నిజమైన విశ్వాసానికి నడిపే నామం
“మీరు యేసును గానీ, ఆయన విమోచన రక్తాన్ని గానీ నమ్మరు” అని ఒక స్త్రీ ఒక యెహోవాసాక్షితో అంది. “మిమ్మల్ని మీరు యెహోవాసాక్షులని చెప్పుకుంటారు. కానీ నేను యేసు సాక్షిని” అని ఒక వ్యక్తి నొక్కి చెప్పాడు.
యెహోవాసాక్షులు యేసు మీద విశ్వాసముంచరు లేదా ఆయనకు తగినంత ప్రాముఖ్యతనివ్వరు అన్న అభిప్రాయం చాలా మందికి ఉంది. అయితే, నిజానికి వాస్తవాలేమిటి?
నిజమే, యెహోవాసాక్షులు దేవుడి నామాన్ని గురించి చాలా బలమైన భావాలను కలిగివున్నారు.a “నేను దేవుడి పేరును తెలుసుకున్నప్పుడు నా జీవితం మలుపు తిరిగింది. నేను మొదటిసారిగా ఆ పేరును చదివినప్పుడు, నేను నిద్రలో నుండి అప్పుడే మేల్కొన్నట్లనిపించింది. యెహోవా అన్న పేరు నన్ను కదిలించింది, కుదిపివేసింది; అది హృదయపు అట్టడుగు భాగాన్ని స్పర్శించింది” అని బ్రెజిల్‌లోని ఈటమార్ అనే సాక్షి గుర్తు చేసుకుంటున్నాడు. అయినప్పటికీ, “నా హృదయం యేసు కొరకైన ప్రేమతో కూడా ఉప్పొంగిపోతుంది” అని కూడా ఆయన చెప్పాడు.
అవును, నిత్యజీవం పొందాలంటే, వాళ్ళు “దేవుని కుమారుని నామమందు” తప్పక విశ్వాసముంచాలని యెహోవాసాక్షులు గ్రహిస్తారు. (1 యోహాను 5:13) ‘యేసు నామమందు’ అనే వ్యక్తీకరణ యొక్క భావమేమిటి?
యేసు నామం దేనికి ప్రాతినిధ్యం వహిస్తుందంటే
“యేసు నామమున” మరియు, దానికి సాదృశ్యమైన వ్యక్తీకరణలు క్రైస్తవ గ్రీకు లేఖనాలంతటిలో, లేదా “క్రొత్త నిబంధన” అంతటిలోనూ కనిపిస్తుంది. నిజానికి యేసు పాత్ర సంబంధంగా “నామము” అనే పదం 80 కన్నా ఎక్కువ సార్లు కనిపిస్తాయి. కేవలం అపొస్తలులకార్యములలోనే దాదాపు 30 సార్లు కనిపిస్తుంది. తొలిశతాబ్దపు క్రైస్తవులు యేసు నామమున బాప్తిస్మమిచ్చారు. ఆయన నామమున స్వస్థపరిచారు, ఆయన నామమున బోధించారు, ఆయన నామమున విన్నవించుకున్నారు, ఆయన నామం కోసం బాధలను అనుభవించారు, ఆయన నామాన్ని శ్లాఘించారు.—అపొస్తలుల కార్యములు 2:38; 3:16; 5:28; 9:14, 16; 19:17.
ఒక బైబిలు నిఘంటువు ప్రకారం, బైబిలులో “నామము” అనే గ్రీకు పదం “ప్రతిదానినీ—అధికారాన్నీ, హోదాను, స్థానాన్ని, మహత్త్వాన్ని, ప్రభావాన్ని, సర్వోత్కృష్టత మొదలుకొని, ఆ పేరుకు వర్తించే ప్రతిదానినీ సూచించేందుకు” తరచూ ఉపయోగించబడింది. కనుక, యేసు నామం యెహోవా దేవుడు ఆయనకు అప్పజెప్పిన రాచఠీవితో కూడిన, విపులమైన కార్యనిర్వహణా అధికారాన్ని సూచిస్తుంది. అందుకే, “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది” అని యేసు తానే చెప్పాడు. (మత్తయి 28:18) పేతురు, యోహానులు ఒక కుంటివాడిని స్వస్థపరచిన తర్వాత, “మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని” యూదా మతనాయకులు అడిగారు. “నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు” అని తెలియజేస్తూ, యేసు నామము ప్రాతినిధ్యం వహించే అధికారంలోనూ శక్తిలోనూ తనకు గల విశ్వాసాన్ని పేతురు ధైర్యంగా వ్యక్తీకరించాడు.—అపొస్తలుల కార్యములు 3:1-10; 4:5-10.
విశ్వాసం యేసుమీదా, లేక కైసరుమీదా?
అయితే, యేసు నామమున అటువంటి విశ్వాసముందని చెప్పడం అంత సులభం కాదు. యేసు ముందుగా చెప్పినట్లు, ఆయన శిష్యులు ‘ఆయన నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు.’ (మత్తయి 24:9) ఎందుకని? యేసు నామము దేవుడి నియమిత పరిపాలకుడిగా, రాజాధిరాజుగా, సకల జనములు లోబడవలసిన వ్యక్తిగా, ఆయన హోదాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆయనకు లోబడడానికి జనులు సిద్ధంగానో, సుముఖంగానో లేరు గనుకనే వాళ్ళు ఆయన శిష్యులను ద్వేషిస్తారు.—కీర్తన 2:1-7.
యేసు కాలం నాటి మతనాయకులు కూడా యేసుకు లోబడుతూ ఆయన ముందు తలవంచేందుకు ఇష్టపడలేదు. వారు “కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడని” చెబుతూ, దేవుని కుమారుడ్ని నిరాకరించారు. (యోహాను 19:13-15) అందుకు మారుగా, వాళ్ళు తమ విశ్వాసాన్ని కైసరు నామము మీద—ఆయన శక్తి మీద అధికారం మీద—ఆయన శాసనాధికారం మీద ఉంచారు. వాళ్ళు తమ స్థానాన్నీ, హోదాను నిలబెట్టుకోవడానికి యేసు చనిపోవాలని కూడా నిర్ణయించుకున్నారు.—యోహాను 11:47-53.
యేసు మరణించిన అనేక శతాబ్దాల తర్వాత, తాము క్రైస్తవులమని చెప్పుకునే అనేకులు యూదా నాయకులను పోలిన దృక్పథాన్ని అలవరచుకున్నారు. ఈ నామమాత్రపు క్రైస్తవులు రాష్ట్ర ప్రభావంలోనూ, అధికారంలోను విశ్వాసముంచుతూ, రాష్ట్రం చేసే పోరాటాల్లో పాల్గొన్నారు. ఉదాహరణకు, 11వ శతాబ్దంలో, చర్చి మీల్ట్‌యా క్రిస్టీలోకి పనికిమాలిన యోధులను లేదా క్రైస్తవ భటులను సంస్థీకరించిన తర్వాత, “నీతియుక్తమైన యుద్ధాన్ని నిర్వహించవలసిన బాధ్యత క్రైస్తవ సామ్రాజ్యపు లౌకిక అధికారాల నుండి తీసివేయబడింది, అందుకు మారుగా, చర్చి తన క్రైస్తవ భటుల ద్వారా ఆ పనిని నిర్వహించాలని తలంచబడింది.” (ద ఆక్స్‌ఫోర్డ్ హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ) క్రూసేడ్లలో భాగం వహించడం ద్వారా, “వాళ్ళు దేవుడితో కాంట్రాక్ట్ చేసుకుని, పరదైసులో తమకోసం ఒక స్థానాన్ని నిశ్చయపరచుకున్నామని” క్రూసేడ్లలో చాలామంది నమ్మేందుకు పోప్‌ల ప్రఖ్యాపనలు కారణమయ్యాయి అని ఆ వృత్తాంతం చెబుతుంది.
యేసుకు నమ్మకంగా ఉంటూనే, రాజకీయ కార్యాల్లోనూ అలాగే, దేశాలు చేస్తున్న యుద్ధాల్లోనూ పాల్గొనవచ్చనీ కొందరు వాదించవచ్చు. చెడు ఎక్కడ కనిపించినా దానిని ఎదిరించడం క్రైస్తవుడి కర్తవ్యమనీ, అవసరమైతే యుద్ధానికి పాల్పడడం కూడా అందులో ఇమిడి ఉందనీ వాళ్ళు భావించవచ్చు. కాని తొలి క్రైస్తవులకు కూడా ఇలాంటి అభిప్రాయమే ఉండిందా?
“తొలి క్రైస్తవులు సైనిక దళాల్లో సేవ చేయలేదు” అని ద క్రిస్టియన్ సెన్‌చ్యురీ పత్రికలోని ఒక శీర్షిక చెబుతుంది. సా.శ. 170-180 దశాబ్దం వరకూ కూడా క్రైస్తవులు సైన్యంలో సేవ చేశారనేదానికి ఏ రుజువూ లేదని అది వివరిస్తుంది. “కేవలం కాలక్రమేణా మాత్రమే, క్రైస్తవులు సైనిక సేవ ఎడల తమకు గల వ్యతిరేక భావాన్ని వదులుకున్నారు” అని కూడా ఆ శీర్షిక చెబుతుంది.
వాటి పర్యవసానాలేమిటి? “క్రైస్తవత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు, క్రైస్తవేతరులకు మల్లే, ఏ వ్యత్యాసమూ లేకుండా యుద్ధంలో పాల్గొనడంలో కన్నా ఇంకా ఎక్కువగా ఏమీ జరగలేదు” అని ద క్రిస్టియన్ సెన్‌చ్యురీ శీర్షిక పేర్కొంది. “ఆ క్రైస్తవులు ఒకవైపు కరుణార్ద్ర హృదయుడైన రక్షకునియందు విశ్వాసముందని చెబుతూ, మరొక వైపు మతపరమైన లేక జాతీయ యుద్ధాలకు వాళ్ళు ఉత్సాహంగా మద్దతు ఇవ్వడం విశ్వాసాన్ని పోగొట్టే మేరకు జరిగింది.”
నేడు తొలి క్రైస్తవులను అనుకరించడం
తొలి క్రైస్తవుల స్వచ్ఛమైన మాదిరిని అనుకరించడం నేటి క్రైస్తవులకు సాధ్యమేనా? అది సాధ్యమేనని ఈ శతాబ్దంలోని యెహోవాసాక్షులు చూపించారు. వాళ్ళ గురించి మాట్లాడుతూ, “యెహోవాసాక్షులు ఎవరూ ఎన్నడూ యుద్ధానికి వెళ్ళరు. . . . ప్రపంచంలో అధికార స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విశ్వాసం గలవారే అయితే, [రెండవ ప్రపంచ యుద్ధం] సంభవించేదే కాదు” అని హోలోకాస్ట్ ఎడ్యుకేషనల్ డైజెస్ట్ సంపాదకుడు పేర్కొన్నాడు.
ఈ మధ్య కాలంలో, ఉత్తర ఐర్లాండ్‌లో చెలరేగినటువంటి ప్రాంతీయ పోరాటాల విషయంలో కూడా అలాగే చెప్పవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం, యెహోవాసాక్షుల్లో ఒకరు బెల్‌ఫాస్ట్ నగరంలోని ప్రొటెస్టెంట్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి బోధిస్తున్నాడు. ఈ సాక్షి మునుపు క్యాథలిక్ అని తెలుసుకున్న తర్వాత, ఒక గృహస్థుడు ఇలా అడిగాడు: “నువ్వు క్యాథలిక్‌గా ఉన్నప్పుడు నువ్వు ఐ.ఆర్.ఏ.కు [ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ] మద్దతునిచ్చేవాడివా” అని అడిగాడు. ఆ వ్యక్తి ఒక క్యాథలిక్‌ను చంపడానికి తుపాకీ పట్టుకుని బయలుదేరుతుండగా పట్టుబడి కస్టడీలో ఉంచబడి, ఈ మధ్యే విడుదలయ్యాడు. గనుక అతడు హింసాత్మకంగా మారగలడని సాక్షి గ్రహించాడు. కనుక, ఆ సాక్షి, “నేను ఇప్పుడు క్యాథలిక్‌ను కాను. నేను యెహోవాసాక్షిని. నిజమైన క్రైస్తవుడిగా నేను ఎవరినీ ఏ ప్రభుత్వం కోసమైనా, ఏ మనిషి కోసమైనా చంపను” అని జవాబిచ్చాడు. దాంతో, ఆ గృహస్థుడు ఆయనతో కరచాలనంచేసి, “హత్య ఏదైనా తప్పే. మీరూ మీ వాళ్ళూ మంచి పనిచేస్తున్నారు. అలాగే చేస్తూ ఉండండి” అని అన్నాడు.
యేసు నామంలో విశ్వాసముంచడమంటే
అయితే, యేసు నామమందు విశ్వాసముంచడమంటే, యుద్ధం చేయకుండా ఉండడం అనే దాని కన్నా ఎక్కువే అర్థముంది. దానర్థం క్రీస్తు ఆజ్ఞలనన్నింటినీ పాటించడం. “నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు” అని యేసు అన్నాడు. మనం ‘ఒకరినొకరం ప్రేమించాలన్నది’ ఆయన ఆజ్ఞల్లో ఒకటి. (యోహాను 15:14, 17) ప్రేమ ఇతరులకు మేలు చేయడానికే ప్రయత్నిస్తుంది. ఇది వర్గ, మత మరియు సాంఘిక దురభిమానాలను తొలగిస్తుంది. అది ఎలాగో యేసు ప్రదర్శించి చూపాడు.
యేసు కాలంనాటి యూదులకు సమరయులంటే చాలా వ్యతిరేకమైన భావాలుండేవి. యేసు అందుకు భిన్నంగా సమరయ స్త్రీతో మాట్లాడాడు. దాని ఫలితంగా, ఆమె, మరితరులూ ఆయన నామంలో విశ్వాసముంచారు. (యోహాను 4:39) తన శిష్యులు “యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును” తనకు సాక్షులౌతారని కూడా యేసు చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 1:8) జీవదాయకమైన ఆయన సందేశం యూదుల వరకు మాత్రమే పరిమితం కాలేదు. అలా, రోమన్ సైనిక కమాండర్ అయిన కొర్నేలీని సందర్శించమని పేతురుకు నిర్దేశించబడింది. మరొక జాతికి చెందిన ఒకరిని సందర్శించడం ఒక యూదుడికి నియమ విరుద్ధమే అయినప్పటికీ, “ఏ మనుష్యుడును నిషేధింపదగినవాడనియైనను అపవిత్రుడనియైనను చెప్పకూడదని” దేవుడు పేతురుకు చూపించాడు.—అపొస్తలుల కార్యములు 10:28.
యేసును అనుకరిస్తూ, యేసు నామము ద్వారా వచ్చే రక్షణను గురించి తెలుసుకునేందుకు ప్రజలందరికీ—వారిది ఏ జాతైనా, ఏ మతమైనా, ఆర్థికంగా ఎలాంటి పుట్టుపూర్వోత్తరమైనా సరే—యెహోవాసాక్షులు ఇష్టపూర్వకంగా సహాయం చేస్తారు. యేసు నామమందలి విశ్వాసం ‘యేసు ప్రభువని తమ నోటితో ఒప్పుకొనేందుకు’ వారిని కదిలిస్తుంది. (రోమీయులు 10:8, 9) యేసు నామమందు విశ్వాసముంచడానికి మీరు కూడా నేర్చుకోగల్గేందుకు వారి సహాయాన్ని స్వీకరించమని మేము మిమ్మల్ని కోరుతున్నాం.
యేసు నామం గౌరవం, ఆదరం, విధేయత వంటి అనుభూతులను నిజంగా పురికొల్పాలి. “ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను” అని అపొస్తలుడైన పౌలు చెప్పాడు. (ఫిలిప్పీయులు 2:10, 11) భూమి మీద జీవిస్తున్నవారిలో ఎక్కువ శాతం మంది యేసు పరిపాలనకు లోబడడానికి సిద్ధంగా లేకపోయినప్పటికీ, ప్రజలందరూ అలా లోబడి ఉండవలసిన లేదా అలా లోబడకపోతే నశించిపోయే కాలం సమీపించిందని బైబిలు చూపిస్తుంది. (2 థెస్సలొనీకయులు 1:6-9) కనుక, ఆయన ఆజ్ఞలనన్నింటినీ పాటిస్తూ, యేసు నామమందు విశ్వాసముంచేందుకు ఇదే సమయం.
[అధస్సూచీలు]
a అదనపు సమాచారం కోసం, 1984లో, వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ న్యూయార్క్ ప్రచురించిన నిరంతరం నిలిచే దైవిక నామం (ఆంగ్లం) బ్రోషూర్ 28-31 పేజీలు చూడండి.
[6వ పేజీలోని చిత్రం]
యేసు పేరట లక్షలాది మందిని చంపారు, చంపబడ్డారు
[7వ పేజీలోని చిత్రం]
యేసుకు జాతి దురభిమానాలు ఉండేవి కావు. మరి మీకు?