుయుద్ధ పరిణామము లేక ఉగ్రవాదముల భీతి లేనివారై నిశ్చింతగా ఉన్నారు. ఈ మనోహరమైన ఉద్యానవనమునకు పైనున్న ఆకాశముల ప్రశాంతతను జెట్ యుద్ధ విమానములు చెదరగొట్టుటలేదు. సైనికులు లేరు, యుద్ధ ట్యాంకులు లేవు, తుపాకులు లేవు. క్రమమును కాపాడుటకు పోలీసు లాఠీ అవసరము లేదు. యుద్ధము, నేరము అసలు ఉనికిలోనే లేవు. అక్కడ గృహముల కొరత లేదు, ఏలయనగా తమస్వంతమని పిలుచుకొను అందమైన గృహములను ప్రతివారు కలిగియున్నారు.
2 ఆ పిల్లలను చూడండి! వారి ఆట చూడముచ్చటగా ఉన్నది. వారు ఆడునది ఏ జంతువులతో! ఈ ఉద్యానవనములో ఏ ఇనుప కడ్డీలు అవసరము లేదు, ఏలయనగా జంతువులన్నియు తమయందేకాక మానవజాతితోను సమాధానమును కలిగియున్నవి. చివరకు సింహము, గొర్రెపిల్లకూడ స్నేహముగా ఉన్నవి. అక్కడనుండి ఇక్కడకు ఎగురుచున్న రంగురంగుల ఆ పక్షులను చూడండి, అక్కడంతా నిండియున్న పిల్లల ఆనందముతోకూడిన నవ్వులు, వాటి ఇంపైన పాటలు వినండి. పంజరములు లేవా? లేవు, ఎందుకనగా ఆ ప్రాంతమంతా స్వేచ్ఛ మరియు అడ్డుచెప్పనలవికాని ఆనందము వ్యాపించియున్నది. ఆ పువ్వుల పరిమళాన్ని ఆస్వాదించండి, సెలయేళ్ల గలగల చప్పుళ్లను వినండి, వెచ్చని సూర్యరశ్మిని ఆనందించండి. ఆహా, ఆ గంపలోని ఫలములు భూమిపై పండిన ఫలములలోకెల్ల మధురమైనవి, మరియు దివ్యమైన ఈ ఉద్యానవనములో చూసి ఆనందించగల ప్రతిదానివలెను అవి బహు శ్రేష్ఠమైనవి.
3 ‘అయితే ఆగండి, వృద్ధులు ఎక్కడ? ఈ సంతోషదాయక సమాజమందు వారును ఆనందమనుభవించ కూడదా?’ అని ఎవరైనా అడుగవచ్చును. వాస్తవానికి వృద్ధులు అక్కడే ఉన్నారు, అయితే వారు మరలా యౌవనులగుచున్నారు. ఈ ఉద్యానవనములో ఎవరును వృద్ధాప్యమునకు ఎదిగి మరణించరు. ఇప్పుడు పిల్లలుగా ఉన్నవారు పరిణతిపొందిన మనుష్యులుగా పెరిగి పెద్దవారగుదురుగాని వృద్ధులుకారు. 20 ఏండ్ల వారేమి 200 ఏండ్ల వారేమి, ఈ ఉద్యానవనములో జీవించు కోట్లాదిమందిలో ప్రతిఒక్కరు యుక్తవయస్కులై సంపూర్ణారోగ్యము కలిగి ఉల్లసించెదరు. ‘కోట్లాది మందియా?’ అని మీరనవచ్చును. అవును కోట్లాది మందియే, కారణమేమనగా ఈ ఉద్యానవనము ప్రతి ప్రాంతమునకు విస్తరింపజేయబడుచున్నది. జీవము, సమాధానము, సౌందర్యము అధికముగా కలిగినదై అది భూదిగంతములకు అనగా, అటు ఫ్యుజినుండి ఆండీస్ వరకు, ఇటు హాంకాగ్నుండి మధ్యధరా వరకు వ్యాపించును. ఎందుకనగా భూమియావత్తు పరదైసు వనముగా మార్చబడుచున్నది. అది పునరుద్ధరింపబడిన పరదైసుయై యుండును.
4 ‘ఇది నమ్మశక్యము కాదు’ అని మీరు అనియున్నారా? సరే, మొదట వాస్తవములను నిదర్శనాధారముతో విచారించుము. గతించుచున్న ప్రస్తుత కష్టవిధానమునుండి మీరును మీ కుటుంబమును తప్పింపబడి మన అట్టమీద చూపబడిన పరదైసులో ప్రవేశించు సాధ్యత కలదు.a
పరదైసును విశదీకరించు గ్రంథము
5. (ఎ) ఈ సంగతులను ఏ గ్రంథము వివరించుచున్నది? (బి) ఏ విధములుగా ఈ గ్రంథము అద్వితీయమై యున్నది?
5 దివ్యమైన ఈ విషయములు, వాటి నిశ్చయత చరిత్రలో క్రితము వ్రాయబడిన గ్రంథములలోకెల్లా ఒక మహాద్భుతమైన గ్రంథమందు వివరించబడియున్నవి. అది బైబిలు అని పిలువబడినది. అది అతిపురాతన గ్రంథమైయున్నది, మరియు దానియందలి భాగములు దాదాపు 3,500 సంవత్సరముల క్రితము వ్రాయబడినవి. అదే సమయములో, ఆధునిక జీవనము కొరకు లోపరహితమైన మరియు అభ్యాససిద్ధమైన సలహానందించుటలో అది బహు నవీన గ్రంథమై యున్నది. దాని ప్రవచనములు భవిష్యత్తు కొరకు తేజోవంతమైన నిరీక్షణను కలుగజేయును. ఇది చరిత్రయందంతటిలో ఎక్కువగా అమ్మబడిన గ్రంథమైయున్నది, పూర్తి బైబిలు లేక దాని పెద్దభాగములు దాదాపు 1,810 భాషలలో 2,00,00,00,000 ప్రతులకు పైగా పంచిపెట్టబడినవి.
6. పరిశుద్ధమని పరిగణింపబడిన ఇతర వ్రాతలనుండి ఏది బైబిలును ప్రత్యేకించుచున్నది?
6 మరి ఏ ఇతర పరిశుద్ధ గ్రంథము కూడ ఇంత విస్తారముగా ప్రపంచమందు పంచిపెట్టబడలేదు, మరియు చాలాగ్రంథములు దాదాపుగా దీనంత ప్రాచీనమైనవి కావు. ఇస్లాముమత ఖురాను 1,400 సంవత్సరముల లోపేగాని అంతకు ముందు వ్రాయబడలేదు. కాగా బుద్ధుడు మరియు కన్ఫ్యూషియస్ దాదాపు 2,500 సంవత్సరముల పూర్వము జీవించిరి, వారి వ్రాతలు అప్పటి కాలమునాటివే. ప్రస్తుత రూపమందు కూర్చబడిన షింటో లేఖనములు 1,200 సంవత్సరముల కంటే ముందు వ్రాయబడినవి కావు. మెర్మోను గ్రంథము కేవలము 160 సంవత్సరముల క్రితమే వ్రాయబడినది. ఈ పరిశుద్ధ గ్రంథములలో ఏదియు బైబిలువలె గత 6,000 సంవత్సరముల మానవచరిత్ర జాడను ఖచ్ఛితముగా తీయలేవు. కాబట్టి ఆదిమతమేదో అర్థము చేసికొనుటకు మనము తప్పక బైబిలునొద్దకు పోవలెను. కేవలము ఈ గ్రంథము మాత్రమే మానవజాతి కొరకు సర్వలోక సందేశమును కల్గినదైయున్నది.
7. ఆలోచనాపరులు బైబిలునుగూర్చి ఏమని చెప్పిరి?
7 బైబిలు సందేశముయొక్క జ్ఞానమును, మరియు రమ్యతను జనాంగములన్నింటిలోగల మరియు నానారంగములయందలి ఆలోచనాపరులచే శ్లాఘించబడినది. పేరుగాంచిన శాస్త్రజ్ఞుడును మరియు గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టిన, సర్ ఐజక్ న్యూటన్ ఇలా చెప్పెను: “ఏ విజ్ఞాన శాస్త్రము బైబిలుకంటె ఎక్కువ ప్రమాణీకృతమైనది కాదు.” “నాకు స్వేచ్ఛనివ్వండి, లేదా నాకు మరణానివ్వండి,” అను మాటలకు పేరుగాంచిన అమెరికా విప్లవ నాయకుడు ప్యాట్రిక్ హెన్రీ ఇంకను ఏమని ప్రకటించెననగా: “ముద్రింపబడిన మరి ఏ పుస్తకముకంటెను బైబిలు మిగుల విలువకరమైనది.” హిందుమత జ్ఞానియని పేరుగాంచిన మోహన్‌దాస్ కె. గాంధి ఒకసారి భారతదేశపు బ్రిటీషు రాజప్రతినిధితో ఇట్లనెను: “క్రీస్తు ఈ కొండమీద ప్రసంగములో చెప్పిన బోధలను మీ దేశము మా దేశము కలిసి అమలుచేసినప్పుడు, మన దేశముల సమస్యలనేకాదు మనము యావత్ ప్రపంచ సమస్యలను పరిష్కరించిన వారమగుదుము.” గాంధి బైబిలులోని మత్తయి 5 నుండి 7 అధ్యాయములనుగూర్చి మాట్లాడుచుండెను. వాటిలోని శక్తివంతమైన సందేశమునకు మీరు పులకరించిపోవుదురో లేదో చూచుటకు మీకైమీరు ఈ అధ్యాయములను చదువుము.
బైబిలు—తూర్పుదేశీయ గ్రంథమై యున్నది
8, 9. (ఎ) బైబిలును పాశ్చాత్తదేశ గ్రంథమని పిలుచుట ఎందుకు తప్పిదమై యున్నది? (బి) బైబిలు ఎట్లువ్రాయబడెను, ఎంత కాలనిడివిలో? (సి) బైబిలును ఎందుకు ఒక గ్రంథాలయమని పిలువవచ్చును? (డి) బైబిలును వ్రాయుటకు ఎంతమంది మనుష్యులు ఉపయోగించబడిరి? (ఇ) బైబిలు మూలమునుగూర్చి వీరిలో కొందరు మనుష్యులు ఎలాంటి సాక్ష్యమునిచ్చిరి?
8 అనేకుల నమ్మకమునకు భిన్నముగా, బైబిలు పాశ్చాత్త నాగరికతయొక్క ఉత్పత్తికాదు, లేక అది ఆ నాగరికతను మహిమపరచుటలేదు. దాదాపు బైబిలంతయు తూర్పుదేశములలోనే వ్రాయబడినది. దానిని వ్రాసిన మనుష్యులందరు తూర్పుదేశముల నివాసులే. బుద్ధునికి వెయ్యిసంవత్సరముల పూర్వము, సా.శ.పూ. 1513లో, మధ్యప్రాచ్యమందు నివసించిన మోషేను ఆదికాండమని పిలువబడు బైబిలులోని మొదటి పుస్తకమును వ్రాయుటకు దేవుడు ప్రేరేపించెను. ఈ ఆరంభమునుండి, బైబిలు దాని చివరిపుస్తకమగు ప్రకటనవరకు పూర్ణానుగుణ్యమైన ఒకే మూలాంశమును అనుసరించినది. బుద్ధుని తర్వాత దాదాపు 600 సంవత్సరములకు, సా.శ. 98లో బైబిలు పూర్తిచేయబడినది. బైబిలు 66 వివిధ పుస్తకములతో తయారుచేయబడిన సంగతి మీకు తెలియునా? అవును బైబిలు తానుగా ఒక గ్రంథాలయమై యున్నది!
9 ఆ విధముగా, మోషే కాలము మొదలుకొని 1600 సంవత్సరములకు పైగాగల కాలములో బైబిలు అణుగుణ్యతా చరిత్రను వ్రాయుటలో 40 మంది మనుష్యులు భాగము వహించిరి. మృతతుల్యమైన మానవునికంటే మహా ఉన్నతమైన శక్తిద్వారా తమ వ్రాతలు ప్రేరేపింపబడినవని వారు సాక్ష్యమిచ్చిరి. క్రైస్తవ అపొస్తలుడు ఇట్లు వ్రాసెను: “దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.”b (2 తిమోతి 3:16) అపొస్తలుడైన పేతురుకూడ ఇట్లు వివరించెను: “ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి.”—2 పేతురు 1:20, 21; 2 సమూయేలు 23:2; లూకా 1:70.
10. (ఎ) మన దినములవరకు బైబిలెట్లుభద్రపరచబడి అందింపబడినది? (బి) మనమింకను ఆది ప్రేరేపిత బైబిలు గ్రంథమును కలిగియున్నామని ఎందుకు నిశ్చయతను కలిగియుండగలము?
10 బైబిలు మనదినము వరకు వచ్చిన విధానము కూడ ఎంతో అసాధారణమైయున్నది. దాదాపు 500 సంవత్సరముల పూర్వము ముద్రణా యంత్రములను కనుగొను పర్యంతము, వేలాది సంవత్సరములుగా చేతితోనే వ్రాసి బైబిలు నకలు ప్రతులు చేయబడవలసి యుండెను. ప్రాచీన కాలపు మరియే ఇతర సాహిత్యపు పనికూడ ఇంత పట్టుదలతో నకలు, ప్రతినకలు చేయబడలేదు. అది అనేకమార్లు నకలువ్రాయబడినది, అయితే అన్ని సమయములలో ఎంతో జాగ్రత్త తీసికొనబడెను. నకలువ్రాసినవారు కేవలము కొన్ని చిన్న తప్పిదములను మాత్రమే చేసిరి, కాగా వీటిని పోల్చిచూచుట మూల గ్రంథము దేవునిచే ప్రేరేపించబడినదని స్థిరపరచినది. బైబిలు చేతివ్రాతప్రతుల ప్రముఖ అధికారియైన, సర్ ఫ్రెడ్రిరిక్ కెన్యన్ చెప్పినదేమనగా: “మొదట వ్రాయబడిన రీతిగానే వాటి నిజస్థితియందు లేఖనములు మనకాలము వరకు వచ్చాయా అని ఏ విధముగానైనను సందేహించుటకు చివరి ఆధారము ఇప్పుడు తీసివేయబడినది.” ఈనాటికి బైబిలు లేక దాని భాగముల చేతివ్రాతప్రతులు దాదాపు 16,000 వరకు ఉనికియందున్నవి, వీటిలో కొన్ని క్రీస్తుకు పూర్వము రెండవ శతాబ్దమునుండి నిలిచియున్నవై యున్నవి. అంతేకాకుండ, బైబిలు మొదట వ్రాయబడిన హెబ్రీ, అరమిక్, గ్రీకు భాషలనుండి దాదాపు భూమియందలి భాషలన్నింటిలోనికి ఖచ్ఛితముగా భాషాంతరములు చేయబడినవి.
11. ఏ ఆధునిక పరిశోధనా ఫలితములు బైబిలు చరిత్రతో ఏకీభవించుచున్నవి?
11 బైబిలు ఖచ్ఛితముగా లేదని చెప్పుటద్వారా కొందరు దానిని అపకీర్తిపాలు జేయుటకు ప్రయత్నించిరి. అయితే, భూగర్భశాస్త్ర పరిశోధకులు ఇటీవల సంవత్సరములలో పాడుబడిన ప్రాచీన బైబిలు ప్రాంతములలో త్రవ్వకములు సాగించి, అతిపురాతనమైన బైబిలు వ్రాతలలో సహితము చెప్పబడిన వ్యక్తులు మరియు ప్రాంతములు నిజంగా ఉనికియందుండెనని నిర్ధారించి తేల్చిచెప్పుటకు కావల్సిన వ్రాతలను, ఇతర రుజువులను కనుగొనిరి. 4,000 సంవత్సరముల క్రితము, నోవహు దినములలో సంభవించినదని బైబిలు చెప్పుచున్న జలప్రళయమును సూచించు విస్తారమైన సాక్ష్యమును వారు వెలికితీసిరి. ఈ విషయమునుగూర్చి రాజకుమారుడును, ప్రసిద్ధిగాంచిన భూగర్భశాస్త్ర పరిశోధకుడునైన మీకాసా ఇట్లుచెప్పెను: “జలప్రళయము నిజంగా సంభవించెనా? . . . జలప్రళయము నిజంగా సంభవించెనను వాస్తవము నమ్మునట్లుగా రుజువుపరచబడెను.”c
బైబిలు యొక్క దేవుడు
12. (ఎ) దేవునిగూర్చి కొందరు అపహాసకులు ఏమని చెప్పుదురు? (బి) బైబిలు దేవునిని తండ్రియని ఎందుకు సూచించుచున్నది? (సి) దేవుని నామము ఏమని బైబిలు చూపించుచున్నది?
12 కొందరు బైబిలును హేళన చేసినట్లే, మరికొందరు సర్వశక్తిగల దేవుని ఉనికినిగూర్చియు హేళన చేయుదురు. (2 పేతురు 3:3-7) వారిట్లందురు, ‘దేవుడు నాకు కన్పించుట లేదుకదా, ఆయనను నేనెట్లునమ్మగలను? మానవునికంటే ఉన్నతుడైన, అదృశ్యమైన సృష్టికర్త నిజముగా ఉనికి యందున్నాడనుటకు రుజువు కలదా? దేవుడు అంతటా, అన్నింటిలో లేడా?’ కాగా మరికొందరు, ‘దేవుడు లేడు, లేక బుద్ధుడు లేడని’ అందురు. ఏమైనను, మనమందరము భూసంబంధమైన తండ్రిద్వారా జీవమెట్లుపొందితిమో, అట్లే మన ప్రారంభ పూర్వికులును యెహోవా అను స్వకీయ నామము గల ఒక పరలోకపు తండ్రి లేక సృష్టికర్తనుండి జీవము పొందిరి.—కీర్తన 83:18; 100:3; యెషయా 12:2; 26:4.
13. ఏ రెండు మార్గములద్వారా యెహోవా తనను మానవజాతికి బయల్పరచుకొనెను?
13 యెహోవా తననుతాను మానవజాతికి రెండు ప్రముఖమైన రీతులలో బయల్పరచుకొనియున్నాడు. ప్రధాన మార్గముగా ఆయన బైబిలుద్వారా తనను బయల్పరచుకొనెను, అది ఆయన సత్యమును, ఆయన నిత్య సంకల్పములను తెలియజేయుచున్నది. (యోహాను 17:17; 1 పేతురు 1:24, 25) మరొక మార్గము, తాను చేసిన సృష్టిద్వారా. తమచుట్టువున్న అద్భుతమైన సంగతులను గమనించుటద్వారా, అనేకులు ఆయన దివ్య వ్యక్తిత్వమునుబట్టి ఆయన పనులలో ప్రతిబింబించబడిన, సృష్టికర్తయైన దేవుడు తప్పక ఉండవలెనని గుణగ్రహించిరి.—ప్రకటన 15:3, 4.
14. యెహోవానుగూర్చి బైబిలు మనకేమి చెప్పుచున్నది?
14 బైబిలుయొక్క గ్రంథకర్త యెహోవా దేవుడై యున్నాడు. ఆయన యుగయుగములనుండి ఉనికిలోవున్న గొప్ప ఆత్మయైయున్నాడు. (యోహాను 4:24; కీర్తన 90:1, 2) “యెహోవా” అను ఆయన నామము తన సృష్టిప్రాణులయెడల ఆయన సంకల్పమునకు ధ్యానమిచ్చుటకు పిలుపునిచ్చును. పరదైసు భూమిమీద జీవించగల్గునట్లుతనను ప్రేమించువారిని కాపాడి దుష్టులను నాశనము చేయుటద్వారా ఆ గొప్ప నామమును మహిమపరచుట ఆయన సంకల్పమై యున్నది. (నిర్గమకాండము 6:2-8; యెషయా 35:1, 2) సర్వశక్తిమంతుడగు దేవుడై యున్నందున, దీనినిచేయు శక్తి ఆయనకు కలదు. ఆయన సమస్త విశ్వమునకు సృష్టికర్తయైయున్నందున, సాధారణమైన జనాంగముల దేవతలు మరియు విగ్రహములకంటే, ఆయన ఎంతో ఉన్నతుడై యున్నాడు.—యెషయా 42:5, 8; కీర్తన 115:1, 4-8.
15. తెలివిగల మనుష్యులు సృష్టినిగూర్చి చేసిన పఠనములు ఏమి తేల్చిచెప్పుటకు నడిపించినవి?
15 ఇటీవల శతాబ్దములలో, సృష్టికార్యములను పఠించుటకు విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఎంతో సమయమును వెచ్చించిరి. వారేమి తేల్చిచెప్పిరి? విద్యుత్ క్షేత్రమందు అగ్రగాములలో ఒకరైన, ప్రఖ్యాత బ్రిటీష్ భౌతిక శాస్త్రవేత్తయైన లార్డ్ కెల్విన్ ఇలా ప్రకటించెను: “విజ్ఞానశాస్త్రమును మనమెంత ఎక్కువ క్షుణ్ణంగా పఠించెదమో అది అంత ఎక్కువగా, నాస్తికత్వమునకు పోల్చదగిన ప్రతిదానినుండి మనలను దూరముగా తీసికువెళ్లునని నేను నమ్ముచున్నాను.” నాస్తికుడని పేరుబడిన, మరియు ఐరోపాలో జన్మించిన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సహితము ఇట్లు అంగీకరించెను: “మనము చాలా తక్కువ గ్రహించగల, విశ్వముయొక్క అద్భుతమైన నిర్మాణమును పునరాలోచించి, ప్రకృతియందు ప్రదర్శితమైయున్న విజ్ఞానములో కేవలము రవ్వంత మాత్రమే వినయముతో అర్థముచేసికొన ప్రయత్నించుటకు . . . ఇది నాకు చాలును.” అమెరికా శాస్త్రజ్ఞుడును నోబుల్ బహుమతి గ్రహీతయైన ఆర్థర్ హోల్లి కాంప్టన్ ఇట్లనెను: “విశ్వమందు విశదపరచబడిన క్రమము—‘ఆదియందు దేవుడు’ అని మహాద్భుతముగా చెప్పబడిన మాటల సత్యమును రుజువుచేయు చున్నది.” ఆయన బైబిలుయొక్క ప్రారంభవాక్యమునెత్తి చెప్పెను.
16. విశ్వమెట్లుదేవుని సృష్టి జ్ఞానమును శక్తిని ఘనపరచుచున్నది?
16 బలమైన జనాంగముల పాలకులు వారి తెలివినిగూర్చి, అంతరిక్షమందు వారు సాధించిన విజ్ఞాన విజయములనుగూర్చి గొప్పలు చెప్పుకొనవచ్చును. అయితే భూమిచుట్టు తిరుగు చంద్రుని, సూర్యునిచుట్టు తిరుగు గ్రహములతో పోల్చినప్పుడు వారి అంతరిక్ష ఉపగ్రహములు ఎంత అల్పమైనవి! మన సూర్యునివంటి వాటిని కోటానుకోట్లుగా కలిగియున్న ఆకాశ నక్షత్ర వీధులను, కోటానుకోట్లుగా కలుగజేసి వాటిని కొలవజాలని కాలమునుండి గగనమందు సమూహములుగా అమర్చిన యెహోవా సృష్టితో పోల్చగా మృతతుల్యమైన ఈ మానవులు సాధించినవి ఏపాటివి! (కీర్తన 19:1, 2; యోబు 26:7, 14) అందుచేత, బలిష్ఠమైన జనములను యెహోవా “లేనట్లుగాను” మనుష్యులను కేవలము మిడుతలుగాను పరిగణించుచున్నాడనుటలో ఆశ్చర్యమేమియు లేదు.—యెషయా 40:13-18, 22.
17. సృష్టికర్తయందు నమ్మికయుంచుట ఎందుకు కారణయుక్తమైయున్నది?
17 మీరొక గృహమందు జీవించుచున్నారా? బహుశ మీకైమీరు ఆ గృహమును నిర్మించియుండకపోవచ్చును, లేక దానిని నిర్మించినదెవరో మీకు తెలిసియుండకపోవచ్చును. అయితే, దానిని నిర్మించినదెవరో మీకు తెలియనంతమాత్రమున, తెలివిగల ఎవరోఒకరు దానిని నిర్మించిరను వాస్తవమును అంగీకరించుటకు మీకు ఆటంకముండదు. ఎందుకంటే, గృహము దానంతటదే వచ్చినదని తర్కించుట కేవలము అవివేకమన్పించుకొనును! ఈ అనంత విశ్వమును, దానియందలి సమస్తమును నిర్మించుటకు అపారమైన మహత్తైన జ్ఞానము అవసరము, కాబట్టి జ్ఞానసంపన్నుడైన సృష్టికర్త ఒకరున్నారని తేల్చిచెప్పుట కారణయుక్తముగా లేదా? నిజముగా, కేవలము బుద్ధిహీనుడు మాత్రమే తన హృదయములో, “యెహోవా లేడు” అని చెప్పుకొనును.—కీర్తన 14:1; హెబ్రీయులు 3:4.
18. దేవుడు ఒక వ్యక్తియని, స్తుతి పొందనర్హుడని ఏది చూపించుచున్నది?
18 మనచుట్టువున్న మహాద్భుతమైన—పుష్పములు, పక్షులు, జంతువులు, మహాశ్చర్యకరమైన మానవ సృష్టి, అద్భుతములైన జీవము, పుట్టుక—ఇవన్నియు అదృశ్యమైన అత్యుత్తమ తెలివి వాటిని ఉత్పత్తిచేసెనని రుజువు చేయుచున్నవి. (రోమీయులు 1:20) ఎక్కడ తెలివి ఉండునో, అక్కడ మనస్సు ఉండును. ఎక్కడ మనస్సు ఉండునో అక్కడ వ్యక్తి ఉండును. ఆ సర్వోన్నత తెలివి, సమస్త జీవులకు సృష్టికర్తయు, జీవమునకు ఊటయైయున్న సర్వోన్నత వ్యక్తిదైయున్నది. (కీర్తన 36:9) సృష్టికర్తయే నిజముగా, సమస్త స్తుతిని, ఆరాధనను పొందనర్హుడై యున్నాడు.—కీర్తన 104:24; ప్రకటన 4:11.
19. (ఎ) యుద్ధమందు తమకు గెలుపు దేవుడే ఇచ్చెనని ఈనాడు ఏ జనాంగమైనను ఎందుకు చెప్పుకొనలేదు? (బి) జనాంగముల యుద్ధములలో దేవుడెందుకు వంతు కలిగియుండడు?
19 రెండవ ప్రపంచ యుద్ధమందు కలిగిన కఠినమైన అనుభవములనుబట్టి కొందరికి దేవునియందు నమ్మకము చెదిరిపోయినది. ఆ సమయములో ప్రతి దేశమువారు కాథోలిక్కులేమి, ప్రొటస్టెంట్లేమి, తూర్పుదేశముల మతములవారేమి అందరు తమతమ “దేవునికి” ప్రార్థనలు జరిపిరి. అయితే వీటిలో కొన్ని దేశములవారికి “దేవుడు” గెలుపునిచ్చి, ఇతరులు ఓడిపోవుటకు అనుమతించెనని చెప్పగలమా? ఈ జనాంగములలో ఎవరును సత్యదేవుని ప్రార్థించలేదని బైబిలు చూపించుచున్నది. భూమ్యాకాశములకు సృష్టికర్తయైన యెహోవా దేవుడు, ఈ గందరగోళమునకు జనముల మధ్య యుద్ధమునకు బాధ్యుడు కాదు. (1 కొరింథీయులు 14:33) ఆయన తలంపులు ఈ భూమిమీదగల జనాంగముల సైనిక, రాజకీయ తలంపులకంటే బహు ఉన్నతమైనవి. (యెషయా 55:8, 9) అదేవిధముగా, సత్యమైన మతమగు యెహోవా ఆరాధనకు జనాంగముల యుద్ధములలో భాగములేదు. యెహోవా జనాంగముల దేవతలకంటే ఎంతో ఉన్నతుడై యున్నాడు. ప్రతి జనాంగములోను సమాధానమును ప్రేమించు స్త్రీపురుషులకు దేవుడైయుండుటలో ఆయన అద్వితీయుడు. బైబిలు చెప్పునట్లుగా: “దేవుడు పక్షపాతికాడు, ప్రతిజనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.” (అపొ.కార్యములు 10:34, 35) ప్రతి జనములోను నీతివైపు మొగ్గుచూపు వారిప్పుడు బైబిలును నేర్చుకొంటూ, సమస్త మానవజాతికి సృష్టికర్తయైన, “సమాధాన కర్తయగు (సత్య) దేవుని” ఆరాధనను హత్తుకొనుచున్నారు.—రోమీయులు 16:20; అపొ.కార్యములు 17:24-27.
20. క్రీస్తుమత సామ్రాజ్యము క్రైస్తవత్వమునకు వ్యతిరేకులుగాను, దేవుని విరోధులుగాను ఉన్నట్లుఏది చూపుచున్నది?
20 మరికొందరు బైబిలును అనుసరించుచున్నామని చెప్పుకొనుచున్న, క్రీస్తుమత సామ్రాజ్యముయొక్క మతములలోని విభాగములను మరియు వేషధారణను సూచింతురు. వారిట్లందురు: ‘అణు ఆయుధములను ఉద్రేకముతో పేర్చుకొనుచున్న వారిలో బైబిలును కలిగియున్న జనాంగములును చేరియుండగా, నేనెట్లు బైబిలు దేవుని నమ్మగలను?’ వాస్తవమేమనగా, బైబిలు ఎల్లకాలములలో సత్యమై నిలిచియుండగా, ఉత్తర ధృవమునుండి దక్షిణ ధృవమంత దూరముగా క్రీస్తుమత సామ్రజ్య జనాంగములు బైబిలు క్రైస్తవత్వమునుండి బహు దూరము జరిగిపోయినవి. క్రైస్తవులమని చెప్పుకొనుటలో వారు వేషధారులై యున్నారు. వారియొద్ద బైబిలున్నది, అయితే వారు దాని బోధలకు లోబడనొల్లనివారై యున్నారు. హిరోషిమామీద మొదటి అణుబాంబు వేయుమని ఆజ్ఞాపించిన అమెరికా అధ్యక్షుడు ఒకసారి ఇట్లు ఆశ్చర్యమును వ్యక్తపరచెను: ఈ లోక సంక్షోభమందు మనుష్యులనడిపింపుకొరకు—“యెషయానో లేక పరి. పౌలో” ఉంటే ఎంత బాగుండును! ఆయన బైబిలు యెషయాతో ఏకీభవించియున్నట్లయిన, ఎన్నటికిని అణుబాంబును ప్రయోగించుమని అనియుండెడి వాడుకాదు, ఏలయనగా యెషయా ‘ఖడ్గములను నాగటి నక్కులుగాను, ఈటెలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుటను’ ప్రకటించియుండెను. అంతేకాకుండ, “మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావు” అని బైబిలులోని పౌలు ప్రకటించెను. (యెషయా 2:4; 2 కొరింథీయులు 10:3, 4) ఏమైనను, బైబిలు జ్ఞానయుక్తమైన సలహాను పాటించుటకు బదులు, క్రీస్తుమత సామ్రాజ్య జనాంగములు స్వయం సంహారక ఆయుధ పందెమందు ఇమిడియున్నారు. తాము బైబిలుకు లోబడువారమని వారుచెప్పు ప్రతిదీ అబద్ధమైయున్నది. దేవుని చిత్తము చేయనివారిగా వారు ఆయన తీర్పును తప్పక ఎదుర్కొనవలెను.—మత్తయి 7:18-23; జెఫన్యా 1:17, 18.
యెహోవా సృష్టి మరియు అద్భుతములు
21. దేవుని అద్భుతకార్యములను సందేహించకుండుట ఎందుకు కారణయుక్తమై యున్నది?
21 యెహోవా సృష్టించును, మరియు ఆయన అద్భుతములు చేయును. నీటిని రక్తముగా మార్చుట, ఎర్రసముద్రమును రెండుగా చీల్చుట, కన్యకు యేసు జన్మించుట, ఆలాగే బైబిలునందు వ్రాయబడియున్న ఇతర అద్భుతముల విషయమై మీరెప్పుడైనా ఆశ్చర్యపడితిరా? సూర్యాస్తమయముల అద్భుతమును పూర్తిగా అర్థముచేసికొనలేని రీతిగానే, మానవునికిగల స్వల్ప జ్ఞానమునుబట్టి వీటిలో కొన్ని అద్భుతములు ఎట్లుజరిగినవో బహుశ ఎన్నటికిని అతడు అర్థముచేసికొనలేక పోవచ్చును. మానవసృష్టి ఒక అద్భుతము. ఆధునిక మానవుడు ఆ అద్భుతమును చూడలేదు, అయితే అది జరిగినదని అతనికి తెలుసు, ఏలయనగా దానిని నిరూపించుటకు ఈనాటికి అతడు జీవించియున్నాడు. నిజానికి, సమస్త జీవము, సమస్త విశ్వము వెరసి నిరంతరము నిలిచియుండు ఒక అద్భుతమై యున్నది. కాబట్టి అటువంటి అద్భుతములు నేడు అవసరము లేకపోయినను, దేవుని వాక్యమగు, బైబిలు ఆయాసమయములలో, ఆయన ప్రత్యేకించి కొన్ని అద్భుతములు చేసెనని చెప్పినప్పుడు, మనము దానిని సందేహించవలెనా?
22. దేవుని మొదటి సృష్టిని వర్ణించుము.
22 యెహోవా సమస్త సృష్టి అద్భుతము మరియు ఆశ్చర్యకరము! అయితే, ఆయన మొట్టమొదట సృష్టించినది చేసినవాటిలోకెల్ల మహాద్భుతమైనది. అది ఒక ఆత్మీయ కుమారునికి, తన “ప్రథమకుమారునికి” సంబంధించిన సృష్టియైయున్నది. (కొలొస్సయులు 1:15) ఈ పరలోక కుమారునికి “వాక్యమని” పేరుపెట్టబడెను. సృష్టింపబడిన అసంఖ్యాకమైన అనేక యుగముల తర్వాత, ఆయన ఈ భూమిపైకి వచ్చి “క్రీస్తు యేసను నరుడు” అని పిలువబడెను. (1 తిమోతి 2:5) ఆ పిమ్మట ఆయననుగూర్చి ఇట్లుచెప్పబడెను: “ఆ వాక్యము శరీరధారియై కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.”—యోహాను 1:14.
23. (ఎ) దేవుని ఆయన కుమారుని మధ్యగల సంబంధమును ఎట్లువివరించవచ్చును? (బి) కుమారునిద్వారా యెహోవా ఏమి సృష్టించెను?
23 యెహోవా మరియు ఆయన కుమారుని సంబంధమును, ఒక కర్మాగార యజమాని-మేనేజరు మరియు తాను డిజైను చేసిన వస్తువులను తయారుచేయుటలో సహాయపడు అతని కుమారునితోగల సంబంధముతో పోల్చవచ్చును. తన ప్రథమకుమారుడును, తోటిపనివాడును అయిన ఆయనద్వారా, యెహోవా ఇతర అనేక దేవుని కుమారులను, ఆత్మీయ ప్రాణులను సృష్టించెను. ఆ తర్వాత వీరు యెహోవా కుమారుడును, ఆయన ప్రధానశిల్పియైనవాడు ఈ భౌతిక విశ్వమును, మనము నివసించు భూమిని కలుగజేయుటను చూసినప్పుడు అత్యానందభరితులైరి. ఈ సంగతులు సృష్టింపబడినవనుటను మీరు సందేహింతురా? వేలాది సంవత్సరముల తర్వాత, యెహోవా విశ్వాసపాత్రుడైన ఒక మనుష్యుని ఇట్లుఅడిగెను: “నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకమున్నయెడల చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడిపాడినప్పుడు, దేవదూతలందరు దేవుని కుమారులందరు ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు?”—యోబు 38:4, 7; యోహాను 1:3.
24. (ఎ) యెహోవా భూసంబంధమైన ఏ సృష్టి అన్నింటిలోకి మిన్నయైయున్నది, ఏ విషయములయందు? (బి) మానవుడు జంతువులనుండి క్రమేణి పరిణామము చెందెనని చెప్పుట ఎందుకు కారణరహితమై యున్నది?
24 తగిన కాలమున యెహోవా ఈ భూమిమీద జీవించువాటిని, ఆలాగే భౌతికమైన వాటిని, మొక్కలను, వృక్షములను, పుష్పములను, చేపలను, పక్షులను మరియు జంతువులను సృష్టించెను. (ఆదికాండము 1:11-13, 20-25) ఆ పిమ్మట దేవుడు తన ప్రధానశిల్పితో ఇట్లనెను: “మన స్వరూపమందు మన పోలికెచొప్పున నరులను చేయుదము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను, పురుషునిగాను వారిని సృజించెను.” (ఆదికాండము 1:26, 27) దేవుని స్వరూపమందు ఆయన పోలికచొప్పున సృష్టింపబడి, దేవుని ఉన్నత లక్షణములగు ప్రేమ, జ్ఞానము, న్యాయము, మరియు శక్తి ఇవ్వబడినందున, తొలి మానవుడు జంతువులకంటె ఎంతో ఉన్నతుడై యుండెను. మానవుడు జంతువులన్నింటిలోకి ప్రత్యేకింపబడిన వానివలె, తర్కించగల, భవిష్యత్తునుగూర్చి పథకము వేసికొనగల, మరియు దేవుని ఆరాధింపగల సామర్థ్యము గలవాడయ్యెను. జంతువులకు తర్కించగల తెలివిలేదు, అయితే అవి తమ సహజసిద్ధమైన జ్ఞానముతో జీవించును. అలాంటప్పుడు, సృష్టికర్త లేకుండానే, బహుగా తెలివి అనుగ్రహింపబడిన ప్రాణియగు నరుడు తెలివిలేని క్షుద్ర జంతువులనుండి క్రమేణి పరిణామము చెందెనని చెప్పుట ఎంత కారణరహితమై యున్నది!—కీర్తన 92:6, 7; 139:14.
25, 26. (ఎ) నరుని ఎదుట ఏ దివ్యమైన ఉత్తరాపేక్ష ఉంచబడెను? (బి) ప్రజలతో భూమిని అమితముగా నింపు సమస్య ఎందుకుండదు?
25 దేవుడు “తూర్పున ఏదెనులో ఒక తోట నిర్మించి” దానిలో నరుని ఉంచెను. అది మన అట్టమీద చూపబడిన తోటవలె, సంతోషమునిండిన ఉద్యానవనమై యుండెను, అయినను అందులో కేవలము ఇద్దరు మనుష్యులు మాత్రమే, ఆదాము అతని భార్యయు ఉండిరి. ఈ తొలి పరదైసు ఇప్పుడు ఉనికిలో లేదు, అది నోవహు కాల జలప్రళయమందు నాశనము చేయబడెను. అయితే మధ్య ప్రాచ్యమందు దానిస్థలము దాదాపు తెలియబడియున్నది, ఎందుకనగా దానిగుండ ప్రవహించబడినవని బైబిలునందు పేర్లతో చెప్పబడిన నదులు ఈనాటికిని ఉనికియందున్నవి. (ఆదికాండము 2:7-14) భూమియంతటిని పరదైసుగా చేయుటకు, ఈ తోటను కేంద్రముగా ఉపయోగించి, ఇక్కడనుండి విస్తరించి భూమినంతటిని సాగుచేయు దివ్యమైన అవకాశమును నరుడు కలిగియుండెను.—యెషయా 45:12, 18.
26 దేవుడు ఆయన కుమారుడు, ఇద్దరు పనివారై యున్నట్లే, దేవుడు నరునికికూడ ఈ భూమిమీద చేయుటకు పనినిచ్చెను. (యోహాను 5:17) మొదటి స్త్రీపురుషులైన ఆదాము హవ్వలకు దేవుడు ఇట్లు సెలవిచ్చెను: “మీరు ఫలించి, అభివృద్ధిపొంది, విస్తరించి భూమిని నిండించి, దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను, ఆకాశపక్షులను భూమిమీద ప్రాకు ప్రతిజీవిని ఏలుడి.” (ఆదికాండము 1:28) అంటే చివరకు ఈ భూమి అమితముగా పట్టలేనంతగా నింపబడి ఆపైన పొర్లిపారునంతగా నరుడు ఫలించుచు, అభివృద్ధిపొందుచునే యుండవలెనని దీని భావమా?? కాదు. ఎవరైనా మీతో ఒక కప్పులో టీ నింపుమని చెప్పినట్లయిన, కప్పునిండిపోయి టేబులునిండా అది పొర్లిపారునంతగా మీరు కప్పులో టీ పోయరు. మీరు కప్పులో టీ పోసి అది నిండిన వెంటనే ఆపుజేయుదురు. అదేవిధముగా, “భూమిని నిండించుడి” అని యెహోవా నరునికిచ్చిన ఆజ్ఞ, అందరికి సౌకర్యవంతమైన రీతిగా భూమి నింపబడిన తర్వాత, ఈ భూమిమీద మానవజాతి పునరుత్పత్తిని ఆపుజేయుట ఆయన సంకల్పమని సూచించినది. ఇది పరిపూర్ణ మానవ సమాజములో ఎలాంటి సమస్యను కల్గించదు. ఈనాటి అసంపూర్ణ మానవజాతి లోకములో మాత్రమే అధిక జనాబా సమస్యను కల్గించుచున్నది.
చెడ్డ సంగతులు—దేవుడు వాటినెందుకు అనుమతించుచున్నాడు?
27. ఇప్పుడు ఏ ప్రశ్నలు జవాబును గట్టిగా అడుగుచున్నవి?
27 పరదైసు భూమిని నిర్మించుట దేవుని సంకల్పమైతే, మరి ఈనాడు భూమి ఎందుకింత దుష్టత్వముతో, బాధతో, దుఃఖముతో నిండియున్నది? దేవుడు సర్వశక్తిమంతుడే అయితే, ఇంతకాలముగా ఈ పరిస్థితులను ఆయన ఎందుకు అనుమతించెను? మన కష్టములన్నింటికి అంతము వచ్చునను నిరీక్షణ కలదా? బైబిలేమి చెప్పుచున్నది?
28. పరదైసు తోటలో తిరుగుబాటు ఎట్లుప్రవేశించెను?
28 యెహోవా సార్వభౌమాధిపత్యమునకు లేక అధికారమునకు వ్యతిరేకముగా దేవుని ఆత్మీయ కుమారులలో ఒకడు తిరుగుబాటు చేసినప్పుడు మానవజాతికి సమస్యలు ప్రారంభమాయెనని బైబిలు చూపించుచున్నది. (రోమీయులు 1:20; కీర్తన 103:22, NW రెఫ. బైబిలు పాదవచనము.) నరుని సృష్టిని చూచినప్పుడు అత్యానందము పొందిన వారిలో ఈ దూత ఒకడై యుండెననుటలో సందేహములేదు. అయితే మత్సరము అహంకారము అతని హృదయములో వేళ్లానుకొనగా, ఆదాము హవ్వలు తమ సృష్టికర్తయైన యెహోవాకు బదులుగా తనను ఆరాధించవలెనను దురాశచే అతడు ఈడ్వబడినవాడాయెను. ఒక బొమ్మను ఉపయోగించి అది మాట్లాడుచున్నట్లుగానే తాను మాట్లాడి నమ్మించు వానివలెనే, ఒక సర్పము వెనుకనుండి మాట్లాడుచు ఈ దూత సర్వశక్తిగల దేవునికి అవిధేయురాలగునట్లు హవ్వను మోసగించెను. ఆపిమ్మట ఆమె భర్తయైన ఆదాముకూడ అవిధేయుడై ఆమె మార్గమునే అనుసరించెను.—ఆదికాండము 2:15-17; 3:1-6; యాకోబు 1:14, 15.
29. (ఎ) తీర్మానమునకు ఏ వివాదాంశములు లేవదీయబడెను? (బి) దేవుడు సవాలును ఎట్లుఎదుర్కొనెను? (సి) సాతాను నిందకు జవాబిచ్చుటలో మీరెట్లు భాగము వహించవచ్చును?
29 ఆ తిరుగుబాటు చేసిన దూత “ఆది సర్పమని” తెల్పబడినది. (ప్రకటన 12:9; 2 కొరింథీయులు 11:3) “ఎదిరించువాడను” అర్థముగల సాతానని, “కొండెములు చెప్పువాడని” అర్థమిచ్చు అపవాదియని పేరు అతనికివ్వబడెను. అతడు భూమిమీద యెహోవా పరిపాలనా హక్కును, నీతిని వివాదమునకు తెచ్చెను, మరియు సాతానను పేరుగల తానిప్పుడు మానవజాతి యావత్తును సత్యారాధననుండి వైదొలగజేయగలనని దేవునికి సవాలు విసిరెను. యెహోవా సార్వభౌమాధిపత్యమును గూర్చిన వివాదాంశము శాశ్వతముగా పరిష్కరింపబడు లాగున, సవాలును నిరూపించుకొన ప్రయత్నించుటకు దేవుడు సాతానును దాదాపు 6,000 సంవత్సరములుపాటు అనుమతించెను. దేవునినుండి వేరైపోయిన మానవపాలన దుఃఖకరమైన రీతిలో విఫలమైనది. అయితే విశ్వాసులైన స్త్రీపురుషులు, ఎంతో కఠినమైన పరీక్షలయందును అపవాదిని అబద్ధికునిగా నిరూపించుచు, యెహోవా సత్యత్వమును నిరూపించి, దేవుని యెడల తమ యథార్థతను కాపాడుకొనిరి, వారిలో యేసు అసాధారణమైన మాదిరినుంచెను. (లూకా 4:1-13; యోబు 1:7-12; 2:1-6; 27:5) మీరును, యథార్థపరులుగా యుండవచ్చును. (సామెతలు 27:11) అయితే మనలను బాధలకు గురిచేయు శత్రువు సాతాను ఒక్కడు మాత్రమే కాదు. ఇంకా ఏ శత్రువు ఉన్నాడు?
శత్రువుగావున్న—మరణము
30. మానవుని అవిధేయత ఫలితముగా వచ్చిన శిక్షనుగూర్చి లేఖనములు ఏమని చెప్పుచున్నవి?
30 అవిధేయతకు శిక్ష—మరణము అని దేవుడు ముందే సెలవిచ్చెను. మొదటి స్త్రీకి శిక్షవేయుచు, యెహోవా ఇట్లనెను: “నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు; నీ భర్తయెడల నీకు వాంఛకలుగును; అతడు నిన్ను ఏలును.” ఆలాగే ఆయన ఆదామను మనుష్యునితో ఇట్లనెను: “నీవు నేలకు తిరిగిచేరు వరకు నీ ముఖపు చెమటకార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నేగనుక తిరిగి మన్నైపోదువు.” (ఆదికాండము 3:16-19) అవిధేయులైన ఆ దంపతులు సంతోషభరితమైన పరదైసులోనుండి సేద్యపరచని భూమికి వెళ్లగొట్టబడిరి. కాగా కాలక్రమమున వారు మరణించిరి.—ఆదికాండము 5:5.
31. పాపమనగా ఏమి, మానవజాతికి దాని ఫలితమేమై యున్నది?
31 పరిపూర్ణతనుండి పడిపోయిన తర్వాతనే, ఆదాము హవ్వలు పిల్లలను కనుటకు ఆరంభించిరి. ఈనాటి మనుష్యులందరు అసంపూర్ణతయందు వారి సంతానమై యున్నారు, అందువలననే అందరు మరణించుచున్నారు. దానిని ఒక బైబిలు రచయిత ఈ మాటలలో వివరించుచున్నాడు: “ఒక మనుష్యునిద్వారా పాపమును, పాపముద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” ఈ “పాపము” ఏమైయున్నది? ఇది పరిపూర్ణమైన లేక సంపూర్తియైన గురుతునుండి పడిపోవుటయై యున్నది. అసంపూర్ణమైన దేనిని యెహోవా దేవుడు అంగీకరించడు లేక జీవించనియ్యడు. మానవులందరు మొదటి మనుష్యుడగు ఆదామునుండి పాపమును అసంపూర్ణతను స్వాస్థ్యముగా పొందినందున, మరణము వారిమీద “రాజుగా పరిపాలించెను.” (రోమీయులు 5:12, 14 NW) పడిపోయిన మానవుడు, జంతువులు మరణించు రీతిగానే మరణించుచున్నాడు.—ప్రసంగి 3:19-21.
32. మనకు స్వాస్థ్యముగా లభించిన మరణమును బైబిలెట్లువర్ణించుచున్నది?
32 “మరణము” అనగా ఏమిటి? జీవమునకు వ్యతిరేకమైనది మరణము. మానవుడు విధేయుడై యున్నట్లయిన భూమిమీద నిరంతరము జీవించియుండు ఉత్తరాపేక్షను దేవుడు అతని ముందుంచెను. అయితే, అతడు అవిధేయుడయ్యెను, దానికి అతడు మరణమును శిక్షగాపొంది స్మృతిలేనివానిగా ఉనికిలో లేనిమాడయ్యెను. మానవుడు అవిధేయుడై చనిపోయినట్లయిన అతని జీవితమును ఆత్మీయ రాజ్యములోనికిగాని లేక అగ్నిమయమైన “నరకమునకు” గాని మార్చుటనుగూర్చి దేవుడు ఏమియు చెప్పలేదు. ఆయన వారినిట్లుహెచ్చరించెను: “నీవు నిశ్చయముగా చచ్చెదవు.” అయితే నరహంతకుడైన అపవాది అబద్ధము పలుకుచు ఇట్లనెను: “మీరు చావనే చావరు.” (ఆదికాండము 2:17; 3:4; యోహాను 8:44) మానవులందరు ఆదామునుండి మన్నునుపోలిన మరణమును స్వాస్థ్యముగా పొందిరి.—ప్రసంగి 9:5, 10; కీర్తన 115:17; 146:4.
33. (ఎ) మానవజాతికి, ఈ భూమికి ఎటువంటి దివ్యమైన భవిష్యత్తు వేచియున్నది? (బి) ఏ ప్రాముఖ్యమైన మూడు సంగతులను యెహోవా తన కుమారునిద్వారా నెరవేర్చును?
33 చనిపోయిన మానవునికి మరి ఏ భవిష్యత్తును లేదా? మహాద్భుతమైన భవిష్యత్తు కలదు! ఇప్పుడు చనిపోయిన వారితో సహా సమస్త మానవజాతి కొరకు భూపరదైసునుగూర్చిన దేవుని సంకల్పము ఎన్నటికిని విఫలము కాదని బైబిలు చూపుచున్నది. యెహోవా ఇట్లుసెలవిచ్చుచున్నాడు: “ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము.” “నేను నా పాదస్థలమును మహిమపరచెదను.” (యెషయా 66:1; 60:13) ఆయనకున్న మిక్కుటమైన ప్రేమనుబట్టి, మానవుల లోకము తనకుమారుడైన, వాక్యముద్వారా జీవము పొందునట్లు యెహోవా ఆయనను ఈ భూమికి పంపెను. (యోహాను 3:16; 1 యోహాను 4:9) యెహోవా తన కుమారునిద్వారా నెరవేర్చు మూడు ప్రాముఖ్యమైన సంగతులను మనమిప్పుడు చర్చించవలెను, అవేవనగా, (1) మరణబంధకము నుండి విమోచనను కలుగజేయుట; (2) మృతులను తిరిగి నిజముగా జీవింపజేయుట; (3) మానవజాతియంతటిమీద పరిపూర్ణమైన ప్రభుత్వము నొకదానిని స్థాపించుట.
మరణము నుండి విడుదల
34, 35. (ఎ) మానవుడు ఎట్లుమాత్రమే మరణమునుండి విడిపించబడగలడు? (బి) విమోచన క్రయధనమనగానేమి?
34 ప్రాచీన కాలమునుండి, దేవుని ప్రవక్తలు మానవుని అమర్త్యతయందు కాక, మరణమునుండి దేవుడు “వారిని రక్షించునను” నిరీక్షణయందలి తమ నమ్మకమును వ్యక్తముచేసిరి. (హోషేయ 13:14) అయితే మానవుడు మరణబంధకములనుండి ఎట్లు విడిపింపబడగలడు? యెహోవా పరిపూర్ణ న్యాయమునకు ‘ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పన్ను’ అవసరము. (ద్వితీయోపదేశకాండము 19:21) కాబట్టి, ఆదాము ఉద్దేశ్యపూర్వకముగా దేవునికి అవిధేయుడగుటద్వారా, పరిపూర్ణ మానవజీవితమును పోగొట్టుకొనినవాడై మానవజాతి యంతటిమీదికి స్వాస్థ్యముగా మరణమును తెచ్చినందున, ఆదాము పోగొట్టుకొనిన దానిని మరలా కొనితెచ్చుటకు, అతని పరిపూర్ణ ప్రాణము కొరకు చెల్లించుటకుగాను ఆదాముకు ప్రత్యామ్నాయముగా మరొక పరిపూర్ణ మానవ ప్రాణము కావలెను.
35 ‘దేనికదే చెల్లించుట’ అనేది చరిత్రయందంతటిలో బహుగా అంగీకరింపబడిన న్యాయసూత్రమై యున్నది. దీనికై సాధారణముగా “విమోచన క్రయధనమును చెల్లించుట” అను మాట ఉపయోగింపబడుచున్నది. విమోచన క్రయధనమనగానేమి? అది “ఒక వ్యక్తిని లేదా వస్తువును తన ఆధీనమందుంచుకున్న వ్యక్తినుండి ఆ వ్యక్తిని లేదా ఆ వస్తువును విడిపించుటకు చెల్లించు మూల్యమై యున్నది. అందువలన యుద్ధ ఖైదీలను లేక దాసులను విడుదల చేయునప్పుడు వారిని చూసిన విధమునకు ప్రతిగా విమోచన క్రయధనము చెల్లింపవలెనని చెప్పబడినది. . . . అవతలి వారికి ప్రత్యామ్నాయముగా లేక ప్రతిగా చెల్లింపబడిన నష్టపరిహారము అతని విమోచన క్రయధనమై యున్నది.”d ఆదాము పాపముచేసిన దగ్గరనుండి, మానవజాతి యావత్తు యుద్ధ ఖైదీలు లేక దాసులవలె అసంపూర్ణత మరియు మరణముద్వారా బంధింపబడినట్లయినది. వారిని విడిపించుటకు విమోచన క్రయధనము చెల్లింపవలెను. విమోచన క్రయధనముయొక్క మూల్యస్వచ్ఛత విషయమై, ఇప్పుడుగాని ఆ తర్వాతగాని ఏ వివాదము తలెత్తకుండా చేయుటకు, ఒక పరిపూర్ణ మానవప్రాణమును, అనగా ఆదాముకు సరిసమానమైన దానిని, బలిగా అర్పించుట అవసరమై యుండును.
36. విమోచన క్రయధనముగా యెహోవా ఎట్లుఒక పరిపూర్ణ మానవ ప్రాణమును దయచేసెను?
36 అయితే, అంత పరిపూర్ణతగల మానవప్రాణము ఎక్కడ లభ్యము కాగలదు? మానవులందరు అసంపూర్ణ ఆదామునుండి వచ్చినవారై, అసంపూర్ణులుగా జన్మించిరి. వారిలో “ఎవడును ఏవిధము చేతనైనను తన సహోదరుని విమోచింప లేడు; వాని నిమిత్తము దేవునికి విమోచన క్రయధనమును ఇచ్చువాడెవడును లేడు.” (కీర్తన 49:7 NW) ఉన్న అవసరతకు జవాబిచ్చుచు, మానవజాతియెడల తనకున్న మిక్కుటమైన ప్రేమచేత కదిలింపబడినవాడై యెహోవా, అవసరమైన బలిగా తయారగుటకు మిగులవిలువైన తన “ప్రథమ కుమారుని” దయచేసెను. వాక్యమని పిలువబడిన తన ఆత్మీయకుమారుని, పరిపూర్ణ ప్రాణమును యూదా కన్యకయైన మరియ గర్భమునకు మార్చెను. ఆ కన్యక గర్భవతియై తగిన కాలమున ఒక కుమారుని కని ఆయనకు “యేసు” అని పేరుపెట్టెను. (మత్తయి 1:18-25) జీవమునకే సృష్టికర్తయైనవాడు, న్యాయసమ్మతముగా అటువంటి అద్భుతక్రియను చేయసమర్థుడై యున్నాడు.
37. జీవమును ప్రేమించు మానవులందరి కొరకు యేసు ఎట్లుతన ప్రేమను చూపించెను?
37 యేసు పెరిగిపెద్దవాడై, యెహోవాకు తనను సమర్పించుకొని బాప్తిస్మము పుచ్చుకొనెను. అప్పుడు దేవుడాయనను తన చిత్తము చేయుమని ఆజ్ఞాపించెను. (మత్తయి 3:13, 16, 17) యేసు భూజీవితము పరలోకమునుండి వచ్చినదైనందున, మానవజాతిని మరణమునుండి విడిపించుటకు, ఆయన ఆ పరిపూర్ణ మానవ ప్రాణమును బలిగా అర్పించగలవాడై యుండెను. (రోమీయులు 6:23; 5:18, 19) ఆయన చెప్పినట్లుగా: “వారికి జీవము కల్గుటకును, అది సమృద్ధిగా కల్గుటకును నేను వచ్చితిని.” “తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువానికంటె ఎక్కువయిన ప్రేమ గలవాడెవడును లేడు.” (యోహాను 10:10; 15:13 NW) సాతాను యేసును హింసాయుత మ్రానుపై చంపినప్పుడు, ఈ విమోచన క్రయధన ఏర్పాటుద్వారా విశ్వసించు మానవులు జీవమును పొందుదురని ఎరిగినవాడై, యేసు ఈ కౄరాతికౄరమైన మరణమునకు తనను అప్పగించుకొనెను.—మత్తయి 20:28; 1 తిమోతి 2:5, 6.
జీవమునకు పునరుద్ధరింపబడుట
38. దేవుని కుమారుడెట్లుజీవమునకు పునరుద్ధరింపబడెను, మరియు ఇది ఏమి నిరూపించుచున్నది?
38 ఆయన శత్రువులు ఆయనను చంపినను, దేవుని కుమారుడు ఎన్నటికిని తన పరిపూర్ణ మానవ జీవిత హక్కును పోగొట్టుకొనలేదు, ఏలయనగా ఆయన దేవునియెడల తన యథార్థతను కాపాడుకొనెను. అయితే, సమాధిలో మృతుడైయున్న యేసు, మానవజాతి పక్షముగా ఈ విలువైన దానిని, అనగా మానవజీవితపు హక్కును ఎట్లు ఉపయోగించగలడు? ఇక్కడ యెహోవా మరలా మరొక అద్భుతమును జరిగించెను, ఆ తరహాలో అదే మొదటిది. యేసు సమాధిలో ఉండిన మూడవ దినమున, యెహోవా ఆయనను మరణమునుండి ఆత్మీయ ప్రాణిగా, అమర్త్యతగల వానిగా లేపెను. (రోమీయులు 6:9; 1 పేతురు 3:18) పునరుత్థానమందు నమ్మకమును స్థిరపరచుటకు, వివిధ సమయములలో యేసు మానవ శరీరమును ధరించినవాడై శిష్యులకు కన్పించెను, ఒకసారి 500 మందికి పైగావున్న తన శిష్యులకు ఆయన కన్పించెను. ఆ తర్వాత మహిమపరచబడిన యేసు ప్రత్యక్ష్యతతో అంధత్వము కలిగిన అపొస్తలుడైన పౌలుతోసహా, వీరిలో ఎవరును ఆయన పునరుత్థాన అద్భుతమును ఏ కారణముచేతనైనను సందేహింపలేదు.—1 కొరింథీయులు 15:3-8; అపొ.కార్యములు 9:1-9.
39. (ఎ) యేసు తన బలివిలువను ఎట్లుఉపయోగించును, మొదట ఎవరి పక్షముగా? (బి) మరింకే గొప్ప అద్భుతమునుగూర్చి యేసు మాట్లాడెను?
39 40 దినములైన తర్వాత పునరుత్థానుడైన యేసు, తన పరిపూర్ణ మానవ బలివిలువను మానవజాతికి విడుదలగా అర్పించుటకు పరలోకమందలి దేవుని సన్నిధికి ఆరోహణుడై వెళ్లెను. “ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి, అప్పటినుండి తన శత్రువులు తనకు పాదపీఠముగా చేయబడు పర్యంతము కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను.” (హెబ్రీయులు 10:12, 13) ఈ విమోచన క్రయధనముద్వారా, “చిన్నమంద” అని పిలువబడు, “క్రీస్తుకు చెందిన” నమ్మకమైన క్రైస్తవులు మొదట విడిపింపబడుదురు. (లూకా 12:32; 1 కొరింథీయులు 15:22, 23 NW) వీరు “మనుష్యులలోనుండి కొనబడిరి,” కావున పునరుత్థానమందు వారు పరలోకములో క్రీస్తుకు ఆత్మీయ సహవాసులుగా తయారగుదురు. (ప్రకటన 14:1-5) అయితే, ప్రస్తుతము మరణించి అసంఖ్యాకముగా సమాధులలోవున్న మానవజాతిలోని ఇతరుల విషయమేమి? భూమిపై ఉన్నప్పుడు యేసు, తీర్పుతీర్చుటకు, జీవమిచ్చుటకు తండ్రి తనకు అధికారమునిచ్చెనని చెప్పెను. ఆయనింకను ఇట్లనెను: “దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున జ్ఞాపకార్థముగా ఉన్న సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దమువిని, . . . పునరుత్థానమునకు బయటకు వచ్చెదరు.” (యోహాను 5:26-29 NW) ఆయన వీరిని భూపరదైసు జీవితమునకు పునరుద్ధరించును.
40, 41. (ఎ) “పునరుత్థానము” అనగా ఖచ్ఛితముగా ఏమిటో వివరింపుము. (బి) దేవుని పునరుత్థాన వాగ్దానమందు మనమెందుకు నమ్మిక కలిగియుండ గలము?
40 “దీనికి ఆశ్చర్యపడకుడి” అను యేసు మాటలను గమనింపుము. అయినను, ఎప్పుడో చనిపోయిన వ్యక్తి మరణమునుండి విడిపింపబడి మరలా జీవమునకు తేబడునా? అతని శరీరము మన్నైపోలేదా? ఆ శరీరముగా తయారైయుండిన అణువులు కొన్ని అప్పటికే మొక్కలు, జంతువులవంటి ప్రాణులలోనికి జీర్ణమైపోయి ఉండవచ్చును. అయితే, పునరుత్థానమనగా అదే రసాయనక మూలపదార్థములను మరలా ఒకచోటికి కూర్చుటయని భావము కాదు. అదేవ్యక్తిని అదేవ్యక్తిత్వముతో దేవుడు మరలా సృష్టించునని దాని భావము. భూమిలోని మూల ధాతువులతో ఆయన ఒకక్రొత్త శరీరమును తయారుచేసి, ఆ శరీరములో అవే గుణములను, అవే ప్రత్యేక లక్షణములను, అదే జ్ఞాపకశక్తిని, ఆ వ్యక్తి చనిపోవు సమయమునకు అభివృద్ధిచేసికొనియున్న అదే జీవన విధానమును ఉంచును.
41 మీరు బహుగా ప్రేమించిన మీ ఇల్లు కాలిపోయిన అనుభవము బహుశ మీకు ఉండవచ్చును. అయితే, దానిలో మీరు ప్రేమించిన రూపురేఖల వివరములన్నియు స్పష్టముగా మీకింకను జ్ఞాపకమున్నందున, అదే ఇంటిని మీరు సులభముగా మరలా నిర్మించగలిగి యుండవచ్చును. అలాంటప్పుడు, జ్ఞాపకశక్తి ఉత్పత్తికే కారకుడైన దేవుడు, మరినిశ్చయముగా, తాను ప్రేమించినందున తన జ్ఞాపకమందు పెట్టుకొన్న మనుష్యులను ఆయన మరలా సృష్టించగలడు. (యెషయా 64:8) అందుకే బైబిలు “జ్ఞాపకార్థముగా ఉన్న సమాధులను” మాటను ఉపయోగించుచున్నది. మృతులను తిరిగి జీవమునకు తెచ్చు దేవుని నిర్ణీతకాలము వచ్చినప్పుడు, ఆయన ఆ అద్భుతమును చేయును, మొదటి మానవుని సృజించుటలో ఆయన ఒక అద్భుతమును చేసినట్లుగానే, అదే అద్భుతమును ఆయన ఈసారి అనేక మారులు చేయును.—ఆదికాండము 2:7; అపొ.కార్యములు 24:15.
42. భూమిమీద నిత్యజీవము ఎందుకు సాధ్యమును, నిశ్చయమునై యున్నది?
42 మరెన్నడును ఈ భూమిమీద చనిపోకుండు ఉత్తరాపేక్షతో, మానవజాతిని మరలా దేవుడు జీవమునకు తెచ్చును. అయితే భూమిమీద నిత్యజీవము ఎట్లుసాధ్యమగును? అది సాధ్యము మరియు నిశ్చయము ఎందుకనగా అది దైవచిత్తమును సంకల్పమునై యున్నది. (యోహాను 6:37-40; మత్తయి 6:10) భూమిమీద మానవుడు నేడు చనిపోవుటకుగల ఒకేఒక కారణమేమనగా, అతడు ఆదామునుండి మరణమును స్వాస్థ్యముగా పొందెను. అయితే, మానవుడు అనుభవించడానికి ఉద్దేశించబడిన భూమిమీది అనంతమైన వివిధ అద్భుతమైన సంగతులను మనము విచారించినప్పుడు, కేవలము వంద సంవత్సరములకంటే తక్కువగావున్న జీవితకాల నిడివి నిజంగా చాలా తక్కువైయున్నది! మానవ సంతతి కొరకు ఈ భూమిని ఇచ్చుటలో, మానవుడు కేవలము వంద సంవత్సరములు లేక వెయ్యి సంవత్సరములు కాదుగాని, తన సృష్టి అద్భుతములను అనుభవించుటకు నిత్యము జీవించవలెనని దేవుడు సంకల్పించెను.—కీర్తన 115:16; 133:3.
సమాధానముగల పరిపూర్ణ ప్రభుత్వము
43. (ఎ) పరిపూర్ణ ప్రభుత్వము కొరకు ఏ అవసరత కలదు? (బి) ఈ సంబంధముగా యెహోవా ఏమి సంకల్పించెను?
43 మన మొదటి తలిదండ్రులు దేవుని నియమమును తిరస్కరించినందున, మానవ ప్రభుత్వము సాతాను ఆధీనము క్రిందికి వచ్చెను. కావున, సరియైన విధముగా బైబిలు సాతానును “ఈ యుగసంబంధమైన దేవత” అని పిలుచుచున్నది. (2 కొరింథీయులు 4:4) యుద్ధములు, కౄరకృత్యములు, అవినీతి, మానవ ప్రభుత్వముల అస్థిరత ఈ వాస్తవమును రూఢిపరచుచున్నది. నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి కలవర పరిస్థితులనుండి సమాధానమును తీసుకు రాలేకపోయినవి. మానవజాతి ఒక సమాధానముగల ప్రభుత్వము కొరకు మొర్రపెట్టుచున్నది. భూమిపై పరదైసును పునరుద్ధరించ సంకల్పించిన సృష్టికర్త, ఆ పరదైసు కొరకు ఒక పరిపూర్ణ ప్రభుత్వమునుకూడ దయచేయుననుట కారణయుక్తము కాదా? అదే యెహోవా చేయుటకు సంకల్పించియున్నాడు. ఈ ప్రభుత్వములో ఆయనకు ప్రతినిధిగా ఉండు రాజు, “సమాధానమునకు కర్తయైన” యేసుక్రీస్తుయై యున్నాడు, “ఆయన రాజ్యపాలనకు మితిలేకుండా వృద్ధియు, సమాధానము కలుగును.”—యెషయా 9:6, 7, NW.
44. (ఎ) ఈ ప్రభుత్వము ఎక్కడవుండును? (బి) అది ఎట్లుతయారుచేయబడును?
44 ఆ పరిపూర్ణ ప్రభుత్వము పరలోకమందుండునని బైబిలు చూపించుచున్నది. ఈ సరియైన స్థానమునుండి, రాజైన యేసుక్రీస్తు ప్రభావవంతముగా నీతియందు భూమియంతటిపైన పరిపాలన చేయును. అంతేకాకుండ, ఆ అదృశ్య పరలోక ప్రభుత్వమందు, ఆయనతో సహపరిపాలకులును ఉందురు. శోధనలలో యేసుకు హత్తుకొనియుండిన అనుచరులనుండి, నమ్మకమైన మానవులనుండి వీరు ఎంపికచేయబడుదురు, ఆయన వారితో ఇట్లనెను: “నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను.” (లూకా 22:28, 29) పరలోకమందు యేసుక్రీస్తుతో పాలించుటకు కేవలము కొద్దిమంది మాత్రమే తీసికొనబడుదురు. ఈనాడు జనములలో, పరిపాలించుటకు పాలనాసభకు లేక పార్లమెంటుకు కేవలము కొద్దిమంది మాత్రమే ఎంపికచేయబడుటను అది పోలియుండును. యేసుక్రీస్తు కేవలము 1,44,000 మంది సహపరిపాలకులను మాత్రమే కలిగియుండునని బైబిలు చూపించుచున్నది. అందువలన దేవునిరాజ్యమందు, లేక పరలోక ప్రభుత్వమందు క్రీస్తు యేసు మరియు భూమినుండి పరలోకమునకు తీసికొనబడిన 1,44,000 మంది ప్రజలు ఉందురు. (ప్రకటన 14:1-4; 5:9, 10) మరి భూమి విషయమేమి? రాజు “భూమియందంతటను . . . అధికారులను” నియమించునని కీర్తన 45:16 చెప్పుచున్నది. మానవ “అధికారులు” లేక ప్రభుత్వపరమైన విచారణకర్తలు, నీతిసూత్రముల యెడల వారికున్న మిక్కుటమైన భక్తిభావమునుబట్టి పరలోకమునుండి నియమింపబడుదురు.—యెషయా 32:1 పోల్చుము.
45, 46. (ఎ) యేసు భూమిపై ప్రకటించుటయొక్క ముఖ్యాంశమేమై యుండెను? (బి) పరిపూర్ణ ప్రభుత్వము వెంటనే ఎందుకు స్థాపింపబడలేదు? (సి) ప్రవచనమందు, లోకసంఘటనలయందు సా.శ. 1914వ సంవత్సరము ఎట్లుప్రత్యేకమై యుండెను?
45 ఎప్పుడు మరియు ఎట్లు పరిపూర్ణ ప్రభుత్వము స్థాపింపబడెను? యేసు భూమిపై యున్నప్పుడు ఆయన ప్రకటన పనియందు ఈ రాజ్యము ముఖ్యాంశమై యుండెను. (మత్తయి 4:17; లూకా 8:1) అయితే, ఆ సమయములో లేక ఆయన పునరుత్థానమందు ఆయన ఆ రాజ్యమును స్థాపించలేదు. (అపొ.కార్యములు 1:6-8) ఆయన పరలోకమునకు ఆరోహణమైనప్పుడుకూడ, ఆయన దానిని స్థాపించలేదు, ఏలయనగా ఆయనింకను యెహోవా నిర్ణీత సమయము కొరకు వేచియుండవలసి యుండెను. (కీర్తన 110:1, 2; హెబ్రీయులు 1:13) ఆ నిర్ణీతకాలము సా.శ. 1914లో వచ్చెనని బైబిలు ప్రవచనము చూపించుచున్నది. ఏమైనను, ఒకవ్యక్తి ఇట్లడుగవచ్చును, ‘పరిపూర్ణ ప్రభుత్వమునకు మారుగా, 1914 వ సంవత్సరము పెరిగిన లోకశ్రమల ప్రారంభమును గుర్తించుట లేదా?’ అసలైన అంశము అదియే! దేవుని రాజ్యరాకడకు ఇటీవల సంవత్సరములలోని విపత్కర సంఘటనలకు దగ్గరసంబంధము కలదు, దానిని మనమిప్పుడు చూద్దాము.
46 1914కు దాదాపు 35 సంవత్సరముల ముందు, ది వాచ్‌టవర్ (ప్రస్తుతము భూమిపై అత్యధికముగా అందింపబడుచున్న మతపత్రిక) బైబిలు ప్రవచనమునందు గుర్తింపబడిన సంవత్సరముగా, 1914 వైపు దృష్టిమళ్లించుచుండెను. ఈ ప్రవచనములు 1914 లో విశేషమైన రీతిలో నెరవేరుటకు ఆరంభమాయెను. యుగసమాప్తియందు కన్పించునటువంటి మరియు యేసు రాజ్యాధికారమందు అదృశ్యముగా ప్రత్యక్ష్యమగుటను రుజువుపరచునటువంటి “సూచనను” గూర్చి 1900 సంవత్సరములనాడు ఆయన తానుగా చెప్పిన ప్రవచనము వీటిలో ఒకటైయుండెను. “సూచనను” గూర్చి తన శిష్యులు అడిగిన ప్రశ్నకు జవాబుగా, ఆయనిట్లనెను: “జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును; అక్కడక్కడ కరవులును, భూకంపములును కలుగును; ఇవన్నియు వేదనలకు ప్రారంభము.” (లూకా 24:3, 7, 8) ఆశ్చర్యకరమైన రీతిలో, 1914లో మొదటి ప్రపంచయుద్ధముగా ప్రారంభమయిన ఈ యుద్ధము, అంతకుముందు 2,500 సంవత్సరములలో జరిగిన 900 యుద్ధములలోకంటే ఏడురెట్లుఎక్కువ నాశనమును కలుగజేసెను. అప్పటినుండి ఎడతెగక వేదనలు కలుగుచునే యున్నవి. యుద్ధనాశనమును, కరవును లేక 1914 నుండి సంభవించిన పెద్దభూకంపములలో దేనినైనను నీవు అనుభవించియున్నావా? అట్లయిన, ఈ విధానముయొక్క “అంత్యకాలము” యొక్క “సూచనకు” నీవు ప్రత్యక్ష్య సాక్షివైయున్నావు.—దానియేలు 12:4.
47. “సూచనను” నెరవేర్చుచున్న సంఘటనలు ఎట్లుఇటీవల సంవత్సరములలో తీవ్రతరమైనవి?
47 రెండవ ప్రపంచ యుద్ధముతో “వేదనలు” ఇంకను అధికమయినవి, ఎట్లనగా ఇది మొదటి ప్రపంచ యుద్ధముకంటె నాలుగు రెట్లు నాశనకరమై యుండెను, ఆలాగే ఇది అణుయుగములోనికి నడిపి, “దిక్కుతోచక భూమిమీద జనములకు కలవరము కలుగును, . . . లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు” అని యేసు చెప్పిన మరొక ప్రవచనమునుకూడ నెరవేర్చుచున్నది. (లూకా 21:25, 26 NW) నేరము, దుష్టత్వము పెరుగుట, పిల్లలలో అవిధేయత, నేరప్రవృత్తి, ఆలాగే భక్తిహీనత లైంగిక దుర్నీతి వృద్ధియగుట—ఈ సంగతులు భయము కల్గించునంతగా పెరిగిపోవుటకూడ ఈ దుష్టవిధానముయొక్క “అంత్యదినములను” గుర్తించుటకు ముందేచెప్పబడినవి.—2 తిమోతి 3:1-5; మత్తయి 24:12.
48. భూమిమీది శ్రమలకు బాధ్యుడు ఎవరైయున్నారు, మరియు అవి 1914 నుండి ఎందుకు పెరిగినవి?
48 ఏమైనను, పరలోక ప్రభుత్వము 1914లో స్థాపించబడినయెడల, భూమిపై ఎందుకు ఇంత దుఃఖమున్నది? దీనికి అపవాదియైన సాతాను బాధ్యుడైయున్నాడు. క్రీస్తు రాజ్యాధికారమును పొందినప్పుడు, అదృశ్యపరలోకమందు సాతానుతో యుద్ధము చేయుట ఆయన మొదటి కర్తవ్యమైయుండెను. తత్ఫలితముగా, “సర్వలోకమును మోసపుచ్చుచున్న” సాతాను అతని దూతలతోసహా భూపరిధిలోనికి పడద్రోయబడెను. తన నాశనము సమీపమైనదని ఎరిగినవాడై, అతడు భూమిమీద గొప్ప శ్రమను రేపుచున్నాడు. అందుచేత, “భూమి, సముద్రమా మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు.”—ప్రకటన 12:7-9, 12.
49. (ఎ) “భూమిని నశింపజేయువారికి” ఏమి సంభవించును? (బి) జనాంగములమీద యెహోవా ఎట్లుతన “న్యాయ తీర్మానమును” అమలుపరచును?
49 ఈ శ్రమలకు అంతమున్నదా? ఔను!—సర్వశక్తిగల దేవుని రాజ్యమైన, పరలోక ప్రభుత్వము, “భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకు” చర్యగైకొనుటతో ఆ శ్రమలు అంతమగును. (ప్రకటన 11:18; దానియేలు 2:44) మరలా ఇక ఎన్నటికిని, తన చేతిపనియైన భూమిని, తమ అణుపనిముట్లతో రాజకీయశక్తులు, అబద్ధ క్రైస్తవులు లేక మరెవరైనను నాశనము చేయుటకు దేవుడు అనుమతించడు. బదులుగా ఆయనిట్లుప్రకటించుచున్నాడు: “నా ఉగ్రతను నా కోపాగ్నియంతటిని వారిమీద కుమ్మరించుటకై అన్యజనులను పోగుచేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుట నా న్యాయ తీర్మానమై యున్నది.” (జెఫన్యా 3:8 NW) భూమిమీద సాతానును అనుసరించు వారిని నాశనమందు ముంచెత్తుటలో తన క్రీస్తుద్వారా విశ్వమందు తన ఆధీనమందలి మహాగొప్ప సైన్యములను యెహోవా ఉపయోగించును. నోవహు దినములలో జరిగిన జలప్రళయమును పోలి పెద్దయెత్తున, ఇది భౌగోళికముగా జరుగును.—యిర్మీయా 25:31-34; 2 పేతురు 3:5-7, 10.
50. (ఎ) “హార్‌మెగిద్దోను” అనగానేమి? (బి) హార్‌మెగిద్దోనును కేవలము ఎవరుమాత్రమే తప్పించుకొందురు?
50 బైబిలునందు ఈ దుష్ట జనాంగముల నాశనము దేవుని యుద్ధమగు హార్‌మెగిద్దోను అని పిలువబడినది. (ప్రకటన 16:14-16) కేవలము యెహోవాను, నీతిని వెదకు దీనులు మాత్రమే, హార్‌మెగిద్దోనును తప్పించుకొని దేవుని సమాధానకర నూతన విధానములో ప్రవేశించగలరు. (జెఫన్యా 2:3; యెషయా 26:20, 21) వీరినిగూర్చి బైబిలిట్లుచెప్పుచున్నది: “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు; బహుక్షేమము కలిగి సుఖించెదరు.” (కీర్తన 37:11) అటుపిమ్మట, భూమిమీద పరదైసును పునరుద్ధరించు గొప్పపని ప్రారంభమగును!
పరదైసు ప్రవేశము కొరకు విద్యాభ్యాసము
51. ఇప్పుడే మీరు చర్యగైకొనుట ఎందుకు అవసరమై యున్నది?
51 పరదైసులో జీవించవలెనని మీరు ఇచ్ఛయించుచున్నారా? మీ జవాబు ‘అవును’ అయినట్లయిన, శ్రమతోనిండిన ఈనాటి విధానమునుగూర్చి, దానికి సమీపించుచున్న నాశనముయొక్క “సూచనను” గూర్చి యేసు మాట్లాడినప్పుడు, “ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని” కూడ ఆయన చెప్పెనని తెలిసికొనుట మీకు పులకరింతను కలుగజేయును. 1914లో “వేదనల ప్రారంభమును” చూసిన ఈ తరములోని కనీసము కొందరు, భూమిమీద పరదైసు పునరుద్ధరింపబడుటను చూచుటకు జీవించియుందురు. (మత్తయి 24:3-8, 34) అయితే, ఈనాడు అనేకమంది నాశనమునకు నడుపు విశాలమార్గమున ఉన్నారను వాస్తవము దుఃఖకరమై యున్నది. (మత్తయి 7:13, 14) మారుటకు వారికి కేవలము కొద్దిసమయము మాత్రమే మిగిలియున్నది. తగిన సమయమున యెహోవా హెచ్చరికను దయచేసియున్నందుకు, మీరెంతగా కృతజ్ఞతగలవారై యుండగలరు! ఎందుకంటే మీరు జీవమును కలిగియుండవలెనని యెహోవా కోరుచున్నాడు, మీరు సరియైన చర్యలు గైకొనుటకు ఆయన మీకు సహాయముచేయును.—2 పేతురు 3:9; యెహెజ్కేలు 18:23.
52. మతము విషయములో జ్ఞానయుక్తమైన ఎంపికను చేసికొనుటకు మీకు ఏమి అవసరము?
52 ఖచ్ఛితమైన జ్ఞానము మీకు ఇప్పుడు అవసరమైయున్నది. (1 తిమోతి 2:4; యోహాను 17:3) దీనిని మీరు ఎక్కడ పొందగలరు? ఇది ఏ మతములోనైనను లభించునా? పర్వతమునకున్న దారులన్నియు చివరకు శిఖరాగ్రమునకు చేరునట్లే, మతములన్నియు ఒకే గమ్యమునకు చేరునని ప్రజలు కొందరందురు. వారెంత తప్పుగా అర్థము చేసికొనియున్నారు! సరియైన మార్గమును కనుగొనుటకు, శిఖరములను అధిరోహించువారు మ్యాపులను ఉపయోగింతురు, మరియు మార్గము చూపించువారిని వారు బాడుగకు తీసికొందురు. అదేరీతిగా, నిత్యజీవమునకు నడుపు సత్యమైన మతము కేవలము ఒక్కటి మాత్రమే కలదు, కాగా దానిని కనుగొనుటకు నడిపింపు అవసరము.—అపొ.కార్యములు 8:26-31.
53. (ఎ) నిత్యజీవము పొందుటకు, మీరు ఎడతెగక తప్పక ఏమిచేయవలెను? (బి) సాతానునుండి కలుగు ఏ శోధనలను మీరు అధిగమించవలసి యుండును?
53 యెహోవా సాక్షులచే అందింపబడిన ఈ చిన్నపుస్తకము మీకు సహాయము చేయును. ఇప్పటికే ఇది మీరు కొన్ని బైబిలు మూల సత్యములను నేర్చుకొనుటకు సహాయపడినది, అవునా? ప్రతి అంశము దేవుని ప్రేరేపిత వాక్యమగు బైబిలుమీద ఆధారపడియున్నదని మీకైమీరు నిస్సందేహముగా రూఢిపరచుకొనియున్నారు. ఇప్పుడు, మీ గమ్యమువైపు పురోగమించుటకు, మీరింకను ఎడతెగక నేర్చుకొనవలెను. అనుదిన సమాజమందు తగిన స్థానమును పొందుటకు ఒక వ్యక్తికి సరియైన లౌకిక విద్య అవసరమైనట్లుగానే, పరదైసు భూమిపై జీవించుటకు తప్పించబడు సమాజములో ప్రవేశించుటకు సిద్ధపడుటలో ఒకవ్యక్తికి సరియైన బైబిలు విద్యాభ్యాసము అవసరమైయున్నది. (2 తిమోతి 3:16, 17) మీ సన్నిహిత స్నేహితులు మిమ్ములను వ్యతిరేకించునట్లుచేయుటద్వారా లేక స్వార్థపూరితమైన ఐశ్వర్యాసక్తిలో లేక లైంగిక దుర్నీతిలో పడిపోవుటకు శోధించుటద్వారా నిన్ను పరధ్యానిని చేయుటకు సాతాను ప్రయత్నించవచ్చును. సాతానుకు లొంగిపోకుము. మీ రక్షణ మీ భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తంతయు మీరింకను బైబిలును పఠించుటమీద ఆధారపడియున్నది.—మత్తయి 10:36; 1 యోహాను 2:15-17.
54. విద్యాభ్యాసము కొరకు మీపొరుగున యెహోవా మరింకే ఏర్పాటు చేసెను?
54 మీ ప్రస్తుత బైబిలు పఠనమును కొనసాగించుటకు తోడుగా, నేర్చుకొనుటకు మరొకమార్గము కలదు. బైబిలు విద్యాభ్యాసమందు శ్రద్ధగల మీ పొరుగు ప్రజలు క్రమముగా ప్రాంతీయ రాజ్యమందిర కూటములకు హాజరగుచున్నారు. అక్కడ హాజరగువారందరు బైబిలు ఉపదేశమును గైకొని, మరింత శ్రేష్ఠమైన ప్రజలుగా తయారగుటకు నమ్మకముగా కృషిచేయుచున్నారు. “యెహోవా పర్వతమునకు [ఆయన ఆరాధనా స్థలము] మనము వెళ్లుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనమాయన త్రోవలలో నడుతము” అని చెప్పుచు వారు క్రొత్తగా వచ్చువారిని సిద్ధముగా ఆహ్వానింతురు. (యెషయా 2:3) బైబిలు కూటములకు హాజరగుటకు మంచి కారణమును హెబ్రీయులు 10:24, 25 వివరించుచున్నది, అక్కడ మనమిట్లుచదువుదుము: “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.”
55. (ఎ) ఏయే విధములుగా యెహోవా సంస్థ ఇతరమైనవాటితో భిన్నమై యున్నది? (బి) మరే ప్రజలు లేనంతగా యెహోవా సాక్షులు ఎట్లుఐక్యమై యున్నారు?
55 యెహోవా సంస్థతో మీరు సహవసించుచుండగా, అక్కడి వాతావరణము ఆలయములు మరియు చర్చీలనుండి బహుగా భిన్నమైయుండుటను మీరు కనుగొందురు. అక్కడ డబ్బు వసూలు చేయుటవుండదు, చాడీలుచెప్పుట లేక కొట్లాట ఉండదు, కుటుంబ గతమునుబట్టిగాని, ఆర్ధిక స్తొమతనుబట్టిగాని వివక్ష చూపబడదు. యెహోవా సాక్షులమధ్య ప్రేమ బహు ప్రత్యేకముగా నిలువబడు లక్షణమైయున్నది. మొదట, వారు యెహోవాను ప్రేమింతురు, రెండవది, వారు ఇతర ప్రజలను ప్రేమింతురు. ఇవి నిజమైన క్రైస్తవుల గురుతులై యున్నవి. (మత్తయి 22:37-39; యోహాను 13:35) వారి కూటములకు హాజరై, మీకైమీరు దానిని రూఢిపరచుకొనుడి. వారి ఐక్యతనుచూసి మీరు ముగ్ధులగుదురనుటలో సందేహము లేదు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తముగా 212 దేశములలో 36 లక్షలకుపైగా యెహోవా సాక్షులున్నారు. అయినను, సాక్షులు భూవ్యాప్తముగా వారి కూటములయందు ఒకే కార్యక్రమమును అనుసరింతురు. ఒకేసమయమందు అనేక భాషలలో ముద్రణాపని జరుగుచున్నందున, ప్రపంచవ్యాప్తముగా యెహోవా సాక్షులు తమ కూటములలో ఒకరికొకరు కొద్దిగంటల తేడాతో ఒకేవిధమైన లేఖన అంశములను పఠనము చేయుదురు. ఈ విభాగిత లోకములో యెహోవా సంస్థయొక్క ఐక్యత ఆధునిక-దిన అద్భుతమై యున్నది.
56. (ఎ) యెహోవా సంస్థతో సహవసించుట నుండి మీరు ఏ ప్రయోజనములను పొందవచ్చును? (బి) సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మీరెట్లుప్రతిస్పందించవలెను? (సి) మీ జీవితమును యెహోవాకు సమర్పించుకొనుట ఎందుకు ప్రాముఖ్యమై యున్నది?
56 యెహోవా ప్రజలతో మీరు క్రమముగా హాజరగుచుండగా, మీరు “నూతన స్వభావమును” ధరించుకొని, దేవుని ఆత్మ ఫలములైన—“ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహమును” పెంపొందించుకొను అవసరతకలదు. (కొలొస్సయులు 3:10, 12-14; గలతీయులు 5:22, 23) ఇది మీకు మిక్కుటమైన సంతృప్తిని తెచ్చును. మీరు అవినీతిమయమైన లోకములో జీవించుచున్నందున, మరియు మీ స్వంత అసంపూర్ణతనుబట్టి ఆయాసమయములలో మీరు సమస్యలను దాటుకొనిరావలసి యుండును. అయితే యెహోవా మీకు సహాయము చేయును. ఆయనను నమ్మకముగా ప్రీతిపరచగోరువారికి ఆయన వాక్యము ఇట్లుఅభయమిచ్చుచున్నది: “దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతివిషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును.” (ఫిలిప్పీయులు 4:6, 7) యెహోవాను సేవించుటకు ఇచ్ఛయించునట్లు, మీరు ఆయన ప్రేమచేత ఆకర్షింపబడినవారగుదురు. ఈ ప్రేమగల దేవునికి సమర్పించుకొని, ఆధిక్యతగల ఆయన సాక్షులలో ఒకరిగా మీరెట్లుతయారుకాగలరో మీకు చూపించుటకు యెహోవా సాక్షులు ఎంతో సంతోషింతురు. (కీర్తన 104:33; లూకా 9:23) అవును, అది ఒక ఆధిక్యతయైయున్నది. కొంచెమాలోచించుము! యెహోవా ఆరాధికునిగా, ఇక్కడ భూమిమీద పరదైసులో నిత్యము జీవించు గమ్యమును మీరు చేరుకొనగలరు.—జెఫన్యా 2:3; యెషయా 25:6, 8.
57. (ఎ) నూతన విధానములో, దేవునికి ప్రజలకుమధ్య ఏ సన్నిహిత సంబంధముండును? (బి) అప్పుడు మీరు అనుభవించగల ఆశీర్వాదములు కొన్ని ఏమైయున్నవి?
57 కాబట్టి పఠనము చేయుటయందు, యెహోవా దేవుని యెడల, ఆయన కుమారునియెడల, నీతియుక్తమైన పరలోక ప్రభుత్వముయెడల ప్రేమను, గుణగ్రహణనను వృద్ధిచేసికొనుటయందు కొనసాగుము. దేవుని ప్రభుత్వమును, మానవజాతిమీద అది కుమ్మరించు ఆశీర్వాదములను వర్ణించుటలో బైబిలు ప్రవచనము ఇట్లుచెప్పుచున్నది: “ఇదిగో! దేవుని నివాసము మనుష్యులతోకూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును.” ఈనాటి స్వార్థపూరిత, నాశనకర మానవ పాలనకు ఎంతో ఉన్నతముగా ఎత్తబడిన “దేవుడు తానే,” ఆ నూతన విధానములో తనను ప్రేమించు మరియు ఆరాధించు వారందరికి దయగల తండ్రిగా ఎంతో సమీపస్తుడై యుండును. నిజముగా, అక్కడ కేవలము ఒకేఒక మతము, యెహోవా దేవుని సత్యారాధన మాత్రమే ఉండును, మరియు ఆయన ఆరాధికులు తండ్రిపిల్లలవలె ఎంతో సన్నిహిత సంబంధమును అనుభవింతురు. తానెంత ప్రేమగల తండ్రియని ఆయన నిరూపించుకొనును! “ఆయన వారికన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెను.”—ప్రకటన 21:3, 4.
58. యెహోవా ‘సమస్తమును నూతముగా చేయునని’ మీరెందుకు నిశ్చయతను కలిగియుండగలరు?
58 ఆ విధముగా పరిపూర్ణ పరలోక ప్రభుత్వముక్రింద భూమిపై పరదైసును స్థాపించు మహాద్భుతము నెరవేర్చబడినదగును. అది రేపు సూర్యుడు ఉదయించి అస్తమించునంత వాస్తవముగా నిశ్చయమై యున్నది. ఏలయనగా భూమ్యాకాశములకు సృష్టికర్తయైన యెహోవా దేవుని వాగ్దానములు “నమ్మకమును నిజమునై యున్నవి.” “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని” పరలోక సింహాసనమునుండి ఆయనే ప్రకటించెను.—ప్రకటన 21:5 NW.
ఈ చిన్నపుస్తకమును పునఃసమీక్షించుటలో క్రింది ప్రశ్నలకు మీరెట్లుసమాధానమిచ్చెదరు?
ఏయే విధములుగా బైబిలు అసాధారణమై యున్నది?
దేవునిగూర్చి మీరేమి నేర్చుకొంటిరి?
క్రీస్తు యేసు ఎవరు?
అపవాదియైన సాతాను ఎవరు?
దేవుడు దుష్టత్వమును ఎందుకు అనుమతించెను?
మానవుడెందుకు చనిపోవును?
మృతుల పరిస్థితి ఏమైయున్నది?
విమోచన క్రయధనమనగానేమి?
ఎక్కడ మరియు ఎట్లుపునరుత్థానము జరుగును?
దేవుని రాజ్యమనగానేమి, అది ఏమి నెరవేర్చును?
“యుగ సమాప్తికి” “సూచన” ఏమైయున్నది?
పరదైసులో నిత్యజీవమునకు మీరు ఎట్లుసిద్ధపడ వచ్చును?
[అధస్సూచీలు]
a పై పేరాలను బలపరచు బైబిలు రెఫరెన్సులు: (1) అపొ.కార్యములు 17:26; కీర్తన 46:9; మీకా 4:3, 4; యెషయా 65:21-23; (2) యెషయా 65:25; 11:6-9; 55:12, 13; కీర్తన 67:6, 7; (3) యోబు 33:25; యెషయా 35:5, 6; 33:24; కీర్తన 104:24; (4) యెషయా 55:11.
b ప్రత్యేకముగా సూచించబడినవి తప్ప ఈ సాహిత్యములో బైబిలు సొసైటి ఆఫ్ ఇండియా బెంగుళూరు వారి తెలుగు బైబిలు వాడబడినది.
c మోనార్క్స్ అండ్ టోంబ్స్ అండ్ పీపుల్స్—ది డాన్ అఫ్ ది ఓరియంట్, పుట 25.
d జె. మెక్లింటాక్ మరియు జె.స్ట్రాంగ్ వ్రాసిన, సైక్లోపిడియా ఆఫ్ బిబ్లికల్, థియొలాజికల్, అండ్ ఎక్లిసియాస్టికల్ లిటరేచర్, సంపుటి 8, పుట 908.
[13వ పేజీలోని చిత్రం]
సృష్టింపబడిన వానిగా, మానవుడు జంతువులకంటే ఎంతో ఉన్నతుడై యున్నాడు
[18వ పేజీలోని చిత్రం]
యేసు పరిపూర్ణ మానవుడైన ఆదాముకు సరిసమానుడై యుండెను