దేవునిపట్ల మీ విధిని మీరు నిర్వర్తిస్తున్నారా?
“గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.”—ప్రసంగి 12:14.
1. యెహోవా తన ప్రజల కోసం ఏ ఏర్పాట్లను చేశాడు?
యెహోవాను తమ మహా సృష్టికర్తగా జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉండేవారికి ఆయన మద్దతునిస్తాడు. తనను సంపూర్ణంగా ప్రీతిపర్చేవారిగా ఉండటానికి కావాల్సిన జ్ఞానాన్ని ఆయన ప్రేరేపిత వాక్యము వారికి ఇస్తుంది. దేవుని చిత్తాన్ని చేయటానికీ, “ప్రతి సత్కార్యములో సఫలుల”వటానికీ ఆయన పరిశుద్ధాత్మ వారిని నడిపిస్తుంది. (కొలొస్సయులు 1:9, 10) ఇంకా యెహోవా ఆధ్యాత్మిక ఆహారాన్నీ, దైవపరిపాలనా నిర్దేశాన్నీ “నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసు[ని]” ద్వారా అందిస్తాడు. (మత్తయి 24:45-47) కాబట్టి, దేవుని ప్రజలు యెహోవాను సేవిస్తూ రాజ్య సువార్తను ప్రకటించడమనే కీలకమైన పనిని కొనసాగిస్తుండగా వారికి అనేక రీతుల్లో దైవాశ్శీస్సులు ఉన్నాయి.—మార్కు 13:10.
2. యెహోవా సేవ సంబంధంగా ఏ ప్రశ్నలు తలెత్తవచ్చు?
2 నిజ క్రైస్తవులు యెహోవా పవిత్ర సేవలో పూర్తిగా నిమగ్నమై ఉంటున్నందుకు ఆనందంగా ఉన్నారు. అయితే, కొందరు నిరుత్సాహంచెంది, తమ ప్రయత్నాలు నిష్ప్రయోజనకరమని భావిస్తుండవచ్చు. ఉదాహరణకు, సమర్పిత క్రైస్తవులు తాము మనస్సాక్షిపూర్వకంగా చేసే కృషికి నిజంగా ఏమైనా విలువ ఉందా అని అప్పుడప్పుడు ఆలోచిస్తుండవచ్చు. కుటుంబ పఠనం, మరితర కార్యకలాపాలను గురించి తలపోస్తున్న సమయంలో కుటుంబ శిరస్సు అయిన భర్త లేదా తండ్రి మనస్సులో, ‘మేము చేస్తున్నదాన్ని బట్టి యెహోవా అసలు ఆనందిస్తున్నాడా? మేము దేవునిపట్ల మా పూర్ణ విధిని నిర్వర్తిస్తున్నామా?’ అన్న ప్రశ్నలు తలెత్తవచ్చు. ప్రసంగి చెప్పిన విజ్ఞతతో కూడిన మాటలు ఇటువంటి ప్రశ్నలకు సమాధానాల్ని తెలుసుకోవడానికి సహాయపడతాయి.
సమస్తమూ వ్యర్థమా?
3. ప్రసంగి 12:8కి అనుగుణంగా అతి ఘోరమైన వ్యర్థము ఏమిటి?
3 జ్ఞాని అయిన సొలొమోను పలికిన మాటలు యౌవనులైనా వృద్ధులైనా ఎవరికైనా అంత ప్రోత్సాహకరంగా ఉన్నవి కావని కొందరు తలంచవచ్చు. “సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, సమస్తము వ్యర్థము.” (ప్రసంగి 12:8) నిజంగానే, యౌవనకాలంలో మహా సృష్టికర్తను ఉపేక్షించటమంత వ్యర్థము ఏదీలేదు, ఆయన్ను సేవించకుండా వృద్ధాప్యానికి ఎదగటం, వయోవృద్ధులు కావటమే ఘనకార్యమన్నట్టుగా వృద్ధాప్యానికి ఎదగటం మహా వ్యర్థము. అటువంటి వ్యక్తికి సమస్తమూ వ్యర్థమే లేదా శూన్యమే, దుష్టుడు అపవాదియైన సాతాను వశంలో ఉన్న ఈ లోకంలో సిరిసంపదలూ కీర్తిప్రతిష్ఠలూ సంపాదించుకుని చనిపోయినా వ్యర్థమే.—1 యోహాను 5:19.
4. సమస్తమూ వ్యర్థము కాదని ఎందుకు చెప్పగలము?
4 యెహోవా విశ్వసనీయమైన సేవకులుగా పరలోకంలో ధనాన్ని కూర్చుకునే వారికి సమస్తమూ వ్యర్థము కాదు. (మత్తయి 6:19, 20) ప్రతిఫలదాయకమైన ప్రభువు పనిలో చేయవలసినది ఎంతో ఉంది, అంతేగాక వారి శ్రమ ఏమాత్రం వ్యర్థమైనది కాదు. (1 కొరింథీయులు 15:58) కానీ మనం సమర్పిత క్రైస్తవులమైనట్లైతే ఈ అంత్యదినాల్లో దైవనియుక్త పనిలో బిజీగా ఉంటున్నామా? (2 తిమోతి 3:1) లేదా మనం, పొరుగువారికీ మనకూ ఏమాత్రం తేడా లేని జీవనశైలిని అవలంబిస్తున్నామా? వారు వివిధ రకాల మతాలను పాటిస్తుండవచ్చు, తమ ఆరాధనా మందిరాలకు క్రమంగా హాజరవుతూ ఆ ఆరాధనా విధానానికి తగ్గట్టుగా చేయటానికి ప్రయత్నిస్తూ బాగా మతనిష్ఠ ఉన్నవారే అయివుండవచ్చు. అయితే ఒక్క మాట, వారు రాజ్య సందేశాన్ని ప్రకటించేవారు మాత్రం కారు. వారికి, ఇది “అంత్యకాలము” అనే కచ్చితమైన జ్ఞానము లేదు, మనం జీవిస్తున్న కాలాలను గురించిన అత్యవసర భావం వారికి లేదు.—దానియేలు 12:4.
5. జీవితంలోని సాధారణ కార్యకలాపాలు మన అతిగొప్ప చింతలుగా మారిపోతే మనం ఏమి చేయాలి?
5 యేసుక్రీస్తు మన ఈ క్లిష్టమైన కాలాల గురించి ఇలా చెప్పాడు: “నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును.” (మత్తయి 24:37-39) మితంగా ఉన్నంత వరకు తినటంలోను, త్రాగటంలోను తప్పేమీ లేదు, ఇక వివాహం విషయానికి వస్తే అది దేవుడే స్థాపించిన ఒక ఏర్పాటు. (ఆదికాండము 2:20-24) అయితే, జీవితంలోని సాధారణ కార్యకలాపాలు మన అతిగొప్ప చింతలుగా మారిపోయాయని మనం గ్రహించినట్లైతే, ఈ విషయం గురించి ఎందుకు ప్రార్థించకూడదు? మనం రాజ్యాసక్తులను ముందుంచటానికి యెహోవా సహాయం చేయగలడు, అలాగే సరైనదేదో చేయటానికీ ఆయనపట్ల మన విధిని నిర్వర్తించటానికీ కూడా ఆయన మనకు సహాయం చేయగలడు.—మత్తయి 6:33; రోమీయులు 12:12; 2 కొరింథీయులు 13:7.
సమర్పణ, దేవునిపట్ల మన కర్తవ్యం
6. బాప్తిస్మం పొందిన కొందరు వ్యక్తులు ఏ ప్రాముఖ్యమైన విధానంలో దేవునిపట్ల తమకున్న విధిని నిర్వర్తించటంలో విఫలం అవుతున్నారు?
6 కొంతమంది క్రైస్తవులు తాము దేవునికి సమర్పించుకున్న సమయంలో తమపైకి తీసుకున్న పరిచర్యకు సంబంధించిన విధుల్ని నిర్వర్తించటం లేదు గనుక వారు తీవ్రంగా ప్రార్థించాల్సిన అవసరం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా సగటున 3,00,000 మంది ప్రతి సంవత్సరం బాప్తిస్మం తీసుకుంటున్నారు, కానీ క్రియాశీలంగా ఉన్న యెహోవాసాక్షుల పూర్తి సంఖ్య అందుకు తగ్గట్టుగా పెరగలేదు. రాజ్య ప్రచారకులుగా మారిన కొందరు సువార్తను ప్రకటించటం మానివేశారు. అయితే, బాప్తిస్మం పొందటానికి ముందే వ్యక్తులు క్రైస్తవ పరిచర్యలో ఉద్దేశసహితమైన భాగాన్ని వహించాలి. అందుకని యేసు తన అనుచరులందరికీ ఇచ్చిన ఈ నియామకం గురించి వారికి తెలుసు: “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి.” (మత్తయి 28:19, 20) వారు ఆరోగ్య సంబంధంగా లేదా తమ పరిధిలో లేని మరితర కారణాల మూలంగా పూర్తి అశక్తులుగా ఉంటే తప్ప, దేవుని క్రియాశీలమైన సాక్షులుగా సేవచేయని బాప్తిస్మం తీసుకున్న వ్యక్తులు మన మహా సృష్టికర్త ఎదుట తమ పూర్తి విధిని నిర్వర్తించటం లేదనే అర్థం.—యెషయా 43:10-12.
7. మనం ఆరాధన నిమిత్తం క్రమంగా ఎందుకు సమావేశం అవ్వాలి?
7 ప్రాచీన ఇశ్రాయేలు జనాంగము దేవునికి సమర్పించుకున్న జనాంగము, ధర్మశాస్త్ర నిబంధన క్రింద, దాని ప్రజలకు యెహోవా ఎదుట కొన్ని విధులు ఉన్నాయి. ఉదాహరణకు, మూడు వార్షిక పండుగలకు పురుషులందరూ సమావేశం కావాలి, పస్కాను ఉద్దేశపూర్వకంగా పాటించని వ్యక్తి మరణశిక్షతో “కొట్టివేయబడును.” (సంఖ్యాకాండము 9:13; లేవీయకాండము 23:1-43; ద్వితీయోపదేశకాండము 16:16) దేవుని సమర్పిత ప్రజలుగా తమకు ఆయనపట్ల ఉన్న విధిని నిర్వర్తించటానికి ఇశ్రాయేలీయులు ఆరాధనకై సమావేశం కావాల్సివున్నారు. (ద్వితీయోపదేశకాండము 31:10-13) ‘నీకు వీలైతేనే ఇది చెయ్యి’ అని ధర్మశాస్త్రం ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడు యెహోవాకు సమర్పించుకున్న వారికి ఈ ఆజ్ఞ పౌలు చెప్పిన ఈ మాటలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది: “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” (హెబ్రీయులు 10:24, 25) అవును, తోటి విశ్వాసులతో క్రమంగా సమావేశం కావటం దేవునిపట్ల క్రైస్తవునికున్న విధిలో ఒక భాగం.
ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి!
8. ఒక యౌవన సమర్పిత వ్యక్తి తన పవిత్ర సేవకు ఎందుకు ప్రార్థనా పూర్వకమైన పరిగణననివ్వాలి?
8 మీరు యెహోవాకు సమర్పించుకున్న యౌవనులా? మీరు మీ జీవితంలో రాజ్యాసక్తులకు ప్రథమస్థానాన్ని ఇచ్చినట్లైతే గొప్ప ఆశీర్వాదాలు లభిస్తాయి. (సామెతలు 10:22) ప్రార్థన ద్వారా, జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవటం ద్వారా మీ జీవితంలో మీరు కనీసం యౌవనశక్తివున్న సంవత్సరాల్లో ఏదో ఒక విధమైన పూర్తికాల సేవలో గడపవచ్చు—మీరు మీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటున్నారని చూపించటానికి ఇది ఒక చక్కని మార్గం. లేనట్లైతే వస్తుపర సంపదలే మీ సమయాన్నీ అవధానాన్నీ పూర్తిగా తీసుకోవటం ప్రారంభమౌతుంది. సాధారణ ప్రజల్లాగానే, మీరు చాలా త్వరగా పెండ్లి చేసుకోవచ్చు, ఇంట్లో వస్తువుల్ని సమకూర్చుకునేందుకు అప్పుల్లో కూరుకుపోవచ్చు. మంచి డబ్బు పండించే ఉద్యోగం మీ సమయాన్నీ శక్తినీ తోడేయవచ్చు. మీకు పిల్లలు పుడితే కొన్ని దశాబ్దాలపాటు కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తించాల్సి వస్తుంది. (1 తిమోతి 5:8) మీరు మీ మహా సృష్టికర్తను మర్చిపోయి ఉండకపోవచ్చు, కానీ మీ భావి జీవిత పథం యుక్తవయస్సులో ప్రణాళికలు వేసుకోవటం లేదా వేసుకోకపోవటం మీదే ఆధారపడి ఉండగలదని గ్రహించటం విజ్ఞతతో కూడిన పని. జీవితపు మలిదశలో మీరు సింహావలోకనం చేసుకుంటూ, కనీసం యౌవనప్రాయంలోనైనా మన మహా సృష్టికర్త సేవలో పూర్తిగా గడిపివుంటే ఎంత బాగుండు అని వాపోతారేమో! మీ భావి అవకాశాల గురించి ప్రార్థనాపూర్వకంగా ఇప్పుడే ఎందుకు ఆలోచించకూడదు? తద్వారా మీ యౌవనప్రాయంలో యెహోవాకు చేసే పవిత్ర సేవనుండి మీరు సంతృప్తిని పొందుతారు.
9. ఒకప్పుడు సంఘంలో బరువు బాధ్యతల్ని మోసి ఇప్పుడు వృద్ధుడైన వ్యక్తికి ఏమి సాధ్యం కాగలదు?
9 వేరే విధమైన పరిస్థితిని గురించి చూడండి—ఒక వ్యక్తి ఒకప్పుడు “దేవుని మంద”కు కాపరిగా సేవచేశాడు. (1 పేతురు 5:2, 3) ఏదో కారణాన, ఆయన స్వచ్ఛందంగా ఆ ఆధిక్యతల్ని విడనాడాడు. నిజమే, ఇప్పుడాయన వృద్ధుడయ్యాడు, దేవుని సేవలో కొనసాగటం ఇప్పుడు మరింత కష్టంగా ఉంటుండవచ్చు. కానీ ఆయన మళ్ళీ దైవపరిపాలనా ఆధిక్యతల కోసం ముందుకు రావటం సాధ్యపడుతుందా? సంఘంలో అటువంటి వ్యక్తి మరిన్ని బాధ్యతల్ని చేపట్టడం మూలంగా ఇతరులకు ఎన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి! అంతేగాక, ఎవరూ కూడా కేవలం తన కోసమే జీవించరు గనుక, ఆ వ్యక్తి దేవుని మహిమార్థమై తన సేవను పెంచుకోవటం సాధ్యమైతే స్నేహితులు ప్రియమైన వ్యక్తులు ఆనందిస్తారు. (రోమీయులు 14:7, 8) అన్నింటికీ మించి, తన సేవలో ఏవరు ఏమి చేసినా యెహోవా దాన్ని మర్చిపోడు. (హెబ్రీయులు 6:10-12) కాబట్టి, మన మహా సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవటానికి మనకు ఏది సహాయం చేయగలదు?
మన మహా సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవటానికి సహాయకాలు
10. మన మహా సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునే విషయంలో ప్రసంగి నిర్దేశాలను ఇవ్వటానికి ఎందుకు చక్కని స్థానంలో ఉన్నాడు?
10 మన మహా సృష్టికర్తను మనం స్మరణకు తెచ్చుకోవటానికి కావాల్సిన సూచనలను ఇవ్వటానికి ప్రసంగి చక్కని స్థానంలో ఉన్నాడు. యెహోవా అతనికి అసాధారణమైన జ్ఞానాన్ని దయచేయటం ద్వారా ఆతని హృదయపూర్వక ప్రార్థనలకు జవాబిచ్చాడు. (1 రాజులు 3:6-12) సొలొమోను మానవ వ్యవహారాల పూర్తి పరిధిని కూలంకషంగా పరిశోధించాడు. అంతేగాక, తాను కనుగొన్న విషయాల్ని ఇతరుల ప్రయోజనార్థమై వ్రాతపూర్వకంగా లిఖించటానికి ఆయన దైవికంగా ప్రేరేపించబడ్డాడు. ఆయనిలా వ్రాశాడు: “ప్రసంగి జ్ఞానియై యుండెను అతడు జనులకు జ్ఞానము బోధించెను; అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. ప్రసంగి యింపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమునుగూర్చిన మాటలు యథార్థభావముతో వ్రాయుటకు పూనుకొనెను.”—ప్రసంగి 12:9, 10.
11. మనం సొలొమోను ఇచ్చిన జ్ఞానయుక్తమైన సలహాను ఎందుకు స్వీకరించాలి?
11 ఈ మాటల్ని గ్రీకు సెప్టాజింట్ ఇలా అనువదించింది: “అంతేగాక, ప్రసంగి జ్ఞాని గనుక, మానవజాతికి వివేకాన్ని బోధించాడు గనుక; నీతికథల నుండి ఆహ్లాదకరమైనదాన్ని చెవులు పట్టుకునేందుకు, వినసొంపైన మాటల్ని కనుగొనేందుకు ప్రసంగి శ్రద్ధతో పరిశోధన చేసి నీతియుక్తమైన మాటల్ని—సత్యవాక్కులను వ్రాశాడు.” (ద సెప్టాజింట్ బైబిల్, ఛార్లెస్ థామ్‌సన్ అనువదించినది) ఆహ్లాదకరమైన మాటల్తో, నిజంగా ఆసక్తికరమైన యుక్తమైన విషయాలతో తన పాఠకుల హృదయాల్ని చేరటానికి సొలొమోను ప్రయత్నించాడు. బైబిల్లో ఉన్న ఆయన మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణమూలంగా కలిగినవి కావటంతో మనం, ఆయన కనుగొన్న విషయాలూ, విజ్ఞతతో కూడిన సలహాలూ నిస్సంకోచంగా స్వీకరించవచ్చు.—2 తిమోతి 3:16, 17.
12. ప్రసంగి 12:11, 12లో నమోదైనట్లుగా సొలొమోను చెప్పిన మాటల్ని మీ స్వంత మాటల్లో ఎలా వ్యక్తం చేస్తారు?
12 ఆధునిక ముద్రణా విధానాలు లేకపోయినా సొలొమోను కాలంలో చాలానే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి సాహిత్యాన్ని ఎలా దృష్టించాలి? ఆయనిలా అన్నాడు: “జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలలవలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకులవలెను ఉన్నవి; అవి ఒక్క కాపరివలన అంగీకరింపబడినట్టున్నవి. ఇదియు గాక నా కుమారుడా, హితోపదేశములు వినుము; పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు; విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము.”—ప్రసంగి 12:11, 12.
13. దైవిక విజ్ఞత కలిగివున్నవారి మాటలు ములుకోలలవలె ఎలా ఉంటాయి, “బిగగొట్టబడిన మేకులవలె” ఉన్నది ఎవరు?
13 దైవిక విజ్ఞత కలిగివున్న వారి మాటలు ములుకోలలుగా ఉంటాయి. అదెలా? అవి పాఠకులను లేదా శ్రోతలను తాము చదివిన లేదా విన్న విజ్ఞతతో కూడిన మాటలకు అనుగుణ్యంగా పురోభివృద్ధి సాధించుమని వారిని గుచ్చుతుంటాయి. అంతేగాక, ‘చక్కగా కూర్చబడిన’ మాటలు అంటే నిజంగా విజ్ఞతతో కూడిన అమూల్యమైన మాటలు వింటూ సమయం గడిపేవారు, “బిగగొట్టబడిన” అంటే గట్టిగా స్థిరంగా ఉన్న “మేకులవలె” ఉంటారు. దీనిక్కారణం, అటువంటి వ్యక్తులు చెప్పే చక్కని మాటలు యెహోవాకున్న విజ్ఞతను ప్రతిబింబిస్తాయి, తద్వారా పాఠకులకు గాని శ్రోతలకు గాని స్థిరత్వాన్నీ మద్దతునూ ఇస్తాయి. మీరు దైవభయంగల తల్లి గానీ తండ్రి గానీ అయినట్లైతే అటువంటి విజ్ఞతను మీ పిల్లల మనస్సుల్లో హృదయాల్లో నాటటానికి బాగా కృషిచేయవద్దా?—ద్వితీయోపదేశకాండము 6:4-9.
14. (ఎ) ఎటువంటి పుస్తకాలను “విస్తారముగా విద్యాభ్యాసము” చేయటం ప్రయోజనకరం కాదు? (బి) ఏ సాహిత్యానికి మనం ప్రధానంగా అవధానం ఇవ్వాలి, ఎందుకు?
14 అయితే సొలొమోను పుస్తకాల గురించి ఎందుకు అలా అన్నాడు? యెహోవా వాక్యంతో పోలిస్తే ఈ లోకంలో ఉన్న అంతులేని పుస్తకాల సంపుటుల్లో కేవలం మానవ తర్కం మాత్రమే ఉంటుంది. ఈ ఆలోచనా విధానంలో అత్యధికం అపవాదియైన సాతాను మనస్సును ప్రతిబింబిస్తుంది. (2 కొరింథీయులు 4:4) అందుకని, అటువంటి లౌకిక పుస్తకాల్లో “విస్తారముగా విద్యాభ్యాసము” శాశ్వత ప్రయోజనాల్ని ఇవ్వదు. నిజానికి మరీ అతిగా అభ్యసించటం ఆధ్యాత్మికంగా వినాశకరంగా ఉంటుంది. సొలొమోనులా మనం జీవం గురించి దేవుని వాక్యం చెబ్తున్నదానిపైనే ధ్యానాన్ని ఉంచుదాము. ఇలా చేయటం మూలంగా మన విశ్వాసమూ బలపడుతుంది, మనం యెహోవాకు సన్నిహితం కూడా అవుతాము. ఇతర పుస్తకాలకూ, సమాచార మూలాలకూ అత్యధికంగా అవధానాన్ని ఇవ్వటం మూలంగా మన శక్తీ ఉడిగిపోతుంది. ప్రాముఖ్యంగా అటువంటి వ్రాతలు, దైవ జ్ఞానానికి విరుద్ధంగా ఉన్న ఈ లోక తర్కాన్ని ప్రతిబింబిస్తున్నప్పుడు అవి అనారోగ్యకరమైనవిగానూ దేవునిలో ఆయన సంకల్పాల్లో మన విశ్వాసాన్ని నాశనం చేసేవిగానూ అయివుంటాయి. అందుకని మనం సొలొమోను కాలంలోనూ మన కాలంలోనూ అత్యంత ప్రయోజనకరమైన వ్రాతలు “ఒక్క కాపరి” అయిన యెహోవా దేవుని జ్ఞానాన్ని ప్రతిబింబించేవే అని గుర్తుంచుకుందాము. ఆయన 66 పుస్తకాలతో కూడిన పరిశుద్ధ లేఖనాలను అందించాడు, మనం అత్యధికమైన అవధానాన్ని ఇవ్వవలసింది వీటికే. బైబిలూ, ‘నమ్మకమైన దాసుడు’ అందించే ప్రచురణలూ మనం “దేవుని గూర్చిన విజ్ఞానము” సంపాదించుకోవటానికి సహాయం చేస్తాయి.—సామెతలు 2:1-6.
దేవునిపట్ల మన పూర్తి విధి
15. (ఎ) మానవుల పూర్తి “విధి”ని గురించిన సొలొమోను మాటల్ని మీరు ఎలా వ్యక్తం చేస్తారు? (బి) మనం దేవునిపట్ల మనకున్న విధిని నిర్వర్తించాలంటే ఏమి చేయాలి?
15 తాను పరిశోధించిన దానంతటినీ ఒక్కముక్కలో చెబుతూ ప్రసంగి అయిన సొలొమోను ఇలా చెబుతున్నాడు: “ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.” (ప్రసంగి 12:13, 14) మనపైనా మన ప్రియమైన వారిపైనా అసంఖ్యాకమైన సమస్యల్ని తీసుకురాగల వెర్రి జీవిత విధానాన్ని అనుసరించకుండా ఉండేలా మన మహా సృష్టికర్తపట్ల ఆరోగ్యకరమైన భయం లేదా భక్తిపూర్వకమైన భావం మనల్నీ మన కుటుంబాల్నీ సంరక్షిస్తుంది. దేవుడంటే ఆరోగ్యకరమైన భయం పవిత్రమైనది, అది తెలివికీ జ్ఞానానికీ మూలము. (కీర్తన 19:9; సామెతలు 1:7) దేవుని ప్రేరేపిత వాక్యంపై ఆధారపడిన అంతర్దృష్టిని మనం సంపాదించుకుంటే, అన్ని విషయాల్లోనూ దాని సలహాల్ని అన్వయించుకుంటే మనం దేవునిపట్ల మన పూర్తి “విధి”ని నిర్వర్తిస్తున్నట్లే. అయితే, దీనర్థం కర్తవ్యాల పెద్ద చిట్టాని తయారుచేయటం కాదు. బదులుగా, జీవిత సమస్యల్ని పరిష్కరించుకుంటున్నప్పుడు మనం లేఖనాల నుండి నడిపింపును పొందటమే, సమస్తాన్నీ దేవుని పద్ధతిలో చేయటమే కావాలి.
16. తీర్పుకు సంబంధించి యెహోవా ఏమి చేస్తాడు?
16 మన మహా సృష్టికర్త దృష్టి నుండి ఏదీ తప్పించుకోలేదని మనం గ్రహించాలి. (సామెతలు 15:3) ఆయన “ప్రతి యంశమునుగూర్చి . . . విమర్శ” చేస్తాడు. అవును, సర్వోన్నత ప్రభువు సమస్తానికీ తీర్పుతీరుస్తాడు, మానవ కన్నులకు గూఢమైన విషయాలకు కూడా. ఇటువంటివి తెల్సుకుని ఉండటం మనం, దేవుని ఆజ్ఞలను పాటించటానికి ప్రేరకాలుగా ఉండగలవు. కానీ అత్యంత గొప్ప ప్రేరకం పరలోక తండ్రి పట్ల ప్రేమే అయివుండాలి, ఎందుకంటే అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.” (1 యోహాను 5:3) దేవుని ఆజ్ఞలు మన శాశ్వత సంక్షేమానికే రూపొందించబడ్డాయి గనుక వాటిని పాటించడం యుక్తమైన విషయం మాత్రమే కాదు, అలా చేయటం జ్ఞానయుక్తం కూడా. మహా సృష్టికర్తను ప్రేమించేవారికి ఇదేమాత్రం భారం కాదు. వారు ఆయనపట్ల తమకున్న విధిని నిర్వర్తించాలనుకుంటారు.
మీ పూర్తి విధిని నిర్వర్తించండి
17. మనం దేవునిపట్ల మనకున్న పూర్తి విధిని నిజంగా నిర్వర్తించాలనుకుంటే మనం ఏమి చేస్తాము?
17 మనం జ్ఞానులమైతే, దేవునిపట్ల మన విధిని నిర్వర్తించాలని నిజంగా కోరుకుంటున్నట్లైతే ఆయన ఆజ్ఞలను పాటించటానికి తోడు మనకు ఆయన్ను అప్రీతిపర్చటానికి భక్తిపూర్వకమైన భయం కూడా ఉంటుంది. నిజంగా “యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలము” ఆయన ఆజ్ఞలను పాటించేవారు “మంచి వివేకము గలవారు.” (కీర్తన 111:10; సామెతలు 1:7) కాబట్టి మనం జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తూ అన్నింటిలో యెహోవాకు విధేయత కనబరుద్దాము. ప్రాముఖ్యంగా ఇది ఇప్పుడు మరింత కీలకమైనది, ఎందుకంటే రాజైన యేసుక్రీస్తు ప్రత్యక్షత ప్రారంభమైంది, ఆయన దైవనియుక్త న్యాయాధిపతిగా పనిచేసే తీర్పుదినము ఆసన్నమైంది.—మత్తయి 24:3; 25:31, 32.
18. యెహోవా దేవునిపట్ల మనకున్న పూర్తి విధిని మనం నిర్వర్తిస్తే మనకు ఏ ప్రతిఫలం లభిస్తుంది?
18 మనలో ప్రతి ఒక్కరమూ ఇప్పుడు దైవిక తనిఖీ క్రింద ఉన్నాము. మనం ఆధ్యాత్మికంగా మొగ్గు చూపుతున్నామా లేదా ప్రాపంచిక ప్రభావాలు మనలోకి ప్రవేశించి దేవునితో మన సంబంధాన్ని బలహీనపరిచేందుకు అనుమతిస్తున్నామా? (1 కొరింథీయులు 2:10-16; 1 యోహాను 2:15-17) యౌవనులమైనా వృద్ధులమైనా మనమందరం మన మహా సృష్టికర్తను ప్రీతిపర్చటానికి సాధ్యమైనంతా చేద్దాము. మనం యెహోవాకు విధేయత కనపర్చి ఆయన ఆజ్ఞలను పాటిస్తే, గతించనైయున్న ఈ పాత లోకంలోని వ్యర్థమైన విషయాల్ని తిరస్కరించినవారమౌతాము. అప్పుడు మనం, దేవుడు వాగ్దానం చేసిన నూతన విధానంలో నిత్యమూ జీవించే ఉత్తరాపేక్షను కలిగివుండగలము. (2 పేతురు 3:13) దేవునిపట్ల తమకున్న సంపూర్ణ విధిని నిర్వర్తించే వారందరికీ ఇవెంత ఘనమైన ఉత్తరాపేక్షలో కదా!
మీరెలా జవాబిస్తారు
◻ సమస్తమూ వ్యర్థము కాదని మీరెందుకు అంటారు?
◻ యౌవన క్రైస్తవుడు/రాలు తన పవిత్ర సేవకు ఎందుకు ప్రార్థనాపూర్వకమైన పరిగణననివ్వాలి?
◻ ఎటువంటి పుస్తకాలను “విస్తారముగా విద్యాభ్యాసము” చేయటం ప్రయోజనకరం కాదు?
◻ మానవుని పూర్తి “విధి” ఏమిటి?
[20వ పేజీలోని చిత్రం]
యెహోవాను సేవించే వారికి సమస్తమూ వ్యర్థము కాదు
[23వ పేజీలోని చిత్రం]
ఈ లోకంలోని అనేకమైన పుస్తకాల్లా కాకుండా దేవుని వాక్యము సేదదీర్పునిస్తుంది, ప్రయోజనాల్ని కలుగజేస్తుంది