‘సహించిన వారు ధన్యులు’
1. 1914నుండి భూమిమీది ఏ పరిస్థితి మత్తయి 24:3-8ని నెరవేర్చెను, మరియు ఏ విషయములో నానాజాతి సమితి మరియు ఐక్యరాజ్యసమితి విఫలమయ్యెను?
తన పుస్తకమగు ది ప్రెజెంట్ ఏజ్, నందు రాబర్ట్ నిస్‌బెట్ “1914నుండి దాదాపు ఆగకుండ డెబ్బయైదు సంవత్సరములు జరిగిన యుద్ధమును”గూర్చి మాట్లాడుచున్నాడు. అవును, ప్రపంచ యుద్ధములతో సహా, కాలాంతమందలి “యుద్ధములనుగూర్చి యుద్ధసమాచారములను గూర్చి” యేసు క్రీస్తు ముందేచెప్పెను. (మత్తయి 24:3-8) “యుద్ధమును శాశ్వతకాలము వరకు ఆపుజేయుటకు” 1920లో నానాజాతి సమితి ముందుకు తీసుకొని రాబడినది. ఎంత దుఃఖదాయకముగా అది విఫలమైనది! “తర్వాతి తరములవారిని యుద్ధతెగులునుండి కాపాడుటకు” 1945లో ఐక్యరాజ్య సమితి వ్యవస్థీకరించబడినది. అయితే మాక్స్ హారెల్‌సన్ వ్రాసిన పుస్తకమగు ఫైర్స్ ఆల్ ఎరౌండ్ ది హారిజన్ ఇట్లు వివరించుచున్నది: “రెండవ ప్రపంచ యుద్ధము తర్వాత ఎక్కడో ఒకచోట యుద్ధము జరుగకుండ దాదాపు ఒక్క దినమైనను లేదు.”
2. లోక పరిస్థితులనుగూర్చి కొంతమంది ప్రజలు ఏమి అడుగుదురు, అయితే మనమే ప్రశ్నలను అడుగవలెను?
2 ఉగ్రవాదము, బలత్కారము, అవినీతి, అలాగే బీదరికము, మాదక ద్రవ్యములు, తెగుళ్లు—ఇవన్నియు దుఃఖకర పరిస్థితికి తోడైనవి. కొందరిట్లడుగవచ్చును: ‘మానవత్వము ఎంతకాలము యిలాంటి కలచివేయు పరిస్థితులను సహింపగలదు?’ మరింత ప్రాముఖ్యముగా మనమిట్లు అడుగవలెను: ‘తన భూసృష్టిని కొల్లగొట్టుటను దేవుడెట్లు సహించును? దుష్టులు భూమిని నాశనముచేయుటకు, మరియు తన విలువైన నామముమీద నిందను మోపుటకు ఆయనింకా ఎంతకాలము వారిని అనుమతించును?’
3. (ఎ) ప్రవక్తయైన యెషయా ఏమని ప్రశ్నించెను, మరియు ఎందుకు? (బి) దానికి యెహోవా ఏమని జవాబిచ్చెను, మరియు ఇది మనకాలము కొరకు దేనిని సూచించుచున్నది?
3 ప్రవక్తయైన యెషయా అటువంటి ప్రశ్ననే లేవదీసెను. తన తోటివారికి యెహోవానుండి వచ్చిన వర్తమానమును ప్రకటించుపని ఆయనకు అప్పగించబడెను. అయితే తననుగాని తనను పంపిన దేవునిగాని వారు లక్ష్యపెట్టరని ఆయన ముందే హెచ్చరింపబడెను. కాగా, యెషయా: “ఓ యెహోవా, ఎన్నాళ్లమట్టుకు?”అని ప్రశ్నించెను. అవును, ఎన్నాళ్లమట్టుకు యెషయా ఆ మూర్ఖజనమునకు ప్రకటింపవలెను, మరియు తన వర్తమానమును లక్ష్యపెట్టుటకు అవమానకరమైన రీతిలో వారు తిరస్కరించుటను యెహోవా ఎంతకాలము సహించును? యెహోవా యిట్లు సమాధానమిచ్చెను: “నివాసులులేక పట్టణములును, మనుష్యులులేక యిండ్లును పాడగువరకును దేశము బొత్తిగా బీడగువరకును. . .ఆలాగున జరుగును.” (యెషయా 6:8-11) అదే ప్రకారముగా ఈనాడు, అపనమ్మక క్రీస్తుమత సామ్రాజ్యము ముఖ్యభాగముగాయున్న లోకముమీదికి తీర్పుతెచ్చుటకు దేవుడు తన నిర్ణయకాలము వరకు అలాంటి నిందను సహించును.
4. యోబు సహనముయొక్క ఫలితమేమైయుండెను, మరియు అది ఈనాడు మనకు ఏ అభయమునిచ్చుచున్నది?
4 సాతాను నిందలను యెహోవా దీర్ఘకాలముగా సహించెను. 3,600సం.ల పూర్వము, పరీక్షించినప్పుడు తన యథార్థతను కాపాడుకొనలేడను సాతాను సవాలును తప్పని నిరూపించుచు నమ్మకమైన యోబుకూడ సహించెను. ఇది యెహోవా హృదయమును ఎంతగా సంతోషింపజేసెను! (యోబు 2:6-10; 27:5; సామెతలు 27:11) యేసు సహోదరుడైన యాకోబు ఆ తర్వాత చెప్పినట్లుగా: “సహించినవారిని ధన్యులనుకొనుచున్నాము కదా? మీరు యోబుయొక్క సహనమునుగూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొనియున్నారు.” అదేవిధముగా, యెహోవాతో కూడ ఈనాడు సహించువారికి ధన్యతకలుగునని అభయమివ్వబడినది.—యాకోబు 5:11.
5. ఈనాటి దేవుని ప్రజలు సహనమును చూపించు అవసరత కలదని యేసు ఎట్లు చూపించెను, మరియు ఏ పనిచేయుచుండగా వారు సహించవలసియున్నారు?
5 మనకాలములో దేవుని ప్రజలు సహనమును చూపవలసిన అవసరముండునని యేసు స్పష్టముగా చూపించెను. “విధానాంతము”యొక్క సూచనను గూర్చి ప్రవచించుచు ఆయనిట్లనెను: “అంతము వరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును.” ఏది చేయుచు సహించుట? దానికి యేసు తర్వాత మాటలు జవాబునిచ్చుచున్నవి: “మరియు ఈ రాజ్యసువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందతటను ప్రకటింపబడును.” (మత్తయి 24:3, 13, 14) అటు తరువాత మాత్రమే ‘అంతము వచ్చును.’—మార్కు 13:10, 13; లూకా 21:17-19 కూడ చూడుము.
ఎందుకు యెహోవా సహించుచున్నాడు
6. సహనమునకు యెహోవా ఎందుకు ఒక అసాధారణమైన ఉదాహరణయైయున్నాడు, మరియు ఆయనలా సహించుటకు ఒక కారణమేమైయున్నది?
6 “దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్ఛయించినవాడై, నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించెను”అని అపొస్తలుడైన పౌలు వివరించెను. (రోమీయులు 9:22) ఈ ఉగ్రతాపాత్రమైన ఘటములు, దుష్టులు యింకను ఉనికిలోవుండుటను యెహోవా ఎందుకు సహించుచున్నాడు? సృష్టికర్తనుండి వేరై స్వతంత్రముగా ఉండే మానవ పరిపాలన నిశ్చయముగా విఫలమగునని ప్రదర్శించుట, యిందుకు ఒక కారణమై యున్నది. (యిర్మీయా 10:23) యేసు రాజ్యపాలన ద్వారా మానవ కుటుంబమునకు ఆయన మాత్రమే సమాధానమును, పొందికను తీసుకురాగలడని నిరూపించుచు త్వరలోనే దేవుని సార్వభౌమాధిపత్యము మహిమపరచబడును.—కీర్తన 37:9-11; 45:1, 6, 7.
7. మరియే యితర కారణముచేతకూడ యెహోవా సహించెను, మరియు ఇది 1930నుండి లక్షలాదిమందికి ఏ ప్రయోజనమును తెచ్చెను?
7 అంతేకాకుండ, “కరుణాపాత్రమైన ఘటములయెడల, . . .తన మహిమైశ్వర్యమును కనుపరచవలెనని” యెహోవా సహించెను. (రోమీయులు 9:23) యేసు క్రీస్తుతో ఆయన పరలోక రాజ్యమందు పరిపాలించుటకు “భూలోకములోనుండి కొనబడిన” యథార్థపరులైన అభిషక్తులు ఈ కరుణాపాత్ర ఘటములై యున్నారు. 1,44,000మందిని ముద్రించుట అపొస్తలుల కాలమునుండి మొదలయినది. అది ఇప్పుడు ముగింపునకు వచ్చుచున్నది. (ప్రకటన 7:3; 14:1, 4) మరియు ఇదిగో! 1930నుండి, చివరి శ్రమను తప్పించుకొని పరదైసు భూమిమీద నిత్యజీవమును స్వతంత్రించుకొందుమను ఉత్తరాపేక్షయందు సంతోషమనుభవించుచున్న, “ప్రతి జనములో నుండి వచ్చిన. . .గొప్ప సమూహమునకు” చెందిన లక్షలాదిమంది యితరులను సమకూర్చుటకు యెహోవా సహనము అనుమతినిచ్చినది. (ప్రకటన 7:4, 9, 10, 13-17) నీవును ఆ గొప్ప సమూహములో ఒకడవై యున్నావా? అట్లయిన, ఉగ్రతాపాత్రమైన ఘటములుండుటను యిప్పటివరకు యెహోవా సహించినందుకు నీకు సంతోషముగా లేదా? ఏమైనను, యెహోవా సహించినట్లుగా నీవును సహించుటయందు తప్పక కొనసాగవలెను.
సహనము ప్రతిఫలమియ్యబడినది
8. మనందరికి సహనము ఎందుకు అవసరము, మరియు మనము సహనము విషయములో ఏ ఉదాహరణను ఆసక్తితో విచారించవలెను?
8 వాగ్ధానములను పొందవలెనంటే మనకందరికి సహనము అవసరము. హెబ్రీయులు 10:36లో ఈ మూలసత్యమును చెప్పిన తర్వాత, అపొస్తలుడైన పౌలు ప్రాచీన కాలమందలి ఒక గొప్ప “సాక్షి మేఘము” చూపిన అచంచలమైన విశ్వాసమును సహనమును వివరముగా వర్ణించెను. ఆపిమ్మట ఆయన మనకిట్లు సలహానిచ్చుచున్నాడు, “విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మనయెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై,” యేసు ప్రతిఫలము విషయములో ఎన్నటికిని దృష్టిలోపించనివాడై, సహనముతో హృదయపూర్తిగా సేవచేసెను. మనము కూడ సహనము చూపుటకు ఆయన మాదిరి మనలను ఎంతగా బలపరచుచున్నది!—హెబ్రీయులు 12:1, 2.
9. సహనముయొక్క ఆధునిక ఉదాహరణల ఫలితముగా ఏమి కలిగెను?
9 సహనమును గూర్చిన ఆధునిక-దిన ఉదాహరణలును సమృద్ధిగాయున్నవి. తమసహనము విషయములో అసామాన్యముగా యుండిన సహోదర సహోదరీలను మీరు ఎరిగియుండవచ్చును, లేక వ్యక్తిగతముగా తెలిసియుండవచ్చును. వారి విశ్వాస్యత మనలను ఎంతగా ఉత్తేజపరచినది! అలాగే ప్రతిసంవత్సరము యెహోవా సాక్షులు తాము ప్రపంచవ్యాప్తముగా చేసిన కార్యమును గూర్చిన రిపోర్టును వాచ్‌టవర్ సొసైటికి యిచ్చినప్పుడు, సహనమును గూర్చిన మరియు యథార్థతను కాపాడుకొనిన పులకరింపజేయు వృత్తాంతములు మరిన్ని మనకు అందును. ఈ సాక్షులు ‘విశ్వాసమునందు సహనమును అమర్చుకొనిరని’ చూపుచు, 1990 జనవరి 1, వాచ్‌టవర్ (ఆంగ్లపత్రిక) పుటలు 20-23నందు 1989లో నెరవేర్చిన మహాకార్యమును సంగ్రహముగా ఒక పట్టికలో వివరించినది.—2 పేతురు 1:5, 6.
బహు ఆకర్షణీయమైన మన సంవత్సరము
10. (ఎ) 1989లో ఎన్ని దేశములు, ద్వీపములు రాజ్యసువార్తను ప్రకటించుటకు భాగము వహించినవి, మరియు ఈ పనిలో ఎందరు పాలుపంచుకొనిరి? (బి) శిఖరాగ్ర మాసమందు ఎంతమంది పయనీర్లు రిపోర్టు చేసిరి, మరియు యింటింటి సేవయందు మొత్తము ఎన్ని గంటలు గడుపబడినవి?
10 ఆ పట్టిక చూపిన విధముగా, రానైయున్న యెహోవా రాజ్య ప్రకటనయందు 212 దేశములు, ద్వీపములు భాగము వహించినవి. ప్రియ కావలికోట పాఠకుడా, ఈ మహా కార్యమును నెరవేర్చిన 37,87,188మందిలో నీవును ఒకడవై యున్నావా? ఆ సేవా సంవత్సరముయొక్క శిఖరాగ్ర మాసములో రిపోర్టుచేసిన 8,08,184 మంది పయనీర్లలో నీవును ఒకడవై యున్నావా? 1989లో భూవ్యాప్తితముగా యింటింటి సేవలో గడిపిన 83,54,26,538గంటలలో నీ తోడ్పాటు ఎలాంటిదైనను, ఆనందించుటకు నీవొక కారణమును కలిగియున్నావు.—కీర్తన 104:33, 34; ఫిలిప్పీయులు 4:4.
11. (ఎ) ఆనందించుటకు ఒక కారణముగా పోయిన మార్చి 22న జ్ఞాపకార్థదినమునకు ఎంతమంది హాజరైరి, మరియు ఎందుకు? (బి) ఎంతమంది బాప్తిస్మము తీసుకొనిరి, మరియు ఈ విషయములో పట్టికలోని ఏ దేశములు అసాధారణముగా యున్నవి?
11 ప్రపంచవ్యాప్తముగా గత మార్చి 22న ఆచరించిన యేసు మరణ జ్ఞాపకార్థ దినమునకు హాజరైన 94,79,064మందినిబట్టి కూడ ఆనందించుము! యెహోవాను సేవించుటలో క్రమముగా భాగమువహించుటకు శ్రద్ధగల ఈ గొర్రెవంటివారిని ప్రేమతో దొడ్డిలోనికి తోలినట్లయిన, అదనముగా 56,91,876మంది రాజ్యప్రచారకులు రాగల సస్యతను ఇది చూపించుచున్నది. (యోహాను 10:16; ప్రకటన 7:9, 15) 1989 సేవా సంవత్సరములో 2,63,855మంది క్రొత్త సాక్షులు బాప్తిస్మము తీసుకొనుట ద్వారా సూచింపబడినట్లు, యిప్పటికే అనేకులు ప్రత్యుత్తరమిచ్చుచున్నారు.
12. (ఎ) వాచ్‌టవర్ సొసైటి కర్మాగారముల విషయములో (బి) పత్రికలు, చందాలనందించుట విషయములో, ఏ అంశములను పట్టిక వెల్లడిచేయుట లేదు?
12 పట్టిక వెల్లడిచేయని అంశములును కొన్నికలవు. బైబిళ్లు, పుస్తకములు, బ్రొషూర్లు, పత్రికలు మొదలగు సాహిత్యముల కొరకైన తృష్ణ తీర్చరానిదిగాయున్నది. తత్ఫలితముగా, 3,58,11,000 బైబిళ్లను, పుస్తకములను బ్రొషూర్లను ముద్రించుటలో న్యూయార్కులోని వాచ్‌టవర్ కర్మాగారములు 25,999 టన్నుల కాగితమును ఉపయోగించినవి. ఇది 1988కంటే 101-శాతము అభివృద్ధి. “తగినవేళలో” ఆత్మీయాహారమును “పెట్టుటకు” “నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసునికి” మద్దతునిచ్చుటలో వాచ్‌టవర్ సొసైటి యితర పెద్ద కర్మాగారములు, ప్రాముఖ్యముగా జర్మని, ఇటలీ, జపానులలో అదనముగా షిఫ్టులలో పనిచేసినవి. (మత్తయి 24:45) “మహా బబులోను” సంబంధముగా ప్రచురించిన వాచ్‌టవర్ సంచికలను పంచిపెట్టవలెనని నొక్కితెల్పుటతో, ఏప్రిల్, మే నెలలలో అత్యధికముగా పత్రికలు, చందాలు అందించబడినవి. (ప్రకటన 17:5) నిస్సందేహముగా, 1990 సేవా సంవత్సరములో మన శ్రేష్ఠమైన సాక్ష్యపు పోరాటముగా నిరూపించుకొను పనియందు ఈ ఏప్రిల్‌లో సహాయ పయనీర్లు మరియు యితరులు లోక క్షేత్రములోనికి అత్యధిక సంఖ్యలో బయలు వెడలియుందురు.—యెషయా 40:31; రోమీయులు 12:11, 12 పోల్చుము.
13. పోయిన సంవత్సరము పట్టికలో లేని ఏ దేశములు ఈసారి పట్టికలో యివ్వబడినవి? వివరించుము.
13 పట్టికను మరలా చూడుము. పోయిన సంవత్సరము పేర్లు వ్రాయబడని కొన్ని దేశముల పేర్లు వ్రాయబడియుండుటను నీవు చూచుచున్నావా? అవును, ఎందుకు? హంగేరి, పోలాండులలో ఇటీవలనే మనపని చట్టబద్దము చేయబడినది. యెహోవా సాక్షులయెడల ఇప్పుడు అలాంటి అవధారణమును చూపుచున్నందుకు ఈ దేశములలోని అధికారులకు మనము కృతజ్ఞులమై యున్నాము. ఈ విషయములో, “మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము,” ప్రపంచవ్యాప్త సహోదరత్వపు ప్రార్థనలకు జవాబు దొరికినది.—1 తిమోతి 2:1, 2.
14. పోలెండు “దైవభక్తి” జిల్లా సమావేశముల ముఖ్యాంశములను కొన్నింటిని చెప్పుము.
14 “దైవభక్తి!” అంతెందుకు, ఆగస్టులో మూడుచోట్ల పోలెండునందు “దైవభక్తి” జిల్ల సమావేశములు జరిగినవి! 91,024మందిగాయున్న మన పోలిష్ సహోదరులు ఎంత అద్భుతకరమైన దాతలుగా నిరూపించుకొనిరి! (హెబ్రీయులు 13:1, 2, 16) అద్భుతము జరిగినట్లుగా, వేలాదిమంది సహోదరులు—జెక్స్, జర్మన్స్, రష్యన్స్ మరియు యితరులు—బస్సు, రైలు, చివరికి నడిచికూడ వచ్చుటకు వీసాలు సంపాదించిరి. మరికొందరైతే అమెరికా, పశ్చిమ యూరపు, ఎంతో దూరమునగల ఫసిఫిక్ మహాసముద్ర ద్వీపములు మరియు జపానునుండి విమానములలో వచ్చిరి. మన సహోదరులు అద్దంలా పరిశుభ్రము చేసిన పెద్దపెద్ద స్టేడియంలు బొటాబొటిగా సరిపోయినవి. క్రొజొవ్‌లో 65,710మంది, పొజ్‌నాన్‌లో 40,442మంది వార్సాలో 60,366మంది కలిసి మొత్తము 1,66,518మంది ఆ సమావేశములకు హాజరైరి. ప్రతి కేంద్రమందును బాప్తిస్మము తీసుకొనినవారి సంఖ్య ఆనంద బాష్పములను కురిపించినది. పోజ్‌నాన్‌లో ఒక 9-సంవత్సరముల బాలుడు, 90-సంవత్సరముల వృద్ధుడు బాప్తిస్మము తీసుకొనగా, మొత్తము ఆ మూడు సమావేశములకు కలిపి 6,093మంది బాప్తిస్మము తీసుకొనిరి. వీరిలో అనేకులు ముసలివాళ్లతోపాటు మతము చనిపోవునని చెప్పు దేశములనుండి వచ్చిన కౌమారులైయుండిరి. దేవుని వాక్యముమీద ఆధారపడు మతము అలా చనిపోదు! (కీర్తన 148:12, 13; అ.కార్యములు 2:41; 4:4 పోల్చుము.) తూర్పు యూరపులో మన సహోదరుల సహనము ఎంత అద్భుతరీతిగా ప్రతిఫలమివ్వబడినది!
పరీక్షయందును కొనసాగిన విశ్వాస్యత
15. లెబనోనులో సాక్షులు ఎట్లు సహనమును, స్థిరతను చూపించిరి, దానితో ఏ చక్కని ఫలితములు వచ్చినవి?
15 అపొస్తలుడైన పౌలు వలెనే, యెహోవా సాక్షులుకూడ అనేక మరియు వివిధ పరిస్థితులలో సహనము చూపుటకు పిలువబడియున్నారు. (2 కొరింథీయులు 11:24-27) లెబనోనులో అంతర్గత యుద్ధము జరుగుచున్నది. మన సహోదరులు ఎట్లు స్పందింతురు? స్థిరముగాను, తీర్మానపూర్వకముగాను వారున్నారు. 1989లో తీవ్రముగా బాంబులు వేయుట జరిగినది, ఈ బాంబుదాడులు అతితీవ్రముగా ఉన్న ప్రాంతములలో సహితము సహోదరులు నీరసపడకుండుటకు తీర్మానించుకొనిరి. బీరట్‌లోని ఒక సంఘము ఇలా రిపోర్టు చేయుచున్నది: “వారములో అన్ని సాయంకాలములందు క్రమముగా సేవచేయు గుంపులను ఏర్పాటు చేయడమైనది. ప్రమాదకర పరిస్థితులయందును సహోదరులు నిరుత్సాహపడలేదు. క్రితమెన్నటికంటెను ఎక్కువ ప్రాంతములలో మేము పనిచేసాము. ఏప్రిల్‌లో మేము పయనీర్ల శిఖరాగ్ర సంఖ్యను కలిగియుంటిమి. క్రొత్త బైబిలు పఠనములు ప్రారంభమైనవి, ఎక్కువ పత్రికలు మరియు పుస్తకములు అందించబడినవి.”
16. సాక్షులులేని పట్టణములకు సువార్తను తెచ్చుటద్వారా కొలంబియాలోని మన సహోదరులు ఎట్లు సహనమును చూపిరి?
16 మాదక ద్రవ్యముల రవాణా, హింసల కారణముగా కొలంబియా వార్తలలోకెక్కినది. ఇక్కడ నమ్మకమైన క్రైస్తవులు చూపిన సహనమును వార్తావిశేషమైనది. యిటీవలనే, సాక్షులులేని పదివేలు అంతకంటె ఎక్కువ జనాబాగల 31 పట్టణములకు తాత్కాలిక స్పెషలు పయనీర్లను పంపించుట జరిగినది. ఒక పట్టణములో పయనీర్లు కేవలము కొద్దినెలలు మాత్రమే యుందురని తెలుసుకొనిన శ్రద్ధగలవారు, పయనీర్లు మరి కొంతకాలము పాటు ఉండవలెనని వేడుకొనిరి. మరొకచోట, పయనీర్లు మూడునెలలలో చేసిన ఆత్మీయ సహాయమును ప్రశంసించుచు వ్రాసిన ఉత్తరమునందు శ్రద్ధగలవారు 18మంది తమ సంతకములను చేసిరి, అలాగే మరింత సహాయము కొరకు వారు అభ్యర్థన చేసిరి. “ఇది గంభీరమైన పని”యని వారనిరి. చెప్పవలసిన అవసరము లేదు, ఈ రెండు స్థలములలో శ్రద్ధను పెంపొందించుటకు ఏర్పాట్లు చేయబడెను. అలాంటి దూరప్రాంతములను అభివృద్ధిచేయుటకు సహనము అవసరము, అయితే పనిచేయు పయనీర్ల కష్టము సంపన్నముగా ఆశీర్వదించబడినది.
17, 18. (ఎ) ఏ పరిస్థితులయందు ఇటలీలోని యెహోవా సాక్షులు సహనము చూపిరి? (బి) వారినిగూర్చి అబద్ధములు వ్యాప్తిచేయబడుచున్నను సాక్షులు ఎట్లు ముందుకు సాగిరి?
17 ఇటలీలో, యెహోవా సాక్షులు మతనాయకులనుండి బలమైన వ్యతిరేకతను ఎదుర్కొనుచున్నారు, అయితే యెహోవా బలమునందు వారు సహించియున్నారు. యెహోవా సాక్షులు తమ గృహముల బెల్ నొక్కరాదని చెప్పు స్టిక్కర్లను యిండ్ల తలుపులమీద అంటించవలెనని, చర్చి సభ్యులకు వివిధ చర్చిలలో మతనాయకులు వాటిని పంచిపెట్టిరి. ఒకానొక ప్రాంతములో అన్ని యిండ్ల తలుపులమీద స్టిక్కర్లను అంటించుటకు అనేకమంది మతనాయకులు కొంతమంది కుర్రవాళ్లను నియమించిరి,—సాక్షుల యిండ్లకు సహితము వారు వాటిని అంటించిరి! అయినను, సాక్షులు సులభముగా జడిసిపోలేదు, బదులుగా వారు తరచు సంభాషణను ఆరంభించుటకు ఆ స్టిక్కర్లనే ఉపయోగించిరి. అంతేకాకుండ, చూపబడిన మత అసహనమును ఖండించుచు, యిలాంటి చౌకబారు ఎత్తులు చర్చి బలహీనతకు నిజమైన సూచనయని నొక్కితెలియజేయుచు, విషయమును ఇటు వార్తాపత్రికలు, అటు ప్రభుత్వ దూరదర్శిని సంస్థ బహుగా ప్రచారము చేసినవి. సాక్షి-వ్యతిరేక స్టిక్కర్ల వివాదమునకు, విశ్వవిద్యాలయ అధ్యాపకుడొకరు ఎంతగా అభ్యంతరపడెనంటే, ఆయన ది వాచ్‌టవర్ మరియు అవేక్! పత్రికలకు చందా తీసుకొనెను.
18 ఇటలీలోని కాథోలిక్కు చర్చి యెహోవా ప్రజలనుగూర్చి అబద్ధములను ప్రచారము చేయుటకు మతభ్రష్టులను సహితము ఉపయోగించుచున్నది, అయితే యిదియు పనిచేయుట లేదు. ఎందుకనగా 1,72,382మంది ప్రచారకులు అందరికి తెలుసు మరియు బహుగా గౌరవింపబడుచున్నారు. తనను దర్శించిన సాక్షులతో ఒకాయన, మాజి సాక్షులద్వారా వ్రాయబడిన సాహిత్యములందు మిమ్ములనుగూర్చి చెడుగా వ్రాయుటను చదివానని, దానితో తానెంతో వ్యతిరేకముగా యుండెనని అదే సమయములో తన సోదరుడొకరు యెహోవా సాక్షి అయ్యెనని, కొంతకాలము తర్వాత మార్చుకొనిన మతము తన సోదరునిమీద చూపిన మంచి ప్రభావమును గమనించినవాడై, ‘చెడ్డదైనది అంత మంచి ఫలితములను ఎట్లు ఉత్పన్నము చేయగలదు?’ అని తాను ఆశ్చర్యపడెనని చెప్పెను. కాబట్టి, తనకుకూడ ఒక బైబిలు పఠనము కావలెనని దర్శించవచ్చిన సాక్షులను ఆయన అడిగెను.—కొలస్సీ. 3:8-10తో పోల్చుము.
ఉదాసీనతకు తగినట్లు సరితూగుట
19, 20. (ఎ) ఫిన్‌లాండ్‌లోని సాక్షులు సహనము చూపించవలసిన ఏ పరిస్థితి అక్కడ కలదు, మరియు ఒక చర్చి ప్రజాభిప్రాయ సేకరణలో నిజముగా గమనార్షమైనది ఏది? (బి) సువార్తను ప్రకటించుటలో సహనము ప్రాముఖ్యమని ఏ అనుభవము దృష్టాంతపరచుచున్నది?
19 సాక్షులు తరచుగా దర్శించు దేశములలో సువార్త యెడల బహు ఉదాసీనత కలదు. ఫిన్‌లాండునందు యిదే జరుగుచున్నది. ఆ దేశములోని చర్చి ప్రజాభిప్రాయమును సేకరించి, దేశములోని 70-శాతము ప్రజానీకము సాక్షులు తమ యిండ్లను దర్శించుటకు యిష్టపడుటలేదని కనుగొనినది. అయితే, 30-శాతము ప్రజలు తీవ్రముగా వ్యతిరేకించుటలేదు, కాగా వీరిలో 4-శాతము మంది తాము నిజానికి యెహోవా సాక్షులను యిష్టపడుచున్నామని తెలియజేసిరి. ఇది గుర్తింపదగిన సంఖ్యయైయున్నది. ఫిన్‌లాండులోని 4-శాతము మంది ప్రజలు అనగా అది 2,00,000మంది ప్రజలను చూపుచున్నది. దానిని ప్రస్తుత 17,303మంది ప్రచారకుల సంఖ్యతో పోల్చండి!
20 సేవకు వెళ్లిన సేవకునితో ఒకరు ఈ ప్రజాభిప్రాయమును ప్రస్తావించుచు, “మీరంటే, మాలో 70-శాతము మందికి యిష్టము లేదని నీకు తెలియదా? ఎందుకు మా యిండ్లకు మీరు ప్రతిసారి వస్తారు?” అని అనెను. దానికి ఆ ప్రచారకుడు ఇలా సమాధానమిచ్చెను: “అవును, అదే సేకరణ మీలో 4-శాతము మంది మమ్ములను యిష్టపడుచున్నారని చూపించినది. మేము ఆ ప్రజలను కనుగొనుటకు ప్రయత్నించుచున్నాము. అంతేకాదు, వారు కేవలము 1-శాతము వున్నాసరే వారిని కనుగొన ప్రయత్నించుటకు మేము యింకను యింటింటికి వెళ్లుదుము.” ఒక క్షణమాగి ఆ యింటి యజమాని “మీ వర్తమానము వారికి అంత ప్రాముఖ్యమా?” అని అనెను. అందుకు ఆ ప్రచారకుడు: “దానిని విన మీరు యిష్టపడుచున్నారా?” అని అడిగెను. ఆ వెంటనే ఈ యింటి యజమాని సువార్తయందు శ్రద్ధను చూపించెను.
భవిష్యత్తు ఏమి కలిగియున్నది
21. (ఎ) ఈ విధానములో ఎటువంటి పోరాటమును మనము పోరాడవలెను, మరియు ఎందుకు? (బి) దేనిని మనము సహించవలసియుండును, మరియు దేనినిగూర్చి హబక్కూకు ప్రవచనము మనకు అభయమిచ్చుచున్నది?
21 ఈనాటి మనందరి విషయమేమి? యెహోవా యేసు క్రీస్తులతో అంతము వరకు సహించుటకు తీర్మానించుకొనియున్నామా? అది దీర్ఘకాలము కాకపోవచ్చును, అయితే మనము తప్పక సహించవలెను! ప్రతిదిక్కునుండి లోక లైంగిక దుర్నీతి, అవినీతి, ద్వేషము మనను చుట్టుముట్టుచుండగా, ఈ సాతాను విధానములో మనము విశ్వాస సంబంధమైన గట్టి పోరాటమును పోరాడవలసియున్నాము. (యూదా 3, 20, 21) మనము వివిధ రకముల హింసను భరించవలసియుండును. యిప్పటికిని, వేలాదిమంది సహోదరులు చెరసాలలో వున్నారు, కొందరైతే అతికౄరముగా కొట్టబడిరి. మన ప్రార్థనలకు వీరు కృతజ్ఞులై యున్నారు. (2 థెస్సలొనీకయులు 3:1, 2) అతి త్వరలోనే ప్రస్తుత విధానము గతించిపోవును! హబక్కూకు చెప్పినట్లుగా: “ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురుత పడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగుచేయక వచ్చును.”—హబక్కూకు 2:3.
22. ప్రవక్తల ఓపికను, యోబు సహనమును మనము అలవరచుకొనినట్లయిన, మనము నమ్మకముగా ఏ ఫలితము కలుగునని ఎదురుచూడవచ్చును?
22 శిష్యుడైన యాకోబు ప్రేమతో మనకిట్లు చెప్పుచున్నాడు: “నా సహోదరులారా, యెహోవా నామమున బోధించిన ప్రవక్తలను, శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి.” యెషయా, యిర్మీయా, దానియేలు మరియు యితరుల వలెనే, ఈనాడు యెహోవా నామమున మాట్లాడు మనము కఠిన పరీక్షలయందును యథార్థతను కాపాడుకొనగల వారమైయుండగలము. యోబు వలెనే, మనము సహించవచ్చును. తన సహనమునకు ఆయనెంతగా ప్రతిఫలమియ్యబడెను! అంతము వరకు మనము సహించినయెడల ఆ పోలికగల ప్రతిఫలములను యెహోవా కరుణ మరియు కృప మనకొరకు తెచ్చును. మనలో ప్రతివారి విషయములో యాకోబు మాటలు నెరవేరు గాక: “ఇదిగో! సహించినవారు ధన్యులని మనము చెప్పుచున్నాము.”—యాకోబు 5:10, 11, NW; యోబు 42:10-13. (w90 1/1)
మీరెట్లు జవాబిత్తురు?
◻ సహనముయొక్క ఏ అవసరతను యేసు నెక్కిచెప్పెను?
◻ ఏ కారణముల కొరకు యెహోవా సహించెను?
◻ 1989లో నెరవేర్చబడిన మహాపనిలోని కొన్ని ముఖ్యాంశములు ఏవి?
◻ పోలెండులోని మన సహోదరుల సహనమునకు ప్రతిఫలమెట్లు లభించెను?
◻ లెబనోను, కొలంబియా, మరియు ఇటలీలోని సాక్షులు పరీక్షలలోను తమ విశ్వాస్యతను ఎట్లు చూపించిరి?